Monday, June 30, 2008

వరద...వడ్డించిన వర్షం
విస్తరి దాటితే వరద


వయసొచ్చిన అందం
వాకిలిదాటితే వరద


కలిసొచ్చిన కాలం
కళ్ళముందే కరిగితే వరద


మనసిచ్చిన చెలికాడు
మరుగుపడితే వరదPrejudice కి తెలుగు పదం ఏమిటబ్బా?

ఓ రెండ్రోజులుగా "Prejudice కి తెలుగు పదం ఏంటా?" అని నా దగ్గరున్న డిక్షనరీలన్నీ తిరగదోడాను. చివరకి బ్రౌను నిఘంటువులో, "విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి" అని అర్థాలు కనపడ్డాయేగానీ సమానాంతర పదం మాత్రం కానరాలేదు. అంటే నిజంగా మన తెలుగు ప్రజల నరనరాల్లో జీర్ణించుకున్న ఈ అమూల్యమైన లక్షణానికి, ఆంగ్లంలో తప్ప తెలుగులో సరైన పదం లేదని తెలిసిపోయింది.కానీ మన జీవితాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండోయ్! ఇదుంటే మనకు చాలా సుఖం. ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. విషయాల నిజనిర్థారణ అవసరం లేదు, తప్పొప్పుల ఆలోచన అఖ్ఖరలేదు, శ్రమలేకుండా బతికెయ్యొచ్చు. ఈ సుఖానికి మనం ఎంతగా అలవాటుపడిపోయామంటే, మనుషుల్ని వారి ప్రవర్తనతోనో, ఆలోచనలూ, అభిప్రాయాలతోనో బేరీజు చెయ్యడం మానేసాం. వారు నివసించిన ప్రదేశాన్నో, సంస్కృతినో, ఇంటిపేరునో లేక కులాన్నో తెలుసుకుని దానికి తగ్గట్టు ఒక "బ్రాండ్" తగిలించి, సుఖపడిపోతాం. "అరవోళ్ళు", "ఆంధ్రావాళ్ళు", "దళితులు" అని కొన్ని బ్రాండ్ లేబుల్లు తగిలించి, మన ప్రెజుడిస్ ని విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉంటాము.


ఒక వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కొలవడంలో గల శ్రమని తగ్గించుకుని, ఇలాంటి బ్రాండ్లు కల్పించేసుకున్నామన్న మాట. అందుకే మన సామాజిక సంబంధాలు వ్యక్తులతో కాక, వారికి ప్రెజుడిస్ తో మనం తగిలించిన లేబుళ్ళతో నెరిపేస్తూ ఉంటాం. ఇలాకాక, ప్రతివ్యక్తినీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగల మనిషిగా అర్థం చేసుకుని, ఆదరించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి ! అందుకే మన వ్యక్తిగత అనుభవాలన్నీ, ‘రంగుటద్దాల’ సగం సత్యాలేకానీ, అసలు నిజానికి ఓ అంగుళం దూరంగానే ఎప్పుడూ ఉంటాయి.ఈ ప్రెజుడిస్ అప్పుడప్పుడూ తీవ్రరూపం దాల్చి, మన మీడియాలో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడితే ఫ్యాక్షనిస్టు, తెలంగాణ యాసైతే కామెడీ ఇలాగే అవ్వలేదూ? అంతెందుకు మనం చాలా విలువల్ని ఆపాదించే "ఇజాలు" కూడా ప్రెజుడిస్ పుణ్యమే కదా! కమ్యూనలిజం (మతతత్వం), జింగోయిజం, మేల్ ఛవ్వనిజం, సర్వాంతర్యామి అయిన క్యాస్టిజం (కులతత్వం) వీటిల్లో మచ్చుకకి కొన్ని.ఇలాంటి సుఖమైన జీవితం నుండీ బయటపడమని చెప్పడం సాహసమే ! కానీ ఇలాగే సాగితే మన మానవ సంబంధాలు అతిమహా లోతుల్లోకీ, అధ:పాతాళానికీ చేరి ఇంకా సుఖపడతాయేమో అని ఎక్కడో చిన్న సందేహం. అందుకే కనీసం నిఘంటువులో అర్థాన్ని వెదికే సాహసం చేశాను. దయతొ అందరూ క్షమించగలరు.

Sunday, June 29, 2008

తప్పకుండా చూడవలసిన సినిమా - `ద్వీప' (కన్నడ 2002)

ఇళ్ళకూ, పొలాలకూ ఇతర ఆస్తులకూ వెలకట్టొచ్చు. గౌరవానికీ, నమ్మకానికీ, జ్ఞాపకాలకీ వెలకట్టగలమా? చాలా అమూల్యమైన ప్రశ్న ఇది. ‘డ్యామ్’ పునరావాసంలోని మానవీయ కోణాన్ని సూటిగా సంవేదనాత్మకంగా తెరకెక్కించిన ‘గిరీశ్ కాసరవెళ్ళి’ చిత్రం ‘ద్వీప’ (తెలుగులో ‘ద్వీపం’ అనొచ్చు). దివంగత ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల కథానాయిక సౌందర్యం నిర్మించి నటించిన చిత్రం ఇది. ద్వీప ఉత్తమ చిత్రంగా భారత ప్రభుత్వ స్వర్ణకమలం పురస్కారాన్ని కూడా అందుకుంది.కొన్ని సినిమాలను చూసి, ఆనందిస్తాం. కొన్నింటిని తిలకించి విశ్లేషిస్తాం. మరికొన్నింటిని ఆరాధిస్తాం. కానీ ‘ద్వీప’, అనుభవించాల్సిన చిత్రాలకోవలోకి వస్తుంది.ఒకవైపు డ్యాం పునరావాసం పై సామాజిక చర్చతోపాటూ, మరో వైపు మానవసంబంధాల సున్నితత్వాన్ని కూడా స్పృశించిన చిత్రమిది. ముంపుకు గురవ్వబోయే ద్వీపాన్ని విడిచి వెళ్ళని నమ్మకం, ప్రేమ ఒకవైపు కనిపిస్తే, తన సామ్రాజ్యమైన ఇంటిని కాపాడుకోవడానికి ఒక మహిళ పడే తపన, ప్రయత్నం కనిపిస్తాయి. ఇంత క్లిష్టమైన విషయాన్ని తెరపైకి అనువదించడం చాలా కొద్దిమంది దర్శకులకే సాధ్యం. వారిలో ఒకరు, ‘గిరీశ్ కాసరవళ్ళి’ అన్నది నిజం. సినిమా నిడివి కొంత ఎక్కువనిపించినా, చెప్పాలనుకున్న విషయం కూడా అంతే ముఖ్యమైంది కాబట్టి కొంత ఓపిక ప్రేక్షకులకి తప్పదు.`గణపయ్య' (అవినాష్) మరియూ `నాగక్క' (సౌందర్య) అనే భార్యాభర్తలు వారి పెద్దదిక్కు గణపయ్య తండ్రి 'దుగ్గజ్జ' (వాసుదేవ రావ్) తో కలిసి ఒక ద్వీపంలో ఉంటారు. అక్కడి చిన్న గుడిలో పౌరోహిత్యం చేస్తూ, "నేమ" అనబడే ఒక సాంప్రదాయ పూజను జరుపుతూ, పొట్టపోసుకొంటూ ఉంటారు. అది ఒక డ్యామ్ సైట్ కావడం వల్ల త్వరలో ముంపుకు గురయ్యే ద్వీపాలలో ఒకటిగా గుర్తించి ప్రభుత్వం అందరినీ ఖాళీ చెయ్యమంటుంది. తండ్రి ఆ స్థలాన్ని వదిలి రావడానికి ఇష్టపడకపోతే కొడుకూ, కోడలు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. వారికి సహాయంగా ఉండటానికి ఒక నవయువకుడు ‘కృష్ణ’ కూడా అక్కడికి వస్తాడు. చివరికి ఆ ద్వీపం మునిగిపోతుందా? నాగక్కకీ, కృష్ణకీ మధ్య ఉన్న స్నేహం ఏవిధంగా సమస్యల్ని తెచ్చిపెడుతుంది? చివరికి ఈ ప్రకృతి మరియూ వ్యక్తిగత కష్టం నుండీ ఈ కుటుంబం ఎలా గట్టెక్కింది? అన్నదే ఈ చిత్ర కథ.ఈ సినిమా పూర్తి సమీక్షని ఇక్కడ చదవగలరు.------------------------------------------------

Saturday, June 28, 2008

I think in తెలుగు !


ఖమ్మం జిల్లాలో ఒక UNICEF ప్రాజెక్ట్ కోసం, నా మొదటి పెద్ద ఇంటర్వ్యూ జరిగింది. ఈ తంతు మొత్తం ఇంగ్లీషులోనే జరిగింది. అక్కడకు వచ్చిన యునిసెఫ్ అధికారి ఒరియా అవ్వడం ఒక కారణమైతే, మన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే చాలా ఇంటర్వ్యూ లలో ఉపయోగించినట్లే, ఇక్కడా ఆంగ్లాన్ని ఎడాపెడా ఉపయోగించేసారు.మనమూ బాగా మాట్లాడే కాలేజీ, యూనివర్సిటీల్లో కాస్త చదువును చట్టుబండలు చేసొచ్చిన బాపతుకాబట్టి, సాధారణంగా వాడే ఆంగ్ల పదాలతోపాటూ, డిక్షనరీ చూస్తేనేగానీ అర్థం కాని క్లిష్ట పదాలు కొన్ని ఉపయోగించేసి, ఛాతీని కాస్త పెంచి మరీ వారెదుట సెటిలైపోయాం. నా వ్యవహారం వారికి నచ్చిన ఫీలింగ్ పెట్టి, ఒకరి మొఖాలొకళ్ళూ చూసుకుని అంగీకార సూచకం తలలూపేసారు. ఇంతలో వారికి హఠాత్తుగా ఒక ధర్మ సందేహం వచ్చింది...వారిలో ఒక పెద్దాయన నన్ను సందేహంగా చూస్తూ "Do you know Telugu?" అన్నాడు. తను చెప్పింది అర్థమయ్యేలోపల నా నోటివెంట అసంకల్పితంగా ఒక సమాధానం వచ్చింది "I think in Telugu" అని. నా సమాధానం విన్న వాళ్ళ మొఖాలు అప్పుడే స్విచ్ వేసిన ట్యూబ్ లైట్లల్లే కొద్దికొద్దిగా వెలిగి...హఠాత్తుగా దేదీప్యమానమయ్యాయి. అంతే, నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది.ఈ సమాధానం ఇచ్చి, బయటొచ్చిన తరువాత నా అసంకల్పిత సమాధానంలోని లోతును కాస్త బేరీజు చెసాను. 8 వ తరగతి వరకూ పూర్తి తెలుగు మాధ్యమం (medium) లో చదివినా, 9-12 వ తరగతిలో ఇంగ్లీషు మాధ్యమం లోకి మారాను. 10 లో తెలుగు పరీక్షలు రాసిన తరువాత తెలుగు వాచకాన్ని అస్సలు ముట్టలేదు. ఇక కాలేజిలో చేసింది ఆంగ్ల సాహిత్యంలో మేజరు, యూనివర్సిటీ లో చేసింది Development Communication, అదీ పక్కా ఆంగ్లంలో. "మరి ఎనిమిదోతరగతి వరకూ, అవసరాలు తప్ప ఆలోచనలు చేసెరగనుకదా! మరి నా ఆలోచనలు తెలుగులోఎందుకున్నాయి?" అన్న తీవ్రమైన సందేహం నాకొచ్చేసింది.తరచి చూస్తే, నాకు తోచిన సమాధానం ఇది. చిన్నప్పటి నుండీ, ఎప్పుడు ఈ తెలుగు పాఠాల నుంచీ తప్పించుకుంటానా అని చూడటం తప్ప తెలుగును, ముఖ్యంగా పాఠాల తెలుగును ప్రేమించి ఎరుగను. ఇక తెలుగు మీడియం అంటారా, లెక్కల్లో ‘సమితులు’ కన్నా ‘సెట్స్’ అనే పదం బాగా అర్థమయ్యేది, సైన్సులో ‘భాస్వరం’ అన్న భారీపదంకన్నా ‘ఫాస్ఫరస్’ అన్న తేలిక పదంలో నాకు సౌలభ్యత కనిపించింది. అంటే చాలామంది భాషావేత్తలు ఎలుగెత్తి చాటుతున్న మాతృభాషలో చదువు నా బోటివాడికి, తెలుగు కంటగింపుగానే తప్ప మనసుకింపుగా ఎప్పుడూ అనిపించలేదు.మరి "ఇంత లావు మూర్ఖుడికి, తెలుగులో ఆలోచించే ఝాడ్యం ఎక్కడినుండీ అబ్బిందా? అనుకుంటున్నారా !" అక్కడే ఉంది నాకు స్ఫురించిన కిటుకు. చిన్నప్పటి నుండీ తెలుగు పాఠాలంటే పారిపోయినా, కథలంటే మాత్రం పడి చచ్చేవాడిని. చందమామ, బాలమిత్ర, బాలభారతి, బాలజ్యోతి, బాలరంజని లాంటి మాస పత్రికలలోని కథల్ని ఔపోసన పట్టడానికి శ్రమించేవాడిని. కాస్త వయసొచ్చాక ‘పాకెట్ పుస్తకాలు’ అని కొన్ని జానపద కథలున్న పుస్తకాలు, దానితోపాటూ మధుబాబు, పానుగంటి, కొప్పిశెట్టి ల షాడో, బుల్లెట్,కిల్లర్ కథలూ చదివాను. ఈ పుస్తకాలు నా భూగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటూ, కాస్త నా మెదడుయొక్క imaginative extent ని పెంచాయనిపించింది. ఒక సహజ ప్రగతి రూపంగా నేనూ యండమూరి నవలలు చదవడం ప్రారంభించాను. క్షుద్రసాహిత్యం అని అప్పట్లో వచ్చిన ఇతగాడి సాహిత్యాన్ని నిరసించినా, నేను మొదట చదివిన తన నవలలు ‘ఋషి’, ‘పర్ణశాల’. వీటిల్లో తను పరిచయం చేసిన మానవ సంబంధాల fragility నన్ను ఆ వయసులోనే చాలా ఆలోచనలకు పురికొల్పింది.


యండమూరి తో ఆరంభించి మల్లాది, యుద్దనపూడి, సూర్యదేవర, వేంపల్లి, మేర్లపాక...ఇంకా ఎందరో పాప్యులర్ రచయితల పుస్తకాలు నిరాటంకంగా, దాదాపు రెండురోజులకొకటి చొప్పున ప్రతి శెలవుల్లో సాధించేసాను. ఎంత వేగంగా చదివేవాడినంటే, నాకు పుస్తకాలు అద్దెకిచ్చే షాపు వాడు నామీద అభిమానంతో "ఎక్స్ ప్రెస్" అని పిల్చేవాడు. కొన్ని సార్లు ఆలస్యమైనా ఎక్కువ డబ్బులు అడిగేవాడు కాదు.ఇక మైసూరు కాలేజీలో "ఆంగ్ల సాహిత్యంతో ప్రక్రియని తెలుసుకో, మీ భాషా సాహిత్యం చదివి అనుభవించు" అన్న సూత్రాన్ని నాకు మా ఫ్రొఫెసర్ తెలియజెప్పిన తరువాత, చలం నుంచీ తిలక్ వరకూ, విశ్వనాధ సత్యనారాయణ నుంచీ బుచ్చిబాబు వరకూ చాలా మందిని చదివాను. స్వంత ఆలోచనలు ప్రారంభమయ్యే తరుణం అదే కాబట్టి, ఆంగ్ల భాషలో నా పాఠాలు సాగినా, నా ఆలోచనా స్రవంతి మాత్రం తెలుగులో జరిగేది. నా సమాజం, దాని ఆలోచనలూ, సంస్కృతి మర్మాలూ, సామాజిక పోకడలూ సాహిత్యం ద్వారా నేను తెలుసుకొగలిగాను కాబట్టే తెలుగులో ఆలోచించి, ఆంగ్ల సాహిత్యానికి కూడా నావైన అర్థాలు (interpretations) చెప్పగలిగేవాడిని. ఉదాహరణకు Sigmund Freud ప్రకారం "పాము" sex కు symbol అంటే, మాకు మట్టుకూ అదొక దేవత అని ధైర్యంగా ఎద్దేవా చెయ్యగలిగే స్థాయికి నా తెలుగు ఆలోచనలు చేరుకున్నాయి.


అందుకే నామట్టుకూ నాకు తెలుగు మీడియం చదువులకూ, తెలుగు భాషా ప్రగతికీ అస్సలు సంబంధం లేదు. ఇంగ్లీషు మీడియం చదువుల వల్ల మన భాషకు వచ్చే తీవ్రనష్టమూ లేదు. రావాల్సిన నష్టం ఇప్పటికే మన భాషా బోధన, పిల్లలను తెలుగులో కథలుకూడా చదవమని ప్రోత్సహించలేని మన మారుతున్న సామాజిక రచనల వల్ల జరిగిపోయాయ్. అందుకే, భావవికాసం రాకున్నా, ఉద్యోగ వైకల్యం రాకుండా కాపాడే ఇంగ్లీషు చదువులే మిన్న. ఇక తెలుగుని రక్షించాలంటే దాన్ని, మనకు పాఠాలు చెప్పినట్లు చేదు మాత్రలు మింగిచినట్లు కాక ప్రేమగా ఉపయోగించే విధానాలు పిల్లలకి నేర్పుదాం.


తెలుగు భాషకు జై!
ఇంగ్లీషు మీడియం చదువులకు జై! జై!!

Friday, June 27, 2008

వావివరసల్లో ఆర్థిక మర్మాలు !?!

ఈ మధ్య నేను రాసిన ‘ఖుదా కేలియే’ అనే ఒక పాకిస్థానీ చిత్ర సమీక్షకు వచ్చిన ఒక స్పందనలో , ఆ చిత్రంలో సర్మద్ అనే పాత్ర తన బాబాయ్ కూతుర్ని బలవంతంగా పెళ్ళిచేసుకోవడం లోని ఔచిత్యాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ విమర్శ ‘బలవంతపు పెళ్ళి’ మీద అయ్యుంటే అసలు సమస్య వచ్చుండేది కాదు. కానీ తన అభ్యంతరం, "వావివరసలు లేని" ఆ పెళ్ళి మీద. తను "ఇండియాలో ఎక్కడా ఎవరూ బాబాయ్ కూతుర్ని పెళ్ళి చేసుకోరు" అని చాలా సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు నా బుర్రకు కాస్త పని కల్గింది."నిజమేనా?" అని నన్నునేను ప్రశ్నించుకుని, జవాబు తెలియక నా ముస్లిం మిత్రుడ్నడిగాను. దానికి అతను "అవును మీ తెలుగోళ్ళలో మేనత్త కూతుర్ని చేసుకున్నట్లే, మా వాళ్ళలో బాబాయ్ కూతుర్ని చేసుకోవచ్చు" అన్నాడు. ఈ ఒక్క వాక్యం లో నాకు కొన్ని మర్మాలు తెలిసినట్టైంది. ఆ మర్మాల్ని కాస్త ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ చెప్పే మర్మాలకి ఏవిధమైన సోషియాలజికల్, ఆంత్రపాలాజికల్ లేక మరే విధమైన సైంటిఫిక్ ఆధారాలు నా దగ్గరలేవు, ఒక్క నా మెట్ట లాజిక్ తప్ప.మనం వావివరసలకు చాలా ఖచ్చితమైన విలువల్ని ఆపాదిస్తాం. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల వారిలో అక్క, మేనత్త లేక మేనమామ పిల్లల్ని దర్జాగా పెళ్ళి చేసుకోవచ్చు. అదే మన భాషలో "వరస". ఇక బావా-మరదళ్ళ సరసాలమీద పుంఖాలు పుంఖాలుగా సాహిత్యం , సినిమాలూ మన సంస్కృతిలో ఒక అవిభాజ్య అంగం. పెళ్ళిళ్ళలో , ఫంక్షన్లలో సంబంధాలూ, వరసల చర్చలు లేకుంటే ఆ సంబరాలు చప్పగున్నట్లే లెక్క.
కానీ, ఈ మాటే ఎవరైనా భారతదేశం బయటున్నవారికి చెబితే దీన్ని "ఇన్సెస్ట్"(incest) అంటారు. "ఛివుక్కు మంటుంది కదూ?" పాశ్చ్యాత్య ధోరణుల్ని అంతగా నిరశించే మనల్ని , ఈ విషయం లో వీరు ఖచ్చితంగా తప్పుపట్టచ్చన్నమాట. ‘కజిన్స్’ మధ్య సంబంధాలు వీరికి ఏమాత్రం అంగీకారం కాదు. అంత దూరం ఎందుకు, ఉత్తర భారతదేశంలో కూడా ఈ సంబంధాలు అంగీకారం కాదు. వీరైతే ఒకడుగు ముందుకేసి ఒకే గోత్రనామం ఉన్నా లేక ఒకే ఊరివాళ్ళైతే వారిని సోదర సమానులుగా భావిస్తారు. ఈ మధ్య కాలంలో హర్యానా లో జరిగిన honor killings ఈ కోవకే చెందినవి. ఇక ముస్లిం సముదాయంలో మనం ‘తప్పు’ అనుకునే బాబాయ్ కూతుర్ని మనవాళ్ళు మేనమామ కూతుర్ని చేసుకున్నంత తేలికగా పెళ్ళి చేసుకుంటారు. అంటే విలువల విషయంలో మనం absolute అని మాట్లాడే విషయాలు, చాలావరకూ సముదాయాన్నీ, సంస్కృతినీ బట్టి చాలా relative అన్నమాట.కానీ, ఈ "విపరీతాలకు" కొన్ని సామాజిక, ఆర్థిక కారణాలు ఖచ్చితంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సామాజికంగా పితృస్వామ్య వ్యవస్థను పటిష్టం చేసి, ఆధిపత్యాన్ని రక్షించడానికి ఇది జరిగిఉంటుందని బహుశా ఫెమినిస్టులు ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇది వారి స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి, దాన్ని వారికే వదిలేస్తాను. ఇక నాకు అనిపించిన ఆర్థిక కారణాల్ని కాస్త చూద్దాం.


మన తెలుగు జీవితాలలో విలువలు రెండు రకాల మనుషులు నిర్ణయించేవారు. ఒకటి వేదాలు తెలిసిన బ్రాహ్మణులు, రెండు భూమి చేతుల్లో ఉండే భూస్వాములు. ఈ ఇద్దరికీ మేనరికాల వల్ల చాలా ఆర్థికస్వామిత్వం లభించిందని నా ఫీలింగ్. మొదటిగా బ్రాహ్మణుల్ని తీసుకుంటే, వీరు ఆలయ అర్చకత్వం మరియూ మాన్యాల మీద వచ్చే ఆదాయంపై తమ భుక్తికి ఆధారపడి బ్రతికారు. ఇలాంటి limited resource గనక మళ్ళీ మళ్ళీ విభజింపబడితే, గొడవలు తప్ప గౌరవప్రదమైన జీవితాలు జీవించగలిగేవాళ్ళూ కాదు. అందుకనే ఒక via medium ని చాలా convenient గా సృష్టించి ఉండొచ్చు. అవే, మేనరికాలు.కాకపోతే ఈ inbreeding కి కొంత logic కావాలి కాబట్టి, వాటి చుట్టూ కొన్ని విలుల్ని ఏర్పరిచారు. బాబాయ్ కూతుర్ని పెళ్ళి చేసుకోకూడదు, ఎందుకంటే ఒకే ఇంటి పేరు కాబట్టి. అదే మేనత్త కూతుర్ని చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటిపేరు మారొచ్చింది కాబట్టి, లాంటివి. ఇంకా చిత్రం ఏమిటంటే, అన్నకూతుర్ని పెళ్ళిచేసుకోవడం ‘పాపం’, కానీ అదే అక్క కూతురితో రొమాన్స్ ‘ఆదర్శప్రాయం’. ఇలా అన్నమాట. అప్పట్లో కొన్ని కుటుంబాల మధ్యనే వివాహ సంబంధాలు ఉండేవి. మహా అయితే ఇటుపక్కూరో, అటుపక్కూర్లోనో ఉన్న వారితో పెళ్ళిసంబంధాలు నెరిపేవాళ్ళు. అంటే కొన్ని తరాలు ఇదే చక్రంలో, ఒకే ఆలయం మీదా దాని మాన్యం మీద బతికేసారన్నమాట.


ఇక భూస్వాముల ఇళ్ళలో చూస్తే, ఇవి ఇంకా చాలా నిబద్దతగా జరిగేవనడానికి మనలో చాలా మందికి ఆధారాలు తెలుసు. ఆస్తి బయటకు వెళ్ళకూడదు కాబట్టి బలవంతపు పెళ్ళిల్లు చెయ్యడంలో కూడా వీరు చాలా సిద్దహస్తులు. ఇలాంటి సంబంధాలు ఈడూ-జోడూ, ఒడ్డూ-పొడవూ, వయసూ -వంకాయతో సంబంధం లేకుండా తెగించిన సంస్కృతి వీళ్ళకి సొంతం. ఇదంతా ఎందుకూ? భూమికోసం ! చాలా విలువైన commodity ఇది, గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునే మహత్తర మార్గమిది. ఇక వీటికి విలువలూ, ఆదర్శాలూ, అవసరమైన రొమాన్సూ అద్దకుండా ఉంటారా? అదే జరిగింది. అందుకే అబ్బాయిలకు "మరదలు", అమ్మాయిల "బావ" అనగానే మనసులో జిల్ జిల్ జిగా.ప్రస్తుత కాలంలో, చాలావరకూ డాక్టర్లు కూడా మేనరికాలు వద్దని చెప్పడమో లేక మన జీవన పరిధులు పెరిగి బయటి సంబంధాలు (చాలా వరకూ ఒకే కులంలో) విరివిగా చేసుకుంటున్నాం. కానీ మన సామాజిక design న్ని మాత్రం సత్యం అనుకునే ఆలోచన చాలా మందిలో ఉంది. ఇంతకీ ఇంత మెట్ట లాజిక్ తియ్యడంలో ఉద్ద్యేశం ఏంటంటే, మన సంస్కృతిలోని విలువల్ని మాత్రమే జీవన సత్యాలని, మిగతా వారి సామాజిక జీవనాన్ని, పద్దతుల్ని చిన్నచూపుచూడడమో లేక అది తప్పు అనడం ఎంతవరకూ సమంజసం అని నాకు అనిపించడం. అందుకే ఎవరైనా మన తీరులకి భిన్నంగా ప్రవర్తిస్తే, మన విలువల్ని బట్టి value judgment ఇచ్చెయ్యక, కాస్త ఆలోచిద్దాం.

Thursday, June 26, 2008

కవితండోయ్ ! కవిత !!


అసంపూర్ణ సత్యం (अर्थ सत्य)అంతులేని గగనాన్ని
ఆశల్లో ఇమిడ్చి
అదుపులో ఉన్న భువనాన్ని
ప్రశ్నిస్తూ ఉంటాను
ఎల్లలెరుగని విశ్వాన్ని
నమ్మకంలా ఉంచి
హద్దులెరిగిన పాలపుంతని
పరీక్షిస్తూ ఉంటాను
ఆశా,నమ్మకాలకన్నా
ప్రశ్నలూ,పరీక్షణలూ మిన్నా?
ఏమో...!
అదే జీవితంలో అసంపూర్ణ సత్యమేమో!
దాన్ని శోధించడమే ఈ జీవన లక్ష్యమేమో!!


నన్ను కవి అన్న వారిని, నేనే కత్తితో పొడుస్తా !

"అసలు మీరు కవికాదన్నవాడిని నేను కత్తితో పొడుస్తాను" అన్న రాధిక గారికి , "మొదటి కత్తిపోటు నాకే!" అని స్వీకరిస్తూ ఈ టపా రాస్తున్నా. నా ఇదివరకటి టపా ఆలోచనలూ Vs భావాలు లో, నా కవితలూ,కథలూ రాయలేని అసహాయతను నా ఆలోచనా శైలి, నా conditioning మీదకీ నెట్టి తప్పించుకున్నాను. కానీ ఈ మధ్య బ్లాగుల్లో అనేక కవితలూ, కథలూ చదివేకొద్దీ, రాయలేకపోయినా, స్పందించగలిగే హృదయంకాస్త ఏర్పడిందనిపించింది. దాన్ని ఆసరాగా తీసుకుని మన

ప్రేమంటే...
నీ వేలితో నీ కన్నే పొడుచుకోవడం,
అని నా మిత్రుడి అనుకోలు.
కన్ను పొడుచుకునైనా...
ఆ ప్రేమ తడి అనుభవించాలని నా వేడుకోలు.
ఆ అనుభవం వెలుగులో,
జీవితం ఒక ఉదయకిరణంలా అనిపిస్తుంది.
అది కేవలం అనుభవిస్తేనే తెలుస్తుంది.
నా కళ్ళ నిరాశ

నుదుటి బొట్టై భాసిల్లుతుంటే,
నా గాజుల సవ్వడి
ఒంటరితనాన్ని పోగొట్టింది.
నా చెవి దుద్దులు
చెంప సిగ్గుల్ని ఆర్పేస్తే,
నా మెడలోని ప్రేమ గొలుసు
నన్ను ప్రేమగా అక్కున చేర్చుకుంది.
వేలికున్న ఉంగరం
బంధాన్ని తెంపుకెళ్ళిన చెలికాడి వేలిముద్రగా మిగిలితే,
నాకు ఆశనీ, దు:ఖాన్నీ నగలుగా వదిలి
ఆనందం మాత్రం చాటుగా తప్పుకుంది.

Wednesday, June 25, 2008

తల్లి మనసు

సాధారణంగా లాజిక్కులూ, రీజనింగులూ అంటూ రాగాలు తీసే ఈ బ్లాగరి హఠాత్తుగా మనసుల మీద పడ్డాడేమిటా? అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ శీర్షికలో ‘మనసు’ ఉందిగానీ, అసలు విషయంలో మనం తీసేవి మాత్రం, నాకు అలవాటైన (మెట్ట) లాజిక్కులే కాబట్టి పాఠకులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.


పిల్లలు యుక్త వయస్సుకి రాగానే, తల్లిదండ్రులు పిల్లలపట్ల చూపే ప్రేమల్లో, పిల్లలపట్ల వారి ఆలోచనల్లో మార్పులు రావడం చాలా సహజంగా జరిగే పరిణామం. తమ జీవితంలోని అనుభవాలనూ, చుట్టుపక్కలవారి వ్యవహారాలనుంచీ వీళ్ళు గ్రహించిన దాన్నిబట్టి, కొన్ని పాఠాలను అన్వయించుకుని, పిల్లల జీవితాల్ని సరైన దారిలో పెట్టాలని చాలా తపనపడిపోతుంటారు. ముఖ్యంగా ప్రేమ-పెళ్ళి విషయానికొచ్చేసరికీ మరీనూ. ఈ విషయంలో చాలా మంది తల్లుల ఆలోచనాధోరణి లోని ఒక చిన్న విచిత్రాన్ని ఇక్కడ చూద్దాం.


కూతురి పెళ్ళి ప్రసక్తి వచ్చే సరికీ తల్లి, తన భర్త కన్నా మంచివాడైన వ్యక్తి కూతురికి మొగుడుగా రావాలని కోరుకుంటుంది. అంటే మెజారిటీ ఆడవాళ్ళకి తన మొగుడు అంత మంచివాడు కాదు అని మనసులో ఎక్కడో ఖచ్చితంగా అసంతృప్తి ఉన్నట్లు లెక్క. తల్లికి ఇంకో కొలమానం ఏమిటంటే, తనను పెంచిన తండ్రి. "తన తండ్రి అంత మంచివాడు ఎక్కడా లేడు" అనేది చాలా మంది అమ్మాయిల విషయంలో, ప్రస్తుతం ‘అమ్మ’ల విషయంలో కూడా ఒక universal fact. ‘భర్త’ ఎప్పుడూ ఆ image కి సరితూగడు సరికదా, వారి తండ్రి ఇమేజ్ ని ఒక సాధారణ భర్తగా తన ప్రవర్తనతో, ఇంకా గట్టిపడేలా చేస్తాడు. ఇక్కడే తల్లి మనసుకూ, పెళ్ళికావలసిన ‘పిల్ల’ మనసుకూ ఉన్న కాంట్రాస్ట్ తెలుస్తుంది. అమ్మాయి తన తండ్రిలాంటి భర్త కావాలి అనుకుంటే, అమ్మాయి తల్లి మాత్రం, "తన మొగుడిలాంటి మగాడు తన కూతురికి అస్సలు వద్దు" అనుకుంటుంది. ఇక సమస్య రాకుండా ఉంటుందా?


ఇక కొడుకు విషయానికి వద్దాం. ప్రతి తల్లీ తనంత మంచి భార్య ఎక్కడా లేదు అనుకుంటుంది. తనంత బాగా ఇల్లూ,పిల్లలూ, భర్తనీ చూసే ఇల్లాలు ఈ భూప్రపంచంలో అస్సలు లేరు, ఇక ఉండబోరు అని ప్రతి తల్లికీ ఒక గోప్ప విశ్వాసం. అందుకనే తనలాంటి భార్య వస్తే, కొడుకు సుఖపడతాడు అనే నమ్మకాన్ని పెంచుకుంటుంది. కొడుకుకి కూడా తల్లిపట్ల ఉండే సహజమైన ప్రేమతో అలాగే ఆశిస్తాడు. అందుకే మగాళ్ళు తమ పెళ్ళాల వంటని, అమ్మల వంటతొ పోల్చి అస్తమానం ఇరుక్కుపోతూ ఉంటారు. ఇక తల్లి విషయానికొస్తే, ఈ expectation పెళ్ళి వరకూ బాగానే ఉంటుందిగానీ, ఆ తరువాత కోడలు "తనలాంటిది కాదు, నిజానికి ఒకరకమైన విరోధి" అన్న నిజం మెల్లమెల్లగా తెలిసొచ్చి, అతాకోడళ్ళ ఆధిపత్యం పోరు మొదలౌతుంది. ఇందులో మొదటి బలిపశువు ఆ కొడుకు/భర్తే !


ఇలా ‘తల్లిమనసు’ మన జీవితాల్లోని కొన్ని సంఘటనలకూ, మన సంసారాల్లో కొన్ని ఘటనలకూ కారణమవుతూ ఉంటుందన్న మాట! చిత్రంగా ఉన్నా, చాలామంది పిల్లల జీవితాల్లో ఇదొక నిజం అంతే.

Tuesday, June 24, 2008

సినిమాలలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఇంకెక్కడైనా ఉందా?


ఈ శీర్షిక చదివి "వీడికి పిచ్చిగాని పట్టలేదు కదా?" అనుకుంటున్నారా! అదే ఇక్కడ విచిత్రం. సినిమా ధియేటర్ అంత ప్రజాస్వామికమైన స్థలం ఏదైనా ఉందా అసలు! అందులో అడుగు పెట్టాలంటే కావలసింది, వెళ్ళవలసిన క్లాసుకు, తీసుకునే టికెట్టు తేడానే తప్ప, ఓకే చూరు కింద నేల టికెట్టోళ్ళూ, క్లాసు జనాలూ ఒకే సినిమాని, ఒకే తెరపై చూడటం కన్నా ప్రజాస్వామ్యం ఇంకోటుందా?


ఈ విషయంలో ప్రజాస్వామ్యం పేరుతో మనకున్న రాజకీయ అధికారాలకన్నా సినిమా చాలా మేలు కదా! ఇందులో మనం ఓటు వెయ్యక...అదేనండీ టికెట్టు తియ్యకపోతే సినిమా ఫ్లాపై కూర్చుంటుంది. అంటే, మనకి call back option కూడా ఉన్నట్లే లెఖ్ఖ. రాజకీయ నాయకులకి ఒకసారి ఓటేస్తే..వాడెంత ఓటివాడైనా ఐదు సంవత్సరాలు భరించాల్సిందే. ఇక సినిమా అయితే ఒకటి కాకపోతే ఇంకొకటి ఎన్నుకునే అధికారం మనకుంది. రాజకీయాలలో మనకా ఛాయిస్ ఎక్కడా?


ఇంకా సౌలభ్యమైన విషయం సినిమాలలో ఇంకొకటుంది. అది ప్రేక్షకుల్ని బట్టి హీరోలు సినిమా తియ్యడం. అంత కన్నా అధికారం రాజకీయాలలొ మనకెక్కడుందీ! మనం కోరుకున్నట్లు ఈ నేతలు రాష్ట్రాన్ని నడుపుతున్నారా? కానీ మన హీరోలు, వారి అభిమానులు కోరుకున్నట్లుగా సినిమాలు మాత్రం తీస్తున్నారు. చిరంజీవి ఎప్పుడొస్తాడో తెలిసినట్టుగా, ప్రేక్షకులు ఈలలేసి గోలచేస్తేగానీ మన మెగాస్టార్ తెరపై ప్రత్యక్షమవ్వడం ఎవరికైనా గుర్తుందా? పాండురంగడులో బాలకృష్ణ నటనని, "అదరహో, తండ్రిని మరిపించాడు" అన్న అభిమాని కేక మీకు వినపడలేదా? ఈ ఈలలూ,కేకలూ మీరు వినికూడా ఇది ప్రజాస్వామ్యం కాదన్నారంటే, మీరు ఖచ్చితంగా అధికారంలో లేని అప్పోజిషనన్న మాట.


ఇలా నాలాంటి వాళ్ళ సరసన మీరు అప్పోజిషన్లో మైనారిటీగా ఉండి, కేకలేసినంత మాత్రానా అధికార పార్టీ, అభిమానుల ప్రకారం మన సినిమాల్ని పరిపాలించకుండా ఆపుకుంటారా? అంటే మన ఆపోజిషనోళ్ళు మెజారిటీ అయ్యేదాకా మనం కోరుకున్న మంచి ప్రభుత్వాలు(సినిమాలు) రావన్న మాట. అందుకే మన సినిమాల ప్రజాస్వామ్యం జిందాబాద్!!!.

Sunday, June 22, 2008

తప్పకుండా చూడవలసిన సినిమా - ఆమిర్ (హిందీ)


‘ది హ్యాపెనింగ్’, ‘దశావతారం’ వంటి భారీ చిత్రాల నడుమ గత వారం సైలెంట్ గా రిలీజైన హిందీ సినిమా ‘ఆమిర్’. ఒక కొత్త దర్శకుడు, అసలు పేరుకూడా సరిగ్గా తెలియని ఒక కొత్త హీరోలతో UTV వారి ‘స్పాట్ బాయ్ మోషన్ పిక్చర్’ బ్యానర్ నిర్మించిన సినిమా ఇది.అప్పుడే విదేశం నుండీ వచ్చిన ‘అమీర్’ అనే ఒక ముస్లిం డాక్టర్, ముంబై ఎయిపోర్ట్ లో అడుగుపెట్టాగానే, తన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసారని ఒక ఫోన్ కాల్ ద్వారా తెలుస్తుంది. ఆ కిడ్నాపర్లు చెప్పినట్టు చేస్తే అందరికీ విముక్తి అని ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి తన ద్వారా చేయించదలుచుకున్న పనేమిటి? తన తలరాత (किस्मत)ని ఫోన్ కాల్ ద్వారా శాసిస్తున్న వ్యక్తికి, అప్పటి వరకూ తన భవిష్యత్తును తనే మలుచుకున్న అమీర్ ఆఖరికి చెప్పిన సమాధానం ఏమిటి? అన్నది ఈ సినిమా ఇతి వృత్తం.ఇలాంటి విషయాన్ని ఎన్నుకోవడం లోనే, మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న ‘రాజ్ కుమార్ గుప్తా’ యొక్క పరిణితి, అభిరుచి కనపడుతుంది. అమీర్ పాత్రలో నటుడిగా ఒక కొత్త ముఖంగా ‘రాజీవ్ ఖండేల్వాల్’ పరిచయ్యాడు. మొదటి ఫ్రేమ్ నుండే రాజీవ్ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నటనతో పాటూ, తెరమీద తన ఉనికి చాటుకునేలా ఉన్న ఇతడి స్క్రీన్ ప్రెజెంస్,వాయిస్ క్వాలిటీ రాబోయే కాలంలో అతడ్ని నిలబెడుతుందనిపిస్తుంది. దాదాపు 1 గంటా 35 నిమిషాల ఈ సినిమాలొ ఇతను తప్ప ఇంకెవ్వరూ స్క్రీన్ పైన కనిపించరు. ఆయినా ప్రేక్షకుల్ని కట్టిపడవెయ్యగలిగాడంటే, భవిష్యత్తులో చాలా సినిమాలలో ఇతను కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది.అమీర్ విమానం లో ముంబై రావడంతో సినిమా మొదలై, అక్కడే ఇమిగ్రేషన్ అధికారి తన లగేజ్ మూడు సార్లు చెక్ చేసి "తను ఒక ముస్లిం,కాబట్టి అనుమానించాలి" అన్న భావాన్ని ఎత్తిచూపుతాడు. అయినప్పటికీ ఆ సంఘటన లో అమీర్ చూపే సహనం, మిగతా సినిమాలో తన ప్రవర్తనకి,ఆఖర్న తను తీసుకునే నిర్ణయానికీ ప్రాతిపదికగా మారుతుంది. ఇలా ఆరంభంలోనే ఒక పాత్ర స్వభావాన్ని సున్నితంగా చెప్పిన సినిమాలు ఈ మధ్యకాలంలో చూసినట్లు లేదు.

(పూర్తి సమీక్ష కోసం http://www.navatarangam.com/?p=502 ఈ లంకెను నొక్కండి)

Saturday, June 21, 2008

తెలుగు సినిమా బాగుపడాలనీ !


(www.navatarangam.com లో వచ్చిన కొన్ని కామెంట్లకి సమాధానంగా రాసి,ఈ మాసంలోనే ప్రచురింపబడిన వ్యాసం ఇది)"తెలుగు సినిమా చెడిపోయిందహే!" అని అందరూ అనేసుకుని, కొందరు బాధపడి. ఇంకొందరు ప్రపంచ సినిమాని అవసరమున్నంత వరకూ చూసేసి "దీన్నుంచైనా నెర్చుకోరు" అని నిస్పృహని వెళ్ళగక్కి. (నాలాంటి) మరికొందరు, దొరికిన కాగితం ముఖాన తమ భావాల రంగుపూసో, బ్లాగులో చర్చలతో దుమారంరేపో నవతరంగం లో ‘టైంపాస్’ వెళ్లదీసేస్తున్నామని,కొంత మంది పోరడం జరిగింది. ఈ శ్రేయోభిలాషుల అభిమానకరమైన ఎత్తిపొడుపుల కింద ఖచ్చితంగా మర్మముంటుందని నమ్మి, ఆత్మారాముణ్ణి హాజరుపరచి "కూసింత అంతర్మధనం అవసరమోయ్" అని, పిలిచి కూలేసి ఈ విషయాన్ని తనతో కలిపి మధించేసా ! సాగరమధనం తీరుగా... కొంచం అమృతం, మరింత హాలాహలం దయచేసాయి. వచ్చినదాన్ని భరించి గొంతులోకి నెట్టెయ్యడానికి శంకరుణ్ణో, కేవలం మంచిని మాత్రం తమమధ్యనే పంచేసుకునే సురశిఖామణినో కాకపోవడంచేత, తెగించి ఆ సారాన్నిఇక్కడ బరితెగించబూనితిని.అసలు తెలుగు సినిమా కొత్తగా ఏంచెడిందని ఇంత కోలాహలం నెరుపుతున్నారు? అని, మహబాగా అడగడం జరిగింది. నిజమే, కొత్తగా అర్జంటుపడి చెడింది ఏమీ లేదు. ఇది చాపకింద నీరులా ఎప్పుడో చెడటం మొదలెట్టింది, మనకు గుర్తించడం చేతకాక,గుర్తెరిగిన వాళ్ళకు దమ్ముల్లేక, "రైఠో !ఎలా జరిగితే అలా జరుగుతుంది" అన్న ఉదాసీనత మొదలైన మొదటిరోజే, తెలుగు సినిమా చెడిపోవడం మొదలయ్యింది. ఈ పరిణామక్రమం యొక్క తారీఖులు లెక్కగట్టడం కన్నా, మనకు కావలసింది, ‘లెక్క మార్చడం’. ఈపని "ఇండస్ట్రీ" లోని పెద్దలో,వారి గద్దెలో చేసేది కావని నా నమ్మకం. ఎందుకంటే, ఆల్ర్రెడీ సముద్రం లో మునిగినోడు మంచినీరు ఎలా ఇవ్వలేడో, వీళ్ళ భాగోతమూ అలాగే ఉంది కాబట్టి. సినిమా పరిశ్రమతప్ప బాహ్యప్రపంచం-నిజ జీవితం దాదాపు తెలియని, వంశపారంపర్య నూతిలో కప్పలు హీరోలు గా ఒకవైపు రాజ్యమేలుతున్నారు. సినిమాకి "కేప్టన్" అని భావించే దర్శకులుగా కొత్తవాళ్ళు, ‘సహాయదర్శకత్వంపు ఊడిగం’ అధమం ఐదుసంవత్సరాలైనా చేస్తేగాని అవడం లేదు. అన్ని సంవత్సరాల దాస్యం అలవడిన వాడు, ఆర్డర్లు తీసుకోగలడేగాని "సినిమా షిప్పుని" నడపగలడా? ఇంతగా స్వజాతి సంపర్కానికి అలవాటు పడ్డ సినీపరిశ్రమ జాతికి జవసత్వాలు తమంతటతాముగా వస్తాయంటారా?మరైతే మార్పు ఎక్కడినుండి వస్తుంది? అన్నది, పెద్ద భేతాళ ప్రశ్న కానేకాదు. కాస్తోకూస్తో మార్పు అప్పుడప్పుడు ఎక్కడినుండీ వచ్చేదో, ఇప్పుడు ఎక్కడ్నుండి వస్తోందో గమనిస్తే, సమాధానం దానంతట అదే వస్తుంది. పాతమురుగు నుండి కొత్తనీరు రానట్టే, చిత్రసీమలో డెబ్భయ్యవ దశకం మొదలు ఇప్పటి వరకూ వచ్చిన నూతన ఒరవళ్ళన్నీ పరిశ్రమేతరులు తెచ్చినవే (వారిలో కొందరు ఇప్పుడు పెద్దరికం వెలగబెడుతూ,తమ మూలాల్ని మరిచారు.అది వేరే విషయం). వంశీ,జంధ్యాల,టి.కృష్ణ మొదలు కొత్తగా కలకలం రేపిన "గమ్యం" ‘క్రిష్’ వరకూ, మనకెన్నో ఉదాహరణలు.అసలు తెలుగు సినిమా చరిత్ర "శకాల"నే మార్చిన "శివ" దర్శకుడు ఎక్కడివాడు? ఏ తెలుగు దర్శకుడి దగ్గర దర్శకత్వం నేర్చాడు?ఇక హీరోలంటారా, వారినీ చూద్దాం. అప్పటికే చిరంజీవి, రాజేంద్రప్రసాద్,మోహన్ బాబు మినహా (వీళ్ళ వారసులూ తయారయ్యారు మన ప్రాణాలకి) మిగతా వాళ్ళందరూ దాదాపు వారసత్వం బాపతే. అంటే మొదలెట్టగానే "బాబు"లన్న మాట. అందరినీ ఒకగాట కట్టలేముగానీ, అసలు ఈ ఝాఢ్యం ఎక్కడి నుండి మొదలో మాత్రం కొంత అంతు చిక్కుతోంది.ఇక ఈ పుట్టుక ‘హీరో రాజుల’ మాట ‘దాస్య దర్శకులు’ వినక చస్తారా! వారు తియ్యమన్న సినిమా తియ్యక చస్తారా!!హీరో లను మినహయిస్తే, చెప్పుకోదగ్గ సహాయ"నటులు" మాత్రం, ఎప్పుడూ సామాన్యజనం నుండేవచ్చి తమ విలక్షణతను చాటారు. రావుగోఫాలరావు మొదలు కోట శ్రీనివాసరావు వరకు, ప్రకాష్ రాజ్ మొదలు నిన్నమొన్నటి షఫి వరకూ అందరూ జన‘ప్రవాహం’ నుంచేగాని, నూతులూ,బాత్ టబ్బులనుండీ మాత్రంకాదు. ఇల్లా వచ్చిన కొత్తనీరు ఎప్పటికప్పుడు కొంత సినీసముద్రపునీటిలో కలుస్తున్నా, ఈ పరిశ్రమ పన్నీరవడానికి మాత్రం మూలాలని కాస్త (బహుశా సమూలంగా) మార్చడం అత్యవసరం.ఇంతస్థాయిలో మార్పురావాలంటే, ఏ అల్లాఉద్దీన్ అద్భుతదీపమో లేక అధమం ‘జై పాతాళ భైరవి’ మంత్రమో రావాలి. ఇవన్నీ రావుగనక, ‘సునామీ’ ఎలాగూ సినీపరిశ్రమలో పుట్టించలేక, ఒక చిన్న కొత్త కెరటం (నవతరంగం) తో సరిపెడుతున్నాం. ‘ఇక్కడ సభ్యుల ఉద్దేశాలు ఘనమే ఐనా, ఆచరణ సాధ్యమా?’ అని ఒక పెద్ద డౌటు ప్రజలకి. నిజమే...!!! కాకపోతే ఒక్క మాట, దుర్మార్గాన్ని కత్తిపట్టి ఎదిరించకపోయినా "ఇది అమానుషం" అని కనీసం చాటుగాఅయినా అన్నవాడే మనిషి. అదేపని మేముచేస్తున్నాం. అదీ అంతర్జాలంలో,మరీ భాహాటంగా అంతే తేడా. ఇక ఆచరణ సాధ్యాసాధ్యాల మాట మరో సంవత్సరంలో తేలిపోతుందని నా నమ్మకం. ‘మాటలనుంచీ చేతలకి మారడానికి కొన్ని చేతులు అప్పుడే సిద్ధమయ్యాయి’ అని మనవి.నవతరంగం ఉద్దేశం, బోరుగొట్టే లాగుడు పీకుడు ఆర్టు సినిమాని ప్రమోట్ చెయ్యడం అసలుకాదు. ఎదో ‘మంచి సినిమా’ అన్నది ఎక్కడైనా (ప్రపంచం లో ఏ మూలైనా) కనపడితే, "చూడండి" అని చెప్పడం. ఇక మన తెలుగు సినిమాకూడా బాగుపడాలని కోరడం...ఒక్కోసారి పోరడం. కనీసం చెడిందని ఒప్పుకుంటేనే, బాగుపడటానికి అవకాశం ఉంది గనక డాక్టర్లుగా మారిన కొందరు పరీక్షించి, రోగాన్ని వెతుకుతున్నారే గానీ, చెడిందని చెప్పేసుకుని పాడెగట్టెయ్యడానికి మాత్రం కాదు. తెలుగు సినిమా మా అందరిజీవితం. దీనికి కాపాడుకుందామని ఒక కోరిక అంతే! తెలుగు సినిమాలో ప్రపంచసినిమాకి సాటైన సినిమాలు రాకపోయినా ఫరవాలేదు, కనీసం తెలుగు సంస్కృతికి, భాష కూ... కనీసం మనుషులకు దగ్గరగాఉన్న ‘కథ కలిగిన’ సినిమా రావాలనే మా ఆశ, తప్పంటారా?

Friday, June 20, 2008

ఇంగితజ్ఞానానికి ఒక కన్నీటి వీడ్కోలు


మనతో చాలా కాలం గడిపి, ఈ మధ్యనే దివంగతుడైన ‘ఇంగితజ్ఞానం’(common sense) అనే ఒక పాత మిత్రుడిని గుర్తుచేసుకోవడానికి ఇక్కడ మనం చేరాం. తన పుట్టుకకి సంబంధించిన వివరాలు సర్కారీ యంత్రాంగంలోని రెడ్-టేపిజం కారణంగా పొగొట్టుకున్నప్పటినుండీ, కనీసం అతని వయసు కూడా తెలీకుండా బ్రతికారు. అయినప్పటికీ చాలా విలువైన పాఠాలను తను మనకి తెలియజెప్పాడు. వాటిల్లో కొన్ని ఇక్కడ ఉదహరిస్తాను. "ఎదుటివాడి పనిలో తలదూర్చకు", "పక్కవాడి అభిప్రాయాలకు గౌరవమివ్వు", "అంతా నాకే తెలుసు అని విర్రవీగకు", "తప్పైతే తప్పని ఒప్పుకో" లాంటివి మచ్చుకకి కొన్ని.


ఇంగితజ్ఞానం గారు చాలా సాధారణమైన ఆర్థిక విధానాల్ని అనుసరించేవారు. ‘సంపాదన ఉన్నంతనే ఖర్చుపెట్టు’, ‘ప్రపంచ బ్యాంకైనా సరే ఉత్తినే ఇస్తే అప్పుతీసుకోకు’ వంటి మౌళిక సూత్రాలని పాటించారు. కానీ, అర్జంటుగా ఎదిగిపోవాలని అప్పులూ, ఇంకా తలకు మించిన ఖర్చులూ తన చుట్టుపక్కల అందరూ చెయ్యడం మొదలయ్యేసరికీ వీరి ఆరోగ్యం కాస్త క్షీణించింది.


అసలే అనారొగ్యంతో ఉన్న వీరు, అర్థం పర్థం లేని తెలుగు సినిమాలు, ఎప్పటికీ లాజిక్ లేకుండా సాగుతున్న TV సీరియళ్ళూ, వాటిని అదేపనిగా వీక్షిస్తూ అతుక్కుపోతున్న ప్రజలనీ చూసి కాస్త చిత్త చాంచల్యం పాలుపడ్డారు. ఈ స్థితిలోనూ కాస్త కొనఊపిరితో ఉన్న వీరి పరిస్థితి, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలనూ,నాయకుల వెర్రివేషాలనూ చూసి విషమించింది.


చివరికి మొన్న జరిగిన మంద్యం లైసెంసుల అమ్మకాల ధరలు విని, వీరు గుండాగి మరణించారు. చనిపోయిన వీరికి ‘ఆలోచన’ అనే సహధర్మచారిణి తోపాటు, ‘బాధ్యత’ అనే కూతురు, ‘తర్కం’ అనే కొడుకూ ఉన్నారు. తన నలుగురు సవతి తమ్ముళ్ళైన ‘నా హక్కు నాకు తెలుసు’ , ‘నేనే కరెక్టు’, ‘నా ఇష్టమొచ్చినట్టే చేస్తా’, ఇంకా ‘తప్పు నాది కాదు, వేరే వాళ్ళది’ ఈ అంత్యక్రియలకి హాజరు కాలేకపోయారు.


ఇంగితజ్ఞానం గారి అంత్యక్రియలకి వీరితోపాటూ చాలామంది హాజరు కాలేదు. బహుశా తను పోయారని ఇప్పటికీ చాలా మందికి ఇంకా తెలిసుండకపోవచ్చు. ఒక వేళ మీకు ఈ విషయం తెలిస్తే, అందరిలాగే మీరు కూడా, ఏమీ చెయ్యకుండా ఉండవలసినదిగా ప్రార్థన. తన ఆత్మకు శాంతి....మనకు తగిన శాస్తీ కలుగుగాక!


--------------------------------

(ఒక స్నేహితుడితో బ్లాగుల్లోని కామెంట్ల గురించి చర్చిస్తూ నేను, "Why don't they understand such simple things of life? they are just a matter of common sense" అన్నాను. దానికి ఆ మిత్రుడు నన్ను ఆప్యాయంగా చూసి "Common sense is not very common to find these days, its either a priced commodity or dead long ago" అన్నాడు. ఆ చర్చకు ఫలితమే ఈ టపా)

Thursday, June 19, 2008

మందు బాబులూ, మీకు జోహార్లు !


"మన మీద మనకు లేని శ్రద్ధ ప్రభుత్వానికి ఎందుకుండాలీ?" అని ఒక బ్లాగులో కామెంటిన ఇండియన్ మినర్వా గారి మాట లో , మద్యం లైసెంసుల వేలం పైన అందరి ఆర్గ్యుమెంట్లనీ తునాతునకలు చేసే బలముంది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల బలహీనతలతో ఆడుకునే దౌర్భాగ్యానికి దిగజారకూడదు సరే, మరి మనిషికి మాత్రం కుటుంబాన్ని పణంగా పెట్టి మరీ బలహీనతకు (దర్జాగా) లోనయ్యే హక్కు ఉందంటారా?


హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న మద్యం దుకాణాల లైసెంసు కోసం చెల్లించిన ధర ప్రతి దుకాణానికీ 2 కోట్లు పైమాట. ప్రభుత్వానికి ఈ తంతు ద్వారా చేకూరిన పైకం అక్షరాలా 1649.49 కోట్లు. ఇక లేడి నెత్తురు మరిగిన పులి, గడ్డి మేస్తుందా? తెలుగుదేశం దారి చూపితే, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆరులైన్ల హైవే చేసేసింది. అంతే తేడా, కాబట్టి ఈ రాజకీయ పార్టీలలో ఎవరికీ మరొకర్ని వేలెత్తిచూపే అర్హత లేదు. ఇక మన ‘ఎర్ర’ బాబులు సరదాగా ఉద్యమాలైతే చేస్తారేగానీ, విషయానికోచ్చేసరికీ వీరూ మందుగారిపోయారు. ఇక మిగిలింది, మన జయప్రకాష్ నారాయణ్ "నిబద్దత ఉంటే బ్రాందీ,సారాలు ఎన్నికల్లో ఉపయోగించం" అని రాజకీయ పార్టీల్ని మాటివ్వమని దాదాపు సంవత్సరంగా అరచి అరచీ ఇప్పుడు పాపం నోరుపడిపోయి, నోరెళ్ళబెట్టి ఈ ప్రహసనాన్ని చూసి బాధకన్నా, ఆశ్చర్యపోవడం ఇతడి వంతైంది. పాపం !


ఇక మహిళా ఉద్యమ కర్తలూ, తెలుగు మహిళా కార్యకర్తలూ (కొంత సినీ గ్లామరు మొఖానపూసి) తమవంతుగా మీడియాలో అక్కసు వెళ్ళగక్కారు. డబ్బుపెట్టి కొన్న కొన్ని సీసాల బ్రాందీ, విస్కీలని కెమెరా సాక్షిగా పగులగొట్టి చేతులు దులుపుకున్నారు. వేలం జరుగుతున్న చోట, వేలం పాడేవాళ్ళని ఐడెంటిటీ కార్డులిచ్చి మరీ పోలీసు ఎస్కార్టులు స్వాగతిస్తుంటే, మరో వైపు లాఠీ చూపించి ఉద్యమ కారుల్ని అదే పోలీసులు శాంతింపజేస్తున్నారు. ఆహా! ఏమి మనోహర దృశ్యం. అణువణువునా హాస్యం, అడుగడుగునా TV సీరియల్ని మరిపించే డ్రామా. నిజంగా అప్పుడనిపించింది, "మందు బాబులూ మీకు జోహార్లు" అని.


బ్లడ్/కాన్ఫ్లిక్ట్ డైమండ్ ఆధారిత కొన్ని ఆఫ్రికా దేశాల అర్ధిక వ్యవస్థల్లాగా మన రాష్ట్రమూ ఈ మద్యం డబ్బుతో అభివృద్ధి సాధించే దిశగా సగర్వంగా అడుగులేస్తుందేమో! మన ఆర్థిక మంత్రి రోశయ్యగారు మాత్రం చాలా హుందాగా "ఈ డబ్బుని మధ్యపాన వ్యతిరేక ప్రచారానికి వాడతాం" అని మరో తీవ్రమైన జోకొకటి పేల్చి, లుంబినీ పార్కు బాంబు విస్ఫోటాన్ని మరిపించారు. ఇన్ని జరుగుతున్నా, ఎక్కడా కనబడని జగన్నాటక సూత్రధారి మాత్రం...పేరు తెలీని మందు బాబులు.


ప్రభుత్వాలకూ,రాజకీయ పార్టీలకూ, సామాజిక ఉద్యమ కర్తలకూ వాళ్ళవాళ్ళ జెండాలూ,అజెండాలూ ఉన్నాయ్. కానీ వ్యక్తులుగా మన గమ్యం ఏమిటి? సాఫీగా జీవితం సాహించడమే కదా ! మరి ఈ మందులో జీవితాన్ని మరిపించే సుఖముందా!?! ఉంటే మాత్రం మందుకు జై ! మందు బాబులకు జై!జై! మందు బాబులూ మీకు జొహార్లు.

Wednesday, June 18, 2008

మా ముకుందుడి భావా‘వేషాలు’పేరు: కత్తి ముకుంద్ అవినాష్
వయసు: వచ్చే నెలకి ఐదు వస్తాయి

వాడు చేసే అల్లరంతా కెమెరా లో బంధించడం కష్టమే...
కానీ, ఏదో అప్పుడప్పుడూ ఇలా కరుణించినప్పుడు క్లిక్కు మనిపించిన ఫోటోలివి.

Tuesday, June 17, 2008

తమిళోళ్ళకి మనమంటే అలుసా !


ఈ మధ్య మన ‘కాలాస్త్రి’గారి బ్లాగులో ‘దశావతారం’ సినిమా చర్చతోపాటూ, తమిళోళ్ళు ఇతర భాషల వారి పట్ల చూపే చిన్నచూపూ చర్చకొచ్చింది. ఇలా మనకు (తెలుగువారికి) అనిపించడం వెనుక ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? లేక నిజంగా తమిళులు అలాంటి భావన కలిగి ఉన్నారా? అని కాస్త ఆలోచించడం జరిగింది. చిన్నప్పటి నుండీ నేను పెరిగిన పరిసరాలు తమిళనాడు బార్డర్ లో ఉండటం, వారి సినిమా మరియూ రాజకియం పై కాస్తో కూస్తో ఉన్న అవగాహన, అంతే కాక కాలేజి మరియూ యూనివర్సిటీ రోజుల్లో ఈ భాష వారితో నా స్నేహన్ని దృష్టిలో ఉంచుకుని ఒక విశ్లేషణకు ఇక్కడ ప్రయత్నిస్తాను.


స్వాతంత్ర్యానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత, దక్షిణాదిన తనదంటూ ఒక ప్రత్యేక హోదాను కలిగిన రాష్ట్రంగా తమిళనాడు ఉద్భవించింది. ఈ ప్రత్యేకత మద్రాసు రాష్ట్రంగా ఇంతకుమునుపే దానికున్న గుర్తింపు వలనైతే కావచ్చునేమోగానీ, ఆ తరువాత కాలంలో భాష, సంస్కృతిక, రాజకీయ, సామాజిక,మరియూ ఆర్థిక రంగాలలో తనదైన శైలిలో చూపిన ప్రగతి ఆ స్థాన్నాన్ని సుస్థిరం చేసింది. వీరి ఈ విభిన్న శైలి, మనకు కాస్త ‘అతి’ అనిపింఛడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే వీరు narrow -minded అంటేనే కాస్త అల్లోచించాల్సి వస్తుంది. ఒక వేళ అలాంటి తమిళ వ్యక్తులు కొందరు మనకు తగిలినా మొత్తం తమిళజాతికి ఈ ఝాడ్యాన్ని అంటగట్టడం ఎంతవరకూ సమంజసం అని కాస్త తరచిచూడాల్సిన అవసరం ఎంతైనాఉంది.ఈ తమిళుల ‘అతి’ కి కారణాలని నాకు అనిపించిన కొన్ని విషయాలను చూద్దాం. మొట్టమొదటిది వీరికి తమ భాష పట్ల ఉన్న అమితమైన ప్రేమ. అది ఒక్కొసారి మరీ హద్దులు మీరినట్టుగా ఉంటుంది. భాషోద్యమాల సమయంలో హిందీకి వ్యతిరేకంగా అమితంగా పోరాడిన రాష్ట్రం ఒక్క తమిళనాడే అన్నది అందరికీ తెలిసిన సత్యం. ఈ వ్యతిరేకతకు కారణం వారికి తమిళం మీది ప్రేమతోపాటూ, భారత ప్రభుత్వం యొక్క ఆధిపత్య (hegemony ) ప్రయత్నాలకు చెక్ పెట్టడంకూడా ఒకటి. తమ తమిళ వ్యక్తిత్వాన్ని (identity) కాపాడుకోవడానికి భాష ఒక పెద్ద ఆయుధం అని వీరు మనస్ఫూర్తిగా నమ్మారు. హిందీ చదువుతో నేషన్ బిల్డింగ్ సంగతేమోగానీ, తమ మూలాల్ని మాత్రం కదిలింఛడానికి ప్రయత్నం జరుగుతున్నదన్న నమ్మకంతో ఈ హిందీ వ్యతిరేక సమరశంఖాన్ని పూరించారు. ఆ పట్టూనే ఇప్పటికీ సాగిస్తున్నారు.వ్యతిరేకమన్నంత మాత్రానా వీరికి హిందీ రాదు అనుకుంటే మట్టుకూ పప్పులో కాలే. చాలా వరకూ చెన్నైలో ఉన్నవారికి హిందీ అర్థమౌతుందిగానీ, మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపరు అంతే. కాకపోతే హిందీ రాకపోయినా దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశన చేయటంలొ వీరు ఒక ప్రముఖ పాత్ర వహించారు. మన దేశాన్ని ఒక ప్లూరలిస్టిక్ డెమాక్రసీగా మిగిల్చిన శక్తులలో వీరి భాషాభిమానం ఒకటి. "హిందీ తప్పదు కాబట్టి నవోదయా విద్యాలయాలు మాకొద్దు" లాంటి కొన్ని మూర్ఖపు పోకడలు తర్వాత వచ్చినా, మూలాలను గమనిస్తే వారి మూర్ఖత్వం కూడా ముచ్చటగానే ఉంటుంది.రెండవది వీరి సామాజిక, సాంస్కృతిక ధృక్పధం. ఈ రెండింటికి ఇక్కడ చాలా దగ్గర సంబంధం ఉంది. మూకుమ్మడిగా బ్రాహ్మణేతర కులాలు భ్రాహ్మణ ఆధిపత్యంఫై తీవ్రమైన పోరాటం జరిపిన చరిత్ర వీరిది. కానీ ఎక్కడా బ్రాహ్మణులపై పోరుగా దీన్ని సలపకుండా, కేవలం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మట్టికలిపిన తెల్ల విప్లవాలలో(Revolution without bloodshed) ఇదొకటి. ఇలాంటి పరిణామం ఏ ఆఫ్రికాలోనో జరిగుంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేము. దాదాపు 50% మించి కులపరమైన రిజర్వేషన్లున్న రాష్ట్రమూ ఇదే, పెద్ద స్థాయిలొ పూజలూ పునస్కారాలూ జరిపి బ్రాహ్మణులకు గౌరవాలు కల్పించేదీ ఇక్కడే. ఈ mutually contradicting values తో తమిళులు గడుపుతున్న జీవన విధానం ప్రశంసనీయం.సాంస్కృతిక పరంగా చూస్తే, బ్రాహ్మణులకు సంబంధింఛిన కళలుగా గుర్తించబడిన కర్ణాటక సంగీతం మరియూ భరతనాట్యాన్ని వీరు తలకెక్కించుకున్నట్టుగా ఎవ్వరూ చెయ్యలేదు. బాల మురళీకృష్ణ వంటి గాయకుణ్ణి మనం అవమానించి తరిమేస్తే, ప్రేమగా అక్కున చేర్చుకున్న సంస్కృతి వీరిది. లలిత కళలతో పాటూ, జానపద కళారూపాలైన గరగాట్టం, కూత్తు వంటి వాటినికూడా సమానంగా ఆదరించి పోషిస్తున్న సహృదయం వీరిది. ఇదే విధానం వీరి సినిమాలలో కూడా కనబడుతుంది. ఒక ఎమ్.జి.ఆర్ తో పాటూ శివాజీ గణేశణ్, జెమినీ గణేశణ్ ఉన్నట్టే, ఒక రజనీకాంత్ కు సమానంగా కమల్ హాసన్ వంటి కళాకారులెప్పుడూ ఉన్నారు. ఇలా ఇద్దరి పట్లా సమాన ఆదరణ చూపే ఈ తమిళోళ్ళు కొంచెం అర్థంకాక మనకు ‘అతిగా’ అనిపిస్తుంది.


రాజకీయపరంగా, ఆర్థిక పరంగా వీరు ఒకమెట్టు ఎప్పుడూ పైనే ఉన్నారు. మొదట్నుంచీ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని సవాలుచేస్తూ వస్తున్న వీరు, ఏనుగుని ఢీకొంటూ కూడా తమ పంతాన్ని ఎల్లప్పుడూ నెగ్గించుకున్నారు. ప్రస్తుత కాలంలో అత్యధిక కాంగ్రెస్ MP లున్న మన రాష్ట్రానికంటే ఎక్కువ నిధులు వీరు కేంద్రం నుండీ దండుకోవడానికి కారణం, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకున్నా, ఇలాంటి పని వారు 60 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. "ఎలా?" అని మాత్రం అడక్కండి, అది తమిళోడికే ఎరుక ! దీనికి కారణం బహుశా వీరిలో గట్టిగా ఉన్న భాషా,సాంస్కృతిక బంధం అని నా నమ్మకం. ఉదాహరణకు తమిళనాడు కేడర్ లో ఎవరైనా IAS,IPS లేక IFS అధికారి వస్తే, వారు ఖచ్చితంగా తమిళం నేర్చుకుని పనిచెయ్యల్సిందే. మరోటి, ఏ తమిళుడైనా ఇతర రాష్ట్రాలలో గానీ, ఢిల్లొ లోగానీ ఈ పదవుల్లో ఉంటే తన పూర్తి నిబద్ధత తమిళనాడు పట్ల చూపిస్తాడు. ఈ రెండుకారణాలుచాలవా అభివృద్దికి!ఇక వీరి రాజకీయ అతికి పరాకాష్టగా చెప్పుకునేది ఒక్కోసారి ఒక్కొక్కపార్టీకి వీరిచ్చే absolute majority. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక్కరో ఇద్దరో MLA లు మాత్రమే ఉన్న అసెంబ్లీ సెషన్లు ఈ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఇందులో ఉన్న మతలబు పెద్ద పెద్ద రాజకీయ పండితులకి కూడా వంటబట్టలేదుగానీ, ఎవరు అధికారంలోకి వచ్చినా చివరి విజయం మాత్రం ఎప్పుడూ ఒక సగటు తమిళుడిదే అనిపిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో అంతకన్నా ఏంకావాలి?ఇన్ని పరస్పర విరోధాభాసాల మధ్య జీవిస్తున్న కొందరు తమిళులు మనకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. వారి నమ్మకం మనకు మూర్ఖత్వంగా అనిపించొచ్చు. వారి భాషా ప్రేమను చాదస్తంగా భావింఛవచ్చు. వారి సామాజిక భావావేశాన్ని అరుపులుగా వర్గీకరించోచ్చు. వారి రాజకీయ నిర్ణయాల్ని పిచ్చితనంగా అభివర్ణించొచ్చు. కాకపోతే వీరి ‘అతిని’ అర్థం చేసుకుని స్నేహం చేస్తే, I think they have a lot to offer to our culture and polity.ఏదిఏమైనా, తమిళొళ్ళను ఎంత అపార్థం చేసుకున్నా, మొత్తం తమిళజాతికి మిగతా భాషల వారి పట్ల చిన్నచూపుందంటే, అంతగా ఆమోదయోగ్యంగా అనిపించదు. కొందరు ఇలా ప్రవర్తించే వారు ఖచ్చితంగా ఉండొచ్చుగాక, అలాంటి వారు మనలో మాత్రం లేరా? లేకపోతే "తెలుగు తేట, కన్నడ కస్తూరి, అరవం అధ్వానం" అన్నది ఎక్కడి నుండీ పుట్టిందీ?


Sunday, June 15, 2008

నేనూ, మా నాయనా, సినిమాలూ


ఈ రోజు తండ్రుల రోజని (father's Day) అన్ని టీవీల్లో ఒగటే రచ్చ. "ఏందిరబ్బా ఈ యవ్వారం? అనుకుంటుండగాన, మా ఆవిడ, "నాన్నాకో ఫోన్ కియాక్యా?" అని హిందీలో అడిగేసింది. ఎందుకో తెలిసిందిగనక తటాలున ఓ ఫోనుగొట్టి మా నాయనకు "హ్యాపీ ఫాదర్స్ డే" చెప్పేసా. చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత ఎందుకో చాలా సిల్లీ గా అనిపించింది. ప్రతిరోజూ తలుచుకుని గౌరవించవలసిన అమ్మకూ, నాన్నకూ సంవత్సరానికి ఒక రోజు కేటాయించి, వీలైతే విష్ చేసి మా పనైపోయిందని తృప్తిపడదామా అనిపంచింది. కానీ ఏంచేద్దాం? వార్ని తరచూ కలసుకోకపోఅడానికి ఈ దూరం కారణమైతే, కనీసం తలుచుకోకపోవడానికి, నా బిజీ జీవితాన్ని సాకుగా చూపి నన్నునేను మోసం చేసుకున్నా. ఆ క్షణంలో, నేనిప్పుడు అమితంగా ప్రేమించే సినిమాల విషయంలో మా నాన్న చెప్పిన ఫిలాసఫీ గుర్తుకొచ్చింది.


చిన్నప్పుడు, వేసవి శెలవుల్లో తిరుమల కొండకెళ్ళి తలనీలాలు సమర్పించుకోవడం మా కుటుంబంలో దాదాపు ఒక పరంపరగా జరిగేది. మనకు ఇంటర్ మీడియట్ వరకూ ప్రతి సంవత్సరం గుండేనన్న మాట. ఆ తరువాత నామోషీగా ఫీలై మానేసా. పైగా దేవుడికి జుట్టు సమర్పించుకోవడం అనవసరం అనిపించడం కూడా ఆ ఆపెయ్యడానికి మరొ కారణం. ఇలా తిరుమల కు వెళ్ళడం ఒకెత్తైతే, తిరుపతిలో ఉన్న మా అత్తగారింట్లో ఉండి అప్పుడే రిలీజైన అన్ని సినిమాలు క్రమం తప్పకుండా చూడడం ఒక ఎత్తయ్యేది. బహుశా ఆ సినిమాల కోసమే అన్ని సంవత్సరాలూ గుండును భరించానేమో అని అప్పుడప్పుడు అనుమానం నాకు.


కొండ దిగి, అత్తోళ్ళింట్లో (మా మేనత్త, మా నాన్నగారి అక్కగారింట్లో) అడుగు పెట్టగానే కొంత డబ్బు మా చేతబెట్టి "సినిమాలు సూడండ్రా!" అనేవాడు మా నాయన. బహుశా నేను 9దో తరగతిలో ఉండగా మా అత్తోసారి "ఏం ఓబులేసూ, ఈళ్ళని సినిమాలకి పంపిచ్చి చెడగొడతాండావే" అంటే, మా నాయన నవ్వి ఊరుకున్నారు. అందరు తల్లిదండ్రులూ సినిమాలకు రాషనింగ్ పెడితే "మానాయనేంది, మమ్మల్ని ఇష్టమొచ్చినట్టు సినిమాల్జూడమంటాడూ!" అని ఒక అనుమానం కూడా కలిగింది. ఈ అనుమానాన్ని నేనే బహుశా కాలేజిలో చేరిన వెంఠనే మా నాయన్ను అడిగా. దానికి ఆయనిచ్చిన సమాధానం దాని వెనకనున్న వారి ఆలోచన చాలా అమోఘమనిపించాయి.


"చూడ్రా! సినిమా జూస్తే మహా అంటే మూడు గంటలు, దాని గురించి మళ్ళీ మాట్లాడుకోని ఇంగో రెండు గంటలు వేస్ట్ చేస్తారు. మీకు సినిమా అంటే ఇష్టం. అలాంటిది, నేను సూడద్దు అంటే... ఆ సినిమా గురించి ఆలోశిస్తూ, నన్ను తిట్టుకుంటూ మీరు గడిపే సమయం ఇంకా ఎక్కువౌతాది. దానికన్నా సూసేస్తే ఒగ పనైపోతుందిగదా?" అన్నారు. ఒక్క క్షణం నాకు మాట రాలేదు. తనే మళ్ళీ చెప్తూ, " ఇప్పుడు రిలీజు సినిమా సూడకుండా నువ్వు కాలేజీకిబోతే, ఆడ ఎవడోఒగడు సిన్మాజూసి ఆ కబుర్లు జెప్తాఉంటే, మల్లా మీకు బాగుండదు, మీ మనసుల్లో నాకు తిట్లుదప్పవు. అవన్నీ అవసరమా?" అని నన్నుచూసి కళ్ళెగరేసారు. "నిజమే కదా!" అనిపించింది. కానీ మళ్ళీ నేనే, "సినిమా చూస్తే చెడిపోతారంటారూ.." అని నసిగా. దానికాయన ప్రేమగా నవ్వి "మూడు గంటలుజూసే సినిమా నిన్ను చెడిపేస్తే...ఇంగ మేమెందుకు? మా పెంపకమెందుకు?" అన్నారు.


ఈ విషయంలో ఆయన ఆలోచన, పిల్లల పెంపకం పట్ల నమ్మకం, వారు తనను అనవసరంగా ‘హేట్’ చెయ్యకూదదన్న తపన, మా స్నేహితుల మధ్య మేము తక్కువైపోకూడదన్న కోరికా, ముఖ్యంగా నాకు సినిమాల పట్ల ఉన్న ఇష్టాన్ని అర్థంచేసుకున్న ఉదాత్తత నన్ను ఇప్పటికీ అబ్బురపరుస్తాయి.


మా నాయన నన్ను సినిమాలు చూడమని ప్రోత్సహించకపోయుంటే, పోస్టుగ్రాడ్యువేషన్ తర్వాత హైదరాబాదులో ఉండటానికి డబ్బులు చాలకపోతే వెబ్ ప్రపంచం డాట్ కామ్ కి సినిమా రివ్యూలు రాసి డబ్బు సంపాదించగలిగే వాణ్ణేకాదు. ఇప్పటికీ "నా సినిమా జ్ఞానానికి తొలిమెట్టు మా నాయన నాకిచ్చిన ప్రోత్సాహమేకదా" అనిపిస్తుంది. నేను జీవితంలో ఒక సినిమా తీస్తేమట్టుకు అది మా నాయనకే అంకితం.


ఈ జ్ఞాపకాల్ని తట్టిలేపినందుకు Father's Day కి ఒక పెద్ద థ్యాంక్యూ చెప్పాలి.

Friday, June 13, 2008

వ్యక్తి స్వేచ్చా - సమాజ శ్రేయస్సూ - Part 2


(గమనిక: ఇక్కడ రాస్తున్నది మతగ్రంధమూ కాదు, వ్యాసకర్త మతప్రవక్త అంతకన్నా కాదు. కనక, ఇక్కడ రాస్తున్నవి ఖచ్చితంగా నమ్మాల్సిన లేక పాటించాల్సిన అవసరం అసలెవ్వరికీ లేదు. ఇవి post-modern ప్రపంచంలో మానవ సంబంధాలలో జరుగుతున్న మార్పుల గురించి కొన్ని ఆలోచనలూ,అభిప్రాయాలూ, స్వీయానుభవాలూ మాత్రమే అని గమనించగలరు)

"ప్రేమలూ -రకాలూ"


పై శీర్షిక పేరు చెప్పగానే మిత్రుడొకరు "ప్రేమలేమైనా వంకాయలా ! చచ్చువీ పుచ్చువీ ఉండటానికి?" అన్నారు. నిజమే! ‘ప్రేమలూ-రకాలూ’ ఏమిటి సిల్లీగా... కానీ ఎంచేద్దాం ఈ భాగానికి ఇదే సరైన శీర్షిక అనిపించి వదిలేశా. ఈ కాలంలో ప్రేమలు వంకాయలంత చీప్ కాదుగానీ అవి కూడా మార్కెట్ కి అనుగుణం తమ స్వభావాన్ని మార్చుకునే సంబంధాల వరుసలో చేరటం వల్ల వాటిల్లో ఉన్న వివిధరకాల గురించి చర్చ తప్పదు.


అసలు ప్రేమంటే? నిజానికి ఈ ప్రశ్నే ఒక పెద్ద సమస్య. ఎందుకంటే, దీనికి సమాధానం మనిషికొక రకంగా ఉంటుంది. అంతగా సందేహంగా ఉంటే మీరూ ప్రయత్నించండి. మీ పక్కనున్న పది మందిని అడిగి చూడండి. వాళ్ళల్లో ఏ ఇద్దరు ఒకే సమాధానం చెప్పినా...ఈ వ్యాసం ఇక్కడే చదవటం ఆపెయ్యొచ్చు. ఇంత వివిధమైన వ్యక్తిగత అర్థాలు కలిగిన ఈ భ్రహ్మపదార్థాన్ని కూడా చాలా మంది సమాజాన్ని గుత్తకు తీసుకున్న మనుషులు స్థిరీకరించి, ‘డిఫైన్’ చేసి పారేశారు. చేసిన యవ్వారం చాలక, కేవలం కలిసుంటే ప్రేమౌతుందా? కామాన్ని ప్రేమంటారా? పెళ్ళి పరమార్థం కాకుంటే పాపమే కానీ ప్రేమ కాదు కదా? హద్దులు దాటితే ప్రేమ పవిత్రత మిగులుతుందా? అంటూ తమ అక్కసు కాస్త అధికారికంగా వెళ్ళబోస్తూ ఉంటారు. వీళ్ళు సమాజాన్ని గుత్తకైతే తీసుకున్నారుగానీ, మనుషుల్ని వారి భావాల్నీ మాత్రం తమ పరిగణలోకి తీసుకుని ఎరుగరు.


అందుకే ఈ గుత్తందార్లకు తెలియని విషయం ఏమిటంటే, చాలా మంది యువత కాలేజిల్లోనూ, యూనివర్సిటీలలోనూ, పనిచేసే చోటా ప్రేమకున్న అర్థాల్నీ, దాన్ని పాటించే విధానాలనీ కొంత బాహాటంగా, మరికొంత రహస్యంగా చాలా మార్చేసారు. ఈ రహస్య మార్పులు అప్పుడప్పుడూ ఒక విప్లవాన్ని తలపిస్తాయి. ఎందుకంటే, some times it appears as if, they have changed the notion of conventional love `fundamentally'. "ప్రేమ యొక్క సాధారణ ప్రాతిపదికని వీరు సమూలంగా మార్చేసారా !" అనిపిస్తుంది. కాకపోతే ఈ సమాజమే పాపం కళ్ళు తెరుచుకునే నిద్రపోతోంది లేదా నిద్రనటిస్తోంది. ఒక వేళ మేలుకుంటే ఈ నిజాన్ని ఎదుర్కుని భరింఛే శక్తి బహుశా లేదనుకుంటా. ఇక సమాజాన్ని పరిరక్షిస్తున్నామన్న ఆపోహలో ఉన్న ఈ గుత్తందార్ల సంగతి దేవుడికే ఎరుక.
ఇప్పుడు ‘సాధారణ ప్రేమ’మొక్క ప్రాతిపదికని చూద్దాం. మన పరిధిలో అందుబాటులో ఉన్న అమ్మాయినో, అబ్బాయినో చూసి, ‘అసంకల్పితంగా’ ఇష్టపడి, ఆ ఇష్టాన్ని బ్రతిమాలో బామాలో ఆ వ్యక్తికి తెలియజెప్పి, పరస్పర అంగీకారానికి వచ్చి, కొన్నాళ్ళు పైపై తిరుగుళ్ళు (చాలా వరకూ రహస్యంగా) తిరిగి, వీలైతే ‘కొన్ని మర్యాదకరమైన హద్దులు’ దాటి ఆనందపడి ఆ తరువాత పెద్దల అంగీకారంతోనో లేక ధైర్యం చేసి లేచిపోయో పెళ్ళిచేసుకోవడం. వెంఠనే ఆ ప్రేమకో శుభం కార్డు. Then they lived happily ever after...ఇంతేనా?


ఇప్పుడు పైవాఖ్యాల్ని కాస్త నిదానంగా చదువుకోండి. చాలా ఆదర్శంగా అనిపిస్తున్నాయా? ప్రజలనుకునే "పవిత్ర ప్రేమంటే ఇదేరా!" అనిపిస్తోందా? ఒకవేళ మీకు అలా అనిపిస్తే నా శుభాకాంక్షలు. ఒకవేళ అలా అనిపించకపోతే ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్దాం.


ప్రేమకు నేను చెప్పిన మొదటి ప్రాతిపదిక కాకపోతే ఇంకోదాన్ని చూద్దాం. చిన్నప్పటి స్నేహం వయసుతొపాటూ ఎదిగి ప్రేమగా మారింది. ఘాఢంగా ప్రేమించుకునారు. పెద్దలొప్పుకోలేదు. లేచిపోయే ధైర్యం లేకపోయింది. పరిస్థితులు వికటింఛాయి. అబ్బాయి తాగుడికీ, అమ్మాయి ఇష్టంలేని పెళ్ళికీ అలవాటుపడ్డారు. కానీ మనసుల్లో ప్రేమ మాత్రం అలాగే ఉంచుకుని...ఆఖర్న మరణశయ్య మీద ఒక్కటయ్యారు. మీరు చూసి మనస్ఫూర్తిగా బాధపడిన సినిమాలా ఉందా? ఇది సినిమా కథే ‘దేవదాసు’. భారతదేశంలో ఇప్పటి వరకూ ఇంత గొప్ప ప్రేమ-త్యాగం కథ మరోటి రాలేదు. కాబట్టి దీన్ని అసలు సిసలు ప్రేమగా అంగీకరించేద్దామా?


పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒకదాన్ని మీరు పవిత్ర ప్రేమగా అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఈ ప్రేమల్లోని విలువల్నే భూటద్దం పెట్టి చూపించి, మిగతావి ప్రేమలు కావని చాలామంది అధికారపూర్వకంగా ఢంకా బజాయించి మరీ చెబుతూఉంటారు.

ఈ బాజాల బుజ్జిగాళ్ళని పక్కనబెట్టి, మనం ప్రస్తుత కాలంలో ‘వ్యవహారంలో’ ఉన్న, యువత తమ పరిస్థితులకు అనుగుణంగా ‘ఆల్టర్’ చేసుసుకున్న‘రెడీమేడ్’ ప్రేమలు కొన్నింటిని తెలుసుకుందాం. ఇవి కొన్ని కొలమానాల ప్రకారం ‘తప్పు’, ‘పాపం’ కావచ్చు. కాకపోతే ఇవి ‘నిజం’ అని మీరు కాస్త మీ ఛుట్టుపక్కల తరచి చూస్తే తెలిసిపొతుంది.1. ఆకర్షణల ప్రేమలు

2. అవసరాల ప్రేమలు

3.అందలమెక్కడానికి ప్రేమలు

4. ప్రేమ కోసం ప్రేమలు

5.పెళ్ళి కోసం ప్రేమలు
పైన చెప్పిన లిస్టులోని ప్రేమల గురించిన వివరణ మరియూ సాధారణంగా తల్లిదంద్రులకు ప్రేమంటే ఎందుకు దడా ఒణుకూ పుట్టుకొస్తాయో Part 3 లో చూద్దాం.

Monday, June 9, 2008

వ్యక్తి స్వేచ్చా - సమాజ శ్రేయస్సు (Part 1)


ఈ మధ్య నేను రాసిన టపాలూ, విన్నవించిన అభిప్రాయాలూ సాంతం వింటూ వచ్చిన ‘అబ్రకదబ్ర’ అనే ఒక బ్లాగుకర్త, "ప్రేమ పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉన్నావ్!" అని ‘కామెంటు’ చేతబుచ్చుకుని నా మెదడును చాలా పరుగెట్టించి, ఆలోచనలతో నింపేసారు. మేము బ్లాగు కామెంట్లలొ ఇన్నాళ్ళూ హోరాహూరీగా చేసిన పొరు తరువాత, కొన్ని ప్రశ్నలు ముఖ్యమైనవి గా మొలిస్తే మరికొన్ని ఆలోచనలు భాష రూపం దాల్చాయి. వాటిని ఇక్కడ ‘వ్యక్తి స్వేచ్చా - సమాజ శ్రేయస్సు’ అనే శీర్షికన ఒక్కో ప్రశ్నను ఒక్కొ భాగంగా టపా రాసి, బ్లాగుబద్ధం చేయ్యడానికి ప్రయత్నిస్తాను.


ప్రారంభంలోనే నా వకాల్తా ప్రాతిపదికని (basis of arguement) ప్రస్తావిస్తాను. మొదటిది. వ్యక్తి (మనిషి) జీవిత గమ్యమేమిటి? ఆనందం. ఇది ఆత్మానందం కావచ్చు, పరమానందం కావచ్చు. ఏది ఏమైనా ఆనందం. అదే మానవ జీవిత గమ్యం. మనం జీవితంలో చేసే సాధన, ప్రయత్నం,ఆదర్శం అన్నింటి ఉద్దేశ్యం జీవితాన్ని ఆనందంగా గడపడం. కాదంటారా!


కాకపోతే, ఆనందానికి ఉన్న పరిధి (pre-condition) ఒక్కటే, అది "మన ప్రస్తుత ఆనందం భవిష్యత్తుకు సమస్యాత్మకం కాకుండటం"(present happiness should not lead to future shock). అంటే, మన భవిష్యత్తును సమస్యల్లో ముంచని ఏ ఆనందమైనా అనుభవయోగ్యమే, అని అర్థం. ఇది మీరు అంగీకరిస్తే నా సగం కేసు నెగ్గినట్టే!


ఇక రెండవది. సమాజం. ఒక వ్యక్తి, సమాజం కల్పించిన పరిధులతో నిరంతరం ఘర్షణ పడితే ఆనందాన్ని పొందగలడా? "కష్టమే!" అన్నదే, సరైన సమాధానం. కానీ ఇక్కడ అసలు ప్రశ్న, సమాజ పరిధులు వ్యక్తి ఆనందానికి స్వయంగా నిచ్చెనలు వేస్తాయా? అని. దీనికి మాత్రం సూటి సమాధానం అసలు దొరకదు. ఒకవేళ జవాబు దొరికినా సమాజం అసలు వ్యక్తి ఆనందానికి ఎందుకు సహాయపడాలి? ‘ఆనందం’ అనేది వ్యక్తి కష్టపడి సాధింఛాల్సిన విషయం అనిపిస్తుంది కదూ! ఇక్కడే ఉంది అసలు కిటుకు.


మన సమాజం (దాని భౌతిక స్వరూపం తెలీదుగానీ, ఉనికి మాత్రం అందరూ అనుభవవించేదే) చాలా తెలివిగా, కన్వీనియంట్ గా తన బాధ్యతల రచనను చేసుకుంది. వ్యక్తి ఆనందానికి అది దోహదపడదుగానీ, మనిషి ఆనందాన్ని పొందే ప్రయత్నం లో ఎక్కడ తనకు భారమయ్యే పనులు చేస్తాడో అని, కొన్ని పరిధులు నిర్ణయించేసింది. అవే చాలావరకూ వ్యక్తిగత సంబంధాలు, ముఖ్యంగా ‘ప్రేమ’ విషయంలో సమాజం నిర్ణయించి, ఆమోదించి, ప్రాచుర్యం కలిగించిన ‘రూల్స్’. కాకపోతే ఈ పరిధుల్ని వ్యక్తులుగా మనం ఎంతగా జీర్ణించుకున్నా మంటే, వాటినే పవిత్ర ఆదర్శాలుగా నమ్మి భుజాలమీదికెత్తుకుని మోసేస్తూ, ఎవరైనా దానికి కాస్త వ్యతిరేకమైన స్వీయ అనుభవాన్ని ప్రస్తావిస్తే అంగీకరించలేకుండా ఉంటాం. కొందరు రాళ్ళు రువ్వి ఆనందిస్తారు. మరికొందరు సభలు పెట్టి మరీ "లోకం చెడిపోయింది" అని తీర్మానిస్తారు. ఇది కొత్తగా జరిగే వింతేమీ కాదు, ఎప్పటినుండో జరుగుతున్న తంతే!

అంటే సమాజానికి వ్యక్తి స్వేచ్చ భారాన్ని కలిగించేవరకూ పెద్ద సమస్య కాదు. కానీ సమస్యల్లా ఈ సమాజం భాధ్యత మోస్తున్నట్టుగా ప్రవర్తించే మీ ఎదురింటి సుబ్బలక్ష్మిదో లేక పక్కింటి పార్వతమ్మదో అందీగాక ఏ ఆఫీసులోని వెంకట్రావుదో. ఇలాంటి అతిఉత్సాహవంతులనే సమాజం అనుకుని ‘ఎవరేమనుకుంటారో’ అన్న అపోహతోనే సగం వ్యక్తిత్వం కోల్పోయి మనవంటూ లేని అభిప్రాయాల ముసుగులో కన్వీనియంట్ గా జీవితం గడిపేస్తాం. ఇలా జీవింఛడం లో నిజంగా ఒక వ్యక్తిగా ఆనందం ఉందో లేదో మనం ప్రశ్నించడానికి కూడా తయారుగా ఉండం. కాబట్టే ఈ వ్యాసం చదివి మారమనడం లేదు, కనీసం ఆలోచించమని చెప్పటానికి మాత్రమే ఈ ప్రయత్నం.
ఇక అసలు విషయానికి వద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానాలు చూద్దాం.


1. కామం, ఆకర్షణ, ప్రేమని ఒక్కటే అనుకోవడం: వీటిని "అంతా ఒక్కటే" అనే మూర్ఖత్వం నాలో లేదు. కానీ, ఇవన్నీ ప్రస్పర బంధం కలిగిన మానవ సంబంధాలు అని నా భావన. "ప్రేమలో కామం OK గానీ, కేవలం కామం తప్పు" అన్నది కొందరి వాదన. మెచ్యూరిటీ ఉన్న ఒక ఆడా-మగా కేవలం కామం కోసం ఒకటైతే అది "అనైతికం",అనేది మన సమాజం పెట్టిన ఒక రూలు. కాస్త ఆలోచిస్తే ఆ కండిషన్ ఎందుకు వచ్చిందో అర్థమైపోతుంది. కామం కోసం (సమాజానికి అంగీకారమైన ‘పెళ్ళి’ అనే బంధం తో నిమ్మిత్తం లేకుండా) ఏకమైన జంట ఆనందానికి ప్రతిఫలంగా ఒక బిడ్డ జన్మిస్తే, అది సమాజానికి ఒక సమస్యగా మారుతుంది. అనాధశరణాలయాలు కావాలి, ఆ బిడ్డడి ఆలనా పాలనా చూడాలి, వాడ్ని సమాజానికి కంటగింపు కాకుండా కాపాడాలి. అబ్బో...! సమాజానికి చాలా పని. అందుకే ఈ ‘నైతికం’ మంత్రం.


అందుకే, "కాంట్రాసెప్టివ్ లు(గర్భనిరోధక సాధనాలు) ఉన్న ఈ కాలంలో ఈ ఆదర్శాలకి అర్థముందా?" అని ప్రశ్నించాను. కాకపోతే చాలా మందికి అది విచ్చలవిడితనానికి ప్రోత్సాహకంగా అనిపించింది. నేను చెప్పింది అందరూ అలాగే చెయ్యాలి అని కాదు, అలా కొందరి జీవితాల్లో సంబంధాలు ఏర్పడితే, వాటిని సమాజం మీకు తగిలింఛిన ‘రంగుటద్దాల’ ల్లోంచీ చూసి గర్హించకండి అని మాత్రమే.


మరో ఆరోపణ, నేను టీనేజి ఆకర్షణని ప్రేమగా భ్రమించడం. నా వరకూ టీనేజి ఆకర్షణ అనేది ఆ వయసులో వాళ్ళకు కలిగే సహజ భావన. "అలాంటి భావనలు కలిగితే అణుచుకోవాలే గానీ, బరితెగించేస్తారా?" అని కొందరి ఉవాచ. టీనేజి ఆకర్షణని, అణుచుకొవడమో లేక రహస్యంగా బరితెగించి సమస్యలు కొనితెచ్చుకోవడమో కాకుండా, ఇంకో మర్యాద పూర్వకమైన దారి వెతుకుదాము అన్నదే నా సలహా. వారి ఆకర్షణల్ని అర్థం చేసుకుందాం, చర్చించి ఆదరిద్దాం, వారి భావనల్నిగౌరవిద్దాం, వాళ్ళని నమ్ముదాం, కనీసం ఇంట్లోనే కలిసి కూచుని మాట్లాడే అవకాశాన్నిద్దాం అంటాను. అది తప్పైతే, ప్రస్తుతం ఉన్న సమాజ పోకడలు రానురానూ ప్రమాదకరంగా మారుతాయన్నది నా ప్రఘాడ విశ్వాసం.


చాలా వరకూ ప్రేమలకు పునాది ఈ ఆకర్షణే, కాదంటారా? మరి దీనిపై ఇంత చులకన భావం ఎందుకు?


ఇక మిగిలింది ప్రేమ. నేను చర్చించిన చాలా మంది, "పెళ్ళే పరమావధిగా సాగితేనే అది ‘ఆదర్శమైన ప్ర్రేమ’" అన్న భావనలో ఉండటం నాకు విస్మయానికి గురిచేసి, సమాజపు కండిషనింగ్ కు అబ్బురపరిచేలా చేసింది.
కాబట్టి, ఎన్నిరకాల ప్రేమలు ప్రస్తుతకాలంలో ఉన్నాయో, మనం కళ్ళుమూసుకుని ఏ ఆదర్శాల్ని గుడ్డిగా నమ్మేసి, ఆవేశ పడిపోతున్నామో Part 2 లో చర్చిస్తాను.
(‘ప్రేమలూ -రకాలూ’ శీర్షికన Part -2 త్వరలో)

Sunday, June 8, 2008

నోరు మూసుకుని చదువు!"నోరు మూసుకుని చదువు!" అన్న గద్దింపు, ప్రశ్న వేసిన ప్రతిసారీ చిన్నప్పట్నించీ నేను విన్నదే. బహుశా మనలొ ప్రతి ఒక్కరికీ ఇంట్లోనో, బళ్ళోనో ఈ గౌరవం సదా జరుగుతూ ఉండేదని నా నమ్మకం. ఈ గద్దింపుల విధానం మనలోని మానవీయ ఆసక్తిని, ప్రశ్నించి, శోధించి, జ్ఞానాన్ని సమపార్జించుకోవలసిన విధానాన్ని మనకు దూరం చేసిందేమో అని నా అనుమానం. "ఈ ధర్మసందేహం హఠాత్తుగా ఎందుకు కలిగింది?" అనుకుంటున్నారా ! దానికీ ఒక కారణముంది చెబుతా.మొన్నీ మధ్య ఇక్కడి యునిసెఫ్ (UNICEF) లో మూడు సంవత్సరాలు పనిచేసిన ‘డాక్టర్ శామ్’ అనే ఒక బ్రిటిష్ అధికారి , ఆఫ్రికాలోని ఒక దేశానికి బదిలీ అయ్యి వెళ్ళిపోతున్న తరుణంలో, ఆయనకు భారతదేశంలో నచ్చినవి,నచ్చనివీ అని పిచ్చాపాటీగా మాట్లాడుతూ అడగటం జరిగింది. దీనికి ఆయన చెప్పిన సమాధానమేమిట్రా అంటే, తనకు బాగా నచ్చింది చాలా చక్కగా విడదీయబడిన ఋతువులు (seasons). ఎందుకంటే తను పుట్టిపెరిగిన లండన్ లో వాతావరణం ఎప్పుడేలా మారుతుందో తెలీదుగనక, అదొక సమస్యగా ఎప్పుడూ చర్చల్లో ఉండేది. ఇక్కడ ఆ బాధ లేదు అని.


ఇక ఈ చర్చకు కారణమైన, నచ్చని విషయం వినండి. "Indians are very intelligent, they have their technical basics very right. But, when it comes to inter-twining them to solve human problems, they fall inadequate" అన్నాడు. దీనికి కొనసాగింపుగా చెబుతూ, "India is unique and needs innovative approaches to solve it's problems. I am afraid, with such limitations things would become difficult" అని. ఈ మాటకి ఒక్క క్షణం మనస్సు ఛివుక్కు మంది. కాకపోతే తన ఇన్నాళ్ళ అనుభవంతో చెప్పిన మాటల్లో కొంత నిజముందనిపించింది.


ప్రశ్నించి,ఆరాతీసి, చదివిన చదువులను జీవితానికి అన్వయించుకుని, తద్వారా కలిగిన సొంత ఆలోచనలనతో సమస్యలకు సమాధానాలు వెతుక్కొగలిగేలా మన చదువులు ఉండేవా? ఇప్పుడు ఉన్నాయా? అన్న సందేహం కలిగింది. తరచి నా జీవితానుభవాన్ని చూస్తే "అలా మన చదువులు లేవేమో!" అనిపించింది.


నన్నయ,తిక్కన పద్యాలు భట్టీయం వెయ్యలేక, వేమన మీదా,ఉపవాచకం మీదా ప్రేమ ఉన్నా... తెలుగుకు ఆమడదూరం పరుగెట్టజూసిన నా బాల్యం గుర్తుకొచ్చింది. ఆరవతరగతి తరువాత, లెక్కల్లో ఫార్ములాలను బెత్తం చూపి మరీ ‘పిడిబట్టించిన’ మా మాస్టారు పుణ్యమా అని ఇప్పటివరకూ లెక్కలకు దూరంగా వెళ్ళాలన్న నా పరుగు ఆగలేదు. సైన్సు కాస్త సులభంగా ఉన్నప్పటికీ ఎనిమిదోతరగతి బౌతికశాస్త్రం లో మళ్ళో ఫార్ములాల గొడవతో నా విజ్ఞానశాస్త్రం కాస్తా అటకెక్కేసిన వైనం ఇప్పటికీ బాగా గుర్తే. సోషియల్లో మనం తెగ విజృంభించినా, హిస్టరీలో తారీఖులు గుర్తుపెట్టుకోవడం లో బోల్తాకొట్టడం గొడ్డలిపెట్టే. ఇక ఇంగ్లీషంటారా, ‘రెన్ & మార్టిన్’ ను ఆంగ్లభాషా వ్యాకరణానికి బైబిలు గా గౌరవించి, భాష నేర్పకుండా గ్రామరు రూల్స్ మాత్రం చక్కగా వల్లెవేయించిన ‘సార్’ ఒకడు తగిలాడు; నా ఆంగ్లపాండిత్యానికి గండి కొట్టడానికి. ఇలా అనుమానమొస్తే అడక్కుండా, ప్రశ్న ఉదయిస్తే దాన్ని మనసులోనే అస్తమింపజేసి, పదవతరగతి వరకూ ‘నోరు మూసుకునే’ చదివేసా.


ఇంతటి భారీ పునాది కలిగిన నాకు, ఆ తరువాతి క్లాసుల్లొ ప్రశ్నించడం నేర్పబట్టీ, సాహిత్యాన్ని చదవబట్టీ కాస్తోకూస్తో స్వతంత్రంగా, సమాజం కోసం కాకపోయినా కనీసం నా కోసం నేను ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. ఒక సమస్య వస్తే ఫార్ములాని గుర్తుచేసుకోకుండా, దాన్ని అక్కడున్న పరిస్థితులను బట్టి స్వతంత్రంగా అర్థం చేసుకుని సమాధాన పరిచే ప్రయత్నాన్ని కాస్తైనా చేయగలుగుతున్నానని ఓ ఫీలింగ్.


అందుకే మన చదువులు కంఠతాపట్టి, ఏదో ఒక డిగ్రీ చేతబట్టి, ఉద్యోగం గుడ్డిగా వెలగబెట్టడానికి తప్ప వ్యక్తిగా ఈ సమాజానికీ, దేశానికీ ఉపయోగపడేలా ఉండటం లేదు అనే నీరసమైన నమ్మకం వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. డాక్టర్ శామ్ అన్నట్టు, భారతదేశం చాలా ప్రత్యేకమైనది...ఈ ప్రత్యేకమైన దేశానికి ఉపయోగపడే చదువులు మనం చదివామా? ప్రస్తుతం ఉన్న తరం చదువుతోందా? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.

-------------------------

Saturday, June 7, 2008

కర్ణాటక లో ఒక బౌద్ధ విహారం
ఈ మధ్య వేసవి శెలవుల్లో కర్ణాటకలోని కూర్గ్ లేక కొడగూ అనే జిల్లాలోని ‘మడికేరి’ హిల్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అక్కడి నుండీ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో, ‘కుషాల్ నగర్’ మరియూ ‘బైలెకుప్పే’ ఊర్ల మధ్యనున్నఒక అందమైన బౌధ విహారం ఫోటోలు మీకోసం. ఈ విహారాన్ని "గోల్డెన్ టెంపుల్" గాకూడా వ్యవహరిస్తారు.
మడికేరి, మైసూరుకు 120 కి.మీ. దూరం. ఈ బౌద్ధవిహారం 30 కి.మీ ముందే వస్తుందిగనక దాదాపు 90 కి.మీ అనుకోవచ్చు. మైసూరు నుండీ ‘కుషాల్ నగర’ చేరాలంటే మంగుళూరు,మడికేరి కి వెళ్ళే ఏ బస్సునెక్కినా చేరుస్తాయి. 60-90 రూపాయలతో ఇక్కడికి చేరచ్చు. రోడ్డు బాగానే ఉంది గనక దాదాపు 2 గంటల ప్రయాణం మాత్రమె. కుషాల్ నగర్ నుండీ కేవలం 5-6 కి.మీ దూరమే ఈ గోల్డెన్ టెంపుల్. కాబట్టి అక్కడనుండీ ఆటోలు విరివిగా దొరుకుతాయి.అదీ కేవలం 40-60 రూపాయలు ఖర్చు చేస్తే చాలు.
-----------------------------------------------

Friday, June 6, 2008

పెట్రోల్ ధర మండుతోంది, ఎడ్లు కట్టండి !

పేట్రోల్ ధరలు మండిన వార్త వినగానే "ఐతే ఏడ్లు కట్టండి" అనెక్కడన్నా వినపడుతుందేమో అని నా కనుల్నే చెవులుగా చేసి తెలుగు బ్లాగులన్ని ఆలకించేసా. తీరా చూస్తే, "పాపం మనం !" అనే బదులు సుజాత గారు ఆమోదయోగ్యమైన ప్రధానిగా మాత్రమే మిగిలిపోయి, "ఇది తప్పదు" అని చేతులెత్తేసిన మన్మోహన్ సింగ్ ను "పాపం!" అనేసరికీ, నా మెదడు మోకాల్లోకొచ్చి కొంత అతివాగుడు కామెంటెట్టి ఊరుకున్నా.

కాకపోతే నా మనసు మూలలో, "ఎందుకిలా చమురు ధరలు తగలడ్డాయా?" అన్న యక్షప్రశ్న బీజమై నాటుకుపోయింది. అది బహుశా కాస్త సారమైన మూలలో పడినట్టుంది. అందుకే ఈ రోజు హిందూస్థాన్ టైమ్స్ పేపరు లో ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర్ర ప్రభుత్వం పెట్రోలు,డీజల్ పై వేసే పన్ను మాత్రమే, లీటర్ కు 33 రూపాయలని చదివేసరికీ గుండె గుభేలుమని నానా రసాలన్నీఊరి ఆ అనుమాపు బీజాన్ని కాస్తా "ఇంతై వటుడింతై, బ్రహ్మాండంబంతై" అన్న తీరులో మహావృక్షం చేసేసాయ్.

ఈ వృక్షవిశాలాన్ని నా చిన్ని మనసులో కూర్చలేక, కుదించలేక భలే ఛావొచ్చిపడిందని తలచి కాస్త ఈ మతలబుని తెల్సుకుని నెమ్మదించుదామనుకున్నా. అనుకున్నదే తడవుగా కాస్త ఇలాంటి జ్ఞానంలో ప్రవీణుడైన మా ‘ఇంటాయన్ను’ ("నువ్వే మీ ఆవిడకో మొగుడివి, నీకింకో మొగుడా!" అని రావుగోపాలరావు లా పిదపబుద్ది చూపి అనేసుకోకండి, ఇంటాయనంటే మా ఇంటి ఓనర్ అనే సాధారణంగా) ఈ విషయమై ఆరాతీసా, కూపీలాగా.

నా సందేహ వృక్షరాజాన్ని ఆయన తేరిపారా తిలకించీ,నా మొర సాంతం ఆలకించి, సాలోచనగా "ఇలా జరగకూడదే" అన్నాడు. ఎలా జరక్కూడదో మనకస్సలు తెలియదు గనక వెర్రినవ్వొకటి విసిరి, ఇండియా మార్కు తెలిసీతెలియని తలఊపుడు ఒకటి ఇచ్చుకున్నా. నా అజ్ఞానాన్ని గ్రహించినవాడై, "పెన్నూపేపరూ తీసుకో" అన్నాడు. "సరే" అని కలంకాగితాన్ని నా అజ్ఞానాన్ని పోగొట్టే దివిటీలా, స్టాచ్యూఆఫ్ లిబర్టీ తరహాలో పట్టుకు కూర్చున్నా. "ఒక లెఖ్ఖ వెయ్" అన్నాడు మా ఇంటాయన. అసలే మనం లెఖ్ఖల్లో పెద్ద బొక్కగనక (జీరో అని గ్రహించి,ఈ శ్లేష పదాన్ని క్షమింఛగలరు) నా మొబైల్ లో ఉన్న క్యాలిక్యులేటర్ ని నిర్లజ్జగా నొక్కడానికి ప్రయత్నిస్తుండగా తనే "ఫరవాలేదు చిన్నలెఖ్ఖే" అని నోటితోనే ప్రపంచపు ఆయిల్ ఖాతాలన్నీ లెఖ్ఖగట్టిపారేసి నా విశాలవృక్షాన్ని కూకటివేళ్ళతో పెకిలించకపోయినా, ఒక కంఫర్ట్ లెవల్ కి కుదించాడు. ఈ కుదింపు లెఖ్ఖ కాస్త పంచుకుంటా!

ఒక బ్యారల్ (200 లీటర్లు) క్రూడ్ ఆయిల్ ధర, ప్రపంచ మార్కెట్టులో ఈ రోజు 125 $ అమెరికన్ డాలర్లు. అంటే ఒక లీటరు ధర మన రూపాయిల్లో ఐతే Rs 25/- అన్న మాట. ఇక మిగిలింది దానిని శుద్దిచేసే ఖర్చు. రిలయన్స్ రిపైనరీ వారి లెఖ్ఖల ప్రకారం ప్రతి బ్యారల్ కూ దాదాపు 10$ డాలర్ల ఖర్చు శుద్దీకరణకు వెచ్చించబడుతుంది. అంటే ఒక లీటరుకి కేవలం Rs 2/- ఖర్చు. అంటే, వెరసి ప్రస్తుతం ఉన్న ఖర్చులతో సహా లెఖ్ఖగడితే, మన పెట్రోలు ధర కేవలం Rs 27/- ఉండాలి. కానీ ఉందా? ఇక రవాణా, పరిశ్రమ లాభం, అతిగాలేని సేల్స్ ట్యాక్స్ కలుపుకుని పది రూపాయలనుకున్నా, Rs 37/- దాటకూడదన్నమాట. మరి ఇప్పుడు ధర...దాదాపు 60 రూపాయలు. ఇక మండదా గుండె?

ఇక నష్టం వచ్చే అవకాశమే లేనప్పుడు "పరిశ్రమ నష్టాల్లొ ఉంది" అని ఇంత హంగామా ఎందుకూ? అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. దీనికీ సమాధానం ఉంది. పోయిన సంవత్సరం క్రూడ్ ఆయిల్ రేటు ప్రకారం పరిశ్రమతో రేటు విషయమై (తనకు రావల్సిన పన్నుతోసహా) ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం, ఒకవేళ ప్రపంచ మార్కెట్టులో ముడిచమురు ధర పెరిగినా, పరిశ్రమలను తన రేటు మాత్రం పెంచొద్దని చెప్పి, తనవంతు పన్ను మాత్రం దర్జాగా దండుకొని నష్టాల్లోకి నెట్టేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం పన్ను మినహాయించి, లేక తగ్గించి నష్టాల్ని భర్తీ చెయ్యొచ్చు. కానీ, ఎన్నికల సమయంలో ‘అభివృద్ది చూపించడానికి’ కావలసిన డబ్బు లేకుండాపోతుంది. అందుకే పరిశ్రమ పేరు చెప్పి, ప్రభుత్వం తన జేబులూ పెట్రోలు డబ్బుతో ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని నింపుకొంటున్నదన్నమాట.

ఇవన్నీ తెలిసిన తరువాత ‘ఎడ్లు’ కాదు, ప్రభుత్వానికి పాడెగట్టాలన్నంత కోపమొస్తోంది.

Wednesday, June 4, 2008

నా కాలేజీ జీవితం - Part 7.2


‘నవవసంతం’ లో నిర్వేదం


ఇలా నా ప్రేమ జీవితం సాగుతుండగా, ఫిబ్రవరి నాటికి మా కాలేజీకి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా, ‘మాల్దీవ్స్’ దేశం నుండీ ఇరవైమంది విద్యార్థులు వచ్చారు. వీరిలొ 17 మంది అబ్బాయిలూ, 3 అమ్మాయిలూ ఉన్నారు. అమ్మాయిలకు (అమ్మాయిల) ‘గంగా హాస్టల్’ విడిదైతే, అబ్బాయిలకు మాత్రం సాధారణంగా కాలేజికి వచ్చే గెస్టులకు నిర్దేశించబడిన‘నర్మదా హాస్టల్’ బస అయ్యింది. రావడం రావడం మా కాలేజిలో వీరొక పెద్ద కలకలం రేపారనే చెప్పొచ్చు. దాదాపు 90% మధ్యతరగతి చెందిన మా కాలేజి అబ్బాయిల నెలసరి పాకెట్ మనీ వెయ్యిరూపాయలకు మించదు. అలాంటిది ఈ కొత్త వాళ్ళ ఆర్ధికస్థితీ(వారి ఒక ‘దీనార్’ మన మూడూ రూపాయలతో సమానమట.ఈ విధంగా లెక్కేసినా వెయ్యికీ, మూడువేలకీ చాలా దూరముంది మరి) , వారి విచ్చలవిడి ఖర్చుతో కూడిన జీవనశైలీ కొంత కంటగింపు కలిగించింది. వీళ్ళందరూ మిడిల్ ఈస్ట్ కు చెందిన ముస్లిం సంతతివారు కావడంతో, కొంత మన భారతీయ రంగుకన్నా తేటగా, తెల్లగా ఉంటారు. ఇదికూడా ఈ ఇన్సెక్యూరిటీకి కారణం అయ్యింది. అంతేకాక "కొత్తొక వింత" సామెత మనకి ఉండనే ఉందిగనక, కాలేజిలో ఉన్న కొంతమంది ‘డిసైరబుల్’ అమ్మాయిలు, వీరితో స్నేహం చెయ్యడానికి ఆసక్తి చూపేసరికీ, వీరు మా కాలేజి అబ్బాయిల గుండెల్లో టెంట్ వేసిమరీ నిద్రపోసాగారు.అప్పటీదాకా గేమ్సేవీ ఆడని రంజని కూడా మార్చి నెల నాటికి షెటిల్ బ్యాట్మింటన్ ఆడే నెపంతో, ‘తాహా వాహబ్’ (ఈ మాల్దీవ్స్ వాళ్ళపేర్లు ఇలాగే ఎడ్చాయిమరి) అనే వాడితో స్నేహం చేసేసింది. అంటే సాయంత్రం మేము గడిపే రెండు గంటలలో (5.30-7.30) ఇప్పుడు మన భాగం ఒక గంటకో, నలభైఐదు నిమిషాలకో కుదింఛబడి కోతకు గురైందన్నమాట. ఈ సమయం కోతతో పాటూ, వారిద్దరూ గేమ్ మధ్య రెస్టుతీసుకోవడానికి పక్కన కూర్చుని చెప్పుకునే ఊసులతో అప్పుడప్పుడూ నా గుండె కూడా కోతకు గురయ్యేది. ఒక రోజు ధైర్యం చేసి "ఇదేమిటని" రంజని ని నిలదీశా. "నామీద నమ్మకం లేదా" అంది. "నువ్వూ వచ్చి మాతో గేమ్ ఆడచ్చుగా" అంది. "స్నేహాన్ని కూడా అర్థంచేసుకోలేవా" అంది. "మరీ ఇంత చిన్నగా ఆలోఛిస్తావెందుకూ? మరీ పల్లెటూరి బాపతులా బిహేవ్ చేస్తున్నావ్" అని నెపం కూడావేసింది. నిజంగా పల్లెబాపతు కాకపోయినా నా ‘చిన్నూరు’ బాపతు ఆలోచనలు, మెట్రో కల్చర్ పిల్ల రంజని కి పల్లెవాటం గా అనిపించడంలో తప్పులేదని భావించి, సిన్సియరుగా నన్నునేను సంస్కరించుకొని ‘పెద్దగా ఆలోచించడానికి’ ప్రయత్నించాను. కానీ మనసు మాట వినదే! ఇలా దినదినాభివృద్ది చెందిన వారి స్నేహనికి షటిల్ ఆడటం చేతగాని నేను మూగసాక్షిగా మిగిలాను. సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి, వేసవి శలవులు మొదలయ్యాయి. రంజనిని రైలెక్కించడానికి ప్రేమగా స్టేషన్ వెళితే అక్కడా ‘తాహా’ ఎదురుపడ్డాడు. బహుశా శెలవుల విరహం పరిస్తితుల్ని చక్కదిద్దుతుందనిపించి నేనూ ఇంటికి బయల్దేరాను.డిసెంబర్ శెలవులలో వారానికొకటి చొప్పున నాలుగు లెటర్లు రాసిన రంజని (తన ఇంట్లోతెలిస్తె సమస్యలొస్తాయని నేను తనకు లెటర్ రాయడాన్ని నిషేధించింది) ఈ రెండునెలల్లో కేవలం ఒక్క లెటరే రాసింది. అదీ శెలవుల ఆఖరులో, తను కాలేజికి ఒక వారం రోజులు లేటుగా వస్తున్నట్టు సమాచారం ఇస్తూ. ఎక్కడో మదిలో తీగతెగిన శబ్ధం వినిపించినా, నా ప్రేమికుడి మనసు ఆ శబ్ధాన్ని అంతగా పట్టించుకోలేదు. "ప్రేమంటే నమ్మకం" అన్న గొప్ప ఫిలాసఫీని విని,నమ్మి,జీర్ణించికున్న మనసుగా మనదీ! తను చెప్పినట్టుగానే నేనుకూడా వారం రోజులు ఆలస్యంగా ఓ సాయంత్రం వేళ కాలేజిలో అడుగుపెట్టా. కీడుని శంకించే మనసుకు, ప్రపంచమంతా తనకు వ్యతిరేకంగా గూడుపుఠాణీ నడుపుతున్నట్టనిపిస్తుందట. అలాగే నేను కాలేజి కి చేరిన మరిక్షణం నుంచీ, నా కెదురుపడిన ప్రతి ఒక్కరి కళ్ళూ నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. రూముకి చేరి లగేజి సర్ధుతుండగానే, మా హరీశూ, రమేషూ, మా రూమ్మేట్ నరసింహా ఇబ్బందిగా ముఖంపెట్టి నా ముందు నిల్చున్నారు. "ఏమైంది" అన్నా, "రంజని, తాహా తో విచ్చలవిడిగా పదిరోజులుగా తిరుగుతోంది" అని చెప్పారు. ఆ మాటవిన్న ఆ క్షణంలో నా మనసు వికలమైనా, మన ప్రేమ గట్టిదని నమ్మి, "నేను చూసుకొంటాను,పొండి" అని చెప్పి హుటాహుటిన గంగా హాస్టల్ బయలుదేరా. అప్పటీకే సాయంత్రం 7.30 కావస్తోంది, హాస్టల్ మూసే సమయం దగ్గర పడుతోంది. రంజని కోసం కబురంపితే, "బయటకు వెళ్ళింది"అని సమాచారం వచ్చింది. అప్పుడే తను హాస్టల్ వైపు ‘తాహా’ తో కలిసివస్తూ కనిపించింది. కోపం, ఉక్రోషం తన్నుకొచ్చాయి. కానీ ఇప్పుడువాటికి సమయం కాదని తలచి, "రేపు పొద్దున హాస్టాల్ గేట్ తెరవగానే కలుద్దాం" అన్నా. మరీ అంత అర్లీగా కుదరదు 8 గంటలకి కలుద్దామంది. మరుసటి ఉదయంకోసం నిద్రలేకుండా ఆరాత్రి గడిపా. బహుశా పొద్దున ఏ 4 గంటలకో నిద్రపట్టిందనుకుంటా, మా రూమీ నరసింహా నన్ను తట్టిలేపుతుండగా మెలకువొచ్చింది. మామూలుగా మార్నింగ్ వాక్ కు వెళ్ళి ఏడున్నరకొచ్చే మా నరసింహ ఇంతత్వరగా వచ్చి నన్నెందుకు లేపుతున్నాడా అనుకున్నా. "ఏంటి ప్రాబ్లమ్" అనగానే, తను పరుగెట్టివచ్చిన అలుపుని దిగమింగుకుని "రంజని, తాహా ఉన్న నర్మదా హాస్టల్ కు పోవడం ఇప్పుడే చూశా" అన్నాడు. ఒక్క క్షణం నా మెదడు పనిచెయ్యలేదు. "ఎంతసేపైంది" అని అడిగా 10 నిమిషాలపైనైందని చెప్పాడు. హడావిడిగాలేచి తయారయ్యి మరో 10 నిమిషాలలో నర్మదా హాస్టల్ ముందు నిలిచా.
దాదాపు అరగంటగా లొపల ఏమిజరుగుతోందో గ్రహించలేని మూర్ఖత్వ కాదు నాది, కానీ లోపలికి వెళ్ళి నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక హాస్టలు బయటే ఉండిపోయా. కడుపులో ఏదో తెలీని భాధ, గుండెల్లో కాల్చిన ఇనుపకడ్డీ మెత్తగా దిగుతున్న ఫీలింగ్. మరో పావు గంటకి రంజని బయటకు వచ్చింది. ఎదురుగా నేను. అంతే, ఒక్క సారి గిరిక్కున తన హాస్టల్ వైపు తిరిగి పరుగులాంటి నడకతో వెళ్ళిపోసాగింది. తన వెనుక నేను, హాస్టాల్ గేట్ దగ్గర తన చెయ్యి బలంగా పట్టుకుని ఆపాను. "Leave me Mahesh, you are hurting me" అంది. "Why did you hurt me first? why are you doing this to me?" అని మాత్రం అనగలిగాను. ఒక్కసారి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది. కాటు వేయబోయే ముందు కోడె నాగు చూపల్లే తన చూపు. తరువాత మెల్లగా అంది..."He makes me feel like a complete woman" అని. అప్రయత్నంగా నా చెయ్యిలేచింది. తన చెంప ఛెళ్ళు మంది. నా దెబ్బకు ఉక్రోషం నిండిన స్వరంతో మళ్ళీ మాట్లాడింది. "How long did you expect me to be contented with your necking and petting Mahesh? I always wanted more and you were never up to it" అంది. ఈ సారి కావాలనే కొట్టాను తన మరోచెంపమీద, మరింత బలంగా. తను తన చెంపని ఒక చేత్తో పట్టుకుని నన్ను చూసిన చూపు, ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటుంది. "నా కోరికల్ని ‘పవిత్ర ప్రేమ’ పేరుతో అణగదొక్కిన నిన్ను, మనిషిగా ఎంతగా దిగజార్చానో చూడు!" అన్నట్టుగా రంజని చూపు. విచలితుడ్నయ్యాను, చేష్టలుడిగి నిల్చున్నాను, భావరహితుడిగా, ఎంత శాతం చచ్చానో తెలియని మనిషిగా హాస్టల్ చేరాను.ఎవరో గంగా హాస్టల్ వార్డన్ కు ఈ విషయం కంప్లైంట్ చేశారట. మరుసటి రోజుకి ఒక వార్డన్ల కమిటీ ఈ కేస్ ను పరీక్షించి నన్ను శిక్షించడానికి సిద్దమై నాకు పిలుపు అందింది. ఐతే హాస్టల్ నుండీ రెస్టిగేట్ చేస్తారనీ, వీలైతే కాలేజి నుండీ కొనాళ్ళు సస్పెండ్ చేస్తారనీ రూల్స్ తెలిసిన కొందరు చెప్పుకున్నారు. "రంజని కి మారే హక్కు ఉంది గానీ, నాకు తనని కొట్టే అధికారం లేదని" అప్పటికే నమ్మిన నేను, ఏ శిక్షకైనా తయారుగా ఉన్నాను. నిజమే కదా! నా విలువల ప్రకారం చూసినా "తను చేసింది పాపమైతే, నేను చేసింది నేరం. పాపానికి క్షమ,ప్రాయశ్చిత్తం అనే అవకాశాలు ఉనాయి. కానీ నేరానికి శిక్ష తప్పదు." నా బలహీనతకూ, రాక్షసత్వానికీ సిగ్గుపడుతూ వార్డెన్ల కమిటీ రూం కి హాజరయ్యాను. అప్పటీకే మా హాస్టల్ వార్డన్ ‘గోపాల్’ మరియూ గంగా హాస్టల్ వార్డన్ ‘గీతా నాయర్’ ఉన్నారక్కడ. ఇంకా వైస్ ప్రింసిపాల్ ‘దొరై స్వామి’ కోసం వారు వెదురు చూస్తుండగానే, మా ప్రొఫెసర్ రఘునాథ్ రయ్యిమంటూ గదిలో దూరాడు. వచ్చీరాంగానే "how can you proceed aginst my student without even informing me" అని ఒంటికాలుపై ఇద్దరు వార్డన్లపైనా రెచ్చిపోయాడు. ఇది హాస్టల్ మ్యాటర్ అనీ, అందుకే తనను పిలవలేదనీ వాళ్ళు నచ్చజప్పడానికి ప్రయత్నిస్తే, "don't try to fool me. Then why is vice-principal coming to attend this proceedings" అని లాజిక్కుతో అదరగొట్టేశాడు. ఇక చేసేదిలేక తనకూ ఒక చైర్ ఇచ్చి కూచోమన్నారు. ఇంతలో దొరైస్వామి రావడం లేటౌతుందనే వార్త వచ్చింది. ఐతే మనం ప్రొసీడవ్వచ్చని గీతా నాయర్ అంటే, ఇంతలొ మా రఘునాథ్ తన మాటల్ని కట్ చేస్తూ "you have an accused. Where is the victim?" అన్నాడు. "No she is not here. Infact She has not complained. some one else at the hostel has see it and cmplained the matter to me" అని గీతా నాయర్ అంది. దానికి మా జేమ్స్ బాండ్ విజయ గర్వంతో "So, you mean to say you actually don't have a case aginst my student !?!" అని ఒకరేంజి సర్కాస్టిక్ రిమార్కొకటి పడేశాడు. దీనితో ఖంగుతిన్న వార్డన్లు రంజని కోసం కబురంపారు. తను రాగానే, నన్ను బయట ఉండమని చెప్పి తనతో మొదట మాట్లాడటం మొదలెట్టారు. బయటికి రాగానే గౌరి, హరీశ్ లు గుమ్మం దగ్గర కనిపించారు.అప్పుడర్థమైంది నాకు, మా గురుడు సమయానికి ఎలా ప్రత్యక్షమయ్యాడో. దాదాపు 10 నిమిషాల తరువాత రంజని తలదించుకుని బయటికి వచ్చింది. మా రఘునాథ్ "నా పనైపోయింది" అన్నట్టుగా బయటకు వచ్చి నాతో "Now you can go back to your hostel Mahesh" ఆన్నాడు. తరువాత నా భుజంమీద చెయ్యి వేసి, "If you have informed me this earlier, things wouldn't have come this far" అంటూ, " Dont feel bad. You have done a mistake and that girl is guilty of a blunder. Just forget everything and get back to your life" అటూ కదిలి వెళ్ళిపోయాడు. తను చెప్పింది సగమే అర్థమైనా, లోపలేంజరిగిందో ఇప్పటికీ నాకు తెలీయని విషయంగానే మిగిలిపోయింది. కాకపోతే ప్రేమలొ ఓడిపొయాననే భాధకన్నా,తనని చెంపదెబ్బ కొట్టి మనిషిగా విరిగిపోయాననే దుగ్ధ నన్ను నిర్వికారుడిగా మిగిల్చిందనిపించింది. మరుసటిరోజు ఆదివారం కాబట్టి లంచ్ కు తన ఇంటికి రావలసిందిగా గౌరి, నన్నూ హరీశ్ నూ ఆహ్వానింఛి బయల్దేరింది. హరీశ్ " सब भूल्जा बॆ!" అంటూ నన్ను హాస్టల్ కు పట్టుకెళ్ళాడు.
మరుసటిరోజు మధ్యాహ్నం గౌరి వాళ్ళింటికి వెళ్ళాం. అంతవరకూ ఈ విషయం గురించి ఏమీ మాట్లాడని గౌరి, "ఇప్పుడిలా ఎన్నాళ్ళుండాలనుకుంటున్నావ్?" అంది నా సర్వం పోగుట్టుకున్న వాలకం చూస్తూ. "నాకేం బాగానే ఉన్నా"నని బుకాయించడానికి నేను ప్రయత్నించేలోపే నా కళ్ళలో నీళ్ళు. ఎప్పుడూవచ్చాయో, ఎలా వచ్చాయో, అలా ఎంతసేపు ఏడ్చానో తెలీదు. బహుశా గత రెండురోజుల భావరహిత జీవితానికి గడ్డకట్టుకుని గుండెల్లో దాగుండిపోయాయేమో. గౌరి ఇలా అభిమానంగా అడిగేసరికీ ఒక్కసారిగా కరిగి ప్రవహించేసాయి. "మహేశ్ గె ఊటా కుడి" అని నాకు భోజనం పెట్టమని గౌరి వాళ్ళమ్మ కన్నడం లో పురమాయించడం లీలగా వినిపించి అప్పటివరకూ సోఫాలో పడిఉన్న నేను లేచాను. నా పక్కన హరీశ్ ఇంకా కూచునే ఉన్నాడు. "పాప ఇన్నూ నిద్రే మాడ్తా ఇదానే, ఆమేలె కుడోనా" ("పాపం నిద్రపోనీ, తరువాత తింటాడ్లే") అని గౌరి అనటం వినిపించింది. టైం చూస్తే దాదాపు నాలుగు కావస్తోంది. అంటే దాదాపు రెండు గంటలు ఏడ్చి నిద్రపోయానన్నమాట. ఇప్పుడు కొంత మనసు తేలికగా అనిపించింది. గౌరి వాళ్లమ్మ వడ్డింఛిన వన్నీ మారుమాట్లాడకుండా తినేశాను. బహుశా రెండురోజులుగా ఏమితిన్నానో, అసలు తిన్నానో లేదో జ్ఞాపకం అస్సలులేదు. అందుకే మంచి ఆకలిగా కూడా అనిపింఛింది. ఇక అక్కడి నుండీ బయల్దేరుతుంటే గౌరి తన పుస్తకాల కలెక్షన్ లోంచీ Betrand Rassels "Marriage and Morals" ఇచ్చి చదవమంది.
సాధారణంగా ఇటువంటి ప్రేమ వైఫల్యాల తరువాత మగాడికి కొన్నే దార్లు కనపడతాయి. మొదటిది మోసం చేసిన అమ్మాయి మీద కక్షగట్టి ఏదోఒకటి చెయ్యడం. రెండు, సెల్ఫ్ పిటీ తో దేవదాసు దారి పట్టి "కుడి ఎడమైతే పొరపాటు లేదనుకోవడం". ఇక మూడవది, "అమ్మాయిలంతా ఇంతే" అని ఇక ప్రేమకే అర్హతలేకుండా తయారవ్వడం. కానీ ఇవేవీ కాని దారిని ఆ పుస్తకం ఇవ్వడం ద్వారా గౌరి నాకు చూఫింది. అదే, పుస్తకాలలో, సాహిత్యం లో, వేదాంతంలో తరచి చూసి, నేనిప్పుడున్న స్థితికి కారణం కనుక్కుని ఈ పరిస్థితినుండీ బయటపడటం. తనిచ్చిన పుస్తకంలో రస్సెల్స్ ఒక చోట అంటాడు "Sex is a matter between two grown-up individuals and of no interest to society till a child is involved" అని. ఈ ఒక్క మాటతో, రంజని విషయంలో నేనుచేసిన తప్పు తెలిసొచ్చింది. నా సమాజం- కుటుంబం ద్వారా,సినిమాల ద్వారా నా కందించిన ‘సెకండ్ హ్యాండ్ ఎంగిలి విలువల్ని’, ‘నా విలువలు’గా భ్రమించి, రంజని అవసరాలతో,ఆకాంక్షలతొ నిమ్మిత్తం లేకుండా, ఏక పక్షంగా మా ప్రేమను పవిత్రంగా ఉంచడం, నా మూర్ఖత్వం కాక మరేమిటి? చలం ‘మైదానం’ లోని అనిర్వచనీయమైన, అవధులులేని, అన్ కండిషల్ ప్రేమ ఉనికిని తెలుసుకుని కూడా ఆచరించే దమ్ముచాలని నాబోటి పిరికివాడికిది తగిన శాస్తికాదా? "యవ్వనం ఒక ప్రాచీనశక్తి, ఈ శరీరం దానికి ఊడిగం చెయ్యక తప్పదు" అని బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ లో తెలియజెప్పినా, యవ్వనానికి దాస్యం చెయ్యక ఎంగిలి విలువల్ని ఆదర్శాలుగా భ్రమించి, నా యవ్వనానికీ ద్రోహం చేసిన ద్రోహినికానా? ఇక "Values are not absolute, they are just relative. Some times they are mutually exclusive , some times praportionatley opposite to each other and mostly highly individualistic." అని చెప్పిన జిడ్డు కృష్ణమూర్తి తత్వాన్ని గుర్తెరిగినా, నాకీ అను(పరా)భవం తప్పేదేమో, నా ప్రేమ నాకు దక్కేదేమో! గర్భనిరోధకాలున్న(కాన్ట్రాసెప్టివ్స్) ఈ నవీన కాలంలో, నేను కాపాడిన విలువలకి అర్థముందా? ఇలాంటి దశలో రంజని ఎంఛుకున్న విలువలు తప్పవుతాయా?ఇలా నా నవవసంతం నిర్వేదంగా మారి నైరాశ్యాన్ని మిగిల్చినా, వైరాగ్యాన్ని కలిగించినా. సాహిత్యం, వేదాంతం దారి చూపి నా స్నేహితురాలు, సగం చచ్చిన నన్ను నా తప్పులు తెలిపి, నా విలువల బేరీజు చేసుకుని ఒక కొత్త రూపం దాల్చే అవకాశమిచ్చింది. హరీశ్ లాంటి మిత్రులూ గౌరి లాంటి ఆత్మబంధువు సహాయంతో, ఈ జీవితానుభవంలోని సారాన్ని మాత్రం గ్రహించి, ఈ అనుభవం యొక్క చేదుని మాత్రం మనసుకంటనివ్వలేదు. తరువాత కొన్నాళ్ళకు తాహా వెళ్లిపోయాడు. నేను అక్కడ ఉన్న రెండు సంవత్సరాలలొ రంజని తో ఎప్పుడూ మాట్లాడలేదు. ఫేర్వెల్ రోజున తను నా దగ్గరకొచ్చి చిన్నగా "సారీ" అనగలిగింది. నేను మాత్రం "ధ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్" అని ఊరుకున్నా.

------------------------------------------------Tuesday, June 3, 2008

నా కాలేజి జీవితం - Part 7.1


'నవవసంతం'


నా కాలేజి జీవితంలో మరింన్ని అనుభవాల్ని పంచడానికా అన్నట్టు మా కాలేజిలో కొత్తనీరు ప్రవేశించింది. అదే, కొత్త అకడమిక్ సంవత్సరానికి గానూ కొత్త బ్యాచ్ జూనియర్స్. కాకపోతే, మా ‘కాలేజీ’ ని ‘ఇన్స్టిట్యూట్’ని చేసే పనిలో భాగంగా భారత ప్రభుత్వం మా ‘బీఏఎడ్’ కోర్సును కత్తిరించి పారేసింది. కొత్తగా వచ్చిన ఎన్.సీ.ఈ.ఆర్.టీ డైరెక్టర్ సైన్సు విభాగానికి చందినవాడూ, "ఆర్ట్సు ఒక శుద్ద వేష్టు" అన్న బలమైన అభిప్రాయంగలవాడై ఈ అకృత్యానికి పాల్పడ్డాడని ఓ బలమైన నమ్మదగ్గ పుకారు కూడా మా చెవులకి చేరింది. ఈ విపరీతం వలన మాకంటూ ‘సొంత జూనియర్లు’ లేకుండాపోయారు. మా కాలేజి లో ఆఖరి బీఏఎడ్ బ్యాచ్ గా మిగిలాం. సైన్సు మెదడైతే ఆర్ట్సు మనసనీ ఈ రెండూ సక్రమంగా ఉంటేనే మనిషైనా కాలేజైనా మనగలదనికూడా తెలియని ఈ కొత్త డైరెక్టర్ మీద జాలిపడాలో, మాకు జూనియర్లు లేకుండా చేసినందుకు కోపగించుకోవాలో తెలియక, మూకుమ్మడిగాచేరి నిరసించి పారేశామ్. నిస్పృహతో కలిసికట్టూగా నిందించి ఆవేశాల్ని చల్లార్చాం. ఇక భవిష్యత్ ప్రణాళికలో భాగంగా, ఉన్న సైన్సు జూనియర్లనే ‘సొంతం’ గా భావించి ర్యాగింగూ, ఫ్రెషర్స్ పార్టీలు సమర్పించుకుని మాలో కలుపుకోవడానికి నిశ్చయించాం. అనుకున్నదే తడవుగా ఒక నెలనాళ్ళు ర్యాగింగ్ విజయవంతంగా ముగించి, ఫ్రెషర్స్ పార్టీకి తాంబూలాలు వాళ్ళ సైన్సు సీనియర్ల కంటే ముందే ఇచ్చేశాం.అప్పటికే మన ట్యాలంట్ ని కొంత గుర్తెరిగిన మా క్లాస్ మేట్లు ఈ ఫ్రెషర్స్ పార్టీ ఆర్గనైజర్లలో ఒకడిగా పట్టంగట్టి గౌరవింఛుకున్నారు. నా భాద్యత గేమ్స్ డిజైన్ చెయ్యడం. మా సీనియర్లు నేర్పిన చిలిపి ఆటలు మా దగ్గరున్నా, వాటికి మన తెలివితో పదునుపెట్టి, ఈ అదనుకు వాడటానికి నిశ్చయించాను. సాధారణాంగా ఒక ‘చీటీల రౌండ్’ ఒకటి ఉంటుంది. ఇందులో రౌండ్లు రౌండ్లుగా చీటీల బాక్సు తిప్పి చీటీ వచ్చిన వాడి చేత ఏదోఒకటి చెయ్యిస్తారు. ఈ ఆటలో సాధారణంగా ఖర్మగాలి ఎప్పుడూ పాట రానోడికి "పాట పాడు" అనో, లేక ఆట రానోడికి "డ్యాంస్ చెయ్యి" అనో వచ్చి సరదాకాస్తా చెడగొడుతూ ఉండేది. అందుకే మనం మన అతితెలివి ఉపయోగించి చీటీలలో కేవలం నంబర్ ఉండేట్టూ, జూనియర్లు చెయ్యవలసిన లిస్టు సపరేటుగా మా వద్ద ఉండేట్టూ మార్చిపడేసా. దీంతో నా సామిరంగా! మా కిష్టమైంది మాక్కావలసిన జూనియర్తో, నంబరుతో సంబంధం లేకుండా చేయించి పడేసాం. ఈ చీటిలరౌండ్ లోనే కాస్త రొమాన్సు కలిపి "నచ్చిన సీనియర్ కు ప్రపోజ్ చెయ్యి", "నచ్చిన సీనియర్తో డ్యాంస్ చెయ్యి" లాంటి తింగర వేషాల్నికూడా జొప్పింఛేశాం. అంటే కాస్త ఆనందంతో పాటూ ఆశ్చర్యాన్నీ, రొమాన్సునీ కలిపి పార్టీ కి కొత్తరంగులద్దామన్నమాట. అందుకె ఇప్పటీకీ "మీ ఫ్రెషర్స్ పార్టీయే బెస్ట్" అంటారు మా జూనియర్స్.‘పేఫర్ డ్యాంస్’ గురింఛి ఇంతకుముందే చెప్పాకదా! ఆ రౌండ్లో నన్ను జోడిగా తిరుపతి అమ్మాయి ‘సరితా రెడ్డి’ ఎంచుకుంది. రెండురౌండ్లు గడిచేసరికీ ఆ అమ్మాయి ఇబ్బందిని గమనించి మనమే ఔట్ ఐపోయాం. తరువాతి రోజుల్లో ఈ అమ్మాయి తో మంచి స్నేహం కుదిరిందిలెండి. ఎంతైనా ఒక జిల్లావాళ్ళంగా మరి. ఈ ర్యాగింగ్ హడావుడీ, ఫ్రేషర్స్ గలభాలో ఉండగానే మళ్ళీ స్నేహాలూ ప్రేమల లిస్టింగు మనసులో వేసేసుకోవడం జరిగిపోయింది. పార్టీ చివరలో ‘బాల్ డ్యాంస్’ రౌండ్ మొదలైంది. ఈ సారి పార్ట్నర్లని మారుస్తూ డ్యాంసు కొనసాగించాలని మా హరీశ్ కోరడం జరిగింది. అవునుమరి, అందరికీ అందరితో డ్యాంస్ చేసే అవకాశం రావాలిగా! . ఈ రౌడ్లో మన లిస్టులో ఉన్న అమ్మాయిలతో అందరితో డ్యాంస్ చేసి చివరిగా, ‘రంజని’ అనే కల్పక్కం(తమిళనాడు) కు చెందిన మళయాళీ అమ్మాయితో జతకలిసా. ఇంతకు మునుపు ఈ అమ్మాయిని ర్యాగింగ్ టైమ్ లో చూసిఉన్నా, అప్పుడు మన కళ్ళు ‘శ్రీజ’ అనే ఒక అందగత్తెమీద ఉండటంతో ఈ అమ్మాయిని పెద్దగా గమనింఛలేదు. కానీ ఇప్పుడు ఇంత దగ్గరగా చూసేసరికీ "బాగుందే!" అనిపించింది. అద్వితీయమైన అందం కాదుగానీ, కళ్ళుమాత్రం ‘మోహినీ ఆట్టం’ డ్యాంసరుకిమల్లే భలే గమ్మత్తుగా అనిపించాయి. నిజంగానే తను ఆ నృత్యం ఐదు సంవత్సరాలు నేర్చుకుందని తరువాత తెలిసింది.పార్టీ ముగుసిన వారానికల్లా స్నేహాలూ, ప్రేమల లిస్టుకి ‘చెల్లెళ్ళ’ లిస్టుకూడా చేర్చాల్సొచ్చింది. కొందరు జూనియరమ్మాయిలు "భయ్యా" అని భయంకరంగా పిలవడం మొదలెట్టారు మరి. ఈ ‘భయ్యా’ అని పిలిచే ‘బహన్’ ల లిస్టులో మొదటిది ‘ఊర్మిళ’ అనే ఢిల్లీ అమ్మాయి. ఇక మన ఖర్మకొద్దీ ‘శ్రీజ’ కూడా ఆలిస్టులోకి చేరిపోయింది. "మనం ట్రై చేస్తున్నాంకాబట్టి ఇలా బ్రదర్ ఫిట్టింగ్ పెడుతున్నట్టున్నారు" అని మా హరీశ్ గాడు చాలా సీరియస్ గా ఫీలయ్యాడుకూడా. ఈ నా చెల్లెళ్ళ లో ఆద్యురాలైన ఊర్మిళ కు కొత్తగా ఏర్పడిన ప్రాణస్నేహితురాలు రంజని. ఈ పిల్లకూడా ఎక్కడ "భయ్యా" అని ఉన్న ప్రాణాల్ని తీస్తుందో అన్న భయం ఒక పక్క పీడిస్తున్నా, ఈ ఇద్దరితో కలిసి కొన్నాళ్ళు విజయవంతంగా ఈవెనింగ్ వాక్ చేస్తూ స్నేహం చేసాను. ఇలా రెండువారాలు ఈవెనింగ్ వాక్ లాగించాక ఒక శనివారం పూట మరుసటిరోజు కలిసి సినిమాకెళ్దామనే ప్లాన్ ఉదయించింది.ఆదివారం సినిమాకెళ్ళే సమయానికి గేటుదగ్గరున్న మనకు రంజని ఒక్కటే వస్తూ కనిపించింది. "అంటే ఇక మన సినిమా ప్రోగ్రాం క్యాన్సిలన్నమాట" అనుకుంటుండగానే, దగ్గరకు వచ్చి "ఊర్మిళ మనం వెళ్తున్నది తమిళ సినిమా కాబట్టి డ్రాప్ అయింది"అనీ, "మనిమిద్దరమే వెళ్దాం" అంది. మనసులో ఒక్కసారిగా వెయ్యి ఫౌన్టేన్లు ఎగసినట్టైంది. నిజమే మరి, మొదటిసారిగా ఒక అమ్మాయితో జంటగా సినిమా అంటే అలానే అనిపిస్తుందేమో! ఎలా ఆటో ఎక్కానో, ఎలా ధియేటర్ చేరానో, టికెట్టు ఎవరుతీశారో ఈ ఆనందంలో తెలిసిరాలేదు. సినిమా మొదలైంది. ‘ఆశై’ అని మణిరత్నం నిర్మించిన సినిమా ఇది. దీన్ని ‘ఆశ...ఆశ...ఆశ’ అని తెలుగులో డబ్ చేశారుకూడా. అజిత్, శుభలక్ష్మి హీరోహీరోయిన్లు, ప్రకాష్ రాజ్ ఇందులో విలన్. లవ్ స్టోరీ అవడం వల్ల ప్రేమ దృశ్యాలు వచ్చినపుడు రంజని ముఖం చూడాలనే కోరికను అణగద్రొక్కుకుని కాస్త సినిమా చూశాను. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన భార్యను కోల్డ్ బ్లడెడ్ గా చంపే సీన్ రాగానే, భయంతో రంజని చేతులు నా చేతుల్ని పట్టుకున్నాయ్, తనకు భయం పోగొట్టే ప్రయత్నంలో భాగంగా నా చెయ్యి తన భుజాల్ని చేరాయి. ఇక సినిమా అంతా, ఫోటో ఫ్రేమల్లే అలాగే ఉండిపోయాం. సినిమా అయిపోయిన తరువాత జనాల మధ్యన తనను రక్షించే హీరోలా చెయ్యి పట్టుకుని ధియేటర్ బయటిదాకా తీసుకువచ్చా. అప్పటీకే మనం ఆకాశంలో విహరించేస్తున్నామని చెప్పొచ్చు. నా ముఖం బహుశా ఆ సమయంలో వెయ్యి వాట్ల బల్బు లాగా వెలిగిపోయిందని నా గట్టి నమ్మకం. అద్దమెక్కడా కనపళ్ళేదుగానీ, ఈ సెన్సాఫ్ అచ్చీవ్ మెంట్ కు మన ముఖాన్ని మనమే ముద్దాడి గౌరవించుకొనుందును. కాలేజ్ చేరే సరికీ సాయంత్రమైంది. చేరగానే ఊర్మిళ ఎదురై "कहा गऎथॆ तुम्लॊग? दिन भर डुंड रहीथी" అంది. అంటే మా కోసం పొద్దున్నుండీ పడిగాపులు పడుతోందని అర్థం. ఈ మాట వినగానే ఒక్క క్షణం షాకై, రంజని వేపు సమాధానం కోసం చూశా. తను తలదింఛుకొనుంది. నాకుమాత్రం తలదింఛుకొని నవ్వినట్టనిపించింది. నా మట్టుబుర్రకి విషయం కొంత అర్థమైనట్టనిపించింది.ఇలా నా ప్రేమకథ ప్రారంభమైన రోజుల్లోనే మా కాలేజీ లో ప్రతిసంవత్సరం జరిగే పాటలపోటీలు జరిగాయి. మొదటి సంవత్సరం మనకు ఒక్క ప్రైజూ వచ్చిన పాపాన పోలేదుగానీ, ఫరవాలేదనే గుర్తింపు మాత్రమే దక్కింది. ఈ సారి మనం ఖచ్చితంగా రెచ్చిపోదామని నిర్ణయించి పేరు నమోదు చేశేసాం. తీరా పోటీ తారీఖున చూస్తే దాదాపు 120 మంది గాయనీ గాయకులు మనతో కుస్తీకి సిద్దంగా ఉన్నారు. సోలోసాంగ్ తయారుగా ఉన్నా, డ్యూయెట్టుకోసం కసరత్తు చేసి ‘శైలజ’ అనే ఒక సీనియరమ్మాయిని ఒప్పించగలిగాను. పోటీ ప్రారంభమైందొ. సోలో పాటగా మనం అప్పటి మన మన:స్థితికి దగ్గరగా " सभाला है मैनॆ बहुत अप्ने दिल कॊ, जुबा पर तेरा फिर भि नाम आरहा है" అనే పాటను పాడాను. ఈ పాటకు అర్థం ‘నా మనసునెంతగా బుజ్జగించి వద్దన్నా, నా పెదాలు నీపేరే పలుకుతున్నాయ్’ అని. ఇక డ్యూయెట్టు కూడా "राह मॆ उन सॆ मुलाकात हॊगई, जिसॆ डर तेथॆ वही बात हॊगई" అని మహా ప్రేమ గీతం లెండి. దీనర్థం ‘వస్తూ వస్తూ తన దర్శనమైంది, ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది’ అని, అనుకోకుండా కలిగే ప్రేమగురించిన గీతమది. మన కొత్తప్రేమ బలమో, ఫీలింగ్ ను నింపిన మన గళమో ఏది మ్యాజిక్ చేసిందో తెలీదుగానీ రెండు ప్రైజులూ మనకేయిచ్చి పోటీకి వచ్చిన జడ్జులు దీవించేశారు. ఇక నేను పాట స్టేజిపై పాడుతున్నంతసేఫూ, కొన్ని వందలకళ్ళు నా మీదకాక రంజని మీదున్నాయని, ఈ చూపుల్ని భరించలేక తను సిగ్గుతో చితికిపోయిందని తను నాతో గర్వంగా చెప్పింది. ఆ క్షణాన నా చాతీ ఒక్క పదంగుళాలు అదనంగా పొంగింది.ఈ తతంగం మొత్తంలో ‘నువ్వంటే నాకిష్టం’, ‘నేను నిన్ను ప్రేమిస్తునాను’ వంటి జెండా వందనాలూ, జాతీయగీతాలూ పాడుకోకపోయినా, ప్రేమ స్వాతంత్ర్యాన్ని మాత్రం యధేచ్చగా అనుభవించాం. బహుశా ప్రేమికులు ‘నేను నిన్నుప్రేమిస్తున్నాను’ అని ఒక స్టేట్ మెంట్ ఇచ్చిమరీ ప్రేమించరనుకుంటా! ఇక మేమంటారా? ఆగి ఆగి కురిసే ఆగష్టు వర్షాలు. చేతిలో చెయ్యీ, చూపులో చూపూ కలిపిన తిరిగిన సెప్టెంబరు సాయంత్రాలు. మైసూరు దసరా సంబరాలను మరిపించిన మా సరదాలూ. కొత్త చెలిమిని మరింత గట్టిపరచిన నవంబరు నాటి కొత్తచలీ. ఇలా సెమిస్టరు లోని నెలల సాక్షిగా ఆనందాన్ని, కొత్త సాంగత్యాన్ని అనుభవించాము. పచ్చకామెర్ల రోగికి లోకం పచ్చగా కనపడ్డం ఎంత అబద్ధమో, ప్రేమలో ఉన్నవాడికి ప్రపంచం మరింత అందంగా అనిపింఛడం అంత నిజమనుకుంటా. మా కాలేజిలో ‘గుల్ మొహర్ అవెన్యూ’ అని ఒక రోడ్ ఉంది. ఎత్తైన ఈ గుల్ మొహర్ చెట్లలో వర్షాల తరువాత ఎరుపు-నారింజ రంగు పూలు పూసి, అవి రోడ్డు మీద రాలిన దృశ్యం మిర్రర్ ఇమేజ్ లా అప్పుడుకనపడి మనసుకు ఆహ్లాదాన్ని కల్పించినట్టు మరెప్పుడూ అనిపించలేదు నాకు. ఇక డిసెంబర్ చలిశెలవుల్లో, నాలుగు లెటర్ల మధ్య మేము అనుభవించిన విరహం అనిర్వచనీయం. ఈ ఎడబాటు తరువాత జనవరిలో మేము కలిసి మొదట మాట్లాడుకున్నది, కలిసి మేము ఫంఛుకొబోయే బ్రతకు గురించీ, కాబోయే మా పెళ్ళి గురించీ, ఆలూలేదూ చూలూ లేదు అన్నట్టు మాకు పుట్టబోయే పిల్లల గురించీ. ఇప్పుడు సిల్లీగా అనిపింఛొచ్చి కానీ, ఆ వయసు ఆవేశం అలాంటిది. ఇంతటి ప్రేమావేశంలోనూ ముద్దులూ కౌగిలింతలూ మినహా మా ప్రేమ హద్దులెప్పుడూ దాటలేదు. నా పిరికితనమో, నేను పుట్టిపెరిగిన సమాజం నాలో నింపిన విలువల మహత్యమో, హద్దులు దాటితే జరిగే పరిణామాల పట్ల భయమో ఇవన్నీ కలగలిపిన నా మానసికస్థితో దీనికి కారణం కావచ్చు. కానీ ఈ కారణం నా జీవితాన్నో మరో విచిత్రమైన మలుపు తిప్పడానికి తయారుగా ఉందని నాకు అప్పుడు తెలీదు.


(`నవవసంతం' రెండవభాగం (7.2)త్వరలో)


----------------------------------------------