Wednesday, April 29, 2009

పదును తగ్గిన ‘అసిధార’

(ఈ టపాతో రెండువందలు పూర్తయ్యాయి)


వందేమాతరం మతానికి అతీతంగా పిల్లలందరూ పాడాలి.
భగవద్గీతను పర్సనాలిటీ డెవలంప్మెంట్ పుస్తకంలా స్కూల్లో పరిచయం చెయ్యాలి.
ఆధునిక విజ్ఞానంతో పాటూ శాస్త్రాల్నీ,వేదాల్నీ కంపల్సరీ చెయ్యాలి....


వింటుంటే బీజేపీ మత/సాంస్కృతిక జాతీయవాద అజెండాలాగా ఉందికదా! ఇప్పుడు ఇంకో ఆలోచన వినండి.
‘కేవలం పరీక్షపాస్ చేయించే చదువుకన్నా, ఆలోచించడం నేర్చుకునే చదువు కావాలి. పిల్లల్ని పరిపూర్ణమైన మనుషులుగా మార్చే చదువు కావాలి’

అందరూ అర్జంటుగా తలలూపే పాయింటుకదా! ఇదే ‘అసిధార’ నవలలో ఉన్న సమస్య.

దాదాపు ఐదు నెలలక్రితం అసిధారని రచయిత కస్తూరి మురళీ కృష్ణ గారి స్వహస్తాల మీదుగా తీసుకుని ఆవేశంగా చదవడం ప్రారంభించాను. పది పేజీల తరువాత, చటుక్కున క్రింద పెట్టేసాను. ఒక తిరోగమవాద, ఛాందసవాద, హిందుత్వవాద నవల అనిపించి ఇప్పటివరకూ ముట్టలేదు. కానీ, ఈ మధ్యనే పూర్తిగా చదవుండా అలాంటి నిర్ణయానికొచ్చిన నా తొందరుపాటుతనానికి కొంచెం సిగ్గుపడి, పుస్తకాన్ని ముగించాను.

నా అభిప్రాయంలో విప్లవాత్మక మార్పురాలేదుగానీ, రచయిత ఉద్దేశం బీజేపీ అజెండాను మొయ్యడం మాత్రం కాదనిపించింది. ‘రాజకీయ హిందుత్వభావజాలంతో సంబంధం లేకుండా కొందరు, అద్వితీయ "ప్రాచీన"భారతీయ సంస్కృతి ఆధారంగా ఒక ఆదర్శలోకం తయారుచెయ్యొచ్చనే కల్పన చేసేవారున్నారేమో’ అనే ప్రత్యామ్న్యాయ ఆలోచనను అంగీకరించే స్థితికి ఈ నవల నన్ను తీసుకొచ్చింది. నేను ఈ నవల చర్చించిన "ఆదర్శాలతో" విభేధిస్తాను. అయినా, ఈ ఆలోచన యొక్క అవకాశాన్ని కాదనను.

సాంప్రదాయక విలుల్ని నిలువెల్లా జీర్ణించుకుని నమ్మిన (నమ్మి జీర్ణించుకున్న కాదు) వివేకానంద, తండ్రి ఆస్థిగా వదిలిన పాఠశాలలో తను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో, బోధనా పద్ధతుల్లో, విద్యార్థుల దినచర్యల్లో మార్పులు తీసుకొస్తాడు. పాఠశాలల్ని ఆర్థిక బలిమితెచ్చే వ్యాపారసంస్థలుగా మార్చే అవకాశాన్ని కాదని, సాంప్రదాయక "ధర్మ"(మత విద్యకాదని ఇతడి వాదన) విద్యను వివేకానంద అమలుపరచడంతో, ఈ ఆస్థిని ఉపయోగించుకోవాలనుకుంటున్న మామయ్య దశరధరామయ్యకు కంటగింపుగా తయారవుతుంది. ఆదర్శం - అవకాశవాదం మద్య పోరు ప్రారంభమవుతుంది. చివరకు ఎవరు గెలుస్తారు అనేది కథ.

సహజంగా హీరో గెలవాలిగనక, అదీ "వివేకానంద" అనే సింబాలిక్ విలువున్న పేరుపెట్టుకున్న నాయకుడు ఖచ్చితంగా గెలుస్తాడుగనక, పాఠకుడికి పెద్ద శ్రమలేకుండా కథ జరిగిపోతుంది. రచయిత కథమొత్తం వాదోపవాదాల్లో గడిపి, చివరి పదిపేజీల్లో తెచ్చిపెట్టుకున్న సస్పెన్స్ తో పాఠకుడికి కొంచెం థ్రిల్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో "స్పందించగలిగిన" అంశం, ఒక అమ్మాయిల గుంపును కథలో కలిపి, sexual tension కు ఆస్కారం కల్పించి, రక్తప్రసరణ పెంచి...ఆతరువాత ఏమీ చెయ్యకపోవడం. రచయితకు చలం మీదున్న అభిప్రాయాన్ని తెలియజెప్పడానికి. శుక్లాంభరధరం శ్లోకంలోని రహస్యాన్ని(ఇదొక భాష్యం మాత్రమే) విప్పిచెప్పడానికి. వివేకానంద "పవిత్రత"కు పట్టంగట్టటానికి. వివేకానందుడి తమ్ముడు (అర్థ)అభ్యుదయవాది రామకృష్ణను దిగజార్చడానికి తప్ప ఈ ఆడగుంపు యొక్క ఔచిత్యం అర్థం కాదు. ఉద్దేశం ఇదే అయితే మాత్రం రచయితకు అభినందనలు.

అమ్మాయిలతో రామకృష్ణ, వివేకానందుల ప్రవర్తన "సహజంగా" చిత్రీకరించినా, ఒక స్థాయికొచ్చేసరికీ మూల ఉద్దేశానికి అందక, తెగిన గాలిపటాల్లాగా కొన్ని conflict దృశ్యాలు వచ్చి, ఈ ప్రేమ- ఆకర్షణల పుటల్ని నవల నుంచీ తెంపేస్తాయి. మోనిక పాత్ర యొక్క "సహజమైన అసహజ" చిత్రీకరణ. లలిత పాత్రను ఉదాత్తం చెయ్యాలా లేక మామూలుగా ఉంచాలా అన్న ఊగిసలాట. ఉద్దేశరహితంగా ప్రవర్తించే మాలతి పాత్ర. ‘కొంతస్థాయి ఉన్మాదం మొదట్నుంచీ ఉందేమో!’ అనిపించే మీనాక్షి వంటి స్త్రీ పాత్రలతో రచయిత పడ్డతంటాలు చాలా సుస్పష్టంగా కనిపిస్తాయి.

కాస్త ఉదాత్తమైన స్త్రీపాత్రలంటే అమ్మ సరోజినమ్మ, చెల్లెలు శారద. ఇద్దరూ వివేకానందను గుడ్డిగా నమ్మితే, శారద మాత్రం కష్టకాలంలో హఠాత్తుగా "ఆరితేరి"పోతుంది. అదీ అప్పటివరకూ లలితను అల్లుకుని మాత్రమే ఎదిగిన(మాట్లాడిన) శారద వివేకానందుని మించిన విజ్ఞత పంచాయితీలో ప్రదర్శించి ఉత్తరాధికారిగా ఎదుగుతుంది. మొదటి దానికి కారణాలున్నా, రెండో మార్పు కొంచెం పంటికింద రాయే.

"జీవం చచ్చిన చదువులోకి జీవాన్ని చొప్పించేందుకు ఒక యువకుడు సాగిస్తున్న వ్రతమే ‘అసిధార’" అని రచయిత స్వయంగా చెప్పుకున్నా, నవలను కొన్ని ప్రాచీన భారతీయ సంస్కృతి లోని "పవిత్రమైన" ఆలోచనల్ని భవిష్యత్తు బంగారబాట చేసే విషయాలుగా ప్రతిపాదించడానికి, తన మనసులో అప్పుడప్పుడూ మెదలిన అమూల్యమైన జ్ఞాన గుళికల్ని నవల్లో కుదించడానికి. విశ్వనాథ సత్యనారాయణ దార్శనికతను నెత్తికెత్తుకోవడానికి. మతమార్పిడి చేసుకున్న దళితుల్ని ఒక ఎత్తిపొడుపు పొడవడానికి. అభ్యుదయ వాదుల్ని అవకాశవాద మాఫియాగా చిత్రించడానికీ. అవకాశవాదంకన్నా, నమ్మిన సిద్ధాంతాల్ని ఆరునూరైనా ఆచరించే (ఒక స్థాయిలో మూర్ఖపు) పట్టున్నవాడు జయించి తీరుతాడనే విషయాల మధ్య, అసలు విషయానికి తక్కువ సమయం కేటాయించి అన్యాయం చేశారు.

నవల శైలి ఎలాగూ చర్చాగోష్టి అప్పుడప్పుడూ ఏకపాత్రాభినయం కాబట్టి, చదువు విషయంలో కూడా తను చెప్పాలనుకున్నది రచయిత మధ్యలో దూరి చెప్పేసుంటే సరైన న్యాయం జరిగేదేమో! ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తరహా వ్యాసానికి కథనద్ది ఆసక్తికరంగా చెప్పిన పుస్తకంగా నిలిచుండేదోమో! కనీసం పూర్తిస్థాయి రాజకీయ హిందుత్వ అజెండాను మసాలాదట్టించి సమర్పించినా సమర్పణ కలిగిన పాఠకులు ఈ నవలకు లభించి ఉండేవారేమో!. అందరి పాఠకుల్నీ మెప్పించాలనో లేక తను నమ్మింది చెప్పాలని కథానాయకుడిలాగా రచయిత చేసిన ప్రయత్నమో తెలీదుగానీ, చదివించగిగిన నవల అయ్యుండీ నిరాశ పరిచింది.

కాకపోతే ఒకసారి చదివి కనీసం విభేధించడమో, కూసింత తిమకపడటమో, మంచి ప్రయత్నం అని అభినందించడమో చెయ్యవలసిన నవల అసిధార. ప్రయత్నించండి.

*****

Tuesday, April 28, 2009

తమిళజాతీయత - శ్రీలంక

‘తమిళజాతీయత’ పేరుతో శ్రీలంక సమస్యని, తమిళనాడు రాజకీయ సమస్యగా మార్చేసారు. ఇన్ని సంవత్సరాల తరువాత టైగర్ ప్రభాకరన్ శ్రీలంక ఆర్మీకి కనుచూపుమేరలో కనిపిస్తున్న తరుణంలో,కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి "యుద్ధం" ఆపే సలహా ఇవ్వాలని కరుణానిధి పట్టుబడుతున్నాడు.

తమిళ ప్రజలపై సింహళ ప్రజల దౌష్ట్యాలు చరిత్ర ఎరగనిది కాదు. మరోవైపు తమిళ ప్రజలకోసం పోరాడుతూ ఒక ఉగ్రవాద సంస్థగా ఎదిగిన LTTE ఉన్మాదంకూడా జగద్విదితమే.

భారతదేశం మొదట్నుంచీ శ్రీలంక విషయంలో "అతి"గానే వ్యవహరించింది. ఒకప్పుడు తమిళ టైగర్ల శిక్షణా శిబిరాలు భారతభూభాగంలో ఉంటే మిన్నుకుండి పరిస్థితి చేజారేసరికీ, PKF ను శ్రీలంక సైన్యానికి మద్ధతుగా పంపి భారతదేశ సైనిక చరిత్రలోనే ఒక ప్రమాదకరమైన అధ్యాయాన్ని రచించింది. పులినెక్కి స్వారీ చేసి, దిగేసి ఎదురు తిరిగిన ఫలితం...రాజీవ్ గాంధీ దారుణహత్య. ఈ చరిత్ర నుంచీ మనం ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉందేమో!

కరుణానిధి ఆకస్మిక నిరాహారదీక్షతో కేంద్రం ఉలిక్కిపడింది. కానీ, తెలివిగా శ్రీలంక ప్రభుత్వంతో యుద్ధం ముగిసిందనే స్టేట్మెంట్ ఇప్పించి అటు కరుణానిధిని మంచి చేసుకుంటూనే, రాజకీయలబ్ధిని చేకూర్చింది. జయలలిత తమిళ్ ఈలం ఏర్పాటు చేస్తానన్న మాటతరువాత, ఈ రకమైన political posturing కరుణానిధికి చాలా అవసరం. లేకపోతే, శ్రీలంక తమిళులపై సానుభూతి కలిగిన తమిళ ప్రజలు కరుణానిధికి రాజకీయ సమాధి కట్టినా కట్టగలరు.

ఈ రాజకీయ నాటకాన్ని పక్కనబెడితే, అత్యంత దయనీయమైన స్థితి ఒకవైపు తమిళ్ టైగర్ల మధ్య మరోవైపు శ్రీలంక సేనలమధ్య కొట్టుమిట్టాడుతున్న సామాన్య ప్రజలది. దాదాపు 5 లక్షల మంది ఈ కల్లోలంలో చిక్కుకుని అలమటిస్తున్నారు. వీరిని రక్షితప్రదేశాలకు ప్రయాణించకుండా అడ్డుకుంటున్న టైగర్ల దౌర్జన్యం దారుణమైతే, తక్షణ సహాయం అందకుండా అంతర్జాతీయ సహాయాన్ని నిలువరిస్తున్న శ్రీలంక ప్రభుత్వానిది మరో దాష్టీకం.

భారతప్రభుత్వం 100 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఇతర దేశాలు, ఐక్యరాజ్య సమితి,రెడ్ క్రాస్ తమ సహాయంతో శ్రీలంకను చేరుకున్నాయి. ఆక్స్ ఫామ్ వంటి స్వచ్చంధ సంస్థలుకూడా తమ వంతు సహాయార్థం వచ్చాయి. ప్రభాకరన్ పట్టుబడే అవకాశాలు కనిపించడం. చాలా వరకూ తమిళ్ ఈలం ఆక్రమిత భూభాగాన్ని శ్రీలంక సైన్యం సొంతం చేసుకోవడంతో ఈ ప్రజలకు సత్వర సహాయం అందుతుందని ఆశిద్ధాం.

*****

Monday, April 27, 2009

సమకాలీన పురుషుడికి ఒక "మేల్ కొలుపు"


"మగాళ్ళంతా ఇంతే" అని స్త్రీవాదులు స్వీపింగ్ జనరలైజేషన్ చేసినప్పుడల్లా, ఒక్కసారిగా నాలో ఉవ్వెత్తున ఎగిసే నిరసన స్వరాల్ని ఎప్పుడూ అక్షరబద్ధం చెయ్యలేకపోయాను. కానీ నా స్వరాన్ని సంగీతంలా వినిపించిన పుస్తకాన్ని ఇప్పుడే చదివాను. నా భావాల తీవ్రతను మించిన వ్యక్తీకరణ కలిగి ఉండటమో లేక నా ఆలోచనల తీరాల్ని తాను తాకొచ్చిన అనుభూతిని మిగల్చడమో తెలీదుగానీ ఇంస్టంట్ గా ఈ పుస్తకం నాకు నచ్చేసింది. అప్పుడప్పుడూ నాలో రేగిన భావతుంపరల్ని జడివానలాగా కురిపించిన ఈ పుస్తకం పేరు "మేల్ కొలుపు". రచయిత అరుణ్ సాగర్.ఆంధ్రజ్యోతి లో ఇరవై ఐదు వారాలపాటూ సాగిన ఈ వ్యాసపరంపరని ఒక సంకలనంగా 2003 లో ప్రచురించారు.

పూర్తి సమీక్షకై పుస్తకం చూడండి.

****

Saturday, April 25, 2009

సృష్టి - సమయం - రొద - ప్రశ్న


ప్రముఖ భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్ తన బ్లాగులో రాసుకున్న కవితల్లో కొన్నింటికి ఇది స్వేఛ్ఛానువాద ప్రయత్నం. మీరూ ఒక ప్రయత్నం చెయ్యండి!

Conception

I conceive myself
in my imagination
and then
lose myself
in my own conception

సృష్టి
నా స్మృతిలో
నన్ను నేను సృష్టించుకున్నాను
ఆ సృష్టిలో
నన్ను నేను అర్పించుకున్నాను

''time' does not fly ?

and so said 'time'

"you have for so long
watched me go by,
now come aboard
and through my porthole
watch yourself go by
for I have been still
for as long as
I have known
myself"

సమయం పయనించదు
సమయం అన్నది...
"ఇన్నాళ్ళ నా గమనం గమనించావు
ఇప్పుడు నన్నధిరోహించి పయనించు
నా గుండ్రటి కిటికీ గుండా
నువ్వు నీ గమనపు వైనం చూడు
అప్పుడైనా...
నాస్థిరత్వం నీకు అవగతమౌనేమో!

Noise

Amidst the noise
and the screaming
in my head
I finally found
the whisper
of my joy

రొద
రణగొణ రొదల మధ్య
నా తలలో కేకలమధ్య
చిట్టచివరకు...
నా ఆనందపు అలికిడి వినిపించింది


a question

I asked you
and you said
'you're too vague'
of course i am
i am afraid
your answer
would be finite
leaving no room
for hope
for interpretation
for dreaming
for yearning
for the search
for myself
in you

an eternity lives
between a yes
and a no

ఒక ప్రశ్న
నా ప్రశ్నకు బదులిచ్చావు
‘అస్పష్టం నీ అస్థిత్వం’ అని
నిజమే! కానీ
నీ సమాధానపు ఖచ్చితత్వం
నన్ను నీలో వెతుక్కునే
ఆశకు స్థలం లేని
అవగాహనకు అవకాశం లేని
కలలకు బలం లేని
కోరికకు స్వరం లేని
అన్వేషణకు వీలు లేని
పరిస్థితి కల్పిస్తుందేమో అన్న భయం

ఎంతైనా ‘అవును’‘కాదు’లమధ్య
ఒక అనంతం జీవిస్తుంది కదా!


****

Friday, April 24, 2009

మతానికి నా నిర్వచనం

మతం అనేది ప్రతి సమాజం తన ఉనికిని కాపాడుకోవడానికి ఏర్పరిచే కట్టుబాట్ల చిట్టా (Rule book).అది సమయానుగుణంగా మారుతుంది. ఏ మతమైనా “Thou shall not do this,do that” అని ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెబుతుంది.అందుకే అదొక rule book అన్నాను. మీకు మరీ తేలిగ్గా అనిపిస్తే అదొక “మతపరమైన రాజ్యాంగం” అనికోవచ్చు. అది నా నిర్వచనం.

దేవుడెక్కడున్నాడో చెబితే,ఆ అతరువాత చేరుకునే మార్గం దానంతట అదే దొరుకుతుంది. ఒకవేళ అదే మతం యొక్క నిర్వచనమైతే, ప్రస్తుతానికి నాకు దాని అవసరం లేదు.భగవంతుదితో నాకు ప్రత్యేకమైన పనేమీ లేదు. నామటుకు మనిషి ఎలా సుఖశాంతులతో బ్రతకాలో తెలిపేది ఏదైనా మతమే. ఏమతంలో ఈ అంశాలున్నా వాటిని స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు.

నేను వ్యతిరేకించేది మూఢాచారాల్నీ,మూఢనమ్మకాలని,అమానవీయ పద్ధతులను. మతం దానికి మూలంగా కనబడితోంది కాబట్టి, దాని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తాను. అంతే తప్ప కేవలం వ్యతిరేకించడం కోసం మతాన్ని వ్యతిరేకించడం మరో మూఢత్వం కాబట్టి, నేను అలాంటి ధృక్పధాన్ని దరిజేరనివ్వను.

‘జీర్ణక్రియని ఆధారాలతోసహా స్వయంగా తెలుసుకుంటేగానీ మనిషి ఆహారం తినడానికి అర్హుడు కాదు’, అంటే బాగుంటుందా? మతం మొత్తాన్ని తెలుసుకునిగానీ మీరు గుడికెళ్ళరా?మరి నేను మతాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రం "అరతెలివి" అంటే ఎట్లా?!?

****

Wednesday, April 22, 2009

కూడికలు - తీసివేతలు

‘బారా ఆణా’ అనే సినిమాలో నసీరుద్దీన్ షా పాత్ర కిడ్నాప్ చేసి ప్రతిగా డబ్బులు తీసుకూంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతుంది. కానీ...కోర్టు వారు అతని మీద కేసు కొట్టేస్తారు. కారణం, ప్రభుత్వ రికార్డుల ప్రకారం అతను ఒక "మరణించిన" వ్యక్తిగనక. చిత్రంగా ఉందికదా! అదే నిజంలో ఉన్న విచిత్రం. గ్రామంలో తన దాయాదులు ఆస్థి కొట్టేసే ప్రయత్నంలో భాగంగా, నసీరుద్దీన్ షా ఎక్కడికో వెళ్ళిన సమయంలో అధికారులతో కుమ్ముక్కై అతను చనిపోయాడని నిర్ధారిస్తారు. తను బ్రతికున్నాననై నిరూపించడానికి చేసే ప్రయత్నం బెడిసి కొడుతుంది. అప్పటి నుండీ ఒక మరణించిన వ్యక్తిగా జీవిస్తాడు.

కానీ ఇక్కడ చర్చ, ‘బారా ఆణా’ సినిమా గురించీ కాదు. నసీరుద్దీన్ షా నటన గురించీ కాదు. ప్రభుత్వ రికార్డుల గురించి.

నాగరికత పరిణామంలో లిఖితపదం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ముఖ్యంగా రాజశాసనాలూ, రాజ్యాంగాలూ ప్రభుత్వం యొక్క ఉనికికీ అధికారానికీ చిహ్నాలు గనక దాని ప్రకారం రాయబడిన ఏదైనా writing on the wall ఏం ఖర్మ, writings on the rock అయిపోయాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నదే నిజం. అది భౌతికంగా నిజం కాకపోయినా, సైద్ధాంతిక పరంగా మనం అంగీకరించకపోయినా, రికార్డులు మారేంతవరకూ అదే నిజం.

ఈ నేపధ్యంలో, దళిత క్రిస్టియన్లు రికార్డుల పరంగా హిందూ మతంలో ఉండటాన్ని ఏవిధంగా ఎవరు ఛాలెంజ్ చేస్తారు? అందుకే హిందుత్వ పార్టీలూ అధికారంలో ఉన్నప్పుడు చట్టాల్ని మార్చకుండా, ఇప్పుడు మతం మార్పిడి గురించీ, ‘దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లకు అర్హులు కారు’ అని మాట్లాడుతుంటే నాకు చిత్రంగా ఉంటుంది.

మతం అనేది నమ్మకానికి సంబంధించిన విషయం అనుకుంటే, క్రైస్తవాన్ని నమ్మినా సామాజిక పరిస్థితి మారని దళితులు తమ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనభవిస్తే జరిగే ఘోరమేమిటి? ఎందుకంటే, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు సామాజిక సమానత కోసం కల్పించబడినవేగానీ మతం ప్రాతిపదన కాదు కదా! క్రైస్తవానికి మారిన రెడ్డి, రెడ్డికులానికి సంబంధించకుండా పోనట్లే, దళితులు క్రైస్తవానికి మారినంత మాత్రానా దళితులు కాకుండా పోవాలంటే ఎట్లా?

ఏది ఏమైనా కూడికలూ తీసివేతలూ మనం చేస్తే అయ్యేవి కావు. రికార్డుల్లో ఉన్నదే సత్యం. క్రైస్తాన్ని అవలంభిస్తున్న దళితులు కూడా ప్రభుత్వ పరంగా హిందూ మతం వారే.

*****

Tuesday, April 21, 2009

త్రివేణి - గుల్జార్ నానోలు

రతన్ టాటా నానొ కార్ గురించి చెప్పినప్పటి నుండీ మన తెలుగు బ్లాగుల్లో చిట్టిపొట్టి కవితలు నానొల రూపంలో దర్శనమిస్తున్నాయి. వీటినే అక్కడక్కడా "హైకులు" గా వ్యవహరించినట్లు గుర్తు. ‘వాక్యాల్ని విరగదీసి,విడదీసి వరుసగా పేర్చేస్తే కవిత్వమౌతుందా?’ వంటి ప్రశ్నలే ఈ నానోలకూ పడ్డాయి. కొందరు వింతకవితా ప్రక్రియగా అభిమానిస్తే, మరికొందరు మరుగుజ్జు కవితలు అవసరమా అని ప్రశ్నించారు. మరొకరు ఏకంగా, "నానోల స్ఫూర్తితో నేను 'నోనో'లు కనిపెట్టా.. " అన్నారు.

ఈ నేపధ్యంలో You tube ప్రయాణం చేస్తుటే ప్రముఖ హిందీ కవి,రచయిత, దర్శకుడు ‘గుల్జార్’ గారి కవితా ప్రయోగాన్ని చూశాను. మూడు పాదాలుండే ఈ బుల్లి కవితల్ని ఈయన "త్రివేణి" అని ముద్దుగా పిలుచుకున్నారు. ఈ పేరు వెనుకా మర్మముంది. అది తరువాత. ఈ బుల్లి కవితలోని ప్రత్యేకతేమిటంటే మొదటి రెండు పాదాలు ఒక పరిపూర్ణమైన ఆలోచనను ఆవిష్కరించేస్తాయి. ఆలోచన పూర్తయిందనుకున్న తరుణంలో, అప్పటిదాకా కనిపించని మూడో పాదం గబుక్కున వచ్చేస్తుంది. వస్తూవస్తూ, మొదటి రెండు పాదాల అర్థాన్ని సమూలంగా మార్చెయ్యడమో, ఉదాత్తతను వ్యంగ్యంగా కూల్చెయ్యడమో లేక రెండుపదాలకూ మరింత భావాన్ని తెచ్చేదిగానో తయారవుతుంది.

ఇక దీనికి "త్రివేణి" అని పేరుపెట్టడానికిగల కారణాల్ని గుల్జార్ చాలా అర్థవంతంగా చెబుతారు. అలహాబాద్ లో గంగా-యమునల సంగమం జరుగుతుంది. కలిసేది రెండునదులే అయినా, కనిపించని సరస్వతీ నదితో కలిపితేగానీ త్రివేణీ సంగమం అవదు. అందుకే అర్థాల్ని మూడోపాదం మార్చే చిట్టిపొట్టి కవితలకు గుల్జార్ త్రివేణి అని పేరు పెట్టుకున్నారు.

గుల్జార్ చెప్పిన కొన్ని త్రివేణిలకు నేను తెలుగు స్వేఛ్ఛానువాదం అందిస్తూ ఆ యూట్యూభ్ వీడియో కూడా పెడుతున్నాను. చూడండి. వినండి. ఆనందించండి.

1. उड के जाती हुयी पंछी ने बस इतना ही दॆखा
दॆर से हाथ हिलाती हुयी ऒ शाख फिजा मे
...अल विदा कहनॆ कॊ या पास बुलाने कॊ !?!

ఏగిరేపావురానికి ఇంతే కనిపించింది
దూరంగా చిటారుకొమ్మ చెయ్యూపిన వైనం
...వీడ్కోలు పలికేందుకో, రమ్మనిపిలిచేందుకో తెలియరాలేదు

2. सब पर आती है सब कि बारी सॆ
मौत मुन्सिब है कमुमॆष नही
...जिन्दजी सब पर क्यू नही आती ?

అందరికీ వస్తుంది, అనుకున్న సమయానికి వస్తుంది
మృత్యువు తప్పదు, అదీ వస్తుంది
...కానీ జీవితం అందరికీ రాదెందుకో?


4. आप के खातिर आजर हम लूट भी लॆ आस्मा
क्या मिलॆगा चंद चम्कीलॆ शीशॆ तॊड कर?
...चांद चुब जायॆग तो उंग्ली से खून आजायेग !

నీకోసం చుక్కలూ చంద్రుడ్ని తెచ్చినా
గాజుపెంకులు తప్ప దక్కేది ఏముంది?
చందమామ మొనతగిలితే నీ వేలికి రక్తమొస్తుందేమో!

5. तमाम सफॆ किताबॊं के फड्फडा नॆ लगॆ
हवा धकॆल कर दर्वाजा आगई घर मॆ
...हभी हवाकि तरह तुम भी आजाया करॊ !

పుస్తకాల పేజీలన్నీ రెపరెపలాడాయి
గాలి తలుపును తోసుకుని విసురుగా వచ్చింది
...అప్పుడప్పుడూ నువ్వుకూడా అలావస్తే, నీ సొమ్మేంపోయింది!


Monday, April 20, 2009

తెలుగు బ్లాగులు - ఇంగ్లీషు బ్లాగులు

ఈ మధ్య కాలంలో తెలుగు బ్లాగుల్లోని కల్లోలాలు, అపోహలూ,ఈర్షాద్వేషాల మధ్యన శరత్, భాస్కర రామిరెడ్డి ఇంగ్లీషు బ్లాగుల ప్రస్తావన తెస్తూ, తెలుగు బ్లాగులతో కొంత తులనాత్మక వివరణ ఇచ్చారు. దీనితోపాటూ "అజ్ఞాత"లు ఎందుకు తయారవుతారో అన్న analysis కూడా చేశారు. ఈ నేపధ్యంలో కొంత నా "నస".

ఇంగ్లీషు బ్లాగులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అదొక మహాసముద్రం. కాబట్టి, అందరూ అన్ని బ్లాగులూ చదవడం పక్కనబెడితే కనీసం చూడటం కూడా కుదరని పని. తమ అభిరుచికి తగ్గ బ్లాగుల్ని ఎంచుకునో లేక తమకు అవసరమైన సమాచారం లభించే బ్లాగుల లింకుల్ని అట్టిపెట్టుకుని అప్పుడప్పుడూ చూస్తారేతప్ప, విస్తృతమైన engagement కు ఆస్కారం తక్కువ. ఇక వ్యక్తిగత interaction కు అవకాశం బహుతక్కువ. ఆంగ్లంలో ‘బ్లాగ్ అడ్డా’,వర్డ్ ప్రెస్ అగ్రిగేటర్’ లాంటి అగ్రిగేటర్లు ఉన్నా, వాటి ప్రాచుర్యం ప్రాధాన్యం బహుస్వల్పం. కానీ తెలుగు బ్లాగుల్లో అలాకాదు. ఉన్నవి కొన్ని బ్లాగులవ్వడంతో అగ్రిగేటర్ల ప్రాధాన్యత హెచ్చు. వ్యక్తిగత పరిచయాలకూ ఆస్కారం మెండు. ఈ రెండూ ఒక స్థాయిలో సమస్యాత్మకమే! మరీ ముఖ్యంగా మన తెలుగు సంస్కృతిలో.

విషయవైవిధ్యం లో ఇంగ్లీషు బ్లాగుల్లో ఉన్న తరహా తెలుగుకి రాదు, రాలేదు కూడా. కారణం, ఇంగ్లీషు ఒక సంస్కృతికి చెందిన భాష కాకపోవడం. ఇంగ్లీషు కేవలం కొన్ని భావజాలాలకు సంబంధించిన భాషగా మిగలకపోవడం. దాని విస్తృతికూడా అపారం. అందుకే ఆ వైవిధ్యం సంభవం. మన తెలుగువాళ్ళు ఆముదాలవలసలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, చివరకు అంటార్కిటికాలో ఉన్నా మన మార్కు మనదే. మన భావాలూ,అపోహలూ,ఆభిజాత్యాలూ,అహంకారాలూ అస్సలు మారవు. మనది ఎలాగూ closed culture కాబట్టి, విషయవస్తువు సృజనలోనూ అంగీకారాత్మకత పేరుతో నియమాలూ,పరిధులూ తయారవుతాయి. ఇప్పుడు, ‘బ్లాగులు ఇలాగే రాయాలి’ అనే నియమావళికూడా కొందరు రూపొందించే "పవిత్ర"కార్యం చేబట్టబూనుతున్నారు కూడాను. అలాంటప్పుడు మనం బావిలో కప్పలుగా కాక, మహాసముద్రంలో ఈదే గజ ఈతగాళ్ళంగా ఎలా మారేది? అది కుదరని పని.

బ్లాగింగ్ అనేది వ్యక్తిగత అభివ్యక్తి అయినప్పుడు, ప్రతివ్యక్తికీ తగ్గ వైవిధ్యం బ్లాగుల్లో కనిపించాలి. కానీ, అది తెలుగు బ్లాగుల్లో కనిపించడం అసంభవం. కవితల బ్లాగుల్ని వదిలేస్తే, సాధారణ విషయాలమీద రాసే వాటిల్లో వైవిధ్యం తక్కువే. కారణం సాంస్కృతికంగా, సామాజికంగా,రాజకీయం మనకు చాలా నిర్ధిష్టమైన మూసలున్నాయి. ఈ మూసల్లోంచీ మనం ప్రతి ప్రాపంచిక విషయాన్నీ బేరీజుచేసి, అనుభవిస్తాం. అదే అనుభవాల్ని బ్లాగుల్లో గుప్పిస్తాం. కాబట్టి ఇక్కడ కూడా "గ్రూపులు కట్టడం" లేదా వీళ్ళందరూ ఒక గ్రూపని ఇతరులు అనుకోవడం అత్యంత సహజం. ఎవరైనా కాస్త వ్యక్తిత్వంతో రాస్తున్నాకూడా, ఏదో ఒక మిషతో వారిని ఏదో ఒక గ్రూపులో పడేస్తేగానీ మనకు అంగీకరించడానికో, విభేధించడానికో కుదరదు.సొంత భావాలతో ఎవరైనా కనిపిస్తే, మనకు అస్సలు నచ్చదు. వారిని ఏదో ఒక ఇజానికో, పార్టీకో లేక సామాజిక/కుల వర్గానికో అంటగట్టేసి "నిర్ణయించేస్తే"గానీ మన అహానికి తృప్తి ఉండదు. కాబట్టి, కాస్తో కూస్తో "తమదైన" రాతల్ని రాసేవారిని తరిమికొట్టేస్తాం. లేదా మనలో కలుపుకునో లేక వేరే గుంపులోకో కలిపేసి "జై" అనిపించేస్తాం. అలాంటప్పుడు వ్యక్తిత్వాలు ప్రతిఫలించేది ఎలా? ఇది మన సమాజ నిర్మాణం నుంచే వచ్చింది కాబట్టి ఇదీ పెద్దగా పట్టించుకోవలసిన విషయం కాదు. ఇక ఇంగ్లీషంటారా, ఇంగ్లీషులో రాసేవాళ్ళు ఎంతకైనా "బరితెగించొచ్చు". కారణం, నిర్ధిష్టమైన మూసలు లేకపోవడమే!

ఇక వ్యాఖ్యల గురించి. ఇంగ్లీషు బ్లాగుల్లోనూ తీవ్రస్థాయి వ్యాఖ్యలే కాదు, తిట్లు, బెదిరింపులూ, వ్యక్తిత్వహననాలూ సాధారణం. ఇక అనామక వ్యాఖ్యాతల బెడద ఎక్కడైనా ఉండేదే. బహుశా అది మానవనైజం అనుకుంటాను. మన తెలుగు బ్లాగులది "చిన్న ప్రపంచం" కాబట్టి తీవ్రత ఎక్కువ అనిపిస్తుంది. మన hypocritical సంస్కృతిలో చాలా చిన్న విషయాలుకూడా "సున్నితంగా" తయారయ్యి, ‘మా మనోభావాలు దెబ్బతిన్నా’యంటూ గెంతడం మనకు అవాటయ్యిందికాబట్టి, ఆ తీవ్రత కాస్తా ప్రకోపాన్ని తలపించే స్థాయిల్లో ఆవిష్కరింపబడుతున్నాయి. ఇవి మన మరుగుజ్జు అస్థిత్వానికి చిహ్నాలేతప్ప మరొకటి కాదు.

ఎవరు ఏమన్నా మనం బావిలో కప్పలమే. అదే మన అస్థిత్వం. దాన్ని మార్చాలంటే మందమైన తోలు కాదు కావలసింది, కొత్తను ఆహ్వానించగలిగే భావవైశాల్యం. మనకు అంగీకారాత్మకం కాకపోయినా, alternative ideology అవసరం అనే ఒక సృహ. వ్యక్తుల్ని వ్యక్తులుగా గౌరవించి,వారి భావాలకూ, ఆలోచనలకూ,అభిప్రాయాలకూ విలువనివ్వకపోయినా కనీసం సహించ గలిగే ఔన్నత్యం. ఇవి లేనంతరకూ, మన సంస్కృతిలో ఇవి రానంత వరకూ మనమింతే. కాబట్టి, let's be happy in our wells.

*****

Saturday, April 18, 2009

అనుభూతి లేని హేతువు...

అనుబంధాల అనుభూతుల్ని అవసరాలు నిర్ణయిస్తున్న తరుణంలో, హేతువు ఆధారంగా బంధాలను,అనుభూతుల్నీ,భావనల్ని నిర్వచిస్తే ! You are so rational, you will never understand my emotion" అనే అపవాదు మొయ్యాల్సొస్తుంది.

నిజంగా హేతువాదులకు నమ్మకాలతో,భావనలతో,అనుభూతులతో పనిలేదా? అంటే మాత్రం, "ఎందుకు లేదు,ఖచ్చితంగా ఉంది" అనే నా సమాధానం. మరి వాటికి అతీతంగా వీళ్ళెలా ప్రవర్తిస్తున్నట్లు ఎందుకు అనిపిస్తారా అంటే, దానికున్న సులువైన సమాధానం, భావలనపై వీరికున్న నియంత్రణ. అంటే, People who are more rational don't perceive emotions less, they just regulate it better అన్నమాట.

ఈ భావనల్ని నియంత్రించే రిమోట్ ఎక్కడుందా, అనేది ఇప్పుడు మనకు కావలసిన అత్యవసర సమాచారం. ఈ రిమోట్ కోసం నిజంగా మనం ఎక్కడో వెతకఖ్ఖరలేదు. అది మన మెదడ్లోనే ఉంది. మన మెదడులో ఉన్న prefrontal cortex అనే భాగం, మన అనుభూతులూ,భావనలతోపాటూ స్వీయచైతన్యం కలిగిన హేతువుని తోడుగా అందిస్తుందట. దీన్నే meta-cognition అంటారు. కానీ ఈ హేతువుని అందిపుచ్చుకోవాలంటే ఆ భావనల గురించి "ఆలోచించడం" అవసరం. ఉదాహరణకు మనకు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపానికి గల కారణాల్ని ఆలోచించడం ద్వారా ఆ స్వీయచైతన్య హేతువుని అందుకోగలమన్నమాట.

అర్థం కాలేదా? మొదట్లో నాకూ అర్థం కాలేదు. కోపం తెచ్చుకోకుండా ఆలోచించి చూడండి. అనుభూతికలిగిన హేతువు దొరుకుతుందేమో!

మొత్తానికి హేతువాదులకు అనుభూతులు లేవనే అపోహ శాస్త్రీయంగా తొలగించబడింది. ఇప్పుడనమనండి "You are so rational, you will never understand my emotion" సరైన సమాధానం చెబుతాను.

*****

Friday, April 17, 2009

బ్లాగు రచన సాహిత్యం ఎందుకు కాదు?

"Literature is not exhaustible, for the sufficient and simple reason that a single book is not. A book is not an isolated entity: it is a narration, an axis of innumerable narrations. One literature differs from another, either before or after it, not so much because of the text as for the manner in which it is read." -- Jorge Luis Borges


ఈ మధ్య ఒక బ్లాగులో జరిగిన చర్చల్లో, బ్లాగుల్లో రాసే రచనలు "సాహిత్యమా" కాదా? అనే ప్రశ్న ఉదయించింది. కొందరు ఘనాపాఠీలు యధావిధి, బ్లాగు రచనలు సాహిత్యం కాజాలవని కరాఖండి నిర్ణయించేసి, చేతులు దులిపేసుకున్నారు. మరొకరు, ‘అసలు బ్లాగు రాతల్ని సాహిత్యంతో పోల్చడమే, సారస్వతానికి జరిగిన అవమానం’గా భావించేశారు. రసస్పందన కలిగించేదేదైనా రచన అయినప్పుడు, ‘రసం’తో కూడిన బ్లాగు రచనలు మాత్రం సారస్వతం ఎందుకు కాదో నాకు అర్థం కాని విషయం. ఇక ‘హితం’ కలిగుంటేగానీ సాహిత్యం కాదనే వ్యాఖ్యానార్థం, ఛాందసవాద సిద్ధాంతంగా కనిపిస్తుందే తప్ప సాహిత్యానికి సరైన అర్థం అని చస్తే అనిపించదు. మరలాంటప్పుడు ఏ నిర్వచనాన్ని అనుసరించి బ్లాగు రాతల్ని రచనలు కావు, సాహిత్యం అసలు కాదు అని అంటున్నారయ్యా అనేది నా ధర్మసందేహం.

"లిఖితమైన లేదా గ్రంథస్థమైన భాగం సారస్వతంగా భావిస్తారు.శాస్త్రగ్రంథాలు, పంచాంగాలు,వార్తపత్రికలు, శాసనాలు ఇవి సారస్వతంగా చెప్పవచ్చు." "సహితస్యభావఃసాహిత్యం.హితేనసహితం సాహిత్యం. ధర్మ ప్రతిపాదనం చేసేది, ప్రీతిదాయకమైనది, ఉపదేశాత్మకమైనిది సాహిత్యం" అనే ‘ఒక పురాతన నిర్వచనాల్ని,ఆధునిక డిజిటల్ యుగంలోకూడా అన్వయించాలనుకునే కొందరు సాంప్రదాయవాదుల మనోవైకల్యాన్ని అంగీకరించాలా?' అన్నది మొదటగా కలిగిన శంక. కేవలం పత్రికల్లో, పుస్తకాల్లో అచ్చైతేనే సారస్వతమా! కంప్యూటర్ మీద అక్షరాల్లో కనిపిస్తే అది సారస్వతం కాకుండా పోతుందా? నీతులు వల్లించి, తియ్యటి కబుర్లు చెబుతేనే సాహిత్యమా! ప్రశ్నిస్తే, కటువుగా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తే సాహిత్యం కాకుండా పోతుందా? అని సవాలు చేస్తే, ఈ రెండు నిర్వచనాలూ "హుష్ కాకి" ఐపోవూ!!

నా అభిప్రాయంలో, మనసులోని అనుభూతిని, అభిప్రాయాలను,ఆలోచనలకు అక్షరరూప వ్యక్తీకరణ ఏదయినా సాహిత్యమే. ఆ సాహిత్యం మంచిదా, చెడ్డదా అన్నది వేరే విషయం. రచయిత కలం నుండి జాలువారిన ఈ అక్షరాలు చదువరుల మనసులో కలిగించే రసస్పందన ప్రాతిపదికన అది విప్లవ సాహిత్యమా, లలితసాహిత్యమా, జానపదమా లేక బూతుసాహిత్యమా అన్నది నిర్ధారితమవుతుంది. దేశ,కాల,మాన పరిస్థితులను బట్టి ఈ నిర్ధారణ మారుతుంది. అంతెందుకు, సినిమాపాటలు,మాటలు మాత్రం ఇప్పుడు సాహిత్యం అవలేదా! మరి బ్లాగులు ఇందుకు మినహాయింపవుతాయా?

రచయితలు ఎప్పుడూ సమాజానికి పనికిరావాలని(‘హితం’ ఉద్దేశంగా) రాయరు. “తన” భావనలు సమాజానికి పనికివస్తాయోమో! అన్న ఆలోచనతో రాస్తారు. అంటే, literature is essentially an individual expression. ఆ వ్యక్తీకరణల్ని సమాజం నెత్తికెత్తుకున్నప్పుడో లేక కొందరు బలవంతంగా సమాజం నెత్తిన ఎక్కించినప్పుడో అది “సాహిత్యం” గా గుర్తింపబడుతుంది. ఇలాంటి మూలస్థాయి వ్యక్తీకరణలకు పట్టుగొమ్మలు బ్లాగులు. మరి సారస్వతపరంగా బ్లాగులకు విలువలేదని ఎవరు నిర్ధారిస్తారు? ఒకరు నిర్ణయించే విలువల్ని మనం ఎందుకు అంగీకరించాలి?

ప్రచురింపబడినప్పుడు అందరిచేతా నిరసింపబడి, ఛీకొట్టబడి, కాలగమనంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన సాహితీకుసుమాలు మాత్రం ఎన్నిలేవని? విమర్శకుల నిర్ణయాలకు అతీతంగా, పాఠకులు సాహిత్యంగా నిలబెట్టిన రచనలు మాత్రం లేవా! ఏ రచన అయినా పండిత-పామరాభిమానాన్ని చూరగొన్నట్లయితే దానంతట అదే సాహిత్యమవుతుంది. ఈ విధంగా చూసినా, బ్లాగు రచనలు సాహిత్యమడానికి కొంత సమయం పడితే పట్టొచ్చేమోగానీ, ఆ అవకాశాన్నే కాలరాయాలనే ఆలోచన Elitist ఆభిజాత్యంకాక మరేమిటి?

బొల్లోజుబాబా బ్లాగుల్లో కవితలు రాస్తారుగనక వాటిని కవితలు కాదంటామా? తోటరాముడు ఒలికించే రసరమ్యహాస్యాన్ని సాహిత్యం కాదంటామా? చావాకిరణ్ రాసిన కథల్నీ, నవలనీ సారస్వతం కాదని పక్కనపెడతామా? గార్లపాటి ప్రవీణ్ రాసిన ట్రావెలాగుల్ని, సాహిత్యంకాదని అపహాస్యం పాలవుదామా? పప్పు నాగరాజు గారి వ్యాసాల్ని సాహిత్యం కాదని మూర్ఖత్వాన్ని మూటగట్టుకుందామా? ఇలా ఎందరో కవులు, కథకులు, వ్యాసకర్తలు, రచయితలూ బ్లాగులోకాన వెల్లివిరుస్తున్నారు. వీరిలో ఉన్న తక్కువేమిటి, ముద్రిత రచనల సాహిత్యంలోని ఎక్కువేమిటి?

ప్రపంచ సాహిత్యంలో కూడా, mainstream literature కు ధీటుగా సృజింపబడిన subaltern literature ని కనుక్కుని మరీ కలుపుకుంటున్న తరుణంలో,అస్థిత్వవాద సాహిత్యాల్నీ, బ్లాగు రచనల్నీ చిన్నచూపుచూసే తెలుగు సాహితీ ప్రేమికుల ఛాంధసాన్ని చూసి నవ్వుకోవాలే లేక వారి భావసంకుచితత్వాన్ని చూసి జాలి పడాలో అర్థం కాని పరిస్థితి. సారస్వత కళ వ్యక్తిభావనలు,ఆలోచనలూ,అభిప్రాయాలను సృజనాత్మకంగా వెల్లడించుకోవడానికి కాకపోతే. మడిచి అటకమీద పెట్టుకోవడానికా?

నాకోసం నేను రాసుకుంటాను. నాకు విలువైనవి అనిపించిన భావాలను అక్షరబద్ధం చేసుకుంటాను. అనే స్పూర్తి బ్లాగులకి సొంతం ఈ ప్రక్రియలో, ఆలోచనల్ని ఆస్వాదించే వారు, అభిప్రాయాలతో అన్యోన్యక్రియ సల్పేవారు, స్పందనలకు రసస్పందన పొందేవారు పాఠకులుగా ఖచ్చితంగా లభిస్తారు. Writings will find its readers, they will find the author. అందుకే, బ్లాగుల్లోని DIGITAL LITERATURE నిర్వచనాన్ని, ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని వారికి బ్లాగు రచనలు సాహిత్యం కాదు. కానీ, నేను మాత్రం "ఎందుకు కాకూడదు" అని ప్రశ్నిస్తూనే ఉంటాను.
****

బూతు చిత్రాలు -మరో సమాంతర సినిమా!

ఈ వ్యాసం మొదటగా నవతరంగంలో ప్రచురింపబడింది.

‘షకీల’ పేరు తెలియని తెలుగు,తమిళ,మళయాళ,కన్నడ,హిందీ ప్రేక్షకుడు ఉండడు. నిజానికి ఈ నాయిక సినిమాలు మళయాళ సినీ రంగంలోని పెద్దపెద్ద హీరోల సినిమాల ఆదాయాన్ని దెబ్బతీస్తుండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రాలని ‘బ్యాన్’ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆర్థికంగా,సామాజికంగా,సాంస్కృతికంగా ఈ B-C గ్రేడ్ సినిమా అనబడే, బూతుచిత్రాల పరిధేమిటో తెలిజెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అనుకోవాలి. మన ఆంద్రప్రదేశ్ లోని ప్రతి పట్టణంలో కనీసం ఒకటో రెండో ధియేటర్లు ఇలాంటి చిత్రాలకోసం కేటాయింపబడి ఉండటం, ఈ బూతు చిత్రాల పరిశ్రమ సమాంతర ఉనికికి ఒక చిహ్నం మాత్రమే. ఇంత సర్వవ్యాప్తమైన ఈ చిత్రాల గురించి కూలంకషమైన ఆర్థిక ,సాంస్కృతిక,సామాజిక అధ్యయనాలు జరిగిన ఆధారాలు కనపడవు. భారతీయ సినిమా,సమానాంతర సినిమా,ప్రపంచసినిమా, కమర్షియల్ సినిమాల అధ్యయనంతోపాటూ, Film is a social practice అని నమ్మేవాళ్ళు ఈ సినిమాలు ఎలా ఒక parallel culture గా మన సమాజంలో ఏర్పడి దినదినాభివృద్ధి చెందాయో కనీసం గమనించడం అవసరమని నా నమ్మకం.

సినిమా పుట్టుకతోనే ఈ బూతు చిత్రాల ఆరంభం జరిగిపోయి ఉంటుందని చెప్పడానికి ఆధారాలు లేకపోయినా, అప్పటివరకూ ‘ఫోటోలలో’ఉన్న బూతు, ‘ఫిలిం’ మీదికెక్కకుండా ఉండిఉంటుందా? అని ప్రశ్నించికుంటే మనకు సమాధానం చాలా సులువుగా దొరికిపోవచ్చు. ముడిఫిలిం మీద ప్రభుత్వ ఆధిపత్యం చలాయించబడిన నలుపు-తెలుపు కాలంలోకూడా భారతదేశంలో ఈ చిత్రాలు నిర్మించబడ్డాయని కొన్ని ఇంటర్నెట్లో లభించే క్లిప్పులనిబట్టి తెలుస్తుంది. కాకపోతే తెలుగులో ఈ చిత్రాల నిర్మాణం గురించి చాలా సందేహాలున్నా, ప్రదర్శన,మార్కెట్ విషయంలో మనమెప్పుడూ ముందున్నామన్న విషయం ప్రతి చిన్న పట్టణంలోనూ ఈ చిత్రాల ప్రదర్శనకై కేటాయించబడిన ధియేటర్ల సంఖ్యనిబట్టి చెప్పొచ్చు.

బూతు సినిమాలు ఒక నిర్వచనం: ఆంగ్లంలో pornography అనే పదానికి “all explicit material intended to arouse the reader,viewer or a listener” అనే అర్థముంది. కాకపోతే ఇందులో “explicit” యొక్క అర్థం ప్రతి దేశానికీ,భాషకూ సంస్కృతికీ మారుతూ ఉండటం, దానితోపాటూ భారతదేశంలోని చట్టబద్దమైన కొన్ని మార్పులకు అనుగుణంగా ఈ నిర్వచనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను “నీలి చిత్రాలు” (blue films) అనకుండా “పెద్దలకు మాత్రమే చిత్రాలు” (adults only films) అని పిలవాలి. ఎందుకంటే, ఇవి 1952 నాటి భారతీయ సినెమాటోగ్రఫీ చట్టానికి లోబడి తమ పరిధుల్ని నిర్వచించుకున్నాయి. వ్యవహారికంగా “బూతు చిత్రాలు” అని చెప్పినా చట్టప్రకారం ఇవి “పెద్దలకు మాత్రమే” చిత్రాలన్నమాట.

తెలుగు బూతు చిత్రాలు: తెలుగు భాషలో ఈ చిత్రాల నిర్మాణం విరివిగా జరిగిన దాఖలాలు చాలా తక్కువ. ముఖ్యంగా మళయాళ పరిశ్రమ నిర్మించిన చిత్రాను అనువాద (డబ్బింగ్) రూపంగా తెలుగు ప్రేక్షకులమధ్యకు తీసుకువచ్చిన సినిమాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ట్రెండ్ కు రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి మళయాలంలో ఫిలిం సెన్సారు చాలా ‘పెద్ద మనసుతో వ్యవహరించడం’. రెండవది, ఒకసారి ఈ మళయాల చిత్రాలను వారి సెన్సారు బోర్డు క్లియర్ చేసిన తరువాత తెలుగు సెన్సారు వారు అక్కడక్కడా ఆడియోతప్ప వీడియో కట్ చేసే అధికారం లేకపోవడం. ఈ లొసుగుల్ని కనిపెట్టి, పెద్ద స్థాయిలో బూతి సినిమాల నిర్మాణం జరిగిన 80 వ దశకంలో చాలా వరకూ చిత్రాల నిర్మాతలు తెలుగువారేనని ఒక అనుమానం. అది నిజం కాకపోయినా, మార్కెట్ మరియూ డిస్తిబ్యూషన్ను దృష్టిలో ఉంచుకుంటే ఈ అనుమానం అబద్దమనిమాత్రం ఖచ్చితంగా చెప్పలేము.

బూతు చిత్రాలు వాటి విభజన: మొత్తం బూతు సినిమాల్ని మూడు కేటగరీలలో విభజించొచ్చు. మొదటిది హర్రర్ ఆధారిత బూతు సినిమాలు, రెండవది సెక్స్ ఎడ్యుకేషన్ పేరిట నిర్మితమయ్యే బూతు సినిమాలు మరియూ మూడోది కేవలం టీన్ సెక్స్ లేక అక్రమసంబంధాల మీద తీసిన సినిమాలు. హర్రర్ సినిమాలకూ వాటి భయంకలిగించే విషయం దృష్ట్యా ఎలాగూ A (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇస్తారుగనక, కొంత అంగప్రదర్శన కలిపితే మరింత మంది ప్రేక్షకులు వస్తారన్న ఉద్దేశం ఈ నిర్మాతలలో కనిపిస్తుంది. లేదూ, కేవలం హార్రర్ ముసుగులో బూతు సినిమాల నిర్మాణమే ఉద్దశంగా కూడా ఉండొచ్చు. AIDS వ్యాధి భారతదేశంలో ప్రబలిన తరువాత సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో తియ్యబడే సినిమాలు ఈ కోవకే వస్తాయి. ఇక మూడవ కేటగిరీ సినిమాల ఉద్దేశం పైన చెప్పిన నిర్వచనానికి దగ్గరగా titillation and arousal తప్ప మరోటికాదు. నిజంగా చెప్పాలంటే అవి ఈ కోవలో వచ్చే సిన్సియర్ చిత్రాలన్నమాట.

బూతుచిత్రాలు -మార్కెట్ : నీలిచిత్రాల నిర్మాణం మరియూ వితరణ భారతదేశంలో చట్టపరంగా నేరం. కాకపోతే ఈ sex starved nation లో ఈ చిత్రాల మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లుంటుందని అంచనా. ఇక కేవలం ఈ బూతుచిత్రాల ఆదాయం మాత్రమే తెలుగు,తమిళ్ మరియూ హిందీ చిత్రాల ఆదాయాన్ని మినహాయిస్తే మిగతా భాషా చిత్రాలన్నింటిని కలిపితే వచ్చే ఆదాయం ఈ చిత్రాల ఆదాయానికి సమానంగా ఉంటుందని, ఏ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సూ చెప్పని అంకెలు.

వీటిల్లోకూడా స్టార్ సిస్టమ్, రిలీజ్ గొడవలూ,సరైన ధియేటర్ల కోసం ఎదురుచూపులూ లాంటి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలలో ఉన్న సమస్యలన్నీ ఉన్నాయి. అంటే నిజంగానే ఒక సమానాంతర సినిమా ప్రరిశ్రమ నడుస్తోందనడం సత్యదూరం కాదు.

ఇంటర్నెట్, శాటిలైట్ టేలివిజన్ మరియూ CD- DVD సంస్కృతులు బూతు ప్రపంచాన్ని ఏలుతున్నా, ఈ చిత్రాల నిర్మాణం మరియూ ప్రదర్శనా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. అంటే, ఏదోఒక “సామాజిక ప్రయోజనం” ఈ సినిమాలవల్ల కలుగుతోంది అనడం త్రోసిపుచ్చలేనిది. ఎలాంటివారు ఈ సినిమా చూస్తారు? ఈ సినిమా చూడటంవలన వారు పొందే gratification ఏమిటి? ఈ సినిమాల penetration వల్ల మన సమాజానికి గల లాభనష్టాలేమిటి? అనేవి బహుశా “communication and culture” లేక “cinema as a social practice” అనే విషయపరిధిలోని పరిశోధనకు పనికొచ్చే విషయాలయి ఉంటాయి. కానీ ఇప్పటి వరకూ ఇలాంటి పరిశోధనలు జరగకపోవడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగింపజేసే విషయం.

****

Wednesday, April 15, 2009

Passion కు తెలుగు పదం ఏమిటి?

ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ బ్లాగులో "Passion and Attachment" గురించి ఒక చిన్న వ్యాఖ్యానం చదివాను. "Passion belongs to the moment and Attachment is addicted to the past or the future. Attachment is desire while Passion is pure acceptance. Desire brings with it the fear of non achievement, but Passion has no fear." అని తను నిర్వచించిన తీరుకి అబ్బురపడి హఠాత్తుగా ఈ ఆలోచనల్ని తెలుగులో రాసిపెట్టుకుందామని ప్రయత్నించాను.

సమస్య ఇక్కడే మొదలయ్యింది. Attachment అనే పదానికి "బంధం" అనే తెలుగు పదం సరిపోయిందిగానీ, passion కోసం పదాన్ని వెతికితే, మోహం - కామం- వెర్రికోపం - ఆవేశం- తీవ్రోత్సాహం-ఉద్రేకం వంటి నెగిటివ్ షేడ్ ఉన్న పదాలేతప్ప ఆ ఆంగ్లపదానికి సమాంతరమైన భావోద్వేగం పలికే పదం దొరకలేదు. అప్పుడనిపించింది, మన తెలుగు భాష ఎంత value judgment కలిగిన భాషో! అని.


మనం "నిర్ణయించి" విలువలు అర్జంటుగా ఆపాదించే చరిత్రకలిగిన మనుషులం. అందుకే, మనకు అన్ని విషయాల్లోనూ ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి. ‘అవును’, ‘కాదు’ అనే పదాలేతప్ప ఇంగ్లీషోడు non-committed తరహాలో వాడే may be,might be, possibly, probably, most likely, most probably వంటి సమానార్థాలు చచ్చినా దొరకవు.ఎంతైనా మనం ప్రతివిషయాన్నీ సాధికారంగా చెప్పే స్వభావం కలిగినవారము కదా! ఒక టపాలో సమాధానమిస్తూ మిత్రుడు "తెలుగులో passive sentences ఉండవు" అని జ్ఞానోదయం కలిగించారు. నిజమే!!! చంద్రమండలానికి సంబంధించిన విషయాన్నైనా ఖచ్చితమైన ష్యూరిటీతో చెప్పగలిగే భాషలో passive-నిష్క్రియ వాక్యాలెందుకుంటాయ్?

మళ్ళీ మనం PASSION దగ్గరికొద్దాం. బహుశా మన సంస్కృతిలో రాధా, మీరాబాయి ల తరువాత తాదాత్మ్యకమైన unconditional ప్రేమ చూపించినవారు లేరేమో. దాన్ని కూడా భక్తిపారవశ్యం చేసేసి మనవాళ్ళు, ‘భగవంతునికీ-భక్తునికీ ఆనుసంధానమైన’ అనే అగరబత్తీ విజ్ఞాపనలాగా ఈ అచంచల,అవాజ్యమైన ప్రేమనుకూడా ఒక "బంధం" గా మార్చేసాము. అందుకే passion అనే పదానికి సమానార్థకం దొరకలేదనుకుంటాను.

అనుబంధాల్ని బంధాలుగా define చెయ్యకపోతే అది మనకొక బూతు. ఇక అవాజ్యమైన, అచంచలమైన, అమూల్యమైన ప్రేమ కనిపిస్తే గుండెల్లో దడ. అబ్బా ఈ ప్రేమ ఎలా కలుగుతుంది? పెళ్ళో గిళ్ళో లేకపోతేనూ!?! అని మహాసందేహం. కాబట్టి, ఆ ప్రేమకొక బ్రాండ్ తగిలించి బంధంగా నిర్ణయిస్తేగానీ కక్ష తీరదు. మరి బంధాలతో సంబంధం లేని passionate love మన సమాజంలో లేదు కాబట్టి నాకు పదం దొరకలేదా లేకపోతే నేను చూసిన డిక్షనరీ తప్పా అనేది పాఠకులే చెప్పాలి. పనిలోపని శేఖర్ కపూర్ చెప్పిన వాక్యానికి తెలుగు అనువాదం ఎవరైనా చెయ్యగలిగితే...మహాభాగ్యం.


****

Monday, April 13, 2009

‘బలమైన’ ప్రధాని

ఈ మధ్య మన్మోహన్ సింగ్ ని ‘బలహీనమైన ప్రధాని’ అని మాటిమాటికీ చెప్పి, కాబోయే ప్రధానమంత్రి ఆశలున్న ఎల్.కె.అద్వానీ తన బలాన్ని చాటుకుంటున్నారు. పరిపాలనా పరమైన వైఫల్యాలనూ, విధానపరమైన లోపాలనూ ఎండగట్టాల్సిన ప్రతిపక్షనేత, నోరులేదు కదా అనే ధైర్యంతో మన్మోహన్ మీద వ్యక్తిగత దాడికి దిగడం దిగజారినతనాన్ని సూచిస్తే, "అజాతశతృవే అలిగిననాడు" అన్న ఛందంలో మన్మోహన్ నవ్వుతూ చెరిగిన నిప్పులతో ఎల్.కె.అద్వానీ పని నిప్పుతొక్కిన కోతి లాగా తయారయ్యింది. ఇంతకీ తేలనిదేమిటయ్యా అంటే, ఎల్.కె.అద్వానీ దగ్గరున్న బలం. మన్మోహన్ సింగ్ బలహీనత.

ప్రధానమంత్రికన్నా బలమైన శక్తికేంద్రం సోనియా గాంధీ కాబట్టి మన్మోహన్ బలహీనమైన ప్రధాని అని ఎల్.కె.అద్వానీ వాదన. ఇంతకన్నా హాస్యాస్పదమైన వాదన మరొకటి లేదని నా వాదన. ఎందుకంటే, సంకీర్ణప్రభుత్వాలు మొదలైనప్పటి నుంచీ "బలమైన" ప్రధాని ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది మన్మోహన్ సింగ్ అనే చెప్పుకోవాలి కాబట్టి. 1984-89 లో రాజీవ్ గాంధీ తరువాత పార్టీ మరియూ ప్రభుత్వంపై పట్టున్న ప్రధానమంత్రి ఒక్కరూ లేరు. చంద్రశేఖర్, వీ.పీ.సింగ్, దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్ ఎవరూ తమదైన శైలి ప్రధానమంత్రిత్వం నెరిపినవారు కాదు. మద్ధతుగా ఉన్న పార్టీల కనుసన్నల్లోనో లేక సొంత పార్టీలోనే వారితో సమానమైన బలమున్న నాయకుడు లేక నాయకులతో ఎప్పుడూ భయపడుతూ, సర్దుకుపోతూ కాలం వెళ్ళదీసినవాళ్ళే. వీళ్ళలో కొందరు ఆపద్ధర్మ ప్రధానమంత్రులుకూడా ఉన్నారు మరి.

సరే! వీళ్ళందరూ బీజేపీయేతర ప్రధానులు అనుకుందాం. మరి బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ లోని ప్రధానికున్న బలమేమిటో చూద్ధాం. పదమూడు నెలల (1998-99) మొదటి బీజేపీ పాలనలో, పరిపాలన పక్కనబెట్టి సమయం మొత్తం జయలలిత మద్ధతు లేఖకోసం తన గుమ్మం దగ్గర పడిగాపులు పడటంతోనే సరిపోయింది. ఆర్.ఎస్.ఎస్. తన అంగబలంతో జస్వంత్ సింగుని ఆర్ధికమంత్రి కాకుండా అడ్డుకుంది. ఇక పక్కలోబల్లెంలాగా డిప్యూటీ ప్రధానమంత్రిగా ఎల్.కె.అద్వానీ వెలగబెట్టిన "బలం" ముందు పాపం అటల్ బిహారీ వాజ్పేయి కాస్తా, ‘అటక్ (చిక్కుకున్న) బిహారీ’ గా మిగిలారు.

రెండో సారి అధికారంలోకి వచ్చాక వాజ్పేయికి పట్టించిన స్థితి ఏ ప్రధానికీ కలలోకూడా కలక్కూడదు. పరిపాలనా సౌలభ్యం కోసం సాధారణంగా ఉన్నతాధికారులపై అధికారం ప్రధానమంత్రికి ఉండాలి. అందుకే Department of Personnel and Training ఎప్పుడూ ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది.కానీ, NDA ప్రభుత్వంలో ఉపప్రధానిగా ఉన్న అద్వానీగారు ఈ డిపార్టుమెంటుని హోంశాఖతో పాటూ "స్వాహా" అనిపించి ప్రధానిని బలహీనపరిచారు. అంతేకాక, CBI నికూడా ‘గుటకాయాస్వాహా’ అనబోతే తనపైనున్న కేసులు ఆపాయిగానీ, లేకపోతేనా...! ఒకవైపు భవిష్యత్తు నేనే అనే ఉపప్రధాని, మరోవైపు హిందుత్వను పక్కనబెట్టారంటూ RSS శ్రేణుల గొడవ, సంకీర్ణభాగస్వాముల లుకలుకలూ ఇన్నిటి మధ్య "వీక్ పీఎం" ఎవరో బహిరంగ రహస్యం. ఇక ఆ బలహీనతలకు కొంతవరకూ కారణమైన ఎల్.కె.అద్వానీ ఖచ్చితంగా "బలవంతుడే" మరి. ఇక గుజరాత్ అల్లర్లను నిరసించిన వాజ్పేయిని బహిరంగంగా ధూషించిన RSS, తరువాత కాంధహార్ విషయం తనకేమీ తెలీదని,, జిన్నాను సెక్యులర్ అని తనపార్టీలోనే బలం నిరూపించుకుని ఎల్.కె.అద్వానీ చాలా శక్తిమంతుడిగా మనముందు నిలిచారు. ప్రభుత్వాన్నీ, పరిపాలననూ, సంకీర్ణ భాగస్వాములనూ, పార్టీని, పార్టీకి సంబంధం లేని సైద్ధాంతిక మూలాల్నీ, పక్కలోబల్లాన్నీ పెట్టుకుని సాగించిన బీజేపీ ప్రధానికంటే మన్మోహన్ శక్తిహీనుడా అనేది అసలు ప్రశ్న.

శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, వామపక్షాల వంటి సంకీర్ణ భాగస్వాములను ప్రధానిని పరిపాలనకు ఇబ్బంది పెట్టకుండా అడ్డుకుంది సోనియా గాంధీ. సొంత పార్టీలోని దిగ్గజాలైన ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్, ఏ.కే.ఆంధొనీ, శివరాజ్ పాటిల్ వంటి వారిని ప్రధానమంత్రి అధికారాల హననంగావించకుండా కాచుకుంది సోనియాగాంధీ. ప్రధానమంత్రి ఆనారోగ్యస్థితిలోకూడా పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి ఒడిదుడుకులూ రాకుండా ప్రణబ్, ఆంధొనీ మధ్య అధికారాల పంపకం జరిగేలా చూసి, ప్రధానమంత్రి అధికారాలకు ఢోకా రాకుండా చూసుకుంది. పార్టీని, సంకీర్ణభాగస్వాములతో తను తలపడుతూ, పరిపాలనను పూర్తిగా ప్రధానిపరం చేసింది. ఇంతకంటే పరిపాలనా పరంగా బలమైన ప్రధానిని ఈ మధ్యకాలంలో భారతదేశం నిజంగా చూసిందంటారా?

సోనియాగాంధీ RSS లాగా రాజ్యాంగేతర శక్తికాదు, అధికారపార్టీకి అధ్యక్షురాలు, సంకీర్ణభాగస్వాముల మధ్యన సంధానకర్త అయిన UPA చైర్మెన్. తను చేసే పనులు తాను చేస్తూనే, ప్రధానమంత్రిని పరిపాలనా పరంగా పరమశక్తివంతుడ్ని చేసింది. "శక్తివంతంగా ఉండటం అంటే గట్టిగా అరవడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండటం" అని మన్మోహన్ సింగ్ ఇప్పుడు అంటుంటే, ఉక్కుమనషి ఎల్.కె.అద్వానీ ఏమంటారో చూడాలి!

****

Sunday, April 12, 2009

సాంప్రదాయ రచన - వ్యక్తిగత అభివ్యక్తి

ఒక వెబ్ పత్రిక సంపాదకుడితో వారి వెబ్ పత్రిక నాకెందుకు వైవిధ్యతున్న పత్రిక అనిపించదో చెబుతుంటే, "అవును, మాది కొంత సాంప్రదాయక పత్రిక లెండి" అనే సమాధానం వచ్చింది.అప్పుడు ఉదయించింది నాకొక ప్రశ్న. అసలు, సాంప్రదాయక సాహిత్యం అంటే ఏమిటి? అని.

చుట్టూచూస్తే కవిత్వంలో,కథల్లో,నవలల్లో చనిపోయిన వ్యక్తులో లేక "గొప్పోళ్ళని" (ఎవరో)నిర్ణయించేసిన వ్యక్తులో రాసిన మూసలో రాసేస్తే అది సాంప్రదాయక సాహిత్యంగా పరిగణింపబడుతోందేమో అనిపించింది. ఇక్కడ సమస్యేమిటంటే, సాంప్రదాయక రచయితలుగా ప్రస్తుతం కీర్తించబడుతున్న అందరూ, వారి కాలంలోని "సాంప్రదాయకత"కు వ్యతిరేకంగా కలం ఝుళిపించినవారే. ఇతివృత్తాలూ, శైలి,శిల్పం అన్నింటిలో "ప్రయోగాలు" జరిపినవారే. ఒకస్థాయిలో విప్లవాత్మక ధోరణి ప్రదర్శించినవారే. కానీ ఇప్పుడు వారిని కన్వీనియంట్ గా "మావాళ్ళే" అనేసుకుని, "క్లాసిసిజం" అంటగట్టి, మూసలో పోసి, అదే మూసలో అందరూ రాయండహో! అని చాటింపు వేసేస్తున్నారు.

ఉదాహరణకు కొడవటిగంటి కుటుంబరావు గారిని తీసుకుందాం. ప్రస్తుతం ఈయన్ను తమలో కలుపుకోని సాహితీసదస్సు లేదు, సాహితీప్రియులు లేరు,సాహితీవిమర్శకులూ లేరు. కానీ, ఒకప్పుడు!!! ఇక్కడే ఉంది తిరకాసు. ఇక చలం సంగతి చెప్పనఖ్ఖరలేదు. అప్పుడూ, ఇప్పుడూ ఈయన రాసిన రాతలకు ఎవరో ఒకరు చంపేద్ధామని తయారు. కానీ, తన రచనల timelessness, ఈయన్నూ పాపం "great traditional writer" ని చేసి కూర్చోబెట్టింది. తమని పక్కనబెట్టి సొంత సాహిత్యాన్ని నిర్మించిన మహాశిల్పుల్ని తమలో అర్జంటుగా కలుపుకునో, లేక తాము నాశనం చెయ్యలేని బలమైన సాహిత్యానికి సాంప్రదాయమనే రంగునద్దో ఈ ‘సాహితీమాఫియా ప్రియులు’ వైవిధ్యాన్ని మూసల్లోపోసి సాంప్రదాయం లేబిల్ తగిలించేసి చప్పట్లు కొట్టేస్తున్నారు.

ఈ పద్ధతి తెలుగు సాహిత్యంలో ఆభిజాత్య ధోరణిని , కొత్త ఒరవడికి విఘాతాన్నీ తయారు చేసింది. తెలుగు సాహిత్యం కేవలం కొన్ని సామాజిక వర్గాలకు చెందిన సాహిత్యంగా, కేవలం కొందరి సర్టిఫై చేస్తేనే గొప్పదిగా నిలిచేవిధంగా తయారయ్యింది. ఈ కుట్రని మీరి తమ అస్థిత్వాన్ని నిలుపుకున్న ఏకొందరినో మినహాయిస్తే, విత్తులుగానే వికటింపబడ్డ రచయితలు కోకొల్లలు. ఈ ఒక్క కారణం చాలు మన తెలుగు సాహిత్యం దుస్థితికి.

ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ఉద్భవించినవే, సాహితీ అస్థిత్వ ఉద్యమాలు. ఒకవైపు దళిత సాహిత్యం, మరో వైపు స్త్రీవాద సాహిత్యం తోపాటూ ఇప్పుడు మాండలికాల పోరాటం మరియూ ప్రాంతీయవాదాల గొంతుకలు సాహిత్యాన్ని కుదిపేస్తున్నాయి. వాదాలకో లేక భావజాలాలలో పరిమితమైనా, కొంత వైవిధ్యాన్ని అందించి కొత్త పాఠకుల్ని ఈ సాహిత్యం సంపాదించుకుంది. వీటి భావజాల పోకడల్ని పురస్కరించుకుని వీటినీ "సాంప్రదాయాలు" చెయ్యడం త్వరలో జరిగిపోవచ్చు. సామదానభేధ దండోపాయాల్ని ఉపయోగించి ఈ సాహితీమాఫియా అవలీలగా ఈ పనిచేసేస్తుందని నా ప్రఘాఢ నమ్మకం.

పత్రికల్లో ఈ ఆభిజాత్యధోరణి అందరికీ తెలిసిందే. అదే ధోరణిని మన తెలుగు వెబ్ జైన్లూ అందిపుచ్చుకోవడం దురదృష్టకరం. కొందరు సంపాదకులు వారి "అభిరుచి"ని బట్టి పాఠకలోకానికి ఏం నచ్చుతుందో, వారు ఏమి మెచ్చుతారో నిర్ణయించి, దాన్నే "ఉత్తమాభిరుచి" గా పాఠకుల గొంతుల్లోకి ఒంపి, మెదళ్ళలోకి నింపే ప్రయత్నం చేస్తుంటారు. సారమున్న సీన్లన్నీ దర్జాగా చూసేసి, ‘ఇవి ప్రేక్షకుల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తా’యన్న నెపంతో "కట్" చేప్పే సెన్సారు వారన్నమాట ఈ సంపాదకులు. వీరికి ఇంగ్లీషు పదమైన "ఎడిటర్" సరైనదేమో! తెలుగులో మరో నాజూగ్గా,నాగరికంగా ఉంది పేరు. సం...పా...ద...కు...లు. I hate them.

వీరంటే నాకు ఇంత ద్వేషం ఎందుకో చెప్పాలంటే, ఈ వ్యాసం యొక్క శీర్షిక దగ్గరికి వెళ్ళాలి. సాహిత్యం సామాజిక ఉన్నతికి, అభ్యుదయానికీ అని ఈ సాహితీ మాఫియా చెప్పే మాటలు శుద్ధ అబద్ధమని నా విశ్వాసం. ఎందుకంటే, రాసేవాడెవడూ సమాజాన్ని ఉద్దరించాలని రాయడు. తన వ్యక్తిగత అనుభవాలు,ఆలోచనలూ ముఖ్యమైనవి అనే నమ్మకంతో రాస్తాడు. ఇవి సమాజానికి ఉపయోగపడతాయనే "ఉదాత్తమైన" భావనకన్నా, తమ అనుభవాలతో identify చేసుకోగలిగే పాఠకులుంటారన్న ఆశ రచయితని రాయడానికి పురిగొల్పుతుంది. అంటే మూలస్థాయిలో రచన ఒక వ్యక్తిగత అభివ్యక్తి. అలాంటప్పుడు దాన్ని "పాత సాహిత్యం" తో బేరీజుచేసి, ఇది ప్రచురణకు,పదిమందీ చదవడానికి యోగ్యమా కాదా అని నిర్ణయించే హక్కు వీరికెవరిచ్చారు? సాహిత్యం సమాజానికి "మొత్తం" పనికిరావాలనేది ఒ Utopian idea. ఎప్పుడూ సాహిత్యం దాని స్థాయినిబట్టి by default కొందరికే పనికొస్తుంది. వారే రచయిత ఆశించన పాఠకులు. తన వ్యక్తిగత అభివ్యక్తితో identify చేసుకోలిగే ఇతర వ్యక్తులు.

భూతకాలం ఆధారంగా వర్తమాన,భవిష్యత్ కాలాల్ని నిర్ణయించడానికి, సాహిత్యం historical continuum కాదు. అందరికీ ఓకే విధమైన "ఉత్తమాభిరుచి" ఉండాలనీ లేదు. మరలాంటప్పుడు "ఉపయోగపడే" సాహిత్యాన్ని నిర్వచించే ఈ అధికారం వీరు ఏవిధంగా సంపాదించుకున్నారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. వార్తాపత్రికల సంపాదకుల వ్యవహారం నాకు అర్థమవుతుంది. కొంత లీగల్ రెస్పాన్సిబిలిటీ మరికొంత మోరల్ రెస్పాంన్సిబిలిటీ వీరి భుజాలమీద ఉంటుంది కాబట్టి, ఏ వార్త ప్రచురించాలీ, ఎందుకు ప్రచురించాలి, ఏంత జాగాలో ప్రచురించాలి అనే నిర్ణయాలకి కొన్ని కొలమానాల్ని ఊహించొచ్చు. కానీ సాహిత్యానికి సంపాదకీయం నెరిపే వారికి moral righteousness తప్ప మరేయితర బాధ్యతలూ ఉన్నట్లు నాకు కనిపించడం లేదు. వీరి వ్యక్తిగత అభిరుచిని బట్టి సాహిత్యం భవిష్యత్తుని శాసిస్తామంటే, నా వ్యక్తిగత అభివ్యక్తిని వీరికి అనుగుణంగా ఎందుకు మార్చుకోవాలో అర్థం కాకనే ఈ ద్వేషం.

ఈ ద్వేషపూరితమైన ప్రక్రియ అవసరం లేని బ్లాగంటే నాకు అత్యంత ప్రియం. ఇక్కడ రాసిన అనంతరం చర్చలరూపంలో సలహాలూ, సూచనలూ,విభేదనలూ, వివాదాలేతప్ప నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆపేసే అధికారం ఎవరికీ లేదు. నేను చెప్పాలనుకున్నది ఎలా చెబితే బాగుంటుందో "బలవంతంగా" రుద్దే హక్కు ఎవరికీ లేదు. ఇంతకంటే ఉత్తమ వ్యక్తిగత అభివ్యక్తి రూపం నాకైతే ఎక్కడా కనిపించలేదు. సాంప్రదాయ రచనల్ని ఆశించే వెబ్ పత్రికలకన్నా, నా వ్యక్తిగత అభివ్యక్తికి అద్దంపట్టే నా బ్లాగే నాకు మిన్న.

విభిన్న ఆలోచనలకూ,అభివ్యక్తులకూ స్థానం కల్పించకుండా, కేవలం సాంప్రదాయ రచనల పేరుతో అనుకూలమైన మూసల్ని సృష్టిస్తూ, ఏకధృవసాహిత్యం వైపు మనం ప్రయాణిస్తున్నంతవరకూ, తెలుగు సాహిత్యం సామాన్యులకు దూరంగానే ఉంటుంది. ఈ విధానాన్ని మార్చాలంటే, వ్యక్తిగత అభివ్యక్తికి పట్టంకట్టడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి అనుభవించి రాసిన ప్రతిరచనకూ, దానికితగ్గ పాఠకులుంటారు. ఇదే నిజం అని నా అనుభవం.

వ్యక్తిగత అభివ్యక్తికన్నా, మీ అభిరుచికీ కాల్పనిక పాఠకుల అంగీకారానికీ పట్టంకట్టే సంపాదకులూ డౌన్ డౌన్!!

జైహో బ్లాగ్ లోకం- వ్యక్తిగత అభివ్యక్తికి అనుకూలం.


****

Saturday, April 11, 2009

ऎ दुनिया अगर मिल भि जायॆ तॊ क्या है? ఈ లోకం నాదైతేమాత్రం నాకేంటి?

ऎ दुनिया अगर मिल भि जायॆ तॊ क्या है? ఈ లోకం నాదైతేమాత్రం నాకేంటి? అని ‘ప్యాసా’ చిత్రంలో గురుదత్ విజయ్ పాత్ర ప్రపంచాన్ని ప్రశ్నించినప్పుడు,ప్రేక్షకుడిగా మనమూ అంతే నిర్వేదానికి గురౌతాము. ప్రేమలో విఫలుడై, ఉద్యోగం లేక బ్రతుకులో ఓడిపోయి, తన సృజనాత్మకతకు కనీస గుర్తింపులేక త్యజింపబడి, అన్నల చేత మోసగించబడి ఇన్ని వైఫల్యాలతో మనిషిగా పరాజితుడై self pity లోకి వెళ్ళిపోయిన ఒక కవి, తన కల్పిత చావులో గౌరవాన్ని పొందుతాడు. బ్రతికుండగా మతించకపోగా మతిలేనివాడన్న ఈ ప్రపంచం, మరణించిన తరువాత పూజించి నెత్తికెక్కించుకుంటున్న ధోరణికి వ్యతిరేకంగా, వారి hypocrisy ని నిరసిస్తూ "ऎ दुनिया अगर मिल भि जायॆ तॊ क्या है? ఈ లోకం నాదైతే మాత్రం నాకేంటి?" అంటాడు. లాభాపేక్ష లేకుండా అప్పుడూ ఇప్పుడూ అభిమానించి ప్రేమించిన వేశ్యతో ఈ ప్రపంచాన్ని కాదని దిగంతాలవైపుకు వెళ్ళిపోతాడు.

అలా అస్తమిస్తున్న సూర్యుడి పైపుకెళ్ళిన వంచిత నాయకీ-నాయకుల జీవితం ఎలా ఉండేది అని ప్యాసా రెండో భాగం తీసే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. ఎందుకంటే, ఆ త్యజించిన ప్రపంచం ప్రమేయం లేకుండా వారు బ్రతికే అవకాశం లేదు గనక! గురుదత్ ది ఒక కళాకారుడిగా తెలిపిన మానసిక నిరసనేకానీ, ప్రపంచాన్ని త్యజించి దిగంతాలకు వెళ్ళిపోవాలనే ఉద్భోదన అసలు కాదు. కాబట్టి ఆప్రశ్న కూడా అసంబద్ధమేమో. చాలా ప్రేమకథలు పెళ్ళితో సుఖాంతం అవుతాయి, లేదా చావుతో దు:ఖాంతం అవుతాయి. అలాక్కాకుండా పెళ్ళైన తరువాత ఈ ప్రేమ నిలిచిందా? లేక చావుతో విడిపోకుండా వీరికి పెళ్ళిజరుగుంటే ఏమయ్యుంటుంది? అని ప్రశ్నించాలంటే కొంచెం ఇబ్బందే మరి. దేవదాసు-పార్వతుల పెళ్ళిజరుగుంటే...ఛస్!! తలుచుకుంటేనే పరమ కంపరంగా ఉంది.

గురుదత్,విజయ్ ప్రపంచాన్ని త్యజించడాన్ని నేను అభినందించకపోయినా, తను చెప్పిన/చూపిన కారణాలు మాత్రం "ఈ ప్రపంచం ఎంత దారుణమో!" అనిపించేలా ఉంటాయి కాబట్టి అంగీకరించాల్సిందే. కానీ, ఈ సమస్యలకి ఫలాయనవాదమే సమాధానమా! మరింకేం చెయ్యలేమా? అన్న ఆలోచన ఎప్పుడూ వచ్చేది. ఈ మధ్య ‘గులాల్’ సినిమాలో ఇదే పాటని తీసుకుని చాలా మంచి సమాధానాలు చెప్పారు అనురాగ్ కశ్యప్ & పియూష్ మిశ్రాలు. "ఎలా ఉన్నా ఇది మన మన ప్రపంచం. మనమే దీన్ని కాపాడుకోవాలనే" యదార్ధవాద కోణం నాకు విపరీతంగా నచ్చింది. ఈ రెండు పాటలూ మీ కోసం...

చూసి...విని....నిర్ణయించుకోండి.





Wednesday, April 8, 2009

ద్రవిడ ఉద్యమం - ఒక ధృక్కోణం


"సమగ్ర భారతదేశానిదీ ఓకే ఒక సాంస్కృతిక చరిత్ర. అది అత్యంత ప్రాచినమైనదీ, ఘనమైనదీ,విస్తృతమైనదీ మరియూ మిక్కిలి నాగరికమైనది." అని ఎరైనా చెబితే, మనం వెంఠనే తలకాయలూపేసి పొర్లుదండాలు పెట్టేస్తాం. కానీ నిజంగా మనది "ఒక" సాంస్కృతిక చరిత్రేనా, అని ప్రశ్నించుకోము.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ, ‘భిన్నత్వంలో ఏకత్వం అదే భారతీయతత్వం’ అనే నానుడిని వ్యాప్తిచేసి భారతీయతత్వాన్ని సృష్టించే నేపధ్యంలో, భిన్నత్వాలలోని విభిన్నత్వాన్ని కొంచెంకొంచెం త్యజించేలా చెయ్యడం జరిగింది. "Nation building" లో భాగంగా, దేశభక్తిని కలిగించే దిశగా జరిగిన ఈ ప్రయత్నంలో మన నాయకుల మేధావుల నిబద్ధతే మనకు కనిపిస్తుంది. కానీ, వారు ఎంచుకున్నది సరైన నమూనానేనా అనేది ఇప్పుడు అత్యంత ప్రశ్నార్ధకంగా తయారయ్యింది. "రాజకీయ ఏకత్వ భావన రావాలంటే సాంస్కృతిక భిన్నత్వం బలహీనమవ్వాలా?" అనేది ఎప్పటి నుండో కొందరు లేవనెత్తిన ప్రశ్న. ప్రస్తుతం స్థానిక విజ్ఞానం,స్థానిక జాతుల చరిత్ర, స్థానిక సంస్కృతులకు లభిస్తున్న గుర్తింపు దృష్ట్యా ఆ ప్రశ్నలూ,వ్యతిరేకతలూ చాలా సహేతుకం అనిపించక మానదు.


ఈ నేపధ్యంలో ద్రవిడ ఉద్యమాన్ని మనం పరికిస్తే,అదొక స్థానిక సంస్కృతి పరిరక్షణ ఉద్యమం అనిపిస్తుంది. కానీ అది సంతరించుకున్న విస్తృత రాజకీయ,సామాజిక రంగు మరియూ ప్రభావాన్ని ప్రసరించిన రంగాల దృష్ట్యా ఇదొక జాతిఉద్యమాన్ని తలపిస్తుంది.

మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతం జాతుల సిద్ధాంతం కాదు,కేవలం భాషా సిద్ధాంతం అనే ప్రాతిపదిక మీద, ఆధునిక భారతీయభాషా శాస్త్ర పండితుడు రాబర్ట్ కాడ్వెల్ (Robert Caldwell) ఈ పదాన్ని వాడాడు. ఎనిమిదవ శతాబ్ధంలో ఒక సంస్కృత పండితుడు వాడిన "ఆంధ్రద్రావిడ భాషలు" అన్న పదం ఆధారంగా కాడ్వెల్ వింద్య పర్వతాలను మీరి వున్న దక్షిణాపధంలో వాడే భాషలైన తమిళ,తెలుగు,కన్నడ,మళయాళ భాషలను "ద్రవిడ భాష"లన్నాడు. ఉత్తరభారతదేశంలో లభ్యమైన గ్రంధాలు ద్రవిడ భాషల్ని ప్రాకృత భాషలుగా లేక రాక్షసభాషలుగా వ్యవహరించారు. దీని ఆధారంగా కొందరు బ్రాహ్మణ మేధావులు, దక్షిణాపధం ఆదినుండీ అనాగరిక సంస్కృతి అనీ, వలస వచ్చిన ఆర్యుల కారణంగా నాగరికత సంతరించుకొన్నది అనే సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు. దక్షిణ భారతదేశంలో "తెల్లగా" ఉండేవాళ్ళు సాధారణంగా బ్రాహ్మణులే అవడమూ, సంస్కృత భాష వీరికే తెలిసుండటంతో, ఈ సిద్ధాంతం ఆధారంగా ఆర్యులు = బ్రాహ్మణులు అన్న నమ్మకం బలపడింది.

తమ ఉన్నతికోసం తమని తాము ఆర్యులుగా, దక్షిణాదివారిని "రాక్షసులు"గా చిత్రీకరించిన బ్రాహ్మణ మేధావుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, బ్రాహ్మణేతర మేధావులు తమ సిద్ధాంతాలతో ముందుకొచ్చారు.పాండ్యుల కాలం నాటి సంగం సాహిత్యం ఆధారంగా ఆర్యులు వచ్చారని చెబుతున్న కాలంకంటే ముందే ద్రవిడదేశం అత్యంత నాగరిక శోభలతో వర్ధిల్లిందని నిరూపించారు. బ్రాహ్మణ-బ్రాహ్మణేతర కులాల సమరం ఇంతటితో ఆరంభం.

ఈ ఆరోపణల,ప్రతిపాదనల నేపధ్యంలో ఈ అగ్నికి ఆజ్యం పోసిన విషయం, బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రాహ్మణుల ఆధిపత్యం. 20వశతాబ్ధం నాటికి మద్రాసు ప్రెసిడెంసీ లోని అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు బ్రాహ్మణుల పరమయ్యాయి. ఉదాహరణకు 1855 లో 305 ఉద్యోగాల్లో 237 వీరివే. అదీ డెప్యూటీ కలెక్టర్లూ, సబ్ జడ్జులు, జిల్లా మున్సిఫ్ లవంటి కీలక హోదాల్లో వీరు రాజ్యమేలారు. మరీ ముఖ్యంగా ఉన్నతవిద్యా బోధనాలయాలైన యూనివర్సిటీల్లో వీరిదే సింహభాగం. అంటే జనాభాలో కనీసం 5% కూడా లేని బ్రాహ్మణులు సామాజాన్ని నిర్దేశించి,ఆధిపత్యం చలాయించే స్థితిలో ఉన్నారు.కొంత ఇంగ్లషు చదువులు చదువుకుని, ఎదుగుదలని ఆశిస్తున్న బ్రాహ్మణేతరులు, అడ్డుగా ఉన్న బ్రాహ్మణుల పట్ల నిరసనభావాన్ని పెంచుకున్నారు.

ఈ పరిస్థితుల్లో 'The Madras Non-Brahmin Association' 1909లో స్థాపించబడింది. రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక సంస్థగా ఇది ఉద్భవించినా,కొన్నాళ్ళకే దీని పేరును ‘The Madras Dravidian Association' మారుస్తూ నిర్ణయం జరిగింది. ఈ కాలంలో ఈ ప్రయత్నాన్ని అభినిందించిన వాళ్లకంటే, "బ్రాహ్మణ వ్యతిరేక సంఘంగా" నిరసించినవారే ఎక్కువ. ఇందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రాంతపు బ్రాహ్మణేతరులు ఎక్కువగా ఉండటం గమనార్హం. అప్పటికే ఉన్న రెడ్డి సంఘాలూ,వెలమసంఘాలూ, బలిజ సంఘాల ఉపయోగంతో పోలిస్తే ఈ సంఘం యొక్క ప్రయోజకత్వం ప్రశ్నార్థకమని వీరి వాదన.

ఈ వాదోపవాదాల మధ్యన మద్రాసు ద్రవిడ సంఘం 1916 వరకూ పెద్దస్థాయి కార్యక్రమాలేవీ చెయ్యలేదు. మధ్యలో కొందరు అసంతృప్తి చెందిన సభ్యులు వేరుపడి "Madras United League" పేరుతో మరో సంఘాన్ని పెట్టుకున్నారు. 1916 లో మద్రాసులో కులవివక్ష కారణంగా అద్దె ఇళ్ళు దొరకక అవస్థ పడుతున్న విద్యార్థులకోసం మద్రాసు ద్రవిడ సంఘం ఒక హాస్టల్ ను నిర్వహించడం మొదలుపెట్టింది. ఈ సమయంలో ఈ ద్రవిడ assertion యొక్క రాజకీయ ప్రాముఖ్యతను గ్రహించిన పి.త్యాగరాయ చెట్టి మరియూ డాక్టర్ టి.ఎం.నాయర్ ఈ సంఘంలో చేరారు. ఆసమయంలోనే బ్రాహ్మణుల పార్టీగా భావింపబడుతున్న కాంగ్రెస్ హోం రూల్ ఉద్యమాన్ని ఆరంభించింది.

బ్రాహ్మణ నాయకత్వంలోని కాంగ్రెస్ కు మద్దతుగా నడుస్తున్న పత్రిక(హిందూ,స్వదేశమిత్రన్)లకు వ్యతిరేకంగా The South Indian People's Association పేరుతో ఆంగ్లంలో జస్టిస్ -ది మద్రాస్ మెయిల్ (ఫిబ్రవరి26,1917) ,తమిళంలో తిరవితన్ (జూన్,1917) మరియూ తెలుగుకోసం అప్పటికే ప్రచురణలో ఉన్న ఆంధ్రప్రకాశిక ను కొనుగోలు చేసి వీరికి అనుకూలంగా ప్రచురించడం మొదలుపెట్టారు. హోంరూల్ వచ్చినా బ్రాహ్మణాధిక్యత కలిగిన హోంమ్ రూల్ లో బ్రాహ్మణేతరులకు అన్యాయమే జరుగుందన్న వాదన ఆధారంగా, ప్రతి కులానికి సరైన ప్రాతినిధ్యం కావాలన్న డిమాండ్ చేస్తూ ద్రవిడ ఉద్యమం ముందుకు సాగింది.

బ్రాహ్మణేతరుల రాజకీయ ఆశయాల సాధనకై జస్టిస్ పార్టీ ఏర్పడింది. మింటో మార్లే సంస్కరణలు,Government of India Act of 1919 ల ఆధారంగా మద్రాసు ప్రెసిడెంసీ లో ముస్లిమేతర,బ్రాహ్మణేతర వ్యక్తికి రాజకీయ రిజర్వేషన్ కల్పించబడింది. ఇది దళితజాతీయ భావనకు కలిగిన గొప్ప విజయంగా చెప్పొచ్చు. ఈ దెబ్బకి కాంగ్రెస్ లో కూడా ద్రవిడ ఉద్యమం గురించి లుకలులు బయల్దేరాయి. ఈ విధంగా దళిత ఉద్యమం సాంస్కృతిక ఉద్యమంగా మొదలై, సామాజిక-రాజకీయ ఉద్యమంగా ఎదిగింది.

అప్పటివరకూ మద్రాసు ప్రెసిడెంసీలో ఉన్న తెలుగువారు ఎంతో కొంత ఈ ఉద్యమాన్ని సమర్ధించినా, సంస్కృతాభిమానులైన తెలుగు వారు, సంస్కృతం వైపు మొగ్గుచూపారే గానీ ద్రవిడ మార్కుని ధరించడానికి వెనుకంజ వేసారు. అంతేకాక, ఆంధ్రప్రాంతంలో బ్రాహ్మణ-బ్రాహ్మణేతరుల మధ్య తీవ్రస్థాయిలో లేని వైషమ్యాలూ, కాంగ్రెస్ పార్టీ పట్ల గల రాజకీయ నిబద్ధతా, ఈ ఉద్యమాన్ని తెలుగు భాష మాట్లాడే ప్రదేశాలవరకూ పాకకుండా చేశాయి. అప్పటినుండీ ద్రవిడ ఉద్యమం, తమిళనాట సామాజిక-రాజకీయ ప్రక్రియలో మాత్రమే భాగంగా మిగిలింది.

ద్రవిడ ఉద్యమం ఒక సాంస్కృతిక ఉద్యమంగా మొదలై ఒక జాతిఉద్యమంగా మిగిలింది. ఒకప్పుడు ద్రవిడ జాతి ఎలా ఉండేది అనే చారిత్రాత్మక అపోహలతో, సిద్ధాంతాలతో మొదలై, చరిత్రతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక సామాజిక-రాజకీయ-సంస్కృతిక identity గా ఎదిగింది. ఈ పరిస్థితుల్లో, "చారిత్రక సిద్ధాంతాలు ముఖ్యమా లేక వాటి ఆధారంగా ఏర్పడిన వర్తమానం ముఖ్యమా?" అంటే, వర్తమానాన్ని ఎన్నుకోవడం కోసం చరిత్రను తెలుసుకోవడం తప్ప దాన్ని తిరగరాయడానికి కాదనే సత్యం మనకు తెలిసిరానంత వరకూ విభేధించుకుంటూ ఆనందించాల్సిందే! Choice is ours.


*Caste & the Tamil Nation,The Origin of the Non-Brahmin Movement, 1905-1920; by K.Nambi Arooran ఆధారంగా.

Monday, April 6, 2009

మన చరిత్ర !?!

ఈ మధ్యకాలంలో పురాణాల్ని చరిత్రల్ని చేసే ప్రహసం ఒకటి మొదలయ్యింది. ‘మన సామాజిక జీవనాన్ని రాసే అలవోక,అత్యంత ప్రాచీన విధానం కథ చెప్పడం కాబట్టి, కటికనిజానికి కొన్ని అతిశయోక్తులు జోడించి చెప్పబడినవి పురాణాలు’.అనే వాదనొకటి బలంగా ఒక మూల వినిపిస్తూనే ఉంది. బీజేపీ వారు అధికారంలో ఉన్నప్పుడు "చరిత్రని తిరగరాస్తాం" అని ఒంటికాలిమీద లేచి ఒరగబడింది కూడా ఈ ధోరణితోనే. ఏదిఏమైనా ఎట్టకేలకు అటు కాంగ్రెస్ కూ ఇటు బీజేపీకీ కొరుకుడుపడని వామపక్ష చరిత్రకారుల చేతుల్లో "మన చరిత్ర" ఉండిపోయింది.

వామపక్ష మేధావులకి దేవుడు ఎలాగూపడడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులంటే అసలు పడదు. ఎంతైనా రష్యా విప్లవానికీ, చైనా ప్రగతికీ భక్తులు కదా! మొత్తానికి చరిత్రను ఎవరికీ కాకుండా కేవలం పుస్తకాల్లో పాఠాలుగా, పరీక్షల్లో ప్యాసయ్యే కీలకాలుగా, పోటీపరీక్షలకు ఆయువుపట్లుగా మార్చేసి ఉసూరుమన్నారు. అంటే మనకు చరిత్రలో మిగిలింది తారీఖులూ, తద్దినాలేతప్ప మన (దు)స్థితికి కారణాలు కాదు. ఆ కారణాలు అకారణాలైనా, ప్రస్తుతం ఆ కారణాల్ని చూపించి మరో మారణకాండకు తయారవడం, అదీ ముతక వాదనల్ని శాస్త్రీయం చేసేరీతిలో తయారవడం మరింత దారుణం.

ఒకరు మ్యాక్స్ ముల్లర్ని "మాయదారి" అంటూనే మా మాయదారి కృష్ణుడు అసలు చరిత్ర అంటాడు. మరొకడు ఆర్య-ద్రవిడ సిద్ధాంతం కుట్ర అంటాడుగానీ, హరప్పా మొహెంజదారో త్రవ్వకాల తరువాత ఈ సిద్ధాంతం చరిత్రలో అటకెక్కిందని తెలుసుకోడు. చరిత్ర కారులేదో మాయజేసి కుట్రజేసి వేలసంవత్సరాల సంస్కృతికి అన్యాయం చేశారని వాపోతూ ఉంటారు. అంతేతప్ప చరిత్ర పునర్నిర్మాణానికి తగిన ప్రాతిపదికల్ని ఏర్పరుచుకోరు.

చరిత్ర ఒక అభిప్రాయం కాదు. లభ్యతలోఉన్న ఆధారాలూ,ఆలోచనల ప్రాతిపదికన ప్రతిపాదించే శాస్త్రీయ సూచన లేక సిద్ధాంతం. చరిత్ర "సృష్టిలో"చరిత్రకారుల పరిధి,వారి నేపధ్యం,వారికి లభించిన ఆధారాలు, వాటికి మద్ధత్తుగా చూపించగలిగే ప్రమాణాలు చాలా ప్రముఖపాత్ర వహిస్తాయి. కేవలం ఆధారాలూ,ప్రమాణాలూ మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే, చరిత్రలో ఘటనలు జరిగిన చూచాయ తారీఖులు తప్ప వాటి నేపధ్యాలూ,వాటి ప్రభావానికి సంబంధించిన అంచనాలు ఉండేవికాదేమో. ప్రామాణికమైన నిజాలు, నమ్మదగిన కల్పనల సమాహరమే చరిత్ర కాబట్టి,దాన్ని మార్పేరాని శాస్త్రంగా అనుకోవడానికి వీల్లేదు. Pure sciences లో కూడా మునుపు ప్రతిపాదించిన సిద్ధాంతాలను కొత్త సమాచారంతో తిరగరాయడం జరుగుతుంది. అలాంటిది అంచనాలూ,ఆలోచనల ప్రాతిపదికన నిజాల నేపధ్యాల్ని ఆలోచించి రాసిన చరిత్ర "స్థిరం" లేక "పరమసత్యం" అనేది హాస్యాస్పదం. చరిత్రను చూసే సాంకేతిక ధృక్పధం అది కాదు.

చరిత్ర ఎప్పుడూ పునర్నిర్వచింపబడుతూ ఉండాలి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ప్రసాదించిన నైపుణ్యత ఆధారంగా, ఇప్పటికే లబ్యతలో ఉన్న ప్రమాణాలను పున:సమీక్షించి వాటి ప్రామాణికతను ప్రశ్నిస్తూ ఉండాలి. ఈ తార్కిక ఆధునిక ధృక్పధం లోబడిన రోజున, చరిత్ర అర్థరహితంగా తయారవుతుంది. ఆ చరిత్రకు సంబంధించిన జాతి లేక ప్రజలకు నిరుపయోగమౌతుంది. ప్రస్తుతం "భారతీయ చరిత్ర" అనబడే అంగీకారాత్మక కథకు అదే గతి పట్టింది. ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, భేధదృష్టి,రాజకీయ ప్రయోజనాపేక్షల ఆధారంగా చరిత్రను పునర్నిర్వచించే ప్రయత్నం జరగటం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇప్పుడు రాయాలంటే...?! అదో పెద్ద ప్రశ్నార్ధకమౌతుంది. హైదరాబాద్ చరిత్రను అందులో కలపాలా వద్దా? కడప నవాబు హిందూ అభిమానాన్ని ప్రస్తావించాలా వద్దా? చంద్రగిరి కోట రహస్యాల్ని చరిత్రలో భాగం చెయ్యాలా? శాతవాహనుల తరువాత రెడ్డిరాజులొచ్చారా? ఓరుగల్లు ప్రాసస్థ్యాన్ని కీర్తిస్తే తెలంగాణా వాదులకు బలం చేకూరుతుందేమో! లాంటి చచ్చు ప్రశ్నలూ చొప్పదంటు సమాధానాలూ ఎన్నో వస్తాయి. ఈ పరిస్థితుల్లో చరిత్రను పునర్నిర్వచించడం ఏట్లా!?!

"విజేతలు రాసిందే చరిత్ర" అని ఎవరో అన్నట్లు, చరిత్ర ఒక విజయగాధగా మిగిలి, పరాజితుల జాడ లేక సగం చచ్చిపోయింది. అశోకుడు కళింగను జయించాడని మనకు తెలుసుగానీ, ఆ ఓడిపోయిన కళింగ రాజు పేరు ఎవరైనా విన్నారా? అయినా ఈ చరిత్రను "మన" చరిత్ర అనడానికి మనకు గల హక్కులుకూడా తెలీని అయోమయస్థితిలో ప్రస్తుతం పడికొట్టుకుంటున్నాం.

5,000 సంవత్సరాల ఘనచరిత్ర అని మహాఘనంగా చెప్పుకుంటాంగానీ, అది ఎవరి చరిత్రో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. హరప్పా-మొహెంజోదారో మనభారతీయ సంస్కృతి అందామనుకున్నా అదెలా పుట్టిందో, మరెందుకు గిట్టిందో ఆధారాలు లేవు. ప్రస్తుతం ఆ రెండు తవ్వకాల ఊళ్ళూ పాకిస్తాన్లో పడిచచ్చాయి. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఎంచక్కా మీకూ మాకూ సంబంధం లేదు మాదే గొప్ప పురాతన చరిత్ర అని చంకలు గుద్దుకున్నా, మనం బావుకునేదేమీ లేదు. వేదాలు మనవే అనుకుందామన్నా, అవి మొత్తం భారతదేశమనే mythical land scape కు సంబంధిస్తాయా అనేది అత్యంత సందేహాస్పదం. భ్రిటిష్ వాడు తీసి దాచకుంటే, మ్యాక్స్ ముల్లర్ ఇంగ్లీషులోకి అనువదించకుంటే, ఈ "పవిత్రగ్రంధాలు" ఏ పాడుబడిన గుళ్ళపాలో అయ్యి, జీర్ణమయిపోయుండేవి. అనవాలుకూడా చిక్కకుండా అదృశ్యమయ్యుండేవి. మ్యాక్స్ ముల్లర్ మాయదారోడైనా కనీసం మా సంస్కృతి మూడువేల సంవత్సరాలనే ఆధారాల్ని జ్ఞానంతో సహా అందించాడు. అవును, తారీఖు తన క్యాధెలిక్ నమ్మకాల్ని బట్టి ఒక పదిహేనువందల సంవత్సరాలు కుదించాడు పాపం! ఆ మాత్రం దానికి, తను చేసిన కృషి మొత్తాన్నీ తుంగలోతొక్కి, మతిలేని కొత్త సిద్ధాంతాల్ని మన తలకు చుట్టాలంటే ఎట్టా?

ఇన్ని సమస్యల్లో మొత్తానికి మన చరిత్రకి పొయ్యేగాలం వచ్చింది. చూద్ధాం ఇది ఎంతవరకూ పోతుందో లేక అసలే మిగలకుండా పోతుందో!

****

Sunday, April 5, 2009

సీత వెదకిన రాముడు


పొద్దు వారు నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం "తామస విరోధి"లో నేనొక సమస్యనిచ్చి పూరించమన్నాను. దానికొచ్చిన పూరణలు వ్యాఖ్యలు ఇవి. ఈ కవితలు మీరు పొద్దు పత్రికలో కూడా చూడచ్చు.

కత్తి మహేష్:
ఈ మధ్య తమిళ్ లో చేరన్ నటించిన ఒక సినిమా పేరు విని “భలే ఉందే”
అనుకున్నాను. అదే శీర్షికని తెనుగీకరించి సమస్యగా ఇస్తున్నాను. ఈ
శీర్షికకు కవిత రాయండి.

"సీత వెదకిన రాముడు"

మనందరికీ తెలిసిన కథలో రాముడు సీతను వెతుకుతాడు, కానీ ఇక్కడ సీత రాముణ్ణి
వెతికానంటోంది. అదేమిటో? ఎలాగో? కొంచెం ఆలోచించి చెప్పండి!

నూతక్కి రాఘవేంద్ర రావు:

రాముని తలచుచు సీతా మాత
విరహ తాపమున తల్లడిల్లి పడి
వున్న వేళలో సీతా ,సీతా
సీతా యటంచు రాము ని గాత్రం
వినిపించె నామెకు వీనుల విందుగ
కర్ణపేయముగ తలపో పిలుపో
రావణ మాయో సంభ్రమాన ఆ
అశోక వనిలొ తత్తర పాటున
సీత వెదికె రాముని కొరకు .


కత్తి మహేష్:

చాలా బాగుంది.
తలుచుకున్న ఎడబాటులో, తలపుకొచ్చిన రాముని పిలుపు వినిపించిన ఆక్షణిక భ్రమలో,
అశొకవనమన్న స్పృహకూడా రాక రాముణ్ణి సీత వెదకటం అమోఘం.
అభినందనలు.

శ్రీవల్లీ రాధిక:

శీర్షిక చూడగానే కలిగిన మొదటి భావమిది. ఇంకా ఇంప్రూవ్ చేయచ్చు.

సీత వెదికింది

తానెరుగని రాకుమారుడెవరో తన మెడలో తాళి కడుతుంటే

తన కోసం శివధనుస్సు విరిచిన సామాన్యుడి కోసం

సీత వెదికింది

తొలిసారి పెళ్ళినాడు సీత వెదికింది

తండ్రికిచ్చిన మాట కోసం తపనపడే తనయుడిలో

శూర్పణఖని కాదన్న శ్రీరాముడి హృదయంలో

తనకున్న స్థానం కోసం సీత వెదికింది

నియమాలకూ నిగ్రహాలకూ

తనపైని ప్రేమ అతీతమనే భావన కోసం

సీత వెదికింది

అశోకవనాల్లో వేచేటపుడూ

అగ్నిపరీక్షలు దాటేటపుడూ

సీత వెదికింది

నీధర్మమూ నా ధర్మమూ

ఒకటేననగల నేస్తం కోసం

వేలసార్లు సీత వెదికింది

వంటరితనంలో వాల్మీకి శరణంలో

తనకోసం నడచిరాగల రాముడి కోసం

సీత వెదికింది

తనచేయి విడవని రూపం కోసం

కన్నబిడ్డల కళ్ళల్లో

సీత వెదికింది

ఆశలన్నీ ఆవిరయ్యాక

పుడమిగర్భంలో కనుమరుగవుతూ

కడసారి కన్నీళ్ళతో సీత వెదికింది

ఆశ్రితవత్సలుడు అయోధ్యాపతిలో

అచ్చంగా తనవాడైన రాముడి కోసం

సీత వెదికింది

బొల్లోజు బాబా:
తొలిసారి పెళ్ళినాడు సీత వెదికింది ?????

కవిత కాన్సెప్టు ఇలా ఉంటే కొంచెం శక్తిమంతంగా ఉండేదేమో

రావణుడెత్తుకెళ్ళినపుడు,
బేలగా అడవంతా గాలిస్తూ రోదించినపుడూ,
అడవికి పంపిననాడు,
స్వర్ణ సీతను పెట్టుకొని యాగాదులు నిర్వహించినపుడు, అగ్నిప్రవేశం
చేయమన్నపుడూ,
అంటూ కొన్ని రాముని కేరక్టర్ లోని కొన్ని గ్రే ఏరియాస్ ని (పెద్దలకు కోపం
వస్తుందేమో) స్పృశిస్తూ ఆ యా సందర్భాలలో ” సీత వెతికింది తన రాముని
కొరకు” అని ఉంటే బాగుండేదనిపించింది.

మీరు ముందే అన్నట్లు రిఫైన్ మెంటు చెయ్యచ్చనిపిస్తుంది.

కత్తి మహేష్:

మంచి కోణం నుంచి చెప్పిన పూరణ.
చెప్పాలనుకున్నది చెప్పేస్తే, ఎక్కడ గొడవలైపోతాయో! అనే సందిగ్ధత ఈ కవితలో
కనపడింది. ఎందుకో?!?

త.య.భూషణ్:

మంచి భావావేశం ఉంది మీలో.దానికి చక్కని భాష సైదోడు.
పూరణలకే పరిమితం కానవసరం లేదు.


*****

Thursday, April 2, 2009

చిగురించని వసంతం


నీ తర్కం కాదనలేనని తెలుసు
అందుకే…
కారణం అడిగే ధైర్యం చెయ్యలేదు

నీ ప్రేమను ప్రశ్నించే సాహసం చెయ్యలేను
అందుకే…
నా ప్రేమను కాదన్నా నొచ్చుకోలేదు

నీ మౌనాన్ని ఛేదించాలనుకోలేదు
అందుకే…
నీ నిశ్శబ్ధాన్ని మౌనంగా విన్నాను

అయినా వసంతం రానేవచ్చింది...
నా మదిలో, కోయిల స్థానంలో
నీమౌనం కూసింది

మూగబోయిన మనసూ
ప్రాణం లేని తనువూ
వసంతం సాక్షిగా ఇక…
చిగురించే సాహసం చెయ్యలేవు


****

Wednesday, April 1, 2009

రాముడుండాడు...రామాయణమూ ఉన్నిందేమో!

మొన్న ఉగాదికి మా ఊరు వాయల్పాడుకు బుయ్యొచ్చినా. బస్సు మీద వాయల్పాడనుందిగానీ, ఊళ్ళో బస్సు దిగంగానే "వాల్మీకి పురం" అని అని పేద్ద బోర్డొగటి స్వాగతమిచ్చింది. ఏందిరా అబ్బా ఈ కత? నేను సక్కంగా మావూరికే వచ్చినానా అనే అనుమానమొగటి పొడుసుకొచ్చింది. ఊరు మన్దిలాగుందిలే, పేరు రాసేద్దేలీనోడెవడో రాసుంటాడనుకుని కొంత దూరం పోతినోలేదో, అన్ని షాపుల బోర్డుల పైనా అదే రాత. అయ్యోనారాతా!! అనుకుని తేరిపారా సూడంగానే, కొంత మంది వాల్మీకి పురం అని రాసి వాయల్పాడు అనే పేరు బ్రాకెట్లో బెట్టుండారు.

"ఏమిరా సిద్దా?" అంటే, ఊరు పేరు మారిందంట. బొంబాయి ముంబై అయ్యింది. మద్రాసు చెన్నై అయింది. కలకత్తా కోల్కతా అయింది...ఇప్పుడు మాఊరికి పొయ్యేగాలమొచ్చి, వాయల్పాడు కాసింతా వాల్మీకిపురమయ్యింది. ప్రకృతి, కాలం పెట్టిన వాయల్పాడు అనే పేరిప్పుడు, స్థలపురాణం సొట్టుజూపించి అయ్యోర్లు మార్చేసినారు. దానికి ఊర్లోవాల్లంతా, తానా అంటే తందానా అని ఖాయం జేసినారంట.

ఒగానొక్కాలంలో మాఊరి నూరప్పకొండల్లో, వావిలాల చెట్లు విపరీతంగా ఉండేవంట. ఈ సెట్టు ఆకుల్ని సింధూరపత్రాలని ఔషధాలు తయార్జేసేదానికీ, పూజాపునస్కారాలకూ వాడతార్లెండి. అమాంతంగా ఉండే ఈ వావిలాల చెట్ల పేరు మింద ఈ ఊరికి "వావిలాలపాడు" అని పేరొచ్చిందంట. వావిలాలపాడు పేరు తెలుగు రాని తురకొల్ల నోట్లోబడి, ‘వావిల్ కి పహాడ్’ అయిపోయి అదికాసింతా, వాయల్పాడ్ అయిందని ఒగ కత చెప్తారు. నమ్మబుద్దెయ్యబోయే కత మాత్రం ఇదే.

కానీ, మాఊరి స్థలపురాణం కత ఇంగోటుంది. అదేమంటే, రామాయణం రాసిన వాల్మీకి అయ్యోరు మా ఊరి నూరప్పకొండల్లో తపస్సు జేసినాడంట. అందుకే ఈ ఊర్లో అందరూ రామాయణం కతని తెగపాడేస్తా ఉంటే, ఆ దార్నబొయ్యే అరవోళ్ళు "వాయిల్ పాడు" అనుకున్నారంట. తమిళంలో దానర్థం ఎప్పుడూ నోట్లో పాట నాన్తా ఉండే వాళ్ళుండే చోటు అని అర్థమంట. వాల్మీకి కతకి ఊతమిస్తా, మాఊర్లో ఒక రాములోరి గుడొగటుండాది. దాన్ని త్రేతాయుగంలో జాంబవంతుడు కట్టించాడని చెప్పుకుంటారు. ‘పట్టాభిరామాలయం’ అని ఈ గుడికి మహచెడ్డపెరుంది లెండి. ఇప్పటికి ప్రతిఏటా, శ్రీరామనవమికి తిరణాల వైభవంగా జరుగుతుంది. మా నూరప్పకొండని రైల్ టేసన్ నుంచీ ఒక మూలగాజూస్తే, దానిమింద వాల్మికి కుచ్చున్నట్లు కనబడతాది.

ఈ కత బట్టుకుని మావోల్లు, వాయల్పాడు పేరుని వాల్మీకిపురం జేసేస్నారు. కాబట్టి "ఇందు మూలముగా తెలియజేయినదేమనగా, వాయల్పాడు పట్టణాన్ని ఇకనుంచీ వాల్మీకిపురంగా వ్యవహరించండహో!"


మా ఊరికత ఇన్నాక, నాకొగ గమనమొచ్చింది. మా సుట్టుపక్కల పల్లెల్లో, ఊర్లలో ప్రతిసోటా రాముడు పాదం మోపిన చోటో, సీతమ్మతల్లి తానమాడిన బావో,గుంటో అట్టాగే హనుమంతుడు సంజీవిని పర్వతం మోస్తూ మోస్తూ జారబోసిన రాళ్ళోరప్పలో ఖచ్చితంగా ఉండాయి. అంటే...మా ఊర్లల్లో రాముడుండాడు...రామాయణమూ ఉన్నిందేమో!


****