Saturday, October 31, 2009

తెలుగుకన్నా...పిల్లల హక్కులు ముఖ్యం


మళ్ళీ తెలుగు భాష చర్చల్లోకి వచ్చేసింది. అవకాశం కోసం ఆశగా చూసే తెలుగు వీరులు బ్లాగుల్లో వీరంగాలు మొదలెట్టేసారు. తెలుగు భాషా ప్రశస్త్యం, ఘనతల్ని ఏకరువుపెడుతున్నారు.ప్రస్తుత పరిస్థితి మీద దీర్ఘమైన వ్యాసాలలో నిట్టూర్పు విడుస్తున్నారు. సందులో సందుగా ఇష్యూ లేక సైలెంట్ అయిపోయిన తెలంగాణా వా(బా)దులు ‘తెలుగు వయా తెలుగుతల్లి వయా తెలంగాణాతల్లి’ అనే రాంగ్ రూటొకటి కనిపెట్టి మళ్ళీ అర్థరహితవాదనల్ని అరంగేట్రం చేయించారు. ఈ గోల మధ్య అసలు గోడు పక్కదారిపట్టింది.

అది పిల్లల హక్కులకు సంబంధించింది. చిన్నపిల్లల సున్నిత హృదయాలకు సంబంధించింది. భాషకన్నా నాకు ఆ పిల్లోళ్ళ బాధ ముఖ్యం. వారు అనుభవించిన మానసిక వేదనకు న్యాయం చెయ్యడం ముఖ్యం. నవోదయా విద్యాలయాలో చదువుతున్నప్పుడు మాకు three language formula ఉండేది. వారంలోని ఆరు రోజుల్లో రెండేసి రోజులు తెలుగు, రెండ్రోజులు హిందీ మరో రెండు రోజులు దినసరి వ్యవహారాలలో ఇంగ్లీషు భాషాప్రయోగం చెయ్యడాన్ని ప్రోత్సహించేవారు. ఆ రోజులో ప్రార్థన మొదలు రాత్రి స్టడీ అవర్స్ ఆఖరి ఘడియ వరకూ ఈ విధానం అమలయ్యేలా మానిటరింగ్ జరిగేది. చిన్నచిన్న పనిష్మెంట్లు,జరిమానాలూ సాధారణం. కానీ ఇలాంటి శిక్షలూ, అవమానాలూ ఉండేవి కాదు.

ఈ ఫోటో పేపర్లో చూడగానే నాకొచ్చింది ఆ వ్యవస్థపై కోపం. ఇంగ్లీషు "మాత్రమే" నేర్పించాలనే తల్లిదండ్రుల పట్టుదలలపై చిరాకు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తూ,reinforce చేస్తున్న టీచర్లు,స్కూళ్ళపై నిరసన. అంతకన్నా మించింది ‘ఆ పిల్లల హృదయాలకు తగిలిన గాయం ఎలా మానుతుందా’ అనే వేదన. 

తెలుగు భాష తన బలహీనతల మూలంగానో, పరిస్థితుల ప్రభావం వల్లనో, పాలకుల చేతకానితనం మూలంగానో,తెలుగోళ్ళ ఇంగ్లీషు మోజు కారణంగా బలైనా నాకు పెద్ద తెడాలేదు. కానీ పిల్లల్ని ఇలా మానసిక వేదనకు గురిచేసే హక్కు ఎవరికీ లేదు. చివరికి తల్లిదండ్రులకు కూడా ఆ అధికారం లేదు. Its a gross violation of child rights. అందుకే స్కూలుపై,టీచర్లపై తక్షణం చట్టపరమైన చర్య తీసుకోవాలి.  

*****

Friday, October 23, 2009

మునెమ్మ - A manifesto on the Feminine


డాక్టర్ కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ అటుపాఠకుల్నీ ఇటు విమర్శకుల్నీ ఒక పట్టాన వదిలే నవలైతే కాదనే నిజానికి, నవల విడుదలైన సంవత్సరం తరువాత కూడా జరుగుతున్న చర్చలూ,వ్యాసాల పరంపరలు,కొనసాగుతున్న ఆలోచనలే సాక్ష్యం. ఆ నవలను కొందరు మ్యాజిక్ రియలిజంగా అభివర్ణించి-పొయటిక్ జస్టిస్ ని కొనియాడితే, మరికొందరు అరాకొరా మానసిక విశ్లేషణ చేసి, మోరలిస్టిక్ జడ్జిమెంట్లు రాసిపారేశారు. నా ప్రయత్నంగా నేను ‘నేటివ్ రీడర్’ ధృక్కోణం నుంచీ నవలని స్థానికసాంప్రదాయాల ఫోక్లోర్ ట్రెడిషన్ పంధాను ఆవిష్కరించే అసంపూర్ణ ప్రయత్నం(నా వ్యాసం పూర్తి కాలేదుమరి!) చేశాను.


మునెమ్మ నవల అందులోని పాత్రల మార్మికత,కథ లోని గాథాత్మకత దృష్ట్యా ఒక మనోవైజ్ఞానిక నవల అనేది నిర్వివాదాంశం. కానీ, ప్రాచిన- మానవమౌళిక( primitive and primordial) భావనలైన లైంగికతను మోరలిస్టిక్ దృష్టితో చూసే పురుషభావజాలం కోణం నుంచీ అర్థం చేసుకునే ప్రస్తుతపోకడలలో ఒక objective analysis ఈ నవలపై జరగలేదు అనేది నా నమ్మకం. ‘మునెమ్మ’ కేశవరెడ్డి పైత్యానికి ప్రతీకగా సాక్షి పేపర్లో కాత్యాయని విరుచుకుపడ్డా, కొందరు సాహితీ మిత్రులు ఆవిడ అర్బన్-ఎలీటిస్ట్- మిస్ ఇంటర్ప్రిటేషన్ కు సాగిలపడ్డా, అదంతా అనలిటికల్ సైకాలజీలోని నవీనపోకడలు (ముఖ్యంగా కార్ల్ యంగ్)- సాహిత్యంలో ఆ పోకడల్ని అన్వయించడం తెలియకపోవడమే అనే నిజాన్ని బహుచక్కగా వివరించిన వ్యాసం పసుపులేటి పూర్ణచంద్రరావు గారు ద సండే ఇండియన్ (19th Oct,2009)లో రాసిన "మునెమ్మ - ఒక ‘ఫండమెంటల్’ కథ! : A manifesto on the Feminine" అనే వ్యాసం.


ఆ వ్యాసం లంకెను ఇక్కడ ఇస్తున్నాను (పేజి నెంబర్ 42- 47). చదివి మీ అభిప్రాయాల్ని తెలిపితే, చర్చ ఇక్కడా ప్రారంభించొచ్చు.


****

Thursday, October 22, 2009

ప్రేమ వైరుధ్యం


ప్రేమ కోసం...
జీవితాంతం ఎదురుచూస్తాం.
ఎవరైనా ప్రేమిస్తే...
అనుమానంతో వేధిస్తాం.
అంగీకరించక మారాంచేస్తాం.

****

Wednesday, October 14, 2009

ఆధునికోత్తరవాదం : Post-modernism




"Post-modernism is not an ideology. Its an 'idea' of demystifying all ideologies at the strength of independent thinking" అని మా ఆంగ్లసాహిత్యం ఫ్రొఫెసర్ చెప్పేవారు.అప్పట్లో కొంత అర్థమయ్యిందనిపించినా,ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను.

"ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం". ఇలా ఉంటే ‘మీ మాటల్లో పొంతనలేదు’ అన్న వ్యాఖ్యలు వినాల్సివస్తుంది. అలాంటప్పుడు గ్రహించాల్సింది ఏమిటంటే, seeking nobody's approval and disapproving no one's idea of what you are  is also part of post- modernism.



****

Monday, October 12, 2009

అర్థం-ఆనందం : జీవితం


ఆనందకరమైన జీవితానికీ అర్థవంతమైన జీవితానికీ చాలా తేడా ఉంది.

ఆనందం ఆ క్షణమైతే చాలు. ఆ క్షణంలో అనుభవిస్తేచాలు. అలాగే ప్రతిక్షణాన్నీ అనుభవిస్తూపోతే జీవితమంతా ఆనందమే.
కానీ...అర్థవంతమైన జీవితంకావాలంటే?
ఒక మనిషి జీవితంలోని భూత-భవిష్యత్-వర్తమానాల అంచనా కావాలి.
ఆశలు,ఆశయాలు,కలలు,రహస్యాలు, అనుభవాలసారాలు కావాలి.
భూతకాలపు చీకటికోణాల్ని - వర్తమానపు ఆశల ఊహల్ని అన్నింటినీ ఒక క్షణం జీవించి సొంతం చేసుకోవాలి.

మరి ఆనందకరమైన జీవితం కావాలా...అర్థవంతమైన జీవితం కావాలా?
నిర్ణయం ఎప్పుడూ...మనదే!

****

Thursday, October 1, 2009

నిజం - అబద్ధం: ఒక నిర్వచనం


వస్తువులు మన ఎదురుగా బౌతికంగా ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. కాబట్టి బౌతికవస్తు పరిజ్ఞానానికి ఎటువంటి వ్యతిరేక భావనా లేక వైరుధ్యం ఉండవు. కానీ మన "నిజాల" జ్ఞానానికి ", "అబద్ధం" అనే వ్యతిరేకపదం ఎప్పుడూ వెన్నంటినే ఉంటుంది. అందుకే నిజాల భావనలో వైరుధ్యాలు సహజం. అలాగే అబద్ధాల్లో కూడా వైరుధ్యం అంతే సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే, నిజం-అబద్ధం అనేవి "నమ్మకం" ఆధారంగా ఏర్పడతాయి. కాబట్టి నిజాన్ని అబద్ధంగానూ,అబద్ధాన్ని నిజంగానూ కూడా ఈజీగా నమ్మొచ్చు. ఒక్కోసారి అబద్ధాల్ని మరింత బలీయంగా నమ్మెయ్యొచ్చు. కాబట్టి నమ్మకాల నిజానిజాల్ని సమీక్షించుకోవడం అత్యంత కష్టం. అంతకన్నా క్లిష్టమైన సమస్య ఏమిటంటే... నిజాన్నీ అబద్ధాన్నీ నిర్వచించడం.


ఎవరైనా నిర్వచించడానికి ప్రయత్నించండి మరి!


****

పదునున్నా గురిలేని ‘బాణం’


“వ్యవస్థలో ఉంటూనే దానిలో మార్పు తీసుకురావాలా లేక వ్యవస్థలోని (ఫ్యూడలిజం,పోలీస్ దుండగాలు వంటి) లోపాలకు వ్యతిరేకంగా సాయుధపోరాటం (నక్సలిజం) చెయ్యాలా?” అనే ప్రశ్నకు ఖరాఖండిగా తేల్చిచెప్పగలిగే సమాధానం ఇప్పటికీ ఉండకపోవచ్చు. కానీ పరిణామక్రమంలో, హింసను ప్రేరేపించే ఏ విధానమైనా, ప్రాణహాని కల్పించే ఏ ఆలోచనా ధోరణైనా ఒకవైపు ప్రజాస్వామ్యానికి మరోవైపు మానవత్వానికీ గొడ్డలిపెట్టనే భావన స్థిరపడింది. ఇలాంటి సైద్ధాంతిక నేపధ్యాన్ని సినిమా కోసం ఎంచుకున్నప్పుడు కొంత ఆలోచన,మరికొంత అవగాహన, మరింత స్థితప్రజ్ఞత కథకుడికి,దర్శకుడికి కావాలి. చివరికి ఏంచెప్పాలనుకున్నాడో దానిమీద conviction కావాలి. “బాణం” సినిమాలో అవి లోపించాయి. అందుకే పదునువున్నా గమ్యం లేక, దారితెలీక గురిలేకుండా మిగిలింది.

ఏ కారణంచేతో అర్థంకాదుగానీ, ఈ సినిమా కథ 1989 సంవత్సరంలో జరుగుతుంది. వ్యవస్థను లోపలినుంచే మార్చడానికి పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే ఒక మాజీనక్సలైట్ కొడుకు ‘భగత్’ (నారా రోహిత్). తండ్రి (షయాజీ షిండే) మంచి కోసం ఉద్యమంలో ఉన్నాడని నమ్ముతూనే, తండ్రి విధానాలతో విబేధించే ఆదర్శవాది. ఒక దృశ్యంలో ఏకంగా “నేను మానాన్న లాగా తప్పు చెయ్యను” అని చెప్పగలిగే సిద్ధాంతకర్త. మరోవైపు మరణశయ్యమీదున్న తండ్రినే చంపే ఒక ఫ్యూడల్/మాఫియా యువనాయకుడు ‘శక్తి సాహు’(రణధీర్). ఫ్యూడలిజాన్ని,రౌడీయిజాన్ని రాజకీయంగా మలుచుకుంటేనే వ్యవస్థమీద పట్టు సాధించగలమనే విజన్ కలిగిన విలన్. ఈ రెండు విపరీత శక్తుల ఘర్షణ ఈ సినిమా కథకు మూలం. చివరికి హీరో ఆదర్శం-నమ్మకం గెలుస్తాయా లేక తన ధృక్పధంలో ఏమైనా మార్పులు వస్తాయా? చివరికి ఏంజరుగుతుంది అనేది కథ.

కథకున్న పరిధి చాలా ఉన్నతం. కథలో చర్చించాలనుకున్న విషయం ముదావహం. అయితే కథనంలోని లోపాలు,హీరోపాత్ర ఎదుగుదల క్రమంలోని పేలవత్వం, అత్యంత నీరసమైన ఎడిటింగ్ కలగలిపి, ఉద్దేశం మంచిదైనా కేవలం ఒక మంచి ప్రయత్నంగా మాత్రమే అభినందించదగ్గ సినిమాగా బాణం మిగిలింది.

బరువైన భగత్ పాత్రలో కొత్త నటుడు నారా రోహిత్ నటించడానికి బాగానే ప్రయత్నించాడు. కానీ పాత్రలోని పరిణితి నటనలో లేకపోవడంతో తన పాత్రలోని స్థిరత్వాన్ని, భావగాంభీర్యాన్ని ప్రదర్శించే విషయంలో చాలాసార్లు ఆసక్తిలేనట్లుగా అనిపించే (రోజా సినిమాలో అరవింద్ స్వామి లాంటి) తన భావప్రకటన పంటికిందరాయిలా అనిపిస్తుంది. రోహిత్ కున్న పెద్ద ప్లస్ అతడి వాచకం. కొంచెం నీరసంగా అనిపించినా స్పష్టంగా తెలుగు మాట్లాడగలడు. గొంతు బాగుంది. మాజీనక్సలైట్ గా షయాజి షిండే పాత్ర కొంత అస్తవ్యస్థంగా ఉన్నా, నటనతో దాన్ని సమర్ధవంతంగా కప్పిపుచ్చగలిగాడు. వరకట్నం, అత్తింటి దౌష్ట్యం, భర్తచేతకానితనం, తండ్రి అకాలమరణం వలన అనాధగా మిగిలే సుబ్బలక్ష్మి పాత్రలో నూతన నటి వేదిక ప్రాత్రోచితమైన ఆహార్యంతో సరిపోయింది. హీరోయిన్ పాత్రకు గాత్రదాతగా గాయని సునీత కృషికూడా ఈ పాత్రను పండించడానికి యధావిధి ఉపయోగపడింది. చాలా మంది కొత్త ముఖాలు కనిపించే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన రణధీర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సినిమాలో ఉన్న పెద్ద లోపం ఏ ఆదర్శంకోసమైతే హీరో సినిమా మొత్తం పోరాడతాడో చివరకి అదే ఆదర్శాన్ని తుంగలోతొక్కి విలన్ “సమస్య”ని చట్టబద్ధంగా అనిచెబుతూనే చట్టాన్ని చేతుల్లోకితీసుకుని “తీర్చెయ్యడం”. దానితోపాటూ, హీరోకీ విలన్ కీ మధ్య సరైన direct conflict లేకపోవడం. ఈ సమస్యల్ని మరింత గాఎత్తిచూపేది, చాలా ఆకర్షనీయమైన విలన్ పాత్ర రూపకల్పన. విలన్ శక్తిసాహు వ్యక్తిత్వం,ఆదర్శం నీచమే అయినా, దానిలో అతను చూపే నమ్మకం, తాత్వికత ప్రేక్షకుల్ని ఆ పాత్రని గౌరవించేలా చేస్తాయి. ఆ పాత్రపలికే కొన్ని సంభాషణలు ఎంత intellectual గా ఉంటాయంటే, వాటికి ధియేటర్లో చప్పట్లు తప్పవు. అలాంటి విలన్ ని హీరో సినిమా మొత్తం చెప్పే ఆదర్శాల్ని మంటగలిపి తరిమితరిమి కొడుతుంటే, (అ)సహజంగా సానుభూతి విలన్ మీదకెళ్ళి హీరో హీరోయిజం కృతకంగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగంలో అనిల్ భండారి సినెమాటోగ్రఫీ సినిమాకి చాలా సహాయం చేస్తే, ఎడిటింగ్ సినిమా గమనాన్ని దెబ్బతీసి ప్రేక్షకుల్ని విసిగిస్తుంది. ఈ సినిమాలో దాదాపు ప్రతిషాట్ నిడివినీ తగ్గించొచ్చని చెబితే ఆశ్చర్యపోనక్కరలేదు. మార్తాండ్ కె.వెంకట్ లాంటి సీనియర్ ఎడిటర్ ఇలా చెయ్యడం అర్థంకాని విషయం. లేదా తప్పు మొదటి సారిగా దర్శకత్వం వహించిన దంతులూరి చైతన్య దయినా అయ్యుండాలనిపిస్తుంది. మంచి పోరాటదృశ్యాల్లోకూడా షాట్ల నిడివి గమనిస్తే ఎడిటర్ కు దర్శకుడికీ మధ్య అస్సలు సమన్వయం కుదరలేదనే విషయం తేటతెల్లమవుతుంది.

గంధం నాగరాజు మాటలు కొన్ని సహజంగానూ, మరికొన్ని కొటేషన్లు ఏరుకొచ్చి ఇరికించినట్లుగానూ, మరికొన్ని పాత్రలకు వన్నెతెచ్చేవిగానూ ఉన్నాయి. శ్రమకోర్చి, ఆలోచించి రాసారన్న నిజం “వినిపిస్తుంది”. ఆ శ్రమ అభినందనీయం. మణిశర్మ సంగీతం పాటల్లో పండితే, అనవసరంగా వచ్చే నేపధ్యసంగీతం కటువుగా ఉంటుంది. లిప్ సింక్ లేకుండా అన్నీ నేపధ్యగేయాలే ఉండటం ఒకపెద్ద రిలీఫ్. ప్రత్యేకత కోసం ప్రదమార్థంలో పోరాటదృశ్యాలు తెరపైన చూపించకుండా కేవలం జరిగిన భావనని కలిగించడం సినిమాలోని రక్తపాతం శాతాన్ని తగ్గించినా, ఎందుకో నవ్వొచ్చింది (ముఖ్యంగా రైల్వేస్టేషన్ పోరాటం)గానీ, ఆ “ప్రత్యేకత”ని ఆస్వాదించలేని పరిస్థితి కలిగింది.

మెగానిర్మాత ఆశ్వనీదత్ భారీతన వారసత్వాన్ని వీడి, కుమార్తె ప్రియాంక నిర్మించిన ఈ చిరుచిత్రం ఒక నవీనపోకడగా అభినందనీయం. కానీ కథనం,పాత్రపోషణ మీద అవగాహనలేకుండా సాగిన ఈ ప్రయత్నం కొంత నిరాశని కల్పించిందని మాత్రం చెప్పక తప్పదు. దర్శకుడు చైతన్య ప్రధమ యత్నంగా ఇలాంటి కథను ఎన్నుకోవడం సాహసంగా ఒప్పుకున్నా, ఆ సాహసానికి సార్థకత చేకూర్చలేకపోయాడని ఒప్పుకోక తప్పదు.

మళ్ళీ చాలా రోజులకు తెలుగులో ఒక సిన్సియర్ సినిమా తీసే ప్రయత్నం జరిగిందని ఈ సినిమా చూడమని రెకమండ్ చెయ్యాలా లేక నిరాశపరిచిందని వెళ్ళొద్దని చెప్పాలా తెలీని పరిస్థితిలో ‘బాణం’ నిలిపింది. అందుకే పదునున్నా ఈ బాణానికి గురిలేదు అని సర్ధుకోక తప్పదు.


******