
అంగ్లమంత సౌలభ్యం ఇంకేభాషలో అయినా ఉందా!? !
ఏమీ చెప్పకుండా, కనీసం వందపేజీలు రాయొచ్చు.
‘అవును’, ‘కాదు’ అనే పదాలు ఉపయోగించకుండా, నిర్ణయాన్ని వాయిదా వెయ్యొచ్చు.
ఒకే పదానికి కనీసం మూడు,నాలుగు అర్థాలు చెప్పొచ్చు.
ఆదర్శాన్ని మాటల్లో మాత్రంమే చెప్పి, అసలు నిజాన్ని మరుగుపర్చొచ్చు.
ఇంతకంటే అర్హత అధికారభాషకి ఇంకేంకావాలి?
మన తెలుగు భాషలో ఇన్ని సౌలభ్యాలున్నాయా అసలు!?!
మన తెలుగు ప్రజల్లో ఉన్న లౌక్యం మన తెలుగు భాషలో ఉందా ?
ఖచ్చితమైన అభిప్రాయాలూ,ఆలోచనలూ,నిర్ణయాలూ చెప్పకుండా కనీసం ఒక పేరా అయినా తెలుగులో రాయగలమా?
ఇది తప్పు,ఇది రైటు అనే అభిప్రాయాలేతప్ప maybe, probably,most probably,most likely,possibly లాంటి అసృష్టమైన సమాధానాలు మనదగ్గర అసలున్నాయా?
తెలుగులో ఏదైనా విషయం చెప్పేస్తే, ఇరుక్కుపోకుండా తప్పించుకోగలిగే 'possible deniability' అవకాశం ఉంటుందా?
ప్రతిపదార్థాలూ, తాత్పర్యాలేతప్ప, మన భాషలోని పదాలకి నానార్థాలు తక్కువే...ఇలాంటి భాష అధికారభాషగా పనికొస్తుందంటారా?
కరుకు కార్యాల యంత్రాంగం పనిలో, కమ్మనితియ్యని తెలుగెవరికి కావాలి?
"దీని భావమిదే తిరుమలేశా!" అని ఫాలో అయిపోతామేగానీ, "మరోటెందుకు కాదు వెంకటేశా?"అని ప్రశ్నించడమే నేర్చుకోని భాష, అధికారభాషా గోదాలో మట్టిగర్తుస్తుందేగానీ బతికి బట్టకట్టేనా?
అందుకే అధికారభాషగా ఆంగ్లమే ఉండాలి.
ప్రభుత్వాలూ,లాయర్లూ, అదికారులూ దర్జాగా బతకాలి.
ప్రజలకు ప్రభుత, యంత్రాంగం, చట్టాలూ అర్థంకాకుండానే ఉండాలి.
మనం ఇలాగే కళ్ళకి గంతలు కట్టుకుని, విజయవంతంగా బతకాలి.
అందుకే...అధికారభాషగా ఆంగ్లమే ఉండాలి.
Sunday, July 20, 2008
ఆంగ్లమే అధికార భాషగా ఉండాలి!
Posted by
Kathi Mahesh Kumar
at
8:13 AM
18
comments
Labels: సమాజం
Saturday, July 19, 2008
ముఖానికి కొన్ని రంగులద్దుకుని...!
వీలైతే ఒక మాస్క్ తొడుక్కుని,
ఎదురైన ప్రతిఒక్కరినీ...పలకరిస్తాను.
ఉదయాన్నే ఒక చిరునవ్వు,
మధ్యాహ్నం ఒక ఆకలి అరుపూ,
సాయంత్రం ఒక సరదా కేక,
ఆపైన నిశిరాతిరిలో ఒక ఆవులింతమధ్య...
నిద్రకొరిగి, సేదతీరుతాను.
కానీ...జీవితమంటే ఇంతేనా?
ఆకలికోసం బ్రతకడం.
ఇతరుల అంగీకారంకోసం వెతకడం.
ఎవరోచెప్పిన జీవనసత్యాలకి ఒదగడం.
మనసును చంపి, మన్ననకై బతకడం.
వారమంతా నలిగి,
వీకెండ్ కోసం చూడడం.
జీవితమంటే ఇంతేనా?
స్నేహాన్ని ఉన్నతమంటాం.
ప్రేమే శాశ్వతమంటాం.
స్నేహితుల్ని సాధించడానికీ,
ప్రేమికుల్ని శోధించడానికీ,
జీవితాన్ని వెచ్చిస్తాం.
తెలియని ప్రశ్నల్నీ,తెలిసిన జవాబుల్నీ
మళ్ళీమళ్ళీ సంధిస్తాం.
జీవితమంటే నిజంగా ఇంతేనా?
ఇదే జీవితమైతే ! ఇప్పుడే తీసేసుకో !!
బిల్లు చూసి ప్రేమించడం,
వీకెండ్లకోసం జీవించడం,
నాకొద్దు.
కొలిచే స్నేహం,
కొనుక్కునే ప్రేమా...
నాకొద్దు.
ఈ మాస్కునీడలో రంగుమారిన ముఖం
అతికించిన నవ్వులూ,
తప్పనిసరై అరిచే అరుపులూ,కేకలూ
నాకొద్దు.
నిజంగా, ఈ జీవితమే నాకొద్దు.
నేను కావాలి...నాకు నేనుమాత్రమే కావాలి.
నేను నేనుగా బ్రతికే జీవితం కావాలి.
ఈ మధ్య ‘కొత్తపాళీ’ గారు తన గూగుల్ చాట్ లో పెట్టుకున్న మాస్క్ చూసిన ప్రతిసారీ నాకు T.S.Eliot రాసిన ఒక కవితలోని ఈ క్రింది లైన్లు గుర్తుకొచ్చేవి;
It's Time
It's time to prepare a face
Prepare a face to meet the faces that you meet
పై పంక్తుల స్ఫూర్తితో ఈ కవితను రాసాను.
Posted by
Kathi Mahesh Kumar
at
10:37 PM
12
comments
Labels: కవిత
కత్తిరింపు సేవలు...
గమనిక : ఈ వ్యాసం యొక్క అసలు శీర్షిక "కత్తిరిద్దాం రా!" కు సెన్సారువారు అభ్యంతరం తెలిపిన కారణంగా మార్చడమైనది. దేన్నికత్తిరిస్తారో... శీర్షికలో లేకపోవడం వలన, ప్రేక్షకులు తమ ఆలోచనాశక్తిని ఉపయోగించి పెడర్థాలు, ముఖ్యంగా బూతు ప్రధానమైన అర్థాలు తీస్తారేమోనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘కంత్రీ’ సినిమాలోని ఒక దృశ్యం వలన దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ‘గోరింటాకు’ లోని డైలాగుతో వికలాంగులు కలతచెందారు. ‘రెడీ’ సినిమాలో సునిల్ పాత్రద్వారా కూచిపూడి కళాకారులు మనస్థాపంపొందారు. ఈ ఘటనల నేపధ్యంలో ప్రాంతీయ సెన్సార్ మండలి కొత్త నియమాల్ని సృష్టించి అమలు చేసింది. ఆ కొత్త నియమాల్ని కొంత తెలుగులో మార్చి ఇక్కడ ఇస్తున్నాను చూడండి;
- ఏదైనా కులాన్ని,మతాన్నీ,ప్రాంతాన్నీ లేక వృత్తిని సూచించే దృశ్యాలనూ లేక సంవాదాలు be scrupulously avoided.
Should refrain from using words like “కుంటోడా, గుడ్డోడా, చెవిటోడా, మూగోడా,నత్తి,” - Words like “నీయమ్మ, నీయమ్మ, నాకొడుకా, దొంగనాకొడుకు, దొబ్బెయ్యడం, తొక్కలో, etc may be removed.
- Lampooning or portraying or making mockery of their caste/religious status must be avoided. Should refrain from showing physically challenged as villains and comedians and showing them in bad light.
- కులపర మతపరమైన పేర్లు should not be used. ప్రాంతీయ యాసల్నీ, మాండలికాల్నీ విలన్లకూ, కామెడియన్ల చిత్రీకరణలో may not be used
- పోలీసు, వైద్యం మరియూ టీచర్ల వంటి వృత్తులను should not be show in poor light as they would demoralize the respective professions.
- Extra care should be taken not to film violent scenes and objectionable scenes at places of worship. The sanctity of the place of worship should be kept in mind.
పైనున్న నియమాలు సెన్సారు చిత్తశుద్దినేకాక, వారి తెలియని తనాన్నీ, చేతకాని తనాన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కావాలనే నేను అనువదించని ఆంగ్ల వాక్యాలు ఎంత అర్థరహితంగా, డొంకతిరుగుడుగా ఉన్నాయో చూడండి. ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటిస్తే ఏదైనా సినిమా తియ్యగలమా? అసలు ఉద్దేశమేమిటో...ఈ నియమావళి ఎందుకో దీనికి రూపకల్పన చేసినవాళ్ళకైనా తెలుసోలేదో సందేహమే! ఇలాంటి అమలు చెయ్యలేని రూల్స్ వల్ల నిజంగా ఎవరికి లాభమో తెలియడం లేదు.
ఇప్పుడే అందిన వార్త: ‘కత్తిరింపు సేవలు’ అని ఉన్న నా టపా శీర్షిక, ‘నాయీబ్రాహ్మణుల’ వృత్తిని కించపరిచేలా ఉందని ఆ సంఘాలు ఆందోళన చెయ్యడం వలన సెన్సారువారు నా టపా సర్టిఫికేట్ ని లాగేసుకుని, బ్లాగునుండీ గెంటేసారు. కాబట్టి అర్ధాంతరంగా టపాకు సెలవుతీసుకోవలసి వస్తోంది. ఈ వివాదం నుండీ బయటబడితే, తీరిగ్గా ఈ విషయం మీద మరో టపా సవివరంగా రాస్తాను.
Posted by
Kathi Mahesh Kumar
at
6:48 AM
10
comments
Labels: సినిమాలు
Thursday, July 17, 2008
నా జ్ఞాపకాల పొరల్లో, బాల్యప్రేమల గుభాళింపులు
మా ఐదేళ్ళ అవినాష్ కళ్ళు, ‘కత్రీనా కైఫ్’ మోము కనపడగానే వెలిగిపోతాయి. అదేమి బాల్యచాపల్యమో తెలీదు.నిజంగా, "అంత చిన్నపిల్లాడి మనసులో తెలీయని ప్రేమభావాలుంటాయా?" అంటే అంత సులభంగా సమాధానం చెప్పలేం. సరదాగా అడిగితే, "అఛ్ఛీలగ్తీహై!" అని హిందీలో సిగ్గుపడతాడు. ఈ రోజు మావాడు , "సింగ్ ఈజ్ కింగ్" అనే కత్రీనా పాట టీవీలో కళ్ళప్పగించి చూస్తుంటే, తఠాలున నా జ్ఞాపకాల పొరల్లోంచీ, బాల్యప్రేమల గుభాళింపులు గుప్పుమన్నాయి.
నిజమే! ఊహతెలీని రోజుల్లోకూడా నా మదిలో వగలరాణులుండేవారు. పక్కింటి అమ్మయో, ఎదురింటి అందమైన ఆంటీయో కారు సుమండీ. నాబాల్యప్రేమల ఊహల్లో తెరనేలే తారామణులే, నా ప్రేమను వెలిగించిన తారాదీపాలయ్యేవారు. చెప్పడానికీ, అదీ బాహాటంగా చెప్పడానికి ఇబ్బందిగా అనిపించినా ఇది మాత్రం నిజం. నా ఈజ్ఞాపకాల తోరణాలు సద్యోజనితం.
అప్పుడు నావయసు నాకేతెలీదు, కానీ ఏదో పేరుతెలీని బ్లాకన్డ్ వైట్ సినిమాలో, చేతిలో బ్యాంట్మింటన్ బ్యాటూ,తెల్ల టీషర్టూ,పొట్టి నిక్కరూ వేసుకున్న లలనామణి ‘కాంచన’నుచూసి మనసుపారేసుకున్నాను. ఆ సినిమాలో కృష్ణ హీరో అనుకుంటా ! కాంచనపక్కన తను నిలబడి ప్రేమించినప్పుడల్లా, నా హృదయం వేయిముక్కలైన వైనాన్ని ఎట్లాచెప్పేది? ఆ తీవ్రత, అర్థంకాని అలజడీ అనుభవిస్తేనే తెలుస్తుంది. తనే నా మొదటి గ్లామర్ క్వీన్...
ఒక శుభదినాన, కేవలం పాతసినిమాలు పొద్దునపూట మాత్రమే ధియేటర్లో వేస్తున్న తరుణాన, "ఓ హలా..నాగినీ" అంటూ నా హృదయక్షేత్రంలో నగారామోహించిన ముగ్ధమోము సుందరి, ముద్దుమాటల తొలకరి బి.సరోజాదేవి. అప్పటికి నాకు కన్నడ భాషతెలీదుగానీ, తన తెలుగులో ఉన్న కన్నడయాసని మనస్పూర్తిగా ఆరాధించి, అభిమానించేసాను. ‘జగదేకవీరుని కథ’లో రామారావు అంతమంది అమ్మాయిల్ని భార్యలుగా కోరి తండ్రిచేత దేశబహిష్కృతుడు కాబడతాడుగానీ, నేనైతే ఒక్క సరోజాదేవితో సరిపెట్టేవాడినే అనుకున్నాను. ఇప్పటికీ అనుకుంటానుకూడా!
నలుపుతెలుపులు దాటి వెండితెర పంచరంగులుపులుముకున్నా, ఆ ఈస్ట్మన్ రంగుల జమానాలో నా కంటికింపైన నారీమణెవ్వరూ లేరనే చెప్పుకోవాలి. వాణిశ్రీ, శారదలు రాజ్యాలేలినా, నాహృదయ సామ్రాజ్యం పొలిమేరల్లోకికూడా వీరు ప్రవేశార్హతనోచుకోలేదు. జమునా,జయలలిత, చంద్రకళ తమ జాణతనాన్ని పండించినా, నా జామురాతిరి కలల కొనలనికూడా తాకలేకపోయారు.
చిన్నపాప పెద్దదై, ‘పదహారేళ్ళ’కే కొన్నివేల శతఘ్నుల్ని పేల్చిన శ్రీదేవిని ఆ సినిమాలో చాటుగా చెయ్యడ్డంపెట్టుకుని వేళ్ళసందుల్లోంచీ చూసిన క్షణం ఇంకా నాకు బాగా గుర్తు. ఒక్కటికెట్టుపై రెండాటల రోజున చూసిన సినిమా ఇది. దీనితోపాటూ మరో సినిమా చూపుతారన్నా, చూసింది పదాటలతో సమానం అనిపించిన ఆ అనుభవం, చెప్పినా అర్థమయ్యేనా? వేళ్ళ సందుల్లోంచీ, "ఎవరేమనుకుంటారో" అని చాటుగా చూసిన అందాలు కళ్ళనిదాటి, ఎప్పుడో గుండెల్లో నిండాయంటే, ఎట్లా వివరించేది?
"మౌనమేలనోయి...ఈ మరపురాని రేయి" అంటూ పవిత్రమైన సినిమాల దర్శకుడే ప్రేమలోపడితీసిన పాటలో, షవర్ కింద జయప్రదని చూసి చలించని హృదయం ఉంటుందా? నా వయసప్పుడు...ఎందుకులెండి, విని మీరిబ్బందిపడతారు. నాకు సౌందర్య దృష్టిని ప్రసాదించిన దేవతలకు నమస్సులర్పించడం, జయప్రదనారాధించడం తప్ప అప్పుడు నేను చెయ్యగలిగింది ఏమీ లేదనిపించింది. స్త్రీత్వపు మధురస్పర్శని మనసుకి చూపిన మందగమనకు నా మన:సుమాంజలి.
ఫోటోలో ఉన్న అగ్నిని తను ప్రేమిస్తున్నా, విజయశాంతి వన్నెల్ని వలచిన నాకనులు ‘అగ్నిపర్వతా’లైన తీరు నాకుతప్ప అన్యులెవ్వరికీ తెలీదు. "ఈ గాలిలో...ఎక్కడొ అలికిడి...అక్కడే అలజడి" అన్నపాటలోని పదాలకు అర్థం పూర్తిగా తెలియకున్నా, భావం మాత్రం మళ్ళీ ఇంకోసారి సినిమా చూడమని చెప్పిన. మూడోరోజు మళ్ళీ ధియేటర్ కెళ్ళిన నేను, ఆ పాటకోసం అంకెలు లెక్కపెట్టుకుని ఎదురుచూసిన ఆత్రాన్ని, ప్రేమనికాక మరేమనుకోవాలి? నిజమే, ప్రేమించాను ఫోటోలో ఉన్న కృష్ణని చంపాలన్నంత ఈర్షపుట్టేంతగా ఆ క్షణాన ప్రేమించాను.
‘అహనా పెళ్ళంట’, ‘మజ్ను’ ఇంకాఎన్నో సినిమాల్లో తెరమీద తను ప్రత్యక్షమైతే, నా మనసు ఆకాశంలో నక్షత్రమై మెరిసిన ఘడియలెన్నో. "కళ్యాణ వైభోగమే...ఈ సీతారాముల కల్యాణమే..." అని తను సిగ్గుపడుతుంటే, "నాకోసమేనేమో!" అని భ్రమించిన తరుణాన, నన్నునేను అభినందించుకున్న పిచ్చినెలా మర్చిపోవాలి? రజని తన పేరు, పక్కింటి అమ్మాయిలాంటి సింప్లిసిటీ తనతీరు. చాలా మందిని ప్రేమించినా, పెళ్ళికోసం మాత్రం ఎవరైనా రజనిని కోరాల్సినవారే! వారిలో నేనూ ఒకడిని. చెప్పాపెట్టకుండా తను చిత్రసీమని వదిలిన నాడు, సినిమా సినిమాలో తనకోసం వెదకి వేసారిన నా మనసెంత బాధపడిందో చెబితే మాత్రం తెలుస్తుందా? ఇప్పటికీ నా కనులు తనకోసం వెదుకుతాయి. తన సమాచారం కోసం చెవులు తరుస్తాయి.
ఆ తరువాత నాకు వయసొచ్చింది. క్లాసులోని కవితా, పక్కింటి పంకజాలు కూడా అందంగా అనిపించారు, తెరతారామణుల్ని మరిపించారు. "కానీ ఏంలాభం?", ఆ ఆనందాలు, అనుభవాలూ, ఆలోచనలూ,ఆరాధనలూ, అద్వితీయ ఆకర్షణలూ లేవు. కేవలం నిజాలూ, నీరసాలూ, నీకూ-నాకూ అనే లావాదేవీలే తప్ప మురిపాలూ,లాలిత్యాలూ ఎక్కడ?
మరిప్పుడు!?! శ్రియ పెదవుల్లో సిరామిక్ చదును తప్ప మనసుగిల్లే మహత్యాలెక్కడ. ఇలియానా వొంపుల్లో ఇత్తడిబిందె నిలుస్తుందేమోగానీ, నా మనసుమాత్రం పక్కకే జారిపొతుంది. అసిన్ చూపుల్లో ఆకర్షణున్నా, అందిపుచ్చుకుందామని అణుమాత్రంగానైనా అనిపించదే! నయనతార నగుమోము నాకేంతక్కువన్నా, నీకన్నా నయాగరాజలపాతం అక్షరాలా నయమని సమాధానం చెప్పాలనిపిస్తుంది. త్రిష చింతాకు కళ్ళు చూసి చిర్రెత్తుకొస్తుందిగానీ, చెంపాచెంపారాసి చెలిమిచెయ్యబుద్దవుతుందా?
ఆ చిన్ననాటి ప్రేమల్లో చాలా బలముందనుకుంటాను. అందుకే మావాడి సెలెక్షన్ను మెచ్చుకుంటారు. బహుశా ఇవే వాడికి మిగిలే నిజమైన ప్రేమ జ్ఞాపకాలవుతాయేమో! నా జీవితంలో నేను తెలుసుకున్న నిజాలు వాడికి ప్రేమని నేర్పే పాఠాలవుతాయేమో! చూడాలి...చూసి ఆనందించాలి.
Posted by
Kathi Mahesh Kumar
at
10:03 PM
42
comments
Labels: సినిమాలు
‘దొంగ’ హీరోలు
బహుభాషా నటుడైన రమేష్ అర్వింద్ (రుద్రవీణ, సతి లీలావతి Etc.) ఈ మధ్య ‘యాక్సిడెంట్’ అనే కన్నడ సినిమాలో హీరోగా చేస్తూ, రేడీయోజాకీ పాత్రని పోషించాడు. టీవీలో ఛానళ్ళు నొక్కుతున్న నాకు తన ఇంటర్వూ ఒకటి కనబడింది. "అసలు రేడియోజాకీ పాత్ర ఎందుకు పోషిస్తున్నారు?" అన్న ప్రశ్నకు అతడి సమాధానం, "ఈ మధ్య యువత చాలా విన్నూతనమైన ఉద్యోగాలు చేస్తోంది. వాళ్ళతో ఐడెంటిఫై చెయ్యబడితే బాగుంటుందని, ఈ పాత్రను అలా తీర్చిదిద్దాం. అంతేకాక, ఈ మధ్య ఒక సినిమా ప్రమోషన్ కోసం ఒక రేడియో స్టేషన్ కి వెళ్ళిన నేను, వ్యక్తిగతంగా ఈ ఉద్యోగశైలిపట్ల ఆకర్షితుడ్నయ్యాను. అందుకే ఇలా ప్రయత్నించాం" అన్నాడు.
ఈ ఇంటర్వ్యూ చూసిన మరునాడు థియేటర్లో ‘రేస్’ అనే హిందీ సినిమా చూసాను. ఈ సినిమాలో హీరో,హీరోయిన్, విలన్, కామెడియన్ అనే భేధం లేకుండా అందరూ మోసగాళ్ళు, దొంగలూ, డబ్బుకోసం హత్య చెయ్యడానికి కూడా వెనుదియ్యని మహామహులూ కనబడ్డారు. అన్నాతమ్ముడా, ప్రియురాలాపెళ్ళామా, పోలీసాదొంగా అన్న తేడాలేకుండా ఒకర్నొకరు దగా చేసుకుంటూ దర్జాగా నడిచిన కథయిది. పైపెచ్చు ఒక పేద్ధ కమర్షియల్ హిట్ కూడా. ఈ సినిమాచూసిన తరువాత నాకర్థమయ్యిందేమిటంటే, BAD BOY is the new HERO అని.
ఈ సినిమాచూసి నేను తెలుసుకున్న పరమ సత్యాన్ని నామిత్రుడొకడికి అర్జంటుగా ఫోన్ చేసి చెప్పాను. అటునుంచీ ఒక్క క్షణం నిశ్శబ్ధం తరువాత విలన్లా నవ్వుతూ, "ఓరి మూర్ఖుడా! ఆంధ్రాలో లేక నువ్వు బతికిపోయావుగానీ, తెలుగు హీరో ఎప్పడో దొంగగా మారిపోయాడ్రా ఫూల్" అని నా కళ్ళు తెరిపించాడు. ఆ తరువాత కళ్ళుమూసుకునొక్కసారి మననం చేసుకుంటే, ఆల్రెడీ కళ్ళుతెరిచిన నా కళ్ళలో నీళ్ళుతిరిగాయి. 2007 లో పెద్దహిట్లైన పాప్యులర్ హీరొల సినిమాలన్నింటిలోనూ కథానాయకుడు దొంగో,ఫ్యాక్షనిస్టో, హంతకుడో,మోసగాడో లేక అంతకన్నా బరితెగించేవాడోగానే కనిపించి ప్రేక్షకులకి విందులు చేసారు. 2006 సంవత్సరమూ అందుకు మినహాయింపుకాదు.ఇక 2008 లోనూ పెద్ద మార్పొచ్చినట్లు అనిపించడం లేదు. అంటే, మొత్తానికి మన సినిమాలల్లో సాధారణ మనుషులో, మర్యాదగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళో, కళాకారులో హీరోలుగా కనబడే అవకాశం అస్సలు లేదన్నమాట.
ఇంత జ్ఞానోదయమైనా నిరాశ చెందక అవిశ్రామంగా వెతికి రెండు సినిమా పట్టుకున్నా, మొదటిది ‘ఆడవారి మాటలకూ అర్థాలే వేరులే’, రెండోది ‘హ్యాపీడేస్’. ‘ఆడవారి మాటలకు...’లో హీరో(వెంకటేష్) ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇదేమాట నా సాఫ్ట్వేర్ మిత్రుడికి చెబితే, వాడు తిట్టిన తిట్లు వినలేక నా చెవిపోటొచ్చింది. "వాడు చేసే ప్రాజెక్టేమిటి, వాడు జాయినైన కంపెనీ ఏమిటి, ఒక్కరాత్రిలో వాడు సాల్వ్ చేసే ప్రాబ్లమెమిటి, వాడ్ని తేరగా ఫారిన్ ఎందుకు పంపుతారు" అంటూ నానా ప్రశ్నలూ వేసి, నా ఆనందాన్ని కాస్తా "తుస్సు" మనిపించాడు. అంటే తేలిందేమిటయ్యా అంటే, పాత్ర ఉన్నా అది నిజంగా నిజానికి చాలా దూరం అని.
ఇక మిగిలిన ‘హ్యాపీడేస్’ని పట్టుకుని నేను హ్యపీగా ఉండగా, ఆ ఆనందమూ నిలవలేదు. దానిమీదా నాకు చాంతాడంత జ్ఞానాన్ని ఇంజనీరింగ్ చదివిన నా మిత్రులు అందిస్తే, అసలు ఆ సినిమాలోని పాత్రల పాంతీయత, భాష, భావాలపై ఒక తీవ్రమైన లెక్చర్ నా ఇంకో ఔత్సాహిక సినిమా ప్రేమికుడి ద్వారా వినక తప్పింది కాదు. అంతా వినిపించాక, "అయినా గుడ్డిలో మెల్ల అనుకుని ఈ సినిమాను ఒక సారి చూసి, ప్రయత్నాన్ని ప్రశంసించొచ్చుగానీ, ఏముందని అవార్డులమీద అవార్డులిస్తున్నారో ఈ అమెచ్యూర్ ఫిల్మ్ కు" అని సూత్రీకరించేసాడు. చివరాఖరికి నామీద దయతల్చి, "నీ బాధ దొంగ హీరోలగురించి కాబట్టి, ఈ రెండూ సినిమాల్నీ మినహాయించుకుని సంతోషించు" అని స్వాంతన పలికాడు.
ఏదిఏమైనా, ఇంత శోధన తరువాత నేను సాధించిన నిజం మాత్రం, మన ఖర్మకు ప్రస్తుతానికి ‘దొంగలే మంచి హీరోలు’ అని.
Posted by
Kathi Mahesh Kumar
at
6:11 PM
18
comments
Labels: సినిమాలు
Wednesday, July 16, 2008
ఒక మెతుకు పట్టుకునిచూస్తే చాలా !?!
"అన్నం ఉడికిందోలేదో చెప్పడానికి ఒక మెతుకుపట్టుకు చూస్తే చాలదా!" అనేది మనం sweeping generalization చెయ్యడానికి చాలా కన్వీనియంట్ గా వాడే సామెత. ‘నిజంగా ఒక మెతుకుని పట్టుకునిచూస్తే చాలా?’, అన్నది ఇక్కడ చర్చించాల్సిన సమస్య.
నా ఇదివరకటి టపా ‘నా మనోభావాలు దెబ్బతిన్నాయి’లో, తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ శంకర్ అనే పాఠకుడు చాలా వివేకవంతమైన ప్రశ్నను, సోదాహరణంగా లేవదీసారు. తను "గోరింటాకు సినిమా విషయంలో నేను మంద కృష్ణని సమర్ధిస్తా, ఆంధ్రజ్యోతి విషయంలో వ్యతిరేకిస్తా" అన్నారు. ఒక్క క్షణం నాకు అర్థంకాలేదు, కానీ తరువాత ఆలోచించి చూస్తే "నిజమేనేమో!" అనిపించింది. ఒకసారి ‘కంత్రి’ సినిమాపై మందకృష్ణ మాదిగ లేవదీసిన దుమారం రాజకీయ ప్రేరేపితం అనుకుని నిరసించినా, ‘గోరింటాకు’ సినిమా విషయంలో వికలాంగులని కించపరిచేలాఉన్న డైలాగుపై సాగిన సంవాదం చాలావరకూ అంగీకారాత్మకంగా అనిపిస్తుంది.
జూనియర్ ఎన్.టి.ఆర్ తోనున్న రాజకీయవిభెధాన్ని దృష్టిలో పెట్టుకుని ‘కంత్రీ’పై ధ్వజమెత్తినా, ఇప్పుడే కాంగ్రెస్లో చేసిన రాజశేఖర్ సినిమాపై దండెత్తడానికి సహేతుకమైన కారణం నాకు కనిపించలేదు. ఒక బ్లాగు మిత్రుడు వ్యంగ్యంగా, ‘ఇదొక నడవని సినిమాకి ప్రమోషనల్ పబ్లిసిటీ’గా చెప్పబూనినా, ఒక దగ్గర నెగెటివ్ పబ్లిసిటీ అయిన పంధా ఇంకో సినిమా ప్రమోషన్ కి ఎలా పనికివస్తుందో కాస్త ఆలోచించాల్సిన విషయమే సుమా! అంతెందుకు, ఆంధ్రజ్యొతి విషయంలో మూర్ఖంగా ప్రవర్తించిన మంద కృష్ణ, అంతకుమునుపే వికలాంగులతోకలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి, వారి హక్కుల్ని కాపాడాడన్న విషయం మనలో చాలామంది (నేను కూడా) కన్వీనియంట్ గా మర్చిపోయాం.
ఈ మందకృష్ణ ఈ ఒక్క ఘటనలో వేసిన తింగరివేషాన్ని అడ్డంపెట్టుకుని కొందరు బ్లాగర్లు ఏకంగా, "దళితులంతా ఇంతే" అనే సిద్దాంతాన్నికూడా ప్రతిపాదించేసారు. ఈ sweeping generalization ఎంత హాస్యాస్పదమంటే, "మా చిన్నప్పటి ఇల్లు మురికికాలువ పక్కనుండేది కాబట్టి, ఆ తరువాత నేను మారిన ఇళ్ళన్నీ మురికి కాలువ పక్కనే ఉంటాయి" అని ప్రతిపాదించినంత. అందుకే బహుశా, ఒక మెతుకుపట్టుకుని చూస్తే, మొత్తం అన్నం కొన్ని విషయాలలో ఉడికినట్లు కాదు అనిపిస్తుంది.
ఒక చర్యకి లక్షలాది మనుషుల మనోభావాలు ఒకేసారి దెబ్బతినెయ్యడం ఎంత విచిత్రమో, ఒక మతం, కులం, వర్గంలోని ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తే, మొత్తం జాతిని తప్పుబట్టడం అంతే విచిత్రం కాదూ!
బాలథాకరే, ప్రవీణ్ తోగాడియా లాంటివాళ్ళు "ముస్లింలను పాకిస్తాన్ పంపెయ్యండి" అంటే, మొత్తం హిందువులంతా అలాగే అనుకుంటారని అంగీకరిద్ధామా?
"హిందువులు ముస్లింలను అణగదొక్కేస్తున్నారు" అని జామామసీద్ పెద్ద అంటే, దేశంలో ఉన్న ముస్లింలందరూ అలాగే భావిస్తున్నారని ప్రతిపాదించేద్ధామా?
కొందరు మహిళలు, అత్యాచార నిరోధకచట్టాన్నో లేక కట్నవ్యతిరేక చట్టాన్నో కక్షసాధింపుకోసం వాడుతున్నారని, అందరూ దుర్వినియోగ పరుస్తున్నారని భావించి దాన్ని రద్దుచేద్దామా?
SC/ST అత్యాచార నిరోధక చట్టాన్ని కొందరు దళితులు స్వప్రయోజనాలకోసం వాడుతున్నారని, అగ్రవర్ణాల అణచివేతకై దీన్ని ఆయుధంగా వాడుతున్నారని సిద్ధాంతీకరించేద్దామా?
అందుకే కొన్ని పరిస్థితులూ, విషయాలలో మెతుకుపట్టుకుని చూసి, మొత్తం సంగతిని అవగాహనచెయ్యడం మాని, కొంత ముందువెనకల తార్కికాన్ని ఆసరాతీసుకుని నిర్ణయాలూ చేద్దాం ! సిద్ధాంతాల్ని ప్రతిపాదిద్దాం!!
Posted by
Kathi Mahesh Kumar
at
7:04 PM
23
comments
Labels: సమాజం
‘సప్తపది’ - కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం !

జాతీయస్థాయిలో తెలుగు సినిమాకి ఒక గౌరవం కల్పించిన శంకరాభరణం (1979) తరువాత, దర్శకుడు ‘కళాతపస్వి’ కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తపది’(1980).
ఒక మహత్తర సంగీతభరిత చిత్రం తరువాత ఒక వివాదాస్పద సామాజిక విషయమైన కులాంతర వివాహం గురించి సినిమా తియ్యనెంచడం సాహసమనే చెప్పాలి. అంతేకాక, కథని ఒక బ్రాహ్మణ ధృక్కోణంలో అంగీకారాత్మకంగా చెప్పగలగడం నిజంగా కత్తిమీద సాము వంటిది.
1970 లలో మొదలైన అభ్యుదయ భావాలు,1980లకొచ్చేసరికీ యువతలో బలంగా నాటుకోవడంతో పాటూ, వాటికి ప్రతికూలమైన సామాజిక వాతావరణంకూడా ఒక defense mechanism లాగా ఏర్పడిన తరుణం అది. ఇలాంటి సున్నితమైన సామాజిక పరిస్థితి మధ్య ఇలాంటి సినిమా తియ్యడం ద్వారా విశ్వనాధ్ గారు సినిమాకున్న సామాజిక బాధ్యతతోపాటూ, ఒక దర్శకుడిగా తన సామాజిక నిబద్ధతనూ పరిచయం చేసారు.
పూర్తి విశ్లేషణని ఇక్కడ చదవండి.
Posted by
Kathi Mahesh Kumar
at
2:11 PM
0
comments
Labels: సినిమాలు

