ఎమ్.ఎఫ్ హుస్సేన్ కతార్ పౌరసత్వం తీసుకోవడంతో మళ్ళీ చర్చలు మొదలు.
కొందరు అన్యాయం అంటే, మరొ కొందరు అక్రమం అన్నారు. కొందరు తగినశాస్తి అనుకుంటే ఇంకొందరు ముసలోడు చస్తే పీడాపోతుందనుకున్నారు.
విషయమంతా ఈ కళాకారుడు హిందూదేవతల్ని "నగ్నంగా" చిత్రించాడన్న వంకతో మొదలయ్యింది.
ఆర్టుగ్యాలరీల ముఖమైనా చూడని కొందరు ఎవరో చెప్పిన హిందుత్వ అజెండా ప్రాపగాండాతో అర్జంటుగా మనోభావాలు గాయపర్చేసుకున్నారు.
నిజంగా సమస్య నగ్నత్వం అనుకునేవాళ్ళు ఉన్న దేవాలయాలన్నింటినీ పడగొట్టెయ్యాలి. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో ఉన్నవన్నీ మొదటిగా నేలమట్టం చేసెయ్యాలి.
దేవాలయాల చుట్టుపక్కలనుంచీ పూజలందుకునే ఉత్సవ విగ్రహం వరకూ పాతికో ముప్పాతికోవంతు నగ్నంగానే ఉంటాయి మరి!
నిజానికి పూర్తిగా బట్టలేసుకున్న హిందూ దేవతలు 19 వ శతాబ్ధంలో రాజారవివర్మ క్రియేషన్.
ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగంలోకి రావడం వలన, దానిద్వారా కమర్షియల్ ఆర్ట్ ను పెంపొందించే భాగంగా రూపిందించబడిన శైలి అది.
అంటే ఈ గొడవంతా నిజమైన హిందూ ఐకనోగ్రఫీని పక్కనబెట్టి రాజారవివర్మ కళాసృష్టిని మాత్రమే ప్రామాణికంగా ఎంచుకుంటున్న కొందరి తెలియనితనమే తప్ప మరొకటి కాదు.
ఎట్టకేలకు కాటికి కాళ్ళుజాపుకున్న హుస్సేన్ (95 ఏళ్ళ వయసువాడు మరి) దేశం వదిలి పోవాల్సి వచ్చింది. ఇందులో మూర్ఖత్వంతో మనోభావాలు దెబ్బతీసుకున్నాళ్ళకన్నా ఇలాంటి పిచ్చిచేష్టలు జరుగుతున్నా ఏమీ చెయ్యక చేతులుకట్టి కూర్చున్న ప్రభుత్వాలది పెద్దతప్పుంది. ఇప్పటివరకూ క్రైస్తవ, ఇస్లాం మతాల్లో మాత్రమే కనిపిస్తూవస్తున్న ఈ ఉన్మాదం ఈ మధ్యకాలంలోనే హిందూమతానికీ పాకింది. నియో-హిందుత్వ భావజాలంలో మునిగిపోతున్న కొందరి పైత్యం కారణంగా సృజనాత్మక స్వాతంత్ర్యం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అభిలషణీయం కాని ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి చేటు మాత్రం ఖచ్చితంగా చేస్తాయి.
****