ట్రాన్స్పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా (Transparency International India) అనే ఒక స్వఛ్చంద సంస్థ ఈ మధ్య దేశవ్యాప్తంగా జరిపిన అవినీతి సర్వేలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని "ఫరవాలేదు" (Moderate) అనే కేటగిరీ చేర్చారు. ఈ సర్వేలో "ప్రమాదకర స్థితి"(Alarming), "చాలా ఎక్కువ"(Very High), "ఎక్కువ"(High) , "ఫరవాలేదు" (Moderate) అనే కేటగిరీలున్నాయ్. అంటే, మొత్తానికి అవినీతిలో మన ప్రభుత్వాలకంటే చాలా రాష్ట్రాలు ముందున్నాయన్నమాట.
ఈ సర్వే దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాల (BPL Families) మధ్య జరపడం మరో విశేషం. అవినీతిని తమ జీవితాలలో ప్రతి క్షణం ఎదుర్కొని, దాని ద్వారా అతిగా నష్టానికి గురయ్యే వీరిమధ్య జరిగిపి ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక, సర్వేలో ‘రేషన్ దుకాణాల వ్యవస్థ’ (PDS), ‘విద్య’, ‘వైద్యం’, ‘విద్యుత్తు’, ‘త్రాగునీరు’, ‘గ్రామీణ ఉపాధి పథకం’(NREGS), ‘భూమి రిజిస్ట్రేషన్’, ‘వనాలు’, ‘ఇళ్ళపంపకాలు’ , బ్యాంకింగ్ మరియూ పోలీసు వ్యవస్థలకి సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. పోలీసు వ్యవస్థలో అవినీతిని, ప్ర్రమాదకర స్థాయిగా దాదాపు అన్ని రాష్ట్రాలవారూ గుర్తించగా , మిగతావాటిని కలుపుకుని ఒక సరాసరిన ఈ ర్యాంకింగ్ చెయ్యడం జరిగింది. ఇక ఈ ర్యాంకింగ్ ను చూద్దాం.
‘ప్రమాదకర స్థితి’లో ఉన్న రాష్ట్రాలు : అస్సామ్, బీహార్, జమ్ము& కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గోవా, నాగాలాండ్
‘చాలా ఎక్కువ’ ఉన్న రాష్ట్రాలు : కర్ణాటక , రాజస్థాన్, తమిళనాడు, మేఘాలయ , సిక్కిం
‘ఎక్కువ’ ఉన్న రాష్ట్రాలు : ఛత్తిస్ ఘడ్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కేరళ, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్
‘ఫరవాలేదు’ అనిపించే రాష్ట్రాలు : ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహరాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, పాండిచ్చేరి, త్రిపుర.
పై సర్వే ప్రకారం దక్షిణ భారతదేశంలో మిగతావారికన్నా మనమే బెటర్ అన్నమాట. నిజంగానే మనం ఫరవాలేదో్.... లేక ఈ విధంగా అవినీతిని కొలవలేని కొత్త మార్గాల్ని కనుక్కున్నామో.... ఇంకా మనవాళ్ళు తెలివి మీరారో... లేకపోతే మన పేదవారు చాలా అమాయకంగా జవాబులు చెప్పారో.... అస్సలు తెలియకపోయినా, "మనమూ ఫరవాలేదు!" అనుకొని తృప్తిపడదాం.
Wednesday, July 2, 2008
అవినీతిలో మన ఆంధ్రప్రదేశ్ ఫరవాలేదండోయ్...!
Posted by
Kathi Mahesh Kumar
at
7:53 AM
6
comments
Labels: సమాజం
Tuesday, July 1, 2008
మతం సినిమాను నిషేధించిందా...!
నేను మైసూర్ లో డిగ్రీ చదువుతుండగా, అక్కడ దొరికే ఏకైక తెలుగు సినీ పత్రిక ‘సితార’ క్రమం తప్పకుండా చదివేవాడిని. ప్రతి ఆదివారం సిటీకి వెళ్ళినప్పుడు ఆ పత్రిక కొని చదవందే, ఏదో మిస్సైనట్టే లెక్క. మైసూర్లో చాలా పాప్యులర్ అయిన తెలుగు సినిమాలు తప్ప ఆన్నీ వచ్చేవి కావు. కాబట్టి, ఈ పత్రికద్వారా వచ్చిన మరియూ రాబోయే సినిమా విశేషాలు తెలుసుకుని, ఇంటికి వెళ్ళినప్పుడు ధియేటర్లో ఆ సినిమా దొరక్కపోయినా వీడియోలో చూడచ్చనే ఒక ఆశని ఈ పత్రిక కల్పించేది. అంతేకాక, ఇందులో ‘గుడిపూడి శ్రీహరి’ గారి సినీసమీక్షలు నాకు తెగ నచ్చేవి. చాలా బ్యాలన్సుడ్ గా తను రాసే సమీక్షల ప్రభావం ఇప్పటికీ నాపై ఉందని నా నమ్మకం.
బహుశా నా రెండవ సంవత్సరంలో అనుకుంటా, ఒక సారి ఇలాగే పత్రిక కొని సిటీబస్సు ఎక్కడానికి బస్టాండుకు వచ్చి కూర్చున్నా. ఇంతలో, మా కాలేజికి చెందిన ఒక తెలుగు సీనియర్ కనబడేసరికీ కాస్సేపు మాట్లాడుతూ సమయం గడిపాం. ఇక బస్సెక్కగానే పక్కపక్కన కూర్చుని, నేను చేసిన మొదటిపని నా చేతిలో ఉన్న ‘సితార’ని అతడికివ్వడం. ఆ ఇరవైనిమిషాల బస్సు ప్రయాణంలో ఆ సీనియర్ పత్రికని తెరిచి చూడలేదు. బస్సు దిగీదిగగానే, దాన్ని మళ్ళీ నా చేతిలో పెట్టాడు. నాకు ఒక్క క్షణం ఆశ్చర్యమనిపించింది. ఉండబట్టలేక అడిగేశా, "చదువుతారని ఇచ్చాను, మీరు చదవలేదే?" అని. దానికి అతను ఒకే ఒకమాటన్నాడు. " మా మతంలో సినిమాలు నిషేధం". ఆ సెకనుకి అతను చెప్పింది నాకు అస్సలర్థంకాలేదు.
ఇది జరిగిన కొన్నాళ్ళకు మా ఆంగ్లసాహిత్యం క్లాసుల్లో, History of English Literature లో భాగంగా ‘బైబిల్’ యొక్క పరిణామక్రమం గురించి చెబుతూ, ఇంగ్లండ్ రాజు 8 వ హెన్రీ (1491-1547) తన వ్యక్తిగత లాభం కోసం (భార్యకు విడాకులిచ్చి, ఉంపుడు గత్తెని పెళ్ళి చేసుకోవడానికి) వాటికన్ నుంచీ ఎలా విడిపడిందీ, ఆ తరువాత ఎలా Church of England స్థాపించిందీ తెలుసుకున్నాను. అంతేకాక, అప్పటివరకూ కేవలం గ్రీకు, లాటిన్ భాషల్లో ఉన్న బైబిల్ని ఆంగ్లంలో తర్జుమా చెయ్యడం కూడా అప్పుడె మొదలయ్యింది. అదీ అప్పటి రాజకీయ పరిస్థితికి అనుకూలంగా ‘అంగీకారాత్మకమైన’ (an agreed version) విధానంలో. ఆ సవరణల బైబిలే ఇప్పటికీ "Great Bible"గా అందరికీ అందుబాటులో ఉంది. ఇక మన భారతీయ భాషల్లోకి అనువదించబడింది ఈ బైబిలు నమూనాయే అన్నది అందరికీ తెలిసిన సత్యం.
పైన చెప్పిన చరిత్రతోపాటూ, మా Film Clubలో నేను తెలుసుకున్న ‘సినిమా పుట్టుక’ చరిత్రను పోల్చిచూస్తే, 1890లలో పుట్టిన సినిమాలను, 15వ శతాబ్ధంలో తిరగరాయబడిన బైబిల్ ఎలా నిషేధించిందో నాకైతే అర్థం కాలేదు. పోనీ యేసు ప్రభువుకి సినిమాలంటే గిట్టవా అనుకుంటే, పాపం ఆయన బతికుండగా అసలు సినిమాలే లేవే! మరి సినిమాల నిషేధం గురించి యేసూ చెప్పక, బైబిలూ రాయకపోతే ఈ మతం సినిమాలను ఎలా నిషేధించిందో, ఇప్పటికీ నాకు సమాధానం తెలీని ప్రశ్నల్లో ఒకటి.
మీకు సమాధానం తెలిస్తే నాకు తెలియజెప్పగలరు. జవాబుకోసం ఎదురుచూస్తూ....
Posted by
Kathi Mahesh Kumar
at
7:30 AM
15
comments
Labels: మతం
Monday, June 30, 2008
వరద...
వడ్డించిన వర్షం
విస్తరి దాటితే వరద
వయసొచ్చిన అందం
వాకిలిదాటితే వరద
కలిసొచ్చిన కాలం
కళ్ళముందే కరిగితే వరద
మనసిచ్చిన చెలికాడు
మరుగుపడితే వరద
Posted by
Kathi Mahesh Kumar
at
8:55 PM
6
comments
Labels: కవిత
Prejudice కి తెలుగు పదం ఏమిటబ్బా?
ఓ రెండ్రోజులుగా "Prejudice కి తెలుగు పదం ఏంటా?" అని నా దగ్గరున్న డిక్షనరీలన్నీ తిరగదోడాను. చివరకి బ్రౌను నిఘంటువులో, "విచారణ లేని నిర్ణయము, అనగా దురభిమానము, దుర్భ్రమ, పిచ్చితలంపు,పిచ్చి" అని అర్థాలు కనపడ్డాయేగానీ సమానాంతర పదం మాత్రం కానరాలేదు. అంటే నిజంగా మన తెలుగు ప్రజల నరనరాల్లో జీర్ణించుకున్న ఈ అమూల్యమైన లక్షణానికి, ఆంగ్లంలో తప్ప తెలుగులో సరైన పదం లేదని తెలిసిపోయింది.
కానీ మన జీవితాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండోయ్! ఇదుంటే మనకు చాలా సుఖం. ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. విషయాల నిజనిర్థారణ అవసరం లేదు, తప్పొప్పుల ఆలోచన అఖ్ఖరలేదు, శ్రమలేకుండా బతికెయ్యొచ్చు. ఈ సుఖానికి మనం ఎంతగా అలవాటుపడిపోయామంటే, మనుషుల్ని వారి ప్రవర్తనతోనో, ఆలోచనలూ, అభిప్రాయాలతోనో బేరీజు చెయ్యడం మానేసాం. వారు నివసించిన ప్రదేశాన్నో, సంస్కృతినో, ఇంటిపేరునో లేక కులాన్నో తెలుసుకుని దానికి తగ్గట్టు ఒక "బ్రాండ్" తగిలించి, సుఖపడిపోతాం. "అరవోళ్ళు", "ఆంధ్రావాళ్ళు", "దళితులు" అని కొన్ని బ్రాండ్ లేబుల్లు తగిలించి, మన ప్రెజుడిస్ ని విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉంటాము.
ఒక వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కొలవడంలో గల శ్రమని తగ్గించుకుని, ఇలాంటి బ్రాండ్లు కల్పించేసుకున్నామన్న మాట. అందుకే మన సామాజిక సంబంధాలు వ్యక్తులతో కాక, వారికి ప్రెజుడిస్ తో మనం తగిలించిన లేబుళ్ళతో నెరిపేస్తూ ఉంటాం. ఇలాకాక, ప్రతివ్యక్తినీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగల మనిషిగా అర్థం చేసుకుని, ఆదరించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి ! అందుకే మన వ్యక్తిగత అనుభవాలన్నీ, ‘రంగుటద్దాల’ సగం సత్యాలేకానీ, అసలు నిజానికి ఓ అంగుళం దూరంగానే ఎప్పుడూ ఉంటాయి.
ఈ ప్రెజుడిస్ అప్పుడప్పుడూ తీవ్రరూపం దాల్చి, మన మీడియాలో కూడా దర్శనమిస్తూ ఉంటుంది. సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడితే ఫ్యాక్షనిస్టు, తెలంగాణ యాసైతే కామెడీ ఇలాగే అవ్వలేదూ? అంతెందుకు మనం చాలా విలువల్ని ఆపాదించే "ఇజాలు" కూడా ప్రెజుడిస్ పుణ్యమే కదా! కమ్యూనలిజం (మతతత్వం), జింగోయిజం, మేల్ ఛవ్వనిజం, సర్వాంతర్యామి అయిన క్యాస్టిజం (కులతత్వం) వీటిల్లో మచ్చుకకి కొన్ని.
ఇలాంటి సుఖమైన జీవితం నుండీ బయటపడమని చెప్పడం సాహసమే ! కానీ ఇలాగే సాగితే మన మానవ సంబంధాలు అతిమహా లోతుల్లోకీ, అధ:పాతాళానికీ చేరి ఇంకా సుఖపడతాయేమో అని ఎక్కడో చిన్న సందేహం. అందుకే కనీసం నిఘంటువులో అర్థాన్ని వెదికే సాహసం చేశాను. దయతొ అందరూ క్షమించగలరు.
Posted by
Kathi Mahesh Kumar
at
3:46 PM
8
comments
Labels: సమాజం
Sunday, June 29, 2008
తప్పకుండా చూడవలసిన సినిమా - `ద్వీప' (కన్నడ 2002)
ఇళ్ళకూ, పొలాలకూ ఇతర ఆస్తులకూ వెలకట్టొచ్చు. గౌరవానికీ, నమ్మకానికీ, జ్ఞాపకాలకీ వెలకట్టగలమా? చాలా అమూల్యమైన ప్రశ్న ఇది. ‘డ్యామ్’ పునరావాసంలోని మానవీయ కోణాన్ని సూటిగా సంవేదనాత్మకంగా తెరకెక్కించిన ‘గిరీశ్ కాసరవెళ్ళి’ చిత్రం ‘ద్వీప’ (తెలుగులో ‘ద్వీపం’ అనొచ్చు). దివంగత ప్రముఖ తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల కథానాయిక సౌందర్యం నిర్మించి నటించిన చిత్రం ఇది. ద్వీప ఉత్తమ చిత్రంగా భారత ప్రభుత్వ స్వర్ణకమలం పురస్కారాన్ని కూడా అందుకుంది.
కొన్ని సినిమాలను చూసి, ఆనందిస్తాం. కొన్నింటిని తిలకించి విశ్లేషిస్తాం. మరికొన్నింటిని ఆరాధిస్తాం. కానీ ‘ద్వీప’, అనుభవించాల్సిన చిత్రాలకోవలోకి వస్తుంది.
ఒకవైపు డ్యాం పునరావాసం పై సామాజిక చర్చతోపాటూ, మరో వైపు మానవసంబంధాల సున్నితత్వాన్ని కూడా స్పృశించిన చిత్రమిది. ముంపుకు గురవ్వబోయే ద్వీపాన్ని విడిచి వెళ్ళని నమ్మకం, ప్రేమ ఒకవైపు కనిపిస్తే, తన సామ్రాజ్యమైన ఇంటిని కాపాడుకోవడానికి ఒక మహిళ పడే తపన, ప్రయత్నం కనిపిస్తాయి. ఇంత క్లిష్టమైన విషయాన్ని తెరపైకి అనువదించడం చాలా కొద్దిమంది దర్శకులకే సాధ్యం. వారిలో ఒకరు, ‘గిరీశ్ కాసరవళ్ళి’ అన్నది నిజం. సినిమా నిడివి కొంత ఎక్కువనిపించినా, చెప్పాలనుకున్న విషయం కూడా అంతే ముఖ్యమైంది కాబట్టి కొంత ఓపిక ప్రేక్షకులకి తప్పదు.
`గణపయ్య' (అవినాష్) మరియూ `నాగక్క' (సౌందర్య) అనే భార్యాభర్తలు వారి పెద్దదిక్కు గణపయ్య తండ్రి 'దుగ్గజ్జ' (వాసుదేవ రావ్) తో కలిసి ఒక ద్వీపంలో ఉంటారు. అక్కడి చిన్న గుడిలో పౌరోహిత్యం చేస్తూ, "నేమ" అనబడే ఒక సాంప్రదాయ పూజను జరుపుతూ, పొట్టపోసుకొంటూ ఉంటారు. అది ఒక డ్యామ్ సైట్ కావడం వల్ల త్వరలో ముంపుకు గురయ్యే ద్వీపాలలో ఒకటిగా గుర్తించి ప్రభుత్వం అందరినీ ఖాళీ చెయ్యమంటుంది. తండ్రి ఆ స్థలాన్ని వదిలి రావడానికి ఇష్టపడకపోతే కొడుకూ, కోడలు కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. వారికి సహాయంగా ఉండటానికి ఒక నవయువకుడు ‘కృష్ణ’ కూడా అక్కడికి వస్తాడు. చివరికి ఆ ద్వీపం మునిగిపోతుందా? నాగక్కకీ, కృష్ణకీ మధ్య ఉన్న స్నేహం ఏవిధంగా సమస్యల్ని తెచ్చిపెడుతుంది? చివరికి ఈ ప్రకృతి మరియూ వ్యక్తిగత కష్టం నుండీ ఈ కుటుంబం ఎలా గట్టెక్కింది? అన్నదే ఈ చిత్ర కథ.
ఈ సినిమా పూర్తి సమీక్షని ఇక్కడ చదవగలరు.
------------------------------------------------
Posted by
Kathi Mahesh Kumar
at
7:09 AM
7
comments
Labels: సినిమాలు
Saturday, June 28, 2008
I think in తెలుగు !

ఖమ్మం జిల్లాలో ఒక UNICEF ప్రాజెక్ట్ కోసం, నా మొదటి పెద్ద ఇంటర్వ్యూ జరిగింది. ఈ తంతు మొత్తం ఇంగ్లీషులోనే జరిగింది. అక్కడకు వచ్చిన యునిసెఫ్ అధికారి ఒరియా అవ్వడం ఒక కారణమైతే, మన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే చాలా ఇంటర్వ్యూ లలో ఉపయోగించినట్లే, ఇక్కడా ఆంగ్లాన్ని ఎడాపెడా ఉపయోగించేసారు.
మనమూ బాగా మాట్లాడే కాలేజీ, యూనివర్సిటీల్లో కాస్త చదువును చట్టుబండలు చేసొచ్చిన బాపతుకాబట్టి, సాధారణంగా వాడే ఆంగ్ల పదాలతోపాటూ, డిక్షనరీ చూస్తేనేగానీ అర్థం కాని క్లిష్ట పదాలు కొన్ని ఉపయోగించేసి, ఛాతీని కాస్త పెంచి మరీ వారెదుట సెటిలైపోయాం. నా వ్యవహారం వారికి నచ్చిన ఫీలింగ్ పెట్టి, ఒకరి మొఖాలొకళ్ళూ చూసుకుని అంగీకార సూచకం తలలూపేసారు. ఇంతలో వారికి హఠాత్తుగా ఒక ధర్మ సందేహం వచ్చింది...వారిలో ఒక పెద్దాయన నన్ను సందేహంగా చూస్తూ "Do you know Telugu?" అన్నాడు. తను చెప్పింది అర్థమయ్యేలోపల నా నోటివెంట అసంకల్పితంగా ఒక సమాధానం వచ్చింది "I think in Telugu" అని. నా సమాధానం విన్న వాళ్ళ మొఖాలు అప్పుడే స్విచ్ వేసిన ట్యూబ్ లైట్లల్లే కొద్దికొద్దిగా వెలిగి...హఠాత్తుగా దేదీప్యమానమయ్యాయి. అంతే, నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది.
ఈ సమాధానం ఇచ్చి, బయటొచ్చిన తరువాత నా అసంకల్పిత సమాధానంలోని లోతును కాస్త బేరీజు చెసాను. 8 వ తరగతి వరకూ పూర్తి తెలుగు మాధ్యమం (medium) లో చదివినా, 9-12 వ తరగతిలో ఇంగ్లీషు మాధ్యమం లోకి మారాను. 10 లో తెలుగు పరీక్షలు రాసిన తరువాత తెలుగు వాచకాన్ని అస్సలు ముట్టలేదు. ఇక కాలేజిలో చేసింది ఆంగ్ల సాహిత్యంలో మేజరు, యూనివర్సిటీ లో చేసింది Development Communication, అదీ పక్కా ఆంగ్లంలో. "మరి ఎనిమిదోతరగతి వరకూ, అవసరాలు తప్ప ఆలోచనలు చేసెరగనుకదా! మరి నా ఆలోచనలు తెలుగులోఎందుకున్నాయి?" అన్న తీవ్రమైన సందేహం నాకొచ్చేసింది.
తరచి చూస్తే, నాకు తోచిన సమాధానం ఇది. చిన్నప్పటి నుండీ, ఎప్పుడు ఈ తెలుగు పాఠాల నుంచీ తప్పించుకుంటానా అని చూడటం తప్ప తెలుగును, ముఖ్యంగా పాఠాల తెలుగును ప్రేమించి ఎరుగను. ఇక తెలుగు మీడియం అంటారా, లెక్కల్లో ‘సమితులు’ కన్నా ‘సెట్స్’ అనే పదం బాగా అర్థమయ్యేది, సైన్సులో ‘భాస్వరం’ అన్న భారీపదంకన్నా ‘ఫాస్ఫరస్’ అన్న తేలిక పదంలో నాకు సౌలభ్యత కనిపించింది. అంటే చాలామంది భాషావేత్తలు ఎలుగెత్తి చాటుతున్న మాతృభాషలో చదువు నా బోటివాడికి, తెలుగు కంటగింపుగానే తప్ప మనసుకింపుగా ఎప్పుడూ అనిపించలేదు.
మరి "ఇంత లావు మూర్ఖుడికి, తెలుగులో ఆలోచించే ఝాడ్యం ఎక్కడినుండీ అబ్బిందా? అనుకుంటున్నారా !" అక్కడే ఉంది నాకు స్ఫురించిన కిటుకు. చిన్నప్పటి నుండీ తెలుగు పాఠాలంటే పారిపోయినా, కథలంటే మాత్రం పడి చచ్చేవాడిని. చందమామ, బాలమిత్ర, బాలభారతి, బాలజ్యోతి, బాలరంజని లాంటి మాస పత్రికలలోని కథల్ని ఔపోసన పట్టడానికి శ్రమించేవాడిని. కాస్త వయసొచ్చాక ‘పాకెట్ పుస్తకాలు’ అని కొన్ని జానపద కథలున్న పుస్తకాలు, దానితోపాటూ మధుబాబు, పానుగంటి, కొప్పిశెట్టి ల షాడో, బుల్లెట్,కిల్లర్ కథలూ చదివాను. ఈ పుస్తకాలు నా భూగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటూ, కాస్త నా మెదడుయొక్క imaginative extent ని పెంచాయనిపించింది. ఒక సహజ ప్రగతి రూపంగా నేనూ యండమూరి నవలలు చదవడం ప్రారంభించాను. క్షుద్రసాహిత్యం అని అప్పట్లో వచ్చిన ఇతగాడి సాహిత్యాన్ని నిరసించినా, నేను మొదట చదివిన తన నవలలు ‘ఋషి’, ‘పర్ణశాల’. వీటిల్లో తను పరిచయం చేసిన మానవ సంబంధాల fragility నన్ను ఆ వయసులోనే చాలా ఆలోచనలకు పురికొల్పింది.
యండమూరి తో ఆరంభించి మల్లాది, యుద్దనపూడి, సూర్యదేవర, వేంపల్లి, మేర్లపాక...ఇంకా ఎందరో పాప్యులర్ రచయితల పుస్తకాలు నిరాటంకంగా, దాదాపు రెండురోజులకొకటి చొప్పున ప్రతి శెలవుల్లో సాధించేసాను. ఎంత వేగంగా చదివేవాడినంటే, నాకు పుస్తకాలు అద్దెకిచ్చే షాపు వాడు నామీద అభిమానంతో "ఎక్స్ ప్రెస్" అని పిల్చేవాడు. కొన్ని సార్లు ఆలస్యమైనా ఎక్కువ డబ్బులు అడిగేవాడు కాదు.
ఇక మైసూరు కాలేజీలో "ఆంగ్ల సాహిత్యంతో ప్రక్రియని తెలుసుకో, మీ భాషా సాహిత్యం చదివి అనుభవించు" అన్న సూత్రాన్ని నాకు మా ఫ్రొఫెసర్ తెలియజెప్పిన తరువాత, చలం నుంచీ తిలక్ వరకూ, విశ్వనాధ సత్యనారాయణ నుంచీ బుచ్చిబాబు వరకూ చాలా మందిని చదివాను. స్వంత ఆలోచనలు ప్రారంభమయ్యే తరుణం అదే కాబట్టి, ఆంగ్ల భాషలో నా పాఠాలు సాగినా, నా ఆలోచనా స్రవంతి మాత్రం తెలుగులో జరిగేది. నా సమాజం, దాని ఆలోచనలూ, సంస్కృతి మర్మాలూ, సామాజిక పోకడలూ సాహిత్యం ద్వారా నేను తెలుసుకొగలిగాను కాబట్టే తెలుగులో ఆలోచించి, ఆంగ్ల సాహిత్యానికి కూడా నావైన అర్థాలు (interpretations) చెప్పగలిగేవాడిని. ఉదాహరణకు Sigmund Freud ప్రకారం "పాము" sex కు symbol అంటే, మాకు మట్టుకూ అదొక దేవత అని ధైర్యంగా ఎద్దేవా చెయ్యగలిగే స్థాయికి నా తెలుగు ఆలోచనలు చేరుకున్నాయి.
అందుకే నామట్టుకూ నాకు తెలుగు మీడియం చదువులకూ, తెలుగు భాషా ప్రగతికీ అస్సలు సంబంధం లేదు. ఇంగ్లీషు మీడియం చదువుల వల్ల మన భాషకు వచ్చే తీవ్రనష్టమూ లేదు. రావాల్సిన నష్టం ఇప్పటికే మన భాషా బోధన, పిల్లలను తెలుగులో కథలుకూడా చదవమని ప్రోత్సహించలేని మన మారుతున్న సామాజిక రచనల వల్ల జరిగిపోయాయ్. అందుకే, భావవికాసం రాకున్నా, ఉద్యోగ వైకల్యం రాకుండా కాపాడే ఇంగ్లీషు చదువులే మిన్న. ఇక తెలుగుని రక్షించాలంటే దాన్ని, మనకు పాఠాలు చెప్పినట్లు చేదు మాత్రలు మింగిచినట్లు కాక ప్రేమగా ఉపయోగించే విధానాలు పిల్లలకి నేర్పుదాం.
తెలుగు భాషకు జై!
ఇంగ్లీషు మీడియం చదువులకు జై! జై!!
Posted by
Kathi Mahesh Kumar
at
9:23 AM
20
comments
Labels: సమాజం
Friday, June 27, 2008
వావివరసల్లో ఆర్థిక మర్మాలు !?!
ఈ మధ్య నేను రాసిన ‘ఖుదా కేలియే’ అనే ఒక పాకిస్థానీ చిత్ర సమీక్షకు వచ్చిన ఒక స్పందనలో , ఆ చిత్రంలో సర్మద్ అనే పాత్ర తన బాబాయ్ కూతుర్ని బలవంతంగా పెళ్ళిచేసుకోవడం లోని ఔచిత్యాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ విమర్శ ‘బలవంతపు పెళ్ళి’ మీద అయ్యుంటే అసలు సమస్య వచ్చుండేది కాదు. కానీ తన అభ్యంతరం, "వావివరసలు లేని" ఆ పెళ్ళి మీద. తను "ఇండియాలో ఎక్కడా ఎవరూ బాబాయ్ కూతుర్ని పెళ్ళి చేసుకోరు" అని చాలా సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు నా బుర్రకు కాస్త పని కల్గింది.
"నిజమేనా?" అని నన్నునేను ప్రశ్నించుకుని, జవాబు తెలియక నా ముస్లిం మిత్రుడ్నడిగాను. దానికి అతను "అవును మీ తెలుగోళ్ళలో మేనత్త కూతుర్ని చేసుకున్నట్లే, మా వాళ్ళలో బాబాయ్ కూతుర్ని చేసుకోవచ్చు" అన్నాడు. ఈ ఒక్క వాక్యం లో నాకు కొన్ని మర్మాలు తెలిసినట్టైంది. ఆ మర్మాల్ని కాస్త ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఇక్కడ చెప్పే మర్మాలకి ఏవిధమైన సోషియాలజికల్, ఆంత్రపాలాజికల్ లేక మరే విధమైన సైంటిఫిక్ ఆధారాలు నా దగ్గరలేవు, ఒక్క నా మెట్ట లాజిక్ తప్ప.
మనం వావివరసలకు చాలా ఖచ్చితమైన విలువల్ని ఆపాదిస్తాం. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల వారిలో అక్క, మేనత్త లేక మేనమామ పిల్లల్ని దర్జాగా పెళ్ళి చేసుకోవచ్చు. అదే మన భాషలో "వరస". ఇక బావా-మరదళ్ళ సరసాలమీద పుంఖాలు పుంఖాలుగా సాహిత్యం , సినిమాలూ మన సంస్కృతిలో ఒక అవిభాజ్య అంగం. పెళ్ళిళ్ళలో , ఫంక్షన్లలో సంబంధాలూ, వరసల చర్చలు లేకుంటే ఆ సంబరాలు చప్పగున్నట్లే లెక్క.
కానీ, ఈ మాటే ఎవరైనా భారతదేశం బయటున్నవారికి చెబితే దీన్ని "ఇన్సెస్ట్"(incest) అంటారు. "ఛివుక్కు మంటుంది కదూ?" పాశ్చ్యాత్య ధోరణుల్ని అంతగా నిరశించే మనల్ని , ఈ విషయం లో వీరు ఖచ్చితంగా తప్పుపట్టచ్చన్నమాట. ‘కజిన్స్’ మధ్య సంబంధాలు వీరికి ఏమాత్రం అంగీకారం కాదు. అంత దూరం ఎందుకు, ఉత్తర భారతదేశంలో కూడా ఈ సంబంధాలు అంగీకారం కాదు. వీరైతే ఒకడుగు ముందుకేసి ఒకే గోత్రనామం ఉన్నా లేక ఒకే ఊరివాళ్ళైతే వారిని సోదర సమానులుగా భావిస్తారు. ఈ మధ్య కాలంలో హర్యానా లో జరిగిన honor killings ఈ కోవకే చెందినవి. ఇక ముస్లిం సముదాయంలో మనం ‘తప్పు’ అనుకునే బాబాయ్ కూతుర్ని మనవాళ్ళు మేనమామ కూతుర్ని చేసుకున్నంత తేలికగా పెళ్ళి చేసుకుంటారు. అంటే విలువల విషయంలో మనం absolute అని మాట్లాడే విషయాలు, చాలావరకూ సముదాయాన్నీ, సంస్కృతినీ బట్టి చాలా relative అన్నమాట.
కానీ, ఈ "విపరీతాలకు" కొన్ని సామాజిక, ఆర్థిక కారణాలు ఖచ్చితంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సామాజికంగా పితృస్వామ్య వ్యవస్థను పటిష్టం చేసి, ఆధిపత్యాన్ని రక్షించడానికి ఇది జరిగిఉంటుందని బహుశా ఫెమినిస్టులు ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇది వారి స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి, దాన్ని వారికే వదిలేస్తాను. ఇక నాకు అనిపించిన ఆర్థిక కారణాల్ని కాస్త చూద్దాం.
మన తెలుగు జీవితాలలో విలువలు రెండు రకాల మనుషులు నిర్ణయించేవారు. ఒకటి వేదాలు తెలిసిన బ్రాహ్మణులు, రెండు భూమి చేతుల్లో ఉండే భూస్వాములు. ఈ ఇద్దరికీ మేనరికాల వల్ల చాలా ఆర్థికస్వామిత్వం లభించిందని నా ఫీలింగ్. మొదటిగా బ్రాహ్మణుల్ని తీసుకుంటే, వీరు ఆలయ అర్చకత్వం మరియూ మాన్యాల మీద వచ్చే ఆదాయంపై తమ భుక్తికి ఆధారపడి బ్రతికారు. ఇలాంటి limited resource గనక మళ్ళీ మళ్ళీ విభజింపబడితే, గొడవలు తప్ప గౌరవప్రదమైన జీవితాలు జీవించగలిగేవాళ్ళూ కాదు. అందుకనే ఒక via medium ని చాలా convenient గా సృష్టించి ఉండొచ్చు. అవే, మేనరికాలు.
కాకపోతే ఈ inbreeding కి కొంత logic కావాలి కాబట్టి, వాటి చుట్టూ కొన్ని విలుల్ని ఏర్పరిచారు. బాబాయ్ కూతుర్ని పెళ్ళి చేసుకోకూడదు, ఎందుకంటే ఒకే ఇంటి పేరు కాబట్టి. అదే మేనత్త కూతుర్ని చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటిపేరు మారొచ్చింది కాబట్టి, లాంటివి. ఇంకా చిత్రం ఏమిటంటే, అన్నకూతుర్ని పెళ్ళిచేసుకోవడం ‘పాపం’, కానీ అదే అక్క కూతురితో రొమాన్స్ ‘ఆదర్శప్రాయం’. ఇలా అన్నమాట. అప్పట్లో కొన్ని కుటుంబాల మధ్యనే వివాహ సంబంధాలు ఉండేవి. మహా అయితే ఇటుపక్కూరో, అటుపక్కూర్లోనో ఉన్న వారితో పెళ్ళిసంబంధాలు నెరిపేవాళ్ళు. అంటే కొన్ని తరాలు ఇదే చక్రంలో, ఒకే ఆలయం మీదా దాని మాన్యం మీద బతికేసారన్నమాట.
ఇక భూస్వాముల ఇళ్ళలో చూస్తే, ఇవి ఇంకా చాలా నిబద్దతగా జరిగేవనడానికి మనలో చాలా మందికి ఆధారాలు తెలుసు. ఆస్తి బయటకు వెళ్ళకూడదు కాబట్టి బలవంతపు పెళ్ళిల్లు చెయ్యడంలో కూడా వీరు చాలా సిద్దహస్తులు. ఇలాంటి సంబంధాలు ఈడూ-జోడూ, ఒడ్డూ-పొడవూ, వయసూ -వంకాయతో సంబంధం లేకుండా తెగించిన సంస్కృతి వీళ్ళకి సొంతం. ఇదంతా ఎందుకూ? భూమికోసం ! చాలా విలువైన commodity ఇది, గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకునే మహత్తర మార్గమిది. ఇక వీటికి విలువలూ, ఆదర్శాలూ, అవసరమైన రొమాన్సూ అద్దకుండా ఉంటారా? అదే జరిగింది. అందుకే అబ్బాయిలకు "మరదలు", అమ్మాయిల "బావ" అనగానే మనసులో జిల్ జిల్ జిగా.
ప్రస్తుత కాలంలో, చాలావరకూ డాక్టర్లు కూడా మేనరికాలు వద్దని చెప్పడమో లేక మన జీవన పరిధులు పెరిగి బయటి సంబంధాలు (చాలా వరకూ ఒకే కులంలో) విరివిగా చేసుకుంటున్నాం. కానీ మన సామాజిక design న్ని మాత్రం సత్యం అనుకునే ఆలోచన చాలా మందిలో ఉంది. ఇంతకీ ఇంత మెట్ట లాజిక్ తియ్యడంలో ఉద్ద్యేశం ఏంటంటే, మన సంస్కృతిలోని విలువల్ని మాత్రమే జీవన సత్యాలని, మిగతా వారి సామాజిక జీవనాన్ని, పద్దతుల్ని చిన్నచూపుచూడడమో లేక అది తప్పు అనడం ఎంతవరకూ సమంజసం అని నాకు అనిపించడం. అందుకే ఎవరైనా మన తీరులకి భిన్నంగా ప్రవర్తిస్తే, మన విలువల్ని బట్టి value judgment ఇచ్చెయ్యక, కాస్త ఆలోచిద్దాం.
Posted by
Kathi Mahesh Kumar
at
4:57 PM
14
comments
Labels: సమాజం

