Sunday, March 20, 2011

స్పృశ్యాస్పృశ్య దేహాలు - ఒక హోళీ అనుభవం

చీరాల, తెనాలి, గుంటూరుల్లొ పెరిగి చదువుక్కున్న నాబోటి కొస్తా కుర్రాళ్ళకి (అప్పట్లొ కుర్రవాళ్ళమనే అర్థంలో సుమా), హోళీ అనే ఒక రంగుల పండగ ఉంటుందని తెలియదు. విజయవాడ సిద్దార్థా ఇంజినీరింగ్ కాలేజీకి చదువులకి వచ్చాక, Hyderabad పిల్లలు, ఉత్తరాది పి...డుగులు హోళీ అడుతుంటె బాగుంది.
 

అన్నింటికన్నా విశేషం-- వేళ్ళు తగిలినా కొరకొర మనే మా ఆడపిల్లలు (క్లాసుమేట్లు), దేవతలు తాకటనికి కూడా సందేహపడే ప్రదేశాల్లో తాకుతూ రంగులు పూస్తున్నా ఏమీ అనకపోవడం. అప్పట్నుంచి, హోళిని మించిన పండగ నాకు లేకుండా పోయింది. 365 రోజుల్లో, ఒక్క రోజు మాత్రమే హోళి రావడం నా జన్మకి శాపమేమో అనిపించింది.
ఇదిలా ఉండగా, మేము ఇంజినీరింగ్ లో జాయిన్ అయినప్పుడు, ఆ తర్వాత రెండేళ్ళ వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజి మా కాంపౌండ్ లోనే ఉండేది. మాధవీ లతల కన్నా నాజూకైన మెడికో ఆడపిల్లలతో స్నేహం వల్ల, అనాటమి ఇరుకిరుకు గదుల్లో వాళ్ళ practicals లో నేనూ ఉండే వాడిని. అక్కడ ద్రావకాల్లో కూడా nude bodies ఉంటాయి కదా. కానీ, ఎంత contrast? ఆ వైరుధ్యాన్ని, అనుభవాన్ని అర్థం చేసుకునే యాతనలో, నా brother in law, Osmania medical collegeలో తన anatomy practicals experience నాకు ఉద్వేగంతో చెప్పినప్పుడు, 1997లో నేను రాసిన కవిత ఇది. ప్రతి హోళీకీ గుర్తుకొచ్చే పోయెం. 


స్పృశ్యాస్పృశ్య దేహాలు

ఒట్టి దేహాలేనా

ధూళి దుప్పట్ల్లై కప్పుతున్న
పంచరంగుల కేరింతల మధ్య
.............................. అవొట్టి దేహాలేనా

వాన చిత్తడి దయన
కొంగొత్తగా తెలిసే పసిడి పాదాలు

కుదురులేని పైటల చాటు
పియానో మడతల గమకాలు

కొనవేళ్లు తాకినా
ఒళ్లెర్ర చేసి కొరకొరమనే చూపుల
అంటరానితనాల్ని వర్ణావర్ణంగా
చెరిపేసిన
ఆనందహోళీల స్మృతిలో...
................................ అవి ఒట్టి దేహాలేనా

ప్రమత్తంగా తాకిన
క్షణభంగుర స్పర్శలేనా-
నును సెగల నివురును తప్పిస్తున్న
భీతి!
ఇది జఘన చంద్రవంక గాయపరిచిన
సౌఖ్యం!
* * *

ఒట్టి దేహాలేనా

తెంపులేని గొలుసు కలల్ని
చెడనివ్వని ద్రావకాల్లో
...................................... ఇవొట్టి దేహాలేనా

పండు కొరకని ఈవ్‌ల
నగ్నాచ్ఛాదనలివేనా

నిద్రంటని దిండు దాచిన
డెబొనేర్ బొమ్మల్లో
అడ్డు తెరల నూలుపోగై
శ్వాస తెంపిన దిసమొలలివేనా

అనాటమీ ఇరుకిరుకు గదుల్లో
అనైచ్చికంగా తాకేవన్నీ తమకపు స్పర్శలేనా

ఎప్రాన్ భుజాల్ని తీకే తామర తూడు
విశ్లేషణల వేళ్లకంటే నలుపెరుపు నరం

జలదరింపుల మెడపై ఊపిరి సెగ
శ్వాసల్లేని గుండెకి డిసెక్షన్ కత్తిగాటు

వీపును గుచ్చే ఉలిమొనల వక్షం
మండుతున్న కంటిలో శవ నగ్నత్వం

నిర్లిప్తోద్వేగాలకు స్పృశ్యాస్పశ్యంగా
తెరతీస్తున్న
జ్ఞాత జ్ఞానాల స్పృహలో
........................................ ఇవి ఒట్టి దేహాలేనా

అనైచ్ఛికంగా తాకేవన్నీ
తమకపు స్పర్శలేనా-

రహస్యాల వేళ్లమధ్య
నలిగి జారే ముగ్గురేణువు!
రంగవల్లుల కెంపుబుగ్గకు
పేడముద్దల దిష్టిచుక్క!!
* * *
*మెడికో బావమరిది 'శివ' 'కు అనుభవంలో వాటా పంచుతూ-



- నరేష్ నున్నా
****

Tuesday, March 1, 2011

శ్యామ్ బెనెగల్ తో నేను





Wednesday, February 23, 2011

"ఓయు"ద్యమం

"ఈ పెద్ద ఉద్యమం ముందు మా చదువులు చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి." - ఒక విద్యార్థిని, ఉస్మానియా యూనివర్సిటీ.
కొన్ని ఆశయాల ముందు జీవితాలు చిన్నవి అనిపించని జీవితాలూ జీవితాలేనా !?
ఉద్యోగాలకోసం యువతా! ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి ఉద్యమించడానికి యువతా! ఏది సరైంది?
 

Tuesday, February 22, 2011

యువతజీవిత అనుభవశకలాల సినిమాటిక్ అనుభవం - LBW

జీవితాలు ఎక్కడ విడిపోయి ఎక్కడ కలుసుకుంటాయో. బంధాలు ఏవిధంగా అనుబంధాల్ని కలుపుకుంటాయో. స్నేహాలూ, ఆకర్షణలూ ప్రేమలూ జీవితాల్ని నిర్దేశించేవే కాకుండా అప్పుడప్పుడూ అనుభవాలుగా, అనుభూతులుగా ఎలా మిగిలిపోతాయో… కొందరు యువతజీవిత అనుభవశకలాల్ని ఏర్చికూర్చిన సినిమాటిక్ అనుభవం LBW – లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ : పెళ్ళికి ముందు జీవితం.

కథ: ఈ సినిమాకథలో రెండు కథలున్నాయి. నిజానికి మూడున్నాయి. మూడోకథ గురించి అప్రస్తుతంగానీ, ముందుగా రెండుకథల గురించి చూద్దాం.
కథ1: హైదరాబాద్ లో జై (అభిజిత్) – రిషి (సిద్దు)చిన్ననాటి స్నేహితులు. రిషి అను(నిషాంతి) ని ప్రేమిస్తాడు. పరిస్థితుల ప్రభావంతో జై- అను ప్రేమికులుగా మారతారు.
కథ2: డల్లాస్ లో ఉద్యోగం చేసుకునే రాజేష్ (రోహన్) – రాధిక (చిన్మయి) స్నేహితులు. రాధిక రాజేష్ ని ప్రేమిస్తుంది. రాజేష్ రాధికని ఒక స్నేహితురాలిగా మాత్రమే చూస్తాడు. రాజేష్ స్నేహితుడు వరుణ్(అసిఫ్), రాజేష్  వద్దనుకున్న రాధికలు ప్రేమలో పడతారు.

ఈ రెండు కథలూ ఒక సినిమాలో ఎందుకున్నాయి అనేది  సినిమాలో చూడాల్సిందే.
ఇక మూడోకథేమిటా అని ఆలోచిస్తున్నారా…! ఈ రెండుకథల్నీ లంకె కలపడానికి ఒక ఉపకథ ఉందిలెండి. అది నాకైతే అనవసరం అనిపించింది. కానీ బహుశా దర్శకరచయిత తనకు తెలిసిన (మరి)కొంత జ్ఞానాన్ని పంచుకోవడానికి tempt ఆయ్యి, దాన్ని నెరేటివ్ గా ఎంచుకున్నాడేమో . ఎంతైనా మొదటి సినిమాకదా. అది లేకపోయినా సినిమాకొచ్చే నష్టమైతే ఏమీలేదు.

...మిగతా సమీక్ష నవతరంగంలో...

****

Friday, February 11, 2011

వినాయక్ సేన్ ను ఉరితియ్యండి

తనతో పాటు వైద్య విద్య నభ్యసించిన వారు విదేశాలు ఎగిరివెళ్లి కోట్లు గడించాలని అలోచించే సమయంలో చత్తీస్ గఢ్ లోని ఒక మారుమూల ప్రాంతంలో అభాగ్యులకు సేవచేయాలనుకోవడమే ఆ డాక్టర్ సాబ్ చేసిన పెద్ద తప్పు.  మావోయిస్టుల ఏరివేతకొరకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంతక ముఠా “సాల్వాజుడుం” సాగిస్తున్న అరాచకాలపై వినాయక్ సేన్ గళమెత్తడంతో ఆయన చేసిన నేరం. కాబట్టి శ్క్షించాల్సిందే...యావజ్జీవ శిక్షెందుకు ఏకంగా ఉరి తియ్యాల్సిందే. అప్పుడుగానీ ఈ ప్రజాస్వామ్యమనే బూటకం వెనకనున్న కార్పొరేట్ల కుట్రల ముసుగు తొలగదు.

వినాయక్ సేన్ గురించి మరింత సమాచారం కొరకు చూడండి: http://www.binayaksen.net/

***

Friday, January 28, 2011

బ్రాహ్మణుల్ని ఎందుకు ద్వేషించాలి?

ఎందుకు ద్వేషం ! ఏముందని విద్వేషం!?
చరిత్రను బేరీజు చేసే ధృక్పధంలో బ్రాహ్మణులు చాలా సామాజిక కురీతులకు కారణంగా కనిపిస్తారు కాబట్టి వాటిని విశ్లేషించడం జరుగుతోందేగానీ  నిజంగా ద్వేషాన్ని విద్వేషాన్నీ సామాజికంగా ఎవరైనా అమలు జరుపుతున్నారా అనేది అత్యంత సందేహాస్పదం. నిజంగా బ్రాహ్మణుల్ని ద్వేషించడం ఒక పంథా అయ్యుంటే, ఈ పాటికి వాళ్ళమీద ఆప్రకటిత నిషేధమో లేదా వివక్షో అమలై ఉండేది. Did it happen?


Let's just ask few questions...

మైనారిటీ ప్రజలు మెజారిటీన శాసించే ఫ్యూడల్ వ్యవస్థను theorize చేసి మూసను సృష్టించింది ఎవరు?
కుల వ్యవస్థలోని కుళ్ళును శాస్త్రీయం చేసింది ఎవరు?
హిందూమతాన్ని బ్రష్టుపట్టించి మాన్వత్వ వ్యతిరేక స్మృతులను సృష్టించి అమలు చేసింది ఎవరు?

ఇవన్నీ అపోహలైతే కాదుకదా !?
Someone has to answer these questions and some need to ask them !


సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బ్రాహ్మణకులం ఆధిపత్యం ఏనాడో నశించించింది. కాస్తోకూస్తో సాంస్కృతికి ఆధిపత్యం కొనసాగుతున్నా, "ఇదే సంస్కృతి" అనే ధోరణిని ఛాలెంజ్ చేస్తూ ఎన్నో subaltern cultures వస్తున్నాయి, alternate culture సృష్టిస్తున్నాయి. కాబట్టి ఇక్కడా they have a loosing battle at hand. మరి ఎందుకుండాలి బ్రాహ్మణ వ్యతిరేకత...they have nothing to offer, nothing to challenge at this point in time. అందుకే ఈ అపోహల్ని రాజకీయ కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు.


ఇప్పుడున్న ద్వేషం ఇక్కడ బ్రాహ్మణులు అనే కులం మీద కాదు. ఆ కులానికి చెందిని మనుషుల మీద అసలు కాదు. బ్రాహ్మనిజం అనే భావజాలం మీద. అది బ్రాహ్మణకులాన్ని దాటి మొత్తం సమాజాన్ని ఆవరించి చాలా శతాబ్ధాలయ్యింది. ఆ ధోరణి,భావజాలం మీద పోరాటం. భౌతికంగా అగ్ర కులాల మీద పోరాటం. ఇందులో బ్రాహ్మణకులం ఎక్కడ్నించీ వచ్చిందో...దాని మీద విద్వేషం ఎవరికుందో ఒకసారి కళ్ళుతెరిచి చూస్తే తెలుస్తుంది.

****

Thursday, December 2, 2010

తెలుగు సినిమా తమిళ పైత్యం

ప్రతిభ ఎక్కడున్నా దాన్ని అభినందిచాల్సిందే, స్వాగతించాల్సిందే, ప్రోత్సహించాల్సిందే. కాకపోతే పక్కోడి ప్రతిభ గుర్తించడంలోని శ్రద్ధ మనదగ్గరున్న ప్రతిభని సానబెట్టడంలో చూపించకపతే పొగడ్డానిక తప్ప మనమంటూ ఎదగడానికి ఏమీ మిగలదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితీ అలాగానే ఉంది. చెప్పుకోవడానికి  సినీపరిశ్రమ మద్రాసునుంచీ హైదరాబాద్ కొచ్చి పాతికేళ్ళు అవుతున్నా, హీరోలను వదిలేస్తే (హీరోయిన్లు ఎలాగూ బొంబాయి నుంచి దిగుమతి అవుతారు) మిగతా విభాగాల్లోని సాంకేతిక నిపుణుల్ని అక్కడ్నించే దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా దర్శకత్వం, సంగీతం, సహనటుల విభాగాల్లో తమిళ్ హవానే నడుస్తోంది.

దర్శకత్వ శాఖలో కోకొల్లలుగా తెలుగు జనాలున్నారు. ప్రతి సినిమాకూ ఆరు మందికి తగ్గకుండా సహాయదర్శకులుగా పనిచేస్తుంటారు. అయినా అవకాశాలు, ముఖ్యంగా పెద్ద అవకాశాల దగ్గరికొచ్చేసరికీ తమిళంవాళ్ళే కావలసొస్తుంది. తమిళులకు దర్శకత్వ అవకాశం ఇవ్వడం వరకూ బాగానే ఉంది, కానీ వాళ్ళ కంఫర్ట్ కోసం ముఖ్యపాత్రల్నో లేదా సహాయపాత్రల్నో తమిళ నటులతో, సాంకేతిక వర్గాన్నంతా తమిళ సాంకేతిక నిపుణులతో నింపడం ఎందుకో ఒక అర్థంకాని పరిణామంగానే మిగిలిపోతోంది. ‘డార్లింగ్‌’లో ప్రభాస్‌ ఫాదర్‌గా ప్రభు చేసిన క్యారెక్టర్‌ మన తెలుగులో ఎవరూ చేయలేరా? అలాగే, ఈనెల 26న విడుదల కానున్న ‘ఆరెంజ్‌’లోనూ ప్రభు ఓ ముఖ్యపాత్ర పోషించాడు. కారణం ఆ నటుడి అవసరమా లేక దర్శకుడి విజన్ లో ప్రభు తప్ప మరే ఇతర తెలుగు నటుడూ కనిపించకపోవడమా?

ఎమ్.ఎస్.విశ్వనాధన్ నుంచీ ఇళయరాజా వరకూ అటు తమిళం ఇటు తెలుగులో మహత్తరమైన సంగీతం ఇచ్చినా, భాషకు అనుగుణంగానే బాణీలు కూర్చారు. ఆ తరువాత తరంలో తమిళ బాణీల్ని డబ్బింగ్ రూపంలో తప్ప స్ట్రైట్ ఫిల్మ్ గా సంగీతం కూర్చి, తెలుగు సంగీతాన్ని ఇవ్వడంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కూడా ఎదురుదెబ్బే తిన్నారు. అయినా మనోళ్ళు ఈ మధ్య హ్యారిస్ జైరాజ్(ఆరంజ్), జి.వి.ప్రకాష్ (డార్లింగ్) అంటూ మళ్ళీమళ్ళీ బొక్కబోర్లా పడటానికి తయారైపోతున్నారు. ఇది మోజుకాక మరేమిటి? నిజంగా హైదరబాద్ లో మ్యూజిక్ డైరెక్టర్లు లేరా? చక్రిలాంటి వాళ్ళు వచ్చిన పదేళ్ళలో దాదాపు వంద సినిమాలకు సంగీతం అందించలేదూ!  మన దగ్గర ప్రతిభకు కొదవలేదు, కానీ గుర్తించేవాళ్ళే కరువు.

మనోళ్ళ తమిళ పైత్యానికి పరాకాష్ట ఏమిటంటే,  తమిళ్ సినిమాలపైన ఈ మధ్య సెటైర్ గా వచ్చిన, “తమిళ్ పడం” అనే సినిమాని మనోళ్ళు రీమేక్ రైట్స్ తీసుకోవడం. తమిళ సినిమాల మీద తీసిన వ్యంగ్యాస్త్రాన్ని తెలుగులో హక్కులు తీసుకోవడం ఒక హాస్యాస్పదమైన ప్రక్రియ అయితే,  దాన్ని రీమేక్ ఎలా, ఎందుకు చేస్తారనేది పెద్ద జోకు. ఏం… తెలుగు సినిమాల మీద సెటైర్ మనం సొంతంగా రాసుకోలేమా? దాన్నీ తమిళం నుంచీ దించుకోవాలా?   హతవిధీ!

***