కశ్మీర రాజతరంగిణి కథలు"రచయిత కస్తూరి మురళీకృష్ణగారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు సాహితీధోరణుల్ని, ఏది మంచి సాహిత్యం అనే నిర్ణయాధికారాన్ని అమలుచేస్తున్న కొందరు పెద్దల గురించి జరిగిన చర్చలో వాళ్లని "సాహితీ మాఫియా"గా వర్ణిస్తే నేను "పీఠాధిపతులు"అన్నాను. ఇద్దరి ఉద్దేశం ఒకటే. కానీ సామాజిక సాంస్కృతిక రెఫరెన్స్ పాయింట్ వేరు. అదే మా ఇద్దరి ధృక్కోణాలలో ఉన్న బేధం. ఆ బేధాన్ని అంగీకరించి బయాస్ లేకుండా చదివితే కశ్మీర రాజతరంగిణి కథలు విషయపరంగా, కథనపరంగా, శైలి పరంగా చాలా ఆసక్తికరమైన కథలు. చరిత్ర మీద ఆసక్తిని రేపెత్తించే కథలు. ఇదా చరిత్ర అని చాలా చోట్ల ఆశ్చర్యపడే కథలు.
చారిత్రాత్మక కథల్లో వచ్చే సమస్య అదే. ఇదా చరిత్ర అని ఆశ్చర్యపడ్డా, ఇదేనేమో చరిత్ర అని నమ్మి అనుమానపడకపోయినా తంటామొదలౌతుంది. కల్హణుడి రాజతరంగిణి ఆధారంగా రాసిన ఈ కాశ్మీర రాజుల కథల్లో చాలా వరకూ మ్లేచ్చులకు, తురుష్కులు, బౌద్ధుల మరియు హిందూరాజులైన కాశ్మీర రాజులకూ మధ్య జరిగిన వాదాలు, వివాదాలు, కుట్రలు, కుతంత్రాలు, మతపరమైన చర్చలు, సనాతనధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పే సూక్తాలు, బ్రాహ్మణుల తపోబలం మరియు శాపఫలాలు ఇవే అన్నీనూ. అప్పటికీ ఇప్పటికీ కాశ్మీర్ ఇతరమతాల ప్రాబల్యం వల్ల వచ్చిన ఘర్షణని అనుభవిస్తుండటం ఆ కారణంగా కథల్లో చెప్పిన కొన్ని ఘటనలు నేటికీ చాలా కాంటెంపరరీగా అనిపించడం వంటి చమక్కులు నిజంగా ఆ కథల్లోంచీ వచ్చాయా లేక కథకుడి మ్యాజిక్కా అనే సందేహం వచ్చినప్పుడు మాత్రం నా బయాస్ పక్కనపెట్టలేకపోయాను. ముఖ్యంగా కథల్లో దాదాపు "హిందూమతం" అనే పదం వాడకపోవడం "సనాతనధర్మం" అంటూ ఒక మిథికల్ పేరునే మాటిమాటికీ జపించడంతోపాటూ యాంటీ బుద్దిస్ట్ కథలకి కల్పించిన ప్రాధాన్యత, మ్లేచ్చులు, తురుష్కులు అంటూ మిడిల్ ఈస్టర్న్ మతాన్ని ఉంటంకించడం చూస్తుంటే హిందుత్వ అజెండా ఏమైనా రచయిత భుజాన మోస్తున్నాడా అనే అనుమానం రాకతప్పదు.
ఈ పాలిటిక్స్ పక్కన పెట్టినా లేక దీనిలో కుట్ర ఉందేమో అనే అనుమానంతో చదివినా "కశ్మీర రాజతరంగిణి కథలు" ఆసక్తి కరంగానే ఉంటాయి. అదే చెయ్యితిరిగిన రచయిత చెయ్యదగ్గ ఫీట్ కాబట్టి కస్తూరి మురళీకృష్ణగారిని అభినందించక తప్పదు. తప్పకుండా కొనిచదవదగ్గ పుస్తకం. చదవండి.