Friday, October 31, 2008

హిందూ - ఇస్లాం టెర్రరిజం సేమ్..షేమ్ !

మొత్తానికి హిందూ- ముస్లిం అతివాదులు ఈ ఒక్క విషయంలోమాత్రం "భాయీ..భాయీ" అయిపోయారు. ఎప్పుడో అయిపోయినా, మాలేగావ్ బ్లాస్టుల నేపధ్యంలో జరిగిన తవ్వకాల్లో ఈ విషయం బహిరంగంగా బయల్పడింది. కొంతమంది హిందూ సాంప్రదాయవాదులు, "హమ్మయ్య ఇప్పటికైనా మన హిందువులు మేల్కొని ఎదురుదాడికి దిగారు" అంటున్నారు. మరికొందరు "ఒక ఆడదిచేసిన ధైర్యం మన మగాళ్ళు చేయలేకపోయారు" అంటూ ఆ వీరనారిని కీర్తించి, నిర్వీర్యులైన మగహిందువుల్ని ఎత్తిపొడుస్తున్నారు. ఈ మొత్తం సాహసంలో హిందూమగటిమికి దొరికిన ఆసరా..ఆ "సాధ్వి"తోపాటూ అనుమానితులుగా అరెస్టయిన ఇద్దరు రిటైర్డ్ అర్మీ ఆఫీసర్లు.


ఇంగ్లీషు మీడియా హిందూ టెర్రరిజాన్ని ఖండిస్తూ పుంఖాలు పుంఖాలుగా సమయం,స్థలం వెచ్చిస్తుంటే, హిందీ మీడియా అటూఇటూకానీ ధోరణి అవలంభిస్తోంది. "అసలు హిందూ తీవ్రవాదం అనేమాటే తప్పు, ఇది కేవలం స్వాభిమానంతో జరిగిన ప్రతిఘటన" అని సానుభూతిపరులు చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు "హిందువులు చేస్తే అది ధర్మరక్షణ, ముస్లింలు చేస్తే దేశద్రోహం -తీవ్రవాదం" అని తేల్చేస్తున్నారు. "తేడా ఏమిటయ్యా?" అంటే, "ఇది దేశభక్తి అది విచ్చిన్నశక్తి" అని వేదాంతాలు వల్లెవేస్తున్నారు.


హిందూ మతవాద రాజకీయపార్టీలు మాత్రం, "అబ్బే వాళ్ళతోమాకస్సలు సంబంధం లేదు" అని చేతులు దులిపేసుకుని, వారి నిబద్ధతను ప్రకటించేసారు. హిందూఅతివాద సంఘాలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు కనబడుతూ,చాపకిందనీరులా 'జష్న్'(పార్టీ) జరుపుకుంటున్నారు. వారికి ఇదొక విజయం. హిందూమతం ఇస్లాంకు ఇచ్చిన "ఈంట్ కా జావాబ్ పథర్". రెండుమూర్ఖత్వాలకీ బలయ్యింది మాత్రం అమాయకులు,సామాన్యులు, ఈ మతాలు పట్టని మామూలు మనుషులు. మొత్తానికి ఇస్లాం-హిందూ టెర్రరిజం సేమ్..షేమ్...


ఎప్పటిలాగే, (భారతదేశంలో) ఇటు ఇస్లాం తీవ్రవాదానికీ అటు హిందూ తీవ్రవాదానికీ నాకైతే పెద్దతేడా తెలిసిరావడం లేదు. రెండువైపులా మూర్ఖులే. మతాన్ని అడ్డంపెట్టుకుని అరాచకాన్ని చేస్తున్న అసాంఘిక,అమానవీయ శక్తులే. దేశద్రోహులే. దండనార్హులే. దుండగులే. ఈ రెంటినీ వేరుగా చూడలేకపోవడానికిగల కొన్ని కారణాలను ఇక్కడ రాస్తున్నాను.

1.ఇద్దరూ హింసను ప్రేరేపించేవాళ్ళే. ఇద్దరికీ పారామిలిటరీ శిక్షణా శిబిరాలుంటాయి. ఒకరు బాంబుల్ని వాడటం నేరితే, మరొకరు కర్రసామూ,కత్తులు తిప్పటం, శూలాలువాడటం సగౌరవంగా నేర్పుతారు. ఇప్పుడు కొత్తగా RDX కూడా చేరినట్టుంది. ఈ పనులన్నీ చెయ్యడానికి ఒకరికి విదేశాలు సహాయపడుతుంటే, మిగిలినవాళ్ళకి విదేశాల్లోవుండే హిందూ సోదరులు సహాయం చేస్తున్నారు. 'తీవ్రవాదం కాదు దేశభక్తి' అని చెప్పుకుంటున్నప్పుడు, ఇలా ట్రైనింగ్ ఇచ్చేబదులు ఆర్మీలో చేరమని ప్రేరేపించొచ్చుగా! ఆర్మీనుంచీ రిటైర్డైనవాళ్ళని మాత్రం మళ్ళీ రిక్రూట్ చేసుకున్నట్లు కనబడుతున్నారు.

2.ఇతరులు ఇస్లాంలో చేరితే తప్పులేదుగానీ, ముస్లింలు మతం విడిచివెళ్తే మాత్రం వారు ద్రోహులూ, చంపడానికి అర్హులు. ఈ విషయంలో ఇక్కడా పెద్ద తేడా లేదు.హిందువులు కాని గిరిజనుల్ని,ఆదివాసుల్నీ హిందూమతంలో చేర్చుకుంటారుగానీ, హిందువులు వేరే మతంలోకి వెళితేమాత్రం "మతంమార్పిడులు జరిగిపోతున్నాయహో!" అని ఒకటే గోల.

3.ముస్లింలు కానివార్ని 'కాఫిర్లు' సమానహోదాకు అర్హులుకాదు అని ఇస్లాం తీవ్రవాదులు భావిస్తారు. హిందూవులు మాత్రం తక్కువతినకుండా,"The foreign races in Hindusthan [India] must either adopt the Hindu culture and language, must learn to respect and hold in reverence Hindu religion, must entertain no idea but those of the glorification of the Hindu race and culture, i.e., of the Hindu nation and must loose (sic) their separate existence to merge in the Hindu race, or may stay in the country, wholly subordinated to the Hindu Nation, claiming nothing, deserving no privileges, far less any preferential treatment — not even citizen's rights.-Golwalkar, 1939
అన్న నమ్మకాన్ని నరనరాలా జీర్ణించుకుంటారు.

4. అవమానాన్ని అనుభవించిన తరువాతగానీ, ముస్లింలు హింసాత్మక ప్రతిఘటనకు పూనుకోకూడదని చెబుతూనే, ముస్లింలపై అన్యాయాలు జరిగిపోతున్నాయని చిలువలుపలువలు చేసిచెప్పి హింసకు ప్రేరేపిస్తారు. హిందుత్వవాదులు చేసేదికూడా exact ఇదే! మొదటగా హిందూమతం పెద్దప్రమాదంలో ఉందనే ప్రాపగాండా సృష్టించడం. తరువాత, దీనికి కారణం ఒకవైపు ముస్లింలు, మరోవైపు క్రైస్తవులూ అన్న భయాందోళనల్ని నాటుకునేలా చెయ్యటం. ఈ భయాన్నీ అపనమ్మకాన్నీ ఆసరాగా చేసుకుని హింసకు ప్రేరేపించడం.

5. హిందూ మతత్వశక్తులు ఇప్పటివరకూ అల్లర్లలో ఇతర ఘటనల్లో షుమారు 5,000 మంది భారతీయులప్రాణాల్ని తీస్తుంటే, ఇస్లాం తీవ్రవాదులు కూడా ఆంతో లేక అంతకంటే ఎక్కువ ప్రాణాల్ని పొట్టనబెట్టుకునుంటారు.

6.ఇద్దరికీ భారతీయ చట్టాలమీద నమ్మకం లేదు. భారతీయతకు అతీతంగా ఒకరు హిందూ రాష్ట్రం మంటే మరొకరు ఇస్లాం స్థాపించబడాలంటారు.

7. దొందుదొందే! ఈ మూర్ఖుల వలన మొత్తం జాతి కొట్టుకుఛస్తోంది. ప్రశాంతత కరువౌతోంది. సామాన్యుల ప్రాణాలు బలౌతన్నాయి.

ఇవి ఎవరు చేసినా, ఏమతమౌఢ్యులు చేసినా చట్టరీత్యా నేరం, రాజ్యాంగ రీత్యా అనంగీకారం. కేవలం బ్యాన్ చెయ్యడంకాదు, ఏకంగా వీరికి మనుగడే లేకుండా చేసినా హర్షనీయమే, స్వాగతించాల్సిన పరిణామమే! ఒక మతంవాళ్ళు చేస్తే మంచి, మరో మతంవాళ్ళు చేస్తే చెడ్డ అని ఎవరికి గొడుగుపట్టినా, రక్తంతో తడిచేదిమాత్రం మనమే!


కాబట్టి, నావరకూ మానవత్వానికి మించిన మతం లేదు. ఒక సెక్యులర్ దేశపు పౌరుడిగా మతాన్ని ఇంట్లోవదిలొస్తానేతప్ప, మిగతా చోట్ల అది అప్రస్తుతం, అనవసరం.

****

Tuesday, October 28, 2008

బుద్ధావతారం !!!




అబ్రకదబ్రగారు కొన్నాళ్ళక్రితం బ్లాగులో దశావతారాల్లో గౌతమబుద్దుని స్థానం గురించి ఒక conspiracy theory ప్రతిపాదించారు. ఆ వ్యాసానికి నేను రాసిన assimilative power of Hinduism అనే వ్యాఖ్య తీవ్రమైన విమర్శలకూ ఖండనకూలోనయ్యింది. హిందూ సాంప్రదాయ ప్రేమికులు ఈ విషయం మీద చాలా తీవ్రమైన చర్చను విజయవంతంగా చేసారు.


ఈ మధ్యనే శ్రీధర్ అనే భరతనాట్య ప్రవీణుడైన స్నేహితుడితో, ఈ విషయమై చర్చిస్తుండగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. తను తిరుపతిలో దశాతారాల మీద ఒక డ్యాన్స్ బ్యాలే ప్రదర్శన ఇచ్చిన అనంతరం, ఒక పెద్దాయన ఇతడిదగ్గరికివచ్చాడట. వచ్చి, "అబ్బాయీ! దశావతారాల వర్ణనలో బుద్దుడి ప్రస్తావన వచ్చినపుడు, నువ్వుపట్టిన ముద్ర గౌతమబుద్ధుడి ధ్యాన భంగిమ. కానీ, దశావతారాల్లో బుద్దుడు గౌతమబుద్దుడు కాదు." అన్నాడట. దీంతో మతిచెడిన నామిత్రుడు, ఒక వెర్రి చూపు చూసి. "మరి ఆ బుద్ధుడు ఈ బుద్ధుడుకాకపోతే మరేబుద్దుడు గురువుగారూ!" అని వ్యంగ్యంపోయాడట.


దానికి ఆ పెద్దాయన ఒక పురాణకథ చెప్పాడట. కథలోని పేర్లు నామిత్రుడికి గుర్తులేవుగానీ స్థూలంగా ఆ కథసారం ఇది. కృష్ణావతారం తరువాత మళ్ళీ ఒక రాక్షసుడు దేవతల పాలిట దరిద్రంలా దాపురించాడట. మళ్ళీ దేవదానవుల యుద్ధం మొదలయ్యింది. ఈ హోరాహోరీ రమారమి కొన్ని వందల సంవత్సరాలు గడిచిందట. ఇంద్రుడు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ రాక్షసుడ్ని సంహరించడం కుదరలేదట. ఈ రాక్షసుడి వెనకాలున్న మాయ గురించి కూపీలాగితే, తెలిసిన సత్యమేమయ్యా అంటే, ఈ అసురుడి భార్య పరమసాధ్వి మరియూ పతివ్రతట. ఆ పాతివ్రత్యప్రభావంతో ఈ రాక్షసుడు అజేయుడై అప్రతిహతంగా సురుల్ని కబడ్డీ ఆడిస్తున్నాడన్నమాట!


సాధారణంగా అయితే, ఈ పాతివ్రత్యం మంటగలిపే చేష్టలు మహబాగా వంటబట్టించుకున్న దేవేంద్రుడు పూనుకోవాలి. కానీ, ఇక్కడున్నది చాలా స్పెషల్ కేసాయే! అందుకే బాధ్యతగా ఎప్పుడూ దేవతల్ని కాపాడే, శ్రీమన్నారాయణుడ్ని దేవతలంతా యధావిధి ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడప్పుడే కృష్ణావతారం వాసనల్ని వొదులుకుంటున్న నారాయణుడికి, మరో పవిత్రకార్యం చేసి మానవాళిని (దేవతల్ని) రక్షించే అవకాశం వచ్చేసింది. అప్పుడుదయించిన అవతారమే, "బుద్ధావతారం".


ఏ ఆడదిచూసినా కళ్ళూ, మనసూ చెదిరి, అర్జంటుగా పాతివ్రత్యాన్ని పోగొట్టుకునే అందం ఈ అవతారానికి సొంతం. ఈ అవతారం ఎత్తిందే అందుకాయె! ఇంకేముందీ, ఈ బుద్దుడు రావటం. ఆ రాక్షసపత్ని మనసు చెదరటం. విపరీతమైన కోర్కెకిలోనవటం. మానసికవ్యభిచారం కారణంగా, పాతివ్రత్యానికి తిలోదకాలివ్వడం. ఆ అసురుడి కథ కంచికి...మనమింటికి.


అంటే, వున్న అవతారాలలో అత్యంత నిరర్థకమైన అవతారం ఇదన్నమాట. కాకపోతే, అత్యంత సుందరమైనదికూడా ఇదే. బహుశా అందుకేనేమో, ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే, "వీడో బుద్ధావతారం రా!" అంటాము.


దీన్లో నిజానిజాలూ, ప్రామాణికాలూ మాన్యులెవరికైనా తెలిస్తే చెప్పాలి. నాకుమాత్రం ఈ కథ భలే నచ్చింది.

Monday, October 27, 2008

ఒరే కడల్ (2007)… ఒక అనుభవం : మళయాళ చిత్ర సమీక్ష


ఈ మధ్యకాలంలో, ‘నాక్కొంచెం మతిపోగొట్టిన సినిమా ఇదే’ అని నిర్ధ్వందంగా అనుకున్నాను. ఎవరూ సినిమాగా తియ్యడానికి సాహసించలేని కథ. కష్టమైన కథను వీలైనంత సులువుగా, అర్థమయ్యేలా, చెప్పగలిగిన కథనం. అబ్బురపరిచే నటన. అప్పుడప్పుడూ ఉలిక్కిపడి, “అరె ఏంచెప్పాడు” అనుకునే సంభాషణలు.వెంటాడే (haunting) పాటలు/నేపధ్యసంగీతం. ఇవన్నీ సమకూర్చింది ఎవరైనా ఆరితేరిన దర్శకుడైతే “సర్లే కష్టపడ్డాడు”, అనుకోవచ్చు. కానీ, దర్శకుడు శ్యాంప్రసాద్ కు ఇది నాలుగో సినిమా అంతే! అందుకే,అభినందించడంతోబాటూ అబ్బురపడాల్సొస్తోంది.

‘ఒరే కడల్’ గురించి కొంత విశ్లేషణని ఇక్కడ పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

పూర్తివ్యాసం కొరకు ‘నవతరంగం’లో చూడండి.


****

నవతరంగంలో ఒక వ్యాసానికి వ్యాఖ్యానిస్తూ, ‘గడ్డిపూలు’ సుజాతగారు మళయాళ సినిమా “ఒరే కడల్” చూసి నన్ను సమీక్షించమన్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వినివున్నా, బలంగా చూడాలనే కోరిక కలగక ప్రయత్నించలేదు. కానీ, సుజాతగారి కోరిక విన్నతరువాత, పనిగట్టుకుని, ఒక మిత్రుడిచేత కేరళ నుంచీ DVD తెప్పించుకుని మరీ చూసాను.

తీరాచూసిన తరువాత, ఈ మధ్యకాలంలో, ‘నాక్కొంచెం మతిపోగొట్టిన సినిమా ఇదే’ అని నిర్ధ్వందంగా అనుకున్నాను. ఎవరూ సినిమాగా తియ్యడానికి సాహసించలేని కథ. కష్టమైన కథను వీలైనంత సులువుగా, అర్థమయ్యేలా, చెప్పగలిగిన కథనం. అబ్బురపరిచే నటన. అప్పుడప్పుడూ ఉలిక్కిపడి, “అరె ఏంచెప్పాడు” అనుకునే సంభాషణలు.వెంటాడే (haunting) పాటలు/నేపధ్యసంగీతం. ఇవన్నీ సమకూర్చింది ఎవరైనా ఆరితేరిన దర్శకుడైతే “సర్లే కష్టపడ్డాడు”, అనుకోవచ్చు. కానీ, దర్శకుడు శ్యాంప్రసాద్ కు ఇది నాలుగో సినిమా అంతే! అందుకే,అభినందించడంతోబాటూ అబ్బురపడాల్సొస్తోంది.

ఈ సందర్భంగా ఈ సినిమా చూడమని పురమాయించిన ‘గడ్డిపూలు’ సుజాత గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ‘ఒరే కడల్’ గురించి కొంత విశ్లేషణని ఇక్కడ పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సునీల్ గంగోపాధ్యాయ బెంగాలీలో రాసిన “హిరాక్ దీప్తి” అనే నవలకు శ్యాంప్రసాద్ అందించిన చిత్ర రూపమే ఈ సినిమా. ఇప్పటివరకూ ఈ దర్శకుడు తీసిన నాలుగు సినిమాలూ (’అగ్నిసాక్షి’ : లలితాంబికా అంతర్ జ్ఞానం అదే పెరుతో రాసిన నవల, ‘కల్లు కొండొరు పెణ్ణు’:ఎస్.ఎల్.పూరమ్ సదానందన్ నాటకం, ‘బోక్షు The Myth’: గంగాప్రసాద్ విమల్ ‘మృగంతక్’ నవల, ‘అకళే’ కిమూలం The Glass Menagerie by Tennessee Williams) సాహిత్యాన్ని ఆధారం చేసుకుని తియ్యడం గమనించదగ్గ విషయం. ఇదే విషయాన్ని ఇతడితో ఎవరో ప్రస్తావిస్తే “I am not a writer. I prefer to adapt well-known literary works of noted writers for my television and cinema productions, so that the viewers too get a chance to explore the literary works from the perspective of the visual media.It is not at all an easy task to do the movie adaptations of the literary works. Another good thing that this adaptations do is it makes the audience read the original work. I went on to read some books only after watching its movie adaptations ex: Godfather, Message in a Bottle, Bridges of Maddison County etc.” అన్నాడట. “కథలు లేవు” అని చెప్పుకుతిరిగే మన సినీపరిశ్రమ ఇతగాడి నుంచీ నేర్చుకోవలసింది చాలా ఉందనిపిస్తుంది.

అయినా, సాహిత్యాన్ని సినిమాలుగా అనువదించడం చాలా క్లిష్టతతోకూడుకున్న విషయం. అలాంటి ధైర్యం,సాహసం, స్థైర్యం వుండే దర్శకులూ నిర్మాతలూ లేని మన సినీజగత్తులో ఇలా ఆశించడం మనతప్పేనేమో! కానీ, మళయాళ సినిమాలో అగ్రహీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ సాహసానికి ఊతమివ్వడమే కాకుండా, అప్పుడప్పుడూ తామే నిర్మాతలుగా మారి చిత్రాలు నిర్మించడం ముదావహం.

సినిమాలలో సాంకేతిక విలువల(form)కన్నా, విషయం (content) మీద నాకెప్పుడూ మక్కువ ఎక్కువ. అందుకే, సినిమాలోని సాంకేతిక విషయాలకన్నా, కథావస్తువు మీద, పాత్రల తీరులమీదా కొంత విశదంగా ఈ వ్యాసంలో చర్చిస్తాను. సంబంధాలను అవసరాలుగా భావించి, బంధాలకూ అనుబంధాలకూ తన జీవితంలో స్థానం ఇవ్వని ఒక existential(అస్థిత్వ వాద) బావజాలం కలిగిన ప్రొఫెసర్ కూ, భర్త ఉద్యోగంపోయి, కష్టాల్లో వున్న ఒక సాధారణ మధ్యతరగతి గృహిణికీ మధ్య ఏర్పడే “అనుబంధం” ఈ కధకు ఆది,మధ్యం మరియూ అంతం. సమాజ నిర్మితమైన నిర్థిష్టమైన విలువలను పక్కనపెట్టి జీవించే మగాడు. సమాజపు విలువల్ని నరనరాల్లో జీర్ణించుకున్న ఒక ఆడదానికీ మధ్య సంబంధం ఏర్పడితే, ఎవరి మూలాలు కదులుతాయి? ఎవరి విలువలు ప్రశ్నించబడతాయి? ఎవరి నమ్మకాలు నిలబడతాయి? ఆ ఇద్దరిలో ఒక పరస్పరమైన మార్పుకు అవకాశం ఉందా? తప్పొప్పుల ప్రసక్తి వస్తుందా? వచ్చినా వాటికి అస్తిత్వం ఉంటుందా? ఈ కథకు ముగింపేమిటి? అనేవి కొన్ని ప్రశ్నలైతే, ఈ సినిమా చూసిన తరువాత, ప్రేక్షకుడి మదిలో మెదిలేవి జవాబు అంతసులువుగా దొరకని మరో లక్షప్రశ్నలైనా ఉంటాయి.

Albert Camus `The outsider’ నవల తరగా సంభాషణతో సినిమా ప్రారంభమవుతుంది. బేల (రమ్యకృష్ణ) అనే స్నేహితురాలితో నాధన్(మమ్ముట్టి) పడుకొని వున్నప్పుడు, తనను పెంచిన ఆంటీ చావుబ్రతుకుల్లో వున్నట్లు ఫోన్ వస్తుంది. అప్పడు జరిగే సంభాషణ చూడండి.

బేల: What’s wrong? (ఏమయ్యింది?)
నాధన్: చెరియమ్మ is sinking (చనిపోయే దశలో ఉంది)
బేల: ఇప్పుడు నువ్వెళ్ళాలా?
నాధన్ : వెళ్ళాలంటావా?
బేల: వద్దులే! చనిపోయే ముందు ఎవరైనా ఇష్టమైనవాళ్ళు కనబడితే, ఇంకా బ్రతకాలనిపిస్తుంది. అది తీవ్రమైనదాహంతో ఉన్నవాళ్ళకు ఉప్పునీరు అందించినట్లనిపిస్తుంది. వెళ్ళకు. Let her have a smooth voyage.

నాధన్ సాలోచనగా “నామనసులో ఉన్నది చెప్పావ్, నిజమే!” అన్నట్లుగా తలవంకిస్తాడు.
ఈ సంభాషణ తరువాత బేల బీరు తాగడం మొదలుపెడితే, నాధన్ తన విస్కీని గ్లాసులో ఒంపుకుంటాడు. కట్ చేస్తే… దీప్తి (మీరా జాస్మిన్) జ్వరంతో వున్న తన కొడుక్కి క్రోసిన్ సిరప్ ఇవ్వడానికి ఖాళీగా వున్న మందుబాటిల్ ఓపన్ చేసి, మందులేకపోయే సరికీ, నిరాశగా మళ్ళీ తడిబట్టను కొడుకు తలపైవేసి ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది.
పైన చెప్పిన ఒక్క సీన్లో దర్శకుడు ఈ సినిమాలోని మూడు ముఖ్యమైన పాత్రల్నీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. బంధాలపట్ల ఎటువంటి మానసిక మోహాన్నీ (emotional attachment) చూపించని కథానాయకుడు. తన మనసుని చదివినట్లు, కథానాయకుడి ఆలోచనల్ని ప్రతిధ్వనించే ఒక సహచరి/స్నేహితురాలు. బాధ్యత,ప్రేమతప్ప మరేమీ తెలియని కథానాయకి.

ఉద్యోగప్రయత్నంలో బెంగుళూరుకు వెళ్ళిన దీప్తి భర్తతో తను ఫోన్లో కొడుకు ఆరోగ్యం గురించీ, డబ్బులేకపోవడం గురించీ బెంగపడుతూ చెబుతుండగా, అదే ఫ్లాట్స్ వుంటున్న ప్రొ.నాధన్ వింటాడు. ఆ తరువాత దీప్తి కొడుకుని హాస్పిటల్ కు తీసుకువెళ్ళి కొంత డబ్బు సహాయంకూడా చేస్తాడు. కానీ, ఈ సంఘటన మొత్తంలో ఎక్కడా తను జాలి పడున్నట్లుగానీ, తనుచేస్తున్నది పరోపకారమన్న భావనగానీ నాధన్ చూపించడు. వారిగురించి ఆలోచిస్తున్నాని బేలతో చెబుతూ, ఆ ఆలోచనల వెనుకగల తన అకడమిక్ ఇంట్రెస్ట్ చెబుతాడు. నాధన్ ప్రకారం, మనదేశంలో 200 మిలియన్ నిరుద్యోగులుంటే వారిలో 60% మంది పెళ్ళైనవాళ్ళే, బహుశా అందరి పరిస్థితీ దీప్తి పరిస్థితిలానే ఉండొచ్చు. కానీ, సాధారణంగా ఇలాంటి భార్యలలో కనిపించే నైరాశ్యం దీప్తికళ్ళలో కనిపించకపోవడం తకు ఆసక్తిని కలిగించిందని చెబుతాడు. దానితోపాటూ ఎంతకాలం దీప్తికళ్ళలో ఆ వెలుగుంటుందో! అనే సందేహాన్నికూడా వెలిబుచ్చుతాడు.

“అంటే, నీ ఆసక్తి ఆ అమ్మాయిలోనా?” అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ,”I am not a womanizer to that extend, I need women as a physical need. Not social.Not emotional” అంటూ తన ఉద్దేశాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెబుతాడు. “నా ఆలోచన ఆ అమ్మాయి గురించికాదు, వీళ్ళని ఈ పరిస్థితుల్లోకి నెట్టిన సమాజాన్ని గురించి” అంటాడు. ఒక సంఘటననీ, ఒక మానవసమస్యని కథానాయకుడు చూసే objective/academic తీరు మనకు ఈ సీనుతో అర్థమవుతుంది.

దీప్తి భర్త జయ్ కుమార్ (నరేన్) పాత్ర ప్రవేశంతో, దీప్తి జీవితంలోని ‘శారీరక వెలితి’ కూడా తెలిసొస్తుంది. బహుశా సినిమాలోని అత్యంత బలహీనమైనపాత్ర దీప్తి భర్త జయ్. అప్పుడప్పుడూ తన మాటలూ,చేష్టలూ కూడా అర్థమవ్వనంతగా ఈ పాత్ర తీరుతెన్నులుంటాయి. బహుశా, అది కథాపరంగా అవసరంకూడానేమో! రెండోసారి భర్త ప్రోద్బలంతో దీప్తి నాధన్ దగ్గరికి డబ్బుసాయం కోసం వెళ్తుంది. ఈ సీన్లో మీరాజాస్మిన్ నటన చూసి, నేను తెలుగులో,తమిళ్ లో చూసిన ఈ నటికీ ఈ సినిమాలో కనిపించిన నటికీ ఎంత తేడావుందో అనుకున్నాను. ఇబ్బంది, మొహమాటం, సంకోచం, సిగ్గూ,బిడియం అన్నీ కలగలిపిన భావాల సమ్మేళనమైన త నటన చాలా సహజంగా అనిపించింది.

దీప్తి మూడోసారి, తీసుకున్న డబ్బు తిరిగివ్వడానికీ, తన భర్త ఉద్యోగానికి ఏదైనా రెకమండేషన్ చెయ్యగలడేమో అడగడానికీ నాధన్ తలుపు తడుతుంది. నాధన్ తనజీవితంలో ఇప్పటివరకూ ఉన్నఒకేఒక బంధం చెరియమ్మ చావువార్తవిని, ఇప్పుడు పరిపూర్ణ స్వతంతృడయ్యానని “సెలెబ్రేట్” చేసుకుంటున్న సమయంలో దీప్తి నాధన్ ఫ్లాట్ కు వస్తుంది.ఆక్షణంలో నాధన్ దీప్తిని శారీరకంగా కావానుకుంటాడు. దీప్తి సంకోచాన్ని చూసి “నీకు ఇష్టం లేకపోతే వద్దులే. I am sorry. నువ్వెళ్ళిపోవచ్చు” అనే choice కూడాఇస్తాడు. కానీ, దీప్తి ప్రస్తుత అవసరమో,నాధన్ ఇదివరకు చేసిన సహాయానికి కృతజ్ఞతో, అప్పటికే నాధన్ కున్న జ్ఞానానికీ, జాలిగుణానికీ తను ఇస్తున్న గౌరవమో, తన శారీరక అవసరమో లేక ఇవన్నీ కలగలిపిన భావనో దీప్తిని అక్కడినుంచీ కదలకుండా చేస్తాయి. వారిద్ధరిమధ్యా సంబంధం ఏర్పడుతుంది.

ఈ సీన్లు జరుగుతున్నప్పుడు దీప్తి మనసులోని భావాలకు అద్దంపట్టినట్లు వచ్చే నేపధ్యగీతం గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. తప్పుచేస్తున్న భావన ఒకవైపు, స్త్రీసహజమైన ప్రేమభావన మరొకకవైపు.పవిత్రత ఒకవైపు, ఆపుకోలేని కోరిక మరొవైపు. దీప్తిలోని ఈ సంక్లిష్టమైన భావాలను చక్కగా అక్షరబద్ధం..స్వరబద్ధం రెండూ చేసిన రచయిత (గిరీష్ పుత్తుషెరి) సంగీతదర్శకులను(ఔసెప్పచ్చన్) అభినందించకుండా ఉండలేము. పూర్తిగాఅర్థంకాని మళయాళం, మొత్తం అర్థాన్ని అనువాదంలో అమర్చలేని సబ్ టైటిళ్ళ నడుమకూడా, నాలో ఆ పాటలోని భావాన్ని నింపగలిగినందుకు నా తరఫున నేనైతే వీళ్ళకి హారతులిచ్చేసాను.

నాధన్ సిఫార్సుతో జయ్ కుమార్ కు ఉద్యోగం వస్తుంది. దీప్తి, నాధన్ మధ్య సంబంధం కొసాగుతుంది. కొంత “పరిచయం” తరువాత, దీప్తి ఈ అనుబంధంనుంచీ తను ఆశిస్తున్న కనీస విలువలు,ఆశంసల (expectations) మధ్యగల అగాధాన్ని గుర్తిస్తుంది. అవరాలకుతప్ప ప్రేమానుబంధాలకు అతీతుడయిన నాధన్ ప్రవర్తన, దీప్తిలో కల్లోలాన్ని రేపుతుంది. తను ‘కేవలం ఒక శారీరక అవసరాన్ని తీర్చే, నచ్చిన అమ్మాయిగామాత్రమే చూడబడటం’ అవమానంగా భావిస్తుంది. అప్పుడుదయించే ప్రశ్నలు “ఇది పాపం కదా?”, “స్నేహం, ప్రేమ లేనిబంధాలు వుంటాయా?” అనేవి. దానికి నాధన్ సమాధానం, “పాపంపుణ్యం అనే విలువలు, సమాజం తన ఉనికిని కాపాడుకోవడానికి పెట్టుకున్నవేతప్ప, వాటికొక అస్థిత్వం లేదు. అవికాలంతోపాటూ మారతాయి”. “స్నేహం ,ప్రేమ లేకుండా, ఆనందం (joy)కోసం సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. అలాంటిదే ఇది” అని చెబుతాడు.

ఈ భావాల తీవ్రని తట్టుకోలేని దీప్తి, “అయితే నా భర్తకు ఉద్యోగమిప్పించింది జాలితొనా లేక…!!” అంటూ నాధన్ అహాన్ని గాయపరడానికి ప్రయత్నిస్తుంది. కానీ, నాధన్ శాంతంగా “నేను మొదటిసారి నిన్ను ముట్టుకున్నప్పుడు, నువ్వెందుకు అభ్యంతరం చెప్పలేదు? ఇష్టం లేకపోతే నువ్వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళలేదు? అలాచేస్తే నేను నీకు సహాయం చెయ్యడం మానేస్తాననా! లేక నీ భర్తకు ఉద్యోగం ఇప్పించననా!!” అని ప్రశ్నించేసరీకీ భరించలేకపోతుంది. అయితే,తప్పని తెలిసీ మళ్ళీ ఇప్పుడు ఎందుకువచ్చావని నాధన్ ప్రశ్నిస్తే, దీప్తిదగ్గర సమాధానం వుండదు. ఒకవైపు అపరాధభావం, మరోవైపు అలవికాని ప్రేమని ఎలా వ్యక్తపరచాలో చెప్పలేక ఊగిసలాడే దీప్తిపాత్రకు మీరా జాస్మిన్ ఈ దృశ్యంలో ప్రాణం పోసింది.

అందమైన కల, అదేక్షణంలో ముక్కలైన కలలాంటి అనుభవం తన మనసులో ఒక నీడలా వెంటాడుతుంటే తనలోతనే ఒంటరిగా దీఫ్తిపడేబాధని దర్శకుడు మోంటాజ్ షాట్లలో నేపధ్యగీతసహాయంతో ఆవిష్కరించడం ఇక్కడా చాలా బాగనిపించింది. ఈ మానసిక సంఘర్షణల నేపధ్యంలో దీప్తి, కలవడానికి వచ్చిన నాధన్ తో “ఎప్పటికీ” తనని కలవననిచెప్పి పంపించేస్తుంది. నాధన్ కొంతకాలంపాటూ విదేశాలకి వెళ్ళిపొతాడు. దీప్తి గర్భవతి అవుతుంది. ఈ తరుణంలో దీప్తిలోని మానసిక సంఘర్షణ ద్విగుణీకృతమౌతుంది.

నాధన్ విదేశంనుంచీ తిరిగొచ్చినప్పుడు దీప్తి తన కడుపులోవున్నది తనబడ్డేఅన్న నిజాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సూటి మాటలేతప్ప, ప్రేమసూచనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని నాధన్ ..”భారతదేశంలో ప్రతి నిమిషానికీ 7,200 పిల్లలు పుడతారని. అలాంటిది దీప్తిగర్భం గురించి తాను ప్రత్యేకంగా ఏమని ఆలోచిస్తా”ననిచెప్పి ఆ తరువాత అసంకల్పితంగా “నేనూ మీతో వచ్చేస్తాను” అన్న దీప్తి మాటలని సులువుగాతీసుకుని తనకు తెలియకుండానే నాధన్ దీప్తిని తృణీకరిస్తాడు (reject). అప్పటికే మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న దీప్తి, ఈ తృణీకరణతో తీవ్రమైన డిప్రెషన్ కు లోనవుతుంది.

దీప్తికి కూతురు పుడుతుంది. కళ్ళముందే తను చేసిన పాపం/ప్రేమకు గుర్తుగా పుట్టిన బిడ్డ, ఒకవైపు తనుచూసుకోవలసిన సంసారం, మనసులో తీవ్రమైన అపరాధ భావనలమధ్య, దీప్తి పిచ్చిదవుతుంది. ఇదెలా జరిగిందో అర్థం చేసుకునేప్రయత్నంలో, నాధన్ కు బేల, “దీప్తి కడుపులోవున్న శిశివు నీదేనేమో! అది చెప్పడానికి దీప్తి నీదగ్గరకొచ్చినప్పుడు, నువ్వుతృణీకరించడం వలన, తన మనసు ఛిన్నాభిన్నైమై పిచ్చిదయ్యిందేమో!!” అన్న అనుమానాల్ని వ్యక్తపరుస్తుంది.

ఈ అనుమానంలోని నిజాన్ని జీర్ణించుకోలేని నాధన్ డిఫెన్సివ్ లో పడతాడు. ఈ ఆలోచని రిజెక్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. దీప్తి ఇప్పుడు పిచ్చిదైపోవడంవల్ల అసలు నిజాన్ని తెలుసుకోలేని స్థితిలో పడతాడు.ఈ సీన్లో బేల-నాధన్ లమధ్య జరిగే సంభాషణను దర్శకుడు చిత్రీకరించిన తీరు చూస్తే, ఒకస్థాయిలో నాధన్ తనలోతనే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. బేల అతడి అంతరాత్మకు ప్రతిరూపంగా అనిపిస్తుంది. ఈ సంఘటన విషయంలో నిజం తెలిసిన దీప్తి పిచ్చిదై ఏమీతెలియని స్థితిలో వుండటంవలన, ఇకమిగిలిన తనే మొత్తం బాధ్యతను తీసుకోకుని అనుభవించాలన్న స్పృహ నాధన్ కు కలుగుతుంది. ఈ దృశ్యంలో మమ్ముట్టి నటన తెరపైచూడాల్సిందే.

జయన్ నాధన్ సహాయంతో దీప్తిని మానసిక చికిత్స కేంద్రంలో చేర్పిస్తాడు. అక్కడ దీప్తికి చికిత్స జరుగుతుంటే, ఇక్కడ నాధన్ మానసికక్షోభని అనుభవిస్తూ, విపరీతమైన త్రాగుడికి అలవాటుపడతాడు. తన అకడమిక్ పనుల్నికూడా మనసుపెట్టి చెయ్యలేకుండాపోతాడు. బహుశా, దీప్తినీ శిశివునీ తృణీకరించిన క్షణంలోనే ‘అప్పటివరకూ బంధాలు లేకుండావున్న నాధన్, ఒక బలమైన సంబంధానికి పునాది వేసాడా!’ అనిపించేంతగా క్షోభననుభవిస్తాడు.

కొంతకాలానికి దీప్తి చికిత్సపూర్తయ్యి ఇంటికి తిరిగొస్తుంది. అప్పటికే ఇల్లుమారటం వలన, నాధన్ వున్న ఫ్లాట్ కి దూరంగా నివసించడం మొదలెడుతుంది. పూజలు పునస్కారాలలో స్వాంతన వెతుక్కుంటుంది. కానీ, ఒకసారి నాధన్ దీప్తిఇంటికివచ్చేసరికీ,చూడగానే తలుపువేసేసినా, మళ్ళీ దీప్తిలో సంఘర్షణ ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎక్కడ నాధన్ ప్రేమలో పిచ్చిదవుతుందోఅన్న భయంతో, ఈ సమస్యలకు మూలమైన నాధన్ ను చంపడానికి నిర్ణయించుకుంటుంది. పిల్లలతోసహా నాధన్ ఇంటికి వెళ్తుంది.

ఎందరో స్త్రీలను అనుభవించిన నాధన్ దీప్తికోసం మాత్రం ఎందుకు తపించాడు? తనకారణంగా, తనకోసం పిచ్చిదైన దీప్తిని నాధన్ నిజంగా ప్రేమిస్తాడా? వీరిద్దరూ ఒకటౌతారా..లేక దీప్తి నాధన్ ను చంపేస్తుందా? ఒకవేళ వీరిద్ధరూ కలిస్తే, ఈ కలయికకు వారేర్పరుచుకున్న ప్రాతిపది ఏమిటి? అనేవి ఈ ఆఖరి దృశ్యంలో తెలుస్తాయి. ఇంత క్లిష్టమైన దృశ్యాన్ని రాయటంలోనూ, తియ్యటంలోనూ దర్శకుడు చూపిన ప్రతిభ, నటీనటులు చూపిన నటనా అద్వితీయం.

పాశ్చాత్యపోకడలైన వ్యక్తివాదం, అస్థిత్వవాదాలను భారతీయ పరిస్థితుల్లో reinterpret చేసిన సినిమాగా ‘ఒరే కడల్’ నాకు అనిపిస్తుంది. ‘మనిషికి అవసరాలూ,ఆనందాలూ, బాధ్యతలతోపాటూ తనను “పిచ్చిగా” ప్రేమించే వ్యక్తిదొరికినప్పుడు సమాజకట్టుబాట్లతో నిమిత్తం లేకుండా, తన భావజాలంతో సంబంధం లేకుండా ప్రేమ పుడుతుందనే ఒక సత్యం ఈ సినిమాద్వారా చెప్పబూనాడేమో!’ అనిపిస్తుంది.

ఈ సినిమాని చూసి అనుభవిస్తేగానీ, కొన్ని అర్థాలు స్ఫురించవు. నేను ఇంకోపదిపేజీల విశ్లేషణ రాసినాకూడా అసమగ్రంగానే అనిపిస్తుంది. అందుకే, ఈ సినిమాను అందరూ ఖచ్చితంగా చూడాలనిమాత్రమే నేను కోరుకుంటాను.

చివరిగా ఒక్కమాట, ఈ సినిమా చూసిన తరువాత రాబోయే 5-6 సంవత్సరాలలో తెలుగులోమాత్రం ఇలాంటి సినిమాను ఎవరూ తీసే సాహసం చెయ్యరేమో! ఒకవేళ చేసినా మమ్ముట్టి, మీరాజాస్మిన్ చేసిన పాత్రల్ని చెయ్యగలిగే ధైర్యం మన పరిశ్రమలో ఎవరికీ లేదనే అనిపిస్తుంది.

ఈ సినిమాని మోసర్ బేర్ వారు 50 రూపాయకే అందిస్తున్నారు. ఎవరైనా మళయాళం మిత్రులుంటే, కేరళ నుంచీ తెప్పించుకోండి.బెంగుళూరు,చెన్నైలలో లో ఈ సినిమా ఖచ్చితంగా దొరుకుతుంది. హైదరాబాద్ లో వున్నవాళ్ళతో నా దగ్గరున్న DVD పంచుకోవడానికి నేను రెడీ!


Wednesday, October 22, 2008

"యాంగ్రీ మిడిల్ క్లాస్" సినిమాలు


మధ్యతరగతి సైజు పెరిగినతరువాత, కొంత మసాలాకలిపిన సామాజిక స్పృహకూడా మనకుకావాలన్న సత్యం కొంతమంది సినీదర్శకుల మదిలో మెదిలింది. అప్పుడు పుట్టుకొచ్చిన సినిమాలే లంచగొండితనం, రాజకీయ స్థబ్ధతకు ప్రజల సమాధానం, వ్యవస్థ నిర్లక్ష్యానికి ప్రతిగా చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకునే “యాంగ్రీ మిడిల్ క్లాస్ సినిమాలు”.

పూర్తి వ్యాసం నవతరంగంలో చదవండి...

Friday, October 17, 2008

అవమానించే సినిమాలు !

ఆర్టు సినిమాలు,హార్టు సినిమాలు, సమాంతర సినిమాలు,బూతుసినిమాలు, బాగుండే సినిమాలు, బాగలేని సినిమాలు, మంచి సినిమాలు, చెడ్డసినిమాలు అని మనం చాలా సినిమాల పేర్లువిన్నాం. చూసాం. చర్చించాం. విశ్లేషించాం. విస్తృతంగా సమాచారాల్ని పంచుకున్నాం. కానీ, గత రెండు వారాలలో నేను ఒక విభిన్నతరహా సినిమాల బారినపడి, ధియేటర్ల నుంచీ నిర్ధ్వందంగా “వాకౌట్లు” చేసాను. అవే…అవమానపరిచే సినిమాలు.

పూర్తివ్యాసం నవతరంగంలో చదవండి.

Wednesday, October 15, 2008

రెస్టారెంటోఫోబియా...!

కొత్త అనుభవం. కొత్త ప్రదేశం. కొత్త మనుషులూ, కొత్త వాతావరణం మనలో ఎప్పుడూ కొంత ఖంగారుని సృష్టిస్తాయి. అది సహజంకూడా. అదీ ముఖ్యంగా ఆ కొత్తదనానికి తెలియనితనం జోడిస్తే ! అధికారమున్నాకూడా మనం సాధికారకంగా నిర్ణయాలు తీసుకోలేం. మన సహజ ప్రవర్తనని చూపించలేము. దాన్నే ఒక్కోసారి మొహమాటం అనుకుంటే, మరో సారి బిడియం అనేసి తృప్తిపడతాము. కానీ, అప్పుడప్పుడూ అది ఈ సాధారణ హద్దుల్నిదాటి మానసిక శాస్త్రంలో చెప్పే కాంప్లెక్స్ గానో లేక ఒక ఫోబియాగా తయారవుతుంది.


ఆంధ్రప్రదేశ్ లో సాధారణగా ఉండే టిఫిన్, భోజనం హోటళ్ళను మాత్రమే చూసిన నేను, డిగ్రీ చదివే రోజుల్లో స్నేహితులతో మొట్టమొదటిసారిగా ఒక పెద్ద 'రెస్టారెంట్'కు వెళ్ళాను. అక్కడ మెన్యూ చూసిన మొదటి క్షణంలో పట్టుకుంది నాకొక కాంప్లెక్స్...దాన్నే ఫోబియా అనుకుంటే అదొక కలగాపులగం ఫోబియా. ఒకటికాదు రెండుకాదు ఏకంగా మూడు ఫోబియాల కలయిక. Kainolophobia or Kainophobia- Fear of anything new, novelty. Kakorrhaphiophobia- Fear of failure or defeat and Katagelophobia- Fear of ridicule.


నిజానికి ఆ మెన్యూలో చాలా పేర్లు నాకు అస్సలు అర్థం కాలేదు. అర్థమయినా, ఆర్డరు ఎలా ఇవ్వాలో తెలీలేదు. కొత్తదనంవల్ల వచ్చిన ఖంగారు ఒకటైతే, ఎక్కడ తప్పుచేస్తానో అన్న భయం మరోవైపు. ఈ రెండిటికీ మూలకారణం, నాతో వచ్చిన స్నేహితులు "ఊరోడ్రా!" అనుకుంటారనే దిగులు. మామూలుగా మాఊర్లో భోజనం చెబితే అన్నీవచ్చెస్తాయి. మహాఅయితే చపాతీ చెప్పేవాళ్ళం. వాటితోపాటూ పప్పో కూరో వాటంతట అవే వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ‘రోటీ’ సపరేటుగా ‘దాల్’ సపరేటుగా ఆర్డరివ్వాలి. ‘పన్నీర్’ అనేది తియ్యటి సోడాలాంటి పానీయంగా నాకు తెలుసేగానీ, అదొక తిండిపదార్థం పేరని తెలీదు. ఇక మలాయికోఫ్తా, కాశ్మీరీ పలావ్, బటర్ చికెన్ లాంటివి కొత్త పేర్లైతే , ఇప్పటికీ పేరుకూడా తెలీని చైనీస్ వంటకాలు బోలెడు.


ఈ తంతుజరిగిన కొన్నాళ్ళకు మా Educational psychology లెక్చరర్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు.


మా లెక్చరర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు విదేశీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒకాయన మైసూర్ కొచ్చాడట. అప్పటికే రీసెర్చ్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న మా లెక్చరర్, ఆయన్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఎక్కడ వెళ్ళడానికి లేటైపోతాడేమో అనే ఆలోచనతో మా లెక్చరర్, అనుకున్న సమయానికన్నా గంట ముందే ఆ ప్రొఫెసరున్న ఫైవ్ స్టార్ హోటల్ కి చేరుకున్నాడు. తీరా అక్కడికి చేరగానే, వారి అసిస్టెంట్ "అయ్యా మీరు గంట ముందొచ్చేసారు, కొంత సమయం వేచిచూడాలి" అని మర్యాదగా చెప్పేసాడు. ఆ గంటసమయంలో ఏంచెయ్యాలో తెలీక కాసేపు లాబీలో కూర్చుని,సమయం గడవక కొంత ధైర్యం చేసి పక్కనే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు.


కూర్చోగానే, చేతిలో మెన్యూ ,పెదవులపై చిరునవ్వూ పెట్టుకుని సర్వర్ ప్రత్యక్షం. ఆ మెన్యూ చూసి మా లెక్చరర్ ఢగైపోయాడు. ఇకతప్పదన్నట్లుగా చదవడానికి ప్రయత్నిస్తే అన్నీ..గ్రీకూ లాటిన్లే. చిట్టచివరకు దోసె,కాఫీ కొంచెం తెలిసిన పదార్థాలలాగా అనిపిస్తే వాటినే ఆర్డరిచ్చు ఊరుకున్నాడు.ఆ చిరునవ్వుల సర్వరు పక్కకితప్పుకోగానే మా లెక్చరర్ దృష్టి పక్క టేబుల్లలో కూర్చుని టిఫిన్ ఆరగిస్తున్న వ్యక్తిలపై పడ్డాయి.ఒక్కసారిగా ఆయనగుండేల్లో కత్తులూఫొర్కులూ పరుగెత్తాయి...అర్థమయ్యిందనుకుంటాను! ఆ పక్క టేబుల్లో దోసెల్ని కత్తులూ ఫోర్కులతో చీల్చిచండాడుతూ కొందరు కనిపించారు. తను వందరుపాయలు త్యాగం చెయ్యడానికి సిద్దమైన దోసె తన టేబిల్ పైకి చేరింది.


అసలే ఎప్పుడూ జీవితంలో వెళ్ళని ఫైవ్ స్టార్ హోటలు , దోసెల్ని అలవోగ్గా చేతుల్తోతప్ప కత్తులూ కటార్లతో తినెరగని జీవితం... ఇప్పడు చూస్తే "ఎరక్కపోయి చెప్పాను ఇరుక్కుపోయాను" అనిపాడుకునే పరిస్థితి. ఎదురుగా ఇష్టమైన దోసున్నా మనసారా తినలేని పరిస్థితి. ఈ డోలామానమైన పరిస్థితిలో మా లెక్చరర్ చేతులు నలుపుకుంటూ దాదాపు 10 నిమిషాలు దీనంగా ఎదురుచూస్తూ, కత్తులూ పోర్కుల కాంబినేషల్నతో ప్రయోగాలు చేస్తూ గడిపేసాడు. ఇంతలో, పక్క టేబుల్లో అప్పటివరకూ ఈ తంతుచూస్తున్న ఒక పెద్దాయన తన టిఫిన్ ముగించిన వెళ్తూవెళ్తూ మా లెక్చరర్ భుజంపై చెయ్యివేసి "my boy! you have paid for it" అనిజెప్పేసి వెళ్ళిపోయాడట.


అంతే! ఆ ఒక్క క్షణంలో మనసుమూల ఒక వెయ్యిక్యాండిల్ బల్బువెలిగేసింది. అప్పటిదాకా ఆడుకుంటున్న ఫోర్కూ కత్తులను పక్కనపడేసి, ఆ సర్వర్ను మించిన నవ్వు తన ముఖం మీద ప్రతిఫలిస్తుండగా విజయవంతంగా చెత్తో దీసె లాగించేసాడు.


ఈ సంఘటన చెప్పిన మరిక్షణంలో నాకున్న ఫోబియాలన్నీకూడా పటాపంచలయ్యాయి. "నిజమే! నా డబ్బులు పెట్టి నేను తింటున్నప్పుడు, నా ఇష్టమొచ్చినట్లు తినే అధికారం నాకుంది కదా" అనిపించింది. అంతెందుకు, అంత డబ్బుపెట్టి ఆర్డరిస్తున్నప్పుడు ఆ పదార్థాలేమిటో అవి వేటితో తయారు చేస్తారో అవి మనకు ఎలా కావాలో సాధికారికంగా అడిగి తెలుసుకుని మరీ చెప్పే హక్కు మనకుందికదా అనిపించింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఆ కాంప్లెక్సులూ,ఫోబియాలూ నా దరికికూడా చేరలేదు.


ఈ సంఘటనను చెప్పి నా ఆత్మన్యూనతను పోగొట్టిన మా సైకాలజీ లెక్చరర్ షిండే గారిని ఇప్పటికీ పెద్ద హోటల్ కెళ్ళిన ప్రతిసారీ, కొత్త ప్రదేశానికి వెళ్ళిన ప్రతిసారీ తలుచుకుంటాను.


*****

Monday, October 13, 2008

చిరంజీవి Vs బాలకృష్ణ : ఒక ప్రేమ సంవాదం

బాలకృష్ణ తన ఫ్యాన్స్ తో చిరంజీవి గొప్పనటుడని చెప్పి ఒప్పించగలడా? అదేపని చిరంజీవిమాత్రం చెయ్యగలడా?
చఛ్చినా చెయ్యలేరు. కారణం, వారివారి ఆలోచనాధోరణులూ, పనిచేసే చిత్రాలు, నటించే విధానాలు, మేనరిజాలు, ప్రేక్షకులకు వారిపట్లుండే ఆశలూ, ఆశయాలూ వేరు..చాలా వేరు. బాలకృష్ణ అభిమానిని హఠాత్తుగా చిరంజీవిని ప్రేమించి, అభిమానించి సినిమాహాల్లో ఈలలేసి గోలచెయ్యమని చెప్పగలమా..ఇలా చెయ్యడానికి ఎవరికీ దమ్ములు చాలవు. ఎందుకంటే, అదంతే. ఆ విలువలూ, అభిమానం, ఉన్మాదం కాంప్రమైజ్ కొచ్చేవి కావు. చిన్నప్పటినుంచీ వాళ్ళునమ్మిన తారను, ఆరాధ్య నటుడ్ని త్యజించడం సులభంకాదు. దాదాపు అసాధ్యం కూడా!


అలాంటిది, తాము జీవితాంతం నమ్మి బ్రతికిన విలువల్ని త్యజించి, తమ ఇష్టానికి వ్యతిరేకంగా, ప్రేమించిన జంటని తల్లిదండ్రులు ఎందుకు ఆశీర్వదించాలి? నిరసించి తాటతియ్యకుండా ఎందుకు వదిలెయ్యాలి? మన సినిమాలూ, సాహిత్యం అన్నీ పెద్దలు ప్రేమలకు వ్యతిరేకమని చూపించి, వారిని కర్కోటకులుగా చూపినవే. చర్యల ప్రకారం వారు చేసేవి దుర్మార్గాలుగా అనిపించినా, "అవి వారికి తమ విలువలపట్ల వున్న నిబద్దతగా ఎందుకు చూడకూడదు?" అనేది నా ప్రశ్న. నమ్మిన సిద్ధాంతాలనూ, విలువలనూ,అభిప్రాయాలనూ, 'పిల్లలకు ఏది మంచో తమకు బాగా తెలుసు' అనే నమ్మకాన్నీ ఒక్కసారిగా విడనాడి విశాలహృదయంతో తల్లిదండ్రులు పిల్లల ప్రేమను ఎందుకు అంగీరించి ఆశీర్వదించాలి. అందుకే ప్రేమను వ్యతిరేకించే తల్లిదండ్రులంటే నాకు అమితమైన గౌరవం.


ఇక ప్రేమికుల సంగతి చూద్దాం.షర్టుకొనడానికీ, షూస్ కొనడానికీ, పరీక్షఫీజు కట్టడానికీ, మెస్ బిల్లు కట్టడానికీ తల్లిదండ్రులనుంచీ పర్మిషన్ తీసుకుంటారేగానీ, ప్రేమల వరకూ వచ్చేసరికీ వారిష్టం వారిది. ఒకరినొకరు ఇష్ట'పడిపోతారు', ఆరాధించేసుకుంటారు, అభిమానించి కలిసి జీవించేయ్యాలనే నిర్ణయాలకొచ్చేస్తారు. అప్పటిదాకా గుర్తురాని తల్లిదండ్రులు, "పెళ్ళి" అనే మాట వినబడగానే గుర్తుకొచ్చేస్తారు. "మా అమ్మానాన్నాల్ని అడిగి ఒప్పించవా శేఖర్!!!" అని బేలగా ఆ అమ్మాయి. "మన ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతోనే సగర్వంగా అందరి సమక్షంలో నీ మెడలో తాళికడతాను ప్రియా" అని సాహసంగా అబ్బాయీ చెప్పుకుని. బాలకృష్ణ అబిమానులకు చిరంజీవి గొప్పనటుడని చెప్పడానికి ప్రయత్నించే తరహాలో తల్లిదండ్రులకు తమ ప్రేమ గొప్పతనాన్ని చెప్పడానికి బయల్దేరుతారు.


ఆ తరువాత జరిగేది కొన్ని వందల సినిమాలలో చూసిన రొటీన్ తంతే. ఆవేశపడే తండ్రి, గుండెలు పగిలేలా ఏడ్చేతల్లి, అవకాశమిస్తే చంపైనా ఈ ప్రేమను అమరం చేస్తాననే (ఉంటే) అన్న, (లేకపోతే) బాబాయిలూ మామయ్యలూ. ఇలా అందరూ పేజీలకొద్దీ తాము పిల్లలకోసం చేసిన త్యాగాలూ,వంశప్రతిష్టలూ, కులగౌరవాలూ, వారికోసం కన్నకలల్నీ ఏకరువుపెట్టి, తమ నిబద్ధతని అధికారికంగా చాటుకుంటారు. ఒకవైపు అమ్మాయి హౌస్ అరెస్ట్, కమ్యూనికేషన్ కట్. మరో వైపు అబ్బాయి విరహాలు. వాడి ప్రేమబాధని మందుతోనో లేక లేచిపొయ్యే ఆలోచనలతో రెచ్చగొట్టి, ప్రేమావేశాన్ని శాంతింపజెసే స్నేహబృందాలు. ప్రేమకు వత్తాసుపలికే బలం లేని బామ్మలో, తాతయ్యలో ఎంచక్కాతయారయ్యి మంచి ట్రాజిక్ కామెడీ వెలగబెడుతూ ఉంటారు. అదేనండీ! ప్రేమికులకు ట్రాజెడీ మనకూ, చుట్టుపక్కలవారికీ మాత్రం కామెడీ.


నిజంగా, ఈ చిరంజీవి అభిమానులకు బాలకృష్ణ సినిమాను ఆదరించమనే తంతు అవసరమంటారా? పిల్లలు తమ ప్రేమల విషయం చెప్పి, తల్లిదండ్రులను ఒప్పించడం ముఖ్యమంటారా? నాకు మాత్రం ఇందులో అనవసరంగా సినిమా నిడివి పెంచి, జీవితాలలో డ్రమాటిక్ ఎఫెక్టి తీసురావడానికితప్ప ఈ తంతెప్పుడూ అసంబద్ధంగానే అనిపిస్తుంది. Diametrically opposite విలువలున్న తరాలు సహృదయంతో, ఎటువంటి బాధా, కోపం, నిరాశ, లేకుండా కాంప్రమైజ్ కు ఎలా వస్తారు? ఎందుకురావాలి? అలావస్తే, వారుతమ జీవిత విలువల్ని "తూచ్!" అని ఒక్క క్షణంలో త్యజించినట్టేకదా ! అది నిజంగా అవసరమా?


ప్రేమించడానికి అఖ్ఖరలేని పెద్దల పర్మిషన్/ఆశీర్వాదం పెళ్ళికెందుకు కావాలి? అంటే, ఈ ప్రేమించే తరానికి ఎప్పుడూ తమ విలువలపట్ల నమ్మకమూ, నిబద్ధతా లేవన్నమాటే! ప్రేమించే ఆవేశమేతప్ప, జంటగా కలిసి బతకాలని సొంతంగా నిర్ణయం తీసుకునే సాధికారత లేదన్నమాట. ఇలాంటి వాళ్ళకు నిజంగా ప్రేమ అవసరమా? అటు తమ పైత్యాలకు పర్మిషనడిగి పెద్దలను అడకత్తెరలో పోకల్నిచెయ్యడం, ఇటు తమ జీవితాల్ని కొంతకాలం నరకప్రాయం చెసుకోవడం వల్ల వీరు సాధించేదేమిటో నాకు అర్థం కాదు.


ఇదేమాట ఒక ప్రేమికుడిని అడిగితే, "ప్రేమంట ఇద్దరు వ్యక్తులు ఇష్టపడటం, పెళ్ళంటే రెండుకుటుంబాల కలయిక కదా! అందుకే, మొదటిదాంట్లో తల్లిదండ్రులు అవసరం లేదు, రెండోదానికి వాళ్ళందరూ కావాలి" అని వేదాంతం ఒలకబొసాడు. "అహా! అలాగా!! అయితే, తల్లిదండ్రులకు తెలీకుండా నీకిష్టమైన అమ్మాయిని కేవలం ప్రేమించు. ఆ తరువాత మీ కుటుంబంకోసం, వారు చూపించిన అమ్మాయిని పెళ్ళిచేసుకో. రెండూ బ్యాలన్సైపోతాయి" అని చెబితే మౌత్ లో సౌండ్ రాలేదు.ఎందుకురా ఈ నాటకాలంటే, "కుటుంబం సపోర్ట్ లేకపోతే పెళ్ళి తరువాత నానాకష్టాలూ పడాల్సివస్తుంది మిత్రమా" అంటూ అసలు నిజాలు బయటపెట్టాడు. బాగోగులు చూడ్డానికీ, కడుపులకీ, పురుళ్ళకీ, ఫంక్షన్లకీ, పిల్లల పెంపకానికీ ఇతరత్రా అవసరాలకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. బరితెగించి ఇష్టమొచ్చినట్లు పెళ్ళిచెసుకుంటే ఈ సుఖాలన్నీ కాదనుకున్నట్లే అని దేవరహస్యం ఏకరువయ్యింది.


"మరి తల్లిదండ్రులపై ప్రేమ సంగతో!" అంటే, "తల్లిదండ్రులు మనపై అధికారం ఉందని ఎలా అనుకుంటారొ, మనకూ వారిపట్ల బాధ్యత మాత్రమే ఉందనుకుంటే సరిపోతుంది. ఎంతైనా పెళ్ళైన తరువాత మనం మనస్ఫూర్తిగా ప్రేమించాల్సింది పెళ్ళాన్నేకదా!" అని నాకే జ్ఞానోదయం కల్పించాడు. ఆలోచించడానికి కొంత ఇబ్బందిగా ఉంటుందిగానీ, బహుశా నిజంకూడా ఇదేనేమో! అంటే, తల్లిదండ్రుల ఆశీర్వాదం పేరుతో ఈ ప్రేమికులకి కావలసింది అవసరాలకు ఫ్యామిలీ అందించే సపోర్టేతప్ప, మరోటి కాదు. అందుకే, ప్రేమిస్తున్నప్పుడు అవసరం లేని తల్లిదండ్రులు పెళ్ళికి అర్జంటుగా కావలసివస్తారు.


ఫ్యామిలీ నెట్వర్క్ లో లభించే సెక్యూరిటీ కోసం, స్వతంత్రించి ప్రేమించినా ఆ నిబద్ధతని గాలికొదిలి, పెళ్ళికోసం మాత్రం పర్మిషనడిగే ప్రేమికులకన్నా, ప్రేమల్ని మనస్ఫూర్తిగా తమ విలువల్ని అనుసరించి నిరసించే పెద్దలపక్షమే నేనూ. అయితేగియితే, ప్రేమికులు ప్రేమతొపాటూ పెళ్ళీ ఇష్టానుసారం చేసుకోవాలేగానీ, చిరంజీవి అభిమానిని బాలకృష్ణ ఫోటోను పూజించమని చెప్పినట్లు, ఒప్పుకోరని తెలిసినా, పెద్దల అంగిక్లారం, ఆశీర్వాదంకోసం దేబరించడం ఎందుకూ!!!! ఇరుపక్షాలవారూ క్షోభపడటం ఎందుకూ...కేవలం ఆ తరువాత ఉత్పన్నమయ్యే "అవసరాల" కోసమేనా! ధైర్యం లేని ప్రేమలు, భవిష్యత్తు సుఖాలకోసం నమ్మకాల్ని త్యజించే ప్రేమలంటే ఇవే. వీళ్ళేనా మన ప్రేమికులు? వీరివా పవిత్ర ప్రేమలు?


*****

Saturday, October 11, 2008

నేను కుహానా లౌకికవాదిని (pseudo-secularist) !

ఈ మధ్య బ్లాగుల్లో జరుగుతున్న చర్చల్లో 'కుహానా లౌకికవాదం' (pseudo-secularism) అనేపదం మాటిమాటికీ వినిపిస్తోంది. ఇంకో అభియోగమేమిటయ్యా అంటే, మైనారిటీలను బుజ్జగించే నెపంతో ప్రభుత్వాలు (ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వ ప్రభుత్వాలు) ముస్లింలకు "పెద్దపీట" వేస్తున్నారు అని. వీటిల్లో నిజానిజాలెంత? అపోహలెన్ని? అనేవి కొంచెం ఆలోచించవలసిన విషయాలే.


హిందువులను ప్రశ్నిస్తేనో లేక ముస్లింలను,క్రైస్తవులనూ సమర్థిస్తేనో చాలా తేలిగ్గా వేసెయ్యదగిన 'బ్రాండ్' సూడో సెక్యులరిస్ట్. ఎవరైనా కాంగ్రెస్ పార్టీభావజాలానికి దగ్గరగా, అది మానవతాదృష్టితో చర్చించినా అర్జంటుగా విధించెయ్యదగిన మూస 'కుహానా..లౌకికవాది'. నేను ఈ బ్రాండింగుకు గురయిన ప్రతిసారీ కన్వీనియంటుగా, "ఇవి హిందూ అతివాద ధోరణులులే!" అనుకోవచ్చు. లేకపోతే రాజకీయపార్టీల ప్రకారంగా వాళ్ళనీ ఒక మూసలోకట్టి, "అబ్బా! వీళ్ళు బీ.జె.పీ, ఆరెస్సెస్స్ వాళ్ళలాగున్నారే" అనుకుంటే సరిపోతుంది. కానీ ఈ బ్రాండుకీ ఆబ్రాండుకీ అపోహ, prejudice తప్ప మరేకారణం కనిపించక, కొంత తర్కాన్ని వెతుక్కుంటూ నిజాల్ని తెలుసుకోవడానికి బయల్దేరాను.


భారతదేశం ఒక లౌకికరాజ్యంగా మనలేకపోవడానికిగల చాలా కారణాలలో ముఖ్యమైనది రాజకీయాన్నీ,మతాన్నీ విడిగా చూడలేకపోవడం. భారతీయ జీవితాలలో మతం ఎంతబలంగా పెనవేసుకుపోయిందంటే, దాన్ని ఒకపక్కనపెట్టి మరో ముఖ్యమైన జీవనాంశమైన రాజకీయన్ని 'తొడుక్కోవాలంటే' అసాధ్యమనిపించేలా మమేకమైపోయింది. ఇదే తీరు మన భారతీయ professionals లో కూడా చూడచ్చు. వ్యక్తిగతజీవితాన్నీ, ప్రొఫెషనల్ జీవితాన్నీ compartmentalize చెయ్యడం మన భారతీయులకి అంత సులువుగా రాదనుకుంటాను.కానీ, ఒక సైద్దాంతిక భావజాలానికి దేశం కట్టుబడినతరువాత ప్రజలూ,ప్రభుత్వాలూ దాన్ని పాటించడం చాలా అవసరం అన్నది కాదనలేని సత్యం. అయితే, ఆ సిద్దాంతమే "హుష్ కాకి" అయిపోతే?


రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అన్నపదం లేకున్నా, 1976 లో ఈ పదాన్ని చేర్చేముందు జరిగిన చర్చల్లో 'Equal distance from every religion' అని నిర్ణయించుకోవడం జరిగింది. అప్పటినుండీ ఇప్పటివరకూ మారిన పరిస్థితులకు అనుగుణంగా 'Equal respect for every religion' అనుకునే వరకూ వచ్చాం. మొదటి సిద్ధాంతంలోని మూలబిందువు మతాన్ని రాజకీయానికి దూరంగా ఉంచడం. రెండో దాంట్లో, అన్నిమతాల్నీ సమానంగా చూడటం అనే నెపంతో మతానికి ఒక రాజకీయ అంగీకారం కల్పించడం. మొదటిది Utopian అనిపిస్తే, రెండోది "తప్పదుకదా!" అనిపించేలా ఉంటుంది. ఈ వైరుధ్యమైన అంగీకారాల నడుమ అటు హిందూపక్షాన వాదించినా, ఇటు ఇతరమతాల తరఫున వకాల్తాపుచ్చుకున్నా రెండూ "కుహానాలే". అంటే ‘మీది తెనాలే..మాది తెనాలే’ పాటవరసలో "నువ్వు కుహానా..నేను కుహానా" అని పాడుకోవాలన్నమాట.


మరి అసలు సెక్యులరిజం ఎక్కడపోయింది? కొంత హాస్యంగా చెప్పాలంటే, మనదేశ రాజకీయపరిణామాల నేపధ్యంలో నిజమైన సెక్యులరిజాన్ని రాజ్యంగంనుంచీ కాకెత్తుకెళ్ళిపోయిందన్నమాట..హుష్ కాకి!!. మొత్తానికి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ,ఇంకోవైపు వామపక్షాలు లౌకికవాద స్ఫూర్తికి తిలోదకాలిచ్చేసి, 'తాంబూలాలిచ్చేసాం తన్నుకు ఛావండి' అంటే, కొందరు నిజంగానే తన్నుకుని,కాల్చుకుని,నరుక్కుని ఛస్తుంటే, మనలాంటివాళ్ళం బ్లాగుల్లోపడి వీరంగం చేస్తున్నాం.


కొంచెం వేదాంత ధోరణిలో చెప్పాలంటే, "సెక్యులరిజమే ఒక మిధ్య..మరి దానికో 'సూడో' జోడిస్తేమాత్రం పోయేదేముంది? అదీ మిధ్యను మించిన మాయేకదా!" ఈ మాయలో ఉన్నవారిలో నేనూ ఒకడ్ని...నేను సూడో సెక్యులరిస్టునే!


ఇక రెండో విషయానికొస్తే, ముస్లింలకు ‘పెద్దపీట’ వెయ్యటం. నావరకైతే, ముస్లింలకు ఇంతకాలం దక్కింది రాజకీయ lip service తప్ప, నిజమైన పీఠాలూ, privilege ఎన్నటికీ కాదు. సచ్చర్ కమిటీ రిపోర్టువరకూ ఎందుకు, చుట్టుపక్కల నివసిస్తున్న ముస్లింలను చూస్తేవారి సామాజిక,ఆర్థిక స్థితి సగటు హిందువుకన్నా తక్కువని ఇట్టే చెప్పెయ్యొచ్చు. అదివాళ్ళ మతంవల్లవచ్చిందో, మూర్ఖత్వంవల్ల వచ్చిందో అనేది అవసరమే అయినా, as a welfare state భారతదేశానికి వీరిని పట్టించుకోవలసిన అవసరంకూడా ఎంతైనా ఉంది. వృద్ధాప్యపు పెంషన్లు, రిజర్వేషన్లూ, గ్రామీణ ఉపాధిపధకం లాగానే ఏదో ఒక సంక్షేమపధకం వీళ్ళకీ అవసరమేకదా! "వద్దు, మతపరమైన రాయితీలు రాజ్యాంగవిరుద్ధం" అని అలాగే వదిలేద్దామంటే, అదెంతవరకూ సమంజసం అన్నది ఆలోచించాల్సిన విషయం.


ఈ "పెద్దపీట" ధోరణిని లేవనెత్తే వారందరూ ఉదహరించేది హజ్ యాత్రలకోసం ముస్లింలకు ఇచ్చేరాయితీలు, మదరసాలకు ప్రభుత్వాలు అందించే నిధులువంటి రాజకీయ తంతునిచూసి. దాన్నే ముస్లింలకు పెద్దపీటగా ఇప్పుకున్నా, నిజంగా హిందూ మతానికి మన దేశం ఎమీచెయ్యటం లేదా అనికూడా ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న మనలో చాలామంది వేసుకోము, వేసుకోవాలనే ఆలోచనకూడా రాదుకూడా.


ఒక ఉదాహరణ చూద్దాం. అలహాబాద్ కుంభమేళాలో (2001) దాదాపు 1500 హెక్టార్ల విస్తర్ణంలో హిందువుల కోసం జరిగిన ఏర్పాట్ల వివరాలు చూడండి.12,000 నీటికొళాయిలు, 50.4 మిలియన్ లీటర్ల నీళ్ళు, 450 కిలోమీటర్ల పొడవునా విద్యుత్ లైన్లు, 15,000 వీధిదీపాలు, 70,000 లెట్రిన్లు, 7100 మంది స్వీపర్లు, 11 పోస్టాఫీసులు, 3000 టెంపరరీ ఫోనుకనెక్షన్లు, 4000 బస్సులు,ఐదు రైళ్ళు, పర్యవేక్షణకై 80 మంది అధికారులు , పోలీసులూ (11,000), ఆర్మీ, ఇతర ఫోర్సెస్ (40 కంపెనీలు) ఎన్నోఎన్నెన్నో. వీటన్నిటికీ లెక్కలుకట్టి చూసుకుందామా!


మధ్యప్రదేశ్ అజ్జయిని లో జరిగిన (2004) అర్థకుంభమేళాకు అయిన ఖర్చు 100 కోట్లపైమాటే. అప్పటి ముఖ్యమంత్రి ఉమాభారతి స్వహస్తాలతో ఈ ఖర్చు జరిగింది. ఇలా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్,ఆంధ్రప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్,తమిళనాడు ప్రభుత్వాలు హిందూ యాత్రికులకు కల్పించే వసతులూ, రాయితీలూ కలుపుకుంటే హజ్ యాత్రలకు పెట్టే ఖర్చులో ఎంతశాతం ఉంటుందో? ఈ ఖర్చులో మిగతా మతాలకీ వాటా ఉందనుకుంటాను, సిక్కులు పాకిస్తాన్ లో ఉన్న ఒక గురుద్వారాకు వెళ్ళటానికి ప్రభుత్వసహాయం చేసినట్లుగా నాకు గుర్తు. అంటే, మతానికి దూరంపాటించాల్సిన మన సెక్యులర్ ప్రభుత్వాలు దర్జాగా మతం కోసం ప్రభుత్వ ఖజానా నుంచీ డబ్బులు ఖర్చుపెడుతున్నాయన్నమాట.


ప్రభుత్వ సబ్సిడీతో(పూర్తి వ్యయం కాదు) ముస్లిం యాత్రికులు హజ్ కు వెళితే, మన హిందువులు కేదార్ నాధ్, అమరనాధ్ యాత్ర, కుంభమేళా, కైలాసయాత్ర, బ్రహ్మోత్సవాలూ,తెప్పోత్సవాలూ, వగైరావగైరాలతోపాటూ, ప్రభుత్వాధీనంలో ఉన్న కొన్ని లక్షల ఆలయాలకూ,పూజారులకూ, ఇతరత్రా వాటికి అయ్యే ఖజానా ఖర్చు ఉండదంటారా? బహుశా వీటిని, ఏర్పాట్లకి అయ్యే ఖర్చుగానో, సెక్యూరిటీ ఖర్చులుగానో చూపిస్తుండొచ్చు. కానీ, మన దేశం హిందూ మతంకోసమే కొన్ని బిలియన్లు ఖర్చుపెట్టిన విషయాలు మాత్రం నిజం.


కాబట్టి, ‘హిందువులకి ఖర్చుపెట్టకుండా, కేవలం ముస్లింలకి దోచిపెడుతున్నారనేది’ భావజాలప్రేరిత అపోహగా కనబడుతుందేతప్ప, నిజాలుగా మాత్రం కనబడటం లేదు.


*****

Sunday, October 5, 2008

సమస్య మతమార్పిడా? మనుషులా?

నావరకూ మనిషి ప్రాణంకన్నా, ఏదీ ముఖ్యంకాదు. మతాలు,కులాలు, వాదాలూ,ఇజాలూ ఏవీ..ఏవీ మనిషి ప్రాణంకన్నా గొప్పవి కావు. అందుకే మతమార్పిడికన్నా, ఇప్పుడు ఒరిస్సాలో పెచ్చరిల్లుతున్న హింస నన్నెక్కువగా కలవరపెడుతోంది. హిందూమత ప్రచారం చేస్తూ, మతంమారకుండా గిరిజనుల్ని కాపాడుతున్న ఆ స్వామీజీని ఎవరు చంపారో ఖచ్చితంగా ఇప్పటికీ తెలీదు. మావోఇస్టులు మేమంటుంటే, మరికొందరు ‘క్రైస్తవులే చంపారని' డిసైడ్ చేసి, దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఘటనలకి మూల కారణం బలవంతపు మతమార్పిడులు.


నవీన్ పట్నాయక్ ప్రభుత్వం స్వామీజీ హత్య వెనుకనున్న నిజాల్ని వెలికితియ్యడానికి CBI దర్యాప్తుకి ఒప్పుకోవడం లేదు. కానీ, ఈ హింస నేపద్యంలో జరిగిన దారుణాలు మాత్రం దాదాపు ముఫైరోజుల తరువాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని భయాన్ని సృష్టిస్తుంటే, మరికొన్ని మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కొన్ని షాకింగ్ గా ఉంటే మరొకొన్ని మతం పేరుతో చెలరేగే మనిషిలోని ఉన్మాదాన్ని పరిచయం చేస్తున్నాయి.


29 సంవత్సరాల క్రైస్తవ ప్రచారకురాలు (నన్) ఒక హిందూమూక చేతిలో సామూహిక మానభంగానికి గురయ్యింది. సాధారణంగా ఏసును ప్రార్థించే ఈ నన్, "నన్ను కాపాడండి" అంటూ అక్కడే ఉన్న ఒక పోలీసును దీనంగా ప్రార్థిస్తుండగా, ఏమీ చెయ్యలేక తలతిప్పేసుకున్న ఒక చట్టాన్ని రక్షించే పోలీసు సాక్షిగా ఈ ఘోరం జరిగింది. మతకల్లోలాల నేపధ్యాల ఉన్మాదస్థితిలో, ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ,మానభగం జరిగిన తరువాత "భారత్ మాతాకీ జై" అనే నినాదాల మధ్యన ఆ ప్రచారకురాల్ని నగ్నంగా ఊరేగించారు. ఈ క్షణంలో, ఆ నినాదం మీదున్న గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోయింది.


ఒక అనాధశరణాలయంపై జరిగిన దాడిలో రంజని అనే ఒక యువతి హిందూమూకకు పట్టుబడితే, దారుణంగా మానభంగం చెయ్యబడి, జీవించి వుండగానే నిప్పుపెట్టి...కాల్చి చంపబడ్డది. ఆ చంపేసిన తరువాత ఆ యువతి క్రిస్టియన్ కాదు..హిం...దూ అని తెలిసింది. తన పాపం అక్కడ తలదాచుకోవడమా? క్రిస్టియన్ లా అనిపించడమా? లేక తరువాత హిందూ అని తెలియడమా?


‘భారత్ మాత ఆర్మీ’ (బజరంగ దళ్ కి ఇదొక మారుపేరిక్కడ) సగర్వంగా, "క్రైస్తవుల్లో భయాందోళన సృష్టించి, మతం మార్పిడికోసం వీరు హిందువుల దరిదాపుల్లోకి రాకుండా చేసాం" అని TV ముఖంగా ప్రపంచానికి చాటి చెప్పారు. దాదపు 50,000 మంది శరణాలయల్లో, ప్రభుత్వ క్యాంపుల్లో మతంమార్చుకున్న గిరిపుత్రులు తమ గ్యారంటీ లేనిబ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. దాదాపు వందమందికి పైగా చనిపోతే ప్రభుత్వం 35 కు మించి లెక్క తేల్చడం లేదు.మొత్తానికి హిందూ మతాధిపత్యం నిరూపించబడింది.నాకు మాత్రం హిందూ అనిచెప్పుకోవడానికి కొంచెం అవమానంగా అనిపిస్తోంది.


రక్షణకూ,పునరావాసానికీ కేంద్రం సహాయం చెయ్యడం లేదని ఇక్కడా పొలిటికల్ స్కోరు చూసుకుంటున్నారేగానీ, ప్రజల ప్రాణరక్షణకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. కాదలేని కొన్ని సాక్షాలు ఇప్పటికి వెలుగుచూసేసరికీ, కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేసి పేర్లులేని కొందరు హిందూ మూకల్ని అర్జంటుగా అరెస్టు చేసారు.


ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా, మాస్టర్ మైండ్లంటూ కొన్ని ముస్లిం ముఖాల్ని తెరపైకితెచ్చే ప్రభుత్వాలకి ఇక్కడి "మాస్టర్ మైండ్లు" TV తెరపై కనబడ్డాకూడా వారి పేర్లు ఉచ్చరించడానికి ఎందుకు జంకుతున్నారొ అర్థంకాని ప్రశ్న.ముస్లింలో కిస్టియన్లో ఎదైనా దారుణం చేస్తే, "వాళ్ళంతా ఇంతే" అని మనం చాలా సులభంగా అనేస్తాం. కానీ, "మన హిందూ సోదరులు" ఈ ఘోరాలు చేసారండేమాత్రం, కొంచెం మింగుడుపడదు.కారణం, మనమూ హిందువులమే, దానితోపాటూ చాలా మర్యాదస్తులైన హిందువులతో మనకు చాలా పరిచయాలున్నాయి. కాబట్టి, "మనం" అలా చెయ్యగలమంటే నమ్మకం కలగదు. బహుశా, అలాగే మనకు ముస్లిం స్నేహితులూ, క్రైస్తవ మిత్రులూ ఉంటే "అందరూ అలాంటివారే" అనే అపోహ తొలగుతుందేమో!


ఏది ఏమైనా మనందరం మనుషులం. మనకు జీవించే హక్కుంది. మనుషులుగా, గౌరవప్రదంగా, అన్యాయం కాకుండా బ్రతికే హక్కుంది. ఆ హక్కుని కాలరాసే అధికారం, మతానికి,కులానికీ,ప్రభుత్వానికీ ఎవ్వరికి..ఎవ్వరికీ లేదు. ఈ ఘటనలపట్ల ఒక హిందువుగా గర్విద్దామా! ఒక మనిషిగా సిగ్గుపడదామా!! అనేవే ఆలోచించాల్సిన ప్రశ్నలు. మిగతావన్నీ అప్రస్తుతం,అనవసరం.


****

Thursday, October 2, 2008

“వెల్కం టు సజ్జన్ పూర్” - ఒక హాయైన ప్రయాణం

ఆదివారంనాడు (28 సెప్టెంబర్ ,2008) ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన “వెల్కం టు సజ్జన్ పూర్” (Welcome to Sajjanpur) చూసాను. చూసినప్పటి నుంచీ, “సమీక్ష ఎలారాయాలా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే,ఒక సినిమాని కొంత విమర్శనాదృష్టితో చూసి బాగుందోలేదో, ఎందుకలా ఉందో చెప్పెయ్యొచ్చు. కానీ, కొన్ని సినిమాలలో ఉన్న ‘సింప్లిసిటీ’ మన ‘కాంప్లెక్స్’ విశ్లేషణకు ఒక్కోసారి సవాలుగా మారుతుంటాయి. ఉదాహరణకు, అనంతనాగ్ తీసిన “మాల్గుడి డేస్” సీరియల్ తీసుకున్నా లేక కొన్ని సంవత్సరాల క్రితం నాగేష్ కుక్కునూర్ తీసిన “ఇక్బాల్” తీసుకున్నా, ఆవి చూసిన అనుభూతుల్ని మిగులుస్తాయిగానీ ఖచ్చితంగా ఇదీ అని చెప్పగలిగే విశ్లేషణకు దూరం చేస్తాయి.

సాంకేతికంగా లేక కథా,కథనాల పరంగా ఈ చిత్రం అత్యుత్తమమైనది కాకపోయినా, చిత్రంలోని నిజాయితీ,’సాధారణత్వం’ ముందు, ఆలోపాలు దాదాపు కనుమరుగై, కేవలం కొన్ని అనుభూతులు మిగిల్చి, విశ్లేషకులని ఇబ్బందికి గురిచేసే గుణం ఉంది అని చెప్పొచ్చు. ప్రముఖ ‘బ్లాగుకవి’ బొల్లోజుబాబా గారు “టక్కు టక్కు మంటూ శబ్ధాలు, శరీరం తరువాత ఏ వైపుకు వూగుతాదో తెలీని వూపులు, మద్యమద్యలో గుర్రం సకిలింపు, జట్కావాడు ఆ బండి చక్రానికి చర్నాకోలు అడ్డంపెట్టి పలికించే ట్ట,ట్ట,ట్ట,ట్ట మనే హారను. ఇలాంటి గుర్రంబ్బండి ప్రయాణం ఎప్పుడైనా చేసారా?” అని అడుగుతుంటారు. తేలిగ్గా చెప్పాలంటే “వెల్ కం టు సజ్జన్ పూర్” సినిమా అలాంటి గుర్రంబ్బండి ప్రయాణమే అని చెప్పుకోవాలి. మాములు సినిమాలలో ఉండే వేగాలూ, శబ్దాలూ, అతిశయోక్తులూ, ఆర్భాటాలూ లేకుండా, కేవలం ఒక చిన్న కుగ్రామంలోని, సాధారణ మనుషుల గురించి తీసిన ఒక సిన్సియర్ చిత్రం.


పూర్తి సమీక్షకు నవతరంగం చూడండి.


****

Wednesday, October 1, 2008

ప్రియమైన శత్రువు

ఈ మధ్య బ్లాగులద్వారా పరిచయమైన ఒక స్నేహితుడు గూగుల్ చాట్లో "ఏంటిబాబూ! బ్లాగులద్వారా మిత్రులతోపాటూ, శత్రువుల్నికూడా బాగా సంపాదించుకున్నట్లున్నావు" అంటే, బహుశా నా టపాలకు వచ్చే కొన్ని ఘాటు వ్యాఖ్యల గురించి చెబుతున్నారేమో అనుకుని, "దాందేముందండీ, ఒక అభిప్రాయమున్నాక దాన్ని అందరు ఆమోదించాలని లేదుకదా. అందుకనే విభేధాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడూ విభేధాలుకాస్తా, వివాదాలవుతూ ఉంటాయి. అంతమాత్రానా శత్రువులైపోతారా!" అనేశాను.


కానీ దానికి ఆ మిత్రుడు తఠాలున ఒక లంకెపంపి "చూడు" అన్నారు. తీరా చూస్తే అది మన "జల్లెడ" బ్లాగ్ అగ్రిగేటర్ లో నా టపాలకు వచ్చిన రేటింగులు. సాధారణంగా నేను జల్లెడ చూడను. కూడలిలో కామెంట్లుకూడా చూసే సౌలభ్యం ఉండటంతో, కూడాలి మొరాయించినప్పుడుతప్ప జల్లెడలో జాలించడానికి బయల్దేరను. అందుకే అక్కడ జరిగిన తతంగం గురించి ఈ మిత్రుడు చెబితేగానీ అర్థం కాలేదు. జల్లెడలో బ్లాగు టపాలను 5 పాయింట్లలో రేటింగ్ చేసి,చదువరులు తమ అభిమానాన్ని తెలియజెప్పే సౌకర్యం ఉంది. ఈ రేటింగ్ వలన ఎప్పుడు ఎవరికి "అవార్డులు" వచ్చాయో నాకు తెలీదుగానీ, నా టపాలకు కొన్ని మాసాలుగా జరిగిన గౌరవం ఏమిటయ్యా అంటే...టపా ప్రత్యక్షమైన గంటా రెండు గంటల్లో టపాకు ఎదురుగా "(0.8)" అనే రేటింగ పాయింట్ వచ్చేయ్యడం.


ఎవరో అభిమాని నా టపాకోసం నిరీక్షించిమరీ 1 నొక్కుతున్నారన్నమాట. దీనర్థం నా టపా అతితక్కువ రేటింగ్ కు అర్హమయ్యిందని. సర్లే దీనివల్ల మనకొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదుగనక, కేవలం ఆ అభిమాని నిబద్దతకు ముచ్చటపడి "పోన్లెండి సార్! ఎవరి ఆనందం వారిది" అని వదిలేద్దాం అనుకున్నాను. కాని నా మిత్రుడు "అలాక్కాదు. మొదటి పేజీ చూడు" అన్నారు. చూస్తే.."నా సామిరంగా!", నా టపాలలో చాలావాటికి యావరేజ్ రేటింగ్ దాదాపు 3 కి పైనే ఉంటే, కొన్నింటికైతే 5 కూడా దాటింది. అప్పుడు నా మిత్రుడు "hahaha" అని నవ్వి, "నీకు వీడేవడో మంచేచెస్తున్నాడయ్యా" అన్నాడు.


ఆ అభిమాని నొక్కే ఒకటికి ఆ తరువాత కొన్ని నెంబర్లు జోడై, మొత్తానికి నా రేటింగ్ పాయింట్లు పెరుగుతున్నాయేగానీ, కేవలం మొదటి రేటింగ్ 0.8 అవడంవల్ల ప్రజలు ఓట్లు తగ్గించి వెయ్యడం చెయ్యడం లేదన్నమాట. నిజానికి జల్లెడలో ఈ సౌకర్యం ఉన్నా, చాలా టపాలకు అసలు రేటింగే ఉండదు అలాంటిది, నాకు కనీసం ఎప్పుడూ 0.8 గ్యారంటీఅన్నమాట.


ఈ తంతువల్ల వచ్చేలాభమేమిటో తెలీదుగానీ, ఇక్కడా విజయవంతంగా తన నిబద్ధతను చాటుకున్న ఆ అభిమాని మాత్రం నాకు తెగనచ్చేసాడు. మొత్తానికి ఈ ప్రియమైన శత్రువు ఎవరోగానీ..నా హృదయపూర్వక నెనర్లు, థాక్యూలు, ధన్యవాదాలు, వణక్కంలు, నన్రిలు ఇంకా చాలా చాలా.

****