Friday, March 6, 2009

అత్త తిట్టినందుక్కాదుగానీ...తోడికోడలు నవ్వినందుకు ఈ మంట

ఈ మధ్యకాలంలో భారతీయ గుర్తింపుకు గొడ్డలిపెట్టంటూ చర్చించిన రెండు విషయాలు, అర్వింద్ అడిగ రాసిన ఆంగ్ల నవల "వైట్ టైగర్", అలాగే డానీ బోయెల్ తీసిన "స్లండాగ్ మిలియనీర్" సినిమాల గురించి. ఒకటి బీహార్ చీకటి నుంచీ వచ్చి, ఢిల్లీలోని ఆధునిక ప్రపంచం లోని ధగధగల నడుమ హంతకుడుగా మారి, IT విప్లవానికి ఆదిబిందువైన బెంగుళూరు వెలుగులో గౌరవనీయమైన వ్యాపారస్థుడిగా మారే ఒక యువకుడు జీవితాన్ని చిత్రించే నవల. మరొకటి, ముంబై మురికి కూపంలో పుట్టిపెరిగి, మాఫియా సామ్రాజ్యపు అంచుల్ని తడిమి చూసి, ఆగ్రా వీధుల్లో తాజ్ మహల్ సాక్షిగా విజయవంతమైన వీధి జీవితాన్ని అనుభవించి, భారతీయ ఔట్సోర్స్డ్ అభివృద్ది చిహ్నమైన కాల్ సెంటర్లో కాఫీ-టీలు అందిస్తూ, చిన్ననాటి ప్రేమకోసం కోటీశ్వరుడయ్యే టీవీ షో హాట్ సీటెక్కి, అనుమానంతో పోలీసుల ‘షాక్ టీట్మెంట్’ తీసుకుని చివరకు డబ్బుతోపాటూ అమ్మాయినీ దక్కించుకునే ఒక "అండర్ డాగ్" కథతో తీసిన సినిమా.


ఈ రెండూ ఇంగ్లీషులో, ఇంగ్లీషువాళ్ళకోసం రాసిన,తీసినవి. కాకపోతే అవి భారతదేశం మీద కాబట్టి మనోళ్ళకి మహకోపమొచ్చేసింది. "హాఠ్! ఆర్థిక అసమానతల అభినవ భారతదేశంలో ఎంత aspirational క్రైముంటే మాత్రం ఇలాంటి చీకటి కోణాన్ని ప్రపంచానికి చెప్పేస్తావా, అదీ ఇంగ్లీషులో రాసి" అని ఒకడి మీద నిప్పులు చెరిగితే, మరొకడ్ని "మాదగ్గర మురికివాడలుంటే నీకేంటి? 70 MM స్టీరియో సౌండ్లో ప్రపంచానికి చాటడానికి నువ్వెవడివి?(అదీ ఇంత బాగా)" అని తీవ్రంగా గర్హించేసారు. మనోళ్ళు జపించే మరో మంత్రం ఏమిటంటే, ‘ఈ రెండూ అభివృద్ధి పధంలో విలసిల్లుతున్న భారతదేశ పరిస్థితిని కించపరిచేవిధంగా పనిచేసాయి’ అని. ఇక్కడే నాకు ‘అత్త తిట్టినందుక్కాదుగానీ...తోడికోడలు నవ్వినందుకు ఈ మంట’ అనే సామెత గుర్తొచ్చింది.


మనదేశంలో ఆర్థిక అసమానతలుంటే ఫరవాలేదు. కానీ దానిగురించి మనం సరదాగా (ఈ నవల ఒక black comedy) కూడా మాట్లాడుకోకూడదు. కళ్ళెదురుగా మురికివాడలు. దుర్భరమైన జీవితాలూ అనుభవించే ప్రజలుండొచ్చు. కానీ వాటిగురించి ఎవరైనా గుర్తుచేస్తే మాత్రం మనకు సహించదు. సమస్యలు మనకు పట్టవు. వాటి గురించి ఎవరైనా ఆరాతీస్తేమాత్రం కోపమొస్తుంది. పైగా అది బయటోడు చెబితే ఇంకా మహచెడ్డ కోపమొస్తుంది. ఈ నవలా, సినిమా గొప్ప కళాఖండాలు కాకపోవచ్చు, కానీ మన మేకప్ వేసుకున్న మురికిముఖాల్ని మళ్ళీ చర్చల్లో బయటపడేలా చేసాయి. అసలు సమస్యనొదిలేసి falls prestige కోసం ప్రాకులాడే మన కుత్సిత మధ్యతరగతి మనోభావాల్ని బయల్పరిచేలా చేసాయి.


అభివృద్ధి ఫలాలు కనీసం వాసనచూడని లోకం మనదేశంలో ఉందని గ్రహించకపోతే, చీకటిలోనే మగ్గిపోతున్న బ్రతుకులు నడిబజార్లో కారు అద్దంపై టకటకా కొట్టి బిక్షమడుగుతున్నాయన్న స్పృహ లేకపోతే... మిగిలేది the great Indian Development story అనే ఎండమావి. ‘కుక్క'లకోసం, ‘పులుల’ కోసం మాత్రమే కొట్టుకుంటూ మనుషుల్ని మరిచిపోయే మన మరుభూమి సంస్కృతి. బహుశా మనకు అదేకావాలి. మనుషులకన్నా, సమస్యల్ని తీర్చే సమాధానాలకన్నా, కొట్టుకోవడానికి కారణాలే కావాలి. రండి కొట్టుకుందాం!


****

16 comments:

సుజాత వేల్పూరి said...

కళ్ళెదురుగా కనపడుతున్న మురికి జీవితాలను బాగు చేసేందుకో, సాయపడ్డానికో ఒక్కరికీ చేతులు రావు కానీ ఇలాంటివి వాటిని ఎత్తి చూపిస్తే అభ్యంతరాలు మాత్రం బాగానే లేస్తాయి. పొంగిపొర్లుతున్న డ్రైనేజీ బాగుచేసే పారిశుధ్య కార్మికులు ఒక్కోసారి ప్రమాదభరితమైన గ్యాస్ వల్లా అందులోనే మరణిస్తారు. ఈ వార్త పేపర్లో చదివి నిర్లిప్తంగా ఊరుకునే మనం అలాంటి దృశ్యాన్నొకదాన్ని(నేపధ్య అది కాకపోయినా) సినిమాలో చూపిస్తే దుమ్మెత్తి పోశాం.

Anonymous said...

పులుల గురించి చర్చ సంగతి తెలీదుగానీ, కుక్కల చర్చకు సంబంధించి మాత్రం, చర్చ సారాంశాన్ని మీరు ఒకే కోణంలో చూసారనిపిస్తోంది.

"కానీ వాటిగురించి ఎవరైనా గుర్తుచేస్తే మాత్రం మనకు సహించదు. సమస్యలు మనకు పట్టవు. వాటి గురించి ఎవరైనా ఆరాతీస్తేమాత్రం కోపమొస్తుంది" - ఇది కొద్దిగా అతి అయిందనిపిస్తోంది.

Anil Atluri said...

"మీ దేశంలో ఐస్ క్రీములు కూడా ఉంటాయా", అని వాణిశ్రీ ని అడిగారని ఆమె వార్త పత్రికలకి ఇచ్చిని ముఖాముఖిలో చెప్పి, తన దేశాన్ని ఇంత దరిద్రంగా చూపించారని అవేదన వెలిబుచ్చింది. ఆ రోజున ఆమే మీద కూడా బురద జల్లారు.

౧౯౬౮ ప్రాంతంలో bold The Party చిత్రం విడుదలయ్యింది. అందులో బక్షి అనే బారతీయుడి పాత్రని పీటర్ సెల్లర్‌స్ పోషించాడు. ఆ చిత్రాన్ని మన వాళ్ళు భరించ లేక దానిని నిషేదించారు.
మీరన్నట్టు - "మనదేశంలో ఆర్థిక అసమానతలుంటే ఫరవాలేదు. కానీ దానిగురించి మనం సరదాగా (ఈ నవల ఒక black comedy) కూడా మాట్లాడుకోకూడదు."
"అత్త తిట్టినందుక్కాదుగానీ...తోడికోడలు నవ్వినందుకు ఈ మంట", నిజవే మరి

Anil Dasari said...

తాతలు తాగిన నేతుల గురించి మోత మోగిస్తూ నేడెలా ఉన్నామో మర్చిపోవటమే నయా దేశభక్తి. నిజంగా పైకెదిగినోళ్లమైతే ఎవడో ఏదో అనుకుంటాడని ఏడుస్తూ కూర్చోం. ఎవడేమనుకుంటే నాకేమని దర్జాగా మన పని మనం చేసుకుపోతాం. అభిమానమున్నోళ్లైతే ఎదుటోళ్లకి ఎత్తి చూపే అవకాశమివ్వకుండా కష్టపడతారు - ప్రతిదానికీ పరాయోళ్లని నిందిస్తూ కూర్చోరు. ఆత్మాభిమానపు ముసుగులో దాగున్న ఆత్మన్యూనత ఇది.

Vinay Chakravarthi.Gogineni said...

నేను చూపించదం తప్పు అనదం లెదు అండి..కాని....నాకు నచ్హలేదు..ఎందుకంటె
పేదరికాన్ని చూపించలంతే...మొత్తం మురికివాదలు చూపించాల అండి..ఎం అమెరికాలొ లెవా...మరల మీరు అనవచ్హు ఎవరి ఆలొచన వారివి అని.... వాడి అలొచన బాగలేదు కాబట్టే ఇలా..ఉదాహరనకి రుద్రవీణ సినెమాలో ఒకతే చీర సీన్లొ ఎంత చిన్నగ వివరం గ చెప్పారు ఎవరిని నొప్పించ కుంద బాలచందర్ గారు అల వుంటే అందరికి నచ్హుతుంది .

Anil Dasari said...

@వినయ్ చక్రవర్తి:

అమెరికన్, ఐరోపా సమాజాల చీకటి కోణాల గురించి కూడా చాలా సినిమాలు తీసింది హాలీవుడ్.

Kathi Mahesh Kumar said...

@వినయ్ చక్రవర్తి:'పేదరికాన్ని చూపించలంతే...మొత్తం మురికివాదలు చూపించాల అండి'...అసలు మీరు సినిమా చూశారాండీ!

కొత్త పాళీ said...

ఈ రెంటినీ విమర్శించిన వాళ్ళకి ఎందుకు కుట్టిందీ అని ప్రశ్నిస్తే బహుశా మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ ఎక్కడో వ్యాఖ్యల్లో మీరే నొక్కి వక్కాణించినట్టు ఆ చీకటి కోణాల్ని చూపించడమే ఈ రెండు సృజనల (సినిమా, నవల) ఉద్దేశమూ ప్రయోజనమూ కచ్చితంగా కాదు. ఆ సందర్భంలో చివరి పేరాలోని మీ కంక్లూజంస్ తో తీవ్రంగా విభేదిస్తాను.

కొత్త పాళీ said...

చెప్పడం మరిచాను.
"FALSE PRESTIGE" :)

Srujana Ramanujan said...

Good views Mahesh garu.

The thing is that we like everything to be rosy picture openly, and want darker pleasures secretly, and always want to give lectures on equality.

Though I don't like the melancholic side of the novel, it was written brilliantly, in a fluent style. We must appreciate it.

అసలు సమస్యనొదిలేసి falls prestige కోసం ప్రాకులాడే మన కుత్సిత మధ్యతరగతి మనోభావాల్ని బయల్పరిచేలా చేసాయి.

In this sense, the writers, and the director created wonders.

Indian Minerva said...

"అబ్రకదబ్ర" ditto ditto.

Anonymous said...

"కళ్ళెదురుగా మురికివాడలు. దుర్భరమైన జీవితాలూ అనుభవించే ప్రజలుండొచ్చు. కానీ వాటిగురించి ఎవరైనా గుర్తుచేస్తే మాత్రం మనకు సహించదు."

సహించదని ఎవరన్నారు? దీన్ని విమర్శించినవాల్లనలేదే? బహుషా మీకు మీరుగా ఊహించుకున్నట్లున్నారు. భారతదేశమంటే పాములు తేల్లు వుండే దేశమని, మనుషుల మెదల్లు తినే వాల్లుండే దేశమని మాత్రమే చూపిస్తేనే వచ్చే చిక్కంతా. పేదరికమన్నది ఏ ఒక్కదేశానికో సంబందించినది కాదు. ప్రతి దేశలోను వుంది. కాని, దాన్ని glorify చేసి చూపిస్తేనే వచ్చేది అసలు తంటా.

Anonymous said...

సాధారణంగా ప్రతీ విషయాన్ని చక్కగా బేరీజు వేసి, ఇరువర్గాల దృక్పథాలను పరిశీలించి మీరు వ్రాసే టపాలకు ఇది కాస్తభిన్నంగా ఒంటెద్దు పోకడలో సాగినట్టు నాకు అనిపించింది.

గాంధీజీ స్వరాజ్యోద్యమంలో ఉన్నప్పుడు భారతదేశంలో పేదరికం మీద ఒక తెల్లావిడ (అప్పటి తెల్లదొరల ప్రభుత్వం లో ఓ అధికారి) భారత దేశానికి వచ్చి, ఇక్కడ పేదరికాన్ని గురించి రాసినప్పుడు, గాంధీజీ ఆమెను "sanitary inspectress" అన్నాడుట.

మల్లాది వ్రాసిన ఓ ట్రావెలాగ్ (యూరోప్ ట్రావెలాగ్ అనుకుంటాను) లో ఓ ఉదంతం. జర్మనీ లో ఓ రైల్వే స్టేషను లో మూత్రశాల పైన ఓ ముక్క రాశారుట. "Indian favourite .." ఆ చివరి పదం నాకూ గుర్తు లేదు కానీ చదివిన జ్ఞాపకం గుర్తుంది.

మనమంతా కూపస్థ మండూకాలని ఎలా అనుకుంటున్నారో, అలానే తెల్ల వాళ్ళు జాత్యహంకారులు అనడానికి ఆస్కారం ఉన్నది. (అందుకే పై విషయాలు ఉటంకించాను. మీకు అలాంటి విషయాలు తెలియనివి కావు)

విశాల దృక్పథం అన్నది ఓ వైపు నుండి మాత్రమే ఆశించటం - అది ఒకప్పుడు తెల్లవాళ్ళతో దోపిడికి గురయిన వర్గం నుండి ఆశించటం సబబేనా?

ఇక్కడ నేను బోడిగుండికు తాడిచెట్టుకు ముడిపెట్టట్లేదు. విమర్శించే వారికీ ఓ background ఉంటుంది. నిస్పాక్షిక చర్చలో దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పబోవటం మాత్రమే.

తెల్ల వాళ్ళందరూ జాత్యహంకారులు అని కూడా చెప్పబోవటం లేదు. అయితే, భారత దేశ ఔన్నత్యం గురించిన సినిమాలు, భారతదేశం లో దరిద్రాన్ని చూపించిన సినిమాలు ఒకే proportion లో వచ్చి ఉండి, సదరు తెల్ల నిర్మాతలకు దర్శకులకు నిస్పాక్షిక దృక్పథం ఉండి ఉంటే, ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి కావు.

ఇక పోతే స్వాతి వారపత్రికలో ఓ వ్యాసం వచ్చింది, ఈ సినిమాను ఖండిస్తూ. అందులో ప్రశ్నలు నాకు గుర్తున్నవి.

ఈ సినిమాలో పాల్గొన్న ముంబయి మురికి వాడ పిల్లలకు - పారితోషికం ముట్టలేదు. ఈ సినిమా దర్శకుడికి, భారతదేశమంతటా వెదికినా, తగిన నటుడు దొరకలేదు (ఆంగ్లదేశపు నటుడు తప్ప). ఇక ఈ సినిమా టైటిలు.

ఈ సినిమా మీద లక్షలు కోట్లు గడించిన వాళ్ళకు, ఈ మురికి వాడల పిల్లలకు పారితోషికం ఇవ్వాలన్న విషయం ఎందుకు పట్టలేదో మరి?

ఈ టపా ఈ సినిమాకు సంబంధించి కాదనిపించింది కాబట్టి, నా అభిప్రాయం చెప్పాను. అయితే ఈ సినిమాను నేను చూడలేదు (చూడడం తటస్థించలేదు. సినిమాల నుండి ప్రేరణ లభిస్తుంది అనే సూత్రం నాకు workout అవదు కాబట్టి.)

ఏకాంతపు దిలీప్ said...

అవన్నీ ఏమో కానీ, స్లం డాగు కి మాత్రం అన్ని అవార్డులు ఎందుకు వచ్చాయో అర్ధం కావడం లేదు...
ఎప్పుడు ఆస్కారుకి ఎంపికైన సినెమా చూసినా ఎంతో కొంత విషయం ఉంది అనిపిస్తుంది... అన్ని అవార్డులు అంతగా అర్హత లేకపోయినా వచ్చేసాయని, ఇదేదో హాలీవుడ్ వాళ్ళ మార్కెట్ విస్తరణా ప్రణాళికల్లో భాగమేమో అని నమ్మేవాళ్ళల్లో నేనూ ఒకడిని...

కొండముది సాయికిరణ్ కుమార్ said...

నిజం చెప్పారు మహేష్ గారు.

SAI said...

ఇదంతా నాకు తెలియదు కాని స్లం డాగ్ మిల్లియనిరే సినిమా మాత్రం నాకు తెగ నచ్చేసింది. కాని అందులో ఏమి చూపించారు చెప్పండి? ఉన్నదే కదా చూపించింది లేనిది ఏమైనా చూపిస్తే అందరు అలా అనొచ్చు. ఏది ఏమైనా ఇప్పటికైనా మన కుళ్ళు రాజకీయాలు, నేతలు మారతారేమో చూడాలి. ఎందుకంటే మరి మన దేశం ఇలా వుండటానికి కారణం ఏంటో వాళ్ళకే తెలియాలి మరి. సొంత లాభం కొంత మానుకో పరుల వారికీ పాటు పడవోయి అనే సామెత గుర్తు వుంటే ఇలా మన దేశం గురించి ఇంకొకడు నీచంగా చెప్పే స్థాయికి మనం దిగజారే వాళ్ళం కాదేమో.