Thursday, October 1, 2009

పదునున్నా గురిలేని ‘బాణం’


“వ్యవస్థలో ఉంటూనే దానిలో మార్పు తీసుకురావాలా లేక వ్యవస్థలోని (ఫ్యూడలిజం,పోలీస్ దుండగాలు వంటి) లోపాలకు వ్యతిరేకంగా సాయుధపోరాటం (నక్సలిజం) చెయ్యాలా?” అనే ప్రశ్నకు ఖరాఖండిగా తేల్చిచెప్పగలిగే సమాధానం ఇప్పటికీ ఉండకపోవచ్చు. కానీ పరిణామక్రమంలో, హింసను ప్రేరేపించే ఏ విధానమైనా, ప్రాణహాని కల్పించే ఏ ఆలోచనా ధోరణైనా ఒకవైపు ప్రజాస్వామ్యానికి మరోవైపు మానవత్వానికీ గొడ్డలిపెట్టనే భావన స్థిరపడింది. ఇలాంటి సైద్ధాంతిక నేపధ్యాన్ని సినిమా కోసం ఎంచుకున్నప్పుడు కొంత ఆలోచన,మరికొంత అవగాహన, మరింత స్థితప్రజ్ఞత కథకుడికి,దర్శకుడికి కావాలి. చివరికి ఏంచెప్పాలనుకున్నాడో దానిమీద conviction కావాలి. “బాణం” సినిమాలో అవి లోపించాయి. అందుకే పదునువున్నా గమ్యం లేక, దారితెలీక గురిలేకుండా మిగిలింది.

ఏ కారణంచేతో అర్థంకాదుగానీ, ఈ సినిమా కథ 1989 సంవత్సరంలో జరుగుతుంది. వ్యవస్థను లోపలినుంచే మార్చడానికి పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే ఒక మాజీనక్సలైట్ కొడుకు ‘భగత్’ (నారా రోహిత్). తండ్రి (షయాజీ షిండే) మంచి కోసం ఉద్యమంలో ఉన్నాడని నమ్ముతూనే, తండ్రి విధానాలతో విబేధించే ఆదర్శవాది. ఒక దృశ్యంలో ఏకంగా “నేను మానాన్న లాగా తప్పు చెయ్యను” అని చెప్పగలిగే సిద్ధాంతకర్త. మరోవైపు మరణశయ్యమీదున్న తండ్రినే చంపే ఒక ఫ్యూడల్/మాఫియా యువనాయకుడు ‘శక్తి సాహు’(రణధీర్). ఫ్యూడలిజాన్ని,రౌడీయిజాన్ని రాజకీయంగా మలుచుకుంటేనే వ్యవస్థమీద పట్టు సాధించగలమనే విజన్ కలిగిన విలన్. ఈ రెండు విపరీత శక్తుల ఘర్షణ ఈ సినిమా కథకు మూలం. చివరికి హీరో ఆదర్శం-నమ్మకం గెలుస్తాయా లేక తన ధృక్పధంలో ఏమైనా మార్పులు వస్తాయా? చివరికి ఏంజరుగుతుంది అనేది కథ.

కథకున్న పరిధి చాలా ఉన్నతం. కథలో చర్చించాలనుకున్న విషయం ముదావహం. అయితే కథనంలోని లోపాలు,హీరోపాత్ర ఎదుగుదల క్రమంలోని పేలవత్వం, అత్యంత నీరసమైన ఎడిటింగ్ కలగలిపి, ఉద్దేశం మంచిదైనా కేవలం ఒక మంచి ప్రయత్నంగా మాత్రమే అభినందించదగ్గ సినిమాగా బాణం మిగిలింది.

బరువైన భగత్ పాత్రలో కొత్త నటుడు నారా రోహిత్ నటించడానికి బాగానే ప్రయత్నించాడు. కానీ పాత్రలోని పరిణితి నటనలో లేకపోవడంతో తన పాత్రలోని స్థిరత్వాన్ని, భావగాంభీర్యాన్ని ప్రదర్శించే విషయంలో చాలాసార్లు ఆసక్తిలేనట్లుగా అనిపించే (రోజా సినిమాలో అరవింద్ స్వామి లాంటి) తన భావప్రకటన పంటికిందరాయిలా అనిపిస్తుంది. రోహిత్ కున్న పెద్ద ప్లస్ అతడి వాచకం. కొంచెం నీరసంగా అనిపించినా స్పష్టంగా తెలుగు మాట్లాడగలడు. గొంతు బాగుంది. మాజీనక్సలైట్ గా షయాజి షిండే పాత్ర కొంత అస్తవ్యస్థంగా ఉన్నా, నటనతో దాన్ని సమర్ధవంతంగా కప్పిపుచ్చగలిగాడు. వరకట్నం, అత్తింటి దౌష్ట్యం, భర్తచేతకానితనం, తండ్రి అకాలమరణం వలన అనాధగా మిగిలే సుబ్బలక్ష్మి పాత్రలో నూతన నటి వేదిక ప్రాత్రోచితమైన ఆహార్యంతో సరిపోయింది. హీరోయిన్ పాత్రకు గాత్రదాతగా గాయని సునీత కృషికూడా ఈ పాత్రను పండించడానికి యధావిధి ఉపయోగపడింది. చాలా మంది కొత్త ముఖాలు కనిపించే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన రణధీర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సినిమాలో ఉన్న పెద్ద లోపం ఏ ఆదర్శంకోసమైతే హీరో సినిమా మొత్తం పోరాడతాడో చివరకి అదే ఆదర్శాన్ని తుంగలోతొక్కి విలన్ “సమస్య”ని చట్టబద్ధంగా అనిచెబుతూనే చట్టాన్ని చేతుల్లోకితీసుకుని “తీర్చెయ్యడం”. దానితోపాటూ, హీరోకీ విలన్ కీ మధ్య సరైన direct conflict లేకపోవడం. ఈ సమస్యల్ని మరింత గాఎత్తిచూపేది, చాలా ఆకర్షనీయమైన విలన్ పాత్ర రూపకల్పన. విలన్ శక్తిసాహు వ్యక్తిత్వం,ఆదర్శం నీచమే అయినా, దానిలో అతను చూపే నమ్మకం, తాత్వికత ప్రేక్షకుల్ని ఆ పాత్రని గౌరవించేలా చేస్తాయి. ఆ పాత్రపలికే కొన్ని సంభాషణలు ఎంత intellectual గా ఉంటాయంటే, వాటికి ధియేటర్లో చప్పట్లు తప్పవు. అలాంటి విలన్ ని హీరో సినిమా మొత్తం చెప్పే ఆదర్శాల్ని మంటగలిపి తరిమితరిమి కొడుతుంటే, (అ)సహజంగా సానుభూతి విలన్ మీదకెళ్ళి హీరో హీరోయిజం కృతకంగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగంలో అనిల్ భండారి సినెమాటోగ్రఫీ సినిమాకి చాలా సహాయం చేస్తే, ఎడిటింగ్ సినిమా గమనాన్ని దెబ్బతీసి ప్రేక్షకుల్ని విసిగిస్తుంది. ఈ సినిమాలో దాదాపు ప్రతిషాట్ నిడివినీ తగ్గించొచ్చని చెబితే ఆశ్చర్యపోనక్కరలేదు. మార్తాండ్ కె.వెంకట్ లాంటి సీనియర్ ఎడిటర్ ఇలా చెయ్యడం అర్థంకాని విషయం. లేదా తప్పు మొదటి సారిగా దర్శకత్వం వహించిన దంతులూరి చైతన్య దయినా అయ్యుండాలనిపిస్తుంది. మంచి పోరాటదృశ్యాల్లోకూడా షాట్ల నిడివి గమనిస్తే ఎడిటర్ కు దర్శకుడికీ మధ్య అస్సలు సమన్వయం కుదరలేదనే విషయం తేటతెల్లమవుతుంది.

గంధం నాగరాజు మాటలు కొన్ని సహజంగానూ, మరికొన్ని కొటేషన్లు ఏరుకొచ్చి ఇరికించినట్లుగానూ, మరికొన్ని పాత్రలకు వన్నెతెచ్చేవిగానూ ఉన్నాయి. శ్రమకోర్చి, ఆలోచించి రాసారన్న నిజం “వినిపిస్తుంది”. ఆ శ్రమ అభినందనీయం. మణిశర్మ సంగీతం పాటల్లో పండితే, అనవసరంగా వచ్చే నేపధ్యసంగీతం కటువుగా ఉంటుంది. లిప్ సింక్ లేకుండా అన్నీ నేపధ్యగేయాలే ఉండటం ఒకపెద్ద రిలీఫ్. ప్రత్యేకత కోసం ప్రదమార్థంలో పోరాటదృశ్యాలు తెరపైన చూపించకుండా కేవలం జరిగిన భావనని కలిగించడం సినిమాలోని రక్తపాతం శాతాన్ని తగ్గించినా, ఎందుకో నవ్వొచ్చింది (ముఖ్యంగా రైల్వేస్టేషన్ పోరాటం)గానీ, ఆ “ప్రత్యేకత”ని ఆస్వాదించలేని పరిస్థితి కలిగింది.

మెగానిర్మాత ఆశ్వనీదత్ భారీతన వారసత్వాన్ని వీడి, కుమార్తె ప్రియాంక నిర్మించిన ఈ చిరుచిత్రం ఒక నవీనపోకడగా అభినందనీయం. కానీ కథనం,పాత్రపోషణ మీద అవగాహనలేకుండా సాగిన ఈ ప్రయత్నం కొంత నిరాశని కల్పించిందని మాత్రం చెప్పక తప్పదు. దర్శకుడు చైతన్య ప్రధమ యత్నంగా ఇలాంటి కథను ఎన్నుకోవడం సాహసంగా ఒప్పుకున్నా, ఆ సాహసానికి సార్థకత చేకూర్చలేకపోయాడని ఒప్పుకోక తప్పదు.

మళ్ళీ చాలా రోజులకు తెలుగులో ఒక సిన్సియర్ సినిమా తీసే ప్రయత్నం జరిగిందని ఈ సినిమా చూడమని రెకమండ్ చెయ్యాలా లేక నిరాశపరిచిందని వెళ్ళొద్దని చెప్పాలా తెలీని పరిస్థితిలో ‘బాణం’ నిలిపింది. అందుకే పదునున్నా ఈ బాణానికి గురిలేదు అని సర్ధుకోక తప్పదు.


******

1 comments:

నీటి బొట్టు said...

బాణం సినిమా ఈ మధ్య వస్తున్నా సినిమాల మీద కొంచెం పర్వాలేదనే అనిపించింది ..కాని కొంచెం బోర్ కొట్టింది.