Monday, July 12, 2010

చలం చెప్పని కథ - కథాజగత్

కథాజగత్ లో నాకు బాగా నచ్చిన కథ "చలం చెప్పని కథ" .


చలం లాంటి భావ తీవ్రత మరొకరి కుంటే అతని పేరు ‘చైతన్య’ అవుతుంది.
అలాంటి చైతన్య చలం లాంటి చలం, మన చలమే అని అనుకునేలా ఉన్న ఒక చలం గురించి ‘తన కథ’ చెబితే "చలం చెప్పని కథ" అవుతుంది. చైతన్య చలం టెలిగ్రాం పిలుపు అందుకుని ప్రయాణమవడంతో సాగే చైతన్యస్రవంతి ఈ కథ. 
కథాజగత్ లో ప్రచురింపబడిన ఈ కథ ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు రాశారు.

ఈ కథనచ్చడానికి నా అభిమాన రచయిత చలం ఒక కారణమైతే. ‘ఆ చలం’ కాడంటూనే కథకుడు ‘మన చలం’ వ్యక్తిత్వాన్నీ, భావజాలాన్నీ, సిద్ధాంతాలనీ అలవోకగా చిన్నచిన్న వాక్యాలో కుదించి రసజ్ఞతను సిద్ధింపజెయ్యడం మరో కారణం.


చలం లాంటి చలం గురించి కథే అయినా, మహారచయిత చలం జీవితాన్ని, రచనల్నీ, ఆలోచనల్నీ, అనుభవాల్నీ, భావాల్నీ అర్థం చేసుకుని జీర్ణించుకున్న తీరు ఈ కథలో మనకు కనిపిస్తుంది. అలాగే కొంత బౌద్ధమత ఆలోచనా సరళి గోచరిస్తుంది.


చలాన్ని మేధతో మధించే కన్నా, మన రక్తంలో... మనలోని ప్రైమోడియల్ సహజత్వపు శక్తుల్లోకి రంగరించుకుంటేనే అనుభవించడానికి సాధ్యమౌతుంది. ఈ ‘చలం చెప్పని కథ’లో కూడా అదే స్ఫూర్తి, ఆరాధన, భావతీవ్రతా నింపడంలో కథకుడు సఫలీకృతుడయ్యారు.
 "కోర్కెలు ఒక వ్యక్తి మనసులో జనించి అవి తీరకపోగా - అతనిలో  అలజడి జీవితం ప్రారంభమవుతుంది. ఎంత నొక్కిపెట్టినా అవి మనః పొరలలో చిక్కుకుని - ఎండల్లో ఎండి మాడిన గడ్డి వర్షంలో తలెత్తినట్లు - కొన్ని పరిస్థితులలో మళ్ళీ మొలకెత్తక మానవు. ఆశల్ని చంపుకోవడం మంచిదే. ఆశల్ని మనసులో పుట్టకుండా చేయడమే ఇంకా మంచిది.  

    నిజానికి వ్యక్తిలో కోరికలు సహజంగా నెరవేరేవే ఎక్కువగా జనిస్తుంటాయి. కాని వాటిలో ఎక్కువభాగం ఈ సంఘం, ఆచారాలు, కట్టుబాట్లు - వీటికే బలి అవుతుంటాయి. అతి సులభంగా నేరేరే ఆశలు ఏ విలువాలేని సంఘం కాలరాస్తే అతడిలో అరాజకత్వం తలెత్తుతుంది. అతణ్ణి లోకం శత్రువుగా భావిస్తుంది. జీవితంలో ఓడిపోయినవాడు ఒంటరిగా సంఘాన్ని ఎదిరించలేనివాడు ఓటమిని అంగీకరించి రాజీ కుదుర్చుకుంటాడు. అతడిని మాత్రం నీతిమంతుడంటుంది సంఘం. ఇలాంటి నీతిమంతుల సంఘంలో చలాని కన్నీ చూక్కెదురే. అలాటి ఈ సంఘంలో జీవించడం చేతకానివాడు చలం."
అంటూ చలం నేపధ్యాన్ని అర్థం చేసుకుంటూనే...


"అతని వాదనను 'వ్యతిరేకత' అని చాలామంది అనుకున్నప్పటికి అది వ్యతిరేకత కాదు. తరతరాలుగా నాటుకున్న పాతకాలపు ఆచారాల్ని కాలరాయటమే!" అని సమర్ధిస్తాడు రచయిత.
    
"జీవితానికి ముందు అంధకారమే. వర్తమానం అంధకారమే. భవిష్యత్తు ఇంకా అంధకారమే. అలాంటి జీవితంలో కాంతిరేఖల్లా అక్కడక్కడ సౌందర్యం ప్రసాదిస్తున్న కాంతికిరణాలు ప్రేమ చల్లదనాన్ని నింపుకుని చలం జీవితంలో వెలుగు నింపాయి. అదే అతని సర్వస్వం జ్ఞాపకంగా దాచుకోగలిగిన నిధులు." అంటూ చలం ప్రేమతత్వాన్ని మూడు వాక్యాల్లో ఆవిష్కరించి మనల్ని బద్ధుల్ని చేశాడు రచయిత.

చివరిలో... చైతన్య మరో చలం అయ్యాడనిపించే చెళుకు, ఒక అద్భుతమైన "ట్విస్ట్" అని చెప్పొచ్చు.

ఇలా రాస్తూ పోతే మొత్తం కథని ఇక్కడే కాపీ చేసెయ్యాలి. కాబట్టి...


ఆ కథ ఈ లంకెలో చదవండి. అనుభవించండి.


*****

2 comments:

nareshnunna said...

Dear Mahesh,

I already read the story, when Chalam name was seen. Though I strongly know that Mr. Jayadheer Tirumala Rao has nothing to do with Chalam, I read it seriously. The story was very disappointing.
But, when you posted in your blog- Parnasala, I again read it, keeping my prejudices away. I understood that it is difficult to establish (or prove) the quality of writings, particularly creative genre.
What utmost I can do is, differing with Mahesh with my assertion that it is a mediocre story..

naresh nunna

Kathi Mahesh Kumar said...

నరేష్ నున్నా గారు,
మంచి కథల బెంచ్ మార్క్ నాకు లేదు. ఎప్పుడు నచ్చింది అప్పటికి నాకు ఉత్తమ కథ అంతే. చలాన్ని గుర్తుచేసినదానికో, చలం సిద్ధాంతాల్ని చూచాయగా సూత్రీకరించినందుకో లేక శైలిలోని personalization...వగైరా వగైరా కారణాలు ఏమైతేనేం ఈ కథ చదవగానే నచ్చింది.

మీ విబేధాన్ని నేను స్వాగతిస్తాను. మీ assertion నాకు అర్థం కాలేదని సవినయంగా మనవి చేస్తాను. :)