అబ్రకదబ్రగారు కొన్నాళ్ళక్రితం బ్లాగులో దశావతారాల్లో గౌతమబుద్దుని స్థానం గురించి ఒక conspiracy theory ప్రతిపాదించారు. ఆ వ్యాసానికి నేను రాసిన assimilative power of Hinduism అనే వ్యాఖ్య తీవ్రమైన విమర్శలకూ ఖండనకూలోనయ్యింది. హిందూ సాంప్రదాయ ప్రేమికులు ఈ విషయం మీద చాలా తీవ్రమైన చర్చను విజయవంతంగా చేసారు.
ఈ మధ్యనే శ్రీధర్ అనే భరతనాట్య ప్రవీణుడైన స్నేహితుడితో, ఈ విషయమై చర్చిస్తుండగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. తను తిరుపతిలో దశాతారాల మీద ఒక డ్యాన్స్ బ్యాలే ప్రదర్శన ఇచ్చిన అనంతరం, ఒక పెద్దాయన ఇతడిదగ్గరికివచ్చాడట. వచ్చి, "అబ్బాయీ! దశావతారాల వర్ణనలో బుద్దుడి ప్రస్తావన వచ్చినపుడు, నువ్వుపట్టిన ముద్ర గౌతమబుద్ధుడి ధ్యాన భంగిమ. కానీ, దశావతారాల్లో బుద్దుడు గౌతమబుద్దుడు కాదు." అన్నాడట. దీంతో మతిచెడిన నామిత్రుడు, ఒక వెర్రి చూపు చూసి. "మరి ఆ బుద్ధుడు ఈ బుద్ధుడుకాకపోతే మరేబుద్దుడు గురువుగారూ!" అని వ్యంగ్యంపోయాడట.
దానికి ఆ పెద్దాయన ఒక పురాణకథ చెప్పాడట. కథలోని పేర్లు నామిత్రుడికి గుర్తులేవుగానీ స్థూలంగా ఆ కథసారం ఇది. కృష్ణావతారం తరువాత మళ్ళీ ఒక రాక్షసుడు దేవతల పాలిట దరిద్రంలా దాపురించాడట. మళ్ళీ దేవదానవుల యుద్ధం మొదలయ్యింది. ఈ హోరాహోరీ రమారమి కొన్ని వందల సంవత్సరాలు గడిచిందట. ఇంద్రుడు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆ రాక్షసుడ్ని సంహరించడం కుదరలేదట. ఈ రాక్షసుడి వెనకాలున్న మాయ గురించి కూపీలాగితే, తెలిసిన సత్యమేమయ్యా అంటే, ఈ అసురుడి భార్య పరమసాధ్వి మరియూ పతివ్రతట. ఆ పాతివ్రత్యప్రభావంతో ఈ రాక్షసుడు అజేయుడై అప్రతిహతంగా సురుల్ని కబడ్డీ ఆడిస్తున్నాడన్నమాట!
సాధారణంగా అయితే, ఈ పాతివ్రత్యం మంటగలిపే చేష్టలు మహబాగా వంటబట్టించుకున్న దేవేంద్రుడు పూనుకోవాలి. కానీ, ఇక్కడున్నది చాలా స్పెషల్ కేసాయే! అందుకే బాధ్యతగా ఎప్పుడూ దేవతల్ని కాపాడే, శ్రీమన్నారాయణుడ్ని దేవతలంతా యధావిధి ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడప్పుడే కృష్ణావతారం వాసనల్ని వొదులుకుంటున్న నారాయణుడికి, మరో పవిత్రకార్యం చేసి మానవాళిని (దేవతల్ని) రక్షించే అవకాశం వచ్చేసింది. అప్పుడుదయించిన అవతారమే, "బుద్ధావతారం".
ఏ ఆడదిచూసినా కళ్ళూ, మనసూ చెదిరి, అర్జంటుగా పాతివ్రత్యాన్ని పోగొట్టుకునే అందం ఈ అవతారానికి సొంతం. ఈ అవతారం ఎత్తిందే అందుకాయె! ఇంకేముందీ, ఈ బుద్దుడు రావటం. ఆ రాక్షసపత్ని మనసు చెదరటం. విపరీతమైన కోర్కెకిలోనవటం. మానసికవ్యభిచారం కారణంగా, పాతివ్రత్యానికి తిలోదకాలివ్వడం. ఆ అసురుడి కథ కంచికి...మనమింటికి.
అంటే, వున్న అవతారాలలో అత్యంత నిరర్థకమైన అవతారం ఇదన్నమాట. కాకపోతే, అత్యంత సుందరమైనదికూడా ఇదే. బహుశా అందుకేనేమో, ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే, "వీడో బుద్ధావతారం రా!" అంటాము.
దీన్లో నిజానిజాలూ, ప్రామాణికాలూ మాన్యులెవరికైనా తెలిస్తే చెప్పాలి. నాకుమాత్రం ఈ కథ భలే నచ్చింది.
Tuesday, October 28, 2008
బుద్ధావతారం !!!
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
ఈ కధ నేనూ చదివాను. నా 'దశావతారాలు' టపాలో ఈ విషయాన్నే లీలామాత్రంగా ప్రస్తావించాను ("అటువంటి వివాదాలని అడ్డుకోవటానికే కావచ్చు, బుద్దావతారమూ గౌతమ బుద్ధుడూ వేరు వేరనే కధొకటి సృష్టించబడింది. అయితే దాన్ని నమ్మే వాళ్లు తక్కువ")
ఈ కధలో నిజముందో లేదో కానీ, నిజమేనయితే అది విష్ణుమూర్తికి మాయని మచ్చే. బహుశా అందుకే ఈ కధని మరీ అంత ప్రచారంలోకి తీసుకురాకుండా, బుద్ధావతారమూ గౌతమ బుద్ధుడూ ఒకరే అనుకునేవాళ్లని వాళ్ల నమ్మకానికే వదిలేసుందొచ్చు.
mahesh,
matsya, varaha, koorma, narasimha, vaamana, parasurama, rama, krishna, venkateswara and kalki are the dasavatars.can you Please let us from where you had got info buddha is part of dasavatars i.e from books, preachings or from somewhere else
వెంకటేశ్వరుడు దశావతారాల్లో ఒకడా? ఎప్పుడూ వినలేదు.
@వీరాస్వామి: దశావతారాల్లో వెంకటేశ్వరుడు లేడండి.మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః
రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కలికిరేవచః" అని దశావతారాల్ని ఉటంకిస్తారు. వీటిల్లో రెండు వివాదాస్పద పేర్లున్నాయి.
"రామశ్చ" అన్నదానిని కొందరు బలరాముడని, మరికొందరు పరశురాముడనీ చెప్పుకుంటారు. కానీ,బలరాముడు ఆదిశేషుని అవతారంగా చెప్పబడిందికాబట్టి చాలావరకూ పరశురాముడ్ని అంగీకరిస్తారు.
ఇక మిగిలింది బుద్దుడు.ఈయన దశావతారాల్లో ఒకరని నేను వినడం క్యాలెండర్లలో చూడటం మాత్రమే జరిగింది.దీనికి ప్రామాణికత ఉందని నేను అనుకోను. అందుకే అబ్రకదబ్రగారి conspiracy theory తో నేను అంగీకరిస్తాను.
@అబ్రకదబ్ర: నాకూ ఈ విషయం మీద సాధికారత లేదండీ. నా మిత్రుడు చెప్పేవరకూ ఈ విషయం అసలు తెలియదుకూడాను. చూద్దాం, మన బ్లాగర్లు ఏమంటారో!
ఇలాంటి కధ ఒకటి ఉందా.. ఎప్పుడూ వినలేదే!
ఇంత వరకు వెంకటేశ్వరుడు కూడా దశవాతారాలలో ఒకటి అనుకుంటూ వున్నా... ఒక వేల కాకపోతే శ్రీనివాస కళ్యానానికి అర్థమెంటి అప్పుడు?
కాని wikipedia దశవాతారాలలో బుద్దావతారం కూడా ఒకటి అని చెపుతున్నది...
Surprising!!!!
ఇదేదో తులసి జలంధర కథలా ఉందేంటి? మరి ఈ అందగాడైన బుద్ధుడెవరు?
ఇది మరో కొత్త కథా?
అది సరే, "ఎంతటి పతివ్రతలైనా అందగాడైన పర పురుషుడు కనపడే వరకే ఈ పాతివ్రత్యం" అని హేళన చేయడానికే అహల్య, రేణుక, తులసి వంటి పాత్రలని పురాణాల్లో చూపించారని నా ఆరోపణ. స్త్రీలను అవమానించడం తప్ప మరేమీ కాదు.
అంత పతివ్రతలైతే మారువేషాల్లో(భర్త వేషంలో) వచ్చిన పరపురుషుల ను కనుక్కోలేరా?
అడిగితే, మాయ, లోక కల్యాణం అంటారు ..!
@సుజాత:
ఇలాంటి ప్రశ్నలు మరీ ఎక్కువ అడిగితే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు, వాటిని విమర్శించటానికి నీకేం అర్హతుంది .. ఇలాంటి వాదాలు చేసి నోరు మూయిస్తారు. కాబట్టి జాగ్రత్త.
మహేశ్ గారూ,
హిందూ మతానికి assimilative power ఉన్నది అని భావించడమే ఒక మత భావన అని మీరు అన్నారు. దానితో నేను విభేదించడం జరిగింది. ఆ చర్చని ఇంకా పొడిగించాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను.
హిందూ సాంప్రదాయ ప్రేమికుల్లో నన్ను కూడా కలిపేస్తే, అసలైన సాంప్రదాయ వాదులు చాలా బాధ పడతారు. నాకు పట్టింపు లేదు. కానీ, హిందూ మతంలో ఉన్న చాలా పనికిరాని విషయాల్ని నేను ఒప్పుకోను, తెగడడానికి మొహమాటమూ పడను.
మీరు కూడా హిందూ సాంప్రదాయ ప్రేమికులనే ఈ టపాని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే- అన్ని అవతారాలకన్న ఈ అవతారం మీకు నచ్చింది. అసలు బుద్ధుడి కన్నా ఈ కొసరు బుద్ధుడు మీకు నచ్చడం, ఈ కథ ఇంకా బాగా నచ్చడాన్ని బట్టి, మీకు హిందూమతంలో నచ్చే విషయాలు చాలా ఉంటాయని, మీరు మా అందరికన్నా హిందూమతాన్ని ఎక్కువ ప్రేమించగలరనీ నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. కొద్దిగా సంస్కృతం నేర్చుకుని, గ్రంథాలు తిరగేస్తే మీకు ఇంకా బాగా నచ్చే విషయాలు చాలానే దొరుకుతాయి.
ఈ బుద్ధుడి కథ నాకు తెలుసు. నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు బాలజ్యోతిలో బొమ్మలతో సహా ఈ కథ పడింది. అయితే ఆ కథ మీరు చెప్పినట్టుగా ఉండదు. రాక్షసులు యజ్ఞయాగాదులు చేసి, తపోబలసంపన్నులై, స్వర్గాన్ని జయిస్తారు. వాళ్ళని మోహింపజెయ్యడానికి విష్ణువు సుందరమైన బుద్ధరూపం దాల్చి, వాళ్ళకి యజ్ఞయాగాదులు దండుగ అని బోధ చేస్తాడు. అతని బోధలు నమ్మి వాళ్ళు యజ్ఞాలు మానెయ్యగానే వాళ్ళ తపశ్శక్తి నశించి, దేవతల చేతిలో ఓడిపోతారు.
ఈ కథ పడ్డాకా, అసలీ కథ నిజంగా మన పురాణాల్లోదేనా అని ఉత్తరాలు కూడా వచ్చాయి బాలజ్యోతికి. అప్పుడు సంపాదకుడు ఖచ్చితంగా ఇది మన పురాణాల్లోదే అని వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది.
ఇటువంటి పుక్కిటి పురాణాలు ’చెత్త’ అనడానికి నాకు మొహమాటమేమీ లేదు. అయితే కొన్ని శతాబ్దాలుగా మెయిన్ స్ట్రీం హిందువులు అసలు బుద్ధుణ్ణే అవతారం అంటున్నారు అని నా భావన.
జయదేవుడి అష్టపదుల్లో -
’నిందసి యజ్ఞవిధే: కేశవ, అహహ శృతిజాతం,
సదయ హృదయ, దర్శిత పశుఘాతం’ అని ఉంటుంది.
అంటే, పశుహింసతో కూడిన యజ్ఞ విధిని నిరసించిన బుద్ధుని అవతారానికి జయము అని దానికి అర్థం.
అహింసని గట్టిగా అవలంబించడానికీ, యజ్ఞాల్లో పశుహింసని మానడానికీ బుద్ధుణ్ణి (ఆ బుద్ధుడు ఎవరైనా సరే) ప్రేరణగా హిందూమతం స్వీకరించింది అనడానికి ఇదో ఉదాహరణ అనీ, ఇది హిందూమతానికున్న assimilative power కి గొప్ప ఉదాహరణ అనీ నాకో అభిప్రాయం. అలా కాదు, హిందూమతం అంటే పశుహింసతో యజ్ఞాలు చేసే పురాతన మతమే అని మీరంటే, ఇప్పుడు భారత దేశంలో ఉన్న జనాభాలో అత్యధికశాతం అసలు హిందువులే కారు. మతం కూడా ఒక ప్రవాహంలాంటిది కావాలి. కాలంతో పాటుగా ప్రయాణం చేస్తూ మార్పుల్ని స్వీకరిస్తూ ఉండాలి. ఆ రకంగా చూస్తే హిందూమతం మిగతావాటికన్నా మార్పుకి చాలా అనుకూలమైనది.
పురాణాల్లోనూ, శాస్త్రాల్లోనూ ఉండే పనికిరాని విషయాల్ని వదిలేసి, పనికొచ్చే విషయాల్ని highlight చెయ్యడం వల్ల కొంత positive గా ఏమైనా సాధించడానికి అవకాశం ఉంటుందనీ, వాటిల్లోని అసంబద్ధమైన విషయాల్ని కెలికి, జనాల్ని విమర్శిస్తే దానివల్ల ఊరికే గొడవల్లో చిక్కుకోవడం తప్ప ఉపయోగమేమీ ఉండదనీ - మతానికి సంబంధించిన అన్ని చర్చలకీ - నా ఆఖరి మాటగా చెప్పి, విరమిస్తున్నాను.
@నాగమురళి:నేను అన్నిమతాల్నీ ప్రేమిస్తాను. నా విభేధం మతాన్ని నమ్మేవాళ్ళతోకాదు,వాళ్ళ మూఢపోకడలూ,అతివాదాలతో మాత్రమే!అవి ఏమతంలో ఎవరు చేసినా, నా జ్ఞానం- శక్తిమేరకు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాను.
నేను ఇక్కడ నచ్చిందని చెప్పింది కేవలం కథ మాత్రమే. అసలు బుద్దుడు చెప్పిన విషయాలుకూడా నాకు చాలా ప్రీతిపాత్రం.
కొన్ని interpretations ప్రకారం,గౌతమబుద్దుడి బోధనలూ, శంకరాచార్యులవారి అద్వైతానికి దగ్గరగా ఉండటం వలన వారే బుద్దుడ్ని దశావతారాల్లో ఒకటి చేసారనే వాదన ఉంది.
మీరు చెప్పిన కథ ఆప్పట్లో బౌద్ధమతానికి వ్యతిరేకంగా హిందువులు చేసిన propagandaలో భాగమైన కథలాగా అనిపిస్తోంది. యజ్ఞయాగాదులు వద్దన్నది గౌతమబుద్దుడే,అతడ్ని అవతారం చేసేసి అతని బోధనల్ని నమ్మినవాళ్ళని రాక్షసుల్ని చేసిన వైనం మీరు చెప్పిన కథలో కనబడుతోంది.
మతం అనేది జీవినవిధానమని అదిఎప్పుడూ మారాలని నేనూ నమ్ముతాను. కానీ, చాలా మంది సాంప్రదాయవాదులు,ఇదొక సనాతన మతం,ఇందులో మార్పుగురించి మాట్లాడటం, నిరసించడం, మార్పుని ఆశించడం అపవిత్రం,పాపం,నేరం అంటూ రాగాలు తీస్తుంటారు.అందుకే "నేతి నేతి" అంటూ అన్వేషించని మతమౌఢత్వాన్ని నేను నిరసిస్తాను.
అసంబద్ధతను మతం పేరుతో ప్రచారం చేసేవాళ్ళతోనే నాకున్న విభేధమంతా,ఊరికే కెలికే సమయం నాదగ్గరలేదు. కానీ, for a common good ఇలాంటి అతివాద మూఢమతవాదుల్ని ఎదుర్కోవడానికి మాత్రం వీలుచూసుకుని సమయాన్ని వెచ్చిస్తాను.
ఒక్క బుద్ధావతారం లో తప్ప మిగతా అన్ని అవతారాలలోను దేవతలు మాయలు, మర్మాలు వుంటాయి .
ఈ కధనుబట్టి బుద్దావతరంలో కుడా మిగిలిన దేవతల ప్రస్తావన వుంది కాబట్టి ,గౌతమ బుద్ధుడు , దసావతారాలలోని బుద్ధుడు వేరు వేరని తెలుస్తుది. మొత్తానికి గౌతమ బుద్ధుడు ఒక ఫ్రేం లోంచి బయటకొచ్చాడు.
ఇక మానసిక వ్యభిచారం అన్న మాట ఆడవాళ్ళకు మత్రమే వర్తిస్తుందా? ఎందుకంటే ఎక్కడా ఒక పురుష పాత్రకి ఈ మాట వుపయొగించగా నేను చదవలేదు.
తెనాలి రామకృష్ణ కవి ఓ చోట, దశావతారాల్లో కృష్ణున్ని వదిలేసి రాసాట్ట. అలాగే రాయల వారు 11 అవతారాలు (బలరాముణ్ణి చేర్చుకుని) చెప్పారట. ఇవన్నీ కావ్యాలు.అలానే బుద్ధుణ్ణి దశావతారాల్లో చేర్చింది శంకరాచార్యుల వారు అని కూడా నేనో చోట చదివాను. (ఇది కొంచెం నమ్మశక్యంగా లేదు).
కొంత మంది మహానుభావులను catagorize చేయడం కుదరదు. అందులో బుద్ధుడు ఒకడు. (బుద్ధ బోధ గురించి తెలుసుకోవాలన్న కించిత్ ఆసక్తి ఉన్న వారెవరికైనా ఆ విషయం తెలుస్తుంది)అవతారాల్లో ఆయన్ను చేర్చడం conspiracy యే అని అనుమానించాల్సి వస్తుంది.
మహేశ్ గారూ, మీ కామెంటు బాగుంది.
రవి గారూ, బుద్ధుడికి సంబంధించి, ఇప్పుడు మహేశ్ గారు రాసిన కథ లాంటివి conspiracy కావచ్చు. కానీ జయదేవుడి అష్టపదిలో (జయదేవుడు సుమారు పన్నెండో శతాబ్దం వాడు) చెప్పిన భావనల్లాంటివి conspiracies కాకపోవచ్చు. బుద్ధుణ్ణి అవతారంగా భావించడానికి హిందువుల్లో ఎక్కువమందికి అభ్యంతరం ఉండదు. ఆయన్ని అవతారంగా భావించడంలో రెండు రకాలూ (Conspiracy + Genuine) ఉండవచ్చు. శంకరాచార్యుడే ఈ Conspiracy చేశాడంటే మాత్రం నేను ఒప్పుకోలేను. ఆధారాలు చూపించమని అడుగుతాను.
ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, గౌతమ బుద్ధుడే తర్వాత శంకరుడిగా జన్మించాడని భావించేవాళ్ళు ఉన్నారు. అది conspiracy కోసం ఏర్పడిన సిద్ధాంతం మాత్రం కాదు. వాళ్ళ నమ్మకానికి ఆధారాలు వేరు. దీని గురించి ఇంకా వివరించమని మాత్రం నన్ను అడగవద్దు.
శంకరాచార్యుల వారిని ప్రచ్చన్న బౌద్ధుడు (తిట్టుగాను, పునర్జన్మ గాను)అన్న వారి గురించి నేను చదివాను.
జయదేవుడిని ప్రశ్నించట్లేదు కానీ,మీరు చెప్పిన genuine అన్నది ఓ tricky word నా ఉద్దేశ్యంలో. తాత్విక చర్చలు వద్దు కాబట్టి విడమర్చి నేను చెప్పలేను.. అలానే శంకరుడు ఓ intellectual.నా దృష్టిలో బుద్ధ మహానుభావుడు intelligent, but not an intellectual.
మహేశ్ గారి కథ నుండీ divert అవుతున్నాం కాబట్టి, ఆపేస్తున్నా.
Mahesh Garu,
mee blogs ekkuva ga chadavakapoyina
meeru itara blogs ki raase comments chala nchi mee blog chudadam jarigindi.
abhinandanalu.
Post a Comment