Sunday, April 5, 2009

సీత వెదకిన రాముడు


పొద్దు వారు నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం "తామస విరోధి"లో నేనొక సమస్యనిచ్చి పూరించమన్నాను. దానికొచ్చిన పూరణలు వ్యాఖ్యలు ఇవి. ఈ కవితలు మీరు పొద్దు పత్రికలో కూడా చూడచ్చు.

కత్తి మహేష్:
ఈ మధ్య తమిళ్ లో చేరన్ నటించిన ఒక సినిమా పేరు విని “భలే ఉందే”
అనుకున్నాను. అదే శీర్షికని తెనుగీకరించి సమస్యగా ఇస్తున్నాను. ఈ
శీర్షికకు కవిత రాయండి.

"సీత వెదకిన రాముడు"

మనందరికీ తెలిసిన కథలో రాముడు సీతను వెతుకుతాడు, కానీ ఇక్కడ సీత రాముణ్ణి
వెతికానంటోంది. అదేమిటో? ఎలాగో? కొంచెం ఆలోచించి చెప్పండి!

నూతక్కి రాఘవేంద్ర రావు:

రాముని తలచుచు సీతా మాత
విరహ తాపమున తల్లడిల్లి పడి
వున్న వేళలో సీతా ,సీతా
సీతా యటంచు రాము ని గాత్రం
వినిపించె నామెకు వీనుల విందుగ
కర్ణపేయముగ తలపో పిలుపో
రావణ మాయో సంభ్రమాన ఆ
అశోక వనిలొ తత్తర పాటున
సీత వెదికె రాముని కొరకు .


కత్తి మహేష్:

చాలా బాగుంది.
తలుచుకున్న ఎడబాటులో, తలపుకొచ్చిన రాముని పిలుపు వినిపించిన ఆక్షణిక భ్రమలో,
అశొకవనమన్న స్పృహకూడా రాక రాముణ్ణి సీత వెదకటం అమోఘం.
అభినందనలు.

శ్రీవల్లీ రాధిక:

శీర్షిక చూడగానే కలిగిన మొదటి భావమిది. ఇంకా ఇంప్రూవ్ చేయచ్చు.

సీత వెదికింది

తానెరుగని రాకుమారుడెవరో తన మెడలో తాళి కడుతుంటే

తన కోసం శివధనుస్సు విరిచిన సామాన్యుడి కోసం

సీత వెదికింది

తొలిసారి పెళ్ళినాడు సీత వెదికింది

తండ్రికిచ్చిన మాట కోసం తపనపడే తనయుడిలో

శూర్పణఖని కాదన్న శ్రీరాముడి హృదయంలో

తనకున్న స్థానం కోసం సీత వెదికింది

నియమాలకూ నిగ్రహాలకూ

తనపైని ప్రేమ అతీతమనే భావన కోసం

సీత వెదికింది

అశోకవనాల్లో వేచేటపుడూ

అగ్నిపరీక్షలు దాటేటపుడూ

సీత వెదికింది

నీధర్మమూ నా ధర్మమూ

ఒకటేననగల నేస్తం కోసం

వేలసార్లు సీత వెదికింది

వంటరితనంలో వాల్మీకి శరణంలో

తనకోసం నడచిరాగల రాముడి కోసం

సీత వెదికింది

తనచేయి విడవని రూపం కోసం

కన్నబిడ్డల కళ్ళల్లో

సీత వెదికింది

ఆశలన్నీ ఆవిరయ్యాక

పుడమిగర్భంలో కనుమరుగవుతూ

కడసారి కన్నీళ్ళతో సీత వెదికింది

ఆశ్రితవత్సలుడు అయోధ్యాపతిలో

అచ్చంగా తనవాడైన రాముడి కోసం

సీత వెదికింది

బొల్లోజు బాబా:
తొలిసారి పెళ్ళినాడు సీత వెదికింది ?????

కవిత కాన్సెప్టు ఇలా ఉంటే కొంచెం శక్తిమంతంగా ఉండేదేమో

రావణుడెత్తుకెళ్ళినపుడు,
బేలగా అడవంతా గాలిస్తూ రోదించినపుడూ,
అడవికి పంపిననాడు,
స్వర్ణ సీతను పెట్టుకొని యాగాదులు నిర్వహించినపుడు, అగ్నిప్రవేశం
చేయమన్నపుడూ,
అంటూ కొన్ని రాముని కేరక్టర్ లోని కొన్ని గ్రే ఏరియాస్ ని (పెద్దలకు కోపం
వస్తుందేమో) స్పృశిస్తూ ఆ యా సందర్భాలలో ” సీత వెతికింది తన రాముని
కొరకు” అని ఉంటే బాగుండేదనిపించింది.

మీరు ముందే అన్నట్లు రిఫైన్ మెంటు చెయ్యచ్చనిపిస్తుంది.

కత్తి మహేష్:

మంచి కోణం నుంచి చెప్పిన పూరణ.
చెప్పాలనుకున్నది చెప్పేస్తే, ఎక్కడ గొడవలైపోతాయో! అనే సందిగ్ధత ఈ కవితలో
కనపడింది. ఎందుకో?!?

త.య.భూషణ్:

మంచి భావావేశం ఉంది మీలో.దానికి చక్కని భాష సైదోడు.
పూరణలకే పరిమితం కానవసరం లేదు.


*****

6 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మాస్టారూ!
ఆ సినిమా పేరు సీత వెదకిన రాముడు కాదు. గమనించండి.
రామన్ తేడియ సీతై = రాముడు వెదకిన సీత
అందులో చేరన్ తనకు తగిన అమ్మాయి కోసం 2,3 పెళ్ళి చూపులకు వెళ్ళటం చూపిస్తారు.

Kathi Mahesh Kumar said...

@మందాకిని: మొత్తానికి అరవంలో నా అరతెలివి ఉపయోగకరమే అనుకుంటాను. తమిళ్ నాకు చదవడం రాదు, ఎవర్నో పేరడిగిరే "రామన్ తేడి సీతై" అన్నారు. నేను అదే అని డిసైడ్ అయ్యాను. తప్పును సూచించినందుకు ధన్యాదాలు.

శ్రీధర్ said...

"హా" సీతా యన్న రాముని వలె పిలుపున
"ఓ"యన్నా యని సంశయమున లక్ష్మనుండేగగ
"హూ" పదమన్న రావణుని హూంకరింపున భీతిల్లి
"అయ్యో" యని రక్షణకై సిత వెదకిని రాముడు, కలడో,రాడో

Ramani Rao said...

"భవతి బిక్షాందేహి" అన్న పిలుపువిని
బిక్ష వేయంగ నెంచి అన్నపూర్ణవోలే అరుదెంచగా
లక్ష్మణరెఖ దాటి రమ్మన్న యాచకుని మాటలకు
సంశయముగ గీత దాటుట ఏ కీడు నెంచుటయో ఎరుంగక
నలుదిశల చూపు సారించె మరిదీ సమేత విభుని కోసం
కుడికన్నదరగ సీత వెదికెను రామునికై.

నాకు కవితలు రాయడం రాదు మొదటి సారి ప్రయత్నించాను. ఎలా ఉందంటారు?

Anonymous said...

అరవం లో ఒక్కటేనా మీ అర తెలివి లేక...

Kathi Mahesh Kumar said...

@మూర్ఖుడు: నా అరతెలివి అరవానికొక్కదానికే పరిమితం కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలలోనూ నాది అరతెలివే!