Wednesday, April 29, 2009

పదును తగ్గిన ‘అసిధార’

(ఈ టపాతో రెండువందలు పూర్తయ్యాయి)


వందేమాతరం మతానికి అతీతంగా పిల్లలందరూ పాడాలి.
భగవద్గీతను పర్సనాలిటీ డెవలంప్మెంట్ పుస్తకంలా స్కూల్లో పరిచయం చెయ్యాలి.
ఆధునిక విజ్ఞానంతో పాటూ శాస్త్రాల్నీ,వేదాల్నీ కంపల్సరీ చెయ్యాలి....


వింటుంటే బీజేపీ మత/సాంస్కృతిక జాతీయవాద అజెండాలాగా ఉందికదా! ఇప్పుడు ఇంకో ఆలోచన వినండి.
‘కేవలం పరీక్షపాస్ చేయించే చదువుకన్నా, ఆలోచించడం నేర్చుకునే చదువు కావాలి. పిల్లల్ని పరిపూర్ణమైన మనుషులుగా మార్చే చదువు కావాలి’

అందరూ అర్జంటుగా తలలూపే పాయింటుకదా! ఇదే ‘అసిధార’ నవలలో ఉన్న సమస్య.

దాదాపు ఐదు నెలలక్రితం అసిధారని రచయిత కస్తూరి మురళీ కృష్ణ గారి స్వహస్తాల మీదుగా తీసుకుని ఆవేశంగా చదవడం ప్రారంభించాను. పది పేజీల తరువాత, చటుక్కున క్రింద పెట్టేసాను. ఒక తిరోగమవాద, ఛాందసవాద, హిందుత్వవాద నవల అనిపించి ఇప్పటివరకూ ముట్టలేదు. కానీ, ఈ మధ్యనే పూర్తిగా చదవుండా అలాంటి నిర్ణయానికొచ్చిన నా తొందరుపాటుతనానికి కొంచెం సిగ్గుపడి, పుస్తకాన్ని ముగించాను.

నా అభిప్రాయంలో విప్లవాత్మక మార్పురాలేదుగానీ, రచయిత ఉద్దేశం బీజేపీ అజెండాను మొయ్యడం మాత్రం కాదనిపించింది. ‘రాజకీయ హిందుత్వభావజాలంతో సంబంధం లేకుండా కొందరు, అద్వితీయ "ప్రాచీన"భారతీయ సంస్కృతి ఆధారంగా ఒక ఆదర్శలోకం తయారుచెయ్యొచ్చనే కల్పన చేసేవారున్నారేమో’ అనే ప్రత్యామ్న్యాయ ఆలోచనను అంగీకరించే స్థితికి ఈ నవల నన్ను తీసుకొచ్చింది. నేను ఈ నవల చర్చించిన "ఆదర్శాలతో" విభేధిస్తాను. అయినా, ఈ ఆలోచన యొక్క అవకాశాన్ని కాదనను.

సాంప్రదాయక విలుల్ని నిలువెల్లా జీర్ణించుకుని నమ్మిన (నమ్మి జీర్ణించుకున్న కాదు) వివేకానంద, తండ్రి ఆస్థిగా వదిలిన పాఠశాలలో తను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో, బోధనా పద్ధతుల్లో, విద్యార్థుల దినచర్యల్లో మార్పులు తీసుకొస్తాడు. పాఠశాలల్ని ఆర్థిక బలిమితెచ్చే వ్యాపారసంస్థలుగా మార్చే అవకాశాన్ని కాదని, సాంప్రదాయక "ధర్మ"(మత విద్యకాదని ఇతడి వాదన) విద్యను వివేకానంద అమలుపరచడంతో, ఈ ఆస్థిని ఉపయోగించుకోవాలనుకుంటున్న మామయ్య దశరధరామయ్యకు కంటగింపుగా తయారవుతుంది. ఆదర్శం - అవకాశవాదం మద్య పోరు ప్రారంభమవుతుంది. చివరకు ఎవరు గెలుస్తారు అనేది కథ.

సహజంగా హీరో గెలవాలిగనక, అదీ "వివేకానంద" అనే సింబాలిక్ విలువున్న పేరుపెట్టుకున్న నాయకుడు ఖచ్చితంగా గెలుస్తాడుగనక, పాఠకుడికి పెద్ద శ్రమలేకుండా కథ జరిగిపోతుంది. రచయిత కథమొత్తం వాదోపవాదాల్లో గడిపి, చివరి పదిపేజీల్లో తెచ్చిపెట్టుకున్న సస్పెన్స్ తో పాఠకుడికి కొంచెం థ్రిల్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో "స్పందించగలిగిన" అంశం, ఒక అమ్మాయిల గుంపును కథలో కలిపి, sexual tension కు ఆస్కారం కల్పించి, రక్తప్రసరణ పెంచి...ఆతరువాత ఏమీ చెయ్యకపోవడం. రచయితకు చలం మీదున్న అభిప్రాయాన్ని తెలియజెప్పడానికి. శుక్లాంభరధరం శ్లోకంలోని రహస్యాన్ని(ఇదొక భాష్యం మాత్రమే) విప్పిచెప్పడానికి. వివేకానంద "పవిత్రత"కు పట్టంగట్టటానికి. వివేకానందుడి తమ్ముడు (అర్థ)అభ్యుదయవాది రామకృష్ణను దిగజార్చడానికి తప్ప ఈ ఆడగుంపు యొక్క ఔచిత్యం అర్థం కాదు. ఉద్దేశం ఇదే అయితే మాత్రం రచయితకు అభినందనలు.

అమ్మాయిలతో రామకృష్ణ, వివేకానందుల ప్రవర్తన "సహజంగా" చిత్రీకరించినా, ఒక స్థాయికొచ్చేసరికీ మూల ఉద్దేశానికి అందక, తెగిన గాలిపటాల్లాగా కొన్ని conflict దృశ్యాలు వచ్చి, ఈ ప్రేమ- ఆకర్షణల పుటల్ని నవల నుంచీ తెంపేస్తాయి. మోనిక పాత్ర యొక్క "సహజమైన అసహజ" చిత్రీకరణ. లలిత పాత్రను ఉదాత్తం చెయ్యాలా లేక మామూలుగా ఉంచాలా అన్న ఊగిసలాట. ఉద్దేశరహితంగా ప్రవర్తించే మాలతి పాత్ర. ‘కొంతస్థాయి ఉన్మాదం మొదట్నుంచీ ఉందేమో!’ అనిపించే మీనాక్షి వంటి స్త్రీ పాత్రలతో రచయిత పడ్డతంటాలు చాలా సుస్పష్టంగా కనిపిస్తాయి.

కాస్త ఉదాత్తమైన స్త్రీపాత్రలంటే అమ్మ సరోజినమ్మ, చెల్లెలు శారద. ఇద్దరూ వివేకానందను గుడ్డిగా నమ్మితే, శారద మాత్రం కష్టకాలంలో హఠాత్తుగా "ఆరితేరి"పోతుంది. అదీ అప్పటివరకూ లలితను అల్లుకుని మాత్రమే ఎదిగిన(మాట్లాడిన) శారద వివేకానందుని మించిన విజ్ఞత పంచాయితీలో ప్రదర్శించి ఉత్తరాధికారిగా ఎదుగుతుంది. మొదటి దానికి కారణాలున్నా, రెండో మార్పు కొంచెం పంటికింద రాయే.

"జీవం చచ్చిన చదువులోకి జీవాన్ని చొప్పించేందుకు ఒక యువకుడు సాగిస్తున్న వ్రతమే ‘అసిధార’" అని రచయిత స్వయంగా చెప్పుకున్నా, నవలను కొన్ని ప్రాచీన భారతీయ సంస్కృతి లోని "పవిత్రమైన" ఆలోచనల్ని భవిష్యత్తు బంగారబాట చేసే విషయాలుగా ప్రతిపాదించడానికి, తన మనసులో అప్పుడప్పుడూ మెదలిన అమూల్యమైన జ్ఞాన గుళికల్ని నవల్లో కుదించడానికి. విశ్వనాథ సత్యనారాయణ దార్శనికతను నెత్తికెత్తుకోవడానికి. మతమార్పిడి చేసుకున్న దళితుల్ని ఒక ఎత్తిపొడుపు పొడవడానికి. అభ్యుదయ వాదుల్ని అవకాశవాద మాఫియాగా చిత్రించడానికీ. అవకాశవాదంకన్నా, నమ్మిన సిద్ధాంతాల్ని ఆరునూరైనా ఆచరించే (ఒక స్థాయిలో మూర్ఖపు) పట్టున్నవాడు జయించి తీరుతాడనే విషయాల మధ్య, అసలు విషయానికి తక్కువ సమయం కేటాయించి అన్యాయం చేశారు.

నవల శైలి ఎలాగూ చర్చాగోష్టి అప్పుడప్పుడూ ఏకపాత్రాభినయం కాబట్టి, చదువు విషయంలో కూడా తను చెప్పాలనుకున్నది రచయిత మధ్యలో దూరి చెప్పేసుంటే సరైన న్యాయం జరిగేదేమో! ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తరహా వ్యాసానికి కథనద్ది ఆసక్తికరంగా చెప్పిన పుస్తకంగా నిలిచుండేదోమో! కనీసం పూర్తిస్థాయి రాజకీయ హిందుత్వ అజెండాను మసాలాదట్టించి సమర్పించినా సమర్పణ కలిగిన పాఠకులు ఈ నవలకు లభించి ఉండేవారేమో!. అందరి పాఠకుల్నీ మెప్పించాలనో లేక తను నమ్మింది చెప్పాలని కథానాయకుడిలాగా రచయిత చేసిన ప్రయత్నమో తెలీదుగానీ, చదివించగిగిన నవల అయ్యుండీ నిరాశ పరిచింది.

కాకపోతే ఒకసారి చదివి కనీసం విభేధించడమో, కూసింత తిమకపడటమో, మంచి ప్రయత్నం అని అభినందించడమో చెయ్యవలసిన నవల అసిధార. ప్రయత్నించండి.

*****

5 comments:

గీతాచార్య said...

అబ్బో. రీవ్యూ తోనే బోరు కొట్టింది. ఇక పుస్తకాన్ని ఏమి చదవాలి? ;-)

>>>వేకానందుడి తమ్ముడు (అర్థ)అభ్యుదయవాది రామకృష్ణను దిగజార్చడానికి తప్ప ఈ ఆడగుంపు యొక్క ఔచిత్యం అర్థం కాదు.
*** *** ***

ఈ వాక్యాలు చాలు ఆ నవల గురింవి చెప్పేటందుకు. నాకూ కాస్త ఆ దర్శన భాగ్యం కలిగింది. అక్కడక్కడా చదివి ఎప్పుడాపేశానో కూడా మర్చిపొయాను.

Indian Minerva said...

"వందేమాతరం మతానికి అతీతంగా పిల్లలందరూ పాడాలి"
మిగతా వాటి గురించి విభేదిస్తాను కానీ. ఇదొక్కటి మాత్రం తప్పనిసరని నా భావం.

అసలుమీకీలాంటి పుస్తకాలున్నాయని ఎలా తెలుస్తుందండీ బాబు!

"కాకపోతే ఒకసారి చదివి కనీసం విభేధించడమో, కూసింత తిమకపడటమో, మంచి ప్రయత్నం అని అభినందించడమో చెయ్యవలసిన నవల అసిధార. ప్రయత్నించండి."

No; but Thanks :)

సుజాత వేల్పూరి said...

ఈ పుస్తకాన్ని మురళీకృష్ణ గారి స్టాల్లోనే కొన్నాను నేను కూడా! ఎంతో ఉత్సాహంతో ప్రారంభించాను చదవడం. ఒక రకమైన అయోమయానికి గురవుతూ చదివాను నవలంతా! ఆడపిల్లల ఎపిసోడ్ నవలకు అనవసరమనిపించింది.అలాగే వివేకానంద ప్రవర్తనలో స్పష్టత ఉండదు.రామకృష్ణ సరే సరి!ఆపకుండా చదివించే నవలైతే కాదు. అక్కడక్కడా బోరుకొట్టేసింది.

అభినందించవలసిందే ప్రయత్నాన్ని,ఇంకొంచెం స్పష్టత ఉంటే!

రాజతరంగిణి కథలు ఎంజాయ్ చేసినట్లు ఈ నవల చేయలేకపోయాను.

సుజాత వేల్పూరి said...

ఏడాది వ్యవధిలో 200 పోస్టులు రాయడం మామూలు విషయం కాదు. మనఃపూర్వక అభినందనలు.

జ్యోతి said...

congratulations for 200th post...