Breaking News: ‘రెడీ’ సినిమాలో సునిల్ పాత్రద్వారా రాష్ట్రవ్యాప్తంగా, కూచిపూడి నాట్యాచార్యుల మనోభావాలు దెబ్బతిన్నాయ్!
పోయిన సంవత్సరం ఎమ్.ఎఫ్.హుస్సేన్ హిందూ దేవతల్ని నగ్నంగా పెయింట్ చేసాడు.
"హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని దేశం నుండీ తన్ని తగలేసాం.
బరోడాలో ఒక విధ్యార్థి పరీక్షకు తన బొమ్మల్ని ప్రదర్శనకు పెడితే...
ఒక రాజకీయనాయకుడు విధ్వంసం చేసి "హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని ఆ విధ్యార్థిని జైలుకి పంపాడు.
బుష్ ప్రభుత్వంతో న్యూక్లియర్ ఒప్పందం చేసుకుంటే...
భారతీయ ముస్లింల "మనోభావాలు దెబ్బతింటాయ్" అని కొన్ని రాజకీయపార్టీలు అంటున్నాయి.
మొన్న ఒక పత్రిక కొన్ని అవాకులు రాస్తే...
"దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని భౌతికదాడికి దిగేసారు.
నిన్న ఒక పత్రికలో జీసస్ బొమ్మ అభ్యంతరకరంగా అచ్చైతే...
క్రైస్తవుల "మనోభావాలు దెబ్బతిన్నాయ్" అని ఆఫీసు ద్వంసం చేసారు.
నిజంగా దేవుళ్ళూ, మతాలూ, కులాలూ గత ఐదు సంవత్సరాలలో ఇంత సున్నితంగా తయారయ్యారా...!?!
సుదీర్ఘ ముస్లిం పరిపాలనలో, బ్రిటిష్ రాజ్యంలో చెక్కుచెదరని హిందూ మతం, దేవుళ్ళూ ఒక్క పెయింటింగ్ తో ప్రమాదంలో పడిపోతారా? "హిందూ మతం ఒక మతంకాదు, అదొక జీవన విధానం" అనిచెప్పుకునే ప్రజల మనోభావాలు ఈ మాత్రానికే గాయపడతాయా?
ప్రపంచవ్యాప్తంగా బుష్ ప్రభుత్వం ముస్లింలపై చేస్తున్న దారుణాలకు భారతీయ ముస్లింలు వ్యతిరేకమేగానీ, భారత ప్రభుత్వం, దేశ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంటే ముస్లిలు ఎందుకు వ్యతిరేకిస్తారో? వారి మనోభావాలు ఎందుకు గాయపడతాయో?
దళితనాయకులలో పెరుగుతున్న వ్యాపారధోరణిని ఒక పత్రిక ఎత్తిచూపినంత మాత్రానా, మొత్తం దళితుల మనోభావాలెలా దెబ్బతింటాయ్? అప్పుడప్పుడూ చాటుగా, అక్కడక్కడా బాహాటంగా దళితులు ఇదే మాటలు అనుకోవడం లేదా? నాయకుడు జాతి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం వహిస్తాడేగానీ, వారి మనోభావాల్ని భుజానేసుకుని తిరుగుతాడా...కొన్ని కోట్ల దళితుల మనోభావాల గురించి క్షణంలో తెలిసి, దాడికి పాల్పడడానికీ?
ప్రేమ, కరుణ, క్షమ మూల సిద్ధాంతలుగా గల క్రైస్తవమతం మనోభావాలు. ఒక్క సిగరెట్, బీర్ క్యాన్ పట్టుకున్న యేసు ప్రభువు బొమ్మతో దెబ్బతినేసాయ్. తెలియక చేసిన తప్పును యేసు ఖచ్చితంగా క్షమిస్తాడేమో గానీ, ఈ విధ్వంసాన్ని క్షమిస్తాడా? అయినా క్రైస్తవ ప్రచార వ్యాసం పైన ఇలాంటి బొమ్మ ఎవడైనా ఉద్దేశపూర్వకంగా వేస్తారా? వేసినా యేసు ముళ్ళకిరీటం పెట్టి కొరడాలతో కొట్టినా చలించలేదే, సిగరెట్టూ బీర్ క్యానూ చేతిలో పెడితే కోపగిస్తాడా? మరి క్రైస్తవుల మనోభావాలు అంత అర్జంటుగా ఎందుకు దెబ్బతిన్నాయో?
నేను హిందువుని, నేను ముస్లింని, నేను దళితుడ్ని, నేను క్రైస్తవుణ్ణి జరిగినవాటికన్నా, ఈ మనోభావాలు దెబ్బతినే నాటకాల్నిచూసి, నా మనోభావాలు దెబ్బతిన్నాయ్...నేనేం చెయ్యాలి?
Tuesday, July 15, 2008
నా మనోభావాలు దెబ్బతిన్నాయ్!
Posted by
Kathi Mahesh Kumar
at
7:43 AM
25
comments
Labels: సమాజం
Monday, July 14, 2008
ఈవ్ టీజింగ్ & కట్నం గురించి కొన్ని నిజాలు
ఈవ్ టీజింగ్ గురించి జరిగిన చర్చలో కొందరు మెట్రో సిటీలలో ఈ సంస్కృతి తగ్గినట్లుగా చెప్పడం జరిగింది. వారికోసం ఇక్కడ నాలుగు ప్రముఖ మెట్రో సిటీలలోని గణాంకాలను ఇస్తున్నాను.
కేవలం మార్చి, 2003 (ఒక్క నెలలో) లో ఈవ్ టీజింగ్ కేసులు
ముంబై : 27
కొలకత్తా : 30
ఢిల్లీ : 744
చెన్నై : 143
మన దేశ రాజధానికి ఈవ్ టీజింగ్ లోనూ రాజధానే!
ఆంధ్రప్రదేశ్ లో కేవలం 6 నెలల్లో (జనవరి 2002 - జూన్ 2002) రిజిస్టెరైన ఈవ్ టీజింగ్ కేసులు 1,807
మధ్యప్రదేశ్ 2,906 తో మొదటి స్థానంలో ఉండగా, మనది సగౌరవమైన రెండవస్థానం.
కట్నం గురించి జరిగిన చర్చలో, "కట్నం కోసం పీడించకుంటే చాలు" అన్నారు.
మన ఆంధ్రప్రదేశ్ లో 2001 వ సంవత్సరంలో కట్నం కారణంగా మరణించిన ఆడపడుచుల సంఖ్య అక్షరాలా 535. అంటే కనీసం రోజుకి ఒక మహిళైనా కట్నానికి బలై ప్రాణం కోల్పోతోందన్నమాట.
ఇక మహిళల్ని గౌరవించి పూజించే మన మహత్తర దేశంలో, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల 2000 సంవత్సరం లెక్కలు కాస్త చూడండి;
1. రేప్ : 16,496
2.కట్నం మరణాలు : 6995
3. గృహ హింస : 45,778
4. ఈవ్ టీజింగ్ : 32,940
5. సెక్సువల్ హెరాస్ మెంట్ : 11,024
మార్పు మనదేశంలో త్వరగా రాదు కాబట్టి, ఆ మార్పొచ్చే రోజుకోసం ఎదురుచూద్దామా? లేక మార్పు తీసుకురావడానికి ఇప్పుడే మనకు చేతనైన ప్రయత్నాన్ని చేద్దామా? Nobody have to wait for change to happen. If you believe in change THIS IS THE TIME TO CHANGE.
(పైన తెలిపిన సంఖ్యలు Center for Social Research అనే సంస్థవారి Eliminating the violence against women : some facts అనే డాక్యుమెంట్ లోనుండీ తీసుకోబడినవి)
Posted by
Kathi Mahesh Kumar
at
6:57 PM
9
comments
Labels: సమాజం
Sunday, July 13, 2008
(నేను) అసలెందుకు రాయాలి?
ప్రముఖ బ్లాగరి వి.బి.సౌమ్య గారు తన బ్లాగులో ‘ఎందుకు చదవాలి?’ అనే టపా క్రితం నెల రాస్తే, ఈ సారి కొత్తగా ‘తెలుగెందుకు చదవాలి?’ అని బహుచక్కగా టపాలు రాసేసారు. ఈ టపాల స్ఫూర్తితోపాటూ, ఈ మధ్య నేను రాసిన మన పెళ్ళిప్రాతిపదిక తప్పైతే? టపాపై తన అభిప్రాయం రాస్తూ ‘అర్వింద్’ అనే మిత్రుడు, నీ టపాల ఆవేశంచూస్తే "సమాజంపై కోపాన్ని, విపరీతమైన ద్వేషాన్నీ నింపుకున్నట్టు అనిపిస్తోంది" అని అన్నాడు. అప్పుడొచ్చిన ఆలోచనే, "అసలెందుకు రాయాలి?" అన్న సందేహం. ఈ టపాలో నా సందేహాన్ని పంచుకోవడంతో పాటూ, నేనెందుకు ఇలా రాస్తానోకూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.
చరిత్రను తీసుకుంటే, రాతలల యొక్క ప్రాచీన ఆధారాలు గుహల చిత్రాలలో (cave paintings) గుర్తిస్తారు. వాటిల్లో చాలావరకూ వేట, ఉత్సవాలు,రోజువారీ దినచర్యల చిత్రాలు బొమ్మల రూపాలలోనూ, కొన్ని సంజ్ఞలరూపంలోనూ భద్రపరిచినట్లు అనిపిస్తాయి. అంటే, జీవితంలోని కొన్ని ముఖ్యమైన,గుర్తుపెట్టుకోదగిన చర్యల్ని ఇలా లిపిబద్ధంకానీ, చిత్రబద్ధంకానీ చెయ్యడం సహజమానవ లక్షణంలా అనిపిస్తుంది. ఇదే ప్రాచినప్రవృత్తి (primordial instinct) లిపి పుట్టుకకూ, మనం రాయడానికీ, సాహిత్య సృజనకూ కారణభూతమైఉండవచ్చు.
మనుషులు తాము నేర్చుకున్న అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ, జ్ఞానాన్నీ అక్షరబద్ధం చేస్తారు. దాని ఆశయం గుర్తుంచుకోవడం కావచ్చు, లేదా ఇతరులకు తెలియజెప్పడం కావచ్చు లేక కేవలం మనసు,మెదడులోని భావాల్నీ ఆలోచనల్నీ రాయడం ద్వారా వ్యక్తపరచి, కొంత మానసిక వత్తిడి నుంచీ ముక్తిపొందడమూ కావచ్చు. ముఖ్యంగా సాహిత్య సృజన, మనిషి తనకు తెలిసిన, ఉత్తమం అనిపించిన విషయాల్ని చెప్పడానికి ఉపయొగిస్తాడని భావిస్తారు. అందుకే, "best that is been thought and said is available in literature" అంటారు. బహుశా మనం బ్లాగులు కూడా ఇందుకోసమే రాస్తామేమో కదా!
రెండునెలల క్రితం నేను ఈ బ్లాగు రాయడం మొదలెట్టకముందు, దాదాపు 15 సంవత్సరలుగా తెలుగులో రాయడం మానేసాను. 10 వతరగతి తరువాత (1992) ఇప్పటి వరకూ,కనీసం ఒక ఉత్తరమైనా తెలుగులో రాసిన పాపాన పోలేదు. అప్పుడప్పుడూ ఉద్యోగరీత్యా కొన్ని విషయాల్ని ఆంగ్లం నుండీ తెలుగులోకి తర్జుమా చేసినా, అది కేవలం భాధ్యతగా చేసినవే తప్ప మనసుపెట్టి చేసిన జ్ఞాపకం అస్సలు లేదు. కానీ నా ‘I think in తెలుగు’ టపాలో వివరించినట్లు, నా ఆలోచనలూ, భావాలూ మాత్రం చాలావరకూ తెలుగులోనే జరిగేవి. అవి బయట మాత్రం హిందీ, ఆంగ్లంలో రూపాంతరం చెంది నిత్యజీవనంలో ఉపయోగపడేవి. కాబట్టి తెలుగులో రాయడం అనే ప్రక్రియ నా జీవితంలో పూర్తిగా మరుగుపడిపోయిందని చెప్పుకోవచ్చు.
బ్లాగులో టపాలు రాయడం మొదలుపెట్టిన తరువాత, అప్పటికే నవతరంగంలో నేను సినిమాలు గురించి రాయడం మొదలుపెట్టి ఉండటం చేత, వాటినే ఇక్కడా పెట్టడం జరిగింది. కానీ, ‘ఎలాగూ సినిమాల గురించి నవతరంలో రాస్తున్నానుకదా, నాకు నిజంగా స్పందించాలనిపించిన సామాజిక,ఆర్థిక,రాజకీయ మరియూ వ్యక్తిగత విషయాలను ఎందుకు బ్లాగులో రాయకూడదూ’ అన్న ఆలోచనవచ్చి వాటిని రాయడం మొదలెట్టాను. అలా క్రమక్రమంగా టపాలు పెరిగాయి. బహుశా గత 15 సంవత్సరాల నా ఆలోచనల్నీ, భావాలనీ అక్షరరూపం ఇవ్వాలన్న తపన, ఈ ఉదృతానికి ఒక కారణం కావచ్చు. ఇంతకాలంలో నేను తెలుసుకున్నవీ, అనుభవించినవీ, నేర్చుకున్నవీ, అభిప్రాయాలు ఏర్పరుచుకున్నవీ చెబుతుంటే, వాటికి వచ్చిన స్పందనని చూసి, నా పిచ్చి సొంతరాతల్ని అన్వయించుకుని అభినందించేవాళ్ళూ, విమర్శించేవాళ్ళూ ఇంత మంది ఉండటం ఆనందాన్ని కలిగించింది.
టపాల ఉదృతం ఎక్కువయ్యేకొద్దీ నా ఆలోచనలలో, నా వ్యక్తిత్వం ఛాయలు బలంగా కనబడడం మొదలయ్యాయి. వాటితోపాటూ టపాలకొచ్చే విమర్శలలో నిరసనలుకూడా. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, మనం మనస్ఫూర్తిగా నమ్మిందో లేక వ్యతిరేకించేదో లేకపోతే రాయడం వృధా, అని నా నమ్మకం. What is the point in writing, if we have nothing to believe in or nothing to rebel against? అందుకే నా టపాలలో చాలావరకూ, నేను బలంగా నమ్మినవీ లేక తీవ్రంగా వ్యతిరేకించే విషయాల్ని రాస్తాను. కాకపోతే ఆ భావనలు నా జీవితంలో వచ్చిన నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కొంత తార్కికంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. దీన్ని చదివిన కొందరు ఎందుకు అంత వ్యతిరేకం? ఎవరిమీద నీ కోపం? అంటే, "నామీద నాకే" అని చెప్పగలనేకానీ, వీరిమీద అని ఖచ్చితంగా సూచించలేను. ఎందుకంటే I rebel against issue, ideas, concepts, social norms, individual hypocrisies వాటిని స్థూలరూపంలో చూడాలంటే కష్టమే, నిర్థిష్టంగా వివరించాలంటే అసాధ్యమే.
ఈ మధ్యనా మిత్రుడు కొన్ని విమర్శల్ని చదివి "ఈ బ్లాగర్లు టైంపాస్ చెస్తున్నార్రా! నువ్వెందుకు ఇంత కష్టపడి ఈ టపాల్ని రాయడం" అన్నాడు. దానికి నేను చెప్పిన సమాధానం ఒక్కటే, "నేను కష్టపడి కాదు, ఇష్టపడి రాస్తున్నాను. నేను రాస్తున్న విషయాల్ని టైంపాస్ కైనా చదివేవాళ్ళు దొరకడం అదృష్టమే" అన్నాను. I really believe in what I said to my friend. రాసేవాడెవరూ దీన్నిచదివి అందరూ గుర్తించాలి అన్న ఉద్దేశంతో రాయరు, కానీ గుర్తింపు వస్తే అది వ్యతిరేకార్ధకమైనా ఆనందంగానే ఉంటుంది. అందుకే తీరిగ్గా పొగడ్తలతో పాటూ విమర్శలకూ సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాను.
నన్ను వ్యతిరేకించేవారు కూడా అంత పొడవైన ప్రశ్నలూ, విమర్శలూ సమయం వెచ్చించి చేసేది, నేను మనస్ఫూర్తిగా నమ్మిన మూల సిద్ధాంతం కోసమే అని బలంగా అనిపిస్తుంది. They believe in different values and rebel against what I say. అందుకే మనమందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనిపిస్తుంది. కాకపోతే నిజజీవితంలో మనం వాదోపవాదాల్లో చేసినట్లే, ఇక్కడా సామ,దాన,భేద, దండోపాయాల్ని ఉపయోగించి వాదనల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించినపుడు మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
నేను బలంగా నమ్మినవీ, తీవ్రంగా వ్యతిరేకించే విషయాలే చాలావరకూ ఈ బ్లాగులో కనబడతాయి. వాటిని అంగీకరించేవారికి స్వాగతం. చదివి అందిపుచ్చుకుని, అభినందించేవారికి సుస్వాగతం. అందిపుచ్చుకుని, ఆలోచించేవారికి మహాస్వాగతం. ఖండించి, విమర్శించేవారికి అద్వితీయ స్వాగతం.
Posted by
Kathi Mahesh Kumar
at
12:30 PM
20
comments
Labels: సమాజం
Saturday, July 12, 2008
ముళ్ళపూడి రమణ ‘ప్యాసా’ చిత్రసమీక్షపై నా సమీక్ష
కాలేజిలో ఉండగా, ప్రతి వారాంతరంలో దూరదర్శన్ లో ప్రసారమయ్యే హిందీ సినిమాల పరంపరలో భాగంగా గురుదత్ దర్శకనిర్మాతగా తనే నటించిన ‘ప్యాసా’ (प्यासा) సినిమా చూడ్డం జరిగింది. మొదటి ఫ్రేమ్ నుంచే ఈ సినిమా నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.
నాయకుడి భావుకత, కవిహృదయం, రాజీపడలేని మనస్తత్వం నాకు గౌరవప్రదంగా అనిపించాయి. ప్రేమికురాలిగా నటించిన ‘మాలాసిన్హా’ అందం ఆ సినిమాలో ముఖ్యంగా "హమ్ ఆప్ కె ఆంఖొంమే ఇస్ దిల్ కో సమాలెతో" అనే పాటలో కళ్ళతో నటించిన తీరును చూసి అర్జంటుగా ప్రేమించానని చెప్పొచ్చు. ‘వహీదా రెహమాన్’ "జానెక్యా తూనే కహె, జానె క్యామైనే సునే" అని చిలిపికళ్ళతో కథానాయకుణ్ణి ఆహ్వానిస్తుంటే, నన్నేనేమో అని భ్రమించానుకూడా. "జానెవొ కైసే లోగ్ థె జిన్కొ ప్యార్ సె ప్యార్ మిలా" అని భగ్నప్రేమికుడిగా ‘గురుదత్’ ఆలపిస్తుంటే, బాధగా మూల్గిన నా హౄదయ స్పందన నిన్నజరిగినట్లుగానే ఇప్పటికీ అనిపిస్తుంది. ఇక "ఎ దునియా అగర్ మిల్ భి జాయేతొ క్యాహై" అని చివర్న నాయకుడు ఈ ప్రపంచాన్ని ప్రశ్నించి త్యజిస్తున్న పాటను చూసి, నేను భరించలేని ఆవేశంతో లేచి నిలబడిన క్షణం ఇంకా నా మదిలో తాజాగా ఉంది. ఆ SD బర్మన్ గారి పాటలు ఆ సినిమాలో చిత్రీకరించిన విధానం అటువంటిది. ఇక నటీనటుల నటన అద్వితీయం.
సంగీతం, నటనతోపాటూ చిత్రకథ, కథనం, సినెమటోగ్రఫీ అన్నీ...అన్నీ నాకు ఈ సినిమాలో ఉత్తమం అనిపించాయి. ఈ మధ్య నేను ‘ముళ్ళపూడి రమణ’ గారి ‘సినీరమణీయం 1’ చదువుతుండగా ఈ చిత్రసమీక్ష కనబడింది. కానీ నా అభిప్రాయానికి భిన్నంగా రమణ గారి విమర్శ ఉండంతో, కొంత ఆలోచించి కారణాలను వెదకుతూ ఒక వ్యాసాన్ని నవతరంగం కోసం రాసాను. ఆ వ్యాసాన్ని ఈ లంకె ద్వారా చదివి, మీ అభిప్రాయాల్ని తెలుపగలరు.
Posted by
Kathi Mahesh Kumar
at
8:52 PM
1 comments
Labels: సినిమాలు
ఏది తప్పు? (కవిత)
తప్పుని తప్పని తెలియజెప్పితే తప్పా?
నిజాన్ని నిఖ్ఖచ్చిగా నిగ్గుదేల్చక
నీరసంతో నివురుగప్పితే తప్పా!?!
తప్పుని "తప్పు" అనడానికి కావలసింది
నిజమెరిగిన చైతన్యమే తప్ప,
నిగడదీసిన నైతికత కాదుగా!
మరి తప్పన్న వారి
నైతికతపై ప్రశ్నచిహ్నాలెందుకు?
నివురుగప్పిన నిజాన్ని నిగ్గుదేల్చినందుకా!
లేక,
నీ మనసు నలుపుని నలుగురిలో నిలిపినందుకా?
ఏది తప్పు?
మూర్తీభవించిన చైతన్యమా!
ముసుగుతన్నిన మాలిన్యమా!!
Posted by
Kathi Mahesh Kumar
at
1:17 PM
12
comments
Labels: కవిత
Friday, July 11, 2008
మన పెళ్ళి ప్రాతిపదికే తప్పైతే?
కట్న గురించి రాసిన టపాలో, మన సాంప్రదాయ వివాహాల గురించి కూడా చాలా చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో ఠకాల్న మా కాలేజీలో ప్రొఫెసర్ రఘునాధ్ చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. తను అనేవారు, "in India marriages happen for wrong reasons" అని. తరచి చూస్తే అది చాలా నిజమని చాలా మంది అభిప్రాయాలు చెప్పకనే చెప్పాయి.
‘పెళ్ళి’ అనే ఒక వ్యవస్థ మానవమనుగడకి చాలా అవసరం అనేది అందరూ అంగీకరించే నిజం. ఇక్కడ సమస్య పెళ్ళి అవసరమా? కాదా? అన్నది కాదు. ప్రశ్న కేవలం ఈ విధానంలో అంగీకరించబడే పెళ్ళిల్లు అవసరమా? అన్నది మాత్రమే. సాంప్రదాయాలూ, కట్టుబాట్లు, ఆచారాల పేర్లతో కొన్ని పరిధులు అప్పటి కాలానికి అనుగుణంగా ఎర్పరుచుకుని వాటినే గుడ్డిగా ఇప్పటికీ ఆచరిస్తూ, అన్యాయమని అనిపించినా, ఆదరించడం అవసరమా అన్నదే మూల సమస్య.
అసలు పెళ్ళెందుకు? అని ప్రశ్నించికుంటే వచ్చే సరళమైన సమాధానం, సహచర్యం, సహజీవనం, సాంఘిక గౌరవం, సామాజిక ప్రగతి. ఈ నాలుగు విధానాలనూ/లాభాలనూ వివరంగా చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. అందునా అర్థం చేసుకోవడానికి అవి మరీ బ్రహ్మపదార్థాలు కావు గనక, మన జీవితాల్లో వాటి ప్రాముఖ్యత తెలిసినవే గనక ఎక్కువ వివరణ లేకుండా, కేవలం పేర్లు మాత్రమే ఉటంకించాను. మొదటి రెండు లాభాలూ వ్యక్తిగతమైతే, తరువాతవి మొత్తం సమాజానికీ, ప్రపంచ ఉనికికీచాలా అవసరం. కాబట్టి పెళ్ళి ప్రాముఖ్యతా, కొందరి దృష్టిలో పవిత్రతా ప్రశ్నార్థకాలు అస్సలు కావు.
కానీ పెళ్ళి మాటల మొదలు, చూపులూ, బేరసారాలూ, ఏర్పాట్లూ, విధివిధానాలూ, ఆచార సాంప్రదాయాలూ, హంగులూ, హంగామాలూ, ఆర్భాటాలూ, పలకరింపులూ, ప్రదర్శనలలోఎంత డొల్లతనం కనబడుతుందో తలుచుకుంటే, గుండె బేజారెత్తిపోతుంది. ఇక అనుభవిస్తే మెదడు మొద్దుబారిపోవడం ఖాయం. నిజానికి పెళ్ళిచేసుకుంటున్న మగాడు ఆడదానికి ఈ చాలా విషయాలలో అస్సలు సంబంధమే ఉండదు. ఇక ఈ ముఖ్యమైన నిర్ణయాలకి ప్రాతిపదిక తెలుసుకుంటే, హస్యంగా అనిపించినా చాలా అసహ్యమైన తంతు అని అంగీకరించాల్సిందే!
అందుకే మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో పెళ్ళికి ఎంచుకోబడుతున్న ప్రాతిపదిక మరియూ కారణాలను (అందరికీ తెలుసుగనక) కాస్త తలుచుకుందాం.
1. పరువూ - ప్రతిష్ట: మహా అయితే తాత, లేదూ ముత్తాత పేర్లు తప్ప కుటుంబ చరిత్రకూడా మనకెవరికీ తెలీదుగానీ, పరువూ ప్రతిష్ట అనేవి సినిమా డైలాగుల్లా ప్రతి పెళ్ళి తంతుముందూ బేరీజు చేసుకునే అతి ముఖ్యమైన విషయాలు. వాళ్ళ తాతలు నేతులు తాగారు కాబట్టి ఇప్పుడు మూతుల వాసన బాగానే ఉండొచ్చన కొండొకచో నిర్ణయాలు. మళ్ళీ ఎమైనా అంటే, "అటు ఏడుతరాలు, ఇటు ఏడు తరాలూ చూడకుండా పెళ్ళే!" అని బీరాలు. ఏడుసముద్రాల అవతల అమెరికాలో ఉంటే మాత్రం వాడెలాంటివాడో కూడా తెలీనవసరం లేకుండా పెళ్ళి మాత్రం ఖాయం చేసేస్తారు. అయినా ఇదొ గొప్ప కారణం. కులం ఇందులో ఒక మహత్తర భాగం పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పఖ్ఖరలెదనుకుంటా!
2. ఈడూ -జోడూ: ఇదొక పెద్ద హాస్య ప్రహసనం. సహజీవనానికీ, సాహచర్యానికీ అవసరమైన స్వారూప్యత(compatibility) ఎవరికీ అఖ్ఖరలేదు కానీ, ఎండకు మారిపోయే వంటి రంగూ, హీల్స్ వేసుకుంటే పెరిగిపోయే ఎత్తూ, కాస్త ఎక్కువ తింటే పెరిగిపొయే బరువూ వీళ్ళకు చాలా ముఖ్యం. ఇక అమ్మాయికి కళ్ళజోడుంటేనో, అబ్బాయికి బట్టతలుంటేనో ప్రపంచయుద్ధాలే జరిగిపోగలవు. అంటే పైపైమెరుగులు తప్ప, పెళ్ళికి అవసరమైన మానసిక హంగులు అస్సలు అవసరం లేవు. వీటికోసం జరిగే పెళ్ళిచూపుల తంతు గురించి ఆ టార్చర్ కు బలైన అమ్మాయినీ, ఆ విధానంలో ఇబ్బందిగా, దర్జాని వెలగబెట్టే అబ్బాయినీ అడిగి తెలుసుకోవాలి.
3. డబ్బూ - దస్కం: అబ్బాయికి సరైన ఉద్యోగం, అమ్మాయి తరఫున నుండీ సరితూగే కట్నం. ఇవి తరువాత వచ్చే ముఖ్యకారణం. ఇవి తెగితేకానీ పూజారి ముహూర్తం పెట్టడన్నమాట. ఇక్కడ ఎలాగూ మార్కెట్ ధరలు నిర్ణయించడం జరిగిపోయింది కాబట్టి అమ్ముకోవడానికీ, కొనుక్కోవడానికీ ఇక్కడ ఎలాంటి సిగ్గుబిడియాలూ కుటుంబాలకి ఉండవని ఇదివరకటి టపాలోనే తెలుసుకున్నాం.
పై మూడు ముఖ్య విధానాలు కాక ఇంకా చాలా ఉండొచ్చు కాని దాదాపు అన్నీ పై మూడింటిలో ఏదో ఒక భాగంలో చేరేవే అని నాకు అనిపిస్తుంది. అంటే పెళ్ళి అనే గమ్యం సరైనదేగానీ, దాన్ని చేరడానికి మన సమాజం ఎంచుకుంటున్న ప్రాతిపదిక (basis) తప్పులతడకగా అనిపించట్లేదూ? Though end can justify its means in many cases, what if the means is so mean? ప్రాతిపదిక ఇంత అర్థరహితంగా ఉంటే పెళ్ళిల్లు సుఖంగా ఉంటాయా అన్నది అడగవలసిన ప్రశ్న.
"కొన్ని తరాలుగా ఇలాగే జరిగింది, అందరూ సుఖంగా సంసారాలు చేసుకోవట్లేదూ?" అనేది చాలా మంది పెద్దల వాదన. నిజమే మా తాతయ్య-బామ్మల తరం, నాన్నా-అమ్మల తరం సుఖంగానే జీవించామన్న నమ్మకంలో ఉన్నారు. ఎందుకంటే పెళ్ళి చేసుకున్నాక భరించాలి, బాధ్యతను సహించాలి అన్న విశ్వాసం ఆ తరంవారి సొత్తు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయా? అందుకే ఈ దారి...సుఖమయ పెళ్ళి అనే గమ్యానికి నిజంగా పూలబాట కాకపోవచ్చు అనిపిస్తుంది.
If our present means or reasons for marriage are doubtful, Its our duty and responsibility to look for better ones.
Posted by
Kathi Mahesh Kumar
at
10:33 AM
29
comments
Labels: సమాజం
Thursday, July 10, 2008
కట్నానికి మరో వైపు
ఈ మధ్య యూనివర్సిటీలో కలిసి చదువుకున్న ఒక మితృడిని కలిస్తే కొన్ని వింత విషయాలు చెప్పాడు. అతని పేరు ప్రస్తుతానికి ‘శంకర్’ అనుకుందాం. వయసు 28, మంచి ఉద్యోగంకూడా చేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతను వేరే రాష్ట్రంలో ఉన్నాడు. కానీ తన కుటుంబం మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది. గత రెండు సంవత్సరాలుగా అతనికి పెళ్ళి చేసే ప్రయత్నాలలో వారి కుటుంబం తలమునకలై ఉంది.
ఫోటో దశలోనే చాలా మంది అమ్మాయిల్ని జాతకం బాలేదనో, కుటుంబ పరపతనొ, అమ్మాయి పొడవనో, కురచనో,సరైన రంగుకాదనో సంబంధాలు ముందుకు సాగలేదు. అసలే అబ్బాయి చాలా దూరంలో ఉంటాడు కాబట్టి, ఆ రిజెక్షన్ల పర్వంలోకూడా తన మాట చెల్లింది కాదు. ఇంటికి ప్రస్తుతాని పెద్దదిక్కైన అక్కగారు ఈ విషయంలో తమ అధారిటీని, పవరాఫ్ అటార్నీనీ చాలా చక్కగా ఉపయోగించేసుకున్నారు.
మొన్న వేసవి శెలవుల్లో ఇంటికెళ్ళిన అబ్బాయికి (అదే మా శంకర్ కి), వచ్చిన ఫోటోల్లో ఒకమ్మాయి తెగ నచ్చేసి హఠాత్తుగా ప్రేమలో పడ్డాడు. బహుశా ఇంకో రెండేళ్ళు పోతే ముప్ఫై ముంచుకొచ్చి, ముదురు బెండకాయ అయిపోతాననికూడా భయమేసిందట పాపం. ఎమైతేనేం ! తన తర్క జ్ఞానం, నాస్తికత్వం మొదలగు ప్రావీణ్యాలతో జాతకాల్నీ, అమ్మాయి కుటుంబ ప్రతిష్టల్నీ తన కుటుంబ సభ్యులచేత పక్కనబెట్టించి, పెళ్ళిచూపులవరకూ లాక్కొచ్చాడు.
పెళ్ళిచూపుల్లో విజయవంతంగా అమాయిని "నచ్చింది" అనిపించాడు. ఇక అమ్మాయికూడా ‘మౌనం అర్థాంగీకారం’ అన్నఛందంలో సరేనంది. ఇక్కడ మొదలైంది అసలు వ్యవహారం. అసలే కట్నం తీసుకోకూడదని ఒక ఆదర్శం తగలడిన మా శంకరుడు, మనసాపుకోలేక, ఆ అమ్మాయితో తన హీరోయిజం నమూనా ప్రదర్శించలేక, మొదటగా వాళ్ళక్క చెవిలో ఈ ఆదర్శం గుళ్ళికని వేసాడు. అంతే! పెళ్ళిచూపులకొచ్చిన పెద్దలతో సహా అందరినీ వాళ్ళక్క అర్జంటుగా బయల్దేరదీసి, "ఇంటికెళ్ళి చర్చించి ఫోను చేస్తామండీ" అని పెళ్ళికూతురి తరఫు వాళ్ళకు చెప్పి ఇంటికి చక్కావచ్చేసారు.
ఇప్పుడు మొదలైంది అసలు కథ.
"కట్నం ఎందుకొద్దు?" అనే ఒక యక్ష ప్రశ్న మావాడి కళ్ళెదుట కనబడ్డ ప్రతివారిచేతా అడిగించేసారు.
"దానికి నేను వ్యతిరేకిని" అని వీడి పంతం.
"ఎందుకు వ్యతిరేకం?" అని వారి రెట్టింపు.
"అదొక సామాజిక దురాచారం" అని వీడి నీతిబోధ.
"అందరూ తీసుకుంటుంటే, నీకేంటి రోగం?" అని కొందరి అక్కసు.
"అందరూ తీసుకుంటే నేనూ ఆ వెధవపని చెయ్యాలా?" అని వీడి కోపం.
"కట్నం తీసుకున్నవాళ్ళంతా వెధవలనా నీఉద్దేశం?" అని, బోలెడు కట్నం తీసుకున్న మహామహుల పేర్లూ వారి గొప్పతన్నాన్నీ ఏకరువుపెడుతూ వీడిమీద అక్షింతలూ.... రంకెలూ.... ఎకసెక్కాలూ...ఎన్నో...ఎన్నెన్నో.
ఇవన్నీ భరించలేక వీడు పెట్టాబేడా సర్దుకుని రైలెక్కి చక్కా వచ్చేసాడు. తీరా వీడు తను పనిచేసే చోటుకు చేరగానే ఏడుస్తూ వాళ్ళక్కగారి ఫోను. "సరేలేరా! నీ కట్నం వద్దంటే వద్దన్నావ్, నాకు మాత్రం ఆడబడుచు కట్నం కావాలి. అది మాత్రం వద్దనకే" అని. వీడికి మతిపొయినంత పనైంది.
వెనువెంఠనే ఒక మేనమామగారి ఫోను. "కట్నం వద్దంటే, నీ మగతనాన్ని శంకిస్తార్రా వెధవా! ఇలాంటి తింగరి వేషాలు వెయ్యకు" అని ఆయన ప్రేమపూరిత సలహా. కట్నానికీ మగతనానికీ ఈ బీరకాయపీచు సంబంధం ఎలా కలిసిందో తెలీక వీడి ఖంగారు. అక్కడినుంచీ పారిపోయైతే వచ్చాడుగానీ, ఈ సమస్యల మధ్యన పనీ చెయ్యలేక, ఆ అమ్మాయిఫోటో చూసుకుంటూ, చిన్నసైజు దేవదాసులా ఒక కొత్తవాలకంగా తయారయ్యాడు. ఈ సమాధానం లేని సమస్యను మరోవైపునుండీ నరుక్కొద్దామన్న నిర్ణయానికొచ్చి, కాబోయే పొటెన్షియల్ మామగారికి ఒక ఫోనుగొట్టాడు.
ఎలా మాట్లాడాలో, అదీ కట్నం విషయం ఈ పెద్దాయనతో ఎలా చర్చించాలో తెలీక, కొంత అఖ్ఖరకు రాని లోకాభిరామాయణం తరువాత మెల్లగా, "అసలు కట్నం తీసుకునే ఉద్దేశం నాకు లేదండీ" అని కుండబద్దలు కొట్టకుండానే అసలు విషయం తెగేసాడు మా శంకరుడు. దానికాయన ఎస్.వి. రంగారావు గారిలా పెద్దరికంతో నవ్వి, "మీరడక్కపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది నాయనా. మాదానికి ఇంత అని ఆల్రెడీ బ్యాంకులో వేసే ఉంచాను" అని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఈ ముక్కతో మావాడి ఆదర్శానికికొక ఆకాశమంత చిన్న గండి పడింది. కొన్ని ధర్మ సందేహాలూ అర్జంటుగా పుట్టుకొచ్చాయి. "అడక్కుండా ఇస్తే దాన్ని కట్నం అంటారా?", "నేను వద్దన్నా వాళ్ళిస్తే, నా అదర్శానికొచ్చిన ఢోకా ఏమైనా ఉందా?", అనేవి ఆ సందేహాల్లో కొన్ని మాత్రమే.
ఎలాగూ కాబోయే మామగారితో ఈ విషయం చర్చించాడుగనక, మిగిలింది అమ్మాయే అనుకుని ఆ కొరతా మా శంకరుడు తీర్చుకున్నాడు. నానాతంటాలు పడి వాళ్ళింటి ఫోనులో ఆ అమ్మాయి గొంతున ప్రేమగా వింటూ తన ఆదర్శాన్ని కాస్త గర్వంగా చెప్పుకొచ్చాడు. దానికి ఆ అమ్మాయి సంతోషించకపోగా "అలా అంటే ఎలాగండీ? మా అక్కకి పది లక్షలిచ్చారు. అదీ టీచరుకి. మీరైతే ఏకంగా లెక్చరర్ ఆమాత్రం ఇవ్వకపోతే విలువేముంటుంది" అని బాధగా అన్నదట. అంతే ఈ దెబ్బకి మావాడు ఢమాల్! వాడి పని టకాల్, టకాల్ అయికూర్చుంది.
కట్నానికి కాకపోయినా ఆడబడుచు కట్నానికి సై అనాలి. పూర్తిగా ఏమీ వద్దంటే తన మగతనానికి నీళ్ళొదులుకోవాలి. ఆడగకపోయినా ఆడపెళ్ళివారు డబ్బిస్తే దాన్ని కట్నమే అనుకోవాలి. వద్దంటే ఇటు కాబోయే మామగారికీ, కాబోయే పెళ్ళాం సామాజిక గౌరవానికొక దెబ్బ. ఇలా తన ఆదర్శం వల్ల సాఫీగా పెళ్ళి జరక్కపోగా. మరిన్ని సమస్యలొచ్చిపడ్డాయి.
ఈ సమస్యలన్నీ నాకు ఏరువుపెట్టి, "సలహా ఇవ్వరా గురుడా" అంటే, "తాట తీస్తా వెధవా! కుటుంబంకోసం పెళ్ళికావాలంటే, కట్నం తీసుకుని సుఖపడు. ఆదర్శంగా పెళ్ళాడాలంటే, చుట్టుపక్కల దొరికినమ్మాయిని దొరికినట్టు ప్రేమించేసి పెళ్ళికి సరే అనిపించూ, మీ పెళ్ళి హైదరాబాదు ఆర్యసమాజ్ లో జరిపించడానికి పరుగు సినిమాలో అల్లుఅర్జున్ లాగా ఇంకొంతమంది స్నేహితుల్ని తీసుకొచ్చి అరెంజిమెంట్లు చేసి ఆశీర్వదించేస్తా" అని చెప్పా.
పాపం ఇప్పుడు మా శంకరుడు ఏనిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాలి!
Posted by
Kathi Mahesh Kumar
at
10:50 AM
53
comments
Labels: సమాజం

