Saturday, June 28, 2008

I think in తెలుగు !


ఖమ్మం జిల్లాలో ఒక UNICEF ప్రాజెక్ట్ కోసం, నా మొదటి పెద్ద ఇంటర్వ్యూ జరిగింది. ఈ తంతు మొత్తం ఇంగ్లీషులోనే జరిగింది. అక్కడకు వచ్చిన యునిసెఫ్ అధికారి ఒరియా అవ్వడం ఒక కారణమైతే, మన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే చాలా ఇంటర్వ్యూ లలో ఉపయోగించినట్లే, ఇక్కడా ఆంగ్లాన్ని ఎడాపెడా ఉపయోగించేసారు.



మనమూ బాగా మాట్లాడే కాలేజీ, యూనివర్సిటీల్లో కాస్త చదువును చట్టుబండలు చేసొచ్చిన బాపతుకాబట్టి, సాధారణంగా వాడే ఆంగ్ల పదాలతోపాటూ, డిక్షనరీ చూస్తేనేగానీ అర్థం కాని క్లిష్ట పదాలు కొన్ని ఉపయోగించేసి, ఛాతీని కాస్త పెంచి మరీ వారెదుట సెటిలైపోయాం. నా వ్యవహారం వారికి నచ్చిన ఫీలింగ్ పెట్టి, ఒకరి మొఖాలొకళ్ళూ చూసుకుని అంగీకార సూచకం తలలూపేసారు. ఇంతలో వారికి హఠాత్తుగా ఒక ధర్మ సందేహం వచ్చింది...వారిలో ఒక పెద్దాయన నన్ను సందేహంగా చూస్తూ "Do you know Telugu?" అన్నాడు. తను చెప్పింది అర్థమయ్యేలోపల నా నోటివెంట అసంకల్పితంగా ఒక సమాధానం వచ్చింది "I think in Telugu" అని. నా సమాధానం విన్న వాళ్ళ మొఖాలు అప్పుడే స్విచ్ వేసిన ట్యూబ్ లైట్లల్లే కొద్దికొద్దిగా వెలిగి...హఠాత్తుగా దేదీప్యమానమయ్యాయి. అంతే, నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది.



ఈ సమాధానం ఇచ్చి, బయటొచ్చిన తరువాత నా అసంకల్పిత సమాధానంలోని లోతును కాస్త బేరీజు చెసాను. 8 వ తరగతి వరకూ పూర్తి తెలుగు మాధ్యమం (medium) లో చదివినా, 9-12 వ తరగతిలో ఇంగ్లీషు మాధ్యమం లోకి మారాను. 10 లో తెలుగు పరీక్షలు రాసిన తరువాత తెలుగు వాచకాన్ని అస్సలు ముట్టలేదు. ఇక కాలేజిలో చేసింది ఆంగ్ల సాహిత్యంలో మేజరు, యూనివర్సిటీ లో చేసింది Development Communication, అదీ పక్కా ఆంగ్లంలో. "మరి ఎనిమిదోతరగతి వరకూ, అవసరాలు తప్ప ఆలోచనలు చేసెరగనుకదా! మరి నా ఆలోచనలు తెలుగులోఎందుకున్నాయి?" అన్న తీవ్రమైన సందేహం నాకొచ్చేసింది.



తరచి చూస్తే, నాకు తోచిన సమాధానం ఇది. చిన్నప్పటి నుండీ, ఎప్పుడు ఈ తెలుగు పాఠాల నుంచీ తప్పించుకుంటానా అని చూడటం తప్ప తెలుగును, ముఖ్యంగా పాఠాల తెలుగును ప్రేమించి ఎరుగను. ఇక తెలుగు మీడియం అంటారా, లెక్కల్లో ‘సమితులు’ కన్నా ‘సెట్స్’ అనే పదం బాగా అర్థమయ్యేది, సైన్సులో ‘భాస్వరం’ అన్న భారీపదంకన్నా ‘ఫాస్ఫరస్’ అన్న తేలిక పదంలో నాకు సౌలభ్యత కనిపించింది. అంటే చాలామంది భాషావేత్తలు ఎలుగెత్తి చాటుతున్న మాతృభాషలో చదువు నా బోటివాడికి, తెలుగు కంటగింపుగానే తప్ప మనసుకింపుగా ఎప్పుడూ అనిపించలేదు.



మరి "ఇంత లావు మూర్ఖుడికి, తెలుగులో ఆలోచించే ఝాడ్యం ఎక్కడినుండీ అబ్బిందా? అనుకుంటున్నారా !" అక్కడే ఉంది నాకు స్ఫురించిన కిటుకు. చిన్నప్పటి నుండీ తెలుగు పాఠాలంటే పారిపోయినా, కథలంటే మాత్రం పడి చచ్చేవాడిని. చందమామ, బాలమిత్ర, బాలభారతి, బాలజ్యోతి, బాలరంజని లాంటి మాస పత్రికలలోని కథల్ని ఔపోసన పట్టడానికి శ్రమించేవాడిని. కాస్త వయసొచ్చాక ‘పాకెట్ పుస్తకాలు’ అని కొన్ని జానపద కథలున్న పుస్తకాలు, దానితోపాటూ మధుబాబు, పానుగంటి, కొప్పిశెట్టి ల షాడో, బుల్లెట్,కిల్లర్ కథలూ చదివాను. ఈ పుస్తకాలు నా భూగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటూ, కాస్త నా మెదడుయొక్క imaginative extent ని పెంచాయనిపించింది. ఒక సహజ ప్రగతి రూపంగా నేనూ యండమూరి నవలలు చదవడం ప్రారంభించాను. క్షుద్రసాహిత్యం అని అప్పట్లో వచ్చిన ఇతగాడి సాహిత్యాన్ని నిరసించినా, నేను మొదట చదివిన తన నవలలు ‘ఋషి’, ‘పర్ణశాల’. వీటిల్లో తను పరిచయం చేసిన మానవ సంబంధాల fragility నన్ను ఆ వయసులోనే చాలా ఆలోచనలకు పురికొల్పింది.


యండమూరి తో ఆరంభించి మల్లాది, యుద్దనపూడి, సూర్యదేవర, వేంపల్లి, మేర్లపాక...ఇంకా ఎందరో పాప్యులర్ రచయితల పుస్తకాలు నిరాటంకంగా, దాదాపు రెండురోజులకొకటి చొప్పున ప్రతి శెలవుల్లో సాధించేసాను. ఎంత వేగంగా చదివేవాడినంటే, నాకు పుస్తకాలు అద్దెకిచ్చే షాపు వాడు నామీద అభిమానంతో "ఎక్స్ ప్రెస్" అని పిల్చేవాడు. కొన్ని సార్లు ఆలస్యమైనా ఎక్కువ డబ్బులు అడిగేవాడు కాదు.



ఇక మైసూరు కాలేజీలో "ఆంగ్ల సాహిత్యంతో ప్రక్రియని తెలుసుకో, మీ భాషా సాహిత్యం చదివి అనుభవించు" అన్న సూత్రాన్ని నాకు మా ఫ్రొఫెసర్ తెలియజెప్పిన తరువాత, చలం నుంచీ తిలక్ వరకూ, విశ్వనాధ సత్యనారాయణ నుంచీ బుచ్చిబాబు వరకూ చాలా మందిని చదివాను. స్వంత ఆలోచనలు ప్రారంభమయ్యే తరుణం అదే కాబట్టి, ఆంగ్ల భాషలో నా పాఠాలు సాగినా, నా ఆలోచనా స్రవంతి మాత్రం తెలుగులో జరిగేది. నా సమాజం, దాని ఆలోచనలూ, సంస్కృతి మర్మాలూ, సామాజిక పోకడలూ సాహిత్యం ద్వారా నేను తెలుసుకొగలిగాను కాబట్టే తెలుగులో ఆలోచించి, ఆంగ్ల సాహిత్యానికి కూడా నావైన అర్థాలు (interpretations) చెప్పగలిగేవాడిని. ఉదాహరణకు Sigmund Freud ప్రకారం "పాము" sex కు symbol అంటే, మాకు మట్టుకూ అదొక దేవత అని ధైర్యంగా ఎద్దేవా చెయ్యగలిగే స్థాయికి నా తెలుగు ఆలోచనలు చేరుకున్నాయి.


అందుకే నామట్టుకూ నాకు తెలుగు మీడియం చదువులకూ, తెలుగు భాషా ప్రగతికీ అస్సలు సంబంధం లేదు. ఇంగ్లీషు మీడియం చదువుల వల్ల మన భాషకు వచ్చే తీవ్రనష్టమూ లేదు. రావాల్సిన నష్టం ఇప్పటికే మన భాషా బోధన, పిల్లలను తెలుగులో కథలుకూడా చదవమని ప్రోత్సహించలేని మన మారుతున్న సామాజిక రచనల వల్ల జరిగిపోయాయ్. అందుకే, భావవికాసం రాకున్నా, ఉద్యోగ వైకల్యం రాకుండా కాపాడే ఇంగ్లీషు చదువులే మిన్న. ఇక తెలుగుని రక్షించాలంటే దాన్ని, మనకు పాఠాలు చెప్పినట్లు చేదు మాత్రలు మింగిచినట్లు కాక ప్రేమగా ఉపయోగించే విధానాలు పిల్లలకి నేర్పుదాం.


తెలుగు భాషకు జై!
ఇంగ్లీషు మీడియం చదువులకు జై! జై!!

20 comments:

మేధ said...

నిజమే తెలుగు మీడియంలో చదువుకి, తెలుగు ప్రగతికి పెద్ద సంబంధం లేదు అనిపిస్తుంది.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయాలి అంటే, ఇంగ్లీష్ అవసరమే.. కాబట్టి ఆ మాధ్యమంలో చదవక తప్పదు.. కానీ స్కూళ్ళలో మరీ తెలుగు మాట్లాడితే పెద్ద నేరం అనే పరిస్థితిలో మార్పు రావాలి.. మా ఫ్రెండ్స్ కొందరు చదివినవి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళే కానీ,వాళ్ళకి తెలుగు లో చాలా పాండిత్యం ఉంది..స్కూళ్ళ దాకా ఎందుకు ఇంట్లో ఏమైనా తక్కువా... బెంగళూరు లాంటి చోట్ల చిన్న చిన్న పిల్లలు(1/2 years) మాటలు కూడా సరిగ్గా రావు, వాళ్ళతో పెద్దవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు!!! నాకు ఎప్పుడూ అర్ధం కాదు.. మన ఇంట్లో మనం మాతృభాష మాట్లాడుకుంటే తప్పేంటి..?! ఇప్పటి పిల్లలు ఎంతమందికి చందమామ, బాలమిత్ర గురించి తెలుసు..? ఏ పిల్లలైనా కాస్త ఇష్టం తో చదువుతున్నా, ఆ పిచ్చి పుస్తకాలు ఎందుకు అనే తల్లిదండ్రులు కోకొల్లలు..

జ్యోతి said...

నిజమే మహేష్. ఈరోజు ఇంగ్లీషు చదువు తప్పనిసరి ఐంది. కాని పిల్లలకు తెలుగు రావట్లేదు అంటే అది పెద్దల తప్పు. చిన్నప్పటినుండి వాళ్లకు ఇంట్లో తెలుగు మాట్లాడుతు, చిన్న చిన్న కథల పుస్తకాలు చదివిస్తూ,ముఖ్యంగా తెలుగు దినపత్రిక చదవడం అలవాటు చేయాలి. స్కూల్లో తెలుగు కాకుండా స్పెషల్ ఇంగ్లీశ్ ఇప్పిస్తారు. అది తప్పు. ఇక స్కూలులో బలవంతంగా చదివిన తెలుగును మర్చిపోనివ్వకుండా చేయడం తల్లితండ్రుల బాధ్యత. బయట ఇంగ్లీషులో మాట్లాడటం తప్పనిసరి. అలాగని తెలుగు మర్చిపోవడం న్యాయమా..కాలీజీ పిల్లలకు తెలుగు అంటే ఒక అంటరాని వస్తువులా అయింది. ఇంకో ముఖ్య విషయం ఇక్కడ చెప్పుకోవాలి. మాటలు పలకడం మొదలుపెట్టిన పసికందులకు ఇంగ్లీషులోనే మాట్లాడే తల్లితండ్రులు - ఈ పద్ధతి మానండి.పిల్లలకు ఏదైనా పదం నేర్పించాలనుకుంటే తెలుగు, ఇంగ్లీషు రెండూ బాషలలో నేర్పించండి. అర్ధం చేయించండి.

పెదరాయ్డు said...

తెలుగులో/తో ఆలోచించటం అన్నది ఒక కవితాత్మక భావన. కొంతకాలం క్రితం వరకూ నేనూ ఇలాగే అనుకునేవాడిని. కాని, కొంత పరిశీలన తరువాత గమనించింది ఏంటంటే, ఇది సందర్భానుసారం జరిగే ప్రక్రియ. ఉదాహరణకు ఇంటి విషయాలు గురించిన ఆలోచనలు మాతృ భాషలోనే సాగుతాయి. ఉద్యోగ(సాఫ్టువేరు) సంభంద అలోచనలు ఇంగ్లీషులోనే..హింది వాళ్ళతో మాట్లాడుతున్నపుడు హిందీనే..కాకపొతే చిన్న కొత్త భాష నేర్చుకుంటున్నపుడు ఇది సాధ్యం కాదు. అలవాటయేంత వరకూ మన వ్యావహారికభాష నుంచి తర్జుమా అవుతుంటుంది. మీరు కూడా గమనించండి.

మీనాక్షి said...

meeru cheppindi aksharala nijam...
nenu kuda TM..
chala ibbandi padutunna..ee angla bhaashato...
english maatladdam ippudu avasaram...
meerannatte...
kaani konta mandi telugu maatladite chinnatanaga bhavistunnaru..meeku telusaa???...katti gaaru..
maroka maata emitante...telugu vachina ranattu...konni padaalanu..like..shankarudu ni sankarudu...shylaja ni sylu..ila palakadam ...chestunnaru..adenTo i dont know.
.....................
telugu maatlaaddam kontamandi chinnatananga...bhaavistunnaru...ee vishayame..naaku badhaga undi...

Purnima said...

నేను తెలుగులో ఆలోచించాలి అంటే ఒ.కే కానీ.. అవి వేరే వారికి తెలుగులో చెప్పాలంటే చచ్చేంత చావు వస్తుంది. నేనెందుకు బాగా రాయలేకపోతున్నా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు.. నాకు నా 18 years english medium education అనే భావం వద్దన్నా పోవటం లేదు. :-((

Kathi Mahesh Kumar said...

పైన వచ్చిన కొన్ని కామెంట్లను దృష్టిలో ఉంచుకుని కొంత వివరణ ఇవ్వడం అవసరం అని నా భావన. ‘తెలుగులో ఆలోచించడానికీ’, ‘తెలుగు భాషలో ఆలోచించడానికీ’ కొంచెం తేడా ఉందని గమనించాలి.

మొదటిది తెలుగు మానసికతకు(mentality) సంబంధించింది. రెండోది బౌతిక భాషకు సంబంధించింది.ఈ రెండూ కవలపిల్లలే, చాలా వరకూ కలిసే ఉంటాయి. కొన్ని సందర్భాలలో కాస్త విడిగా ఉన్నట్లు అనిపిస్తాయి. పెదరాయ్డు గారు బహుశా ఆతేడానే చెప్పడానికి ప్రయత్నించారు.

@మేధ, తెలుగుతనాన్ని బ్రతికించుకుంటే తెలుగు భాషను బ్రతికించినట్టే. నువ్వన్నట్లు దానికీ ఇంగ్లీషు మీడీయానికీ సంబంధం అస్సలు లేదు.మన సంస్కృతిలో ఆ సంకల్పం చాలా స్పష్టంగా తెలుస్తోంది. బహుశా సమస్య అదయ్యుండచ్చు.

@జ్యొతి,మీరు చెపినట్టు తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది.

@ మీనాక్షి, నువ్వు చెప్పిన తెలుగు మాట్లాడాలంటే నామోషీ విషయం మీద మరో టపా రాయాల్సిందే.

@పూర్ణిమ, ఆ కాస్త gap మనలాంటి ఇంగ్లీషు మీడియం తెలుగోళ్ళకు ఉండేదే. ప్రయత్నిస్తే దాన్ని ఖచ్చితంగా అధిగమించగలం.

Bolloju Baba said...

nice discussion.
ఈ అంశానికి దగ్గరగా ఉండే విషయంపై క్రింది ఇవ్వబడిన బ్లాగులో మంచి చర్చ జరిగింది. ఆశక్తి కలిగిన వారు చూడవచ్చును.

http://ajitv.blogspot.com/2008/06/blog-post_24.html?showComment=1214397960000

http://ajitv.blogspot.com/2008/06/blog-post_23.html

భావకుడన్ said...

మహేష్ గారు,

ఇది భలే బావుందండి. నా బ్లాగులో జరుగుతున్న చర్చ ఇక్కడ కూడా జరగటం.

ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే రెండు వేరు వేరు సమస్యలను జనులు కలిపేస్తున్నారు అని నా అభిప్రాయము. "తెలుగు భాష మాట్లాడక పోవటము, దాన్ని చిన్న చేయటము" అన్నది ఒక సమస్య, "ఆంగ్లము మాద్యమముగా ఉండాలా అన్నది" ఇంకో సమస్య.

ఆంగ్ల మాధ్యమములో బోధన జరగ కూడదు అనే వారు పోరబడుతున్నది ఎక్కడ అంటే ఈ మాతృభాషకు జరుగుతన్న అవమానం కేవలం ఆంగ్లము నేర్చుకోవటం వల్లనే అని అనుకోవటం.

కాని నిజంగా మన మాతృభాషను చులకన చేస్తున్నది, తమ తమ సంస్కారాన్ని బట్టి అంతే కాని ఆంగ్లము ఏమి "మీ భాషను చులకన చేయండి" అని చెప్పలేదు అని గ్రహించట్లేదు.

మీనక్షిగారు,
మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదండి. "శంకరుడు" అనేది మన అచ్చ తెలుగులో పలికేటపుడు "sankarudu" ane పలకాలి "shankarudu" అనకూడదు , అలాగే "శైలజ" అంటే "shailaja" అని పలకగూడదు "sailaja" అనే పలకాలి.

మన అక్షర మాలలో
"స" = "sa" అని పలకాలి,
కాని "శ" కూడా "sa" అనే పలకాలి. పలికేటపుడు "స్య" అన్నట్టు కొంచం ద్వని వస్తుంది దాన్ని పూర్తిగా మనం రాతల్లో వివరించలేము.

"మనిషి" లోని "షి" ఉంది చూశారూ--దాన్ని ఒక్కటే "sha" అని పలకాలండి . "స" అనకూడదు.

"శివుడును" మీరు "శివుడు" అనకపోతే మానేయండి "షివుడు" అనే పిలవండి, మీ ఇష్టం. కాని "sivudu" అని అసలైన ఉచ్చారణ చేస్తున్న వారిని "shivudu" అని అనట్లేదని మాత్రము ఆపేక్షించకండి దయచేసి.

అది ఎలా అవుతుందంటే "ultaa chor kotvaal ko daate" అని హిందీలో ఒక సామెత ఉంది. అలా అన మాట.

భావకుడన్ said...

పైన last but one para లో ఆక్షేపణ బదులు ఆపేక్షణ అని వాడను- తప్పును మన్నించండి.

Sankar said...

‘తెలుగులో ఆలోచించడానికీ’, ‘తెలుగు భాషలో ఆలోచించడానికీ’ కొంచెం తేడా ఉందని గమనించాలి ..... తెలుగు కూడా భాషే కదా(మొదటినుండీ తెలిసిన భాష)..

ఏదైనా ఈ విషయంలో మీతో అంగీకరిస్తున్నాను. మొదట్లో నేను కూడా ఎదుటివారు ఏం అడిగినా మనసులో తెలుగులో తర్జుమా చేసుకొని దానికి సమాధానం కూడా తెలుగులోనే అనుకొని ఆంగ్లమునకు తర్జుమా చేసి చెప్పేవాన్ని, .. కాని రాను రాను పెదరాయుడుగారు చెప్పినట్టు english conversation జరుగుతున్నప్పుడు englishలోనే ఆలోచించడం అలవాటైపోయింది. ఈ తేడాను నేను స్పస్టంగా గమనించాను నాలో. అందరిదీ ఇదే పరిస్ధితి అనుకొంట.

@భావకుడన్
చాలామంది శ ను englishలో వ్రాసేప్పుడు sa లేదా sha రెంటినీ వాడతారు. అదే స కి ఐతే saని ష కి ఐతే shaని వాడతారు. మీనాక్షిగారు english scriptలో వ్రాయడం వల్ల మీరు కన్‌ఫ్యూజ్ ఐనట్టున్నరు. అసలు ఉద్దేశ్యం శంకరుడ్ని సంకరుడు అని పిలుస్తారని కాబోలు ఆమె చెప్పదలచుకున్నది ( ఇది నాకు స్వీయానుభవం , నా పేరు spelling sankar అవ్వడంవల్ల చాలామంది north indians సంకర్ అని పిలిచేవారు). అలానే శైలజ విషయంలో కూడా సైలజ అని పిలుస్తుంటారు చాలామంది. ఇక స శ ష లను పలికేందుకు మనం ఉపయొగించే ట్రిక్కేంటంటే 'స ' పలికినప్పుడు నాలుక చివర్ని, 'శ ' పలికేప్పుడు నాలుక మధ్య భాగాన్ని, 'ష ' కైతే లోపలిభాగాన్ని వాడతాం. కావాలంటే ఒకసారి test చేసుకోండి.

కొత్త పాళీ said...

అభినందనలు మహేశా. చాలా బాగా రాశారు.
తెలుగెందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్నకి సమాధానంగా ఈ టపా ఒక మేనిఫెస్టో.

Kathi Mahesh Kumar said...

@బాబా గారూ, నెనర్లు
@భావుకుడన్ గారూ, ఇప్పుడిది హాట్ టాపిక్కేకాక అవసరమైన విషయం కూడా. అందుకే ఎక్కడైనా ఈ చర్చలు తప్పవు.

@శంకర్, తెలుగు భాష, సంస్కృతి ఒక్కలాగే అనిపించినా, కూసింత తేడా ఉంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

@కొత్తపాళీ గారూ నెనర్లు

The Communicator said...

telugu lo maatlaadina alochinchina...how far we are able to communicate. Telugu lo maatladithay neram. today people who know telugu are paid more.

You can take my example. nOne of them in my department know telugu. but we need to communicate where I am ahead of others and gain a upper hand.

Today in telugu media people with excellent telugu are paid 12 lakhs per annum with 5 years of experience.

S said...

Hmm.... good post :)

Anonymous said...

@మహేష్ : నాకు చాలా తృప్తిగా ఉంది మహేష్! హాయిగా ఉంది. థాంక్స్.

ఇవ్వాళ్టికి నిద్రపోయి,రేపు మాపో ఎప్పుడో టైము చూసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడతాను.

థాంక్యూ వెరీ మచ్.

Ramani Rao said...

నా బడి చదువంతా తెలుగు మాధ్యమం కాబట్టి ఈ ఆంగ్లం విషయంలో ఇప్పటికి ఇబ్బంది పడ్తునే ఉన్నాను. ఆంగ్లంలో మాట్లాడేప్పుడు తెలుగులో ఆలోచిస్తున్నాను అన్న విషయం నాకు అవగాహనకి రాలేదు మీ టపా చదివేవరకు. ఇదో కొత్త విషయం "అవును కదా" అని అనుకొన్నాము. తెలుగు , ఇంగ్లీషు ఆవశ్యకతల గురించి చాలా బాగా చెప్పారు..

Kathi Mahesh Kumar said...

@రేరాజు: ఈ టపా నేను సరిగ్గా ఒక సంవత్సరం క్రితం రాశాను. ఆలోచన దాదాపు ఆరుసంవత్సరాల క్రితం వచ్చింది. కాబట్టి తెలుగు ఆలోచనకొచ్చిన ఢోకా ఏమీ లేదు. కానీ మరింతమందికి ఆ ఆలోచనలు రాని వ్యవస్థని మాత్రం మనం చేజేతులా తయారుచేసుకుంటున్నాం. అదే నా బాధ.

@రమణి: ధన్యవాదాలు. ఆలోచనల్నికూడా హేతుబద్ధంగా ప్రశ్నించుకుంటేగానీ మన ప్రవర్తనకు సమాధానాలు దొరకవు. అలా చెయ్యడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. కొన్ని సమాధానాలు దొరుకుతాయి. కొన్ని దొరకవు. ప్రయత్నం మాత్రం చెయ్యాల్సిందే.

Sudhakar said...

చాలా నిజం...ఈ టపా నాకు చాలా తృప్తినిచ్చింది. హమ్మయ్య నాకు తోడు కనీసం ఒకరున్నారు ఈ విషయం లో.

Anonymous said...

తెలుగు తలపు.
తెలుగు తెలుపు
తెలుగు వెలుగు..
తెలుగు తిను
తెలుగు విను
తెలుగు అను.
పలుకగ పలుకగ
తీయనగును..
మా తెలుగు తల్లికి
మల్లెపూదండ.

Anonymous said...

తెలుగు తలపు.
తెలుగు పలుకు
తెలుగు వెలుగు..
తెలుగు తిను
తెలుగు విను
తెలుగు అను.
పలుకగ పలుకగ
తీయనగును..

-మా తెలుగు తల్లికి
మల్లెపూదండ.