Sunday, May 11, 2008

నా మొదటి కథ, మొదలెట్టా !!!


జీవితం లో నేను రాస్తున్న మొదటి కథ ఇది. వ్యాసంగం అప్పుడప్పుడూ వెలగబెడుతున్నా, కథలు రాశే ధైర్యాన్ని ఎప్పుడూ తెచ్చుకోలేదు. ఎందుకంటారా? వ్యాసం లో ఐతే మనం చెప్పాలనుకుంది చెప్పేసి, తూచ్! అనేసుకోవచ్చు. కానీ కథల్లో అలాకాదు. పాత్రలను సృష్టించాలి, వాటికి ప్రాణప్రతిష్ట చెయ్యాలి,ఆలోచనల్ని నింపాలి కథను నడిపించాలి. అంతా చేసిన తరువాత ఒక్కోసారి సృష్టించిన పాత్రలు "నువ్వు మమ్మల్ని నడపడమేమిటి?"అని, తమ కథ తామే నడిపించేసి, కథకుణ్ణి ఇబ్బంది పెట్టేస్తాయి. ఇంత లావుశ్రమ మనకెందుకులే అని నేను సర్దుకు పోతున్నా, అరవింద్ అనే నా మిత్రుడు తేరగా ఇంటర్ నెట్ దొరకబుచ్చుకుని (సాప్ట్ వేర్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు లెండి!) గూగుల్ టాక్ లో నన్ను కథ రాశెయ్యమని తెగ పోరేస్తున్నాడు. ఆన్లైన్ లో గ్రీన్ లైటు కనపడితే, వీడేనేమో అని ఒక్కటే దడ.

ఈ ‘దడ’బిడ తప్పించుకుందామని, కథ రాశేద్దాంలే! అనుకున్నా. కానీ ఈ మధ్య నేను చదివిన బ్లాగుల్ళొని కథలు గుర్తొచ్చి, మరింతగా గుండె ఠారెత్తింది. ఏమి కథలు, ఏమి విషయం,ఏమి శైలి. నా సామిరంగా ! పత్రికలూ,పబ్లిషింగూ వదిలి, గుడెలుతీసిన కథా పోటుగాళ్ళూ,పోటుగత్తెలూ దండుగా తెలుగు బ్లాగులమీద దండెత్తినట్టుగా ఉంది కత. ఈ మహాయుద్ధం లో వంటకత్తెట్టుకుని "నేనూ సైనికుడినే, కథా కదనరంగానికి వారసుడినే!" అనడం ఎట్టా? అని నాలోనేను ఆత్మారాముడితో డిస్కషన్ లో ఉంటే, అదే మిత్రుడు, మరో సలహా పారేశాడు. అదేమిటయ్యా అంటే, "నీ అభిప్రాయాలనే కథా పాత్రలుగా మార్చి, కథ రాశెయ్యీ" అని. కానీ, ఇలా రాస్తే అది ఒక చర్చా పత్రమవుతుందే గాని, కథ అవుతుందా? అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇంతా ఆలోచించే బదులు, రాయడం మెదలెడితే విషయం తేలిపోతుందిగదా... అనిపించి ఇప్పుడే మొదలెట్టా.

"ఇంత ఉపోద్ఘాతం రాయకముందే ఎందుకు? రాసిన తర్వాత కథని టపా వెయ్యక!" అని మీరనుకొవచ్చు. కానీ ఇదంతా అడ్వాన్స్ గా ఎందుకు చెబుతున్నానంటే, సిగరెట్ మానాలనే వాడు పదిమందికి చెప్పి మానాలంటారు పెద్దలు. దీనివలన, ఒకవేళ ఈ మానవుడు మళ్ళీ కర్మగాలి సిగరెట్ అంటిస్తే,ఎత్తిపొడవడానికి చుట్టూ ఉన్నావాళ్ళు ఉపయోగపడి, వాడి మాన్పుకు తోడ్పడుతారని. అదే విధంగా నేను కథ రాసి, దైర్యం చాలకనో లేక తప్పింఛుకోవాలనో మరో రెండురోజుల్లో పోస్ట్ చెయ్యకపోతే, మీరు ఎత్తిపోడవడానికీ,గుర్తుచెయ్యడానికీ ఉంటారని నా ఆశ. సాహసం శేయరా డింభకా! కథ దక్కుతుందని నాకునేనే చెప్పేసుకుని దూకేస్తున్నా!

7 comments:

సుజాత said...

నిన్న నేను సినిమా కథలోకి దూకెయ్యండి అనగానే మీరు ఇవాళ నిజంగా కథలోకి దూకేశారే! జాగ్రత్త! మీ కథ మాకు కొన్ని అంచనాలున్నాయి మరి!

కొత్త పాళీ said...

మీ గూగుల్ ఐడీ చెప్పండి. ఎప్పుడాన్నా మీ అరవింద్ మర్చిపోతే నేనుంటా మిమ్మల్ని కథ రాయడానికి ఎగదోసేందుకు. :-)

Kathi Mahesh Kumar said...

సుజాత & కొత్త పాళీ గారు,

కథ రాయడం ఇంత కష్టమేంటడీ బాబూ!!!

డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ కుస్తీ లా ఉంది.ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టూ "కూసాలు కదులుతున్నాయ్". వివరణ ఇవ్వలా,సంభాషణలు చెప్పించాలో తెలీక తల పట్టుకు కూర్చున్నా.ఇక నా పాత్రలు అల్రెడీ నన్ను వెధవాయ్ ని చెసేస్తున్నాయ్. ఒక్కటీ మాటవినదేంటండి? ఉన్నవి రెండే కానీ, ఇద్దరు పిల్లలు చెసే మారాం చేసేస్తున్నారు.

హరి భగవంతుడా! ఈ కథలెలా రాస్తారు తండ్రీ?

teresa said...

ఉపోద్ఘాతం బావుంది!

మంజుల said...

మరే! కధంటే మాములు విషయం కాదు. నేనెప్పుడు కధ రాయబోయినా అది చివరికి కవితైపోతుంది. all the best.

Srinivas said...

మీ కథలోని పాత్రలు మిమ్మల్ని కథ రాయనివ్వకుండా అడ్డెలా పడుతున్నాయో రాస్తే అదో కథ!

S said...

మహేష్ గారు...చూడండి...మీ బ్లాగుకి వచ్చాను...మళ్ళీ రాలేదనేరు.. :)
కథ రాయడం మరీ కష్టమేమీ కాదు...మీరు రాయండి..అదే దాని దోవలో వెళ్ళిపోతుంది.. :)
Gud luck!