Saturday, May 10, 2008

లండన్ లో తెలుగు ప్రేమోన్మాదం !

ఓ జ్యోతిర్మయి, ఆ...లిస్టులో చేరిపోయింది. ప్రేమించుకున్నారట, ఇప్పుడు ఆ అమ్మాయి మనసు మార్చుకుందని చంపేసాడుట. ఎంతదారుణం !!!

విజయవాడ, కరీంనగర్ ఇప్పుడు లండన్, ప్రదేశాలలో మార్పే తప్ప ‘తెలుగు ప్రేమ’ వికారాల్లో ఏమీ మార్పులేదు. అసలీ సంస్కృతి ఎక్కడినిండీ వచ్చిందని చాలా చర్చలు జరుగుతున్నాయ్. కొందరు సినిమాల మీద దుమ్మెత్తి పోస్తే, ఫెమినిస్టులు పేరుకుపోయిన "పితృస్వామిక భావజాలాన్ని" కారణమంటున్నారు. వామపక్షాలు ఈ నేరాన్ని "కంస్యూమరిజం" మీదకునెడితే, బీజేపీ దీన్నే "పెరుగుతున్న పాశ్చాత్యసంస్కృతికి చిహ్న"మని తీర్పుచెబుతున్నారు. అసలు సమస్యకు మూలం ఎక్కడో వీరికి అసలు తెలియకపోయైనా ఉండాలి, లేదా వీరు చెబుతున్న అన్నికారణాలూ నిజమైనా అయ్యుండాలి. ఈ చర్చలన్నింటిలో నేను గమనించింది ఒక్కటే, ఎక్కడా ‘ఆ వయసు’ వారిని చర్చల్లో భాగస్వాముల్ని చేయకపోవడం. అసలు ఈ సమస్యకు కారకాల్ని అనుభవిస్తున్న యువతనడిగి తెలుసుకునే ప్రయత్నాలు ఎక్కడాచేసినట్టు కనపడకపోవడం.

ఒక తెలుగు ఛానల్లో పనిచేస్తున్న మిత్రుడిని తో ఈ మాటే అడిగితే తను చెప్పిన సమాధానం, "ఆన్ కేమరా మాట్లాడ్డాలంటే, వీరికి తల్లిదండ్రుల భయం, ఇక ఈ విషయం గురించి సృష్టంగా అభిప్రాయాలు వీరు చెప్పలేకుండా ఉన్నారు" అని. నిజమే, కానీ ఒకసారి తను చెప్పిన వాక్యాన్ని నెమరువేసుకుంటే అందులో అసలు సమస్య తెలుస్తోందనిపించింది. ఈ వయసు వారికి ప్రేమపై ఉండేవి అభిప్రాయాలు కాదు ‘నమ్మకాలు’. ఇక తల్లిదండ్రులపై ఉండేవి భయాలుకాదు, "మా పిల్లలు చాలా అమాయకులు, ఇలాంటి విషయాలు వీరికి తెలియదు" అని నమ్మే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని(మూర్ఖత్వాన్ని) కాపాడాలన్న తపన. అందుకే ఈ ‘నమ్మకాలు’, తల్లిదండ్రులను ‘కంఫర్ట్ జోన్లో’ ఉంచే ప్రయత్నాలు ప్రస్తుత పరిస్తితికి కారణమనిపిస్తుంది.

ఈ ప్రేమపై యువతకున్న నమ్మకాల్ని కొంచెం పరిశీలిద్దాం.
1. ప్రేమ జీవితంలో ఒక్కసారే కలుగుతుంది (కాబట్టి దొరికిన అమ్మాయిని హింసించైనా ప్రేమని పొందాలి)
2. ప్రేమంటే ఒకరికొకరు సొంతమవడం ( తను "సొంతం" అయ్యింది కాబట్టి, నా ఇష్ట ప్రకారం నడవాలేగానీ తనకి ఇష్టాఇష్టాలు ఉండకూడదు)
3.ప్రేమకు ప్రాణమివ్వాలి ( లేదంటే ‘ప్రాణం తియ్యాలి’ )

ఎంత పనికిమాలిన `ప్రేమాదర్శాలని' మనం (సమాజం) ప్రాపగేట్ చేసి, యువతకు నమ్మకాల్ని చేసామోచూడండి. దాన్ని అపార్థం చేసుకున్న యువతదే తప్పు అని కొందరివాదన. పై ఆదర్శాలకు అర్థాలుంటే, అపార్థాలౌతాయిగానీ అసలు అర్థమే లేని ఈ పిచ్చి సూత్రాలకి మినహాయింపుకావాలా?

జీవితంలో ప్రేమ ఒక్కసారే కలగటమేమిటి, నాన్సెన్స్! నాకు మట్టుకూ ‘చలం’ లా చాలాసార్లే కలిగింది. ఇప్పుడు దొరికిన అమ్మాయి చేజారితే ఇంకొకరు అంత ఈజీ దొరకని కరువేగానీ, ఈ అవకాశం ఉంటే యువత అంత డెస్పరేట్ అవ్వరని నా నమ్మకం. మనుషుల ప్రాణాలకన్నా, మనం కల్పించుకున్న విలువలు కొన్ని తగ్గినా ఫరవాలేదంటాను, మీరేమంటారు?

ఇక ప్రేమలో ఒకరికొకరు ‘సొంతం’ అవడం. పుట్టించిన తల్లిదండ్రులకూ మనం సొంతంకాదు, మనకు పుట్టిన బిడ్డలు మనకు సొంతంకాదు కానీ, ప్రేమలో అమ్మాయి మాత్రం మన "ప్రాపర్టీయే". ఈ ముక్కచెప్పిన వాడి సొంత భూమి హైదరాబాద్ లో ఉంటే, కబ్జాచేసెయ్యాలి.

ప్రేమకు ప్రాణాలివ్వాలి (లేదా తియ్యాలి). ఈ వాక్యం చెప్పినోడు ఖచ్చితంగా శాడిస్టే. ప్రేమ జీవితంలో ఆనందాన్ని పంచాలేగానీ, జీవితాన్నే అంతం చెయ్యాడం ఎంత తెలివితక్కువతనం! పిచ్చివాడు కాకపోతే, ఎవరీ సిధాంతాన్ని ప్రతిపాదిస్తాడు?

ఇక తల్లిదండ్రుల మూర్ఖత్వపు హిపోక్రసీని ఎండగట్టడానికి...త్వరలో ఒక వేరే టపా పెడతాను.

20 comments:

Chaks said...

మీరు చెప్పిన ప్రతీమాటతో ఏకీభవిస్తున్నాను. చాలా బ్లాగుల్లో చర్చించిన ఆడవాళ్ళ డ్రస్సు గురించికాక అసలయిన పాయింట్లని పట్టుకున్నారు. ఈతరం యువతలో రెండు రూపాలున్నట్లున్నాయి. ఒకటి సమాజంలో నటించడానికి మరొకటి తాత్కాలిక అవసరాలకి అది ఆడయినా మగయినా. ఈ రోజు సాక్షి పేపర్ ప్రకారం వీడు తనప్రేమని తన తల్లికి ముందే చెప్పాడంట కానీ ఆమె తన ప్రేమవ్యవహారాన్ని కనీసం తల్లిదండ్రులకు చెప్పకుండా ఎంతో బుద్ధిమంతురాలిగా నటించింది, అది చాలా తప్పు. అతనితో కలిసి వెళ్ళింది, ఇతనితోనూ మరికొందరితో కలిసి ఒకే ఫ్లాటులో ఉంది. ఇంతజరిగాక, సరదాలన్నీ తీరింతరువాత మనసుమార్చుకున్నానంటే.. వాడికి మండదా మరి? ఈరోజుల్లో అమ్మాయిలెలా ఉన్నారంటే "మాదసలే సాంప్రదాయమైన కుటుంబం, పబ్లిగ్గా ఇవన్నీచేస్తే సహించరు" అనిచెప్పి ప్రైవేటు వ్యవహారాలకి ఇండైరెక్టుగా ఓ.కే అంటారు.

ఇలాంటి చర్చల్లో యువత భాగస్వామ్యం లేదు అన్నదానిని పాక్షికంగా ఒప్పుకుంటున్నాను. ఇలాంటివి నేను కొన్ని జాతీయ చానల్స్ లో చూశాను. అందులో సమస్య ప్రతి ఒక్కరూ తమ సొంత అభిప్రాయాలను కూడా మొత్తం యువత అభిప్రాయాలుగా చెప్పడమే. పైగా అవి కేవలం ఒక అరగంట సమయాన్ని పూడ్చడానికి పెట్టినట్టుగా ఉన్నాయి.

ఇక ప్రేమ గురించి మీరుచెప్పిన దానితో నేనేకీభవిస్తున్నాను. మీలాగే, ’చలం’ లాగే నేనుకూడా. అయితే మీరన్నట్లు ప్రేమించడానికి అమ్మాయిలు దొరకని కరువేమీ ప్రస్తుతం మన దేశంలో లేదు. అప్పటికే వాడి తాహతుకు మించి ఒక దానికోసం ఎంతో డబ్బు, కాలం ఖర్చుపెట్టిన వాడు మరోదాన్ని వెతుక్కోవాలంటే అయ్యే పనేనా? అందుకే ఆ కసి తీరడంకోసం ఇదిగా వీడిలా చట్టవ్యతిరేకపనులు చేస్తుంటారు.

Kathi Mahesh Kumar said...

చక్న్ గారు,

మీ అంత ఘాటు అభిప్రాయం ఈ విషయం లో నాకు లేదని చెప్పొచ్చు. కానీ మీరు చెప్పిన "వాడికి మండటం" అర్థంచేసుకోదగ్గ ఫీలింగే. తప్పల్లా, తను ఎంచుకున్న సమస్యను ‘అంతం’చేసేమార్గం. మనిషి ప్రాణం కన్నా, ప్రేమలు,విలువలూ,రూల్సూ గొప్పవి కావు అని నా నమ్మకం.అందుకే దీన్ని దారుణం అన్నాను.

మీరు చెప్పినట్టు అమ్మాయిలు ప్రవర్తిస్తారు అనేది,ఫెమినిస్టులు తప్ప అందరూ అంగీకరించే నిజాలే. కాకపోతే,ఇలాంటి "చికట్లో ఐతే ఓకే" అనే స్థితికి వారు రావడానికి గల సామాజిక పరిస్థితిని అర్థంచేసుకుని మెచ్యూర్ గా ప్రవర్తించడం ఈ జనరేషన్ కి నేర్పాలి అని మాత్రమే నా కోరిక.They have a reason to be like that and we are all part of creating such environment.కాబట్టి అబ్బాయిలూ అమ్మాయిలూ అనికాకుండా, ఒక సమాజంగా దీనికి భాధ్యత వహించాలి.

ప్రస్తుతం ఉన్న యువత ప్రేమను ఒక "వస్తువు"(commodity)గా చూస్తున్నారు కాబట్టి, దానితోపాటూ వచ్చే కొత్త విలువలనికూడా గ్రహించేట్టు చెయ్యాలి,అంగీకరించేట్టు చెయ్యాలి. మార్కెట్టులో, వస్తువు విలువ ఎప్పటికప్పుడు ఎలా మారుతుందో అలాగే ప్రేమలు మారతాయని,అదిఒక హక్కుఅని తెలియజెప్పాలి కాబోలు.

ఇక "ఒక దానికోసం ఎంతో డబ్బు, కాలం ఖర్చుపెట్టిన వాడు మరోదాన్ని వెతుక్కోవాలంటే అయ్యే పనేనా?" అన్నదానికీ నేనిచ్చే సమాధానం ఒక్కటే. అబ్బాయి పెట్టిన ఖర్చుకు మారుగా అమ్మాయి తన సాంగత్యంతో పాటూ, "వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉందిరా" అనే సోషియల్ స్టెటస్ ని కూడా ఇచ్చి ఖర్చుకు చెల్లు రాసింది. అంటే "డీల్" ఎండ్ అన్నమాట. ఇక నువ్వు కొత్తవ్యాపారం వెతుక్కోవాలే గానీ, సాధించే హక్కు ఎక్కడుంది?.

Sujata M said...

అవును. చంపేసే హక్కు మాత్రం ఎవరికీ లేదు. అలా అని ఆసిడ్ పోస్తే ఒకే అని కూడా అనుకోకూడదు. న్యాయంగా ఎవరు మనకు ఎంత ద్రోహం చేసినా,వ్యతిరేకించినా.. బాధపెట్టినా, నష్టపరచినా.. మనకు మాత్రం వాళ్ళని శారీరకంగా హింసించే, చంపే, హక్కు లేదు. కోపం, ఉక్రోషం.. లాంటి హింస కు ప్రేరేపించే భావాలను అదుపులో ఉంచుకోవటమే.. సంస్కారం. న్యాయ పరమైన హక్కు ఎలానూ లేదు. బలం ఉంది కదా అని చంపేస్తే.. ఇపుడు ఆ అబ్బాయి కూడా నష్టపోతున్నాడు కదా. అయ్యో.. ! కాస్త ఆ ఆవేశాన్ని ఇంకొక్క క్షణం ఆపుకోగలిగితే ఎంత బావుండేది ?!

Kathi Mahesh Kumar said...

సుజాత గారు,
నా రాత,ఇప్పటివరకూ జరిగిన చర్చ మగాళ్ళ పక్షంగా (point of view)గా ఉంది.మరోపక్షాన్ని జోడించి చర్చని ఒక కొలిక్కి తేగలరని కోరుతూ...
మహేష్

రాధిక said...

నిమిషానికొకలా మనసులు మార్చేసుకుని ఇతరుల మనోభావాలను గాయపరచడం చాలా తప్పు.అలాంటివాళ్ళు శిక్ష అనుభవించాలి.అది ఆడయినా,మగయినా.కానీ వ్యాస కర్త అన్నట్టు చంపడం,హింసించడం ఒక్కటే పరిష్కారం కాదు.జీవితంలో ఒక్కరినే ప్రేమిస్తాను,ఒక్కరి మీదే ప్రేమకలుగుతుంది అన్నది సినిమా డైలాగు.నిజ జీవితంలో అలా ఉండదు.కాలం దేనినయినా మారుస్తుంది.ఆఫ్ట్రాల్ ప్రేమ ఎంత దాని ముందు .

Anonymous said...

మీరు చెప్పిన మూడు కారణాలకు మరొకటి కలుపుకోవాలి: వయస్సు "పొంగు"ని "ప్రేమ" గా భావించడం.

Kathi Mahesh Kumar said...

రాధిక,నెటిజన్ గారికి నెనర్లు.
‘వయస్సు "పొంగు"ని "ప్రేమ" గా భావించడం’ అన్నది ఒక యువకభావన అందుకని ఇక్కడ ప్రస్తావించలేదు.నాచర్చల్లా "నమ్మకాల" గురించి. ఇది యువత నమ్మేవిషయం కాదు, అనుభవించేది. మనం మన ఆలోచనల్లో ఎంతనిజమని నమ్ముతామో, టీనేజిలో తమ అనుభూతుల్ని అంత నిజమనుకుంటుంటారు.కాబట్టి అందులో పెద్ద తప్పు ఉందని నేననుకోను.

సమస్యల్లా సమాజం తన అభిప్రాయాల్నీ విలువల్నీ ఆపాదిస్తూకూడా,భాద్యత నుండి తప్పించుకు తిరగడానికి ప్రయత్నించడం తో వస్తుంది.

Anil Dasari said...

అసలు ప్రేమంటే ఏమిటి బ్రదర్స్ మరియు సిస్టర్స్? అమ్మాయిలేమో అబ్బాయి కండలో, ఆస్థి పాస్తులో, అలాంటిదే మరోటో చూసి ప్రేమిస్తారు. అబ్బాయిలేమో ముఖ్యంగా అమ్మాయి అందం చూసి ప్రేమిస్తారు. ఇదా ప్రేమంటే? అడుక్కు తినే అబ్బాయినీ, అంద వికారమైన అమ్మాయినీ ప్రేమించే వాళ్లెవరు?

చదువుకోండిరా బాబూ అని అమ్మానాన్నా నానా తిప్పలూ పడి ఫీజులు కట్టి కాలేజీలకి పంపిస్తుంటే వీళ్లు ఆ పని చెయ్యకుండా ప్రేమా దోమా అని తిరిగటమేంటి? ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడ్డాక ప్రేమించుకోమనండి, ఏ వేషాలైనా వేసుకోమనండి. అలా బాధ్యతనెరిగిన వయసులో వచ్చి పడేది - మోహమైనా, ప్రేమైనా, మరోటేదైనా ఇలాంటి దారుణాలకి దారి తీసే అవకాశం తక్కువ.

ఇక, ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘోరాలు తరచూ జరగడానికి కారణం పాశ్చాత్య పోకడలు పోతున్న సినిమాలు, పబ్ సంస్కృతి, అమ్మాయిల విచ్చలవిడి వేషధారణ, ఇంటర్ నెట్, ఇలాంటివే మరెన్నో. ఎయిడ్స్ పై అవగాహన పేరుతో 'కండోం ఉపయోగించండి' అని చిన్న పిల్లలకి బళ్లకెళ్లి మరీ చెప్పడమేంటి? ఇది కండోం ఉత్పత్తుల కి పరోక్ష ప్రచారం కాదా? కన్స్యూమరిజం మాయల్లో ఇదొకటి మాత్రమే.

http://anilroyal.wordpress.com

Kathi Mahesh Kumar said...

అయ్య అబ్రకదబ్ర గారూ,మీ ఆవేదన అర్థం చేసుకో దగ్గదే అయినా ప్రకృతికి విరుద్దమని గ్రహించగలరు.

ప్రేమ ‘ఒక ప్రాచీన శక్తి’ అది మానవ మన:శరీరాలలో ఒక విచ్చిన్న భాగం. అది చదువులు చెప్పించి ఆపినా,సమాజపు అడ్డుకట్టలు వేసి నిలిపినా ఏమీ ప్రయోజనం లేదు.ప్రేమ అనేది ఆకలి దప్పికలలాగా ఒక మానసిక, శారీరక అవసరం అంతే.అదితీర్చ గలిగే వ్యక్తి(ల) పట్ల కలుగుతుందే తప్ప మీరన్నట్టు అడుక్కు తినే అబ్బాయి పైనా, అంద వికారమైన అమ్మాయి పైనా కలగక పోవచ్చు. దానికి ఎవర్నీ భాద్యుల్ని చెయ్యాల్సిన అవసరం లేదు.గర్హించనూ అఖ్ఖరలేదు.

చదువు కోమని పంపితే ప్రేమలేమిటని?జీవితం లో సెటిలైన తర్వాత ప్రేమించమని సలహా ఇస్తున్నారు. అసలు ప్రేమించే వయసు నిర్ణయించడానికి మనవెవరు?ఈ సమాజం ఎవరు? ప్రకృతి ఆల్రెడి నిర్ణయించిన దారిని మనమే ‘అతిగా కండిషనింగ్’ చేసి, ప్రస్తుత దుస్థితికి కారణమయ్యామని నా భావన. రొమాంటిక్ లవ్ యొక్క తీవ్రతను లెఖ్ఖగట్టలేని మన(నమాజ)మూర్ఖత్వమే, ఈ విశృంఖలత్వానికి మూలకారణం అనిపిస్తుంది.

మీరుచెప్పిన "పబ్ సంస్కృతి, అమ్మాయిల విచ్చలవిడి వేషధారణ, ఇంటర్ నెట్,ఎయిడ్స్ పై అవగాహన పేరుతో 'కండోం ఉపయోగం నేర్పడం" ప్రేమ పేరుతో చంపడాలూ చావడాలకి కారణాలు అసలు కావని గ్రహించగలరు. పైన చెప్పిన కారణాలు ‘సెక్స్’ ని ప్రోత్సహిస్తుండవచ్చునే గానీ ప్రేమ పేరుతో చంపడాన్ని మాత్రం అసలు కాదు.

నా ఉద్దేశం లో ప్రేమని ‘పవిత్రం’ చెయ్యడం,దాని పట్ల కొన్ని అపోహలు కల్పించడం(నేన్ము నా వ్యాసం లో చెప్పినవి కొన్నే),ప్రేమని వ్యక్త పరచడానికి ఒక అంగీకారాత్మక విధాన్నాన్ని,భాషనీ ఈ సమాజం కల్పించక పోవడం ఈ ఉన్మాదాలకి ముఖ్యకారణాలని నేను నమ్ముతాను.

ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొనేందుకు ఈ క్రింది లంకెను చూడండి http://parnashaala.blogspot.com/2008/05/blog-post_03.html

Wanderer said...

మహేష్ గారు, మీరన్నట్టు ప్రేమ పట్ల సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలే కారణమైతే, ఆ నమ్మకాల్లో ఒకటి "ప్రేమ అంటే త్యాగం. మనం ప్రేమించిన మనిషి సంతోషాన్నే ఎప్పుడూ కోరుకోవాలి" అన్నది ఒకటి కదా? సమాజం, సాహిత్యం, పత్రికలు, సినిమాలు, స్నేహితులు, పెద్ద వాళ్ళు - ఎవరు చెప్పినా ఇదే సూత్రం కదా? మరి మిగిలిన నమ్మకాల్లా ఇదెందుకు పని చేయట్లేదు? ఎందుకిన్ని ప్రేమకి సంబంధించిన నేరాలు జరుగుతున్నాయి?

"నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు" లాంటి డైలాగులు ఈ మధ్య కొన్ని సినిమాల్లో వినబడ్డాయి. సాధారణం గా ఈ మాట చెప్పే వాడు ప్రతి కథానాయకుడై ఉంటాడు (విలన్ కాదు, ఏంటీ-హీరో). వయలెంట్ ప్రేమ కథా చిత్రాలది ఒక ట్రెండ్ అయి కూర్చుంది. అంటే సినిమాలు చూసి నేర్చుకున్నారని అనట్లేదు. అలాంటి అలోచన ఒకవేళ మనసులో మెదిలితే సినిమాలో అదే మాట వినపడటం ఆ అలోచనకి endorsement నీ, బలాన్నీ ఇస్తుంది. సినిమాలో మోసపోయిన హీరోతో తనని తాను ఐడెంటిఫై చేసుకోడం, అతడిలాగానే రియాక్ట్ కావడం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాస్త ఎమోషనల్ గా ఉండే వాళ్ళు మరీ వల్నరబుల్. ప్రేమ తాలూకు గ్లోరీ దక్కకపోయాక కనీసం ఈ ఏంటీ-హీరో గ్లోరీ ఐనా దక్కితే చాలనుకుంటారేమో ఇలాంటి నేరాలకి పాల్పడే వాళ్ళు.

ప్రేమ పట్ల అభిప్రాయాలు, నమ్మకాల కంటే, వ్యక్తిగత అనుభవమే ప్రేమ పరిణామాన్ని నిర్దేశిస్తుంది అనుకుంటా.
ఇంత సీరియస్ చర్చ లో కూడా "ఈ ముక్కచెప్పిన వాడి సొంత భూమి హైదరాబాద్ లో ఉంటే, కబ్జాచేసెయ్యాలి." అన్న లైన్లు చదివి నవ్వుకున్నా. బాగా వ్రాసారు.

రామ said...

వీటన్నింటితో బాటు తప్పు చేసిన వాడిని సరిగా శిక్షించే దమ్ము మన చట్టాల్లో, చట్టాల్ని అమలు పరిచే వాళ్ళలో లేకపోవడం కూడా ఒక పెద్ద కారణం అంటాను నేను. ప్రజాబాల గారు చెప్పినట్టు, సినిమా లలో ఇలాంటివి వుంటే సెన్సార్ వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవడం (సెన్సార్ వాళ్లు ఫిక్స్ చెయ్యాల్సిన వస్తువులు ఇంతకంటే ముందు వేలాది వున్నాయి అనుకోండి) ఒక కారణం.
విజయవాడ లో లక్ష్మి ని హత్య చేసిన మనోహర్ కి వేసే శిక్ష ద్వారా భవిష్యత్ నేరస్తులకి ఒక బలమైన మెసేజ్ ఇవ్వాల్సిన న్యాయస్థానం అతనికి ప్రాసిక్యూషన్ కోరిన ఉరి శిక్ష కాకుండా జైలు శిక్ష తో సరిపెట్టడం ఇలాంటి ఎన్నో ఇతర నేరాలకి అలుసు ఇచ్చిందనడం నిజం కాదా? ఆ తరువాతే ఇలాంటి నేరాలు మన రాష్ట్రం లో పెచ్చుమీరాయి. ఏదో హీరోయిసం లాగ ప్రేమికులు (?) తమ ప్రేమ ని ఒప్పుకోని అమ్మాయిలని "లక్ష్మి కి పట్టిన గతే పడుతుంది" అంటూ బెదిరించారని ఎన్నో వార్తల్లో చదివాం!.

Kathi Mahesh Kumar said...

@ప్రజాబాల గారూ, చాలా లోతైన ప్రశ్న వేసారు. సమాధానం శోధించడానికి ఇక్కడ ప్రయత్నిస్తాను."ప్రేమ అంటే త్యాగం. మనం ప్రేమించిన మనిషి సంతోషాన్నే ఎప్పుడూ కోరుకోవాలి" అనేది కూడా ఒక పాప్యులర్ నమ్మకమే.కానీ ఈ భావానికి కావల్సిన ‘రీఇన్ఫోర్సుమెంట్’ ఈ మధ్య కాలంలో (90 ల నుండీ) చాలా తగ్గిపోయింది. మీరు చెప్పిన సినిమా విషయాలు కూడా ఆ కారణాలలో ఒకటి.

ఒక వేళ అక్కడక్కడా చెప్పినా, త్యాగ మంటే ‘తాగి చెడిపోవడమో’ లేక ప్రేయసి జీవితాన్ని బాగుచేసి తన బతుకు బండలు చేసుకుని చివరకు విరహగీతాలు పాడుకోవడం లాగానో చేసి ఒక ఇమేజ్ సృష్టించారు.దీన్ని ప్రస్తుతం ఉన్న యువత ఏరకంగానూ ఆదర్శప్రాయంగా తీసుకోలేరు. వారి స్టైలుకి పడదుగా మరి!

ఇక మీరన్నట్టు వ్యక్తిగత అనుభవం ప్రేమ ప్రరిణామాన్ని నిర్దేశించినా,ప్రేమ పిచ్చికి మాత్రం ఈ నమ్మకాలే దివిటీ పడుతున్నాయి. అసలు సమస్య అదే.చాలా ప్రేమలు సక్రమంగా ఉన్నా...ఇలాంటి సమస్యాత్మక ప్రేమల తోటే మన సమాజానికి ప్రమాదం.

@రామ గారూ, మీరన్న చట్టాల బిందువు చాలా ముఖ్యమైనదే. కాకపోతే విలువలు మార్చుకుంటున్న మన సమాజపు నీడలే ఈ వ్యవస్థల మీదా ఉన్నాయి. మార్పు రెండు వైపుల నుండీ కావాలి.

చిన్నప్పటి నుండీ చెల్లెల్ని తక్కువగా చూసిన కుటుంబంలో పుట్టిన కుర్రాడు, సుప్రీం కోర్టు జడ్జి గా మారినా ‘మహిళా సమానత్వాన్ని’ గౌరవించగలడా?

krishna rao jallipalli said...

"ఎంతో బుద్ధిమంతురాలిగా నటించింది, అది చాలా తప్పు. అతనితో కలిసి వెళ్ళింది, ఇతనితోనూ మరికొందరితో కలిసి ఒకే ఫ్లాటులో ఉంది. ఇంతజరిగాక, సరదాలన్నీ తీరింతరువాత మనసుమార్చుకున్నానంటే.. వాడికి మండదా మరి?" .... ఇదే పని మగాడు చేస్తే.. ఈమె కు కూడా మండితే.. YES. CORRECT. మండాలి... నా కొడుకులని నరకాలి. ఇరగ దీయాలి నా కొడుకులని.. ఈ లంజా కొడుకులది ప్రేమీనా అసలు.. కాదు కాదు. ఒట్టి SADIST నా కొడుకులు. ప్రేమ హింసను కోరుతుందా?? ప్రతి INCIDENT లోను అడాల్లె బలి అవుతున్నారు కాని... ఎప్పుడు కూడా మగాల్లకి ఒక్క గాయం ఐన అయ్యిందా.. అంటే అర్థం??

Anil Dasari said...

మహేష్,
ఈ విషయమ్మీద మనకి వేరే చోట ఇప్పటికే హోరా హోరీ నడిచింది :-) కాబట్టి మరీ ఎక్కువ సాగదీయకుండా రెండు ముక్కల్లో నా అభిప్రాయం రాస్తాను.

మీరు ప్రేమనీ, కామాన్నీ ఒకే గాట కట్టేస్తున్నారు. వయసు వేడికి ప్రేమనే ముసుగు వేయవద్దు. ఆ వేడి ఉండటం సహజమని మీరంటారు. కాదని నేననను. దాన్ని అదుపులో ఉంచుకోవాలని మాత్రమే అంటున్నాను. అలా ఉంచుకునేవాళ్లే ఎక్కువ మన సమాజంలో. సాక్షాలు మీ చుట్టూనే ఉంటాయి. మీ స్నేహితుల్లో మీరన్న 'ప్రేమ'లో పడిన వాళ్లెంత మంది, పడని వాళ్లెంత మంది? నాకయితే రెండోరకం వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. వాళ్లకి ఏ భావాలూ, అనుభూతులూ ఉండవని అనగలరా?

ప్రేమ పేరుతో జరిగే ఉన్మాదాలకి కారణాలు చాలా ఉన్నాయి. వీటిలో ఎక్కువ అమ్మాయి ఒప్పుకోలేదని అబ్బాయి దాడి చేసే కేసులే ఉంటాయి. ఇదేమి ప్రేమ?

Anonymous said...

అయ్యా, కత్తి మహేష్ కుమార్ గారు ఈ అశ్లీల అసభ్య పదజాలాన్ని మీ వ్యాఖ్యలనుండి ఎలా తొలగించాలో ఆలోచించారా?

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర, వద్దంటూనే మొదలెట్టారు. నేనూ చిన్న సమాధానం చెప్పి ఊరుకుంటా.కామాన్నీ,ప్రేమనూ నేను కాదు, మీరే ఒక గాటిన కడుతున్నారు.

కామం అంటే కనపడ్డ వాళ్ళనందరినీ కోరడం. ఆకర్షణ అంటే ఏ వయసులోనైనా ఒకరిని చూసి ముచ్చటపడటం,ఆశ పడటం (అందులో కొంత కామం కూడా ఉండొచ్చు).కామాన్ని కూడా ఒక రకమైన ప్రేమ(Love making)అనే అంటారు. గమనించ గలరు.

ఇక ఆకర్షణ ని కొంత స్థాయి వరకూ ప్రేమగా పరిగణించవచ్చు. ఎందుకంటే, ప్రేమకు మొదటి మెట్టు చాలావరకూ ఈ ఇదే.

వయసు వేడి సహజం,దాన్ని అనైతికం చేసి సమాజం కొన్ని హద్దులు గీసింది. అదీ సమాజం తనను తాను కాపాడుకోవడానికే (అదేలా? అని మీరడిగితే నేను ఒక మొత్తం టపా రాసేస్తాను).ఆ వేడిని అణుచుకొనో,దాచుకునో మనలో చాలామంది బతుకుతున్నారు కాబట్టి అదే సరైనదనడం కాస్త హాస్యాస్పదమైనా ఒక పచ్చి నిజం.ఆ విషయంలో మీరు సరైన బిందువే చెప్పారు.

ప్రేమ పేరుతో జరిగే ఉన్మాదాలకు కారణాలు చాలా ఉన్నాయన్నారు. నాకు తోచిన కొన్ని కారణాలు నేను చెప్పా, మిగిలినవి మీరు చెప్పడానికి ప్రయత్నించండి. చదవడానికి మనమెప్పుడూ తయారే. నేను చెప్పినవే ఫైనల్ అని నేను అస్సలనడం లేదు.


@నెటిజన్, ఈ అసభ్యకరమైన కామెంటు చూసా.డిలీట్ చెద్దామని మొదట అనుకున్నా,ఆ తరువాత "ఇతడిదికూడా ఒక అభిప్రాయమే కదా!" అనుకున్నా.పాపం ఎంత నిస్పృహతో రాశారో. క్షమించి భరిద్దాం.

Anil Dasari said...

హద్దుల్లో ఉండమనే సమాజపు కట్టుబాట్లు చెరిపేయమనే ఆవేశం మీ వ్యాఖ్యల్లో తరచూ కనిపిస్తుంది నాకు. అది విచ్చలవిడితనానికి దారి తీస్తుందనేది నా అభ్యంతరం. 'సహజమైన అనుభూతులను తొక్కి పట్టవద్దు' అంటూ సపోర్ట్ చేసుకోవద్దు. కొన్నిటిని ఇష్టమున్నా లేకపోయినా తొక్కిపట్టాల్సిందే. సరిగా మీరన్న కారణం చెప్పే వారం క్రితం క్యాలిఫోర్నియాలో స్వలింగ సంపర్కుల వివాహాలను అధికారికం చేశారు. రేపు అదే కారణం చెబుతూ వావివరుసల్లేని సంబంధాలని కూడా చట్టబద్ధం చేయొచ్చు. జంతువులనీ, గ్రీకు, రోమన్ల ఇతిహాసాలనీ ఉదాహరణలుగా చూపి అనాదిగా ఇన్సెస్ట్ కూడా సహజమైన అనుభూతే అని వాదించగల ఘనాపాటీ లాయర్లున్నారు అన్నిచోట్లా! ఈ విషయంలో కూడా హద్దులు చెరిగిపోవాలనే వాదనొస్తే ఏమంటారు మీరు?

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర గారూ,మళ్ళీ తేనె తుట్టె ను కదుపుతున్నారు మీరు. నేను విచ్చలవిడితన్నన్ని కాదు, వ్యక్తిగత సంబంధాలలో ఇద్దరు concenting adluts కు వారి హద్దులు (అవసరమైతే ఒకోసారి సమాజంతో నిమ్మ్జిత్తం లేకుండా) నిర్ణయించుకునే అధికారం ఉందని మాత్రమే చెబుతున్నాను.

విచ్చలవిడితనానికి మీరిచ్చిన ఉదాహరణలు ‘గే మ్యారేజెస్’ మరియూ ‘ఇంసెస్ట్’.ఇవికూడా పరస్పర మార్పుకు లోనవగల విలువలు.

మన హిందువులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు అత్త కూతుర్నీ లేక అక్క కూతుర్ని పెళ్ళిచేసుకుంటారు. దీన్నే పాశ్చాత్య దృక్పధం తో చూస్తే ఇంసెస్ట్. కాదంటారా? ముస్లింలు ఇదే విధంగా చిన్నాన్న కూతుర్ని పెళ్ళి చేసుకోవచ్చు. కానీ మనకు మాత్రం ఇది పాపం,ఘోరం...కదా!!!

గే మ్యారేజ్ విషయం కూడా అందే. వాళ్ళు కలిసి బ్రతకడానికి నిబద్దులైన ఇద్దరు వ్యక్తులు. కేవలం సామాజికంగా వార్ని శారీరకంగా ఒకే తరహా(సెక్స్)కి చెంది ఉన్నారని భావింపబడుతుంది. అంతే.

కాస్త వినడానికీ, అంగీకరించడానికీ ఎబ్బెట్టుగా అనిపిస్తాయిగానీ,కాస్త ఆలోచించి చూడండి.

Gopal Koduri said...

మహేష్ గారు..
ఉన్మాదానికి ప్రేమ దారి తీస్తుందని నేననుకోను. అసలలాంటిదాన్ని ప్రేమ అనటమే తప్పని నాఉద్దేశ్యం. ప్రేమ కామం కోరదని నేననను. కాని కామాన్ని మాత్రమే కోరేదాన్ని ప్రేమ అనరు. అలాగే, ఇద్దరి మధ్య బందానికి సమాజం అడ్డువస్తుందనడం న్యాయం కాదు. ఒక అబ్బాయి అమ్మాయిని(లేదా అమ్మాయి అబ్బాయిని) ఇష్టపడి పెళ్ళి చేస్కోవచ్చు. దానికి సమాజం అడ్డు చెప్పదు. చెప్పినా లెఖ్ఖలేదు! కాని "కామం చాలు" అంటే ఖచ్చితంగా అడ్డుచెప్తూందీ సమాజం, దాని పర్యవసనాలను దృష్టిలో ఉంచుకుని. దీన్నే అబ్రకదబ్ర గారు విచ్చలవిడితనం అన్నారనుకుంటాను.

Kathi Mahesh Kumar said...

@దారి తప్పిన ప్రేమే ఉన్మాదానికి కారణమైతోందనే, మొదటి నుంచీ ఇక్కడ చెబుతోంది.కాబట్టి అందులో అందరం ఏకీభవిస్తాం. కేవలం శోధించదగ్గ కారణాల వెతుకులాటలో ఈ టపా రాయటం జరిగింది. ఇది సర్వకారణాల సమాహారమూ కాదు,ఎలాంటి ప్రేమలు మంచివో చెప్పే ప్రిస్క్రిప్షనూ కాదు.

ఇక అబ్రకదబ్ర గారికీ నాకూ ప్రారంభమైన ఈ చర్చ కేవలం ఈ టపాకుమాత్రమే సంబంధించినది కాదు. ప్రపంఛమంతా మనకు తెలిసిన "పవిత్ర ప్రేమ" లోనే జీవించాలి అనుకోవడాన్నే నేను వారు చెప్పిన దాంట్లో విభేధిస్తున్న విషయం.మిగతావన్నీ అంగీకారాలే.


ఇక ‘కామం మాత్రమే చాలు’ అనుకునే మనుషులు కేవలం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు. కాబట్టి దానిమీద చర్చ వ్యర్థం.కాకపోతే పెళ్ళే పరమావధిగా ఉండే ప్రేమలే సరైనవి, మిగతా ప్రాతిపదికలు తప్పు అనే ‘ఇంజెక్టడ్’ భావనని గురించి మాత్రమే పునరాలోచించమంటున్నాను.