Monday, May 5, 2008

నా జీవితం లో ‘రే’ సినిమా !




సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ `రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ `పథెర్ పాంచాలి ’ తోనో `అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది.

1994 లో ఆంధ్ర దేశమనే నాకు తెలిసిన చిన్న ప్రపంచం నుంచి కాలేజి చదువుకని మైసూరు రీజనల్ కాలేజి లో చేరటం జరిగింది. ఆసలే ఆంగ్ల సాహిత్యం మేజరు అందునా తెలియని ప్రపంచం ఈ సంధర్భం లో కాలేజి లో film club ఒకటి ఉందని తెలిసి సంబరపడి హుటాహుటిన సభ్యుడినైపొయా. అప్పటిదాకా రిలీజైన ప్రతి తెలుగు సినిమాని అప్రతిహతంగా బాగున్నా బాగులేకున్నాచూడటం అలవాటుగా ఉన్న నాకు అసలు సినిమాపై ఒక నిర్ధిష్టమైన అభిరుచి అప్పట్లో ఏడ్చినట్లుగా నాకు గుర్తులేదు. ఒక వారం తర్వాత ఏదో బెంగాలి చిత్రరాజాన్ని క్లబ్ వారు ప్రదర్సిస్తున్నారహొ… అంటూ ఒక నోటిసు వెలువడటం జరిగింది. ఒక్కసారిగా నేనుకట్టిన 200 రూపాయలు కళ్ళముందు కదిలి భగ్గు మంది. దక్షిణ భారతీయులు చదివే కాలేజి కాబట్టి తెలుగుతోబాటు ఏ తమిళమో,కన్నడమో మహా ఐతే మలయాళం సినిమాలు దయతలుస్తాయనుకున్న నాకు బెంగాలి సినిమా ఒక షాకేమరి !

ఈ తంతు ,కథాకమామిషు ఏంటో తెలుసుకుందామని మా ఊరి సీనియరుని ఆశ్రయించా. ఆమహాశయుడు ’ఒరే పిచ్చినాగన్నా! film club అంటే సినిమాలు చూసి తందనాలు ఆడటం కాదునాన్నా(ఇక్కడ club కి కూడా ద్వందం తీసాడు మా సీనియరు), సినిమాలు చూసి ఆస్వాదించటం,ఆనందించటం,అభినందించటం అంటూ నా అజ్ఞానాన్ని దూరం చేసాడు. ఏది ఏమైనా నేను కట్టిన పైసలు బూడిదలొ పోసిన పన్నీరు కావడం ఇష్తం లేక అయిష్టంగానే సినిమాని భరించటానికి నిర్ణయించేసుకున్న తరుణంలో ఇంకో ఔత్సాహిక స్నేహితుడు మరింత సమాచారాన్నిమోసుకొచ్చాడు. ఇదేదో గొప్ప దర్శకుడు దర్శకత్వం నెరపిన మహత్తర చిత్రమని, ఈ సినిమా చూడకపోతే జన్మలకు సార్థకత ఉండదని వినికిడని, ఈ సినిమా కేసెట్టు ప్రత్యేకముగా కలకత్తా నుండి దిగుమతి చేయబడిందని దాని పేరు ’చారులత’ అని దానిభావం.రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిచే రకం మనం కాదని బాహాటంగా కాకున్నా మనసులొ అనేసుకుని సినిమా చూడ్డానికి నేనూ తెగించేసాను.

సినిమా మొదలవక ముందే క్లబ్బు కోఆర్డినేటరు లేచి కొన్నిపరిచయ వ్యాఖ్యలు చెయ్యడం మొదలెట్టాడు, సినిమా ముందువేసే న్యూస్ రీలు లాగా ఇదీ భరించక తప్పదని నాకు అర్థమైపోయింది. ఈ సినిమా ని సత్యజిత్ రే అనే వ్యక్తి దర్శకత్వం వహించారని తను చెబుతూ ఒలికించిన గౌరవం చూస్తే, ఒక్క క్షణం ఆ ’రే’ ఎవరో మామధ్య కూర్చుని ఉన్నాడేమో అందుకె ఇన్ని రాగాలు పొతున్నాడు ఈ వెధవాయి అనిపించింది.

సినిమా మొదలైంది, సన్నగా ఎక్కడొ దూరంగా నాకు తెలిసిన సంగీత ధ్వని తెరమీద ఉన్న చీకటి లోంచి titles మధ్యన వినిపించింది. ఆ క్షణం లో, నా జీవితంలో ఎప్పటి నుండో చూడాలనుకున్న సినిమా ఇదేనేమో అనిపించింది. ఎందుకలా అనిపించిందో ఇప్పటివరకు సమాధానం దొరకని ప్రశ్నల్లొ ఒకటి. ’చారు’ తెరమీదకి వచ్చింది, మధుబాల తరువాత నా కంటికి ఇంతవరకు ఏ కథానాయిక ఆనలేదనేచెప్పాలి కాని ఈ గుండ్రటి బెంగాలి వదనం ఒక్క సారిగా నన్ను ప్రేమలొ పడేసినట్టుఅనిపించింది. మాధబి(వి) ముఖర్జీ తన పేరని తరువాత తెలిసింది, కాని ఆ మోము లోని నిఘూఢ విషాదం చూసి ఒక్క ఉదుటున తెరచించుకు వెళ్ళి ఓదార్చుదామనిపించింది. ఆ నటి ఒక్క చూపులొ చూపించిన భావప్రకటన సినిమా మొత్తానికి మూలవస్తువని తరువాత తరువాత తెలియ వచ్చింది. బహుశా దీనినే గొప్ప నటన మరియు దర్శకత్వ ప్రతిభ అంటారేమో. నాయిక ఒంటరితనం, జీవితం మీది జిజ్ఞాస, ప్రేమ,ఉత్సుకత దానితొపాటు తన ఉనికినే గుర్తించని భర్త భూపతి (శైలెన్ ముఖర్జీ) నిరాసక్తతని ఒక్క ‘opera glassess’ దృశ్యం లొ చూపించిన విధానం చూసి సినిమా అంటే ఇదేరా! అనిపించిందంటె నమ్మాలి.

తెరచించకుండానే ’చారు’ ఉదాసీనతను దూరం చెయ్యడానికి ప్రత్యక్ష్యమవుతాడు ’అమోల్’ (ఈ పాత్రను సౌమిత్ర చటర్జీ చేసారు). తన బీరకాయపీచు సంబంధం ఏమిటో subtitles చదవలేని నా బుర్రకు అర్థం కాలేదుకానీ… తను ’చారు’ జీవితం లొ తెచ్చిన మార్పు చూసి మాత్రం చాల ఈర్ష కలిగింది. రవీంద్ర సంగీతం, బెంగాలి సాహిత్యం సాక్షిగా వీరి మధ్య ఏర్పడే సాన్నిహిత్యానికి ఒక ’క్యుపిడ్’ బొమ్మ చారులత ఊగె ’ఉయ్యాల’ సాక్ష్యాలవుతాయి. ఆపుకోలేని ఆకర్షణ, అందుకోలేని అశక్తత, ఆమోదయోగ్యం కాని సామాజిక పరిస్థితి, భర్త నమ్మకం, అన్న విశ్వాసం వెరసి సినిమాకి కావలసిన ఘర్షణ (conflict) ని అందించాయి.

అమోల్ సహవాసం లో చారు ఒక సృజనాత్మక వ్యక్తి (రచయిత్రి) గా తన ఉనికిని మళ్ళీ పొందుతుంది కాని మారుతున్నభర్త స్థితిగతులు (ఆస్థి, పత్రిక అంతా పోతుంది), ఈ moral conflict మరియు’చారు’ యొక్క independent growth as an individual (beyond just being passive women companion) ను తట్టుకోలేక ఒక ఉత్తరం రాసి లండన్ కి పలాయనం సాగే ’అమోల్’ , ఇవన్ని కలిపి ’చారు” ను క్రుంగదీస్తాయి. తనజీవితం అనుకున్న పత్రిక పోయి ఒకవైపు ఉన్న భూపతి, అమోల్ వెళ్ళిపొయిన బాధలొ ఏడుస్తున్న చారు ని చూసి జరిగిన ’విషయం’ గ్రహిస్తాడు. ఈ బీటలు వారిన సంసారం ఒడ్డుకు చెరిందా ? చారు జీవితం ఏమైంది? అన్నదే సినిమాకు ముక్తాయింపు.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం, కథనంలో ఉన్న beauty అది ఏంటంటే…ఎక్కడా ఏమీ చెప్పక పోవడం. అంగ్లం లో ఒక మాట చెబుతారు “if you have said it, you have finished it. If you have suggested it, you have created it” అని. ’రే’ ఈ చిత్రం లో చారు -అమోల్ మధ్య ప్రేమ ఉందనికాని, వారి మధ్య శారీరక సంభంధం ఉన్నట్లుగాని ఎక్కడా చెప్పడు, మనచేత అనిపింపచేస్తాడు. భూపతి-చారు ఆఖర్నకలిసారా లేదా అన్నదికూడా చెప్పడు, సినిమా ఆఖరు లో వీరిద్దరి చెతులు కలిసాయా లేదా అనిపించే విధంగా “freeze shot” తో ’శుభం’ (శుభ మేనా…..?) పడుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే, ’రే’ తెరమీద కవిత్వం రాసాడని చెప్పవచ్చు… poerty on screen.

ఆప్పటివరకు విలన్ని చంపేముందుకూడా “నేను నిన్ను చంపుతారా” అని డయలాగు చదివే చంపే హీరోల సినిమాలను ఆరాధించిన నాకు చారులత ఒక అద్భుతంగా అనిపించింది. సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కూసింత సెంటిమెంటు… లేకపోతే రివెంజ్ ఉంటే చాలు అనుకునే ఈ ’ఎర్ర బస్సు మహేష్’ కు జ్ఞానోదయమైంది.

ఇప్పుడు సత్యజిత్ రే గనుక బ్రతికిఉంటే, నాకు ఆ మహానుభావున్ని కలిసే అవకాశం వచ్చి ఉంటే ఒక పని మాత్రం ఖచ్చితంగా చేసేవాడిని. చలం మైదానాన్ని, బుచ్చిబాబు ’చివరకు మిగిలేది’ ని ఆయన చేతుల్లో పెట్టి దయచేసి ఈ తెలుగు సాహితీ కుసుమాలను తెరబద్ధం చేసి తెలుగు సినిమాని పునీతం చెయ్యమనే వాడిని.

ఈ నా వ్యాసం మొదటగా www.navatarangam.com లో ప్రచురించబడింది

3 comments:

సుజాత వేల్పూరి said...

నేను ఈ సినిమా చూడలేదు. కానీ ఇక చూడక తప్పదు.

కొత్త పాళీ said...

మహేష్ గారూ, మీ బ్లాగుని చూసి చాలా సంతోషం కలిగింది. జెనెరల్ గా సినిమా గురించి, పర్టిక్యులర్ గా తెలుగు సినిమా గురించి పట్టించుకుని బాధపడే సినిమా పిచ్చోళ్ళు చాలా మందే ఉన్నారిక్కడ. You shall have good company :-)
దీనిమీద ఒక లుక్కెయ్యండి.
http://navatarangam.com

మీ బ్లాగు కూడలిలోనూ జల్లెడలోనూ చేర్పించండి. పది మందికీ అందుబాటులోకి వస్తుంది.
అన్నట్టు ఈమాట జాలపత్రిక తాజా సంచికలో రే చారులత గురించే మంచి వ్యాసం పడింది.
http://eemaata.com/em

నిషిగంధ said...

'చారులత ' ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది మీ టపా చదవగానే!
మీరన్నది నిజమే, సత్యజిత్ రే అంటే 'పథేర్ పాంచాలి ' నే గుర్తొస్తుంది!