Tuesday, December 16, 2008

మతమా...! కులమా...?

కులచర్చలు అంత తొందరగా తెగేవీకాదు అంగీకారాత్మక నిర్ణయాలకు వచ్చేవీ కావు.అవి మన సామాజిక మనుగడనూ, ఆలోచననూ problamatize చేసి కొత్త సమీకరణాల్ని తయారుచెయ్యడానికేతప్ప సమస్యల్ని తీర్చడానికి ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఇప్పట్లో అలా ఉపయోగపడే పరిస్థితీ కనిపించడం లేదు.


హిందూ మతస్థులు ఎప్పుడూ ఒక cohesive సమూహంగా వ్యవహరించ లేదు.ఒకే మతానికి చెందినవారిగా కొన్ని shared symbols ఉన్నప్పటికీ,ఆచారవ్యవహారాలు, విధివిధానాలు,సాంప్రదాయాలూ అన్నీ కులపరంగా ఏర్పరచబడ్డాయి లేదా అలాగే ప్రచారం కల్పించబడ్డాయి.


చాతుర్వర్ణాల సృష్టినుంచీ పంచమకులాల్ని చేర్చేవరకూ విభజించి పబ్బంగడుపుకునే బ్రాహ్మణక్షత్రియవర్ణాల ఆధిపత్య కుట్ర తప్ప మతపరిరక్షణ ఎవరి ఉద్దేశమూ కాలేదు. జ్ఞానాధారిత,రాజ్యాధికారాధారిత సంఘం నుంచీ భూమిఆధారిత సంఘం ఏర్పడే సరికీ నియో-క్షత్రియ (రెడ్డి,కమ్మ,బలిజ మొ")కులాలు తమ అధికారాన్ని చెలాయించాయేతప్ప సర్వమానవ సమానత్వం ఎక్కడా చూపించలేదు. అందుకే ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.


భూమినుంచీ రాజకీయం రాజ్యాధికారానికి మూలమవ్వగానే ఇవే కుల సమీకరణాలు ఆ వ్యవస్థమీద superimpose అయ్యాయి.అంటే వ్యవస్థ మారినా మూలాలు మాత్రం అవే అన్నమాట.ఓట్ బ్యాంక్ రాజకీయ క్షేత్ర్రంలో ఈ వర్గసమూహాల స్పృహ విజయవంతంగా ప్రతిసారీ reinforce చెయ్యబడింది.ప్రజాస్వామ్యంలో సమానత్వం తేవడంపోయి రాజకీయలభ్ధి కోసం కులాలు మరింత కరుడుగట్టిపోయాయి.కొన్ని కులాలు తమపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ కులాల ఉనికిని బలోపేతం చేస్తుంటే,మరికొన్ని తమకు సంక్రమించిన అధికారం ఎక్కడ కోల్పోతామో అన్న భయంతో మరింతగా ఈ కులవ్యవస్థని వ్యవస్థీకరిస్థున్నాయి.


ఇటువంటి రాజకీయబ్రహ్మాస్త్రాన్ని త్యజించి సమానత్వాన్ని కాంక్షించే ఆలోచన దాదాపు అన్నికులాల్లోనూ అడుగంటింది. ఇది హిందూమత సమస్య కాదు. ఇదొక ఆర్థిక-సామాజిక-రాజకీయ సమస్య.కులాలకి మూలాలు మతంలో వున్నా,అసలే అరవ్యవస్థీకృత హిందూమతంలో ఈ విస్తృత సమస్యను తీర్చే శక్తి లేదు.ఈ సామాజిక సమస్యకు మతపరమైన సమాధానం వెతికితే అది మరింత ప్రమాదకరమైన పరిణామం అవుతుందేతప్ప solution ఏనాటికీ కాదు.


కాబట్టి, కులాన్ని ఒక సామాజిక వర్గంగా చూసి ఆర్థం చేసుకుని ఆరాతీసి సమాధానాలు వెతకగలిగితే కొంతైనా సాంత్వన కలగొచ్చు. హిందూమత పరిరక్షణలో భాగంగా కులాలను విడనాడాలని పిలుపునిస్తే మాత్రం మతాన్ని వదిలేస్తారేమోగానీ కులాల్ని చాలా మంది వీడలేరు.ఆధ్యాత్మికతకు మతమైతే కులం ఆర్థిక-సామాజిక-రాజకీయ అధికారానికి హేతువు.ఈ ఒక్క కారణం చాలు మతాన్ని త్యజించి కులాన్ని తలకెక్కించుకోవడానికి.



‘హిందూఛారిటీస్’ అనే బ్లాగులో ‘కులమును విసర్జించండి’ అనే టపాకు నేను చేసిన వ్యాఖ్య ఇది.

****

25 comments:

ఏకాంతపు దిలీప్ said...

అవును కులం పోయేది కాదు. ఇది ఆర్ధిక,సామాజిక,రాజకీయ సమస్యే. మనం ఇప్పటికే చూస్తున్నాము మతం మారినా వారి వారి కులాల మధ్యే వివాహాలు జరగడం. కానీ ఈ ఆ,రా,సా సమస్యని ఒక్క రాజకీయ దృక్పధంతో మాత్రమే కొంతవరకు రూపుమాప గలము. కానీ అది ఇప్పట్లో జరిగేదిగా లేదు... చివరకి నాకనిపిస్తుంది మెల్లగా(చాలా మెల్లగా) సామాజికంగా, ఆర్ధికంగా మార్పు వస్తూ అదే ఒక రాజకీయ మార్పు కి హేతువు అవ్వొచ్చని... లేక సామాజికంగా, ఆర్ధికంగా వచ్చిన మార్పు రాజకీయ ప్రమేయం(జోక్యం) అవసరం లేకుండా అయినా చెయ్యొచ్చు...

Naveen Garla said...

Religion is biggest failure in History. చరిత్రను చూస్తే, ఏ మతం కూడా మానవుడికి సుఖం, శాంతి వగైరాలు ఇచ్చినట్లు కనపడదు. జన్మను బట్టి కాక, సంస్కారాన్ని బట్టి కులాన్ని ఆపాదించుకొంటే బాగుంటుంది.

సమతలం said...

కుల వృత్తులు నశించిన కులాల ఉనికి ఉన్నది. దానికి కొంత కారణం గ్రామీణ వ్యవస్థ ఇంకా బలంగా ఉండటమే.కుల వ్యవస్థ ఉనికి చివరి దశలో వున్నది. మార్పు వస్తుంది. కాని రాజ్యాధికారంలో ఉన్న వారి వల్ల కాదు.మార్కెట్ శక్తుల వల్ల,పట్టణీకరణ వల్లనె కులాల ఉనికి నశిస్తుంది.

spiritualindia said...

నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీకు సమాధానం చెబుతాను.

గుంపులో గోవిందయ్య said...

>>అందుకే ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.
దీనివల్ల జరిగే నష్టం ఏంటో నాకర్ధంకాలా.
౬౦ సంవత్సరాల మన స్వాత్రంత్ర భారతంలో ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చినా పైకి దేనికి రాలేకపోతున్నారు సోకాల్డ్ "నిమ్న కులాలు". రిజర్వేషను ఫలాలు వాళ్లకి చేరటంలేదు, కానీ దేనికి చేరట్లేదో రాయండి. అగ్రకులాలు అపేయిస్తున్నాయా? నిన్నటికి నిన్న, మంద వర్గీకరణ మీద మళ్లీ అల్టిమేట్టం వేసాడు. ముందు ఇచ్చిన అందివచ్చిన అవకాశాలని సరిగ్గా వాడుకోవడం నేర్చుకోవాలి. ఈ రిజర్వేషన్ల కోసం ఎన్ని త్యాగాలు జరిగాయో వాటిని గురించి కూడా రాయండి. ప్రతీ పంచవర్ష ప్రణాళికలో ఎన్ని కోట్లు కేటాయిస్తున్నారో అదీ రాయండి. అవి ఏ రాజకీయ వాది,ఏ ఏ కులపోడు తిన్నాడు, ఏ ఏ మందలు ఎంత ఎంత తిన్నారో రాయండి. "అగ్ర" జాతులు, కేవలం ఈ "నిమ్న" కులాల తాయిలాలవల్ల జీవితాలు కోల్పోయినోళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లు ఎప్పుడైనా రోడ్డుమీద పడ్డారా? వాళ్ల చరిత్రలు కూడా రాయండి. ఫలానా వాడు, ర్యాంకు వచ్చినా, కేవలం రిజర్వేషను వల్ల సీటు దొరకక ఎద్దు ముడ్లో కర్ర పెట్టుకుంటూ తన నిస్సహాయతకీ, తన లేమికీ, తన దురదృష్టానికీ ఏమిచేయొచ్చో మీరే సెలవివ్వండి.
నేను చెప్పదల్చుకుంది : ఇదికేవలం రాజకీయ చిత్రం మాత్రమే. ఇరవైఒకటో శతాబ్దంలో ఇంకా కులాలేంటి మతాలేంటి, అందరం ఒక్కటే. లేనిపోనివి రాసి జనాలకి పిచ్చిలేపొద్దు. సామాజిక న్యాయం అందరికీ ఒక్కటే.
ఏదో ఓ కాలంలో నరుక్కున్నారు, తన్నుకున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి ఆటి గురించి?
అసలు ఒక అప్ప్లికేషనులో కులం కాలం తీసెయ్యటానికి పాటుపడండి. ఒక ఉద్యోగం పేదోనికి అందేలా చెయ్యండి. పేదరికానికి కులం లేదు, మతం లేదు.
ఈ కులం అఱుపులు ఇంక ఆపండి.

rākeśvara said...

కులాల ఉనికి ఖచ్చితంగా తగ్గుతుంది లెండి. నాకు ఇందాకే ఈ విషయమై ఒక గమ్మత్తయిన అనుభవం కలిగింది. మీరు ముందుకు బదులు వెనక్కు చూస్తున్నట్టనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం, కానీ రేపవరెఱుగుదురు లెండి.

కులం విషయంలో నేను అమెరికా వెళ్ళివచ్చిన తరువాత నా అభిప్రాయం చాలా మారింది.
అక్కడ పెద్దపెద్ద నగరాల్లో దెయ్యాలలా రెడ్ ఇండియన్ల ఛాయలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి.
ఉదా - wall street అనే పేరులో ప్రస్తావించబడ్డ wall, అప్పటిలో తెల్లవారికీ, స్థానిక అమెరికా ఖండ తెగలకు మధ్య కట్టబడ్డ గోడను సూచిస్తింది. అలా న్యూయార్కులో వున్న స్థానికులను సైతం పూర్తిగా చంపేసారు తెల్లవారు.

మన అదృష్టం బాగుండి, మన దేశం వచ్చిన తెల్లవారు (ఆర్యన్లో, వేఱెవఱోనో..), అలా సర్వనాశనం చేయలేదు. ఇదిగో ఇలా కపిల చ్ఛాయులను మిగిల్చారు.

నా ఆవకాయబద్ద అభిప్రాయాన్ని ప్రక్కన పెడితే,

Nationalism అని విశ్వకవి ఠాగూరు వ్రాసిన చిన్ని పుస్తకం ఉంది, అందులో భారతదేశం యొక్క సామాజిక సమస్య ఏమైయ్యువుండేది, దానికి ఫలితంగా కులం ఎలా వచ్చింది. అలా పరిష్కారంగా వచ్చి ఇప్పుడు సమస్యగా మారిన కులవ్యవస్థను ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది చాలా బాగవ్రాసారు.

ఠాగూరుని పట్టుకుని చాలా బాగా వ్రాసారు అంటూంటే నాకు నవ్వస్తుంది. ఠాగూరు వ్రాసారు అంటే సరిపోతుందిగా!

రాకేశ్వర

రాధిక said...

ఎందుకు సార్ మీరు లోపలి కసి తీర్చుకోడానికి అక్షరాలు ఆయుధాలుగా చేసుకుంటారు?మీకు అగ్రవర్ణాలంటే కోపం.అది పెరిగి పెరిగి హిందూత్వం మీదకి కూడా వెళ్ళింది.అప్పట్లో హిందువులు ఏదో చేసారని హిందువుగా పుట్టినందుకు హడావుడిగా సిగ్గుపడిపోయారు.మొన్న ముబై పేలుళ్ళప్పుడు ముస్లిములని అనుమానించవద్దు ఆవేశం వద్దు అదీ ఇదని చెప్పారు.నేను హిందూ వ్యతిరేకిని కాదు అని చెపుతారు మళ్ళా.మీకు ఎక్కడా అనిపించట్లేదా ఒకేవిషయం మీద రెండు మూడు రకాలుగా మాటలు మాట్లాడుతున్నానని.మీకు తెలియట్లేదా హిందూత్వాన్ని,దేశాన్ని అవసరంలేకపోయినా పదే పదే విమర్శిస్తున్నానని, కోపాన్ని ప్రదర్శిస్తున్నానని.దళితు చాలామంది మతం మారింది కేవలం డబ్బు కోసం.హిందువుగా వుండడం వల్ల రిజర్వేషన్లు వుంటాయి కాబట్టి అటు అదీ,ఇటు ఇదీ రాబట్టుకోవడం కోసం రెండు పేర్లతో చెలామణీ అవుతారు.మీరు చాలా కొత్త సిద్ధాంతాలు[సొంత సిద్దాంతాలు]చెప్పేస్తున్నారు దళితులు ఇందుకు హిందూత్వం వద్దనుకుంటున్నారు అంటూ.
చాలామంది చెప్పిందే నేను చెపుతున్నానండి మౌనంగా వున్నవాళ్ళందరూ మీతో ఏకీభవిస్తున్నారని అనుకోవద్దు.మీరు చేస్తున్న చర్చలు చదివిన ప్రతివారికీ అర్ధం అవుతుంది చివరికి మీరు కవర్ చేసుకోడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో.మీరు చేస్తున్న చర్చలలో,మీ మాటలలో పొంతన వుండేలా చూసుకోండి ప్లీజ్.
కఠినం గా మాట్లాడినందుకు క్షమాపణలతో
జైహింద్

Kathi Mahesh Kumar said...

@రాధిక:నేను బ్లాగురాసేదే నాకు నచ్చినవీ నాకు నచ్చనివీ రాసుకోవడానికి.రాష్ట్రంలో తెలుగుదేశం, జాతీయస్థాయిలో కాంగ్రెస్ కు నేను ఓటేసానంటే నామిత్రుల్లోనే చాలా మందికి అర్థం కాలేదు.అలాంటిది మీకు నా భావజాలం ద్వారా నేను అర్థమవుతానని అనుకోను.

నాకు అగ్రవర్ణాలంటే కోపం లేదు. అగ్రవర్ణభావజాలాన్ని అంగీకరించను. నాకు హిందువులంటే కినుకలేదు కానీ హిందూవాద భావజాలాన్ని వ్యతిరేకిస్తాను. ముంబై పేలుళ్ళప్పుడు ఈ సాకుతో మళ్ళీ భారతీయ ముస్లింలపై నెపంపెట్టి రాజకీయాలు చెయ్యొద్దని చెప్పాను. దానివల్ల నష్టమేతప్ప లాభం లేదన్నాను.ఇందులో నాకు పొంతనలేని విషయం ఏమిటో తెలీదు.They are consistence with "my ideology".

నేను హిందుత్వాన్నీ దేశాన్నీ విమర్శిస్తే అది నా భావన. దాని అవసరానవసరాలు నిర్ణయించుకునేది నేను. acceptability కోసం (ఎవరి ఏకీభావం కోసమో) నా ఆలోచనల్ని నేను మానుకోనుకదా! I am more important to myself than public opinion and blogs are not an indicator of public opinion for sure.

Kathi Mahesh Kumar said...

@గుంపులో గోవిందయ్య: ‘దళితులు హిందువులం కాదు పొమ్మనటం’ ఒక సైద్ధాంతిక విభేధం.దళితులంటే suppressed classes అని అర్థం. వివక్షకు గురైతూ ఈ మత చట్రంలో ఎందుకుండాలి అనేది ఒక ప్రశ్నైతే,దళిత దేవుళ్ళైన మాతమ్మ,పోలేరమ్మ,పోతరాజులకు స్థానం లేని హైందవ సాంప్రదాయాలు మావి కావేమో అనే సందేహమూ దళిత బహుజనుల్లో ఉంది. ఎంతైనా మనుషుల్నే కానివాళ్ళని చేసినప్పుడు దేవుళ్ళకు మినహాయింపుంటుందా!

ఇలాంటి సైద్ధాంతిక విభేధాల్లో లాభనష్టాలకన్నా కారణాలను వెతకడం ముఖ్యం. మీరు దాన్ని రిజర్వేషన్ కు ముడిపెట్టి చాలా చెప్పారు. నా వ్యాఖ్య పరిధి అది కాదు. దాన్నొక ప్రత్యేక చర్చగా పెట్టుకుంటే బెటరేమో.

‘దళితులు హిందువులం కాము’ అంటే వచ్చే నష్టం ఏమీ లేదు అని మీరనుకుంటే మాత్రం పొరబడినట్లే. సంఖ్యాపరంగా దళితుల్ని హిందూమతం నుంచీ తీసేస్తే మిగిలిన హిందువులు భారతదేశంలో "మైనారిటీలు" మిగిలిపోతారు. అప్పుడుకూడా రిజర్వేషన్లు ఈ రాజకీయ వ్యవస్థ తీసెయ్యదు సరికదా మరింతగా అమలు చేస్తారు. రాజకీయవ్యవస్థకు కావలసింది జనబాహుళ్యం మతం కాదు.

"ఇది కేవలం రాజకీయ చిత్రం మాత్రమే" అని చెప్పి మీరు రాజకీయవ్యవస్థను చాలా చిన్నచూపుచూస్తున్నారు. మన జీవితాల్ని,దేశ విధానాల్నీ నిర్దేశిస్తున్నది ఈ రాజకీయ చిత్రమే అని గ్రహించండి.మీ ఆవేదన సహేతుకమే కానీ,అప్లికేషన్లలో కులం కాలం తీసెయ్యడానికి we need to go through a process of understanding and demystifying అదే నేను చేస్తున్నపని.

నా వ్యాఖ్యకు ములమైన టపాను ఒక సారి చదవండి.నావి కులం అరుపులు కావు,కులం విరుపులు అని అర్థంకాగలవు.

@రాకేశ్వర్: ఐతే ఖచ్చితంగా ఆ పుస్తకం చదవాల్సిందే.

@ఏకాంతపు దిలీప్: నిజమే!క్రైస్తవంలోకి మారినా రెడ్డికులంలో మాత్రమే పెళ్ళిచేసుకునే ఫ్యామిలీ నాకొకటి తెలుసు. కులంలో మార్పు మీరన్నట్లు చాలా...చాలా నెమ్మదైన పరిణామం.

@నవీన్ గార్ల: మీరన్నది సబబే అంటే కార్పొరేట్ తరహా కుల బ్రాండిగ్ అన్నమాట. దీనికీ ఒక theory ఉందనుకుంటాను. వెతకాలి!

@spiritual India:waiting 4 u

@కామన్ మ్యాన్: మార్పు రావానేదే ఆశయం కానీ మతపరంగా ఈ సమస్యని తీర్చలేమనెదే నా పాయింట్.

Anonymous said...

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది.
సమయం : శనివారం సాయంత్రం 6- 7
వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్.
దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.

Anonymous said...

రాధీక గారు,
హీందువులను మహేశ్ గారు విమర్శిస్తున్నారు అని అన్నారు,
మరి ఇండియన్ ముస్లిమ్ లను support ఎందుకు చేసారు అన్నారు అంటె మీ ఉద్దెశం ఇక్కడ ముస్లిమ్ లకు ఏవరు సమర్ధించకుడదా?
వీధి కుక్కలాంటి ముస్లిమ్ లు ఉన్న దేశం పాకిస్తాన్ .అలాంటి వారు చేసిన చర్యల కు ఇక్కడ ముస్లిమ్ లను నిందించరాదు అని మహేశ్ గారు అన్నారే తప్ప హిందువులను చులకన చేయలేదు.
అవు కధ లొలా
ఎక్కడ ఎ దాడి జరిగిన ఇండియన్ ముస్లిమ్ ల ను కుడా విమర్శించి తృప్తి పడటం మనకు అలవాటు అయింది, నిందితులని మనం ఎం చెయలేం కాబట్టి ఇలా ముస్లిమ్ మతాని విమర్శించి తృప్తి పడదాం అలాగే ఇతరులని విమర్శించ మని ప్రోత్సహిదాం అలగే నా రాధిక గారు.

ముస్లిమ్ లొ లొపాలు ఉండవచ్చు కాని ఇస్లామ్ లొ లొపాలు లేవు,

Bolloju Baba said...

కుల వృత్తులు పోతున్నా, కుల స్పృహ ఇంకా సమాజంలో పోలేదు. చాలా చోట్ల అది కుల వివక్షగా ఉంటోంది.
ఈ వివక్ష పోయేటంత వరకూ రిజర్వేషన్లు ఉండటం సమంజసమే.
తనకే దేవాలయ ప్రవేశమే లేని రోజుల్లో, దేముడిని తన పాకలోకి రప్పించిన మతాన్ని నెత్తికెత్తుకోవటంలో పెద్దగా ఆర్ధిక కారణాలుండి ఉంటాయని నేననుకోను. (నేను మాట్లాడుతున్నది 200 సంవత్సారల క్రితం)

ఆనాటి విష వివక్ష ఫలమే ఈనాటి వాస్తవాలు.

పరిస్థితిని చక్కదిద్దగలిగే రాజకీయ చిత్తశుద్ది ఎవరికీ లేదు. (ఓట్ బాంకు రాజకీయాలగురించి)
కనుక అంతవరకూ, :-|


అప్రస్తుతమైనా


మృత్యువులో అనేకులు ఒకటవుతారు.
జీవితంలో ఒకడే అనేకులు.
దేముడు మృతినొందిన నాడే
మతములన్నీ ఏకమౌతాయి.
(స్ట్రే బర్డ్స్: చరణం నం: 84)

అన్న టాగోర్ మాటలు చదివి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.

బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

@బొల్లోజుబాబా: వివక్ష పోయేటంతవరకూ రిజర్వేషన్లు ఉండాలనటం బాగుంది. కానీ, రిజర్వేషన్ల వలన కులవివక్ష మరింతగా వ్యవస్థీకరించబడుతోంది అనేది కొందరి వాదన. ఉదాహరణకి రిజర్వేషన్ విధానం వలన సీట్లో లేక అడ్మిషన్లలోనో అవకాశాలు కోల్పోయిన అగ్రకులాలవాళ్ళు ఆ వివక్షను మరింత కసితో కొనసాగిస్తున్నారు అనేది ఒక అవగాహన.దీనితో పాటూ కులాలవారీగా కాలేజీల్లో,యూనివర్సిటీల్లో,పనిచేసేచోటా జట్లుగా విడిపడి ఈ వివక్షను మరింత జఠిలం చేస్తున్నారన్నది మరో అభియోగం.

పై అవగాహనకూ అభియోగాలకూ మనదగ్గర సమాధానం లేకపోవచ్చు లేక ఉన్నా అవి అమలుపరచలేని విధంగా ఉండచ్చు.అందుకే రిజర్వేషన్ల విధానం ఒక నిస్పాక్షిక సమీక్ష జరగాలి. ఆ సమీక్ష ద్వారా రిజర్వేషన్ అమలుపరిచే విధానంలో,వీలైతే పూర్తి ఆలోచనలో సమయానుగుణమైన మార్పులు తీసుకురాగలిగిన సత్తా ప్రభుత్వాలకు ఏర్పడాలి.(ఇది వీలవుతుందా అనేది ప్రశ్నార్థకమే!!!)

మతానికీ (దేముడికీ)కులానికీ సంబంధం తెగిపోయిందని నేనెందుకన్నానంటే,మతం(in its original form) ఒక ఆధ్యాత్మిక విధానం. దానికి ప్రాపంచిక విషయాలతో అంటే సామాజిక-ఆర్థిక-రాజకీయ విషయాలతో సంబంధం లేదు.వ్యవస్థీకృత మతం ఈ ప్రాపంచిక విషయాలలో అధికారం కోసం redifine చెయ్యబడ్డా, సామాన్యులవరకూ వచ్చేసరికీ మతం ముక్తికి మార్గమే తప్ప అధికారానికీ,రాజకీయానికీ,డబ్బుసంపాదనకీ కాదు.

ఇక కులం మాత్రం ఈ మూడు ప్రాపంచిక విషయాలను ఆధారం చేసుకునే విస్తృతరూపం సంతరించుకుంది. అందుకనే, మతానికి సంబంధం లేకుండా దీనికి విచికిత్స జరగాలని అంటున్నాను.

మీరు చెప్పిన ఠాగోర్ మాటల్తో నాకూ మతిపోయింది...ఖచ్చితంగా అంగీకరించాల్సిన పదాలే!

Bolloju Baba said...

"రిజర్వేషన్ విధానం వలన సీట్లో లేక అడ్మిషన్లలోనో అవకాశాలు కోల్పోయిన అగ్రకులాలవాళ్ళు ఆ వివక్షను మరింత కసితో కొనసాగిస్తున్నారు అనేది ఒక అవగాహన"

అలా కొనసాగించటం అవగాహనా రాహిత్యం కాదా?
ఏ రిజర్వేషనైనా రాజ్యాంగ పరిమితులకు లోబడే ఉంటుంది కదా(కొన్ని చోట్ల మినహా 50% దాటకుండా).

జనాభా ప్రాతిపదికన ఎవరి వాటాను వారు ఆశించటం లో అన్యాయమెందుకవుతుంది.

అలా కసికి లోనవ్వటం పూర్తి అక్కసుతోను, అసూయతోనూ జరిగే ఒక ప్రహసనంగా నాకు తోస్తూంటుంది.

జనాభాలో ఇరవై శాతం ఉన్న వారు ఎనభై శాతం రొట్టె ముక్క నాశించటం ఏం మానవత్వం అనిపించుకుంటుంది?
ఇక మనకూ జంతువులకూ తేడా ఏమిటి?

ప్రతిభ అనేది సాపేక్షం. అనేక ఆర్ధిక సామాజిక కుటుంబ, జన్యు నేపధ్యాలపై ఆధారపడి ఉంటుంది.

కుటుంబ ఆస్థుల పంపకాలలో చట్టంమైనా/ధర్మమైనా అందరినీ సమానంగా తీసుకోమంటుంది కానీ హెచ్చుతగ్గులతో కాదుగా!

ప్రస్తుత రిజర్వేషన్లలో నాక్కనిపించే ఒక లోపం:
రెండవ మూడవ తరాలు కూడా నిస్సిగ్గుగా రిజర్వేషను ఫలాలను అందిపుచ్చుకోవటం.
దానికి కొన్ని విభాగాలలో ఉన్నట్లు క్రీమీ లేయర్ పద్దతిని అన్నింటికీ వర్తింపచేయటం సహేతుకమైన నిర్ణయమౌతుంది.
కానీ ఎవరు చేస్తారు. విడిపోయి కొట్టుకుంటూంటే బహు బాగు బహుబాగు అనుకొనే రాజకీయవాదులు చేయ సాహసించగలరా?
బహుసా మనతరంలో జరుగుతున్న భావజాల వ్యాప్తి ద్వారా ముందు ముందు జరగొచ్చనే ఆశిస్తాను.

మేధ said...

>>రిజర్వేషన్ విధానం వలన సీట్లో లేక అడ్మిషన్లలోనో అవకాశాలు కోల్పోయిన అగ్రకులాలవాళ్ళు ఆ వివక్షను మరింత కసితో కొనసాగిస్తున్నారు అనేది ఒక అవగాహన

అలా రావడానికి కారణం, అప్పటివరకు వాళ్ళతో పాటే కార్పొరేట్ కాలేజీల్లో చదువుకుని, బైక్స్ మీద తిరుగుతూ ఉండి, కేవలం ఉన్నత విద్య విషయంలో కులం ఆధారంగా, ఆ అత్తెసరు మార్కులతో కూడా సీటు సంపాదించుకుంటున్నందుకు..

అందరూ ఇలా ఉన్నారని కాదు కానీ, ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువవుతున్నారు.. నిజంగా వెనకబడి ఉన్న వాళ్ళకి, రిజర్వేషన్స్ అందిస్తే ఎవరూ బాధపడరు.. కానీ అన్నీ ఉండి కూడా, తక్కువ మార్కులు వచ్చి కూడా, కేవలం కులాన్ని చూపి సీట్ సంపాదిస్తుంటే, అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండి అటు డబ్బులు కట్టి చేరడానికి ఆర్ధిక స్థితి సహకరించక, ఇటు రిజర్వేషన్లు లేక ఇబ్బందులు పడే వాళ్ళు కోకొల్లలు..

ఇలా చెప్పడం వల్ల, నేను అలా అసహనం చూపించే వాళ్ళని వెనకేసుకు వస్తున్నానని కాదు.. కానీ, ఎక్కువ మంది అలా అనుకుంటున్నప్పుడు, ఆ భావాన్ని తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగాలి కదా..

రాధిక said...

ఇండియన్ గారూ ంజేను చెప్పేదీ అదేనండి ముస్లిమ్ లొ లొపాలు ఉండవచ్చు కాని ఇస్లామ్ లొ లొపాలు లేవు అని మీరన్నట్టు హిందువులో లోపాలు వుండొచ్చుగానీ హిందూత్వంలో లోపాలు లేవని.నేనిక్కడ అన్నది ముస్లిములను అందరీ విమర్శించమని కాదు.హిందువైనందుకు సిగ్గుపడుతున్నాను అని అన్నాయన ముస్లిం చర్యకు కూడా అలాగే బాధపడాలి కదా అని.మీకోవిషయం తెలుసా మాకు ఇక్కడ వకాస్ అని చాలా ఆప్త పాకిస్తానీ స్నేహితుడు వున్నాడు.నేను ముస్లిములను అనుమానించండి అని ఎందుకు అంటానండి.మహేష్గారు ఎమన్నా చెప్పాలనుకుంటే నేను హిందువునే కానీ లోపాలను చూపుతున్నాను అనేలాంటి వాదనలు కాకుండా డైరక్టుగా నాకు హిందూత్వం అంటే నచ్చదు అని మొదలుపెట్టమనమని.రెండువైపులా ఆలోచిస్తున్నాను అని,కొత్త కోణాన్ని చూపిస్తున్నాను అనే ఆయన మాటలని మొదట్లో నమ్మిన నేను ఆయన ఇలా ఎప్పుడూ ఒకవైపుకే వుండిపోవడం చూసి బాధపడుతూ పెట్టిన కామెంటది.దళితుల గురించిన టపాలో ఆ టెర్రరిస్టు మాట ఆయన మాటలు ఎందుకు ఎప్పుడూ ఒకవైపుకే వుంటాయని ఉదాహరణగా చూపిస్తూ చెప్పినవి మాత్రమే.వద్దు వద్దనుకుంటూనే కామెంటు పెట్టాను నిన్న.ఇక ఇది వాదులాటకి దిగేలోగా నేను ఆపేస్తున్నాను.

Anonymous said...

I completely agree with రాధిక అబిప్రాయాలతొ. Apart from that I will agree and wish that lower castes get integrated with rest of the society. We have to get rid of the caste system and destroy the caste boundaries.

Reservation system must be target oriented. It can not continue for ever. So far no society or political system invented a perfect system in which every one is on equla footing on economic, religious, social class basis, cultural and social status basis.

Don't look at the West for solutions. The history of West was/is littered with Slavery, Bonded Labor, Colonization, extreme exploitation of Natives, and Soul harvesting. Romas or Gypsis were the Dalits of Europe. Read their history to understand how West treat you brown skinned people.

Katthi: the popup window that we respond to your blog is very slow. Fix that or adot a different way similar to other Blogs. Then i will complete my thought process.

The West is funding and tutoring the wayward suseptable castes in India to divide and rule Indians once again. Don't fall for such cheap tricks.

Kathi Mahesh Kumar said...

@రాధిక:
"రెండువైపులా ఆలోచిస్తున్నాను అని,కొత్త కోణాన్ని చూపిస్తున్నాను అనే ఆయన మాటలని మొదట్లో నమ్మిన నేను ఆయన ఇలా ఎప్పుడూ ఒకవైపుకే వుండిపోవడం చూసి బాధపడుతూ పెట్టిన కామెంటది"

చాలా మందిప్పుడు బ్లాగుల్లో ఒకవైపు (మాత్రం) చూపిస్తున్నారు. మిగిలిందల్లా రెండోవైపే, అది చూపడానికి నెనెంచుకున్నాను.బహుశా అందువల్లే రెండోవైపుండిపోయానని మీకు అనిపిస్తుండొచ్చు.

ముస్లింలతొపాటూ ఇస్లాంలోనూ లోపాలున్నాయి. హిందువులతో పాటూ హిందుమతంలోనూ లోపాలున్నాయి.There is no perfect religion on the earth yet. ఇక రాజకీయ మంత్రమైన హిందూవాదమైతే అత్యంత లొపభూయిష్టం. హిందువైనందుకు కొన్ని సంఘటనల వలన నేను సిగ్గుపడితే నాలాంటి ఎందరో ముస్లింలు ఇస్లాం తీవ్రవాదులు చేసిన పనులకు సిగ్గుపడ్డారు.

@మేధ:ఇక్కడ బొల్లోజు బాబాగారు చెప్పిన క్రీమీలేయర్ పద్ధతి అమలు జరపడం వల్ల ఉపయోగం ఉండొచ్చు. రిజర్వేషన్ల కోసం పోరాడేవాళ్ళు ఆ రిజర్వేషన్లు "అవసరంవున్నవాళ్ళకు" అందేలాకూడా పోరాడటం అవసరం. అంతేకాక ఇప్పటివరకూ రిజర్వేషన్ వరుసగా అందుకుంటున్నవాళ్ళు స్వఛందంగా రిజర్వేషన్లను త్యజించడానికి ముందుకు రావాలి. ఇలా (చాలా)కొందరు చేసారుకూడా.

@బొల్లోజు బాబాగారు: మీరు చెప్పినవన్నీ అక్షరసత్యాలు. నేను minimalistic conflict నేపధ్యంలో అగ్రకులాల స్పందనకు సమాధానం వెతకాలనే సూచన చేసానేగానీ మీరు చెప్పిన "అవగాహనా రాహిత్యం" కోణాన్ని విస్మరించాను. నిజమే!విశదీకరించి చెప్పగలిగితే కక్ష బదులు empathy(స్వానుభూతి) కలగొచ్చేమో! ఆ ప్రయత్నం ఇంతవరకూ చేసిన దాఖలాలున్నాయా? అన్నది సందేహమే.

Anonymous said...

రాధిక గారు,
ఈ మధ్య చాలా మంది అవసరం లెక పొయిన మత ఉద్దేశంతొ ముస్లిమ్ లకు వ్యతిరేకంగా దాదాపు ౧౨౦ పొస్త్ లు కూడలి లొ చుసాను, అదే విమర్శ మతం మీద కాక తివ్రవాదం మీద చేసివుంటే సంతొషించే వాళ్ళం.
ముంబయి పేళ్లు వల్ల నష్టం హిందువులకే కాదు ముస్లిలకు జరిగింది.
తివ్రవాదులు లక్ష్యం బారతదేశం.బారతదేశం అంటె కేవలం హిందువులేకాదు ముస్లిమ్ లు ఉన్నారు.
కాబట్టి తివ్రవాదాని వ్యతిరేకిదాం మతాని కాదు ముఖ్యం ముస్లిమ్ లను కాదు.
సలామ్

సమతలం said...

కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన జరిపే కార్యక్రమం ఏదైనా మార్పును కోరదు.

కులం అనేది మన దేశ సమస్య. మెజారిటి హిందు మతంలో సేవక వర్గంగానే గుర్తింపబడ్డారు, కాని హిందువులుగా గుర్తించబడలేదు. మెజారిటి ప్రజలకు హిందు మతంతో పెద్దగా సంబంధం లేదు. ఇలాంటి వారు ఇతర మతాలను కూడా కులాలుగానే చూస్తున్నారు.

మత రాజకీయాలలో భాగంగా అందరిని హిందువులని కొత్తగా ఆపాదిస్తున్నారు.ఆదిగా హిందువులుగా(బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ మొ// వారు) వున్నవారు మైనారిటి కులాలు.కుల వివక్ష తగ్గితే ఆధునిక (హిందు లేదా శూద్ర లేదా మిశ్రమ) మతం ఆవిష్కరణ జరుగుతుంది. అంటె హిందు మరియు ఇతర గ్రామ దేవతల ఆచారాలు కలిపి కొనసాగించబడుతాయి . మొదటినుండి హిందువులమనే వారు ఉనికి కోల్పోతారు. హిందు మతం కులాల సమస్య యధాతదంగా వుంచాలని కోరుకుంటుంది. కాని అది జరగదు. మార్పు సహజం.

కులాల ఉనికి నశిస్తె, మత ఉనికి కూడా తగ్గుతుంది.

Kathi Mahesh Kumar said...

@కామన్ మ్యాన్: విభేధించలేని మాటన్నారు. ఆ మార్పు త్వరితగతిన జరగాలని ఆకాంక్షిద్ధాం!

ఇస్లాం - కొన్ని నిజాలు said...

నేను మీకు సమాధానం వ్రాశాను. కాస్త చూడండి.

Anonymous said...

Indian గారు,

దావూద్ ఇబ్రహిం ఎక్కడి ముస్లిం? చోటా షకీల్ పాకిస్తాన్ వాడా? అబూ సలేం? మొన్నటికి మొన్న గుజరాత్ అల్లర్లలో పట్టుబడ్డ అబూ బషర్? అఫ్జల్ గురు? వికారుద్దీన్ మన హైదరాబాద్ వాడే !! ఇలా దాదాపు ప్రతీ దాడుల వెనుక వినిపిస్తున్న పేర్లు ఎవరివి? ఇండియన్ ముజాహిదిన్ లో భారతీయ ముస్లింలు లేరా? ఎందుకు తెలిసి కూడా ఆవు కధ లంటూ ఉపమనాలతో ఆత్మ వంచన? ఇప్పుడు ఎవరు ముస్లింలంతా టెర్రరిస్టులే అన్నారు? కాని టెర్రరిస్టుల్లో చాలా మంది ముస్లింలే. ఇది ఎవరూ కాదనలేని నిజం. మొదట ఈ నిజాన్ని నమ్మగలిగితే (కష్టంగానే ఉంటుంది), తదుపరి అటువంటి వాటికి వ్యతిరేకంగా ముస్లిం సమాజం లో ప్రయత్నాలను ఆశించవచ్చు. ఇంకొక విషయం, ముస్లింలని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అంటే, హిందూ మతాన్ని, నమ్మకాలని అదేపనిగా విమర్శించటం కాదు.

@కత్తి మహేష్ కుమార్,
భారతీయ సమాజం లో చాతుర్వర్ణ వ్యవస్థ నుండి, నేటి రాజకీయ వ్యవస్థ వరకు మీరు తెలిపిన పరిణామ క్రమం, ఏయే కులాలు ఎక్కడ ఆధిపత్యం లోకి వచ్చాయో మీరు చెప్పిన దానితో పూర్తిగా ఏకీభవిస్తా. ఇంకోలా చెప్పాలంటే, మీరు వ్రాసిన టపా దాదాపు ఆమోదయోగ్యమే. అయితే..దళితులు మేము ఇప్పుడు హిందువులం కాదు అనటానికి మీరు చెప్పిన కారణం సరి కాదనిపిస్తుంది. సైద్ధాంతిక విభేదమా? ఏ సిద్ధాంతం నుండి విభేదించారు? ఆ సిద్ధాంతం అసలు వుందా ప్రస్తుతం? మరిప్పుడు దళితులు ఏ మతం అని చెప్పుకుంటున్నారు? అలా చెప్పుకుంటున్న మతాలలో సర్వ మానవ సమానత్వాన్ని గుర్తించి వెళ్తున్నారా? హిందువలం కాదన్నప్పుడు, హిందూ దళితులకి సంక్రమించే ప్రయోజనాలు ఎందుకు పొందాలనుకుంటున్నారు? ఇంక మీరు గుంపులో గోవిందయ్య కి ఇచ్చిన ఉదాహరణ నవ్వు తెప్పించేదిగా ఉంది. క్షమించండి. మాచమ్మ, పోలేరమ్మ, పోతురాజు..దళిత దేవుళ్ళు కాదు, గ్రామ దేవతలు. చాలా ఊర్లలో ఈ దేవతల ఉత్సవాలను అగ్ర వర్ణాల వారే ఘనం గా నిర్వహిస్తారు. అంతే కాదు, వీళ్ళని కులదైవాలుగా పూజిస్తారు. బ్రాహ్మణులు కూడా.

@బొల్లోజు బాబా గారు,
ఇక్కడ మళ్ళీ రిజర్వేషన్ల ప్రస్తావన ఎందుకండి? నా దృష్టిలో అది కలిగించిన ప్రయోజనం 10 శాతం అయితే, నష్టం 90%. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశం లో అయినా అసలు ఇటువంటి విధానం ఉన్నదా? జనాభా ప్రాతిపదకన ఎవరి వాటా వాళ్ళకా? అంటే అర్హత ఉన్నా, లేకపొయినా ఫలాన కులం వల్ల అవకాశం కల్పించాలనేగా మీ ఉద్దేశ్యం? జనాభా ని కులాల సముదాయం గా చూస్తేనే ఇటువంటి వాదాలు పుట్టుకొస్తాయి. అంటే, ఏ కులం లో వాళ్ళు ఆ కులం లో వాళ్ళతోనే ప్రతిభ లో పోటీ పడాలి కానీ వేరే కులం లోని వాళ్ళతో కాదని?

"జనాభాలో ఇరవై శాతం ఉన్న వారు ఎనభై శాతం రొట్టె ముక్క నాశించటం ఏం మానవత్వం అనిపించుకుంటుంది?
ఇక మనకూ జంతువులకూ తేడా ఏమిటి?"

20% ఉన్న వాళ్ళు 80% రొట్టెముక్కని ఆశిస్తున్నారా? అంటే, మన కులం లో 10 మందికి అవకాశం వచ్చింది కాబట్టి మిగిలినవి వేరే కులాలకి వదిలేసుకోవాలనా? మనకు 100% అవకాశాలు లేనప్పుడు, ఇంక 20-80 విభజన ఎందుకు? పోని అదే నిజమైతె 20% ఉన్న వాళ్ళు మైనారిటీ కదా.. మన ప్రభుత్వాలకి మైనారిటీలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి కదా.. ఇదేంటి ఇక్కడ రివర్స్?
అన్నీ బానే ఉన్నా కూడా కులం పేరు చెప్పి, మరొకరికి రావల్సింది తీసుకోవటం మానవత్వమా?

ప్రతిభ ఎప్పుడూ సాపేక్షమే. కాని ప్రతిభ ని వెలికితీయటానికి కల్పించవలసిన సదుపాయాలలో మాత్రం సాపేక్షకత ఉండకూడదు. అంటే, అందరికీ నాణ్యమైన ప్రాధమిక విద్య అందుబాటులో ఉండాలి. +2/ఇంటర్మీడియట్ వరకు అయినా...కుటుంబ ఆస్థి లాగా దేశాన్ని పంచితే, ఎవ్వరికి ఏమీ మిగలదు. అంతా కలిసి దాన్ని పెంచి మరింత మందికి అందుబాటులోకి తెచ్చేలా విస్తరించాలి. లెకపోతె, ముందు ముందు కుల ప్రాతిపదకన జిల్లాలు, రాష్ట్రాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే హైదరాబాద్ ముస్లింలది అన్న డిమాండ్ వినిపిస్తుంది.

Bala said...

Mahesh, I like this piece of writing, specially on cast system.
People were divided into different groups or religions (categories in case of cast) just to protect their own identity. Later on the religion became a medium to excerpt power on the people; the ideology of the religion is the ideology of power. We like to fix our identity in small boxes with different labels, once in was in terms of religions, casts, now classes, etc. All the time the dirty categories are there, the name is changing but the function of the categories are the same. I have doubt that is it possible to live without any categories; it seems it is not possible! We have to understand that the categories are just conventions to run the system not some entities from the outside world, or God.

గీతాచార్య said...

The only perfect religion on this Earth is ME, MYSELF! (Reason)