Wednesday, February 18, 2009

‘మునెమ్మ’ పై కాత్యాయని పైత్యం


'మునెమ్మ' నవలపై కాత్యాయనిగారి సమీక్ష/విశ్లేషణ కూడా "రాసేవాళ్ళకు చదివేవాళ్ళెప్పుడూ లోకువే" అన్న నానుడిని స్థిరపరిచేదిగానే ఉంది.అందుకే, ఒక సాధారణ పాఠకుడిగా కాత్యాయనిగారు చేసిన ఈ అవమానాన్ని చూస్తూ సహించలేక ఈ స్పందనని అక్షరబద్ధం చేస్తున్నాను.

ఒక రచయిత యొక్క వర్గస్పృహ, సామాజిక ధృక్పధం, భావజాలం తను రచించే రచనలలో ఉండొచ్చునుగాక. కానీ, విమర్శకులు ఒక రచనని బేరిజు చేసేటప్పుడు రచయితనుకాక, ఆ రచనలోని సూచించిన ఆధారాలను మూలం చేసుకుని వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చెయ్యాలి. అలాకాకుండా, ఉరుమురిమి మంగలం మీదపడ్డట్టు మొదటిపేరాలోనే డా" కేశవరెడ్డి "గొప్ప"తనాన్ని ఎద్దేవాచేసి. ఆయన "మార్క్సిస్టు నిష్ట" ను అపహాస్యం చేసి. పేద,దళితసమస్యలనే చురకత్తుల్ని జేబులోపెట్టుకు తిరుగుతాడనే అపవాదు మూటగట్టి. తదనంతరం అసలు విషయాన్ని ప్రారంభించడం కాత్యాయనిగారి bias ను సుస్పష్టంగా ఎత్తిచూఫూతోంది.ఒక పాఠకుడిగా ఇవన్నీ నాకు అప్రస్తుతాలు, అనవసరాలు.

పుస్తకం గురించి చెప్పకముందే కాత్యాయనిగారు విసిరిన మరొ రాయి, రచయిత "స్త్రీ సమస్యలపై సానుభూతితో తాజానవల 'మునెమ్మ' వెలువరించారు" అటూ రచయితకు లేని ఉద్దేశాన్ని ఆపాదించడం. 'జయప్రభ'గారు రాసిన ముందుమాటలో "అయ్యా! మీరచనల్లో స్త్రీపాత్రే ఉండవు. ఉన్నా వాటికి ప్రాధాన్యత ఉండదు. మీధృష్టిలో స్త్రీలకి ప్రాధాన్యత లేదా? లేక స్త్రీలని ముఖ్యపాత్రగా మలచి కథ రాయగల్గిన శల్తిమీకు లేదా? ఆడవాళ్ళంటే మీకేమన్నా భయమా??" అన్న ప్రశ్నలకి సమాధానంగా ఈ నవలను రాయటం జరిగిందన్న సూచన ఉంది. అంతేతప్ప, సమీక్షకురాలు ఆరోపించిన 'ఒంటరి స్త్రీల సమస్యలకు పరిష్కారాన్ని అందిచడానికి పూనుకున్నట్లు'గా కనీసం చూచాయగాకూడా చెప్పడం జరగలేదు.అలాంటప్పుడు, ఇంతటి ఆరితేరిన conclusion కి సమీక్షకురాలు ఎలా వచ్చిచేరారో అర్థంకాకుండా ఉంది.

****

2 comments:

cbrao said...

మునెమ్మ చదవని పాఠకులకు పర్ణశాలలో రాసినది ఒక పట్టాన బోధ పడదు. దీనికి ఇంకో కారణం ఈ నవల సమీక్షకురాలు ఏమి చెప్పారో కూడా తెలియదు. సమీక్ష ఒక చిత్ర రూపాన ఇవ్వటం వలన అది చదవటం చాలా కష్టం. ఏమైనా, సమీక్షకులు వ్యక్తిగత అభిప్రాయాలకు బలమివ్వక, రచయితపై అభిమానం ప్రదర్శించకుండా, నిష్పాక్షికంగా, తటస్థం గా రాసినప్పుడు సమీక్షలకు, సమీక్షకుడికి విలువ పెరుగుతుంది. పుస్తక సమీక్షలు ఎలా ఉండాలనే విషయం పై భవదీయుడు రాసిన పుస్తక సమీక్షలు అనే వ్యాసం చూడవచ్చు.

కొత్త పాళీ said...

ఈ విమర్శ సమీక్ష రాసింది కాత్యాయనీ విద్మహేనా, చూపు కాత్యాయనా వీరిరువురూ కాక ఇంకో కాత్యాయనా?