Wednesday, February 25, 2009

ఔనన్నా! కాదన్నా!!

ఔనన్నా,కాదన్నా జీవనవైరుధ్యాలు చాలా తమాషాగా ఉంటాయి. ఒక నిమిషంలో విజయశిఖరాల్ని అధిరోహించిన మనం, మరో నిమిషంలో...అపజయాల అఘాతాల్లో మన గుర్తింపును వెతుక్కుంటూ ఉంటాం. ఈ ఎగుడు దిగుడు అలల మధ్యన బ్రతికెయ్యడం. పడిలేచే ఆలోచనల, అనుభవాల మధ్యన ప్రపంచాన్ని అనుభవించెయ్యడం మనం అప్రయత్నంగా చేసే పని.

అందుకే ఈ అసహన అలల మధ్యన జీవించే చాలా మందిని చూసినప్పుడల్లా, నా జీవనప్రయాణాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తాను. ప్రతొక్కరి జీవితంలోనూ ఒడిదుడుకులుంటాయి. కానీ, వ్యకిత్వం, ఆలోచన సాక్షిగా ఈ అలల తాకిడిని బేరీజుచేస్తే గుర్తొచ్చింది, ఇవన్నీ నిజానికి బాహ్యప్రపంచపు ఒత్తిడుల అనవాలేకదా ! అని. అయితే మరివి నా జీవితపు ఆటుపోట్లు కావా? ఏమో?!? నిజంగా కావేమో!

ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. ఒక రైతుదగ్గర ఆరోగ్యవంతమైన జోడెడ్లుండేవి. పొలం దున్నీ బండి నడీపీ రైతు పొషణకు ఉపయోగపడే విధంగా ఉండేవి. రైతు పక్కింటాయనెప్పుడూ "ఎంత అదృష్టమయ్యా నీది. ఇలాంటి ఎడ్లున్నాయి" అంటుండేవాడు. దానికి రైతు నవ్వి "ఔనో కాదో" అని వేదాంత ధోరణిలో సమాధానం చెప్పుకొచ్చేవాడు.

కొన్నాళ్ళ తరువాత ఆ ఎడ్లు రైతునొదిలి అడవిలోకి పారిపోయాయి. పక్కింటతను "చూశావా నీదురదృష్టం ఎలా తగలడిందో" అన్నాడు. రైతుమళ్ళీ "ఔనో కాదో" అనే సమాధానం ఇచ్చాడు. రెండ్రోజులు గడిచేసరికీ అడవిలోకి పారిపోయిన ఎడ్లు మరిన్ని అడవి పశువులతో జత కలిసి రైతు ఇల్లు చేరాయి. మళ్ళీ "ఎంత అదృష్టమయ్యా నీది" అని పక్కింటాయన. రైపు ఎప్పటిలాగే "ఔనో కాదో".

రైతు కొడుకొకడు ఎటువంటి శిక్షణా లేని అడవి పశువు మీద స్వారీ చెయ్యబోతూ ప్రమాదవశాత్తూ పడిపోతాడు. విపరీతమైన జ్వరం పట్టుకుంటుంది. అప్పుడు పక్కింటతను మళ్ళీ "చూశావా నీ దురదృష్టం" అనే అన్నాడు. రైతు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. యుద్ధం మొదలయ్యింది. సైనికుల్ని భర్తీ చేసుకుంటూ గ్రామాలను వెదుకుతున్న సైన్యం రైతు కొడుకు పరిస్థితి చూసి, "వీడు పనికి రాడు" అని నిర్ణయించి వెళ్ళిపోయారు. కానీ పక్కింటాయన కొడుకుని సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి తీసుకెళ్ళారు. రైతు కొడుకు కొన్నాళ్ళకు కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. పక్కింటాయన కొడుకు యుద్ధంలో చనిపోతాడు. మళ్ళీ...రైతు అదృష్టాన్ని అతను కీర్తిస్తే, రైతు మరోమారు తన ఔనోకాదో సందిగ్ధతను వ్యక్తపరుస్తాడు.

ఈ కథవిన్న ప్రతిసారీ పునర్జన్మ ఎత్తినట్లుంటుంది. ఏది మంచి ఏది చెడు? ఏది గెలుపు ఏది ఓటమి? అన్న ప్రశ్నలు తలెత్తిన ప్రతిసారీ, ఈ కథలోని సత్యం గుర్తుకొచ్చి స్వాంతన కలుగుతుంది.మన జీవితంలోని ప్రతి ఘటనా మంచీ చెడూ రెండుపార్శ్వాలనూ కలిగుంటుంది. బహుశా అందుకే స్పానిష్ సామెతలో "every bad happens for a good reason" అంటారు కాబోలు. వాటిని అర్థం చేసుకోవడం, జీవితానికి అన్వయించుకోవడం మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం చెయ్యాల్సిన పనులు. అలాంటప్పుడు ఎవరివో తులమానాలు మనకెందుకు? వారు చేసే బేరీజులు మనకేల?

మంచి చెడుల్ని సమానంగా స్వీకరిద్ధాం. వాటి విలువల్ని ‘స్వదృష్టి’ బేరీజు చేద్ధాం. అప్పుడు మన సమాధానం కూడా ఔనన్నా కాదన్నా "ఔనో..కాదో" అవుతుందేమో!


* ఒక మిత్రుడు పంపిన ఆంగ్ల వ్యాసం ఆధారంగా.


****

10 comments:

Anonymous said...

మీరు చెప్పిన కథ చైనా లో ఒకప్పుడు జన్మించిన దార్శనికుడు లావు త్సు అనే వ్యక్తి (తావోఇజం అనే ఒక భావన, మతానికి ఆద్యుడు) శిష్యుడు క్స్వాంగ్ త్సు చెప్పినది.

ఆయన చెప్పిన ఇంకో కథ నేను బ్లాగుతాను.

Unknown said...

మీరు కూడలి లోంచి విరమించుకోడం'' అవునో కాదో ''లా అన్న మాట .

Bhaskar said...

I do not know who said this "Count your blessings, Not your troubles".

Kottapali said...

జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు సినీకవి.
ఒక సంఘటన జరిగినప్పుడు అది మన మంచికా చెడుకా అనేది వెంటనే సరిగ్ఘా గుర్తింపుకి రాదు. అంతే కాకుండా అనేక సంఘటనలు ఒక దాని వెంట ఒకటి జరిగినప్పుడు, వాటి మధ్యన ఉన్న కార్యకారణ సంబంధం కూడా మనకున్న పరిమిత దృక్కోణంలో స్పష్టంగా తెలీదు. ఉదాహరణకి మీ కథలో .. ఎడ్లు అడవి పశువుల్ని తెచ్చాయి కాబట్టి కొడుకు వాటిని ఎక్క చూశాడు. ఎక్కాడు కాబట్టి కాలు విరిగింది. కాలు విరిగింది కాబట్టి సైన్యంలో చేరలేదు. అసలు ఎడ్లు అడవిలోకెళ్ళి అడవి పశువుల్ని తీసుకురాకపోతే ఇవన్నీ జరిగేవా?
ఇటువంటి మోరల్ డైలమాల చర్చలోనే 19, 20 శతాబ్దుల్లో ఆధునిక తత్త్వ వివేచనలు పుట్టుకొచ్చాయి. వీటిల్లో చాలా వరకూ చెప్పేది .. ఈ సంఘటనలన్నీ రేండం గా జరుగుతుంటాయి, వీటి వెనక ఒక పథకం గానీ వ్యూహం గానీ నడిపించే శక్తి గానీ ఏమీ లేదు .. అని. సరే, అదొక మాయాప్రపంచం అనుకోండి.

శ్రీనివాస్ పప్పు said...

ఇది వయసు పెరిగి కొన్ని ఆటు పోట్లు ఎదురయితే వస్తుంది తప్పకుండా,అందరికీ కాకపోయిన కొందరికేనా(ఎప్పటికీ రాకపోతే అది మూర్ఖత్వం అవుతుంది)...

దీన్నే స్థితప్రజ్ఞత అనచ్చేమో,గీత లో కృష్ణపరమాత్మ చెపినట్టు...

teresa said...

బావుంది...ఔనో,కాదో!

లక్ష్మి said...

Good One!!!

Padmarpita said...

మహేష్ గారు....మీరు చెప్పింది అక్షరాల సత్యమండి...

$h@nK@R ! said...

మహేష్ గారు...
చాలా బాగా చెప్పారండి! నేనైతే ఏది జరిగిన మన మంచికె అని అనుకుంటాను :-) అన్నట్లు.. ఈ రొజు అంధ్ర జ్యొతి లొ కూడ మీ గురించి తెలుసుకున్నాను..! నా నుండి ప్రత్యేక అభినందనలు..!!!

కొత్త పాళీ said...

@ Sreenivas Pappu - స్థితప్రజ్ఞత వేరే