Tuesday, February 24, 2009

హిందీ సినిమాలు - Politics of Representation

హిందీ చిత్రరంగమంతా, ఆస్కారు అవార్డులస్థాయిలో ‘ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’- IIFFA ప్రారంభించుకున్న సమయంలో (బహుశా 2005 అనుకుంటాను) మళయాళ నటుడు మమ్ముట్టిని NDTV పాత్రికేయుడు, What do you think of IIFFA ?ఆని ఒక ప్రశ్న అడిగాడు. దానికి మమ్ముట్టి చెప్పిన సమాధానం ఏమిటంటే, “Its an utter arrogance on Hindi film Industry’s part to call themselves ‘Indian Film Industry’. Whom do they represent ? NONE. There are number of regional language films that are being made in India, representing it’s people and culture. These guys have not even bothered to acknowledge this fact and call themselves Indian film industry!!! I don’t strongly object to IIFFA, simply because I don’t even care to acknowledge it.”

తను చెప్పిన ఈ ఒక్కమాటతో ఈ మహానటుడిని, ఒక వ్యక్తిగా కొండంత గౌరవం ఇవ్వడం మొదలుపెట్టాను. ఎవరిని represent చేస్తూ సినిమాలు తీస్తున్నారోకూడా తెలియని బొంబాయి/ముంబై చిత్రపరిశ్రమ, తమనితాము ‘భారతీయ చిత్రపరిశ్రమ’గా చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. హిందీ మన జాతీయభాష అయినంతమాత్రానా, హిందీ సినిమాలు మన జాతీయ సినిమాలు ఎలా అవుతాయో నాకు అర్థంకాని విషయం. అంతేకాకుండా, ఆస్కారు అవార్డుల్లోకూడా విదేశీచిత్రాల కేటగిరీ వుంటుంది. కానీ, ఈ IIFFA లో కనీసం ఇతరభాషా చిత్రాల ఊసుకూడా ఉండదు. అలాంటప్పుడు, ఈ అవార్డుల పేరులో హిందీ చిత్రపరిశ్రమ అనికాకుండా, “ఇండియా” అనే పదం అవసరమా? అనేది, మిలియన్ డాలర్ ప్రశ్న.

ఇక్కడే మొదలౌతుంది “representation” గురించి ‘మిస్ రెప్రజెంటేషన్’ అనే భాగం. ఈ మొత్తం తంతులో,గుర్తించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. అందులో మొదటిది, నిజంగా ముంబై పరిశ్రమ(బాలీవుడ్) కనీసం హిందీ మాట్లాడే ప్రజలకూ వారి సంస్కృతికీ అయినా ప్రాతినిధ్యం వహిస్తాయా? రెండోది. ఒకవేళ వహించినాకూడా, హిందీ సినీరంగానికి భారతీయ సినీపరిశ్రమ హోదాని ఇవ్వచ్చా?

భాష అనేది గాల్లోంచీ ఊడిపడేది కాదు. దానికొక సాంస్కృతిక-సామాజిక-ఆర్థిక-రాజకీయ నేపధ్యం ఉంటుంది. ఈ విస్తృత నేపధ్యం లోని అనుభవాల్ని అనువదించడానికే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు భాషని ఉపయోగిస్తారు. ప్రామాణికమైన హిందీ భాషను భారతదేశంలోని బృహత్తరమైన భౌగోళిక భాగంలో అధికార భాషగా వాడుతారు. కానీ, ప్రాంతాన్ని బట్టి దానిలో చాలా మార్పులు చేర్పులు కనిపిస్తాయి. ఒక రాష్ట్రానికీ మరో రాష్ట్రానికీ కొన్ని వేలపదాల తేడా ఉంటుంది.

హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్- ఉత్తరాంచల్, బీహార్-ఝార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్ ఘడ్,హర్యాణా,కొంతవరకూ హిమాచల్ ప్రదేశ్ మరియూ రాజస్థాన్. ఈ మధ్యవచ్చిన వంద హిందీ సినిమాల్ని చూస్తే ఈ ప్రదేశాల్లోని ఏప్రజలకు అవి అద్దంపట్టాయో, ప్రాతినిధ్యం వహించాయో చెప్పాలంటే బుర్రబద్ధలు కొట్టుకోవాలి. ఆరంభంలో చాలావరకూ నిర్మాతలు,దర్శకులూ, నటులూ పంజాబ్ (భారతీయ-పాకిస్తానీ రెండువైపులా ఉన్న) ప్రాంతానికి చెందిన వారవటం వలన అక్కడి సంస్కృతీ,సంగీతం,ఇతర కళల్ని హిందీ సినిమాల్లోకి అనువదించారు. కర్వాచౌత్, లేడీ సంగీత్ లాంటి పెళ్ళికి సంబంధించిన పంజాబి సాంప్రదాయాలు హిందీ సినిమాల పుణ్యమా అని భారతీయ సాంప్రదాయాలైపోయాయి.ఢోలక్ లాంటి వాయిద్యాలు సినీసంగీతంలో భాగాలయ్యాయి. ఆ తరువాత బెంగాలీ దర్శకుల హవా నడిచినంత కాలం బెంగాలీ కట్టూబొట్టూ హిందీ సినిమాల్లో స్థానం సంపాదించింది. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే బొంబాయి నగర నేపధ్యంలోనే చాలా వరకూ సినిమాలు వచ్చేవి. ఇప్పటివరకూ అదే తంతు కొనసాగింది. అంతమాత్రానా మరాఠీ సభ్యత,సంస్కృతికి ఈ సినిమాలు నీరాజనాలు పట్టాయా అంటే, అదీ లేదు. ఢిల్లీ నేధ్యంలో 80 వదశకంలో ‘స్పర్శ్’,‘చష్మేబద్దూర్’ వంటి సినిమాలు వచ్చినా అవి ఢిల్లీ సంస్కృతిని చూపించాయా అనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు వస్తున్న హిందీ సినిమాలు ప్రాతినిధ్యం వహించేది ఎవరికి? ఏ ప్రజలకు? ఏ సంస్కృతికి? ఏ భాషకు?

సినిమా ఒక (contemporary art form) సమకాలీన కళల సమాహారమన్న నిజం అందరూ అంగీకరించే విషయం. అలాంటప్పుడు కళ ఒక నిర్ధుష్ట్యమైన భాష, సంస్కృతి,సామాజిక-రాజకీయ సందర్భంలో లేకపోతే దాని ప్రయోజనం ఏమిటో ప్రశ్నించాల్సిన విషయమే. లేదూ సినిమా కేవలం వినోదం కోసమే అంటే ఆ వినోదం ఏ స్థాయికి చెందిందో పునర్విచారణ చెయ్యవలసిన విషయమే!

ఉత్తర ప్రదేశ్ లో స్థానిక భాష భోజ్ పురి లో సినిమాలున్నాయి. ఉత్తరాఖండ్ లో కుమోనీ,గఢ్వాలీ లో సినిమాలు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీహార్-ఝార్ఖండ్ లో మైధిలీ భాషా సాహిత్యం నుంచీ సినిమాల వైపుగా అడుగులు పడుతున్నాయి. చిన్నచిన్న ప్రయత్నాలు జరుగుతున్నా రానున్నకాలంలో ఈ ప్రయత్నాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. హిందీ సినిమాలలో అప్పుడప్పుడూ ఈ ప్రాంతం ప్రజలు కనిపించినా, బొంబాయి లేక ఢిల్లీ నుంచీ వచ్చే హీరోలకు సహాయపడటానికో లేక సినిమాలో తమ భాషని అపహాస్యం చేస్తూ హాస్యాన్ని పండించడానికో మహా అయితే అమాయకపు హీరోయిన్ గా హీరోను ప్రేమించడానికో తప్ప మరెందుకూ ఉపయోగపడిన ధాఖలాకు కనిపించవు. ఈ నేపధ్యంలో అటు భాషాజనాలకు, ప్రాంతాలకూ,స్థానిక సంస్కృతికీ రాజకీయాలకూ స్థానం లేని హిందీ సినిమా హిందీభాష ప్రజల సినిమా అనికూడా చెప్పుకోవడం సందేహాస్పదం. ఒక స్థాయిలో హాస్యాస్పదం.

ఒకప్పుడు శ్యాం బెనెగల్ తనకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ ఫ్యూడల్ వ్యవస్థ ను ‘అంకుర్’, ‘నిశాంత్’ లాంటి సినిమాలలో జనబాహుళ్యానికి చెప్పడానికి హిందీ భాష ఆసరా తీసుకుంటే ప్రస్తుతం ప్రకాష్ ఝా వంటి దర్శకులు తన బీహార్ ప్రపంచాన్ని“గంగాజల్’, ‘అపహరణ్’ వంటి సినిమాల ద్వారా ఆవష్కరిస్తునారు. ఇలాంటి సార్థక ప్రయత్నాలు అరాకొరాయే తప్ప విస్తృతం కావు. హైదరాబాదీ ముస్లింలపై తీసిన ‘బాజార్’, ఉత్తరప్రదేశ్ మాఫియాను మట్టుబెట్టడం గురించి తీసిన ‘సెహర్’, ఎమర్జెన్సీ నేపధ్యంలో ఢిల్లీ ని ఆధారం చేసుకున్న ‘హజారో ఖ్వాహిషే ఐసీ’, రియల్ ఎస్టేట్ మాఫియా గురించి తీసిన ‘ఖోస్లా కా ఘోస్లా’ వంటివి అప్పుడప్పుడూ వచ్చే సినిమాలే తప్ప సర్వసాధారణంగా హిందీ సినిమాలన్నీ ఏ భాషకూ సంబంధించినవి కావని నా నమ్మకం. They are rootless cinema that uses Hindi as a medium of language that’s all.

ఈ విధంగా హిందీ సినిమా హిందీవాళ్ళ సినిమానే కాదు. మరి దీనికి భారతీయ సినిమా అనే పదం ఎలా ఉపయోగించాలి?

ఈ మొదటి నిర్ణయం నుంచీ ఉదయించేదే మన రెండో ప్రశ్న. “హిందీ సినీరంగానికి భారతీయ సినీపరిశ్రమ హోదాని ఇవ్వచ్చా?” హిందీ కాకుండా దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ సినిమాలు తియ్యబడుతున్నాయి. ముఖ్యంగా చెన్నై లో తమిళ, మళయాళ చిత్రాలు, హైదరాబాద్ లో తెలుగు చిత్రాలు, బెంగుళూరులో కన్నడ,ముంబై లో మరాఠీ మరియూ కోల్కతా లో లో బెంగాలీ,ఒరియా,అస్సామీ చిత్రాలు ప్రముఖమైనవి. ఇందులో అన్ని భాషా చిత్రాలూ తమతమ భాష,సంస్కృతి, రాజకీయాలు,సామాజిక స్థితిగతులకు అద్దంపడతాయి.ముఖ్యంగా తమిళ,మళయాళ, బెంగాలీ,ఒరియా మరియూ అస్సామీ చిత్రాలలోని సింహభాగం ఇలాంటి చిత్రాలే.

తెలుగు సినిమాలు సంఖ్యాపరంగా హిందీ చిత్రాల్ని అధిగమించినా, తెలుగు ప్రజల్ని represent చెయ్యడంలో విఫలమవుతున్నాయన్నది ప్రముఖంగా వినబడే విమర్శ. అందులో చాలా వరకూ నిజం ఉంది కూడాను. హిందీ భాషలోని urban rootlessness ని అత్యంత శ్రద్ధతో అందిపుచ్చుకున్న పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమే కావచ్చు. తమిళ చిత్రరంగంలో కూడా ఈ మూస చిత్రాలు కొన్ని బయల్దేరినప్పటికీ భాషావిస్తృతత్వమో లేక సాహితీ-సాంస్కృతిక బలమో తెలీదుగానీ తమిళ సంస్కృతి తళుక్కు మనిపించే సినిమాలు ఇక్కడ అధికపాళ్ళలో ఇంకా వస్తున్నాయి. సాంకేతికపరంగా తమిళ, తెలుగు భాషా చిత్రాలు హిందీకి తలదన్నే విధంగా ఉన్నా, విషయపరంగా వైవిధ్యంతో నిలిచేవి మాత్రం తమిళ సినిమానే అనుకోవాలి.

కన్నడ-మరాఠీ భాషల్లో అత్యద్భుతమైన సాహిత్యం, నాటకం ఉన్నా, సినిమాలు మాత్రం అలవికాని కారణాలతో ఆ అద్భుతాల్ని అందిపుచ్చుకో లేకున్నాయి. అయినప్పటికీ గిరీశ్ కాసరళ్ళి, గిరీష్ కర్ణాడ్ వంటి దర్శకులు అప్పుడప్పుడూ కన్నడంలో ఆణిముత్యాల్ని రాలిస్తే, ‘శ్వాస్’, ‘డోమివెలీ ఫాస్ట్’ వంటి సంవేదనాత్మక చిత్రాలు మరాఠీలోనూ వెల్లివిరుస్తూనే ఉన్నాయి.సత్యజిత్ రే, మృణాల్ సేన్ ల వారసత్వాన్ని నిలుపుకోలేకపోయినా, అపర్ణాసేన్, రీతూపర్ణ ఘోష్ వంటి దర్శకులు బెంగాలీలో అప్పుడప్పుడూ సినిమాద్వారా తమ భాషాసంస్కృతుల ఉనికిని జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతూ వస్తున్నారు.

హిందీ భాష మాట్లాడే ప్రజలకు ప్రాతినిధ్యం వహించని ఈ చిత్రరంగం, ఏవిధమైన ఇంతటి చరిత్ర,నేపధ్యం, జనం కలిగిన మిగతా భాషల సినిమాని కనీసం గుర్తించని హిందీ చిత్రరంగం, తమ అంతర్జాతీయ అవార్డుల్ని భారతీయం అనడం… మమ్ముట్టి చెప్పినట్లు arrogance - అహంభావం కాక మరేమిటి?

ఈ మధ్యకాలంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు హిందీ చిత్రరంగంనుంచీ వస్తున్నా, అవి urban కథల్నీ, జీవనశైలినీ,ప్రజల్నీ వారి ఆలోచనలనీ ప్రతిబింబిస్తున్నాయి తప్ప హిందీభాషకు సంబంధించిన native ప్రజల్ని కాదు. ఈ ‘కొత్త మార్పు’ స్వాగతించదగినదే అయినా, హిందీ సినిమా తన పరిధి పెంచుకొని తన ప్రజల్ని represent చేస్తేతప్ప సార్థకత ఉండదేమో. ఈ విధానం ఇలాగే కొనసాగిస్తే ‘బాలీవుడ్’ అన్న పేరేతప్ప ‘హిందీ సినిమా’ అనే అర్థంకూడా నిరర్థకమైపోతుంది. ఇక ‘ఇండియన్/భారతీయ సినిమా’ అనే పేరుకు ఈ చిత్రరంగం కనీస అర్హతనుకూడా తెచ్చుకోలేదు.

****

11 comments:

Shiva Bandaru said...

మంచి విశ్లేషణ. ప్రాంతీయ భాషల్లో ఎన్నో మంచి చిత్రాలు వస్తున్నాయి . వాటిని వెలుగులోకి తీసుకువచ్చే ఆస్కార్ లాంటి వేదిక ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది .

Malakpet Rowdy said...

Excellent Analysis!

సుజాత said...

ఎప్పటిబట్టో నాకు ఉన్న సందేహాలన్నీ ఈ టపాలో మీరు వ్యక్తపరిచారు. విశ్లేషించారు. హిందీ సినిమాల విషయంలో మమ్ముట్టి చెప్పినదానితో 100 శాతం ఏకీభవించాల్సిందే! arrogance! అద్భుతమైన విశ్లేషణ.

ప్రాంతీయ భాషల్లో వచ్చే ఉత్తమ చిత్రాలను అంతర్జాతీయ వేదిక పైకి తీసుకెళ్ళేందుకు ఏమీ చేయలేరా హిందీయేతర రాష్ట్రాల నిర్మాతలు, దర్శకులూ? ఏ ప్రమాణాలతో ఒక సినిమాకు అంతర్జాతీయ స్థాయి (eligibility అనుకోండి) వస్తుందో వివరించి ఉండాల్సింది మీరు.

కర్వాచౌత్, లేడీ సంగీత్ లాంటి పెళ్ళికి సంబంధించిన
పంజాబి సాంప్రదాయాలు హిందీ సినిమాల పుణ్యమా అని భారతీయ సాంప్రదాయాలైపోయాయి.....
పచ్చినిజం!


ఈ వ్యాసాన్ని నవతరంగం లో ప్రచురించలేదా?

Anonymous said...

:-)

Anonymous said...

చక్కని విశ్లేషణ...బాగుంది!

teresa said...

Very good write-up on a choice topic!

asha said...

చాలా బాగా రాశారు.
ఇంతోటి భాగ్యానికి సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కి
హిందీ వాళ్ళని, బోలెడంత డబ్బులిచ్చి మరీ అతిధులుగా ఎందుకు పిలుస్తున్నారో అర్ధం కావటం లేదు. అమితాబ్ అంటే ఏదో పెద్దతను అనుకుందాం. మద్యలో ఈ కత్రినా కైఫ్ ని ఎందుకు
పిలిచారో అర్ధం కాలేదు. పోని ఇంకో పరభాషా సినిమావాళ్ళతో సత్సంబంధాల కోసం అనుకున్నా మిగతా భాషల నుండి ఎవరినీ పిలవకుండా వీళ్ళనే ఎందుకు పిలుస్తున్నారో అర్ధం కావటం లేదు.
వీళ్ళ సినిమాలే కాదు....అవార్డ్ ఫంక్షన్స్..వేషమూ...భాషా..ఆఖరికి గ్రీట్ చేసుకోటం కూడా హాలివుడ్ నుండి కాపీ కొట్టేసినట్లు
ఉంటాయి.

Suuren D'sa said...

"తెలుగు సినిమాలు సంఖ్యాపరంగా హిందీ చిత్రాల్ని అధిగమించినా, తెలుగు ప్రజల్ని represent చెయ్యడంలో విఫలమవుతున్నాయన్నది ప్రముఖంగా వినబడే ..............................విషయపరంగా వైవిధ్యంతో నిలిచేవి మాత్రం తమిళ సినిమానే అనుకోవాలి."

Brilliant!

It is such observations that make me want to visit your blog, your absence in Koodali and Jalleda notwithstanding.

cbrao said...

హిందీ సినిమాలు ఉత్తర భారతదేశం లోని అన్ని ప్రాంతాల ప్రజల ఇతివృత్తాలతో సినిమాలను నిర్మించారు. ఈ వ్యాసం లో పేర్కొన్నట్లుగా హైదరాబాదు , తెలంగాణా నేపధ్యంలో కూడా చిత్రాలు వచ్చాయి. నికా మరువలేము కదా. సరికొత్తగా ముంబాయి నేపధ్యంగా చిత్రాలు వచ్చినప్పటికీ హిందీ చిత్రాలు ఉత్తర హిందూస్తాన్ ను ప్రతిబింబిస్తాయి. కాని భారతదేశం పూర్తిగా హిందీ చిత్రాలలో గోచరించదు. ఇందుకు కారణం భారత్ భిన్న సంస్కృతులకు, భాషలకు, ప్రాంతాలకు నిలయం.

Kathi Mahesh Kumar said...

@సీబీ రావు: నా పాయింటల్లా హిందీ చిత్రాలు ఉత్తర హిందూస్థాన్ ను ప్రతిబింబించట్లేదని. కానీ మీరు మాత్రం ప్రతిబింబిస్తాయనే చెబుతున్నారు. మరోసారి హిమాచల్ ప్రదేశ్ నుంచీ బీహారు చివరిదాకా ప్రయాణం చేసి, ఎక్కడి ప్రజల సినిమాలు హిందీ సినిమాల్లో ఉన్నాయో గమనించండి.

హిందీచిత్రాల్లోని ఎంత మంది హీరోలు లక్నో,పట్నా,జైపూర్,భోపాల్ వంటి నగరాలనుంచీ వచ్చినట్లు చూపిస్తారో కాస్త చెప్పగలరా!లేదా అక్కడి విషయాలనూ,సంస్కృతినీ గురించి తీసిన సినిమాలు ఎన్నో లెక్కిస్తారా?

ముంబాయి నేపద్యంగా ఇప్పుడు కాదు ఎప్పట్నుంచో సినిమాలొచ్చాయి. దేవానంద్ నటించిన 80% సినిమాలు బొంబాయి నేపధ్యానికి సంబంధించినవే. షమ్మీకపూర్ హీరోగా వచ్చిన 60% సినిమాలు ఈ నగరం నేపధ్యం కలిగినవే.

@శివ: జాతీయ అవార్డులు(పురస్కారాలు) అన్ని భాషలకూ ప్రాతినిధ్యాన్ని ఎప్పుడూ ఇస్తూవచ్చాయి. కానీ వాటికి తగ్గ ప్రాచుర్యం,ప్రాధాన్యతా దేశవ్యాప్తంగా ఇవ్వకపోవడం మనకు జరుగుతున్న నష్టం.

Anonymous said...

తెలుగు, హింది సినేమాల లో సామ్య మేమంటె బాగా డబ్బు ఉన్నవాళ్ల కుటుంబాల వ్యాపారం అది. 1990 సంవత్సరమునుంచి చాల మార్పు ల కు లోనైది. తెలుగు సినేమాలు లో కులవాసనల తో ,భుస్వామ్య భవాలతో మరీ కంపు కొడుతాయి,అది 1990 తరువాత రావడం మొదలు పెట్టయి. దీనికి ఉదాహరణకు ఈ ట్రెండ్ సమర సింహా రెడ్డి నుంచి మొదలు. తమషా ఎమిటంటే దళితుల మీద దాడు లకు ( చుండురు) లాంటి సంగటనలకు ఏ వర్గం బాధ్యులో ఆ ఇంటి పేరు కలవారె జయం మనదే రా అని అట్టడుగు వర్గాల వారిని ఉద్దరిస్తున్నట్టు తిస్తారు. సినెమాలు రాజకియం లో రావడానికి హీరో కు ఉపయొగ పడె విధం గా రూపొందిస్తారు. తెలుగు లో కొత్త వాళ్లకి అవకాశం,ప్రయోగాలు చాలా తక్కువ తమిళ్ తో పొలిస్తే. మరి హింది లో ఐతే గ్లొబలైజెషన్ తరువాత వాళ్లకి పట్ట పగ్గాలు లేకుండా పొయాయి. ఎంత సేపటికి అమెరికా, లండన్ లో ఉన్న యన్.ఆర్.ఐ.ల ప్రేమ మీద సినేమాలు తియడం అది కూడా ఆ నిర్మతల కొడుకులె దర్శకులు చాల వాటికి. ఎంత సేపటికి ఐతే డబ్బు ఉన్నవాడి ప్రేమ కథలు లేక పొతే వ్యాపార వర్గాల ఎత్తులు జిత్తులు. వీళ్లు ప్రెక్షకులకు అమెరికా వాడికన్నా బాగా గ్లొబలి జషన్ ను అందము గా అమ్ముకొని డబ్బు చేసు కొన్నారు సమయానుకూలం గా.