Saturday, November 15, 2008

పోహా - జిలేబి

పోహా- జిలేబి...ఇదేంటా! అని ఆలోచిస్తున్నారా?!?


మధ్యప్రదేశ్ రాష్త్రంలో ‘మాల్వా’(Malwa) అనే ప్రాంతం వుంది. ఇండోర్ (Indore) నగరానికి చుట్టుపక్కలున్న ప్రదేశానంతా మాల్వాగా వ్యవహరిస్తారు. కొంత రాజస్థాన్, గుజరాత్ లోని ప్రాంతాలనుకూడా చారిత్రకంగా మాల్వా ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. మనం చిన్నప్పుడు చందమామ కథల్లొ చదివిన మాళవదేశం ఇదేనట. అదేంటో...ఆ కథల్లో ఎప్పుడూ మాళవదేశం రాకుమారుడూ, వంగదేశపు రాకుమారీ మాత్రమే ఉండేవారు!!


ఆ సంగతి పక్కనబెడితే, ఈ ప్రాంతంవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఫలహారం - బ్రేక్ ఫాస్ట్ "పోహా- జిలేబి". జిలేబి సంగతి అందరికీ తెలిసిందేకాబట్టి, విశదంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ ‘పోహా’ కూసింత కొత్తపదంగనక చెప్పుకోవాల్సిందే. మనం అటుకులంటామే..ఫ్లాట్ రైస్ దాన్ని లెమన్ రైస్ తరహాలో పోపుబెట్టి, నిమ్మకాయపిండితే అదే పోహా. ఈ పులిహోరలాంటి పోహాకీ, చెక్కెరపాకం కారే జిలేబీజీ చనువెప్పుడు కుదిరిందో, మనువెప్పుడు జరిగిందో తెలీదుగానీ, ఈ ప్రాంతం మొత్తం ఇదే తరహా. పొద్దునైతే చాలు రొడ్డుపక్కన చిన్నచిన్నబళ్ళూ, కాకాహోటళ్ళూ ఇదే వడ్డిస్తూ కనిపిస్తాయి. మనుషులు వీటిని మనసారా ఆరగిస్తూనే కనిపిస్తారు.


ఇడ్లీ, వడ,దోసె, ఉప్మా-పెసరట్టు, పొంగల్, పులిహోరకి అలవాటుపడ్డనాకు ఇంట్లో ఏంవండుకున్నా, ఈ పోహా- జిలేబి మాత్రం పాప్యులర్ వంటకం విచిత్రమైన కాంబినేషన్ గానే అనిపించింది. అక్కడున్న మూడు సంవత్సరాలూ, కనపడిన ప్రతి వ్యక్తినీ ఈ పెళ్ళిసంబంధం గురించి ఆరాతీసా. కానీ నిరాశే మిగిలింది. ఇదితప్ప పొద్దున్నే అక్కడ ఇంకేదైనా కావాలంటే దొరికేవి సమోసా, కచోరి. అక్కడక్కడా అప్పుడప్పుడూ పూరి, పరాఠా. ఈ పరాఠా మన ఆంధ్రాతరహా కాదండోయ్! వీళ్ళకి పారాఠా అంటే, ఆలూ,గోబీ,పన్నీర్, పాలక్ (పాలకూర) లాంటి filling కలిపిన stuffed పరాఠా అన్నమాట. దాంట్లోనూ డాల్డాకారేలా కాలిస్తేగానీ వీరికి ముద్దదిగదు.మనలాంటోళ్ళకి గొంతు దిగదు.కాబట్టి safe bet పోహా -జిలేబీనే. పొద్దునే స్వీట్ తినే అలవాటు లేకపోవడం వల్ల, జిలేబీవద్దంటే దుకాణమోడు జూలో జంతువల్లే చూసేవాడు. తెలుగులో అంటామే "గాడిదకేంతెలుసు గంధం వాసన", "అడవికోడి కేందెలుసు వడ్లగింజ రుచి" అని, అలాచూస్తారన్నమాట.


ఇప్పుడు ఈ వంటకం ఒకవైపు గుజరాత్,రాజస్థాన్ లలో మరోవైపు మహరాష్ట్రలోకూడా జాతీయ బ్రేక్ఫాస్ట్ అయ్యిందని విన్నాను. ఈమధ్య హైదరాబాద్ వచ్చినతరువాత, మళ్ళీ బయట ఎన్నిరకాల బ్రేక్ఫాస్టులో....I am loving it. మెక్ డోనాల్డ్స్ నాకుపెద్దగా నచ్చదుగానీ, ఈ ట్యాగ్ లైన మన ఆంద్రాటిఫిన్ హోటళ్ళకూ, కర్ణాటక తరహా దర్శినిలకూ మాత్రం అర్జంటుగా పెట్టేసి సంతోషించెయ్యాలనుంది.


చివరిగా ఒక్కమాట, భోపాలో, ఇందోరో, అహ్మదాబాదో, నాగ్ పూరో వెళితేమాత్రం పోహా-జిలేబి కాంబినేషన్ ప్రయత్నించండే...భలే వుంటుంది "ఆవకాయ్ బిర్యానీ"లాగా.


****

7 comments:

Sujata said...

I hope no one will fight with u over this issue. I like South Indian Tiffin Stalls. I always loved them. I am really loving it. :D (I dont like Poha in any form..)

కొత్త పాళీ said...

పోహా చూళ్ళేదు గాని, వేడి జిలేబీ వేడి పాలూ కాన్పూరులో సాధారణ బ్రేక్ఫాస్టు ఫుడ్డు. చేరిన మొదట్లో నాకు వెళ్ళుకొచ్చేది. మెస్సులో అదున్న రోజున్న నాలుగు బ్రెడ్డు ముక్కలు తినేవాణ్ణి. కాన్పూరు వదిలే సమయానికి దీనికి ఎంత అభిమానిని ఐపోయానంటే మెస్సులో లేని రోజుల్లో పొద్దు పొద్దున్నే వెనక గేటు దగ్గర తాత పెట్టే చాయ్ స్టాలు కెళ్ళి మరీ తినే వాణ్ణి. ఇంకో తమాషా ఏంటంటే, అక్కడ జిలేబీ తిన్న తరవాత, మళ్ళీ ఎక్కడా జిలేబీ నచ్చలేదు (ఇది అమెరికాలో)!

నా జీవితం ... చైతన్య said...

ఈ పోహా నాక్కూడా రెండేళ్ళ క్రితం నించి పరిచయమేనండోయ్. మా కాంటీన్ లో వారానికొక్కసారి ఇదే మాకు గతి. అలానే ఈ ఆలూ పరాటాలు, గోభి పరాటాలు కూడా. కాకపొతే కొద్దిగా మన స్టైల్ లో చేస్తారు కాబట్టి హాయిగా తినెయ్యొచ్చు.
మీరు చెప్పిన సామెతలకి నాకు తెలిసిన ఇంకో సామెత కలుపుతున్నా.
"పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన?"

Unknown said...

అరే భలే రాసారండి. ఈ రోజు వుదయం ఇండోర్ నించి భోపాల్ వెళ్తూ సోన్‌కచ్‌లో పోహా జిలేబీ తిన్నాను (ఇంతకముందు కూడా చాలాసార్లు). తమాషా ఏమిటంటే నాతో వున్న ఢిల్లీ మిత్రుడితో మన తెలుగు బ్రేక్‌ఫాస్ట్ గురించి సరిగ్గా ఇలాగే చెప్పుకొచ్చా..!!

గతంలో ఇండోర్‌లో వున్నట్లైతే ఇక్కడి రాజవాడా రాత్రి విందు గురించి కూడా ఒక టపా వేసుకోవచ్చు.. ఏమంటారు..??

Kathi Mahesh Kumar said...

@సత్యప్రసాద్ అరిపిరాల: మీరూ పోహాబాధితులే అన్నమాట. అదీ భోపాల్-ఇందోర్ మధ్యన. గతమూడేళ్ళలో నేనూ సోన్కచ్ లో కనీసం 60 సార్లు పోహా తినుంటాను.

రాజవాడతోపాటూ, ఛప్పన్ దుకాణే గురించికూడా టపాకట్టేస్తాను.కనీసం immediate గా relate చేసుకోవడానికి మీరుంటారు.

@చైతన్య:మీ కొత్తసామెత బాగుంది. ఆధునిక ధృక్కోణం అంటే ఇదా! నేను మరేదో అనుకున్నాను. చాలా నేర్చుకోవాలి!

@కొత్తపాళీ: అంతేనండీ..కొన్నంతే. నాకు హైదరాబాద్ బావర్చి బిర్యానీ నచ్చుతుంది. మిగతాచోట్లవి ఆనవు. నామిత్రులు హాస్యాలాడతారుగానీ,నా టేస్ట్ నాది. ఏంచేద్ధాం?

@గడ్డిపూలు సుజాత:పోట్లాడ్డానికి చాలా విషయాలున్నాయి లెండి. కానీ, జీవించడానికి మిగతావి కావాలికదా! అందుకే సినిమాలు, సంగీతం,సాహిత్యం, తిండీ వగైరావగైరాలు. మీరు పోహాను ఇష్టపడకపోయినా, నాటపా నచ్చినందుకు ధన్యవాదాలు.

Anonymous said...

మహారాష్ట్రలో ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో, కాందా పోహె ఉంది. నేనూ ఈ కాంబినేషన్ కు వీర పంఖాని. మహారాష్ట్రలో ఉన్నప్పుడు.

Unknown said...

Nijamenandoy .... poha maharastara lo chala popular breakfast. Idi same mana Uggani (Rayalaseema Vantakam Lendi) lantidanna maata ... kaani Uggani anta ruchiga undadulendi ...