Sunday, November 23, 2008

ఏదిపాపం?

ఆధునిక నవలాకారుల్లో (చిట్టిబాబు,బుచ్చిబాబు, కుటుంబరావు గారితోపాటూ) నాకునచ్చిన మరో నవలాకారుడు ‘చివుకుల పురుషోత్తం’. బహుశా రావలసిన గుర్తింపుకూడారాని నవలాకారుడుకూడా ఈయనేనేమో!


మొదటి నవల "ఏదిపాపం?"తోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్యాఅకాడమీ బహుమతి పొందినా, ఇప్పటికీ చాలా మంది పాఠకులకు ఈ పేరు (సు)పరిచితం కాదు. నేను మా కాలేజి లైబ్రరీ పుణ్యమా అని చివుకుల పురుషోత్తం గారి నవలలు చదివాను. కానీ, ముద్రణలో లేని కారణంగా ఆ తరువాత ఎక్కడ ప్రయత్నించినా ఈ రచయిత నవలలు దొరకలేదు. ఈ మధ్య విజయవాడలోని పాతపుస్తకాల షాపుల్లో వెదుకుతుంటే, "ఏదిపాపం?", "మేలుకొలుపు" అనే రెండు నవలలు మాత్రం దొరికాయి.


‘ఏదిపాపం?’ నవలలోని కొన్ని పేరాలను ఇక్కడ రాస్తున్నాను. ఎవరిదగ్గరైనా చివుకుల పురుషోత్తం గారి మిగతానవలలుంటే తెలుపవలసిందిగా కోరుతున్నాను.


వనజ: "మగవారికి మా ఆడవారి ధృష్ట్యా కొన్ని మూర్ఖపు నమ్మకాలుంటాయి. నన్ను ఇరవైమూడేళ్ళ వయసుదానిని పెళ్ళిచేసుకున్నాడు విశ్వనాధం. కానీ, ఆయన అభిప్రాయం ప్రకారం నేను అప్పటిదాకా మనస్సును శూన్యంగా అట్టిపెట్టుకుని, ఆ మహాపురుషునితో వివాహం కాగానే ఆయనను మనస్సులో పెట్టుకుని పూజించుకొంటున్నాననుకుంటాడు. ఇపుడు మీ వెంటవచ్చాను కాబట్టి తప్పంతా మీదేననుకుంటాడు. మీ మగజాతి సంగతంతా ఇంతే! ఆడదాని గురించి అనాదిగా మూర్ఖంగా కొన్ని అసందర్భపు భావాలను ఏర్పరచుకున్నారు. వాటినీ మాపైరుద్దారు. మాలోఅందరూ ఆ మీ అభిప్రాయాల ప్రకారం నడుచుకున్నట్లు నటిస్తాం. కానీ, ఒక్కోసారి సహజంగా ప్రవర్తిస్తాము. ఆ సహజప్రవర్తన మీ అభిప్రాయాలకు భిన్నంగా వుంటుంది గనక మీరు ఆడదాన్నర్థం చేసుకోవడం కష్టం అనుకుంటూంటారు.

ఎమోషనల్ గా స్త్రీపురుషులు సమానులే. మీ బుర్రల్లో ఏం మెదులుతుందో మా బుర్రల్లోనూ అంతే. వివాహమంటే అండదే పవిత్రంగా చూసుకోవాలి -పాతివ్రత్యం ఆడదానిధర్మం - అనేవి కల్లబొల్లి కబుర్లు. అంతరగతంగా ప్రతి ఆడదానికీ తెలుసు - ఇలాంటి కబుర్లు చెబుతుంటేనే మగవాడు సంతోషిస్తాడని. మాకు ఆర్థికస్వాతంత్ర్యం లేదుకదా? పిల్లలు అనే బంధాలు మమ్మల్నే ఎక్కువగా బాధిస్తాయికదా? అందుకే పడివుంటాము అబద్దాలు చెప్పుకుంటూ - అసహజమూ, అసత్యమూ అయి. "


నారాయణ: "అసలు స్త్రీకి పవిత్రత అనే విచిత్ర భావనలు ఈ కాలంలోనే విపరీతంగా, అర్థరహితంగా,శాస్త్రభిన్నంగా ఉన్నాయి. పరపురుషుడి వేలు తగిలితేనే కుక్క ముట్టినకుండ అంటారు. అంటే పగలగొట్టెయ్యొచ్చన్నమాట. కానీ మనపూర్వులు ధర్మశాస్త్రంలో అలా అనలేదు. కొన్ని స్మృతులను చూస్తుంటే ఈనాటికీ చాలా అడ్వాన్సుడ్ గా కనబడుతాయి. స్త్రీకి వ్యభిచారం అనేది ఓ పెద్దతప్పుగా చెప్పలేదు. ఆనేరానికి ప్రాయశ్చిత్తంకూడా సింపుల్గా చెప్పారు. స్త్రీకి వ్యభిచార దోషం ఒక రజోదర్శనం నుండీ మరో రజోదర్శనం వరకే అంటే ఒక బహిష్టు నుండీ మరో బహిష్టువరకూ అని. ఆ తరువాత ఆటోమేటిగ్గా ఆ పాపం పోతుంది. ఇంకా ఉల్లిపాయలు, మాంసాహారం తిన్న నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణునికే ప్రాయశ్చిత్తం చాలా ఎలాబరేట్ గా చెప్పారు."

"...మన శాస్త్రాలు కాన్స్టిట్యూషన్స్ లాంటివి. వాటికి అమెండ్మెంట్స్ ఇచ్చుకోమనికూడా శాస్త్రాలలొ నిర్దేశించారు. ధర్మశాస్త్రాల్లో సాంఖ్యాకంగా చెప్పి వీటిలో వేటినైనా మార్చుకోమన్నారు. అయితే ఆ మార్పు పెద్దలచెత చేయించమన్నారు. రాగద్వేషాలకు అతీతుడై, వయసుపండి ఆత్మదర్శనం చేసిన వ్యక్తిమస్తిష్కానికి తోచిన దానికంటే మించిన ధర్మం లేదు పొమ్మన్నారు. అట్టిధర్మం ఎలాంటిదయినా, అంతవరకూవున్న ధర్మశాస్త్రాలకు భిన్నంగా ఉంటే పాతధర్మాన్ని తుంగలో తొక్కమన్నారు...."


****

8 comments:

Kottapali said...

చిట్టిబాబెవరు?
చివుకుల పురుషోత్తం గొప్ప రచయిత. ఆయన నవల పేరు ఏది పాపం, ఏది పుణ్యం కాదూ? 1981-82 సమయంలో ఆంధ్రప్రభ వీక్లీలో ఒక సీరియల్ వచ్చింది - పేరు గుర్తు లేదు. అందులో హైందవ ఆధ్యాత్మిక సాధనలని గురించి చాలా డీటేళ్డుగా రాశారు. నేణు విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఈయన నవల్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా .. దొరకలా :(

సుజాత వేల్పూరి said...

నాకూ ఈ పుస్తకం గుంటూరు పాత పుస్తకాల షాపుల్లోనే దొరికింది. అనుకోకుండా నిన్ననే ఈ పుస్తకం చదివాను.

ఇందులో నారాయణ అభిప్రాయాలు, ప్రవర్తన ఆటోమాటిగ్గా పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. బాలా త్రిపుర సుందరిని ఉపాసించి, ఆమె సాక్షాత్కారం కూడా పొందిన వాడు (అంటే స్థితప్రజ్ఞత సాధించాడనేగా)ఇలా పరిస్థితులకు లొంగటమేమిటో అర్థం కాదు. అందునా స్త్రీల విషయంలో!

ఇంతగా ఇహలోక లంపటాల్లో మునిగిన వాడు సడన్ గా స్వామీజీ గా మారతాడు.

బహుశా మీరు ఉదహరించిన అభిప్రాయాల నేపధ్యంలోనే ఈ నవలకు "ఏది పాపం" అని పెట్టి ఉంటారు పేరు.

పురుషోత్తం గారు "మూడో పురుషార్థం " అనే నవల కూడా రాశారు. జవహర్ నగర్ మెయిన్ రోడ్లో ఒక పాత పుస్తకాల షాపుంది. అక్కడ దొరుకుతుందేమో ప్రయత్నించండి!

kasturimuralikrishna said...

మహేష్ కుమార్ గారూ, చివుకుల పురుషోత్తం విశ్వనాథ వారి శిష్యుడు. అతడి ప్రభావంతో రచనలు చేశాడు. అందుకే మన విమర్శకులు ఆయనను పట్టించుకోలేదు. మీరు విశ్వనాథ వారి చెలియలికట్ట, తెరచిరాకు లాంటి నవలలు చదవండి. మీకు నచ్చుతాయి. ఆలోచింప చేస్తాయి.

Anonymous said...

Thank you for writing review about a good book. Most of the social, religious and cultural malpractices were due to Brahmins urge for domination Hindu society.

We can get rid of such outdated practices in our society, and take our civilization to the next level, without converting to intolerant cults from West.

This excercise should be a cultural revival and reformation instead of embracing intolerant Abrahamic cults.

Anonymous said...

@kasturimuralikrishna: తెరచి రాజు అండి.
మొన్న ఆవేశం ఎందుకు..టపా చదివిన తరువాత ..

Anonymous said...

@Mahesh, You are choosintopics that have scope for critical review. Our society and culture are at cross roads. We need to reform them before we lost them for ever. We have to fight against evil forces internal and external (intolerant ideologies).

Keep writing about the subjects that allow people to think critically. There are many bloggers that write about movies, heros and heroins, and about some nonsense. There is no use of such endless gossip. We need to address the real issues facing by our socierty.

Kathi Mahesh Kumar said...

@సుజాత: ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. బహుశా నవలలో నారాయణ యొక్క నైతికనిబద్ధతని మీరు కాంక్షించినట్లున్నారు! ఆ నవల చెప్పదలచుకున్న విషయానికి అది విపరీతం.

జీవితంలో నైతికత,నిబద్ధతకన్నా ముఖ్యమైన విషయం "జీవించడం". ఇందులో నారాయణ అదేచేస్తాడు.అందుకే నవల పేరు ‘ఏదిపాపం?’.

ఇక మరణపుటంచుల్లోవున్న నారాయణకు బాలాత్రిపుర సుందరి కనిపించడాన్ని wishful thinking అని (western philosophy-psychology చదివిన తరువాత) నారాయణే చెబుతాడు.అంటే కొత్త జ్ఞానం పాతవిషయాలపై కొత్త ధృక్పధాన్ని కలిగించిందన్నమాట. అదేకదా జీవితం!!!

ఇక స్త్రీల విషయం అంటారా...అప్పటికే ఒక guilt లో నారాయణ తన విలువలని ప్రశ్నించుకునే సమయంలో వనజ తన అవసరంకోసం అతని మన:స్థితిని వాడుకుంటుంది. ఈ అనుభవంతో తన విలువల పరిధిని మార్చుకుని/పెంచుకుని నారాయణ జీవితాన్ని కొత్తగా చూస్తాడు. విభిన్నంగా/వింతగా ప్రవర్తిస్తాడు.ఇందులో వైరుధ్యంకన్నా, అతనిలోని ఎదుగుదలనే చూడాలి.

ఇహలోక లంపటాల్లో మినగనివాడికి నిజంగా స్వామీజీ అయ్యే అర్హతవుందంటారా!?!

@కొత్తపాళి: చిట్టిబాబు కూడా ఒక నవలా రచయితేనండీ ఆయన నవలలూ కాలేజిలోనే చదివాను. ఇప్పుడు మళ్ళీ ఆ నవలల వేటలోవున్నాను. దొరకగానే వారిగురించీ కొంత టపాకడతాను.

@మురళీకృష్ణ: మంచి సమాచారం అందించారు.ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

నవల మొదట్లో నారాయణ (తల్లి, తోబుట్టువుల చావుకు కారణమైన తండిని కూడా క్షమించగలగడం) కారెక్టర్ ని చూసి అటువంటి నైతిక నిబద్ధతను తర్వాతా ఆశించాను.

సరే, జీవించడమే ముఖ్యం అన్నారుగా! జీవించడం అంటే జీవితం ఎటు లాక్కెళితే అటు పోవడమేనా అని?

నవల చెప్పదల్చుకున్న విషయం అది కాదు కాబట్టి, నవల పేరే జీవితాన్ని ప్రశ్నించే విధంగా 'ఏది పాపం" కాడం వల్ల ఇక చర్చించి ప్రయోజనం లేదు. దేవతా సాక్షాత్కారం wishful thinking అని నారాయణ చెప్పడం నాకూ నచ్చింది.

ఇంతకీ ఇది చివుకుల గారి మొదటి నవల అని నాకు మీరు చెప్పేవరకూ తెలియదు.
చిట్టిబాబు గారు కూడా తెలియదు. ఇంతవరకూ పేరే వినలేదు.