Monday, November 10, 2008

మహిళ నుంచీ, ‘మానవి’గా మారిన ఒక స్త్రీ కథ

నవల పేరు : మానవి
రచయిత్రి: వోల్గా
ప్రచురణ కర్త: స్వేచ్చ ప్రచురణ
మొదటి ముద్రణ: 1998
ధర: 50 రూపాయలు
ప్రతులకు: ప్రజాశక్తి, దిశ, నవోదయ, విశాలాంధ్ర బుక్ హౌస్


ఇల్లే స్వర్గం. భర్తే దైవం. పిల్లలే లోకం అనుకున్న ఒక మహిళకు, తను నమ్మిన విలువలన్నీ ఒక్క క్షణంలో ఆవిరైపోతే? ఇల్లాలిగా తన హోదా, భార్యగా తన గుర్తింపు, తల్లిగా తన గౌరవం అర్థాంతరంగా ప్రశ్నార్థకమైతే? ప్రేమించే భర్త మరో స్త్రీని ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిస్తే? తన విలువలు పుణికిపుచ్చుకున్నదనుకున్న కూతురు, తన సంసారాన్ని కాపాడుకోవడానికి ఆ తల్లినే దూరం చేస్తే? బంధాలతోనే కొలవబడి. అనుబంధాల ఆసరాతోనే జీవితాన్ని అర్థం చేసుకుని. ఇల్లాలిగా మాత్రమే గౌరవాలందుకున్న ఒక మహిళను, ఎంచుకున్న జీవితం, పెంచుకున్న బంధం. అర్థరహితమై, తన అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే? అప్పుడా మహిళ ఏం చేస్తుంది?


ఈ ప్రశ్నలకు సమాధానమే ‘వోల్గా’ నవల ‘మానవి’. పాతికేళ్ళ కాపురం తరువాత, డాక్టర్ సురేష్ తన తోటి డాక్టర్ నీలిమతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అతడికి భార్య,కొత్తగా పెళ్ళయిన కూతురు, యూనివర్సిటీలో చదువుతోన్న మరో కూతురు ఉంటారు. అయినా అతడు ఈ బంధం నుంచి తప్పించుకోలేకపోతాడు. భార్యతో ఈ విషయం దాచకుండా చెప్తాడు. దానితో అతడి భార్య వసంత దాదాపు పిచ్చిదవుతుంది. భార్యగా తనలో ఏదైనా లోపముందా! ఇల్లాలిగా తను ఏదైనా తప్పుచేసిందా!! తల్లిగా తనుభాద్యతలు నెరవెర్చలేదా!!! అనే మీమాంశలో వసంతం ఉక్కిరిబిక్కిరవుతుంది. నీలిమలో గల ఆకర్షణేమిటో తను ఇప్పుడు భర్తని ఎందుకు ఆకట్టుకోలేకపోతోందో తెలీక సతమతమవుతుంది.ఏంచెయ్యాలో తెలీదు. ఎలా భర్తను "అదుపులో పెట్టుకోవాలో" అర్థం కాదు. ఈ నిరాశానిస్పృహల మధ్య భర్తకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసి, మళ్ళీ ప్రేమికురాలి దగ్గర స్వాంతన పొందేంతగా మానసికహింసకు గురిచేస్తుంది. తనూ మానసికక్షోభ అనుభవిస్తుంది.


ఈ సంఘర్షణలో భాగంగా, తన ఆలోచనలకూ ఆకాంక్షలకూ ప్రతిరూపమైన పెద్దకూతురు లావణ్య దగ్గర స్వాంతనపోందాలనుకుంటుంది. కానీ, తల్లికన్నా తన సంసారం ముఖ్యమనుకునే లావణ్య, తల్లికి ఆర్థికంగా తండ్రి సహాయం చెయ్యాలనే షరతు (తన భర్తద్వారా) తండ్రికి తెలియపరుస్తుందే తప్ప, వాళ్ళని కలిపే ప్రయత్నం చెయ్యదు. అవసరానికి కావాలనుకున్న తల్లి కష్టాల్లో వుండటం చూసి, తప్పించుకోవాలనుకుంటుందేతప్ప ఆధారమై ఆదుకోవాలని అనుకోదు. ఈ విధంగా ఆశపెట్టుకున్న కూతురు నిరాశపరుస్తుంది. కారణం, ఆ కూతురికీ తన సంసారమేతప్ప తల్లిదండ్రులు ముఖ్యంకాదు.


వ్యక్తిత్వాన్ని మూర్తీభవించినట్లుండే (యూనివర్సిటీలో చదివే) రెండో కూతురు ‘నవత’ ఒకవైపు తల్లికి ఆసరాగా నిలవడమేకాక, తండ్రిని అర్థం చేసుకుని గౌరవప్రదంగా తల్లిదండ్రులు విడిపోవడానికి తోడ్పడుతుంది. నవత సహవాసంలో వసంత తన జీవితంలో అప్పటివరకూ నమ్మిన విలువల్ని త్యజింస్తుంది. ఇల్లే ప్రపంచంగా, భర్తా పిల్లలే జీవితంగా తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా ఒక reflected relationships యొక్క ఆసరాతో బ్రతికిన ఒక గృహిణి, తను నమ్మిన విలువలన్నింటినీ ఒక్క క్షణంలో కోల్పోయిన తరువాతకూడా, zero base నుంచీ జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ, పాత విలువల్ని (భర్త సురేష్ ని) ఒక dispassionate human being గా కళ్ళలోకళ్ళుపెట్టి చూసిన తరువాత, మార్పుని మనస్ఫూర్తిగా ఆహ్వానించి పరిపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకుని "మానవి" అవుతుంది.


ఈ నవలలో రచయిత్రి ఉద్దేశం 'మహిళకు తనదంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. సంబంధాలు తన జీవితాన్ని నిర్వచించక, ఒక మనిషిగా తనకు ఒక వ్యక్తిత్వం-అస్థిత్వం ఉండాలి' అనిచెప్పడం. అందుకే అటు నీలిమకూ ఇటు సురేష్ పాత్రకూ ప్రాధాన్యత ఇవ్వలేదు. Point of conflict ఆ సంబంధం అయినప్పటికీ, ప్రధాన వస్తువు కాదు. ఒక మహిళ, భార్య,తల్లి,గృహిణి నుంచీ మనిషిగా మారిన వసంత లో జరిగే "మార్పు" కథావస్తువు. కాకపోతే, రచయిత్రి ఈ సంబంధాన్ని సమాజిక విలువలకోణంలోంచీ చూపించి నిరసించకపోవడం ఒక పెద్ద తెరపి అనుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో, నీలిమ పాత్రను ఒక వ్యాంప్ లాగా చిత్రిస్తే, వసంత పాత్రకు మరింత సానుభూతి దక్కుండేది. కానీ అలా చెయ్యకపోవడం రచయిత్రిలోని ప్రత్యేకతని చాటుతుంది.


అదే విధంగా సురేష్ పాత్రకూడా సాధ్యమైనంత సాధారణంగా ఈ "తప్పు" గురించి భార్యదగ్గర ప్రస్తావిస్తాడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఎక్కడా నీతి,అనైతికతా అనే పదాలు రాకపోవడం. ఈ ఘటనని ఒక మానవీయపరిస్థితి (human situation) గా ఎటువంటి value judgment లేకుండా చెప్పటంలో రచయిత్రి చేసిన కత్తిమీది సాము అభినందనీయం. ఈ నవలలో, ఆర్థికంగా సామాజికంగా స్వతంత్ర్యంగా ఉంటూ, శారీరక-మానసిక అవసరాలకోసం ఒకపెళ్ళయిన మగాడితో సంబంధం కొనసాగించే వసంత స్నేహితురాలు శాంత నీలిమను రెప్రెజెంట్ చేస్తే. వసంతం- శాంతల పాత్రధోరణులలోని భిన్నత్వానికి వారధిలా, ఒకవైపు ఇల్లూ చూసుకుంటూ మరో వైపు డాక్టరుగా తన వ్యక్తిత్వాన్నీ నిలుపుకుంటూ మరో స్నేహితురాలు డాక్టర్ రోహిణి కనిపిస్తుంది. అతిముఖ్యంగా వసంత చిన్నకూతురు నవత భవిష్యత్తుకు చిహ్నంగా అనిపిస్తుంది.బహుశా అందుకే తన పేరు "నవత" అయ్యిందేమో! ఈ విధంగా మహిళా సాధికారతలోని వివిధస్థితిగతుల్ని రచయిత్రి తన పాత్రలద్వారా చూపించడం, అదీ సామాజిక విలువల ప్రస్తావన లేకుండా హృద్యంగా అనిపిస్తుంది.


భార్య, తల్లి,గృహిణిగా వసంత తన identity కోల్పోయి, ఆఖరికి వసంత, వసంతగా మిగులుతుంది. కేవలం ఒక మహిళగా కాకుండా ఒక వ్యక్తిగా, మనిషిగా, మానవిగా మిగులుతుంది. prescribed, ascribed and reflected identities పోయి తన true identityతో మిగులుతుంది.

తప్పకుండా చదవ వలసిన నవల. ప్రచురించబడి పది వసంతాలు కావస్తున్నా, ఇప్పటి పరిస్థితులకూ అన్వయించుకోదగ్గ విషయమున్న నవల.


****

11 comments:

శ్రీ said...

ఆసక్తికరంగా ఉంది ఈ పుస్తకం. తప్పక చదవడానికి ప్రయత్నిస్తాను.

SaveNatives said...

Kathi,

Good Analysis. Nothing to add from my side. Keep up the good work.

Anonymous said...

Hi Kathi,

You have choosen a nice subject and provided good analysis.

BTW. I have just read the post in which you wrote about your son's Krishna getup.

Your son looks wonderful in Lord Krishna getup.

Anonymous said...

I read this story long back in vipula/chatura........before even knowing who volga is....may be in my 7th class or so. I just gave up all the hope of finding this story again. Somehow it influenced me a lot. Thank you very much for letting me know about this novel.

సుజాత said...

ఇలాంటి వివాహేతర సంబంధాలు ఏర్పడినపుడు ఒక వ్యక్తిత్వం అంటూ లేని సగటు భార్యలు ఎలా కుదేలై పోతారో ఈ నవల చూపిస్తుంది. మనిషిగా ఎలా మారాలో చెపుతుంది.

కానీ ఇది నవల కాబట్టి నవత అనే కూతుర్ని ప్రవేశ పెట్టి ఆమె ద్వారా వసంతలో మార్పు వచ్చినట్టు చూపించింది ఓల్గా. మరి ఇద్దరూ లావణ్య లాంటి కూతుళ్ళే ఉంటే వసంతలు ఏం చెయ్యాలో చెప్పలేదు.

సరే, ఇవన్నీ పక్కనపెడితే ఇలాంటి పనులకు సురేష్ లు ఎందుకు వొడిగడతారో, పాతికేళ్ళు కాపరం(ఈ నవల్లో ఎటువంటి కలతలూ లేకుండ అన్యోన్యంగా ఉంటారు వసంత, సురేష్ లు) చేసిన భార్య మీద "ప్రేమ" లేకపోవడం ఏమిటో అంతుబట్టదు. 'నువ్వు సురేష్ ని ప్రేమిస్తున్నావా" అంటే వసంత "ప్రేమించడం ఏమిటో నాకు తెలియదు, నేను సురేష్ భార్యగా ఉండాలి అంతే" అంటుంది.మరి సురేష్ భార్య హోదా చాలు అనుకున్నామె గుండెలు పగిలేలా ఏడ్చి,ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తుంది. నవల చదివిన వారికి ఆమె కేవలం "సురేష్ భార్య హోదా" కోసమే ఏడుస్తుందని అనిపించదు.

చివర్లో తన కాపరం నీటిమీద బుడగ అని తెలిసాక సురేష్ ని చూసినా ఆమెలో ఏ స్పందనా కలక్కపోవడం...అది ఓకే!

Anonymous said...

mahEsh gArU,
I totally agree with you. I read it a few years ago and thought it is an awesome book. If you haven't already read, read vOlgA's "swEcca" too. That too is quite a thought provoking book.
Aside-
I am still waiting for your story's (nirNayam) part-3 :) It was quite nice.
regards
Sharada

Kathi Mahesh Kumar said...

@సుజాత:చాలావరకూ వసంతలకు లావణ్యలాంటి కూతుళ్ళే ఉంటారు.తల్లులు చాలామంది కూతుర్ని "మంచి అమ్మాయిలాగా"నే పెంచుతారు.అమ్మాయిలకుండాల్సిన మంచివ్యక్తిత్వం మూస మన సమాజంలో ఇంకా తయారవ్వలేదనుకుంటాను.

ఇలాంటి పనులకు సురేష్ లు ఎందుకు చేస్తారు అనేదానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేం.ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలాపుడుతుంది చెప్పలేం. దాన్ని ఎలా నియంత్రించాలి అనేది ఆ పరిస్తితుల్లో మనిషి చేతుల్లో వుండదు.

ఇక వసంత-సురేష్ లు పాతికేళ్ళు కాపురం చేసినా ప్రేమ లేకపోవడం అంటారా..ఇక్కడ వారిమధ్య "ప్రేమ లేదు" అనేదాన్ని బహుశా రెండుకోణాలనుంచీ చూడాలి. మొదటిది అభిరుచులు,ఆలోచనలూ కలిసిన నీలిమ-సురేష్ ల ప్రేమలాంటి 'ప్రేమ' ఈ సంబంధంలో లేదు. రెండోది పెళ్ళి చేసుకుని సంసారం సాగిస్తున్నారుకాబట్టి కేవలం దాన్నొక 'బాధ్యత'గా భావిస్తూ కలిసి బ్రతికారేగాని, అనుభవైక్యమైన ప్రేమ వారిమధ్య లేకుండా ఉండివుండొచ్చు.

సురేష్ భార్యగా గుర్తింపునీ, మంచితల్లిగా సామాజిక గౌరవాన్నీ, మంచి గృహిణిగా తన బాధ్యతనీ వసంత నెరవేర్చినా, సురేష్ నీలిమలో పొందిన ప్రేమ వసంత ఇవ్వలేకపోయుండచ్చు.

నిజానికి నవలలోని కొన్ని భాగాలు (ముఖ్యంగా శాంతితో వసంత పెట్టుకునే గిల్లికజ్జాలు) చదివితే, అసలు వసంతకు "ప్రేమ అంటే ఇదీ !" అనే స్పృహేవున్నట్లుగా కనపడదు. అంటే తను పెళ్ళైందికాబట్టి, భర్త బాగోగులు చూసింది. తల్లికాబట్టి పిల్లల జీవితాల్ని చక్కదిద్దే(?) ప్రయత్నం చేసింది. గృహిణికాబట్టి ఇల్లే సర్వస్వం అనుకుంది. ఇందులో "ప్రేమ" ఎక్కడుందో...కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా!

ప్రేమ అనేది కలిసి జీవితాన్ని పంచుకున్నంతమాత్రానా వచ్చే default setting కాదు. చాలామంది బాధ్యతలు నిర్వర్తించడం ప్రేమ అనుకుంటారు. ఇక్కడ వసంత పాత్ర చేసేదీ అదే. పెద్ద కుమార్తె లావణ్య-వసంతల మధ్యనున్న తల్లీకూతుళ్ళ ప్రే....మ చూడండి.దాన్ని ప్రేమ అందామంటారా?

కనీసం తల్లీపిల్లలమధ్య unconditional ప్రేముండాలని మనం నమ్ముతాంకదా! కానీ ఇక్కడ నిజం ఎదురుగా నిల్చునేసరికీ, ప్రేమలు ఎలా "హుష్ కాకి" అయిపోయాయో చూడండి. అంటే, వారి మధ్య ఉన్నది, బాధ్యతతో కూడిన బంధం. అదీ అవసరాన్నిబట్టి మారిపోయే సంబంధం. భార్యాభర్తలుగా వసంత-సురేష్ మధ్యకూడా ఇలాంటి సంబంధమే పాతికసంవత్సరాలుగా నడిచుండొచ్చు. కొంచెం అతిశయంగా అనిపించినా అదొక possibility. కాదనగలమా?

చివర్లో భర్తనికూడా ఒక సమమానమైన సాధారణ ‘మనిషి’లాగా,వసంత చూడగలగటమే తను సాధించిన వ్యక్తిగత పరిణితి.అందుకే తను మానవి అయ్యింది.

@శారద: స్వేచ్చ కూడా చదువుతానండీ. suggest చేసినందుకు ధన్యవాదాలు.నిర్ణయం దాదాపు పూర్తయినట్లే ఈ వారాంతరంలోపు బ్లాగులో పోస్ట్ చేస్తాను.

@భవాని: మళ్ళీ ఇప్పుడు చదవండి ఇంకా బాగా అనుభవించగలరు.

@శ్రీ: చదివెయ్యండి సార్ ఓపనైపోతుంది.

ప్రతాప్ said...

Good review.
కానీ కథ మొత్తం రివ్యూ లో చెప్పేస్తే ఎలా అండి. అస్సలే నేను చదవాలని కొనిపెట్టుకొన్న నవల.

మధుశ్రీ said...

ఈ నవల నేనూ చదివాను.
"ప్రేమ ఎప్పుడు ఎవరికి పుడుతుందో..చెప్పలేం"...
అవును, వసంతకా వయసైపోయింది. ఇద్దరు పిల్లల తల్లి. పైగా అభిరుచులు కలిసిన ప్రేమ కాదని వంక ఒకటి. అభిరుచులు కలిస్తే స్నేహంగా ఉండాలి కానీ అభిరుచులు కలిసిన వాళ్లందరితోనూ సంబంధాలు పెట్టుకుంటారా సురేష్ లాంటి భర్తలు? పెళ్ళైన పాతికేళ్ళకు గుర్తొచ్చాయా అభిరుచులు? వసంత ఇష్టాలేమిటో, అభిరుచులేమిటొ తెలుసుకోడానికి సురేష్ ఏనాడైనా ప్రయత్నించాడా?

"అబ్బ, రోజంతా చాకిరీ, పని..మార్పు లేని జీవితం" అని వసంత కూడా విసిగిపోయి మరో కిషోర్ తో ఇదే రకమైన ప్రేమ వెలగబెడితే సురేష్ వసంత లాగా ఏడ్చి ఊరుకుంటాడా?

విషయం ఏమిటంటే....అందరూ కాకపోయినా కొందరు మగాళ్లకు కొన్నాళ్ళకు , మార్పు కావాలి. దానికి మారుపేర్లే....ఈ అభిరుచులు కలిసిన ప్రేమలూ, వంకాయలూనూ!

Kathi Mahesh Kumar said...

@మధుశ్రీ: మీధృక్పధం చాలా సహజంగా వుంది. కాకపోతే,ఇలాంటి సంబంధాలు చాలా వ్యక్తిగత పరిధిలో ఏర్పడుతాయి, వాటి వివరాలు ఆబంధంలో వున్న ఇద్దరికీతప్ప మిగతావారికి తెలిసేవికావు.

అందుకే హిందీలో "ప్యార్ కియానహిజాతా హోజాతాహై అంటారు". ఇలాంటి సంబంధాలు పెట్టుకోరు. అలా జరిగిపోతాయి అంతే!

మనంవారి మానసిక,శారీరక,సమయ పరిధిలో ఉండముగనక,వీటి గురించి కూలంకషంగా అర్థం చేసుకోలేము.అందుకే, మన వ్యక్తిగతధృక్కోణం నుంచో లేక సామాజిక విలువల నేపధ్యం నుంచో బేరీజుచేసి ఒక judgment వెలువరించేస్తాము.లేదా, "నేనైతే ఇలాచెయ్యను." "కొందరుమగాళ్ళు ఇలాగే చేస్తారు" లాంటి generalization చేసి, మనకు అర్థమయ్యేవిధంగా ఈ సంబంధాల్ని నిర్వచిస్తాము.ఇది సహజంగా జరిగే ప్రక్రియ.We are conditioned to do that.

"అభిరుచులు కలిసిన ప్రేమల"గురించి నేను చెప్పింది ఒక possibility మాత్రమే.సురేష్ కు భార్యమీద అభిమానం లేదు అనేది చాలావరకూ నిజం కాకపోవచ్చు. ఎందుకంటే,తను రహస్యంగాకూడా ఈ సంబంధాన్ని కొనసాగించుండొచ్చు.కానీ,వసంతకు నిజాయితీగా ఈ విషయం చెబుతాడు. అది అతని వ్యక్తిగత నిబద్ధతకు చిహ్నంకదా!

పైగా, సురేష్ వసంతని నిర్లక్ష్యం చెయ్యలేదు. తను అప్పుడు చిక్కుకున్న పరిధిలో సాధ్యమైనంతవరకూ "న్యాయం" చెయ్యడానికే ప్రయత్నించాడు. లేదా కనీసం అన్యాయం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించాడు అని చెప్పుకోవచ్చు.

వసంత తన ఆక్రోశాన్నీ,అక్కసునూ,ఉక్రోషాన్నీ తెలియజెప్పే ప్రయత్నంలో, అసలే అందిగ్ధంలోవున్న సురేష్ కు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ పరిస్థితుల్లో సురేష్ కొంత కటువుగా ప్రవర్తించినా, లేక స్వాంతనకోసం నీలిమ దగ్గరికి బయల్దేరినా తప్పుపట్టలేము.

అదొక మానసిక సంఘర్షణ సమయం.అప్పుడుకూడా సురేష్ "నీ దిక్కున్నచోట చెప్పుకో" అనలేదు.He has committed a mistake from our point of view for sure,కానీ అతడు దుర్మార్గుడైతే కాదనిపిస్తుంది.

@ప్రతాప్:హయ్యో !సమీక్షలో మొత్తం కథ ఎక్కడ చెప్పానండీ. నేను చూపింది అస్తిపంజరాన్ని మాత్రమే, నిజానికి ఈ నవలలో కథనం, సంభాషణల్లో మొత్తం జీవం ఉంది. చదవండి.You will not miss out anything.

dhaathri said...

సీరియల్ గా సగం చూసాక నవల కొని చదివాను అస్తిత్వ ఆవేదన కు ఒక మార్గం చూపించారు ఓల్గా ఈ పదేళ్ళలో మరింత ఆలోచనా శక్తీ మరింత ధైర్యం స్త్రీలలో పెంపొందాయి ఆత్మ గౌరవాన్ని నిలుపుకునే వసంత ఆమె స్నేహితురాలు పద్మ అనుకుంట ఒకతని తో సహజీవనం సాగిస్తూ ఉంటుంది ఆమె అలాగే మరో కోణంలో మరో స్నేహితురాలు ఉద్యోగం బాధ్యతలో మునిగి పిల్లల్ని చుసుకోలేకపోతున్నానని బాధ పడుతుంది స్త్రీ ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత అవసరమో అంత హార్దిక స్వాతంత్ర్యం కూడా అని చెప్పే దశాబ్దం క్రితం దైనా ఎవెర్ గ్రీన్ నవల ...దీనికి ప్రేరణ డాలస్ హౌస్...అనే ఆంగ్ల నాటకం ...ఇక సురేష్ అన్నేళ్ల తర్వాత మరో స్త్రీని ప్రేమిన్చడమనేది......లాజిక్ కి అందదు...కొన్నిటికి సమాధానాలు ఉండవు ... తన వృత్తిని ప్రవృత్తిని అర్ధం చేసుకున్న మనిషి దొరకడం వల్ల అని నా ఉద్దేశం వసంత ఇల్లాలు మాత్రమే జీవన సహచరి కాదు..ఇది చాల మంది జీవితాల్లో ముఖ్యంగా కళాకారుల సాహిత్య కారుల జీవితాల్లో గొప్ప ప్రొఫెషనల్స్ జీవితాల్లో సహజం .....అయతే అందరి అసంతృప్తికీ సమాధానం ఉండక పోవచ్చు ..ఇందులో స్త్రీ పురుషుని సహాయం లేకుండా కూడా ఉండగలదనే విషయాని వసంత చేత , లేలుండా ఉండలేడని పద్మ చేత....నిరూపించే చిత్రణ చాల బాగా చేసారు ఓల్గా......మీ సమీక్ష బాగుంది మహేష్ గారు ...ప్రేమతో....జగతి