Thursday, November 6, 2008

ఫ్యాషన్...అంటే!

మధుర్ భండార్కర్ ‘ఫ్యాషన్’ సినిమా చూసినతరువాత వచ్చిన కొన్ని అసంపూర్ణ ఆలోచనలు.


ఫ్యాషన్ TV మొదలైన కొత్తల్లో ఒక మిత్రుడితో కలిసి చూస్తూ, "అసలు నిజజీవితంలో ఈ బట్టలెవరైనా వేసుకుంటారా?" అనే ఒక ప్రశ్న లేవదీసాను. దానికి ఆ మిత్రుడు సగౌరవంగా,"నీ పరిధిలోని జీవితంలో ఈ దుస్తులు వేసుకునేవాళ్ళు లేకపోయినంతమాత్రానా, ఇలాంటివి వేసుకోరని ఎందుకనుకుంటావు. బహుశా, మన స్థాయికీ,పరిధికీ అంతుచిక్కని ప్రపంచంలో వీళ్ళు వుంటారేమో కదా!" అన్నాడు. అప్పుడు నేను తనతో అంగీకరించకపోయినా, ఇప్పుడు తలుచుకుంటే ఆ మాటల్లోని మర్మం అర్థమవుతోంది.


పదిసంవత్సరాల క్రితం కేవలం ఫ్యాషన్ టీవీలో మాత్రమే కనిపించిన దుస్తులు, ఐదారు సంవత్సరాలక్రితం సినిమాలలో ప్రవేశిస్తే, ప్రస్తుతం షాపింగ్ మాల్లలోనూ, వాటికొచ్చే మన ఎదురింటి పక్కింటి అమ్మాయిలూ,అబ్బాయిల వంటిమీద కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ అంటే, అప్పటి సమాజంలో చాలా మంది ఆచరించే ఆహార్యశైలి అనుకుంటే, ఈ మార్పు త్వరితగతిన జరిగిందని అనిపిస్తుంది. కానీ, ఫ్యాషన్ నిజజీవితాలకు దూరంగా వుంటుందా అని ప్రశ్నించుకుంటే మాత్రం, "కాదేమో!" అనిపించకమానదు. మనకు తెలియకుండానే చాలా ఆహార్యధోరణులు మన జీవితాల్లో వివిధస్థాయిల్లో ప్రవేశించేస్తాయి.


ప్రతి ప్రాంతానికీ తగ్గ ఆహార్యవ్యవహారాలు అనాదిగా వస్తున్నాయి. కానీ, ఈ విస్తృతత్వం మాత్రం బహుశా 18 వశతాబ్ధంలో పెద్దస్థాయిలో బట్టల పరిశ్రమలు స్థాపించబడి, వివిధరకాల వస్త్రాలు జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చినప్పటినుండీ వేగవంతమై, ఒక వ్యవస్థీకృతమైన రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. లండన్, ప్యారిస్,మిలాన్ వంటి యూరోపియన్ నగరాలు ఈ ఫ్యాషన్ రంగానికి ఆద్యులనుకుంటే, భారతదేశంలో ఢిల్లీ,ముంబై నగరాలు ఫ్యాషన్లకు పుట్టినిల్లులుగా గుర్తిస్తాము.


నా జీవితంలో చాలా భాగంవరకూ ఫ్యాషన్లని నిర్దేశించింది మాత్రం మా ఊరి దర్జీ (టైలరు). మా టీచరొకాయన తనసొంతమైన అర్థం వచ్చేటట్లు "we are all tailor made personalities" అనేవాడు. తను ‘పర్సనాలిటీ’ అనేపదానికి తీసిన అర్థం వ్యక్తిత్వమని కాకుండా, appearance గురించి వుండేది. నిజానికి, వ్యక్తిత్వానికి తీసుకొనే ఒకానొక కొలమానాలలో వేషధారణ,ఆహార్యం కూడా వుంటాయి. కాబట్టి, ఈ విధంగా చూస్తే, మనం టైలర్లు చేసిన మనుషులమే కదా!


నా చిన్నప్పుడు సఫారీ సూట్ల ఫ్యాషనొకటొచ్చింది. నేనూ మా నాన్నా, అన్నయ్యా ముగ్గరం ఒకే రంగు సఫారీ సూట్లేసుకుని పండగకు ఊరికి బయల్దేరేవాళ్ళం. ఆ సమయంలో మరేదైనా ఫంక్షన్ జరిగినా ‘ఒకే ఫ్యామిలీ’ తరహాలో ఒకేరకం బట్టలతో దిగుమతయ్యేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే చాలా చిత్రంగా వుంటుందిగానీ. అప్పట్లో చాలా కుటుంబాలలో ఇదే పద్దతుండేది.


ప్యాంట్ల విషయంలో నాకు బాగా గుర్తున్న మార్పు. గొట్టాం (ప్యారలల్)ప్యాంట్లనుంచీ కనీసం నాలుగేసి ఫ్లీట్లున్న (మడతలు) బ్యాగీప్యాంట్లలోకి మారడం. బహుశా ఏదో సినిమాలో నాగార్జున ఆ ప్యాంటు తరహా వెయ్యడంతో, ఒకే రాత్రికి ఆంధ్రదేశం మొత్తం ఈ బ్యాగీప్యాంట్లు ఫ్యాషనై కూర్చున్నాయి. ఆ ప్యాంటుల బెలూను తరగా ఉబ్బడానికి తోడు, సరిగ్గా ఐరన్ చెయ్యకపోతే చిత్రంగా కనిపించే ఫ్లీట్లొకటొచ్చి పడ్డాయి. కొందరైతే ప్యాంటుకున్నవి చాలనట్లు, షర్టులకి కూడా, మధ్యలో చీలినట్లో లేక అటూఇటూ మడిచినట్లో ఈ ప్లీట్ల ఫీట్లు పడేవారు. ఆప్పట్లో కొందరు పెద్దోళ్ళు, "ఇదేం లేటేస్ట్ ఫ్యాషన్ ‘గుండమ్మ కథ’ సినిమాలో ఏఎన్నార్, ఎన్టీయార్ ఈ ప్యాంట్లే వేస్తేనూ" అనేసారుకూడాను.


ఆ తరువాత వచ్చిన విప్లవాత్మకమైన మార్పు. జీన్స్ ప్యాంట్. మొదట్లో ఈ గోనెపట్టలూ,టార్పాలిన్ తరహా ప్యాంట్లు ఎవరేస్తారనుకున్న నాలాంటి చిన్నూరు జనం, అతిత్వరలో ఈ జీన్స్ యొక్క సౌలభ్యాలను (ఉతక్కుండా వారమేసుకోవచ్చు, ఐరనింగ్ ఇతర మెయింటెనన్స్ సున్నా) గుర్తించి ఆదరించేసాము. అదే తీరులో లంగా ఓణీలు వేసే ఆంధ్ర అమ్మాయిలు సౌలభ్యాలను గుర్తించి, సల్వార్ కమీజులను స్వాగతించేసారు. నా చిన్నప్పుడు ఎవరైనా ఆడపిల్లలు సల్వార్ కమీజ్ (మా వైపు ఇప్పటికీ పంజాబీ డ్రస్సులంటారు) అడిగితే, "నీకెందుకే ఈ తురక డ్రస్సు" అనేవారు. కారణం, అప్పట్లో ఈ దుస్తుల్ని కేవలం ముస్లిం అమ్మాయిలు మాత్రమే ధరించడం.


ఒకప్పుడైతే, ఊరి టైలర్ కుట్టినబట్టల్ని బట్టి మన ఆహార్యాలు తయారయ్యేవి. కనీసం కొంత భిన్నత్వం,కూసింత వ్యక్తిత్వం ఆ టైలర్నిబట్టీ మనం కుట్టించుకున్న తీరునిబట్టీ ఉండేవి. కానీ, ఇప్పుడు ఎక్కడచూసినా మనం వేసుకున్న బట్టల్లాంటి బట్టలే ప్రతిఒక్కరూ వేసుకుని కనబడతారు. ఈ విధంగా ఫ్యాషన్ ప్రజాస్వామ్యం వచ్చేసిందన్నమాట.


అప్పటికీ ఇప్పటికీ FTV లోనో ఇండియా ఫ్యాషన్ వీక్ లోనో వుంటుందనుకునే ఫ్యాషన్ చాపక్రిందనీరులా బట్టలరూపంలో, ఇతర వస్తువుల రూపంలో మన ఇంటికీ, ఒంటిమీదకీ చేరుతూనే వున్నాయి. తేడాఅల్లా, ఇప్పుడది చాలా త్వరగా జరుగుతోంది. ఒకప్పుడు మనకు సౌలభ్యంగా అనిపిస్తేనే అవి పాప్యులర్ అయ్యేవి, కానీ ఇప్పుడు పాప్యులర్ చేసిమరీ మనచేత కొనిపిస్తున్నారు. అంతే తేడా...ఏది ఏమైనా ఫ్యాషన్ మనలో వుంది.ఉంటుంది కూడానూ!

16 comments:

నవ్వులాట శ్రీకాంత్ said...

మన మీద సమాజం పట్టు తగ్గి ,వ్యక్తిగత స్వేచ్చ పెరగటం,ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడటం,మన అవగాహనా పరిధి విశాలమవ్వటం కూడా ఫాషన్ వేపు మన అడుగులు పడటానికి కారణాలుగా చెప్పుకోవచ్చు .

గీతాచార్య said...

fashion is the art of expressing one self in a particular manner. it's there from time immemorial, when an early man wore two leaves around him. It was new to everybody then.

after that there were so many fashion kings and queens. I stopped wondering about fashion long back. You here missed your usual punch.:-)

కొత్తెప్పుడూ నెగ్గుకు రావటం కష్టమేనండీ. నేను మొదటి సారి పాంట్ వేసుకునేందుకు నిరాహార దీక్ష చేశాను. అబ్బో అదేదో ఒక తెల్ల పాంటు ని సైజ్ చేయించి నా బులబాటకం తీర్చారు. ఓ సంగతి చెప్పనా? అప్పుడు పాంట్ల కోసం కష్టాలు పడ్డా ఇప్పుడు నిక్కర్లె సుఖం అని తెలుసుకున్నాం. (షార్ట్స్). నిక్కర్ అంటే Out of fashion మరి.

Anonymous said...

గీతాచార్య, మీ ప్యాంటు వ్యవహారం చదవగానే ముళ్ళపూడి వెంకటరమణ కోసం వాళ్ళమ్మ, అమ్మమ్మ కలిసి ప్యాంటు కుట్టిన - తయారుచేసిన అనాలి - సంగతి (ఆయన రాసుకున్నది) గుర్తొచ్చింది.

సుజాత వేల్పూరి said...

మరి మోకాళ్ల కింద కూడా కలిపి పదహారు పాకెట్లు(జేబులు) ఉండే పాంట్ల గురించి రాయలేదేం? కావాలనుకున్నట్టు, షార్ట్ గానూ, 3/4 గానూ, ఫుల్ పాంట్ గానూ ఎక్కడికక్కడ ఊడగొట్టి, మార్చుకునే మల్టీ జిప్పుల పాంట్ల గురించి కూడా రాయలేదు. ఇప్పుడవి ఎక్కడ చూసినా కనపడుతూ విరక్తి పుట్టిస్తున్నాయి.

మన పరిథి లో మనం చూడనివన్నీ ప్రపంచమంతటా ఉండాలని రూలుందా ఏమిటండీ? ఫాషన్ టివి లో చూపించే లాంటి బట్టలకు కొంచెం దగ్గరగా మన నిఫ్ట్ వాళ్ళు కూడా తయారు చేస్తారు. అవన్నీ కేవలం ramp show లకే పరిమితం! నెత్తిన పక్షి గూళ్ళ లాంటి హాట్లు, వెనక మైలు దూరం వరకు వూడుస్తూ ఈడుస్తూ ఉండే వస్త్రాలు, ఇవన్నీ బయటకొచ్చే వాళ్ళు అది ఏ సందర్భమైనా (విచిత్ర వేషధారణో, ఫాషన్ షో నో అయితే తప్ప) వేస్కోరు.

చదువరి గారు,
భలే గుర్తు చేసారు.

ఉమాశంకర్ said...

ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నా నేనిప్పటికీ జీర్ణిచుకోలేని ఫ్యాషన్ ఒకటుంది, చిరిగిన బొక్కలున్న జీన్స్ ప్యాంట్. ఇండియాలో పెద్దగా చూసిన గుర్తు లేదు గాని, ఇక్కడ మాత్రం విరివిగా కనపడుతుంది. కొన్ని బొక్కలు ఎంత పెద్దవిగా ఉంటాయంటే ప్యాంట్ వేసుకొనేటప్పుడు కాలు వాటిల్లోకి జారిపోకుండా ఎంత కష్టపడాలో అనిపిస్తుంది.

ఇక ఫ్యాషన్ షొల్లో కనపడే ఫ్యాషన్లు మాత్రం నా బుర్రకి ఇప్పడు కాదు ఎప్పటికీ అర్ధంకావు. నావరకు నాకు అదొక సీక్రెట్ సొసైటీ.


చానాళ్ళ తరువాత ఒక సరదా విషయంపై రాసినట్టున్నారు.సినిమా రివ్యూలు, రెస్టారెంటోఫోబియా లాంటివి కొన్ని మినహాయిస్తే మీనుంచి సరదా టపా వచ్చి చాలారోజులయినట్లుంది నాకు.

Anonymous said...

నా చిన్నప్పుడు మేక్సీ ( కాళ్ళవరకూ వుండె గౌను ) వేసి అమ్మ స్టూడియొలో ఫొటో తీయించింది
మా అమ్మాయి అది చూసి ఒకటే నవ్వు. నైటీ తో స్టూడియొకెళ్ళిపొయవా అని .అప్పుడు నైటీ అన్న పదమే తెలీదు.ఇప్పుడు నైటీ లేని చొటు " భూస్తలమంతా వెదికిన దొరకదు " ఇంతకన్న జనాదరణ పొందిన వస్త్రం మరొటి లేదేమో

సుజాత వేల్పూరి said...

లలిత గారు,
భలే చెప్పారు సుమా! మాక్సీలు కాలక్రమేణా నైటీలైపోయాయి. చిన్నప్పుడు మాక్సీలు వేసుకోడం పేద్ద ఫాషన్!

మా ఇంట్లో నైటీ పేరు దేవతా వస్త్రం!( మా ఆడపడుచు పెట్టిన ముద్దుపేరు)

మేధ said...

నిజమే.. అప్పట్లో సినిమాల్లో మాత్రమే వేసుకునే దుస్తులు, ఇప్పుడు అన్నిచోట్లకి వచ్చేసాయి.. రోజు రోజుకి వాటి పొడుగు కూడా తగ్గిపోతోంది.. అలాంటి వాటిని చూసినప్పుడల్లా, మా ఫ్రెండ్ చేసిన కామెంట్ గుర్తొస్తుంది నాకు.. ఒకసారి ఏదో షాప్ కి వెళ్ళి కొన్ని డ్రస్స్ చూస్తూ ఉన్నాం.. ప్రక్కనే, కిడ్స్ వేర్ అని ఉంది.. దాన్ని చూసి అతను, ఇంకా నయం చిన్నపిల్లలది అని వేరుగా పెట్టారు, లేకపొటే అమ్మాయిలందరూ How Cute.. How Simple అనుకుంటూ కొనేసేవాళ్ళు అని!

P.S. ఆంధ్రజ్యోతి లో మీ బ్లాగు వచ్చినందుకు అభినందనలు..

నిషిగంధ said...

మీనించి ఇంకొక ఇంట్రెస్టింగ్ (నాకు) టపా :-)

మనం ఫాషన్ ని కేవలం బట్టల వరకే అన్వయించుకుంటాము కానీ అసలైతే బట్టలు, ఏక్సెసరీస్, అప్పియరెన్స్ లాంటివన్నీ ఫాషన్ రూఫ్ కిందకే వస్తాయి.. ఒకప్పుడు మొకాలి వరకూ వచ్చే హ్యాండ్ బ్యాగులు ఇప్పుడు మోచెయ్యి దాటితే కష్టం :-)

మీరన్నట్టు కాస్తో కూస్తో మార్పులతో పాతవే మళ్ళీ కొత్త ఫాషన్ గా చలామణీలోకి వస్తాయి.. వీటిల్లో నాకు అత్యంత విసుగు పుట్టించేది మా ఆడవాళ్ళ శారీ బ్లౌజులు!! బ్లౌజ్ చేతులు ప్రతి 3,4 సంవత్సరాలకీ పైకీ కిందకీ జరుగుతూ ఉంటాయి.. కొన్నిసార్లు బుట్ట చేతులు ఇంకొన్నిసార్లు బీడ్స్ వేళాడుతూ.. సంవత్సరాల తరబడి ఉండే వేలకి వేలు పోసి కొనుక్కున్న పట్టుచీరలకి ఈ బ్లౌజ్ ఫేషన్ రాపిడ్ చేంజ్ వల్ల ఎంత అన్యాయం జరుగుతుందో!!

మొన్నొక పార్టీకి నాకు బాగా ఇష్టమైన ఒక పట్టుచీర కట్టుకెళ్తే నా ఫ్రెండ్ పైనించి కింద వరకూ చూసి 'లాభం లెదు నిన్ను ఫాషన్ పోలీసుకి అప్పగించాల్సిందే' అంది!! అదండీ ఇప్పటి ఫాషన్ ఆరాధకుల తీరు:-)

Anil Dasari said...

మహేష్ బాణీ మారింది - ఈ టపా వరకే కావచ్చు. బాగుంది, ఆటవిడుపుగా. టపా కూడా బాగుంది.

పదేళ్ల క్రితం బెంగుళూరులో రెండు మూడు నెలలున్నప్పుడు గమనించా. మా ఆఫీసు ఎదురుగా నిఫ్టీ ఉండేది. అందులో అమ్మాయిలు రేనాల్డ్స్ పెన్నులు సిగలో తురిమేవాళ్లు. అదో రకం ఫ్యాషన్!

ర్యాంపు షోల్లో పిల్లి నడకల సుందరీమణులు (అంత సుందరంగా ఏమీ ఉండరు; వీళ్లలో చాలామంది మోడళ్లెలా అయ్యారో నాకర్ధం కాదు. అది వేరే కధ) ధరించే వార్తా పేపరు కాయితంతో కుట్టిన వస్త్రాలు, చీలికలు పేలికల ముష్టావతారపు దుస్తులు వగైరా నేనెంత తలబాదుకున్నా అర్ధం కాని ఫ్యాషన్. పదేళ్ల తర్వాతైనా ఇవి బయట కనిపిస్తాయంటే నేన్నమ్మను.

Anonymous said...

లండన్, ప్యారిస్,మిలాన్ వంటి యూరోపియన్ నగరాలు ఈ ఫ్యాషన్ రంగానికి ఆద్యులనుకుంటే, భారతదేశంలో ఢిల్లీ,ముంబై నగరాలు ఫ్యాషన్లకు పుట్టినిల్లులుగా గుర్తిస్తాము......"

this is wrong I think. The best place for the first debut of a fashion stuff is Bangalore. That wa what I read in a magazine years ago (India today?)

But otherwise I agree with most of the other stuff. There also used to be Bell Bottoms, flowing hairlock etc,. Then recently after seeing Gundamma katha I recognized that NTR was wearing a shorts that exactly resembled what I was wearing that very day :-))

Nishigamdha garu. Correct about blouse. The hands come and go up and down. Very funny.

Anonymous said...

నాకు నైటీ ని చుస్తే పాతళ భైరవి లో S.V. రంగా రావు గురుతుకు వస్తాడు. అందులో నైటీ వెసు కొని వీధు లొ ఆ చివరి నుంచి ఈ చి వరి దాక కొంతమంది తిరుగు తారు పగటి పూట కూడ. దాని పేరు మనం డె అండ్ నైటీ అని పెడితే బాగుంటుంది.

Anonymous said...

నాకు నైటీ ని చుస్తే పాతళ భైరవి లో S.V. రంగా రావు గురుతుకు వస్తాడు. అందులో నైటీ వెసు కొని వీధు లొ ఆ చివరి నుంచి ఈ చి వరి దాక కొంతమంది తిరుగు తారు పగటి పూట కూడ. దాని పేరు మనం డె అండ్ నైటీ అని పెడితే బాగుంటుంది.

రాధిక said...

Tapaa super.comments adurs.TV fashions bedurs

సుజాత వేల్పూరి said...

anonymas gaaru

మా వారు కూడా సేం డైలాగ్! "నైటీని చూస్తే పాతాళభైరవి లో ఎస్వీయార్.."

Anonymous said...

హయ్. నేను కూడా జీన్స్ ఫ్యాంట్ వేసుకోటం
ఇందుకే స్టార్ట్ చేశా.