Wednesday, August 6, 2008

మా నాయన నేర్పిన మతం

పుట్టుకతో హిందువునే అయినా, ప్రతి సంవత్సరం తిరుపతి కొండెక్కి, తలనీలాలు సమర్పించిన చిరాకుతో బహుశా నా తొమ్మిదవ తరగతిలో అనుకుంటాను మతమంటే విసుకొచ్చేసింది. అర్థంకాని పూజలూ, పూజయ్యేంతవరకూ పస్తులూ, తాళ్ళు కట్టుకోవడాలూ, బొట్లుపెట్టుకోవడాలూ అంటే ‘టీనేజ్ రెబెలియన్’ కలిగిన కాలమది. ఐతే మాత్రం పండగలన్నా,పిండివంటలన్నా, గుంపులు లేని గుళ్ళన్నా, తియ్యటి కొబ్బరిముక్కన్నా ఇప్పటికీ ఆరాధిస్తాను ఆస్వాదిస్తాను. కాకపోతే, దేవుడికీ నాకూ మాత్రం చుక్కెదురే. "If God exists, that's his business" అనుకునే మనస్త్వత్వం నాది.



చిన్నప్పటినుంచీ కాస్త తర్కం మరిగిన బుర్ర మనది. అదెక్కడినుంచీ వచ్చిందో నాకే తెలీదు. బాల్యంలో చదివిన బాలమిత్ర, చందమామ కథలనుంచో లేక కాస్త బాల్యానికి బైబై చెప్పేరోజుల్లో చదివిన డిటెక్టివ్ పుస్తకాల మహిమో తెలీదుగానీ, నచ్చని విషయాన్ని తర్కించి తోలుతీస్తేగానీ ఒప్పుకునేవాడ్ని కాదు. ఈనా తర్కానికి మా అమ్మ చిరాకుపడి తలపై ఒకటంటిస్తే, ‘మా నాయన’ మాత్రం ఓపిగ్గా జవాబివ్వడానికి ప్రయత్నించేవారు. ఇక మా అన్నయ్య చాలా సిన్సియర్ గా చెప్పినవి ఫాలో అవ్వడమేతప్ప ప్రశ్నించి ఎరుగడు. ఈ విషయంలోతను ‘రాముడు మంచి బాలుడు’ కంటే సిన్సియరన్నమాట. ఇక మా చెల్లెలు గారాలపట్టికాబట్టి, కన్సెషన్లన్నీ తనకే. ఉపవాసం రోజుకూడా, "పాపం చిన్నపిల్ల" అని ప్రత్యేకంగా పులిహోర తినిపించి మరీ తన చేత ఉపవాసం చేయించేవారు. మనకే ఇక్కడ ఆకలితో నకనకలు, అనవసరపు అనుమానాలూ, తర్కాలూనూ...



ఇలా నా తార్కిక ప్రశలు సందించి మా నాయన దగ్గర సమాధానం రాబట్టే ప్రయత్నంలో, నాకు తెలీకుండా ఒక వ్యక్తిత్వం ఏర్పడిపోయింది. మతమంటే ఒక తార్కిక దృక్కోణం ఏర్పడింది. అదేలాగో చెబుదామని ఈ టపా కడుతున్నాను.




నాకు ఊహతెలిసిన తరువాత మతం గురింఛి నేనడిగిన ప్రశ్న దేవుడున్నాడా? అని. ఆ ముక్క అడగ్గానే ఎప్పుడోఒకప్పుడు నేనడుగుతాననే సందేహం మానాయనకు ముందే కలిగినట్లు నవ్వి, "దేవుడున్నాడో లేదో నాకు తెలీదు. ఉంటే మంచిదేగదా?" అన్నారు. "నిజమే కదా !" అనిపించింది. "దేవుడంటే శివుడో విష్ణువో కాదు. అదొక శక్తి అంతే. జీవితానికి అన్వయించి చెప్పాలంటే అదొక ‘నమ్మకం’. మనిషికి తనకన్నా పెద్ద శక్తొకటి తనను కాపాడుకొనుందనే నమ్మకం చాలా అవసరం. అదే దేవుడంటే. ఇప్పుడు చెప్పు, ఉంటే మంచిదా, కాదా?" అన్నారు. ఇక నిజంగా నా దగ్గర ఆ విషయం గురించి అడగడానికేమీ మిగల్లేదు. దేవుడు అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నకాదు. తన వ్యక్తిత్వం మీద, క్షమత మీద ఆధారపడే మనిషికి దేవుడు అవసరం లేదు. తమను తాము కాపాడుకునే సత్తా ఉన్నప్పుడు, ఎదో శక్తి కాపాడుతుందనే ‘నమ్మకం’ యొక్క అవసరం లేదు. ఆక్షణంలో నేను దేవుడ్ని త్యజించాను. కొందరు సరదాగా అంటారు కదా, "I was an atheist till I realized I was GOD" అని. ఆ తర్వాత నేనూ అలాగే ఫీలయ్యాను. Yes, I am God.



నేనడిగిన రెండో ముఖ్యమైన ప్రశ్న, పూజలూ పునస్కారాలు అవసరమా? అని. దానికి మా నాయన చెప్పిన సమాధానంతొ నాకు పుజచెయ్యాలనే బూజు ఈ జీవితకాలానికి వదిలిపొయింది. ఆయనంటారు "దేవుడు నమ్మకమైతే, పూజాపునస్కారాలు ఆ నమ్మకాన్ని మళ్ళీమళ్ళీ పెంపొందించుకొవటానికి చేసే సాధన. ఒక practice. అందుకే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తారు. ప్రసాదాలూ, పళ్ళూఫలాలూకూడా అంతే! దేవుడే సృష్టింఛిన ఈ చక్కెర పొంగలీ, పులిహోరా, దద్దోజనం ఆయనకే అర్పించి మనమేదో ఘనకార్యం చేసేసామనుకుంటే ఎలాగా? ఇక మంత్రతంత్రాలంటావా...అవి అర్థం కాకపోతే వాటికీ సినిమా పాటలకీ పెద్ద తేడా లేదు. అర్థంచేసుకుంటే వాటిల్లో భగవంతుణ్ణి పొగిడేవో లేక ఆయన ప్రసాదించిన జీవితాన్ని అమూల్యమనేవే ఉంటాయితప్ప, మాయలూ మంత్రాలతో దేవుడ్ని ప్రత్యక్ష్యం చేసేవికావు" అని. అంతే, ఆ తరువాత నేను పూజకోసం కడుపు మాడ్చుకోవడం, మంత్రాలకు అర్థం తెలీకుండా తలఊపడం మానేసాను. వీలైతే పూజారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. తను అర్థం చెప్పకపోతే పక్కకి తప్పుకుంటాను. నాకు తెలిసిన కాస్తోకూస్తో సంస్కృతంతో కొన్ని మంత్రాలకు అర్థంతీసే ప్రయత్నం చేసానుకూడా. చాలా వరకూ మంత్రాలు దేవుడి గుణగణాలూ, బంధుత్వాలూ లేక ఆయన సౌదర్యాన్నో శక్తినో తెలిజజెప్పేవేతప్ప పనికొచ్చేవి చాలా తక్కువ కనిపించాయి. నా అదృష్టంకొద్దీ నా పెళ్ళి ఆర్యసమాజ్ లో జరగటం వలన పెళ్ళి మంత్రాలకి అర్థాలు చెప్పిమరీ నా పెళ్ళి కానిచ్చారు . అందుకే, "I had most meaningful marriage" అనుకుంటూ ఉంటాను.



తన సమాధానాలు విన్నతరువాత నాకు అసలు మా నాయనకు మతం మీద నమ్మకముందా అనే సందేహం వచ్చింది. ఆమాటా ఒక సారి ఆడిగేసాను. "ఇంత తార్కికంగా మతాన్ని చూసే నువ్వు, అమ్మవెంట గుళ్ళు గోపురాలకెందుకు తిరుగుతావు? మమ్మల్ని ప్రతి సంవత్సరం తిరుపతి ఎందుకు తీసుకెళతావు?" అని. దానికాయన ఆశ్చర్యంగా చూసి "నాకు మతంకన్నా కుటుంబ బంధాలు ముఖ్యం. మీ అమ్మకు దేవుడంటే భక్తి. కాబట్టి, తనకోసం గుళ్ళూగోపురాలు చుడతానేతప్ప, దేవుడి కోసం కాదు. ఇక ప్రతి సంవత్సరం తిరుపతంటావా...అదొక ఫ్యామిలీ ఔటింగ్. ప్రతి శలవుల్లో కుటుంబంతోసహా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి. తిరుపతి దగ్గర, తెలిసిన ఊరు,పెద్ద ఖర్చు లేదు పైపెచ్చు పుణ్యంపురుషార్థం రెండూనూ" అని చెప్పి నవ్వారు. ఉండబట్టలేక అక్కసుగా అదిగేసాను, "మరి గుండో?" అని. దానికాయన, సమ్మర్లో గుండును మించిన సుఖంముందంటావా? దానికి తోడు, ఇలా కత్తెరపడిన తలకు వెంట్రుకలు బాగా మొలుస్తాయని చెబుతారు అంతే!" అని మా గుండు రహస్యాన్ని వెళ్ళడించారు. అప్పటి నుండీ నేను గుండు కొట్టుకుంటే ఒట్టు. కాకపోతే ఈ వివరణవల్ల నేను నేర్చుకున్నవి రెండు విషయాలు. మొదటిది, మనం నమ్మకపోయినా కుటుంబంకోసం కొన్ని పనులుచెయ్యకతప్పదు. భగవంతునికన్నా, మానవసంబంధాలు విలువైనవి. మన తర్కంకన్నా, పెళ్ళాంపిల్లల ప్రేమ గొప్పది. రెండో విషయం, ప్రతి ఆరు నెలలకో లేక సంవత్సరానికో ఒకసారి కుటుంబంతోకలిసి ఒక ఔటింగ్/హాలిడే వెళ్ళడం. ఇవిరెండూ ఇప్పుడు నా జీవితంలో ముఖ్యమైన భాగాలు.



ఇంత జ్ఞానోదయమైనా అప్పుడప్పుడూ కొన్ని చిన్నవీ,చిలిపివీ అయిన ప్రశలు అడుగుతూనే ఉండేవాడిని. ఒక సారి, "దేవుడికి టెంకాయే ఎందుకు కొట్టాలి? అది దేవుడికి ఇష్టమనా లేక ఆయన ఇదే కావాలని కోరాడా?" అని నేనడిగిన ప్రశ్నకు ఆయన, "అన్నింటినీ సృష్టించిన దేవుడు తనకు ఇది కావాలి అని ఎప్పుడూ కోరడు. టెంకాయ మానవుడి అహానికి గుర్తు(బయటనున్న టెంక).దాన్ని పగలగొడితేగానీ లోపలున్న ఆత్మ(మెత్తటి కొబ్బరి) సాక్షాత్కారమవదు. అహాన్ని పగులగొట్టి దేవుడికి మన ఆత్మల్ని అర్పించడమే దీని పరమార్థం" చెపారు. ఇప్పటికీ నేను కొబ్బరికాయ కొట్టాల్సొస్తే గుర్తుచేసుకునేది ‘నా అహం (ego) తగ్గిందా, లేదా?’ అని మాత్రమే.



ఇలా మా నాయన నాకు విశ్వరూపదర్శనమిచ్చి, నా మతాన్ని మలచారు. అందుకు మా నాన్నకి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మూఢాచారాలనుంచీ, అర్థరహిత మంత్రాలనుంచీ, ఉబుసుపోకచేసే పూజాపునస్కారాలనుంచీ విముక్తి ప్రసాదించిన నాతండ్రికి ధన్యుడిని. తార్కికత్వానికి మానవత్వం నేర్పి, మానవసంబంధాల విలువను తెలియజెప్పిన జనకునికి నేను సర్వదా కృతజ్ఞుడిని .



అందుకే ఇప్పుడు, తర్కంలేని విలువా, మానవత్వం లేని మతం నిరర్థకం అని మనస్ఫూర్తిగా నమ్ముతాను.


****

Tuesday, August 5, 2008

మగాడికి విముక్తి ప్రసాదించండి !

ఇప్పటివరకూ ‘స్త్రీవాదానికి' (feminism) కి వ్యతిరేకం‘పురుషాహంకారం’ (Male chauvinism) అనుకుంటూవచ్చాను. కానీ, ఈ మధ్య నేను రాసిన ‘స్త్రీపక్షపాతానికి మరోవైపు’, ‘వక్రీకరించిన వరం’ టపాలకు వచ్చిన వ్యాఖ్యలకు సమాధానాలు తెలుసుకునే శోధనల నేపధ్యంలో, అంతర్జాలంలో ఒక గమ్మత్తైన వెబ్ సైట్ చూడటం తటస్థించింది. National Coalition of Free Men (NCFM) అనే ఈ సైట్ మగాళ్ళకు వ్యతిరేకంగా జరిగే లింగవివక్షకు (sex discrimination) వ్యతిరేకంగా అమెరికాలో 1977 వ సంవత్సరం నుండీ పనిచేస్తోంది. అంటే ‘స్త్రీవాదానికి’ వ్యతిరేకం ‘పురుషస్వాతంత్ర్ర్యం’ అన్నమాట. చాలా చిత్రంగా ఉందికదూ! మొదట చదివినప్పుడు నాకూ అలాగే అనిపించింది.



కాకపోతే నా ‘అర్బన్ మేల్’ మిత్రుడు చెప్పిన నగరవాసంలో మారుతున్న జెండర్ సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటే, ఇలాంటి ఒక సంఘం త్వరలో భారతదేశంలో పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు. నాకు బాగా నచ్చిన విషయం వీరి సైధ్ధాంతిక వివరణ (Philosophy of the organization). అందునా ముఖ్యంగా ఈ సిద్ధాంతం ఆఖర్న FREE MEN, ‘మగాడికి ముక్తిని ప్రసాదించండి’ అని వీరు చేసిన విశ్లేషణ నాకు అమితంగా నచ్చి ఇక్కడ స్వేచ్చానువాదం చేసి అందిస్తున్నాను. ఈ విశ్లేషణను ఆంగ్లంలో చదవాలనుకునేవారు లంకె ద్వారా మాతృకని చదవొచ్చు.


మగాళ్ళని విముక్తుల్ని చెయ్యండి...

  1. వారి పాత్రలకున్న కఠిన నిర్వచనాలనుంచీ
  2. సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలు అతిగా పొందిన జాతి అనే అపోహలనుంచీ
  3. అసాధ్యాలని సుసాధ్యాలు చేస్తారనే లేనిపోని ఆదర్శాలతూనికల నుంచీ
  4. నెత్తిన రుద్దిన పోటీలనుంచీ, వైఫల్యాల భయాలనుంచీ
  5. సహజభావాలూ, సహజ ప్రేరణలూకాక, తర్కాన్ని ఆధారం చేసుకుని నిర్ణయాలు చేసే బలవంతం నుంచీ
  6. అపాదిత అంతస్తులనుండీ, పాత్రలనుంచీ
  7. తమ భయాన్ని ప్రకటించలేని నిస్సహాయతనుంచీ
  8. ఉద్యొగం పురుషలక్షణం అనే సామెత నుంచీ
  9. హింసాత్మక ప్రవర్తన తమ మగతనానికి చిహ్నమనుకునే భ్రమలనుంచీ
  10. తమ శరీరపు అవసరాలను నిర్లక్ష్యం చేసే బాధనుంచీ
  11. స్త్రీలను లైంగికంగా సంతృప్తిపరచాల్సిన భాధ్యతనుంచీ,ఆడవారి భావప్రాప్తి నాటకాలనుంచీ
  12. సాటి మగాళ్ళతో సన్నిహిత ఆత్మిక సంబంధాలు నెరిపడానికిగల సామాజిక అవరోధాలనుంచీ
  13. రక్షకులు,పోషకులుగా తమ పటిమ ప్రదర్సించాల్సిన బలవంతం నుంచీ
  14. చట్టపరమైన శిక్షల తీవ్రతలో వివక్షతనుంచీ
  15. పిల్లలను పెంచడంలోని ఆనందాన్ని అందుకోలేకపోవడం నుంచీ
  16. స్త్రీలను అణచివేసే వర్గంగా తమను చూపెట్టే ఈ మూసలనూ, లక్షణాలనూ ఆపాదించడం నుంచీ


పైనున్నవాటిల్లో కొన్ని కేవలం అమెరికన్ సంస్కృతికి మాత్రమే చెందినవైనప్పటికీ, చాలావరకూ మన భారతీయ నగరజీవనానికి అన్వయించుకోవచ్చనిపించింది. ముఖ్యంగా మగాడి మారుతున్న పాత్ర నేపధ్యంలో, అతివాద స్త్రీవాదుల బారినుండీ రక్షణ మగాడికీ ఒక హక్కుగా కావల్సిన పరిస్థితి వస్తే ఇలాంటి సంఘాల రూపకల్పన అవసరంగా కనిపించొచ్చు.



నాకు కాస్త సరదాగా అనిపించినా, ఇప్పటికే ఇలాంటి సంఘాల ఆవశ్యకతను కోరుకునే మగాళ్ళ జాబితా పెరుగుతోందనడానికి నా ‘స్త్రీపక్షపాతానికి మరోవైపు’ టపాకొచ్చిన స్పందనబట్టి అనిపిస్తోంది. వాళ్ళల్లో ఒకరు భారతీయ ఫ్రాంచైజ్ తీసుకుని దీన్ని మొదలెట్టినా ఆశ్చర్యం లేదు.



‘మక్బూల్’ అనే హిందీ సినిమాలో ఓంపురి ఒక డైలాగ్ అంటాడు "సృష్టిలో సమతౌల్యం (balance) చాలా అవసరం. నిప్పుకెప్పుడూ, నీటి భయం ఉండాల్సిందే!" అని. దానినిక్కడ అన్వయించుకుంటే, జెండర్ యుద్దంలో ఇంతకాలం సాగిన మగవారి పైచేయికి స్త్రీవాదం సమాధానమైతే, ‘స్త్రీవాదం’ మితిమీరిన రోజున ‘పురుషస్వాతంత్ర్యం’ ఉద్భవించి సమతౌల్యం సృష్టిస్తుందన్నమాట!


"Wah...what an IDEA sirji!!!!"

****

Monday, August 4, 2008

వక్రీకరించిన ‘వరం’

ఇప్పుడే భూమిక అనే మహత్తర స్త్రీవాద వెబ్ పత్రికలో ‘ఆడది కోరుకునే వరం’ అనే ఒక చిత్రమైన కథ చదివొచ్చాను. మతకలహాల నేపధ్యంలో ఒక ముస్లిం స్నేహితురాల్ని తప్పనిసరిపరిస్థితుల్లో చేజేతులారా హిందూ మతతత్వ గుంపుకప్పగించి ‘స్నేహితురాలు చనిపోవాలని’ ప్రార్థించే ఒక మహిళ కథ. భర్తా, కుటుంబం కేసు విషయమై కోర్టుకెక్కడానికి ఒప్పుకోకపోతే, జగన్మాతకై ఒక ‘ఎస్కేపిస్టు తపస్సు’ చేసి "మగవాడు తన శత్రువనుకున్న మగవాణ్ణి చంపుతాడు, శత్రువర్గానికి చెందిన ఆడదాన్ని మానభంగం చేస్తాడు. ఇదేమని అడగటానికి ఏ సంస్థలూ, సంఘాలూ ముందుకు రావు. యుద్ధాలు కల్లోలాల లేని సమయాల్లో మాత్రం మమ్మల్ని వదలుతారా? ఏ వయసు కానీ, ఎవరు కానీ, ఆడదై ఒంటరిగా చిక్కితే చాలు, మగవాడి కామాగ్నికి మాడి మసైపోవలిసిందే కదా? మేం కనిపెంచిన మగవాడి చేతిలో మాకీ అవమానం, అమర్యాద, హింసా ఎందుకు? అడుగుతాను ఆ ఆదిశక్తినే! ఈ న్యాయన్ని ఎవరు సృష్టించారో, అసలిదేం న్యాయమో ఆమెనే అడుగుతాను" అని ఆక్రోశాన్ని వెలిబుచ్చే కథ.



కథ బాగుంది. కథనం బహుబాగుంది. కానీ చెప్పదలచుకున్న విషయం చివరికంటా చదివిన నాకు, తెగ చిరాకొచ్చింది. ఆ కథ క్రింద నేను రాసిన కామెంటు "ఆడదానికి ప్రాణం కంటే, మానం ముఖ్యమనే భావజాలాన్ని విజయవంతంగా రీఇన్ఫోర్స్ చేసారు" అని. నిజం, I seriously felt that way. ఈ నా నిర్ణయానికి ముఖ్యకారణం ఆ కథలోని ఒక వాక్యం. రచయిత్రి అంటుంది, "వాళ్ళు ఆమెని కుక్కలు విస్తరి చింపినట్టు చింపేకంటే ముందుగానే ఆమె ప్రాణాలు పోవాలని ఆ రాత్రి దేవుణ్ణి నేను ప్రార్థించినట్టు నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థించలేదు" అని. ఈ ఆలోచన ఎంత దారుణం...ఎంత అమానుషం...ఒక్క సారి ఆలోచించండి!



మతకల్లోలాలూ, యుద్దాలూ, హిసాత్మక ఘటనల్లో ప్రతిపక్షంలోని మగాళ్ళని కొట్టో చంపో ,మహిళల్ని చెరచో,హింసించో కక్ష సాధించడం అనాదిగా వస్తున్న పరంపరే. అది గర్హనీయం, ఖండనీయం , మానవత్వానికే అవమానకరం. కానీ, ఆడవారు చెరచబడటం కన్నా మరణించడం మేలని ఒక మహిళ అనుకోవడం అంతకన్నా ఘోరమని నా నమ్మకం. పితృస్వామిక భావజాలాన్ని నరనరాలు నింపుకుని, మహిళని సమాజ గౌరవ చిహ్నమనో, మగాడి అభిమానానికి ఆధారమనో నమ్మే ఒక మహిళ కోరికగా నాకనిపించింది. అంతే కాదు, కండతో కండ రాసుకునే ఒక బౌతిక ప్రక్రియకు, లేని విలువలాపాదించి, ఆడదానికి ‘పవిత్రత సీల్’ అంటగట్టిన చారిత్రాత్మక మగాహంకారానికి దీపం పెట్టిమరీ పూజిస్తున్న ఒక గతితప్పిన స్త్రీవాది వరంలా అనిపించింది.



Rape is a physical,mental and psychological assault అంతకు మించి దానికి మితిమీరిన విలువ ఆపాదించడం, పితృస్వామిక భావజాలాన్ని నెత్తికెక్కించుకోవడమే అని నేను నమ్ముతాను. 1996 లో అనుకుంటా, ‘శ్రీకారం’ అనే ఒక జగపతిబాబు సినిమా వచ్చింది. అందులో ఒక రేప్ విక్టింని భర్త,సమాజం చుట్టూఉన్న ఆడవాళ్ళు ఎలా చిత్రవధచేస్తారో నిజానికి దగ్గరగా చూపించారు. అందులో హీరో అంటాడు "తనమీద ఒక దౌర్జన్యం జరిగింది. మానసికంగా శారీరకంగా హింసించబడింది. చట్టపరంగా ఈ దౌర్జన్యాన్ని జరిపిన నేరస్తులకు శిక్షవిధించబడాలి. ఈ మాత్రానికి ఈ సమాజం ఏదో దారుణం జరగిపొయినట్లు మళ్ళీ అదే హింసను ఈమె మీద జరపడమెందుకు" అని. ఈ కథ చదివిన తరువాత ఆ ముస్లిం మహిళని మానభంగం చెయ్యడానికెత్తికెళ్ళిన హిందూ మతాంకారులకన్నా, రేప్ కన్నాముందే తన స్నేహితురాలు చనిపోవాలని కోరుకునే ఈ స్త్రీ పాత్ర లాంటి వ్యక్తులవల్ల మన సమాజానికి ప్రమాదమెక్కువనిపించింది.



ఎందుకంటే, మానభంగం జరిగిన తరువాత స్త్రీ బ్రతుకు "కుక్కలు చింపిన విస్తరి" అనే భావన మగాడిలో ఉంటే వాడ్ని ‘మేల్ ఛౌవన్నిస్ట్ పిగ్’ అనుకోగలనుగానీ, ఒక ఆడది అదే విధంగా ఆలోచిస్తే వారినేమనాలో నాకు తెలీదు. మానభంగం ఒక ‘గాయం’. మగవాడు తన ఆధిపత్యాన్ని వ్యతిరేకించే మగాడిని కొట్టి, ఆడదాన్ని అవమానించో లేక బలవంతం చేసో తన డామినేషన్ ని నిరూపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో, మగాడి వర్తించని ‘విస్తరి’ ఆడదానికి మాత్రం వర్తింపజేయడం ఒక సామాజిక కుట్ర అని తెలిసీ, ఆ భావజాలానికి సగర్వంగా తపస్సు చేసి మరీ వరాన్ని అందించడం ఏవిధంగా స్త్రీవాదమో నాకు అర్థం కాని విషయం.



అసలు ‘మానభంగం’ అనే పదమే ఒక కుట్ర. "మానం" అంటే ఏమిటి? మగవారికి మానముండదా? మగవాడిని అవమానిస్తేనో, శారీరకంగా హింసిస్తేనో మానభంగం అనమే! ఆడవారికే ఈ మానభంగం జరుగుతుందా? ఏమిటీ విచిత్రాలు. డబుల్ స్టాండర్డ్స్. పైపెచ్చు, సమానత్వమని కాంక్షించే ఉదారస్వభావులుకూడా ‘ మానభంగం కన్నా, మరణమే మిన్న’ అనే నిర్ణయాలకొచ్చేసి, అదొక వర్చ్యూ లాగా ఊదరగొట్టేస్తే ఎలా? రేప్ ను పవిత్రతతో లంకెలేని, ఒక హేయమైన హింసగా భావించలేమా! రేప్ ఒక నేరం. దాదాపు వ్యక్తిని మానసికంగా చంపే హత్య. అందుకే, "అత్యాచారానికి బలవడంకన్నా, ఆ ఆడది చనిపోతే బాగుంటుందనుకోవడం సరైనదేనా?" అనేదే నా ప్రశ్న.



అత్యాచారానికి గురైన స్త్రీజీవితం అంతటితో అంతం కాదు. She has a right to life. As much as a person who undergoes violence in life. ఇలా స్త్రీవాద కథలంటూ, మళ్ళీమళ్ళీ పితృస్వామిక భావజాలాన్ని మహిళల మీదకు రుద్ది. వారేదో పెద్ద ప్రమాదంలో ఉన్నారని, వార్ని రక్షించేందుకు ఉద్యమిస్తున్నామని ప్రగల్భాలు పలికే కొందరు నిజమైన స్త్రీవాదాన్ని అటకెక్కించేస్తున్నారు. I resist such attempts and condemn such literature.



ఆడవారిపై రేప్ కీ, హింసకీ వ్యతిరేకంగా యుద్దంతొపాటూ, ఈ ‘మానభంగ మనస్తత్వం’ నుంచీ ఈ పితృస్వామిక స్త్రీవాదుల్నికూడా విడిపించాలి.

****

Sunday, August 3, 2008

స్త్రీపక్షపాతానికి మరోవైపు

ఈ మధ్య కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మిత్రుడొకడు నా ‘స్త్రీ పక్షపాత’ వ్యాసాలు చూసి, తనకు తెలిసిన మరో పార్స్వాన్ని పరిచయం చేసాడు. తన ఆర్గనైజేషన్లో అందాన్ని అడ్డం పెట్టుకుని అందలమెక్కుతున్న అమ్మాయిల కథలూ, ప్రేమ పేరుతో అబ్బాయిల్ని "వాడుకుని" అనాధలూ,అభాగ్యులుగా చేస్తున్న వెతలనూ చెప్పి, నా ఆలోచనలకు మరో కోణాన్ని అందించాడు.



అతనితో జరిగిన చర్చ ఆధారంగానే ‘ప్రశ్నలు -జవాబులు’ అనే కవిత రాశాను. ఆ కవిత రాసినతరువాత కూడా, చెప్పడానికి ఇంకా ఉందనిపించడంతో ఈ వ్యాసాన్ని రాయడానికి ప్రయత్నిస్తున్నాను.



సాధారణంగా ఆడామగా అనగానే పాలకులు-పాలితులు, పీడకులు-పీడుతులూ,ఫెమినిస్టులూ-మేల్ ఛౌవ్వనిస్టులూ ఈ వ్యవహారాలే కనబడి ఒకే మూసలో ఆలోచనలు జరిగిపోతుంటాయి. అది బహుశా సహజంకూడా. ఒక గ్రామీణ నేపధ్యం నుంచీవచ్చిన నాబోటి వాడికి కూడా, వామపక్ష భావజాలం కలిగిన అకడమిక్ ఇంస్టిట్యూట్ లలో చదవడం వలన, బీదలపాట్లు, కులపోరాటాలతొపాటూ కన్వెన్షనల్ స్త్రీవాద భావాల మూసలు, DNA లో భాగమైపోయాయి. ఆధునిక అర్బన్ ప్రపంచంలో జీవిస్తున్నాకూడా, ఇప్పటికీ నేను చాలావరకూ గ్రామీణాభివృద్ది కెరీర్ పధంలోనే ఉన్నాను కాబట్టి, నాకు తెలిసిన ఆనిజాల్నే నిత్యజీవితంలో చూస్తూవచ్చాను. అందుకనే బహుశా ఈ ‘మాడ్రన్ మగాడి’ బాధలు చాలావరకూ తెలియకున్నాయి.



ఏమైనా, నా మిత్రుడు నా పరిధిని పెంచాడు. ఈ కొత్తకోణం దిశగా ఆలోచించడానికి పురిగొల్పాడు. ఈ ఆలోచనలు బహుశా నేను ప్రస్తుతం రాస్తున్న ‘Maleకొలుపు’ వ్యాసావళికి మరింత హంగులు సమకూరుస్తాయనుకుంటాను.



ఆడవారి ట్యాలెంటుతోపాటూ, అందం ఒక అసెట్ గా ప్రతిరంగంలో పనికొస్తుందనడం ఎవరూ కాదనలేని సత్యం. మగాడు కష్టపడి ఎంట్రీ సంపాదించాల్సిన చోటకూడా, అందమైన ఆడది ఒక నవ్వుతో జాక్ పాట్ కొట్టేయ్యగలదన్నది ఖచ్చితంగా మగవాడి వీక్నెస్ కి సంబంధించిన సమస్యే అయినా, ఆ వీక్నెస్ ని ఉపయోగించుకోగలిగిన ఆడదాని గొప్పతనాన్ని కూడా గుర్తించకతప్పదు. ఈ విషయంలో "మగాడికి మగాడు శత్రువే".



నవ్వుతోపాటూ ఆడవారు సర్వదా ఉపయోగించే మరో ఆయుధం "గోముగా అడగడం". అసలు ఈ ‘గో...ము...గా’ అనే పదం తెలుగులో ఎవడు పెట్టాడోగానీ, మహత్తరమైన ఇంగ్లీషులోకూడా ఇంత పవర్ ఫుల్ పదం దొరకదు. ముద్దుముద్దుగా ఆడది అడిగితే, గుండెని కట్చీఫ్ లోపెట్టిమరీ అర్పించడా ఏమగాడైనా? అదీ ముంగాళ్ళమీద కూర్చుని మరీ! ఇదే సాధారణంగా ఆఫీసుల్లో తమ పనిని పక్కమగాడి నెత్తికికట్టడానికి లలనామణులు వేసే ఎత్తుగడ. "సుబ్బారావు గారూ...మరే! కాస్త ఈ పనిచూసిపెట్టరూ" అని వగలు ఇలికిస్తే, కాదనే సత్తా ఏ మగపుంగవుడికైనా ఉంటుందా? ఎంతైనా షివల్రీ పాలపీకతో పట్టుకు పుట్టిన మగాళ్ళుకదా ! ఆడవారికి సహాయం చెయ్యడం మన విద్యుక్త ధర్మం మరి.



ఇంకో ఆయుధం "కన్నీళ్ళు". సమానత్వం సంగతి సరేగానీ, పట్టువిడుపులు మాత్రం ఆడవారికి ప్రత్యేకంగా ఉండాలి. పనిగంటలైనా, శెలవులైనా, కన్షెషన్లు మాత్రం మెండుగా ఎర్పరచాలి. లేకుంటే, "కార్పొరేట్లు జెండర్ ఫ్రెండ్లీ కాదు" అని ఏకిపారేస్తారు. పనిసరిగ్గా చెయ్యకపోయినా పల్లెత్తుమాటంటే, ఎక్కడ కొళాయి ఓపనై, తిట్టినోడి ఇమేజ్ ప్రవాహంలో కొట్టుకుపోతుందో అన్న టీంలీడర్ మగాళ్ళ పాట్లు నా మిత్రుడు చెబుతుంటే, చాలా సరదాగా అనిపించింది. కానీ, ఆ సిట్యుయేషన్లో నేనే ఉంటేమాత్రం, ఖచ్చితంగా కష్టమే అయ్యేది. ఎంతైనా, ఆడాళ్ళ కన్నీళ్ళా మజాకా!



నా మిత్రుడి ప్రకారం మరొ బ్రహ్మాస్త్రం "ఫ్లర్టింగ్". ఈ పదానికి సమానాంతర తెలుగుపదం తెలీదుగానీ, ‘సరదాగా మాట్లాడటం’ అంటే మాత్రం ఆ ఇంగ్లీషుపదం పవర్ తగ్గిపోతుంది. బాసైన ప్రతి మగవెధవకీ, మగ సబార్డినేట్లు ముళ్ళలాగానూ, ఆడ ఉద్యోగినులు మల్లెపువ్వుల్లాగనూ కనబడతాయంటాడు మా దోస్త్. దీనికి తోడు, నవ్వుతూ ఫ్లర్టేషియస్ గా మాట్లాడే అమ్మాయిలకు ప్రివిలేజిలతోపాటూ, ప్రమోషన్లలో ప్రిఫరెన్సుకూడా వస్తుందని కార్పొరేట్ మగప్రపంచమంతా నమ్మే విషయం. ఆడబాసైనా, మగబాసైనా మగాడికి ఒరిగేదిక్కడ ఏమీ ఉండదు. ఆడబాసు మగ సబార్డినేట్లని ‘మగపురుగులు’గా చూస్తే, ముందే చెప్పినట్లు మగబాసు కళ్ళకి వీళ్ళు ‘ముళ్ళే’. ఈ తంతులో తమ ట్యాలెంటుని పరిపూర్ణంగా ఉపయోగించుకునే సుందరాంగులు, కార్పొరేట్ ల్యాడర్ త్వరత్వరగా ఎక్కేసి సక్సెస్ చవిచూసేస్తారన్నమాట.



"అందరూ ఇలాగే ఉంటారా?" అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే, అందరూ ఇలా ఎప్పుడూ ఉండరుగనక. కాకపోతే, ఇదొక సామాజిక పార్శ్వం. ఒక దీనుడు అనుభవించి మరీ చెప్పిన నిజం. కాబట్టి, ఈ కోణానికి ఎంత విలువ ఉందో అంతే ఉండాలి. పొలిటికల్ కరెక్ట్ నెస్ ఇక్కడ సమస్యా కాకూడదు, స్వీపింగ జనరలైజేషన్ అనే అపవాదూ అర్థవంతం కాదు. ఇలాంటివి కొన్ని సబ్ కాన్షియస్ గాకూడా జీవితల్లో జరుగుతాయి. ఇక్కడ కార్పొరేట్ ఆఫీసుల్లో చెప్పినవి, పార్టీల్లో, ఫంక్షన్లలో, ప్లాట్ ఫారంలలొ, పార్కుల్లో, ప్రయాణాల్లో ఎంతోకొంత శాతంలో మన జీవితాల్లో జరగలేదంటారా?


*****

ప్రశ్నలు - జవాబులు



"గోముగా అడగడం అంటే?"
మెత్తగా గోతులు తియ్యడం.
తియ్యగా పనికానియ్యడం.
మగాడికి మచ్చుకైనారాని,
‘ఫెమినైన్ చార్మ్’ ఉపయోగించడం.

****



"వగలు కురిపించడం అంటే?"
వొంపులు తిరగడం.
నవ్వు వొలికించడం.
బేలతనాన్నినటించి,
బండినడిపెయ్యడం.

****


"ఫెమినిజం అంటే?"
నిజానికీ నిజానికీ మధ్య
అభిప్రాయాలగోడకట్టడం.
భావజాలంపేరుతో
బాధల్ని ఏకరువుపెట్టడం.
‘మగ’బూచిని మట్టుబెట్టడమే
మహా ఆదర్శమనడం.

****


"షివల్రీ అంటే?"
ఒక ఇంగ్లీషుపదం.
బలహీమైన ఆడజాతిని,
అర్జంటుగా కాపాడమని
మగాడికి మన సమాజమిచ్చిన లైసెంస్.

****


"మేల్ ఛౌవనిజం అంటే?"
మరో ఇంగ్లీష్ పదం.
తానే గొప్పోడనే మగాడి భ్రమకు
అక్షరాలా అక్షరరూపం.
అపార్ధాలకూ, అపోహలకూ,
నిలువెత్తు అద్దం.


****

"అన్నీ తప్పైతే మరి రైటో?"
ఎదీతప్పుకాదు అన్నీ రైటే!
"గోతులూ,వగలూ
ఇజాలూ,భ్రమలూ
అపార్థాలూ,అపోహలూ
అన్నీ రైటేనా?"”
‘All is fair in love and war’ అని వినలేదా?
ఇది యుద్దంలాంటి ప్రేమ
ప్రేమలాంటి యుద్దం
ఇందులో కాకుంటే మరెందులో ఇవన్నీ రైటు?!?


****


Saturday, August 2, 2008

మాతృభాష - భావప్రకటన

ఇప్పుడే ‘తెలుగువీర లెవరా!’ అనే బ్లాగులో ‘మనకెప్పుడీ మంచిరోజులు’ అని తమిళనాడులో ఉన్నతవిద్యలో తమిళభాషాబోధన గురించి ఒక లంకె ఇస్తూ, మన తెలుగువారు ఇలా ఎందుకు ప్రయత్నించరూ అని తమ బాధని వ్యక్తపరిచారు. అక్కడ ఒక నేను ఒక సమాధానం (దాదాపు టపా కన్నా పెద్దది) రాసినా, మరింత విస్తృతంగా విషయాన్ని వివరించాలి అనిపించి ఇక్కడ ఒక టపాగా రాస్తున్నాను.



భావప్రకటన: పిల్లలుగా అవసరాలతో మొదలై, తరువాత సమాచారం, వివరణలుగా మార్పుచెంది, ఎదిగేకొద్దీ ఆలోచనలూ,విశ్లేషణలుగా మనకు తెలిసిన ప్రపంచాన్ని, అర్థం చేసుకున్న జ్ఞానాన్నీ తెలియజెప్పే విధానాల్ని భావప్రకటన అంటాము. ఇది ఒక సహజ ప్రక్రియ, చుట్టూఉన్న బౌతిక,సామాజిక,కుటుంబ పరిస్థితుల మాధ్యమంగా ఈ భావప్రకటన పుట్టుకొస్తుంది.



మాతృభాష - భావప్రకటన: సహజవాతావరణం కల్పించిన భావప్రకటన ఖచ్చితంగా ఆ వాతావరణంలో వాడబడే భాషలో ఉంటుంది. దాన్నే మాతృభాష అంటాము. అంతేతప్ప అమ్మ భాషో,నాన్న భాషో కాదు. ఉదాహరణకు నేను తెలుగు, మా ఆవిడ బెంగాలీ అయినా, నా కొడుకు అవినాష్ మాతృభాష మాత్రం హిందీ అన్నమాట. భవిష్యత్తులో తను బెంగాలీ లేక తెలుగు,ఆంగ్లాలు నేర్చుకున్నా, మాతృభాష మాత్రం హిందీగానే ఉంటుంది.



భావప్రకటన -సంస్కృతి: భాష, భావప్రకటనా ఎప్పుడూ చుట్టుపక్కలున్న వాతావరణం పైన ఆధారపడి ఉంటాయని చెప్పుకున్నాం. ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని సంస్కృతి అనుకోవచ్చు. మా ఇంగ్లీషు ఫొఫెసర్ ఎప్పుడూ చెప్పేవాడు "understand English literature, but go and experience and feel it your regional language literature" అని. విశదంగా చెప్పాలంటే సాంస్కృతికంగా, ఆంగ్ల సాహిత్యం యొక్క సృజన ఆ సాంస్కృతిక నేపధ్యం నుండీ చెయ్యబడింది కాబట్టి, అర్థం చేసుకోగలమేగానీ అనుభవించాలంటే మనకు సాధ్యం కాదు కనుక, ఆ తెలుసుకున్న అర్థాన్ని మన మాతృభాష సాహిత్యానికి అన్వయించుకుని అనుభవించాలన్నమాట.



అంటే, మనకు తెలిసిన సంస్కృతిలోని వస్తువులూ, అభిప్రాయాలూ,ఆలోచనలూ,భావజాలాలూ వేరే భాషలో చెప్పాలంటే ఆ సహజత్వం రాదని అర్థం. అలాగే, వేరే భాషని అనుభవించాలంటే, వారి సంస్కృతి తెలిసుండాలన్నమాట. ఉదాహరణకు అమెరికన్ సినిమా చూసే మనకు, ఇంగ్లీషు బాగా వచ్చినా చాలా విషయాలు అర్థం కావు, కారణం అవి culture specific expressions లేక culture specific behaviour కావడమే. నేను చిన్నప్పుడు చూసిన కొన్ని సినిమాలలో కారు ఆగిపోయినప్పుడు "Car ran out of gas" అనే భావన అర్థమయ్యేది కాదు, ఎందుకంటే, మనం కారులో ‘పెట్రోల్’ అంటామేగానీ ‘గ్యాస్’ అనము కాబట్టి. ఇది చాలా చిన్న ఉదాహరణే అయినా, పెద్ద ఉదాహరణలు మరింత "తేడాగా" ఉంటాయని మాత్రం చెప్పొచ్చు. అలాగే, భగవద్గీత లోని మార్మికత, తార్కిక మెదడు కలిగిన పాశ్చ్యాత్యులకు అర్థమవ్వడం కష్టం అని చెబుతూ ఉంటాం. కారణం ఈ సాంస్కృతిక తేడాయే కదా!



తెలుగు భాష - భావప్రకటన: పై విశ్లేషణ నేపధ్యంలో, మాతృభాషలో భావప్రకటన సహజంగా, చురుకుగా ఉంటుందని అంగీకరించినా, దానికున్న pre-condition చైతన్యవంతమైన సంస్కృతి. విస్తృతమైన తెలుగు భాష ఉపయోగానికి చైతన్యవంతమైన తెలుగుతనం ఒక అవసరం. కానీ, ఆ తెలుగుతనం మన ఆంధ్రప్రదేశ్ లో, మన జీవితల్లో,చుట్టుపక్కలున్న వాతావరణంలో ఉందా? అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు ఎవరి జీవితాల్లో వారు తరచి చూసుకొని సమాధానం తెలుసుకుంటేనే బాగుంటుంది.



వ్యక్తిగతంగా ‘తమిళ,మళయాల, కన్నడతనాలతో’ పోల్చుకుంటే, మన తెలుగువారిలో తెలుగుతనం పాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నా, అపోహలూ, ఆచారాలే తప్ప తెలుగు సాంస్కృతిక స్పృహ, భావజాలం,ఆదర్శాలు మచ్చుకకికూడా కనిపించవు. కర్ణుడిచావుకి వందకారణాలన్నట్లు, ఈ స్థితికి ఎన్నో కారణాలు. వాటిల్లో నాకు తోచిన ముఖ్యమైన రెండు కారణాలు 1. భాషా భోధన 2. తెలుగువారిలో పెరిగిన వ్యాపార ధోరణి.



1. భాషాభోధన :వాడుకభాషను దగ్గర చెయ్యడం మానేసి కొన్ని తరాలుగా నన్నయ,తిక్కన అని పూర్వపు వైభవాన్ని బలవంతంగా పిల్లలకు అంటగట్టడం ఒకటైతే, సమాజంలోని పరిణామాల్ని భాషలో ప్రతిఫలించక "ఉబుసుపోక" రాసుకున్న సాహిత్యాన్ని మన భాషా సంస్కృతిగా పట్టంగట్టిన స్థితి మరోకారణం. వీటివలన తల్లిదండ్రులు భాషకు దూరమవ్వడమేకాక, పిల్లల్నికూడా "తెలుగులో ఏముందిరా! ప్రతిపదార్థాలూ తాత్పర్యాలూ తప్ప" అంటూ దూరం చేస్తున్నారు. వారు చేస్తున్నది చాలా వరకూ సహేతుకం కూడాను. ఈ విధానం వలన మనకొరిగింది ఒక కుహానా భాషా సంస్కృతి, మాతృభాషంటే ఆమడదూరం పారిపోయే జనస్రవంతి.ఇక తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ లంకె కుదిరేనా ?


2.తెలుగువారిలో వ్యాపారాత్మక ధోరణి: మన సాంస్కృతిక మూలాలు బలహీనమైనప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఎదుగుదలకు బలమైన కారకమైన ‘డబ్బు’ని మూలంగా ఎంచుకోవడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. 5 వతరగతి వరకూ మాతృభాషలో భోధన, ఆపైన త్రిభాషా ఫార్ములా (Tri-language formula) అని National Curriculam Framework చెబుతున్నా, పుట్టుకతోనే ABCD లు నేర్పుతూ, తామూ మమ్మీలూ డాడీలూ అవుతూ, మన తెలుగువారు ఇంగ్లీషు వైపుకి పరుగులుతీస్తున్నారు. దానికిగల ముఖ్యకారణం వారి పిల్లల్ని ‘ఉద్యోగ విపణి(job market) కి’ త్వరగా తయ్యారు చేసేయ్యడమే. అంటే, భాషాసంస్కృతి బలహీనమైన మన జాతి, కనీసం బలమైన ఆర్థిక సంస్కృతి దిశగా అడుగులేస్తోందన్నమాట.



పై నేపధ్యంలోంచీ చూస్తే, మన స్థితికి మనమే కారణం. ఆంగ్లాన్ని ధూషించో, ఇంగ్లీషు భాషపై మనవాళ్ళకున్న మోజుని నిరసించో తెలుగు భాష వాడకాన్ని పెంచలేము. తెలుగుతనాన్ని , సంస్కృతినీ, భాషా సంస్కృతినీ సమూలంగా సంస్కరించి "పనికొచ్చే తెలుగును" పరిచయం చేస్తే తప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుభాష తిరోగమనం అరికట్టబడదు. అంటే మూలాల్ని సంస్కరిస్తేగానీ ఈ లక్షణాలు బాగుపడవు.



ఆ మూలాల్ని సంస్కరించే చేవ,సత్తా,బలిమి మనకు లేవు గనక ఆవేదన వ్యక్తపరుస్తూ, ఆంగ్లాన్ని నిరసిస్తూ, ఆంగ్లాన్ని మాతృభాషగా చేసుకుంటున్న తెలుగువారిని ఎద్దేవా చేస్తూ, తెలుగు భాష స్థితిని చూసి కన్నీరు విడుస్తూ, కనీసం మన జీవితల్లో తెలుగుని పెంపొందించుకుందామని ప్రమాణాలు చేసుకుంటూ సంతోషిద్ధాం.

*****

Friday, August 1, 2008

సరదాగా సమాధి కడదాం!


నిప్పులు కడిగిన కులాల
మసిబొగ్గుల మాటున
గౌరవంగా బ్రతికేద్దాం.
వినే చెవిలో సీసం.
పలికే నాలుకను చీలికచేసే
ఆదర్శాలను అభినందించి

ప్రశ్నిస్తే వెలి.
ఎదురుతిరిగితే తల తెగాలి.
అనే, ప్రమాణాలందించిన
పెద్దల బుద్దులని అక్షరాలా ఆచరించి.

అంటరానితనాన్నీ,
రెండూగ్లాసుల విధానాన్నీ
అఫిషియల్గా చట్టంబద్దం చేసి
కులాల ఆచారాల్ని
రాజ్యాంగంకన్నా అపురూపమందాం.

అందరూ కలసికట్టుగా
కూలాల్ని ఉద్దరిద్ధాం.
మానవత్వానికి సరదాగా సమాధికట్టి,
మార్పుని ఆశించేవారిని
‘కులపిచ్చిగాళ్ళని’ నిరసించి నోరుమూయించి
మువ్వన్నెల జెండాకాక, కుల అజండాని
భుజానమోస్తూ, భారతదేశాన్ని బలోపేతం చేద్దాం.


*****