Monday, August 4, 2008

వక్రీకరించిన ‘వరం’

ఇప్పుడే భూమిక అనే మహత్తర స్త్రీవాద వెబ్ పత్రికలో ‘ఆడది కోరుకునే వరం’ అనే ఒక చిత్రమైన కథ చదివొచ్చాను. మతకలహాల నేపధ్యంలో ఒక ముస్లిం స్నేహితురాల్ని తప్పనిసరిపరిస్థితుల్లో చేజేతులారా హిందూ మతతత్వ గుంపుకప్పగించి ‘స్నేహితురాలు చనిపోవాలని’ ప్రార్థించే ఒక మహిళ కథ. భర్తా, కుటుంబం కేసు విషయమై కోర్టుకెక్కడానికి ఒప్పుకోకపోతే, జగన్మాతకై ఒక ‘ఎస్కేపిస్టు తపస్సు’ చేసి "మగవాడు తన శత్రువనుకున్న మగవాణ్ణి చంపుతాడు, శత్రువర్గానికి చెందిన ఆడదాన్ని మానభంగం చేస్తాడు. ఇదేమని అడగటానికి ఏ సంస్థలూ, సంఘాలూ ముందుకు రావు. యుద్ధాలు కల్లోలాల లేని సమయాల్లో మాత్రం మమ్మల్ని వదలుతారా? ఏ వయసు కానీ, ఎవరు కానీ, ఆడదై ఒంటరిగా చిక్కితే చాలు, మగవాడి కామాగ్నికి మాడి మసైపోవలిసిందే కదా? మేం కనిపెంచిన మగవాడి చేతిలో మాకీ అవమానం, అమర్యాద, హింసా ఎందుకు? అడుగుతాను ఆ ఆదిశక్తినే! ఈ న్యాయన్ని ఎవరు సృష్టించారో, అసలిదేం న్యాయమో ఆమెనే అడుగుతాను" అని ఆక్రోశాన్ని వెలిబుచ్చే కథ.



కథ బాగుంది. కథనం బహుబాగుంది. కానీ చెప్పదలచుకున్న విషయం చివరికంటా చదివిన నాకు, తెగ చిరాకొచ్చింది. ఆ కథ క్రింద నేను రాసిన కామెంటు "ఆడదానికి ప్రాణం కంటే, మానం ముఖ్యమనే భావజాలాన్ని విజయవంతంగా రీఇన్ఫోర్స్ చేసారు" అని. నిజం, I seriously felt that way. ఈ నా నిర్ణయానికి ముఖ్యకారణం ఆ కథలోని ఒక వాక్యం. రచయిత్రి అంటుంది, "వాళ్ళు ఆమెని కుక్కలు విస్తరి చింపినట్టు చింపేకంటే ముందుగానే ఆమె ప్రాణాలు పోవాలని ఆ రాత్రి దేవుణ్ణి నేను ప్రార్థించినట్టు నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థించలేదు" అని. ఈ ఆలోచన ఎంత దారుణం...ఎంత అమానుషం...ఒక్క సారి ఆలోచించండి!



మతకల్లోలాలూ, యుద్దాలూ, హిసాత్మక ఘటనల్లో ప్రతిపక్షంలోని మగాళ్ళని కొట్టో చంపో ,మహిళల్ని చెరచో,హింసించో కక్ష సాధించడం అనాదిగా వస్తున్న పరంపరే. అది గర్హనీయం, ఖండనీయం , మానవత్వానికే అవమానకరం. కానీ, ఆడవారు చెరచబడటం కన్నా మరణించడం మేలని ఒక మహిళ అనుకోవడం అంతకన్నా ఘోరమని నా నమ్మకం. పితృస్వామిక భావజాలాన్ని నరనరాలు నింపుకుని, మహిళని సమాజ గౌరవ చిహ్నమనో, మగాడి అభిమానానికి ఆధారమనో నమ్మే ఒక మహిళ కోరికగా నాకనిపించింది. అంతే కాదు, కండతో కండ రాసుకునే ఒక బౌతిక ప్రక్రియకు, లేని విలువలాపాదించి, ఆడదానికి ‘పవిత్రత సీల్’ అంటగట్టిన చారిత్రాత్మక మగాహంకారానికి దీపం పెట్టిమరీ పూజిస్తున్న ఒక గతితప్పిన స్త్రీవాది వరంలా అనిపించింది.



Rape is a physical,mental and psychological assault అంతకు మించి దానికి మితిమీరిన విలువ ఆపాదించడం, పితృస్వామిక భావజాలాన్ని నెత్తికెక్కించుకోవడమే అని నేను నమ్ముతాను. 1996 లో అనుకుంటా, ‘శ్రీకారం’ అనే ఒక జగపతిబాబు సినిమా వచ్చింది. అందులో ఒక రేప్ విక్టింని భర్త,సమాజం చుట్టూఉన్న ఆడవాళ్ళు ఎలా చిత్రవధచేస్తారో నిజానికి దగ్గరగా చూపించారు. అందులో హీరో అంటాడు "తనమీద ఒక దౌర్జన్యం జరిగింది. మానసికంగా శారీరకంగా హింసించబడింది. చట్టపరంగా ఈ దౌర్జన్యాన్ని జరిపిన నేరస్తులకు శిక్షవిధించబడాలి. ఈ మాత్రానికి ఈ సమాజం ఏదో దారుణం జరగిపొయినట్లు మళ్ళీ అదే హింసను ఈమె మీద జరపడమెందుకు" అని. ఈ కథ చదివిన తరువాత ఆ ముస్లిం మహిళని మానభంగం చెయ్యడానికెత్తికెళ్ళిన హిందూ మతాంకారులకన్నా, రేప్ కన్నాముందే తన స్నేహితురాలు చనిపోవాలని కోరుకునే ఈ స్త్రీ పాత్ర లాంటి వ్యక్తులవల్ల మన సమాజానికి ప్రమాదమెక్కువనిపించింది.



ఎందుకంటే, మానభంగం జరిగిన తరువాత స్త్రీ బ్రతుకు "కుక్కలు చింపిన విస్తరి" అనే భావన మగాడిలో ఉంటే వాడ్ని ‘మేల్ ఛౌవన్నిస్ట్ పిగ్’ అనుకోగలనుగానీ, ఒక ఆడది అదే విధంగా ఆలోచిస్తే వారినేమనాలో నాకు తెలీదు. మానభంగం ఒక ‘గాయం’. మగవాడు తన ఆధిపత్యాన్ని వ్యతిరేకించే మగాడిని కొట్టి, ఆడదాన్ని అవమానించో లేక బలవంతం చేసో తన డామినేషన్ ని నిరూపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో, మగాడి వర్తించని ‘విస్తరి’ ఆడదానికి మాత్రం వర్తింపజేయడం ఒక సామాజిక కుట్ర అని తెలిసీ, ఆ భావజాలానికి సగర్వంగా తపస్సు చేసి మరీ వరాన్ని అందించడం ఏవిధంగా స్త్రీవాదమో నాకు అర్థం కాని విషయం.



అసలు ‘మానభంగం’ అనే పదమే ఒక కుట్ర. "మానం" అంటే ఏమిటి? మగవారికి మానముండదా? మగవాడిని అవమానిస్తేనో, శారీరకంగా హింసిస్తేనో మానభంగం అనమే! ఆడవారికే ఈ మానభంగం జరుగుతుందా? ఏమిటీ విచిత్రాలు. డబుల్ స్టాండర్డ్స్. పైపెచ్చు, సమానత్వమని కాంక్షించే ఉదారస్వభావులుకూడా ‘ మానభంగం కన్నా, మరణమే మిన్న’ అనే నిర్ణయాలకొచ్చేసి, అదొక వర్చ్యూ లాగా ఊదరగొట్టేస్తే ఎలా? రేప్ ను పవిత్రతతో లంకెలేని, ఒక హేయమైన హింసగా భావించలేమా! రేప్ ఒక నేరం. దాదాపు వ్యక్తిని మానసికంగా చంపే హత్య. అందుకే, "అత్యాచారానికి బలవడంకన్నా, ఆ ఆడది చనిపోతే బాగుంటుందనుకోవడం సరైనదేనా?" అనేదే నా ప్రశ్న.



అత్యాచారానికి గురైన స్త్రీజీవితం అంతటితో అంతం కాదు. She has a right to life. As much as a person who undergoes violence in life. ఇలా స్త్రీవాద కథలంటూ, మళ్ళీమళ్ళీ పితృస్వామిక భావజాలాన్ని మహిళల మీదకు రుద్ది. వారేదో పెద్ద ప్రమాదంలో ఉన్నారని, వార్ని రక్షించేందుకు ఉద్యమిస్తున్నామని ప్రగల్భాలు పలికే కొందరు నిజమైన స్త్రీవాదాన్ని అటకెక్కించేస్తున్నారు. I resist such attempts and condemn such literature.



ఆడవారిపై రేప్ కీ, హింసకీ వ్యతిరేకంగా యుద్దంతొపాటూ, ఈ ‘మానభంగ మనస్తత్వం’ నుంచీ ఈ పితృస్వామిక స్త్రీవాదుల్నికూడా విడిపించాలి.

****

38 comments:

Purnima said...

hmmm....

Budugu said...

simply superb Mahesh garu!!!! పనికిమాలిన మూర్ఖ సిద్దాంతాలతో విషబీజాలు నాటే మూర్ఖవాదులు ఇకనయినా కళ్ళు తెరవాలి.

ఏకాంతపు దిలీప్ said...

నాకైతే మీరు అనుకున్నట్టు అనిపించలేదు.

అక్కడ ఒక ఆడది అలా వేడుకుంది. అక్కడ అదే ఆడది ఇంకా ఏదైనా భరించలేని కష్టం వచ్చినప్పుడూ అలానే వేడుకోవచ్చు. చావుని ప్రసాదించమని. బహుసా మగాళ్ళుగా మనం "కుక్కలు చింపిన విస్తర.." అని చెప్పిన ఆ కష్టాన్ని మనం అర్ధం చేసుకోలేమేమో... అక్కడ అది మానం గొప్పది అనేదాని కన్నా, ప్రాణం మీదకొచ్చే కష్టాన్ని చెప్పుతుందేమో!

ఎంతమంది మగవాళ్ళు విసిగిపోయిన సంధర్భాల్లో ఈ బతుకు బతికేకంటే చావడం బెటర్ అని అనడం వినలేదు మనము? ఈ సంధర్భంలో జీవితాన్ని ఎదుర్కోకుండా అలా నెగటివ్ గా మాట్లాడిన మగాడిని ఏ విధంగా తీసుకుంటామో, పైన చెప్పిన సంధర్భంలో ఆడదాని మాటని కూడా అలా తీసుకోవచ్చు....


నాకు ప్రాణం కన్నా మానం ముఖ్యమన్నట్టు అనిపించలేదు...

అంతా చదివినప్పుడు నాకు... అక్కడ కష్టం భరించలేని శారీరక బలాత్కారం రూపంలో, నమ్మిన సమాజం తన నమ్మకాన్ని కూలదోసింది అని మానసికమైన దిగ్భ్రాంతితో కూడుకున్నది...అలాంటి ఒక భరించలేని కష్టం ఎదురైనప్పుడూ ఆ మనిషి(ఇక్కడ ఆడది ) ఎలా స్పందించారో అన్నదే కనపడుతుంది...

ఆ రచయిత నిజంగా ప్రాణం కన్నా మానం ముఖ్యం అని తన రచనల్లో, చేతల్లో ప్రాపగేట్ చేస్తుంటే, దాన్ని ఖండించడానికి ఈ రచన మాత్రం ఖచ్చితంగా ప్రాతిపదిక కాదు, వేదిక కాదు.


**********************************
ఇంకా ఒకవేళ మీరు ఆ టపాకి స్పందించినట్టు నేను ఈ టపాకి స్పందించాల్సి వస్తే ఇలా స్పందిస్తాను...

మోసం చేసి,ఆడదాన్ని పది మంది ఒకేసారి రేప్ చేసినా తను చనిపోదు. తను బతకగలదు, బతకాలి... అని చెప్పి పది మందిని రేప్ చెయ్యడానికి ప్రోత్సహిస్తున్నారు... అలా మానభంగం చేసినా ఆ ఆడది ప్రాణం పోదు అని ఎలా ఆ పది మంది అనుకుంటారో మీరు కూడా అలానే అనుకుంటున్నారు. మీ లోని "మేల్ చావనిజం" ని చూపించుకున్నారు...

మీ ప్రయత్నం ఆ రచనలోని మీరు అర్ధం చేసుకున్న భావాన్ని ఖండించి వివరించడం అయితె, నా ప్రయత్నం కూడా అలాంటిదే అని గుర్తించాలి అని మనవి చేసుకుంటున్నాను.

************************************

మిమ్మల్ని నొప్పిస్తే మన్నించమని వేడుకుంటున్నాను....

Anonymous said...

మీరు వ్రాసిన ప్రతిపదంలోని ఆవేశం, ఆవేదన కనిపిస్తున్నాయి. నిజమైన ఫెమినిస్ట్ ఎలా ఆలోచించాలి అని చక్కగా నిర్వచించారు. ప్రతి మనిషి అంగీకరించక తప్పనంత బలమైన వాదన. నిజంగా మీ మాటలు చైతన్యాన్ని కలిగించాయి. హ్యాట్సాఫ్.

పెదరాయ్డు said...

మహేష్ గారూ, మగవాడు ఆడదాన్ని ఎంతగా ప్రభావితం చేసాడంటే ప్రతి ఆడదీ ఈనాటికీ తనకుతానే పవిత్రతనూ, సున్నితత్వాన్నీ తన శరీరానికి ఆపాదించుకుంటొంది. తనకు తనే ఆ ఉచ్చులో ఇరుక్కుంటొంది.

నాకుతెలిసినంతవరకూ పిల్లల్ని కనే అవకాశం, వారిని రక్షించవలసిన సహజ బాద్యతే ఆడవారికున్న బలహీనతలు. దీన్ని సొమ్ము చేసుకునే ఈ సిద్దాంతం రూపొందించబడి వుండవచ్చు.

"కండతో కండ రాసుకునే ఒక బౌతిక ప్రక్రియకు, లేని విలువలాపాదించి, ఆడదానికి ‘పవిత్రత సీల్’ అంటగట్టిన చారిత్రాత్మక మగాహంకారానికి ..." అక్షరాలా నిజం.

Jagadeesh Reddy said...

బాగా చెప్పారు మహేష్ గారు... శీలం, మానం అనే వాటిని ఆడ వాళ్ళ విషయంలో మాత్రమే వాడతారు. రేప్ అనేది స్త్రీ యొక్క గౌరవం మీద జరిగిన దాడిగానే భావించాలి. ఇద్దరూ కలిసి చేస్తేనే తప్పు అవుతుంది కదా. అటువంటప్పుడు, జరిగిన దానికి కేవలం మహిళలనే ఎందుకు బలిపశువుని చెయ్యాలి? తప్పు చేసిన పురుషుడు దర్జాగా చెలామణి అవుతుంటే, నిజానికి తనదే తప్పూ లేకపోయినా మహిళ మాత్రం బాధ పడడం చాలా దారుణమయిన విషయం.

Sankar said...

మహేష్‍గారూ ఈసారి కూడా నా ఓటు మీకే.. అసలు ఇక్కడ తప్పు చేసినవాడికి కాకుండా బాధితురాలికి తప్పు అంటగట్టడం అమానుషం... సానుభూతికి బదులు సూటిపోటి మాటలు కూడాను. కాని ఈ విషయంలో మాత్రం మగవారికంటే ఆడవారే ఆడవారికి శత్రువులు, ఎందుకంటే వాళ్ళే దీనిని భూతద్ధంలో చూపడం, రేప్‍కి గురైన ఆవిడ కోల్పోయినదేదో తమ దగ్గర భద్రంగా ఉందన్న అహంభావాన్ని ప్రదర్శిస్తుంటారు.
@దిలీప్‍గారు,
మీరు ఈ వ్యాసాన్ని అలా ఎందుకు అర్ధం చేసుకున్నారో నాకు బోధపడడంలేదు.
’మోసం చేసి,ఆడదాన్ని పది మంది ఒకేసారి రేప్ చేసినా తను చనిపోదు. తను బతకగలదు, బతకాలి... అని చెప్పి పది మందిని రేప్ చెయ్యడానికి ప్రోత్సహిస్తున్నారు...’ ...
అంటే ఇక్కడ మీ ఉద్దేశ్యం ఏంటి, ఆ ఆడది ధైర్యంగా బ్రతక కుండా ఎవడో చేసిన తప్పుకు చచ్చిపోవాలా... మీరు ఒకసారి మహేష్‍గారు రిఫర్ చేసిన కధ చదవమని మనవి.. అక్కడ రచయిత్రి భావం ’శీలం కంటే మానం’ గొప్పదనే అర్ధంలేని ఆదర్శాన్ని వ్యక్తపరిచేదిగానే ఉంది... ఇక్కడ మహేష్‍గారు చెప్పేది అలాంటి భావజాలాన్ని మనసులో నింపుకోకుండా ఉంటే... ఒకవేళ అనుకోని పర్స్ధితుల్లో ఎవరన్నా బలాత్కారానికి గురైనా , తమ జీవితం అక్కడితో ఐపోయిందనే భావం మనసులోకి రాదని, తద్వారా సమాజంలో మామూలు జీవితాన్ని కొనసాగించొచ్చని...

సుజాత వేల్పూరి said...

"మానభంగం" "మానభంగం" అని పత్రికల్లో రోజుకు పది సార్లు చదువుతుంటాం కాబట్టి ఆ పదం చదవడానికి పెద్ద కష్టంగా ఉండదు. సరే, ఆ సంఘటన జరిగిపోయాక, ఆ సదరు ఫర్జానా(అదేనా పేరు?) పరిస్థితి ఏమిటి? మగవాళ్ళు ఆమెను పబ్లిక్ ప్రాపర్టీగా చూస్తారు. ఇది సహజం! అంతకంటే అతి సహజాతి సహజంగా జరిగేది ఏమిటో తెలుసా, సాటి స్త్రీల నిరసన, ప్రవర్తన!వీళ్ళే సమాజంలో ఎక్కువభాగం! లుక లుక లాడుతూ! ప్రతి స్త్రీ సాటి స్త్రీ ని అర్థం చేసుకుని ఉన్నతంగా ఆలోచిస్తుందని, ప్రవర్తిస్తుందని ఊహించలేం! కష్టాన్ని తట్టుకునే శక్తి మనసుకు కొంతవరకే ఉంటుంది. ఇది ఆ హద్దు దాటిక కష్టం! కొన్ని కష్టాలు తీరడానికి సమాజం, తోటిమనుషుల సహాయం తోత్పడతాయి.(ఆర్థికమైన,వైవాహిక సమస్యలు మొదలినవి)ఇది అలా తీరే కష్టం కాదు. ముందు సమాజమే ఆమెను వెలేసే చాన్స్ ఉంది. ఈ కష్టాలు అసలే అన్నిరకాలుగానూ నలిగిపోయి ఉన్న ఫర్జానాను మరింత చిదిమి వేయకూడదనే nerrater అలా కోరుకుందని నేను అనుకుంటున్నాను.

అసలు ఫర్జానా మానసిక, శారీరక పరిస్తితి ఏమిటో ఆలోచించండి. ఆమెపై అత్యాచారం జరిపింది ఒక్కరా, పది మందా? అటువంటి ఘోర సంఘటన జరిగాక ఆమె ఏం చేయాలి?(ఏం చేస్తుందన్నది ఫర్జానా కొదిలేద్దాం)

మీరే అన్నారుగా అది "mental assault కూడా అని! అది జరిగాక ఒక మామూలు స్త్రీ పరిస్థితి ఏమిటి? neraater కూడా ఒక మామూలు స్త్రీ పాత్రే. తనకు ఎదురైన కష్టానికి ఆదిశక్తే జవాబివ్వాలని కోరుకునే పాత్ర! ఆ పాత్ర దృష్టిలోంచే ఆ కథ నడిచింది.ప్రాణం కన్నా మానం ముఖ్యం అన్నట్టు నాకూ అనిపించలేదు. ఒక వేళ రచయిత్రి "ప్రాణం కన్నా మానం ముఖ్యం" అనే సందేశం ఈ కథ ద్వారా ఇవ్వదల్చుకుంటే నేను దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను.

Kathi Mahesh Kumar said...

@దిలీప్ & సుజాత; ఈ కథ మరేదైనా పత్రికలో చదివుంటే, ఒక నిట్టూర్పు విడిచి ఊరుకునేవాడిని.కానీ ఈ కథ ప్రచురించబడింది ‘భూమిక’లో.స్త్రీవాద పత్రికగా చెప్పుకునే వీరి విలువల్ని మనస్ఫూర్తిగా నమ్మిన నాకు ఈ కథలోని విషయం ఆమోదయోగ్యం కాదు.నేను ఈ కథలో అర్థం చేసుకున్నదే ఈ వ్యాసంలో చెప్పాను. మీకు వేరేవిధంగా అర్థమయ్యుంటే, ఒక పాఠకుడి/రాలి గా అది మీ హక్కు.

కొన్ని విలువలకు నిబద్దమైన పత్రికలు ఆ విలువల్ని ప్రచారం చెయ్యాలేగానీ పితృస్వామిక భావజాలంలో భాగాలైన ఆడవారిలోని బేలతనాన్నీ,చేతకానితనాన్నీ,ఎస్కేపిజాన్నీ కాదు. ఎక్కడోఉన్న ఆదిశక్తికోసం తపస్సుచెయ్యక ఆ "మమూలు స్త్రీ" తనలోని ఆదిశక్తిని నిద్రలేపి అన్యాయాన్ని ఎదుర్కొని తను విఫలమైనా, అది నాకు ఆదర్శమే.

అంతేకాక ‘ఆదిశక్తిని’ వరదేవతగా ఎంచుకోవడానికి కథలోగల కారణం చదివారా? "మనిషినీ, మగవాణ్ణీ, ఆ మగవాడు తయరుచేసిన న్యాయవ్యవస్థనీ, అతడి కనుసన్నలో మెలిగే సంఘాన్నీ ఎవరినీ అడిగి లాభం లేదు, ఆఖరికి ఆ దేవుణ్ణి కూడా. ఆయనా మగవాడే కదా?". ఈ ఒక్క వాక్యంచాలు ఈ కథ స్త్రీవాదానికి ఎంత దూరమో తెలియజెప్పడానికి! అసలు ఇలాంటివారికి స్త్రీవాదం గురించి నేర్పడానికి ఒక టపా రాసెయ్యాలి.

రేప్ ఎంత దారుణమైనా,LIFE is more valuable అని నేను నమ్ముతాను.చెయ్యోకాలోపోతే చనిపోవాలని కోరుకుంటామా?అత్యాచారం కూడా దాదాపు అంతే.రేప్ చెయ్యబడిన స్త్రీని తనదేతప్పన్నట్టు చూసే ఈ సమాజాన్ని నిరసించక,త్యజించక అత్యాచారాన్ని సహించి శారీరకంగా,మానసికంగా హింసించబడిన మహిళ "చావుకోరడం" నా పరంగా దారుణమేకాదు అమానవీయంకూడా.అందుకే ఈ విలువల్ని ప్రభోధించే కథను నిరసించాను.

రేప్ జరిగిన మహిళ మానసిక పరిస్థితిని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ,ఒక మనిషిగా ఈ కుహానా విలువలకి అతీతంగా తనకు కావల్సిన మానసిక ధైర్యాన్నివ్వగలననే నమ్మకం నాకుంది.ఆ empathy చాలనుకుంటాను.

ఏకాంతపు దిలీప్ said...

శంకర్,
నేను భూమిక లోని టపాని నాలుగు సార్లు చదివాను. మహేష్ గారి ఈ టపాని అంత కన్నా ఎక్కువసార్లే చదివాను.

ఆ టపాలో నాకెక్కడా "ప్రాణం కన్నా మానం" గొప్పది అని ఎక్కడా ధ్వనించలేదు. నాకు ఆ కష్టం తీవ్రత మాత్రమే భోధపడుతుంది.

ఒకవేళ భూమిక ఎడిటర్లు దాన్నే ప్రోపగేట్ చేస్తున్నారు అనిపిస్తే, దానికి "ఆడది కోరుకునే వరం" అనే రచన ఏ విధంగాను ఆధారం, ప్రాతిపదిక కాకూడదు.


అలాంటి గొడవల్లోనే మీరు ఇరుక్కుపోయి, వేరే వర్గం వాళ్ళు మిమ్మల్ని చితకబాది మీలో స్పృహ మిగిలి ఉండగానే మీ పురుషాంగం మీద పది సార్లు మోది అక్కడే వదిలిపోయారు అనుకోండి. ఆ షాక్ ఎలా ఉంటుందో మగాడిగా నాకు తెలుసు. మీకు అలా జరుగుతుందని తెలిసి, అలాంటి బాధపడే కన్నా వాడు చావడం బెటర్ అని నేను అనుకుంటే... నాలో మీ పట్ల సానుభూతిని మాత్రమే చూస్తారు గానీ, దాన్నుండి ద్వంద్వార్ధాలు ఏ మనిషీ తియ్యడు.

ఇంకా

మీరు ప్రశ్నించిన నా ఉద్దేశం... అది నేను అర్ధం చేసుకున్నది కాదు. నాకు మహేష్ గారు ఏ విధంగా భూమికలోని టపాని అర్ధం చేసుకున్నారో, నేను కూడా ఈ టపాని అర్ధం చేసుకుని ఉంటే నా స్పందన ఎలా ఉంటుందో చెప్దామని రాసాను.

ఏకాంతపు దిలీప్ said...

మహేష్ గారు,

ఇకపోతే నేను రాసే ముందు నా కామెంట్ అవసరమా అని ఆలోచించి రాస్తా... రాత్రి నిద్ర ముంచుకొస్తున్నా చాలా సేపు ఆలోచించి రాసాను.

దానికున్న కారణాల్లో నాకు ఖండించాలి అనిపించింది ఖండించడం ఒకటి, ఇంకోటి మీలాగా విరివిగా రాసేవాళ్ళు, విరివిగా చదివించే వాళ్ళు (వైడ్ వ్యూయర్షిప్) చెప్పినది చాలా మంది నమ్మేస్తారు. ఒక పత్రిక లోని ఒక రచనని తద్వారా ఆ పత్రికని టార్గెట్ చేసుకుని రాస్తున్నప్పుడు చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మీ రచనలకి అలవాటు పడిపోయిన జనం దాన్ని గుడ్డిగా నమ్మేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సదరు పత్రికకి మీరు అర్ధం చేసుకున్న విధానం చెయ్యగలిగిన నష్టం చెయ్యగలదు.

నాకు మీరు ఎంచుకున్న ఆ రచనలో మీరు టార్గెట్ చేస్తున్న భావజాలం ఎక్కడా కనపడలేదు.

బహుసా మీరు చాలా మంది అర్ధం లేని స్త్రీ వాద రచనలు, స్త్రీ వాదులని చూసి ఉంటారు. ఆ రచన చదువుతున్నప్పుడూ మీ అనుభవాల ప్రాతిపదికగా మీరు ఆ రచనని అర్ధం చేసుకుని ఉండొచ్చు. దాన్నుండే మీ టపాలోని ఆలోచనా పరంపర పుట్టి ఉండొచ్చు.

నాకు మాత్రం "out of place" అనిపించింది.


నా ఖండన భూమిక లోని రచనని మీరు అర్ధం చేసుకుని "propagate" చేస్తున్న విధానానికి మాత్రమే సంభందించినది.


అది తప్పిస్తే మీరు చెప్పిన మిగిలిన విషయాలతో నేను ఏకీభవిస్తాను.

GIREESH K. said...

Beautiful articulation Mahesh. And a very valid point, wonderfully presented. Your posts are very nice and thought provoking. Good going, keep it up.

(Lekhini is not working, hence I am leaving my comment in english)

Kathi Mahesh Kumar said...

@దిలీప్; Beauty lies in the eyes of beholder అన్నట్లే, Interpretation is a right of reader,beyond author's intentions. కాకపోతే, కథలో ఇంతసూటిగా "మానంకంటే ప్రాణం ముఖ్యం" అని సజెస్ట్ చేసినాకూడా మీకు కనపడకపోవడం ఆ పత్రిక పట్ల మీ నమ్మకమో లేక ఆ భావజాలం పట్ల ప్రశ్నించలేని మీ నిబద్దతకో చిహ్నంలాగా అనిపిస్తోంది. అందులో కూడా ఏమాత్రం తప్పులేదు.మనం బలంగా నమ్మే విలువలు లేకపోతే అసలు జీవించడం ఎందుకు.

ఇక నేను పత్రికనో లేక రచననో "టార్గెట్" చేసి ఉద్దేశపూర్వకంగా రాయలేదు. ఆ కథ చదవగానే నేను పొందిన అసహనంలోంచీ ఈ వ్యాసం పుట్టుకొచ్చింది.నిజానికి నేను చాలా మంది ఆడవాళ్ళకన్నా పెద్ద ఫెమినిస్ట్ ని.కాబట్టి అటు స్త్రీవాదానికీ లేక స్త్రీవాద పత్రికకీ నా భావాలవల్ల నష్టం వాటిల్లే అవకాశం లేదు. నిజానికి నా టపాలో లంకె పెట్టడం వలన భూమిక పత్రిక ట్రాఫిక్ బ్రహ్మాండంగా పెరిగి, ఆ కథను చదివినవారి సంఖ్య రెట్టింపైఉంటుంది. గమనించగలరు.

@గిరీష్,ధన్యవాదాలు.

Anil Dasari said...

ఈ మగ పందులు, ఆడ కుక్కలు వగైరా వాదాలన్నీ కడుపు నిండినోళ్ల కాలక్షేపం బఠాణీలు. వాటివల్ల ప్రపంచం మారేదేమీ లేదు. అవి లేనంత మాత్రాన వచ్చే మార్పేదో రాకుండానూ పోదు. చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా, బలమున్నోడిదే రాజ్యం. ఆడ-మగ సంబంధాల్లోనూ ఇదే సూత్రం. మగాళ్ల నుండి ఆడాళ్లకుండేవి శారీరక హింసలైతే అట్నుండి ఇటు అవి మరో రీతిలో ఉంటాయి. దొందూ దొందే. వీటి గురించి ఇంతలేసి విశ్లేషణలు అనవసరం. అవి ఏనాటికీ మారేవి కాదు, ఈ వాదాలెన్నటికీ తెగేవీ కాదు. ఇది సత్యం, నిత్యం.

ఏకాంతపు దిలీప్ said...

మహేష్ గారూ,

అదే నాకూ అర్ధం కావడంలేదు. మీరెలా అలా అర్ధం చేసేసుకున్నారో అని! అలా అర్ధం చేసుకోవడం విషయం తప్పితే మీరు రాసిన మిగిలిన కాంటెంట్ విలువైనది. నేను దాన్ని ప్రశ్నించడం లేదు. అసలు ఆ కాంటెంట్ని భూమిక రచనని మీ ఉద్దేశంలో చూపకుండా కూడా రాయొచ్చు. అలా రాస్తే దానికి సార్వత్రికత వచ్చేది.

వివాదం( ఈ పదానికి చాలా అర్ధాలు ఉన్నాయి) వచ్చినప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది.
ఖచ్చితంగా భూమిక తన ఉద్దేశాలని వక్రీకరించిన మీ కోణంలో నుండి ట్రాఫిక్ ని ఆశించి ఉండదు.

పాఠకులు పెరిగినప్పుడు మన మీద భాధ్యత మరింత పెరుగుతుంది. మీ బ్లాగు మీ ఇష్టం. ఇలా వేరే వారి రచనలు విమర్శించేప్పుడు మనం అసహనంతో కాకుండా సంయమనంతో వ్యవహరిస్తే మన భాధ్యత నెరవేరుతుంది.

నాకనిపిస్తుంది ఆ అసహనం ఆ రచనలోని విషయం వల్ల కాదు, ఆ రచన మీరు ఎప్పటి నుండో అసహనంగా ఖండిద్దాము అనుకున్న ఒక విషయాన్ని గుర్తు చెయ్యడం వల్ల మీకు మరలా అసహనం పుట్టింది. చివరికి ఆ అసహనం ఆ రచన వల్ల వచ్చిందా? మీ గత అనుభవాలదా? అని గుర్తించలేకుండా పొయింది... అసహనంలో కూలంకుషంగా ఆలోచించలేము కాబట్టి భూమిక రచన మీద వేటుపడింది...., కానీ ఎప్పటి నుండో మీరు కూలంకుషంగా ఆలోచిస్తున్నవి మాత్రం చక్కగా రాసారు....

గీతాచార్య said...

చాలా చాలా ఆలోచించాల్సిన, చర్చించాల్సిన అంశాన్ని మీరు లేవనెత్తారు. కానీ చర్చించే వాళ్లు చాలా సంయమనం పాటిస్తూ కేవలం రేషనల్ వ్యూస్ ఆధారం చేసుకోవాల్సిన అంశం. లేకపోతె చర్చ బదులు వాదులాట మొదలౌతుంది.

మీ బ్లాగ్స్ మస్ట్ రీడ్. ఇలాగే కొనసాగించండి.

చక్కటి విషయాలని వ్రాస్తున్నందుకు నెనెర్లు.
-------------------------------------------------------------------------------------------------------------
ఈ క్రింద నా బ్లాగు లోని కథని ఇస్తున్నాను. ఇదీ చర్చించాల్సిన అంశమే. మీ కామెంట్ వ్రాస్తారని ఆశిస్తున్నాను.

http://annisangathulu.blogspot.com/2008/05/blog-post_23.html

భూమిక లోని కథను నేను చదవలేదు కనుక దాని గురించి వ్రాయటంలేదు. I appreciate your efforts in these topics.

Kathi Mahesh Kumar said...

@దిలీప్; చూసిన సినిమాని ఎలా సమీక్షించి విమర్శిస్తామో ఇదీ అంతే. దశావతారం సినిమా కమల్ హసన్ లోని నార్సిసిజానికి ప్రతీకగా నాకు అనిపిస్తే (ఇది నా అభిప్రాయం కాదు ఉదాహరణ మాత్రమే) తప్పు లేదుగానీ, ఇక్కడ నేను నా ఆలోచనలను ‘ట్రిగ్గర్’ చేసిన రచనను ఉటంకింస్తే వచ్చిందా? ఆలోచనలెప్పుడూ గాలిలోంచీ రావుకదా! ఈ విషయంలో ఆ కథ ఈ పనిచేసింది.

నేను ఈ టపాను సార్వత్రికత ఆశించి రాయలేదు. ఏటపా ఆ ఉద్దేశంతో రాయనుకూడా.నేను అనుభవించింది,అనుకున్నది,ఆలోచించేది మాత్రమే రాస్తాను. ఇదీ అంతే.నేను కథని వక్రీకరించానని నువ్వంటున్నావు. అది నా interpretation based on the available text అని నేను అనడంతో పాటూ, ఆ కథ లంకెకూడా ఇచ్చాను. నా అవగాహన తప్పైతే నా టపాకు విలువివ్వఖరలేదు. నా అభిప్రాయానికి అస్తిత్వం లేదు.

కథ చదివిన తరువాత నాకు వచ్చిన భావన "చిరాకు".అదే mind setతో నేను ఈ వ్యాసం రాసుంటే, సమస్యను చర్చించడానికి బదులు, కథను చీల్చి చెండాడేవాడిని.అది చాలా సులువుకూడా.కానీ నా వ్యాసం అలాఉందని నేననుకోను.

@అబ్రకదబ్ర; చాలా రోజులతరువాత నా బ్లాగు మీద దయగలిగిందన్నమాట!ఈ వాదనలు తెగేవి కాదని నేనుకూడా అంగీకరిస్తాను. కానీ కనీసం సమస్యను అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణలు అవసరమే అని నా అభిప్రాయం.

@గీతా చార్యగారూ. ధన్యవాదాలు. మీ కథను చదివి కామెంటాను చూడండి.

మీనాక్షి said...

మహేశ్ గారు మంచి పోస్ట్ raasaaru.
manchi aalochinachalsina posts rastunnaru.

vasantam said...

మహేశ్ గారు :D
ఏకాంతపు దిలీప్ గారు :(

Sankar said...

@దిలీప్‍గారు,
సరిగ్గా పేరు గుర్తులేదుకానీ ఒక మానసిక శాస్త్రవేత్త చెప్పిన మాటలివి... ’there are no facts, only interpretations'... ఇక్కడ జరుగుతున్నదదే (ఆమాటకొస్తే బ్లాగులోకంలో వ్యాసాల ద్వారా వాటి కామెంట్ల ద్వారా కూడా జరుగుతున్నదదే)... మనిద్దరం భూమికలోని కధని వేరు వేరు కోణాలనుండి చదివామన్నది మాత్రం మీ కామెంటు ద్వారా నాకు అర్దమైంది(అది మీ ఉదాహరణతో బలపడింది)... ఇక్కడ నేను ఇంతకు ముందు రాసిన కామెంటు ఇక్కడ మహేష్‍గారి బ్లాగులో రాసిన వ్యాసం మీద స్పందన మాత్రమే, అయితే ఈ వ్యాసానికి బేస్ ఆ కధ కాబట్టి దానిని ఇక్కడ గుర్తుచేసాను . మరో విషయం ఆ కధమీద నా అభిప్రాయం పూర్తిగా నా వ్యక్తిగతం(అది తప్పవ్వడానికి నూరు శాతం అవకాశం ఉంది),దానిని జనరలైజ్ చెయ్యదలచుకోలేదు.మీరు చెప్పిన ఉదాహరణ చదివాక నాకు వేరే కోణం నుండి చదివే చాన్స్ దొరికింది. థాంక్స్... ఇంకోసారి ఆ కధని చదివి నా అభిప్రాయాల్ని అక్కడ వ్యక్తపరుస్తాను...

Kathi Mahesh Kumar said...

@దిలీప్; మీరు శంకర్ కు చెప్పిన వివరణ చూశాను.మీరు చాలా తార్కికంగా చెప్పడానికి ప్రయత్నించారని మొదట అనుకున్నా, నీ బేసిక్ అనుకోలే (assumption) తప్పుగా ఇప్పుడనిపిస్తోంది.

మగాడు హింసకు గురికావడమే కాదు, దాదాపు రేప్ కి సమానమైన సొడమీ (sodomy)కి గురైనా చనిపోవాలి అనుకోరు. అలాగని నీలాంటి మిత్రులు కోరుకోరుకూడా. ఎందుకంటే,సామాజిక స్టిగ్మా ఈ విషయంలో పెద్దగా లేదు గనక. పైపెచ్చు survival instinct అనే ఒక మహత్తర మానవశక్తొకటుంది.యుద్దం,మతకల్లోలాలవంటి స్తితిలో పురుషాంగం తెగ్గోయబడినా బతికిన మగపుంగవులున్నారు.

జీవించాలి అనే కోరికకు ఆడామగలకు తేడా ఉండదు.కాబట్టే, LIFE is more important than social stigma అన్నాను. ఈ కారణంగానే,హిందూ గుంపుకు తన స్నేహితురాల్ని పట్టించిన తన ‘గిల్ట్’ పోగొట్టుకోవడానికో,లేక మానంపోయే స్నేహితురాల్ని (సానుభూతితో !?!) మరణంద్వారా రక్షించాలనుకునే ఆ స్త్రీ కోరికలో స్వార్థం తప్ప ఆదర్శం లేదనిపించింది.

మాటి మాటికీ మీరు ఆ కథలో నాకు "ప్రాణంకన్నా మానం గొప్పది" అని చెప్పినట్లు తోచడం లేదంటున్నారు. ఈ వాక్యాలకర్థమేమిటి? "వాళ్ళు ఆమెని కుక్కలు విస్తరి చింపినట్టు చింపేకంటే ముందుగానే ఆమె ప్రాణాలు పోవాలని ఆ రాత్రి దేవుణ్ణి నేను ప్రార్థించినట్టు నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థించలేదు", "చచ్చిపోయిందని ఆశ పీకుతున్నా తన కోసం ఎంతెంతో వెతికాను". ఈ మాటలు ఆ తీసుకుపొయిన మతోన్మాదులు అత్యాచారం చెయ్యడంకోసమే తీసుకెళ్తున్నారని తెలిసిన తరువాత అనుకుంటుంది.

teresa said...

@mahesh- you've done a wonderful job in brining up an important social issue to the readers' attention. I agree with your views on "life being more valuable than the stigma of being a rape victim" unequivocally.
Talking about the story in bhoomika- The narrator is an average woman grieving for her friend and expressing her angst just like an average laywoman. she is not trying to convey a message to the world and neither is the author. For a critical reader like you, I understand that it's more than just a story and I personally feel that it's a good story to have evoked an excellent response from you! keep up the good work :)

ప్రియ said...

What a fantastic topic to read. Fantastic, not in essence, but the effort to present a serious topic, for everybody to read, understand, and act accordingly.

I feel happy that the telugu blogs are written about very important issues.

నిజానికి నేను చాలా మంది ఆడవాళ్ళకన్నా పెద్ద ఫెమినిస్ట్ ని.

"నేను నక్సలైట్ ని, నేను నక్సలైట్ ని, నేను నక్సలైట్ ని," టైపు లో ఉంది. కానీ మీరన్నట్లు మానం కన్నా ప్రాణం ఎప్పుడూ మిన్న. I agree with you. I read the story, and then writing the comment.

Kranthi M said...

మానభంగం ఒక ‘గాయం’. మగవాడు తన ఆధిపత్యాన్ని వ్యతిరేకించే మగాడిని కొట్టి, ఆడదాన్ని అవమానించో లేక బలవంతం చేసో తన డామినేషన్ ని నిరూపిస్తాడు. idi adirindi mahesh garu.Inka chaala raayalani undi kaani raayaleka pounna kshaminchandi.simply superb.

రాధిక said...

మీరు టపాలో చెప్పిన విషయాలు చాలా విలువైనవి,గౌరవి0చతగ్గవి మరుయు అ0దరూ ఏకీభవి0చతగ్గవి కూడా.కానీ ఆ కధలో నాకు అలాన్టి భావ0 కనిపి0చలేదు.నా కోణ0 ఇలా వు0టే మీకు ఆ కోణ0లో కనిపి0చి వు0టు0ది.కాబట్టి మీరేమి చెప్పాలనుకున్నారో చెప్ప0డి.మీరు చెప్పిన దానిలో కూడా పెద్ద తప్పేమీలేదు.మీకు అనిపి0చి0ది చెప్పారు అ0తే.కానీ అ0దరి నీ అదే కోణ0లో ఆ కధ చదివేలా చేయొద్దు.అలాగే దిలీప్ గారికి అనిపి0చి0ది కూడా ఆయన ఇక్కడ చెప్పారు.ఇక్కడ కొమ్తమ0దికి తప్పుగా కొ0తమ0దికి తప్పులేనట్టుగా అనిపి0చి0ది అ0టే ..సో కధలో తప్పేమీలేదు.భూమిక ఎడిటర్ గారికి కూడా అది మాకోణ0 లోనే కనిపి0చి వు0టు0ది.లైట్ సార్.

ఏకాంతపు దిలీప్ said...

"మగాడు హింసకు గురికావడమే కాదు, దాదాపు రేప్ కి సమానమైన సొడమీ (సొదొమ్య్)కి గురైనా చనిపోవాలి అనుకోరు. అలాగని నీలాంటి మిత్రులు కోరుకోరుకూడా. ఎందుకంటే,సామాజిక స్టిగ్మా ఈ విషయంలో పెద్దగా లేదు గనక."

నేను దాని గురించి రాయలేదు.

"పైపెచ్చు సుర్వివల్ ఇన్స్తించ్త్ అనే ఒక మహత్తర మానవశక్తొకటుంది.యుద్దం,మతకల్లోలాలవంటి స్తితిలో పురుషాంగం తెగ్గోయబడినా బతికిన మగపుంగవులున్నారు."

తెగ్గోయబడి ఉండొచ్చు. బతికీ ఉండొచ్చు. మీరన్న మహత్తర శక్తి కూడ ఉండొచ్చు. వాటిని నేనూ ఖండించను, భూమిక వాళ్ళు ఖండించరు. నేను ఆ ఉదాహరణ ఎందుకు తీసుకున్నాను అంటే.., ఆ హింస తీవ్రత ని చెప్పడానికి మాత్రమే. అలా మగాడి అంగం మీద దెబ్బ తగిలితే భరించలేనంట షాక్ ఎలా తగులుతుందో, దాన్ని తెలిసిన సాటి మగాడు ఆ షాక్ తీవ్రత తెలిసి ఆ హింస భరించడం కన్నా చావడం బెటర్ అనొచ్చు. సహజంగానే చిన్నప్పటి నుండి ఆటలాడేప్పుడు మనం( మగాళ్ళు) వేసుకునే జోకులు దాన్ని ధృవీకరిస్తాయి... అలా అంటే నిజంగా ఆ భాధకి గురైన మగాడు చనిపోవాలని కాదు, కేవలం తీవ్రత పట్ల సానుభూతిని తెలియ చెయ్యడం మాత్రమే...


"జీవించాలి అనే కోరికకు ఆడామగలకు తేడా ఉండదు.కాబట్టే, ళీFఏ ఇస్ మొరె ఇంపొర్తంత్ థన్ సొచీల్ స్తిగ్మ అన్నాను. ఈ కారణంగానే,హిందూ గుంపుకు తన స్నేహితురాల్ని పట్టించిన తన ‘గిల్ట్’ పోగొట్టుకోవడానికో,లేక మానంపోయే స్నేహితురాల్ని (సానుభూతితో !?!) మరణంద్వారా రక్షించాలనుకునే ఆ స్త్రీ కోరికలో స్వార్థం తప్ప ఆదర్శం లేదనిపించింది."

అసలు ఇక్కడ సోషల్ స్టిగ్మా ని ఆ రచయిత సమర్ధించలేదు.

"మాటి మాటికీ మీరు ఆ కథలో నాకు "ప్రాణంకన్నా మానం గొప్పది" అని చెప్పినట్లు తోచడం లేదంటున్నారు. ఈ వాక్యాలకర్థమేమిటి? "వాళ్ళు ఆమెని కుక్కలు విస్తరి చింపినట్టు చింపేకంటే ముందుగానే ఆమె ప్రాణాలు పోవాలని ఆ రాత్రి దేవుణ్ణి నేను ప్రార్థించినట్టు నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థించలేదు", "చచ్చిపోయిందని ఆశ పీకుతున్నా తన కోసం ఎంతెంతో వెతికాను". ఈ మాటలు ఆ తీసుకుపొయిన మతోన్మాదులు అత్యాచారం చెయ్యడంకోసమే తీసుకెళ్తున్నారని తెలిసిన తరువాత అనుకుంటుంది."

మాటి మాటికి మీరు లేని విషయాని ఆపాదిస్తున్నారు అనిపించింది. చూడండి పది మంది రేప్ చేస్తే షాక్ తో పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళూ, తీవ్రమైన రక్త స్రావం అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు... అసలు ఆవిడ పడిన బాధ తీవ్రత ఆలోచించకుండా, దానిలో మీరు మీక్కావాల్సింది వెతుక్కోవడమేమిటో అసలు అర్ధం కావడం లేదు...

సరే.. ఇక నేను విరమించుకుంటున్నాను... చాలా సమయం వెచ్చించాను ఈ ఒక్క విషయం మీదే...

Kathi Mahesh Kumar said...

@రాధిక గారు; సాహిత్యానికి సొంత భాష్యం (interpretation) చెప్పడం ప్రతి పాఠకుడి హక్కుగా నేను భావిస్తాను. దిలీప్ కిచ్చిన మొదటి కామెంట్లో నేను అదే చెప్పానుకూడా. కాకపోతే తను "ఖచ్చితంగా భూమిక తన ఉద్దేశాలని వక్రీకరించిన మీ కోణంలో నుండి ట్రాఫిక్ ని ఆశించి ఉండదు" అని అనేసరికీ,I felt I need to justify my interpretation. అందుకే ఇలా రాసేనాతప్ప,తననీ నాలాగే ఆలోచించమనో లేక నాకోణంలోంచే కథ చదవమనో కాదు.

@తెరెసా గారూ:I feel stories of "ideology" should be forward looking not regressive. ‘ఒక యావరేజ్ ఆడవారి బేలతనాన్ని చూపిస్తే, సానుభూతిని ఆశించడమవుతుందే తప్ప తాము నమ్మిన సిద్దాంతాన్ని propagate చేసినట్లు కాదు’ అని ఈ కథ చదివిన తరువాత నాకనిపించింది. పైపెచ్చు యుద్దం,మతకల్లోలాల వంటి సామూహిక హింస నేపధ్యంలో ఒక కథను,అదీ మహిళలపై జరిగే అత్యాచారాన్ని కథావస్తువుగా ఎంచుకున్నప్పుడు ఆ ఘటనకు assertive గా స్పందించలేక,escapism తో జగన్మాతకై తపస్సు చేసి మగజాతికి వ్యతిరేకంగా వరంకోరుకోవడంతో ముగించడం is nothing but reinforcing the concept of 'male devil'.ఇలా మగాడిని భూతద్దంలోంచీ చూపించడం స్త్రీవాద సిద్ధాంతపరంగా outdated అని చెప్పుకోవాలి. Just because its easy and convenient to evoke a provocative response,such gimmick is adopted.

గుజరాత్ అల్లర్లలో తనకు జరిగిన అవమానాన్ని దిగమింగి, ‘బిల్కిస్ భాను’విజయవంతంగా పోరాడి, తనపై అత్యాచారం చేసినవార్ని కోర్టుకీడ్చి న్యాయం చేసిన మహత్తర తరుణంలో ఈ బేలతనానికీ,జగన్మాతపుజకూ,తపస్సుకీ వరాలకీ నేను హారతిపట్టలేక నా నిరసనను తెలిపాను.

ఈ కథ ఇంకెక్కడైనా వచ్చుంటే, నా నుండీ ఇంత తీవ్రమైన ప్రతిస్పందన వచ్చుండేది కాదు.స్త్రీవాదాన్ని సైద్దాంతిక పరంగా నమ్మినవాడిని కాబట్టే, ఆదర్శాలపేరుతో తీసిన‘ఆమె’,‘ఆయనకి ఇద్దరు’ ‘కన్యాదానం’లాంటి regressive సినిమాలను వ్యతిరేకించినట్లే,ఈ కథనూ నిరసించాను.

@ప్రియ;నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు.తెలుగు బ్లాగుల్లో ఇంకా సామాజిక స్పృహ ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.ఎప్పుడూ politically correct కాకపోయినా అర్థవంతమైన చర్చలు జరుగుతూనే ఉన్నాయ్.

@క్రాంతి కుమార్: మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

@దిలీప్; నేను interpretation అంటే, నువ్వు "వక్రీకరించావు" అన్నావ్, అందుకే ఇంత చర్చ చెయ్యాల్సొచ్చింది.Both may be right and both might be wrong as well. But,both have a point of view, that's all the more important.

Anonymous said...

I never knew that my short story raised such a discussion/storm on the internet. Good to know that people do read my "avAkulu chavAkulu" :)

Strangely, I have never used the words"SIlam", "kuTumbam", "pavitratA" in the story. That should be sufficient to understand how much value I give to them, and what I think about them (in this context).

The story is NOT about "what should a woman do when raped?"nor is it about her "chastity", nor is it about her "family values" .It is about the agony, sense of outrage and humiliation, indignity of the act.

SAying that "rape is just an incident, need not make such a hue and cry about it" is not a valid argument. It is an abhorable crime against woman's individuality, sexuality and existence. Note that I am not talking about "violation of the body". I agree that that is beside the point.

The point of the protagonist wishing her friend were dead, indicates the emotional trauma women go thru in such events.

I found it strange that -when I talked of the "agony" and "trauma" that goes inside a woman, people talked about "SIlam" and "pavitrata" and then branded the story as perpetuating "feudal values". Ironic indeed.


Any crime against our personality in vulnerable moments gives a beating to our self-respect. The story is to highlight that bashing of self-respect.Surely not to advice that all the raped women should commit suicide. Neither does it advice women to ignore the crime. It becomes every woman's right to fight against it in whatever way they can.

If the attitude that "oh, you are not going to die because of that, take it easy, it is just an accident" etc. is justified, then we need not even worry about traffic problems, thefts or anything short of murder. But we do want to fight against every kind of crime. Then why is it branded as "feudalistic" when women say "we want to fight against rape"?


The concept that the protagonist "prays to God" instead of "spiritedly fighting against the crime through usual means" (or else ignore the problem since it is just an "incident" as advised by the people here) -
is to indicate how helpless women feel in front of the combined forces of legal systems and physical vulnerability.

If people could understand the agony and trauma of physical violation, then may be everybody can do something to prevent such crimes and make the society more safe for everyone.

నిషిగంధ said...

నా ఈ కామెంట్ మహేష్ గారినో లేక, కామెంట్స్ రాసిన వారినో ఉద్దేశించి కాదు.. in generalగా అందరు కధా రచయితలకు విన్నవిస్తున్నాను..

నా ఉద్దేశ్యంలో ఇక్కడ సమస్య కధదో, దానిపై ఏ ఒక్కరి భాష్యానిదో కాదు.. కధా కాలానిది!! అసలు మనం ఏ యుగంలో ఉన్నామండి!! నాకు కాన్సర్ వచ్చింది బాబో అని ఆశలన్నీ వదిలేసే కాలం లోనా లేక ఆ కాన్సర్ ప్రతికణాన్ని నిర్మూలించేవరకూ పోరాడే కాలంలోనా!!!

నేను కాన్సర్ ని, మానభంగాన్ని ఒకే దాటన కట్టమనడం లేదు.. కానీ మానభంగము, దాని వలన కలిగే వేదన, రోదన, ఇంకా ఎన్నెన్నో లాంటి భావాల మీద ఇప్పటికే ఎన్ని కధలు, సినిమాలు కళ్ళకు కట్టినట్లు చూపించాయి!! అవే భావాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పడంలో ప్రయోజనం ఏమిటి??? అన్ని చూసినా/చదివినా చేసేవాళ్ళు చేయకుండా ఉంటున్నారా!!

సమస్య గురించి అందరికీ తెల్సిందే! ఇక్కడ కావాల్సింది సొల్యూషన్! ఇలాంటి దుర్ఘటనల తర్వాత ఎలా survive అవ్వొచ్చో/అవ్వగలరో చూపించడం.. వీలైతే/తెలిస్తే అది చెప్పండి.. ఒక ఆశావాదాన్ని సృష్టించండి!! అంతేగానీ సమస్య నించి తప్పించుకుని అడవుల్లోకి పారిపోయే అమ్మాయిలను మాత్రం సృష్టించకండి!!

ఏకాంతపు దిలీప్ said...

@sbmurali2007

Thank God! finally you arrived and aired your view...

Anonymous said...

I have clarified my stand on "running away to the forest" on my blog space sbmurali2007.wordpress.com
Thanks for the spirited and lively discussion and exchange of views.

Kathi Mahesh Kumar said...

@శారద: రచయిత్రే స్వయంగా వచ్చి కథ గురించి వివరణ యివ్వడం సంతోషంగా ఉంది.

I have absolutely no issues with what you INTENDED while writing the story. But, unfortunately story doesn't carry your intentions. The story neither communicates your intentions nor propagates 'feminism' in it's ideal form. That's why I called the story "regressive" at its best. Stories of ideology should be progressive not lead to escapism. I found the later in the story.

That might be my skewed interpretation. However, its the text that lended itself to such a call.

కథ రాయడంలోని మీ ఉద్దేశం అభినందించదగినదే, కానీ మీ కథ మీ ఉద్దేశాల ఆదర్శాలకి అద్దం పట్టినట్టు నాకు అనిపించలేదు. అందుకే నా భాష్యం కాస్త త్రీవ్రత సంసరించుకుంది.

మీరు ఎంచుకున్న కథ గుజరాత్ అల్లర్ల నేపధ్యంలో ‘బిల్కిస్ భాను’ అనుభవించిన వ్యధకు ప్రతిరూపం. కాకపోతే, నిజజీవితంలోనే తాను పోరాడి తనను అత్యాచారం చేసినవాళ్ళని చట్టం ద్వారా శిక్షింపజేసింది. అలాంటిది మీరు ఎస్కేపిజాన్ని (తపస్సు) ఆసరాగా తీసికుని న్యాయ,చట్ట వ్యవస్థలు మగాడి కనుసన్నలలో మెలుగుతాయికాబట్టి న్యాయం జరగదనే నిర్ణయం ఆ ఎస్కేపిజానికి ప్రారాకాష్ట. పైపెచ్చు స్నేహితురాల్ని రక్షించేదైర్యం చెయ్యని మీ ప్రధానపాత్ర, తన స్నేహితురాలి "చావును కోరడం" out of guilt అనిపిస్తుందేతప్ప మీరు చెప్పిన సానుభూతి కాదు.

పైన నేను చెప్పిన చర్చకు మూలకారణం మీ కథ ‘భూమిక’లో ఉండటం. నిషిగంధ గారి సలహా కూడా అందుకే అని నా భావన. ఒక ‘వాదానికి’ సంబంధించిన పత్రికలో రాస్తున్నప్పుడు ఆ వాదాన్ని ప్రతిఫలించే కథ రాయాలి. మీరు ఈ కథని మీ బ్లాగులో రాసుంటే, నేను అభినందించి, నాకు అనిపించిన లోపాలు చెప్పి ఉండేవాడినేతప్ప, సైద్ధాంతిక చర్చ పెట్టేవాడిని కాదు.

నిషిగంధ గారు సజెస్ట్ చేసినా అదే చేసారు.ఇది వరకూ నేను చెప్పినట్లు, ఇవివి. సత్యనారాయణ తీసిన ‘ఆమె’ సినిమా ‘ఉత్తమ సామాజిక చిత్రం’గా నంది అవార్డు పొందినప్పుడు నేను పొందిన నిరసన భావమే మీ కథ స్త్రీవాద కథ అన్నప్పుడు కలిగింది. అందుకే ఇన్ని చర్చలు. కాబట్టి "ఇజాల" కథలు రాస్తున్నప్పుడు ఆ వాదం పట్ల ఒక కూలంకష అవగాహన కలిగి రాస్తేనే రాణిస్తాయి. అది మీ సృజనాత్మకతకు ఆనకట్టో లేక బంధమో అని మీరు అనలేరు. ఎందుకంటే, ఒక వాదాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు already ఒక సరిహద్దుని ఎంచేసుకున్నారు. అందుకే ఆ హద్దుల్ని గౌరవించి కథా వస్తువు, కధనం ఉండాలి అని చెప్పడం జరిగింది.

Anonymous said...

మహేష్ కుమార్ గారూ, చర్చ పక్కదారి పట్టించాలని కాదు కానీ, నేను శారద కథ చదివాను. ఇక్కడ మీ అభిప్రాయాలూ, వ్యాఖ్యలూ చూశాక రాయాలనిపించింది. మీరు నాబ్లాగులో వెలిబుచ్చినట్టు free imaginationతో, అంటే మీకు మున్ను గల అభిప్రాయాలదృష్టితో కథ చదివారు. రచయిత్రి చెప్పని మాటలు మీకు కనిపించాయి. నాకు ఆగుజరాత్ కథ తెలీదు. అంచేత నాకు శారధ చెప్పినట్టే, కేవలం, మనం మామూలుగా గమనించని మరొక కోణం, ఒకమనిషి ఆర్తి మాత్రమే కనిపించింది.
మొత్తంమీద మంచి చర్చ వచ్చిందని చెప్పగలను. మీఇద్దరికీ అభినందనలు.

- మాలతి

Anonymous said...

"కండతో కండ రాసుకునే ఒక బౌతిక ప్రక్రియకు, లేని విలువలాపాదించి, ఆడదానికి ‘పవిత్రత సీల్’ అంటగట్టిన చారిత్రాత్మక మగాహంకారానికి ..."

సంభోగం - అది ఏ పరిస్థితుల్లో జరిగినా దానికి పై వాక్యంలో ఇవ్వబడ్డ వ్యాఖ్యానం సరైనది కాదు. ఇది, విషయాల పట్ల వ్యాఖ్యాతల యొక్క sensitivity level ని ప్రతిబింబిస్తుంది. ఇది నిజమే అయితే మానభంగం చెయ్యడానికి రేపిస్టుకుండే కారణాలు (ఆఫ్టరాల్ కండ కండతో రాచుకోవడమే కదా ! దానికంత ఫీలయ్యేదేముంది ? ) అతనికుంటాయని, ఆ కారణం చేత అతడు చేసింది పెద్ద అపరాధం కాదనీ ఒప్పుకోవాల్సి వస్తుంది. అంతే కాదు, వావి-వరసలు మఱచిపోయి కలయిక జరుపుకునే రహస్య జంటలందరినీ మనం బాహాటంగా సమర్థించాల్సి వస్తుంది. (ఆఫ్టరాల్ కండ కండతో రాచుకోవడమే కదా ! దానికంత ఫీలయ్యేదేముంది ? )

జరిగిన సంఘటనని మర్చిపోమనే క్రమంలో, స్త్రీపురుష సంబంధాల్లో పాటించాల్సిన పవిత్రతని కించపఱచరాదు.

ఒకదానికి ఒక విధంగా స్పందించడమనేది వాళ్ళ వాళ్ళ sensitivity level. ఏమీ చెయ్యలేం. కానీ అన్ని కేసులూ ఒకటి కాదు.

ఏ సమాజంలోనైనా మగాణ్ణీ బట్టే ఆడది ఉంటుంది. అందులో "పితృస్వామికం" గట్రా అంటూ గగ్గోలు పడాల్సిందేమీ లేదు. ఈ పరిస్థితికి ప్రత్యామ్నాయం లేధు.

Sudhakar said...

Excellent post.

Kathi Mahesh Kumar said...

@తాలబా గారూ: చిన్నపిల్లలు మొత్తుకొంటున్నా బలవంతంగా ముద్దు చెయ్యడాన్నికూడా violation of individual space గా భావిస్తాను నేను. అలాంటిది అత్యాచారం ఫరవాలేదు అని ఖచ్చితంగా చెప్పను. కాకపోతే "అత్యాచారం కన్నా మరణం మేలు" అనే భావజాలం మన "పవిత్రత" ఆపాదించిన నేపధ్యంనుంచీ వచ్చింది కాబట్టి దాన్ని నేను నిరసించాను అంతే!

ఇక మీరు లేవనెత్తిన వావి-వరసలు లేని కలయికలు కూడా సామాజిక నేపధ్యం నుంచీ ఉద్భవించినవే. ద్రవిడ హిందువులు అత్త,అక్క కూతుర్ని పెళ్ళిచేసుకుంటాం. ముస్లింలు బాబాయ్ కూతుర్ని భార్యగా అంగీకరించొచ్చు.ఉత్తర భారతంలో ఒకే గోత్రనామం ఉంటేచాలు పెళ్ళి చేసుకోవడానికి కుదరదు.జాగ్రత్తగా గమనిస్తే అన్నీ కన్వీనియన్స్ కోసం పెట్టుకున్న రూల్సేగానీ వాటికి "పవిత్రత" ఆపాదించాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి వాటిని నిరసించడమో సమర్ధించడమో మనకు అనవసరం. Those are individual issues అంతే.

@మాలతి గారూ & సుధాకర్ గారూ: ధన్యవాదాలు.

Anonymous said...

very good and sensible post. Society somehow makes sure that it pains the pained. It should come out of that heinous trap.

గీతాచార్య said...

I agree with your views for most part. I now read the post.

But I agree means your views are considerable. i have an another story to tell.