ఈ మళయాళపోళ్ళు మనకన్నా బెటర్రా! అని మా స్నేహితుడొకడు కాలేజి రోజుల్లో ఎప్పుడూ అంటుండే వాడు. దీనికి, ఏం నీ గర్ల్ ఫ్రెండ్ మలయాళీ అనా? అంటూ మా ఎత్తిపొడుపులు సాధారణంగా జరిగేతంతు. మేము ఏడిపించడం వల్ల ఉక్రోషం తోనో, లేక మాకు నిజంగా జ్ఞానబోధ చెయ్యడానికో,తను సమర్ధించుకుంటూ కొన్ని లాజిక్కులు చెప్పేవాడు. నేను కాలేజిలో,యూనివర్సిటీ లో ఆపైన ఉద్యోగపరంగా చాలా భాషల వారితో,ప్రాంతాల వారితో కలిసిఉండటం జరిగింది. అందులో చాలామంది మలయాళీలు కూడా ఉన్నారు. ఇన్నాళ్ళ అనుభవంలో, నా మిత్రుడు చెప్పిన మాటల్లో నిజముందనిపించేది. తెలుగు వాడిగా, వీరి ‘ప్రతేకత’ను స్వీకరించడానికి కాస్త మనస్కరించకపోయినా, కాలాంతరంలో వీరి ‘భిన్నత్వాన్ని’ అభిమానించాను. అందరు మలయాళీలూ ఇలాగే ఉంటారు, అందరు తెలుగు వారూ అలాగే ఉంటాం అనిచెప్పడం ఇక్కడ ఉద్దేశం కానే కాదు. కేవలం నా మిత్రుడి లాజిక్కుకు కొంత నా అనుభవాన్ని జోడించి మీతో పంచుకుంటున్నాను అంతే.
మలయాళీ లలో నాకు కనిపించిన గొప్ప విషయం, తమ పనిలో ఎవరైనా తప్పుచూపిస్తే దాన్ని అంగీకరిస్తారే తప్ప,వ్యక్తిగతంగా తీసుకుని కక్షగట్టకపోవడం. చిత్రంగా ఉంది కదూ? ఒక్కసారి మన తెలుగు జీవితాలు చూస్తే, మనవాళ్లు పనిప్రదేశం (work place) లో అయిష్టత,అప్పుడప్పుడూ శతృత్వం ఎర్పరుచుకున్న వ్యక్తులు చాలావరకూ మన పనిలో తప్పుల్ని ఎత్తిచూపిన వారైఉంటారు, కాస్త గమనించండి ! తెలుగు వారు స్వభావరీత్యా పనిని ‘పర్సనల్ అజెండా’గా చేస్తామేగానీ, పనిని పనిగా చేసే ‘డిటాచ్ మెంట్’ లేదు. అందుకే, ఎవరైనా మన పనిలో తప్పులు చూపితే, వారు "మనతప్పులు" వెదకుతున్నారన్న అపోహతో కత్తికట్టేస్తాం, కరవాలాలు దూసేస్తాం.
ఇక రెండవది, మొదటిదానికి చాలా దగ్గరైన లక్షణం. వీరు తమ వ్యతిరేకతను, అంగీకారాత్మకంగా తెల్పడం (disagree agreeably). దీన్నిగూర్చి కాస్త వివరంగా చెప్పకతప్పదు. సాధారణంగా మన అభిప్రాయాలతో ఎవరైనా విభేదిస్తే, దాదాపు వాగ్వివాదమో లేక చిన్నసైజు యుద్ధమో చేసి, మాట నెగ్గించుకునే ప్రయత్నంచేస్తాం. కానీ మలయాళీని ఎక్కడైనా ఇలా చేయగా చూసారా? వీళ్ళు నానా యాగీ చెయ్యరు. కేవలం తను మీతో అంగీకరించడం లేదని తెలియచెబుతాడే గానీ,మీతో విభేధించడు. అంగీకరించక పోవడానికీ, విభేధించడానికీ చాలా తేడాఉందండోయ్ ! ఇంకా వివరణ లేకుండా ఈ విషయం అర్థమైందనుకుంటా!
మూడవది, చాలా ముఖ్యమైనది, వీరి సామాజిక వ్యవహారాల్లో వర్గాలూ,కులాల ప్రసక్తి దాదాపు రాకపోవడం. ఈ విషయమెత్తితే మన తెలుగువాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఫీలవుతారని తెలుసు. అందుకే ఎంత ‘అంగీకారాత్మకంగా’ వీలైతే అంత అంగీకారాత్మకంగా వివరించడానికి ప్రయత్నిస్తాను.
ప్రవాసాంధ్రుల తీరు నాకు తెలియదుగానీ, ఆంధ్ర దేశంలో ఎక్కడికెళ్ళినా డైరెక్ట్ గానో, నర్మగర్భంగానో చలం గారు చెప్పినట్లు, "మీరేమట్లు" అన్న ప్రశ్న రానేవస్తుంది. అలాక్కాకున్నా, "మనోడే" అన్న బాండింగ్ జరిగిన తరువాతే మనస్త్ఫూర్తిగా వ్యవహారాలు నడుస్తాయి. ఇక రాజకియాలు మొదలు, సినిమాలు,వ్యాపారం, చదువులూ అన్నింటిలోనూ ఈ ప్రసక్తిలేకుండా సాగదు. ఈ విషయంలో ‘ఎంతశాతం? ఎక్కడ?’ అన్న విభేదమే తప్ప, ఇదసలు మన వ్యవహారశైలి కాదు... అని మనమెవ్వరం గుండెల మీద చెయ్యేసుకుని చెప్పలేం. కానీ, మలయాళీల సాంగత్యం చాలావరకూ, ఇతరులు ‘మలయాళి’ అన్న ఒక్క ప్రాతిపదిక పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. నాయర్లు,పిళ్ళైలు,నంబూదరీలు అని వీరిలో కులాలున్నా, వీరి సాంస్కృతిక మరియు రాజకీయ జీవనంలో ఈ సామాజిక పార్శ్వం యొక్క ప్రాధాన్యత అంతగా లేదు కాబట్టి ఇలాజరిగి ఉండవచ్చు. అందుకే, బహుశా ఈ రాష్టం లో వామపక్షాలు నిరాటంకంగా పాలిస్తున్నాయి. మనం మాత్రం ఈ పరస్పర ఉత్ప్రేరకాల మద్యన, కులాల పద్మవ్యూహంలో గింగిరాలు తిరుగుతూనే ఉంటాం.
నాలుగవదీ, నేర్చుకోవలసినదీ వీరిలో భాష పట్ల, సంస్కృతిపట్ల గల నిబద్దత. మన ఆంధ్రావాళ్ళతో పాటు, పర రాష్టాలలొ మరియూ దేశాలలో ఇంకెవరైనా ఎక్కువ జనాభా ఉన్నారూ అంటే అది మలయాళీలే. కానీ వీరు తమ భాష, సంస్కృతి పట్ల చూపే ప్రేమానురాగాలు చూస్తే అప్పుడప్పుడూ ఆశ్చర్యమేస్తుంది. బయట ఉన్న వాళ్ళే కారండోయ్! కేరళ లో ఉన్న వాళ్ళలో కూడా ఈ లక్షణం బహుబాగా కనిపిస్తుంది.
మలయాళం లో మాట్లాడటం, సాహిత్యం లో ప్రవేశముండటం ఒక అవసరంగా, గౌరవంగా వీరు భావిస్తారు. కానీ మనం, తెలుగు రాకపోతే అంత గొప్ప. ఎంత ఆంగ్లమిళిత భాష మాట్లాడితే అంత గౌరవం. ఇక సాహిత్యంమాటంటారా? చెబితే నవ్విపోదురుగాక. మనకు బాల సాహిత్యం అసలు ప్రాచుర్యంలో లేదు. మార్కులెక్కువొస్తాయని చనిపోయిన సంస్కృతాన్ని ఉద్దరిస్తామేగానీ, మాతృభాష వైపు తలపెట్టి కూడా పడుకోము. మలయాళ సాహిత్యంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది, వారి ‘బాల సాహిత్యం’. వర్ణమాల మొదలు పిల్లల దైనందిక అవసరాలనూ,ఆదర్శాలనూ సరళ రీతిలో తెలియజెప్పే బాలసాహిత్యం వీరి సొత్తు. క్రిందతరగతుల్లో నన్నయ, తిక్కన టైపు పద్యాలను ఊదరగొట్టి పిల్లల్ని భయపెట్టక, వారి వయసుకు తగ్గట్టు మొదట వ్యావహారికం లో భాషను నేర్పుతారు. ఆ తరువాత పద్యసాహిత్యం వైపుకు దృష్టిని మరలుస్తారు. అందుకేనేమో, ఈ మలయాళీలు భాష అంటే ఆమడదూరం పరుగెట్టక అందిపుచ్చుకుని ఆనందిస్తారు,ఆస్వాదిస్తారు.
ఇక సంస్కృతి గురించి మాట్లాడుకుందాం. సాధారణ కట్టూబొట్టూ మొదలు లలితకళల వరకూ వీరికి ఒక "బ్రాండ్" ఉందని చెప్పవచ్చు. మన తెలుగువాడు పంచకట్టుతో ఎప్పుడైనా, కనీసం ఉగాది నాడైనా వీదెక్కగలడా? మలయాళీ మాత్రం తన "ముండ్" (పంచె) కట్టుకుని, యూనివెర్సిటీ క్లాసు అటెండ్ కాగలడు,అవుతారు కూడా. ఇక మహిళలు ధరించే "సెట్టి ముండ్"(బంగారు రంగు అంచుకలిగిన తెల్లటి నేతచీర) లో వీరినిచూస్తే, జీవీ.ఆయ్యర్ తీసిన ‘ఆది శంకరాచార్య’ సినిమాలో శంకరాచార్యుడి తల్లి పాత్రధారిణి మాత్రమే నాకు గుర్తుకువస్తుంది. ఒక గౌరవ ప్రదమైన అందం ఈ కట్టులో ఉందని చెప్పోచ్చు. ప్రస్తుతం తెలుగు కట్టూబొట్టూ అంటారా? ఉందిగానీ, అంతా కలగాపులగం.
కేరళలో ‘మోహినీ ఆట్టం’ నేర్వని ఆడపిల్లలు చాలా అరుదు. కథాకళిని గూర్చి తెలియనివారు అసలు కనిపించరు. ఇలా వీరు కళల్ని ‘దూరం గా’ ఆరాధించక, జీవితాలలో భాగం చేసుకున్నట్టు అనిపిస్తుంది. బహుశా కళలు ఇలాగే అభివృద్ధి చెందుతాయేమో ! ఇక్కడ మన తెలుగోడి సంస్కృతీ ప్రేమగురించి విపులంగా చర్చించి అభాసుపాలవదల్చుకోలేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి, శంకరాభరణం స్ఫూర్తిగా సంగీతాన్ని, సాగరసంగమం సాక్షిగా నాట్యాన్నీ నేర్చుకున్న తరం ఇప్పుడు పెద్దవాళ్ళైపోయారుగానీ, వాళ్ళ పిల్లలకు ఇవి నేర్పి పెద్దరికాన్ని మాత్రం నిలుపులోవడం లేదు. ఇక కళల పట్ల గౌరవమంటారా, అది ‘రవీంద్రభారతి’ మెట్లు దిగగానే హుష్! కాకి. మలయాళీ లు తమ కళాప్రేమని అటు రంగస్థలానికీ, ఇటు సినిమా రంగానికీ విస్తరించి, ఉత్తమ నాటకాలూ, కనీసం జీవితానికి దగ్గరగా ఉన్న సినిమాలనూ అందిస్తున్నారు.
ఐదవది, ఆఖరుది మలయాళీ అమ్మాయిల గురించి. ఒకప్పుడు ఇది ప్రమీలా రాజ్యం (ప్రమీలార్జునీయం సినిమా చూడండి) అవడం చేతనో లేక స్వతహాగా మాతృస్వామ్య సమాజం అవటం మూలంగానో తెలియదుగానీ ! ఈ అమ్మాయిలలో ఒక రకమైన ‘కాన్ఫిడెంస్’ కనపడుతుంది. అదీ ముఖ్యంగా అబ్బాయిలతో మెలిగేటప్పుడు. స్నేహం చెయ్యడానికి వీరు వెనుకాడరు, అలాగని చాలా ఈజీ గా ప్రేమించేస్తారని అనుకోకండి. స్నేహాన్ని ప్రేమగానూ, ప్రేమని స్నేహం గానూ ‘పాస్’ చేసే ద్వంద్వ ప్రవృత్తి వీరిలో అస్సలు కనిపించదని చెప్పాలి. స్నేహం లోనో ప్రేమలొనో అబ్బాయిలు మితిమీరినప్పుడు, "నో" అని ఖచ్చితంగా చెప్పగల మనో దైర్యాన్ని కూడా వీరుకలిగి ఉంటారు. ఇక మన తెలుగు అమ్మాయిలు చాలా వరకూ సహజసిద్ధమైన (సమాజనిర్మిత conditioning వలన) సిగ్గుబిడియాలతో ‘మంచి అమ్మాయిలుగా’ కాగలరేకానీ, తమదైన భావజాలం ఉండి, భావవ్యక్తీకరణా పద్దతులు కలిగిన వక్తిత్వం గల అమ్మాయిలుగా కాలేక పోతున్నారేమో అని నా భావన.
ఇలా మనం మలయాళీ ల దగ్గర నెర్చుకునే విషయాలు కొన్ని ఉన్నాయని నాకు అనిపించింది. నా ఉద్దేశ్యం లో ఇలాంటి సాంస్కృతిక తేడాలను తెలుసుకుని మంచిని గ్రహిస్తే, ఒక నూతన ఒరవడికి నాంది అవుతుందని నా నమ్మకం. నా స్నేహితుడు చెప్పిన ఇంకో మాటతో ఈ వ్యాసం ముగిస్తాను. "ఫూడల్ భావజాలం లేని తెలుగోడు, కమ్యూనిష్టుకాని మలయాళీ లేడు" అని.
14 comments:
ఈ రోజు మీ బ్లాగు చదవడం వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నెనర్లు.
meeru cheepina vaatitho nenu ekkebhavistunnanu..endukante maa office lo sagam mandi Kerala valle..kaanee chanipoyina samskrutham annappudu koncham manasu chivukkumandi ...kaani nijame ani anipinchindi
>> మాతృభాష వైపు తలపెట్టి కూడా పడుకోము
పానుగంటి లక్ష్మీనరసింహం వారి వాడుకలాగా ఉంది. బాగుంది.
@మినర్వ గారూ,ధన్యవాదాలు.
@నరేష్ గారు,మీ అనుభవం లోకూడా ఈ విషయాలు రావడం బాగుంది.ఇక సంస్కృతాన్ని "మృత భాష" అని భారత ప్రభుత్వమే చెప్పేసింది కాబట్టి(ఎక్కడా వ్యావహారికంలో లేదుకాబట్టి) అది నిజం. మన తెలుగు వాళ్ళు ఇంటర్ మీడియట్ లో తెలుగు ను వదిలెయ్యడానికి కారణం సంస్కృతమన్నది అందరికీ తెలిసిన సత్యమే.
బాగా చెప్పారు. మనం వాళ్ళలాగా ఉండాలంటే యెమి చేయాలో చెబుతారా?
మీరు వ్రాసిన విషయముతో 101% ఏకీభవిస్తున్నాను.
నెనర్లు!!!
మళయాళీలను బాగా అబ్జర్వ్ చేసారండి! చాలా చక్కని తులనాత్మక పరిశీలన!తప్పుని అంగీకరించడం అనే విషయం ఒకటి రెండు సార్లు గమనించాను గానీ(అదీ మీరు చెప్పాక ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకుని అలా అభిప్రాయానికి వచ్చాను) కానీ కులం ప్రసక్తి లేకపోవడం గురించి అంతగా తెలియదు. (మీ అంతగా ఏ తెలుగు వాడూ మళయాళీ లను స్టడీ చేసుండడు) అలా మనం ఎప్పటికుండగలుగుతామో కదా!
మళయాళీ సంస్క్రుతిలో నాకు నచ్చేది మీరు చెప్పిన 'శెట్టిముండ్' చీర. ఆ చీరలో ఎవరు కనపడ్డా చూస్తూ అక్కడె ఆగిపోదామనిపిస్తుంది నాకు. (మా ఇంటి పక్కనే అయ్యప్ప ఆలయం ఉంది. ఇక్కడ చాల మందిని చూస్తుంటాను నేను)ఆ చీర అందానికి ముగ్ధురాలినై,కేరళ ట్రిప్ లో కొనేసాను.
రవీంద్ర భారతి మెట్లు దిగ్గానే హుష్ కాకి " బాగా చెప్పారు! అసలు రవీంద్ర భారతి మెట్లు ఎక్కాలనే ఆలోచన కొంతమందికన్నా ఉన్నందుకు సంతోషించాలేమో మనం భవిష్యత్తులో! ముఖ్యంగా రంగస్థలానికి ఆదరణ లేకపోవడం నాకు బాధ కలిగించే విషయం!
ఏ ఇంట్లో అయినా సమర్థత కలిగిన ఆడవాళ్ళుంటే అంటుంటారుగా 'అక్కడంతా ఆడ మళయాళం ' అని!
బాగుందండి, మంచి పరిశీలన! ఇంత చెప్పాక, మీతో ఏకీభవించలేకుండా ఉండలేకపోతున్నాను. మనం అలా ఎందుకుండలేకపోతున్నాం! అంత నిబద్ధత మనకెందుకు లేదు?
సుజాత గారు,నెనర్లు.
మనం అలా ఎందుకుండలేకపోతున్నాం! అంత నిబద్ధత మనకెందుకు లేదు? అన్న మీ ప్రశ్నతో మళ్ళీ నా మెదడుకి పనిచెప్పారు.సామాజిక,చారిత్రక కారణాలు చాలానే ఉన్నా, మీకోసం ఇక్కడ ఒకటి ఉదహరిస్తాను.
1997 లో "అమెరికా! అమెరికా!!" అనే ఒక కన్నడ సినిమా చూశా(ఈ సినిమా గురించి నవతరానికి విశ్లేషణ త్వరలో రాస్తున్నా), అందులో ఇద్దరు హీరోలు. ఒకరు ‘పక్షి’లా ఆకాశం లో ఎగిరిపోవాలి, ప్రపంచపు ఆనందాల్ని అనుభవించాలి అంటాడు. మరొకరు ‘మహావృక్షం’లా,వేళ్ళూనుకుని ఆకాశాన్ని అంటేలా ఎదగాలి అంటాడు. ఈ ఇద్దరి పాత్రలమధ్య గల తేడాయే తెలుగోడికీ, మళయాళీ కి అని నాకు అనిపిస్తుంది.
మనం ఆకాశాన్నైతే అంటుకుంటున్నాం కానీ,‘పక్షి’ ఎప్పుడో ఒకప్పుడు కిందకు దిగాలని మర్చిపోయాం. కానీ మళయాళీ అలా కాదు తన roots (వేర్లు) బలంగా పెట్టుకునే, ఎదగదగ్గ ఎత్తుకు ఎదుగుతాడు. అంతే తేడా (ఇది చాలా తేడా సుమండీ!)
మనవాళ్ళలో మార్పు వస్తుందని ఆశించడం తప్ప, మనం చేయగలిగింది పెద్దగా లేదనిపిస్తుంది.ఎంతవీలైతే అంతగా ఇటువంటి సంస్కృతుల తేడాలను ఎత్తి చూపగలిగితే, కనీసం కొందరైనా ఆలోచిస్తారని ఆశ.
అద్భుతంగా చెప్పారు పోలిక. ఇది చాలా తేడానే! మీలాంటి బ్లాగర్ ఒకరు తప్పకుండా కావాలి, మెదళ్లకు రొటీన్ గా కాకుండా ఇతర విషయాలు కూడా ఆలోచించేలా పని చెప్పడానికి.మీ సమీక్ష కోసం ఎదురు చూస్తాను.
Anna chala machiga compare chesaru.
Chala rojula taruvata oka manchi vislesana chadivanu. Meeru kerala lo communist bavajalamu vellunukuni poyindantunnaru....nijame...dani to patu pachima bengal lo la kakunda malayali communistulu chesina tappulu oppukuntunnattunaaru anduke contunu ga power lo vundaleka potunnaru...( I am kidding)....ilanti vislesanulu mee nuchi inka ravalani korukuntunnanu.
malllus gurunchi baaga telusukunnandi...
మంచి టపా. ఆంధ్రదేశంలోని తెలుగు వారు కొంత detatched గా ఉంటారేమో గాని, ప్రవాసాంధ్రులు ఈ విషయంలో భిన్నంగా ఉన్నారు. వీరికి తెలుగు వారు,మాతృభాష, ఇక్కడి సాహిత్యం, లలిత కళలు, పిండి వంటల న్నా ఎంతో ఇష్టం. తమ పిల్లలకు తెలుగు నేర్పటానికి వీలయినన్ని ప్రయత్నాలు చేస్తారు. తెలుగు సాహితీకారులు, కళాకారులకు సన్మానాలు చేస్తారు. ఆంధ్రదేశము నుంచి వచ్చే నా లాంటి తెలుగువారిని అక్కునచేర్చుకొంటారు. నేను ఒరిస్సా, అండామాన్ నికోబార్ దీవులకు ఇంకా అమెరికా పర్యటన కు వెళ్లినప్పుడు అక్కడివారు నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. పోర్ట్ బ్లైర్ రేడియోలో నా గౌరవార్థం ప్రత్యేకంగా నా పేరుతో తేటతేట తెలుగులా అనే ప్రేమనగర్ లోని పాటను ప్రత్యేకంగా వినిపించటం జరిగింది. అమెరికాలో నేనున్న తావికి వచ్చి , తమ ఇంటికి విందు భొజనానికి తీసుకువెళ్లిన ఘటనలు చాలా పట్టణాలలో జరిగాయి. అదీ ప్రవాసాంధ్రుల సహృదయత.
ఇందులో ఒక అపశృతి కూడా గమనించా. అమెరికా లోని ప్రవాసాంధ్రులు కులాల ప్రాతిపదిక,తెలంగాణా పేర ప్రత్యేక సంఘాలు పెట్టుకోవటం బాధ కలిగిస్తుంది.
chaala baagundhandi. oka manchi aalochana puttinchelaa raasaaru.
inthaki "nevarlu" ante enti... chaala comments lo kanipinchindhi.
Idi chala varaku nijam.
Inkoka vishayam.. Kerala okappudu 100% literacy unna raashtram. Ippati sangathi teliyadu.
adi kuda chusi manavallu nerchukovali. nenu oka 1 nela rojula paatu akkada kalari, kathakali nerchukunna. Trivandrum lo oka intilo addeku basa chesamu. chala mandi chala andamga, apyayataga matalaadaru.
ikapothe kalala vishayaniki vaste, cinema rangam lo kuda veellu chala goppa. adbhutamainatuvanti kathalu, camera pani tanam manamu chusam. desam loni goppa goppa camera man lu ee raashtram nunchi vachina vaaare.. enthaina kerala vallu naku ishtam.
Post a Comment