Sunday, August 3, 2008

స్త్రీపక్షపాతానికి మరోవైపు

ఈ మధ్య కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మిత్రుడొకడు నా ‘స్త్రీ పక్షపాత’ వ్యాసాలు చూసి, తనకు తెలిసిన మరో పార్స్వాన్ని పరిచయం చేసాడు. తన ఆర్గనైజేషన్లో అందాన్ని అడ్డం పెట్టుకుని అందలమెక్కుతున్న అమ్మాయిల కథలూ, ప్రేమ పేరుతో అబ్బాయిల్ని "వాడుకుని" అనాధలూ,అభాగ్యులుగా చేస్తున్న వెతలనూ చెప్పి, నా ఆలోచనలకు మరో కోణాన్ని అందించాడు.



అతనితో జరిగిన చర్చ ఆధారంగానే ‘ప్రశ్నలు -జవాబులు’ అనే కవిత రాశాను. ఆ కవిత రాసినతరువాత కూడా, చెప్పడానికి ఇంకా ఉందనిపించడంతో ఈ వ్యాసాన్ని రాయడానికి ప్రయత్నిస్తున్నాను.



సాధారణంగా ఆడామగా అనగానే పాలకులు-పాలితులు, పీడకులు-పీడుతులూ,ఫెమినిస్టులూ-మేల్ ఛౌవ్వనిస్టులూ ఈ వ్యవహారాలే కనబడి ఒకే మూసలో ఆలోచనలు జరిగిపోతుంటాయి. అది బహుశా సహజంకూడా. ఒక గ్రామీణ నేపధ్యం నుంచీవచ్చిన నాబోటి వాడికి కూడా, వామపక్ష భావజాలం కలిగిన అకడమిక్ ఇంస్టిట్యూట్ లలో చదవడం వలన, బీదలపాట్లు, కులపోరాటాలతొపాటూ కన్వెన్షనల్ స్త్రీవాద భావాల మూసలు, DNA లో భాగమైపోయాయి. ఆధునిక అర్బన్ ప్రపంచంలో జీవిస్తున్నాకూడా, ఇప్పటికీ నేను చాలావరకూ గ్రామీణాభివృద్ది కెరీర్ పధంలోనే ఉన్నాను కాబట్టి, నాకు తెలిసిన ఆనిజాల్నే నిత్యజీవితంలో చూస్తూవచ్చాను. అందుకనే బహుశా ఈ ‘మాడ్రన్ మగాడి’ బాధలు చాలావరకూ తెలియకున్నాయి.



ఏమైనా, నా మిత్రుడు నా పరిధిని పెంచాడు. ఈ కొత్తకోణం దిశగా ఆలోచించడానికి పురిగొల్పాడు. ఈ ఆలోచనలు బహుశా నేను ప్రస్తుతం రాస్తున్న ‘Maleకొలుపు’ వ్యాసావళికి మరింత హంగులు సమకూరుస్తాయనుకుంటాను.



ఆడవారి ట్యాలెంటుతోపాటూ, అందం ఒక అసెట్ గా ప్రతిరంగంలో పనికొస్తుందనడం ఎవరూ కాదనలేని సత్యం. మగాడు కష్టపడి ఎంట్రీ సంపాదించాల్సిన చోటకూడా, అందమైన ఆడది ఒక నవ్వుతో జాక్ పాట్ కొట్టేయ్యగలదన్నది ఖచ్చితంగా మగవాడి వీక్నెస్ కి సంబంధించిన సమస్యే అయినా, ఆ వీక్నెస్ ని ఉపయోగించుకోగలిగిన ఆడదాని గొప్పతనాన్ని కూడా గుర్తించకతప్పదు. ఈ విషయంలో "మగాడికి మగాడు శత్రువే".



నవ్వుతోపాటూ ఆడవారు సర్వదా ఉపయోగించే మరో ఆయుధం "గోముగా అడగడం". అసలు ఈ ‘గో...ము...గా’ అనే పదం తెలుగులో ఎవడు పెట్టాడోగానీ, మహత్తరమైన ఇంగ్లీషులోకూడా ఇంత పవర్ ఫుల్ పదం దొరకదు. ముద్దుముద్దుగా ఆడది అడిగితే, గుండెని కట్చీఫ్ లోపెట్టిమరీ అర్పించడా ఏమగాడైనా? అదీ ముంగాళ్ళమీద కూర్చుని మరీ! ఇదే సాధారణంగా ఆఫీసుల్లో తమ పనిని పక్కమగాడి నెత్తికికట్టడానికి లలనామణులు వేసే ఎత్తుగడ. "సుబ్బారావు గారూ...మరే! కాస్త ఈ పనిచూసిపెట్టరూ" అని వగలు ఇలికిస్తే, కాదనే సత్తా ఏ మగపుంగవుడికైనా ఉంటుందా? ఎంతైనా షివల్రీ పాలపీకతో పట్టుకు పుట్టిన మగాళ్ళుకదా ! ఆడవారికి సహాయం చెయ్యడం మన విద్యుక్త ధర్మం మరి.



ఇంకో ఆయుధం "కన్నీళ్ళు". సమానత్వం సంగతి సరేగానీ, పట్టువిడుపులు మాత్రం ఆడవారికి ప్రత్యేకంగా ఉండాలి. పనిగంటలైనా, శెలవులైనా, కన్షెషన్లు మాత్రం మెండుగా ఎర్పరచాలి. లేకుంటే, "కార్పొరేట్లు జెండర్ ఫ్రెండ్లీ కాదు" అని ఏకిపారేస్తారు. పనిసరిగ్గా చెయ్యకపోయినా పల్లెత్తుమాటంటే, ఎక్కడ కొళాయి ఓపనై, తిట్టినోడి ఇమేజ్ ప్రవాహంలో కొట్టుకుపోతుందో అన్న టీంలీడర్ మగాళ్ళ పాట్లు నా మిత్రుడు చెబుతుంటే, చాలా సరదాగా అనిపించింది. కానీ, ఆ సిట్యుయేషన్లో నేనే ఉంటేమాత్రం, ఖచ్చితంగా కష్టమే అయ్యేది. ఎంతైనా, ఆడాళ్ళ కన్నీళ్ళా మజాకా!



నా మిత్రుడి ప్రకారం మరొ బ్రహ్మాస్త్రం "ఫ్లర్టింగ్". ఈ పదానికి సమానాంతర తెలుగుపదం తెలీదుగానీ, ‘సరదాగా మాట్లాడటం’ అంటే మాత్రం ఆ ఇంగ్లీషుపదం పవర్ తగ్గిపోతుంది. బాసైన ప్రతి మగవెధవకీ, మగ సబార్డినేట్లు ముళ్ళలాగానూ, ఆడ ఉద్యోగినులు మల్లెపువ్వుల్లాగనూ కనబడతాయంటాడు మా దోస్త్. దీనికి తోడు, నవ్వుతూ ఫ్లర్టేషియస్ గా మాట్లాడే అమ్మాయిలకు ప్రివిలేజిలతోపాటూ, ప్రమోషన్లలో ప్రిఫరెన్సుకూడా వస్తుందని కార్పొరేట్ మగప్రపంచమంతా నమ్మే విషయం. ఆడబాసైనా, మగబాసైనా మగాడికి ఒరిగేదిక్కడ ఏమీ ఉండదు. ఆడబాసు మగ సబార్డినేట్లని ‘మగపురుగులు’గా చూస్తే, ముందే చెప్పినట్లు మగబాసు కళ్ళకి వీళ్ళు ‘ముళ్ళే’. ఈ తంతులో తమ ట్యాలెంటుని పరిపూర్ణంగా ఉపయోగించుకునే సుందరాంగులు, కార్పొరేట్ ల్యాడర్ త్వరత్వరగా ఎక్కేసి సక్సెస్ చవిచూసేస్తారన్నమాట.



"అందరూ ఇలాగే ఉంటారా?" అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే, అందరూ ఇలా ఎప్పుడూ ఉండరుగనక. కాకపోతే, ఇదొక సామాజిక పార్శ్వం. ఒక దీనుడు అనుభవించి మరీ చెప్పిన నిజం. కాబట్టి, ఈ కోణానికి ఎంత విలువ ఉందో అంతే ఉండాలి. పొలిటికల్ కరెక్ట్ నెస్ ఇక్కడ సమస్యా కాకూడదు, స్వీపింగ జనరలైజేషన్ అనే అపవాదూ అర్థవంతం కాదు. ఇలాంటివి కొన్ని సబ్ కాన్షియస్ గాకూడా జీవితల్లో జరుగుతాయి. ఇక్కడ కార్పొరేట్ ఆఫీసుల్లో చెప్పినవి, పార్టీల్లో, ఫంక్షన్లలో, ప్లాట్ ఫారంలలొ, పార్కుల్లో, ప్రయాణాల్లో ఎంతోకొంత శాతంలో మన జీవితాల్లో జరగలేదంటారా?


*****

47 comments:

Purnima said...

బాగుందండి, ఏం చెప్పాలో అర్ధం కానంతగా!! ;-) ఆడవారి వల్ల మగవారికి హాని. మగవారి వల్ల ఆడవారికి హాని. ఆడదానికి ఆడదే శత్రువు. మగాడికి మగాడు కూడా!!

ఇన్ని చెప్పే బదులు.. "మనిషికి మనిషే ప్రమాదం" అనుకుంటే పోలే!!

Anonymous said...

ఇలాంటివయితే మా కంపెనీ లో బోలెడున్నాయి. ఆర్కిటెక్ట్ లని, టీం లీడ్ లని ప్రేమించి పెళ్ళాడే అమ్మయిలు కోకొల్లలు కనిపిస్తారు. ఈ విధంగా లైఫ్ అన్నివిధాల సెటిల్ అయిపోతుంది.

Anonymous said...

హ హ హ. క్లుప్తంగా బాగా రాసారు.
ఈ "గోముగా అడగడం" మాత్రం కిల్లర్ అండి బాబొయ్. మీరు దాని పవర్ మీద పూర్తిగా ఒక బ్లాగు రాయండి, రియల్ లైఫ్ ఉదాహరణలతో సహా. వీలైతే అందర్నీ రాయమనండి. చాలా మంది అమ్మాయిలకి ఇంకా బాగా తెలీదు దాని శక్తి ఏంటనేది. నా మటుకు నాకు ఈ మధ్యనే బాగా అనుభవం అవుతోంది, క్రొత్తగా ఆఫీసు లో ఇండియన్ అమ్మాయిలు జాయిన్ అయ్యారు. కొంచెం చనువుగా మాట్లాడితే చాలు, గుండె జార్చుకునే నాలాంటి అభాగ్యులకి తెలుసు ఆ కష్టాలు ఏంటో. చాలా కాలం 500 మందిలో కేవలం ఇద్దరు ఇండియన్స్ మి ఉండడం వల్ల లైఫ్ ఈజీగా గడచి పోయింది. ఈ ప్లర్టేషియస్ టాక్ ఒకటి. దానికి రెస్పాండ్ అవకపోతేనేమో, "Dud" అంటారు, అవుతేనేమో లేనిపోని తంటాలు (అసలే మన గుండె జర్రున జారిపోయే టైపు, ఎక్కడ తేల్తుందో మనకే తెలీదు. )

On a serious note..నా రూట్స్ కూడా ఓ కుగ్రామం లోనే ఉన్నాయి. నేను M.Tech కంప్లీట్ చేసేంతవరకీ కూడా నాకు వామపక్ష భావాలంటే సింపతీ ఉండేది(నేను పుట్టి పెరిగింది, బాగా నక్సలైట్లు ఉండే ఊర్లో). Very hard-core కాకపోయినా, strong feminism భావాలు ఉండేవి. చాలామంది Indian మగవాళ్ళని కొంచెం less sympathetic light లోనే చూస్తుండేవాణ్ణి. Indian social standards ప్రకారం చాలా liberal(?)/progressive views ఉండేవి.

అయితే అమెరికాకి వచ్చిన తరవాత చాలా వరకు నా భావాలు/ఆలోచనలు మారాయి. బహుశా అంతవరకూ నాకు లభించిన సాహిత్యం, పరిచయమైన మనుషులు, మన చరిత్రలో గొప్పవాళ్ళుగా చెప్పబడ్డ వ్యక్తులూ వారి రాతలూ, ఇంకా మన సొసైటీ లో ఎక్కువగా కనబడే love the poor/hate the rich వాతావరణం ఇంకా చాలా కారణాలు(అదో పెద్ద లిస్ట్).

ఆ మారిన భావాల్లో భాగంగా, ఇప్పుడు Indian urban/suburban educated youth అంత బాడ్ ఏమీ కాదు అనుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే they are pretty good.

ఎందుకు మారిందీ అంటే, అంతకు ముందు నేను married life ని, family life ని granted అనుకునేవాణ్ణి. అలాక్కాదు అని ఇక్కడకు వచ్చిన తరవాతే తెలిసింది.

But, నేను ఇప్పటివరకీ చూసిన ప్రపంచంలో నాకు కనబడ్డ ఇండియన్ అబ్బాయిలు (a vast majority of them) కుటుంబాన్ని వదలిపెట్టి పారిపోయే వాళ్ళు కాదు. వాళ్ళకి చాలా western and other societies standards తో పోలిస్తే, అసంతృప్తులు లేక కాదు. చాలా మంది అబ్బాయిలకి, ఇంట్లో కనీస intellectual stimulus(I guess I am using a wrong-word)..దొరకదు. I mean కనీసం ఒక మంచి జోక్ వేస్తే receive చేస్కోలేని wives కోకొల్లలు. నేననేది B.Tech/M.Tech/MCA/MBBS అమ్మాయిల గురించి!. నేను చాలా చిన్న example ఇచ్చా, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు.
ఈ మాత్రం దానికే ఫ్యామిలీ వదిలిపొట్టి పోతారా...అవ్వ..
Exactly...that's my point.

ఈ incompatibility అనే issue మీద(అప్పటికే ఒకటో/రెండో/కొన్నో సంవత్సరాలు date/lived-together చేసి వుండి కూడా) 1/3 or more marriages end అవుతాయి చాలా societies లో.

నాకయితే ఎంత ఆశ్చర్యమేసోదో మొదట్లో, నా seniors ని, వాళ్ళ marriages ని చూస్తే. అసలెలా పెళ్ళి చేసుకున్నారబ్బా ఈ అమ్మాయిలని అనుకునేవాణ్ణి(వాళ్ళంతా చాలా మంచి అమ్మాయిలు). అసలెక్కడా intellectual compatability కనిపించేది కాదు. చాలా మందితో మాట్లాడిన తర్వాత(వాళ్ళ ఇళ్ళలో, వంట చేస్కోలేక వందల సార్లు మెక్కినాక), చాలా దగ్గరిగా చూసినాక ఈ compatability/wave-length/frequency/vibes/opinions matching అనేది అంతా చాలా over-rated concept అని అర్ధమయ్యింది.
ఆ విషయాలకి కాకుండా కుటుంబానికి, పిల్లలకి ప్రాధాన్యిచ్చి తన తనకి కావాల్సిందేంటో తెల్సుకోవడానికో, ఆ తెల్సుకుంది వెదుక్కోవడానికో వెళ్ళని ఇండియన్ అబ్బాయిలంటే నాక్కొంచెం గౌరవం పెరిగింది. అందులోనూ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల గురించి ఈ western-society లో అబ్బాయిల్లాగా(not generalsing please) "అంత" cheap గా మాట్లాడ్డం చేయరు అలాగే always-looking-to-get-into-her-pants అనే attitude ని కలిగి వుండరు.

Yes, ఆడవాళ్ళని sleeping pills గా చూసే husbands కోకొల్లలు..అలాగే మగవాళ్ళని తెలిసో, తెలియకో currency notes లాగా treat చేసో wives కూడా వేలు.

సరే ఎక్కడో మొదలెట్టి, ఎక్కడికో వెళ్ళిపోయా. ఆకలి దంచేస్తోంది బయటికెళ్ళాలి. ఏమైనా పిచ్చి రాతలు కాని, incohrent thoughts కాని కనబడితే, ఈ candidate ఇంతే అని ignore చేసేయండి. bye

మోహన said...

మహెష్ గారూ..

ఎవరైనా [ఆడైన, మగైనా], సహాయం అడిగితే చెయ్యకుండా ఉండలేని వారికి[ఆడైన, మగైనా] ఇలాంటి తంటాలు తప్పవు. అమ్మాయిలు అడిగినంత మాత్రాన కరిగిపోవటం అనేది మగాడి తప్పు. అలా జరిగినంత కాలం, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఆడవారు కూడా, తమ ఆత్మ గౌరవం కంటే భర్త కి చేసే సేవ ముఖ్యం అనుకున్నంత కాలం, వైవాహిక జీవితంలో వారి కష్టలూ గట్టేక్కవు.

నేను ఎవరో ఒకరి తరపున మాట్లాడట్లేదు. మాట్లాడను కూడా. ఉద్యోగం లో, వైవాహిక జీవితంలో ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది నిజం! సరిగ్గా చూస్తే దనికి కారణం నాకు ఒక్క విషయమే కనిపిస్తుంది. ఇంటైనా, బయటయినా ఆత్మ గౌరవం తరువాతే యెదైనా...! అది నిలబెట్టుకోలేనప్పుడు పక్క వారిని ఎంత విమర్శించినా లాభం లేదు. తప్పు మనలో పెట్టుకుని పక్క వారిని నిలదీయటం సబబు కాదు కదా.. escaping అవుతుంది!! అని నా అభిప్రాయం.


"గ్రామీణాభివృద్ది కెరీర్ పధం" మహేష్ గారూ మీ కెరీర్ వివరాలు చెప్తారా ? మెయిల్ చెయ్యాలనుకుంటే visalay@yahoo.co.in కి చెయ్యగలరు. Thanks in advance.

RG said...

@ Indian minerva

"I mean కనీసం ఒక మంచి జోక్ వేస్తే receive చేస్కోలేని wives కోకొల్లలు. నేననేది B.Tech/M.Tech/MCA/MBBS అమ్మాయిల గురించి!."

How true :(

Sujata M said...

Not up to your mark. I was stumped by the title of the post.

Sexual mileage... is one aspect where the giver and taker are at advantage.

It is not a necessary fact that a successful career woman has been satisfying her bosses sexually!

Its not a Trend issue either. Its a matter of personal choice. However, fingers crossed, women do enjoy some protection by law against being sexually harassed at work.

If MCPs want to strip these laws off (on whatever reasons..), I hope only God can help them.

Anonymous said...

సుజాత గారూ..ఇది దారుణమండీ..ఆయన already చెప్పారు కదా.

"అందరూ ఇలాగే ఉంటారా?" అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే, అందరూ ఇలా ఎప్పుడూ ఉండరుగనక" అని.


మీరు చెప్తుంది నిజం. దానికి వ్యతిరేకంగా తనేమీ రాయలేదే!.

Kathi Mahesh Kumar said...

@సుజాతగారూ;ఇవి నేను కొత్తగా తెలుసుకున్న కోణం.బహుశా సొంతంగా అనుభవించి ఉంటే,ఇంకా బాగా రాయగలిగేవాడినేమో!నేను ఈ వ్యాసంలో sexual favours వరకూ వెళ్ళలేదు.ఆ పధం individual choice దని నా నమ్మకం. కానీ, flirting చాలా సాధారణంగా మన భారతీయ పరిధుల్లో (శారీరకంగా కలవనంతవరకూ పవిత్రతకు ఢోకా లేదుకదా)విస్తృతంగా జరుగుతుందనడం కాదనలేని సత్యం.అందరూ అలాగే చేస్తారు అనిమాత్రం ఎవరూ చెప్పలేరు. నేను చెప్పాలనికూడా ప్రయత్నించలేదు.

ఇక law against sexual harassment at work ని ఈ కారణాలవల్ల ఎవరైనా తీసెయ్యదలిస్తే,దానికి వ్యతిరేకంగా పోరాడేవారిలో నేను మొదటుంటాను.నాకూ నిజాలు తెలుసు. కానీ,ఇది నిజానికి ఒక కొత్తకోణం మాత్రమే. Not the whole truth.

@మోహన; చాలా సహేతుకమైన బిందువును లేవనెత్తారు. నిజమే హృదయాన్ని చేతుల్లో పెట్టుకు తిరిగే మగాళ్ళది ఖచ్చితంగా ఇందులో తప్పుంది. కాకపోతే ఇదే ఆర్గ్యుమెంటుని, మేల్ ఛౌవ్వనిజంకు వర్తింపజేస్తే ఒప్పుకుంటారా.అంటే,"పితృస్వామిక భావజాలవ్యాప్తికి ఆడవారి బలహీనత కారణం" అన్నమాట. కాస్త ఆలోచించండి.శోషితుడెప్పుడూ తన తప్పుందని ఒప్పుకోజాలడు.

@ఇండిపెండెంట్ గారూ; చాలా విశదంగా మీ స్వీయానుభవాన్ని పంచి వ్యాసం విలువని పెంచారు.చాలా ఆలోచింపదగిన విషయాలను తెలియజెప్పారు.మీరు చెప్పినవాటిపై స్పందించడంకన్నా,అంతర్మధనం చాలా అవసరం.

@మురళీధర్;ఈ విషయాలు మీకళ్ళముందే జరిగుంటే అంతకన్నా నా వ్యాసానికి క్రెడిబిలిటీ ఇంకేముంటుంది. నెనర్లు.

@పూర్ణిమ, మనిషికి మనిషి ప్రమాదమే, అందులో వీశమెత్తు సందేహం కూడా లేదు. కానీ ఇక్కడ మన చర్చ జెండర్ వార్లో ఇద్దరూ ఉపయోగిస్తున్న ఆయుధాల గురించి.ఇంతకుముందే చెప్పానుకదా, ఇదొక యుద్దం every thing is fair. ఎక్కడా వాల్యూజడ్జిమెంట్ అనవసరం.

ప్రతాప్ said...

మహేష్ గారు, మీరు చెప్పిన శాతం చాలా తక్కువ ని నా అభిప్రాయం. అలానే sexual herrasment శాతం కూడా బహుతక్కువ, బహుతక్కువ కాబట్టి మన సమాజంలో అలాంటివి జరగడం లేదు అని నేను అనను. కాని వాటి శాతం తక్కువ అని అంటున్నానంతే. ఏమో మరి ఎవరో అన్నట్లు మన "సమసమాజ" పరిస్థితులవల్ల ఇలాంటివి చాల రోజులవరకు బయటకి రావేమో.

ఇలానే మా బాస్ ఒకరోజు కోపం పట్టలేక ఒకమ్మాయిని మీటింగులో అందరి ముందు రెండు మాటలు అన్నారు. అంతే, హైదరాబాదుకి వానలొచ్చేసాయి, కాదు కాదు వరదలొచ్చేసాయి. మా ముందు మా బాస్ ని తెగతిట్టి, resign చేసి వెళ్ళిపోయింది. ఇందులో ఎవరిది తప్పు అని నేను చెప్పను. ఎందుకంటే ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి.

మంచి ఆలోచనలని రేకెత్తించేలా ఉన్నాయి మీ టపాలు.

జ్యోతి said...

మహేశ్.

ఇక్కడ నువ్వు చెప్పిన లక్షణాలు ఉన్న అందమైన అమ్మాయిలు ఉద్యోగం చేస్తూ తమ అందంతో మగవాళ్ళని వల్లో వేసుకుని డబ్బులు గుంజి, తమ జల్సాలు తీర్చుకున్నవాళ్ళు కొందరిగురించి నాకు తెలుసు. ఇలాటి అమ్మాయిలు కొంచెం వయసు పెరిగాక, జీవితంలో ఎలా సెటిల్ అవుతారో తెలీదు.

Rajendra Devarapalli said...

పాత ప్రేమాభిషేకం సినిమాలో ఒక డైలాగుంది,అవతలివాళ్ళు కావాలనుకుంటేనే ఇవతలవాళ్ళు కావాలనుకుంటారు,ఇవతలివాళ్ళు వద్దనుకుంటే అవతలి వాళ్ళూ వద్దనుకుంటారు.ఇక్కడ విషయం ఏమిటంటే,మగాళ్ళలో బకరాలు ఎలాగస్వచ్చందంగా అమ్మాయిలకోసం బలిపీఠాలెక్కుతారో,అలాగే అమ్మాయిల్లో కొందరు మొహమాటానికి పోయి ఏవేవొ తెచ్చుకుంటారు.ఇది అద్దాల్లో హంగూ ఆర్భాటాల్తో ఉండే కార్పోరేటు ఆఫీసు కావచ్చు,మడికట్టుకు కూర్చున్న విశ్వవిద్యాలయం,కావచ్చు.
ఎలాగయినా మనపని జరుపుకోవాలీ అది ఎలాంటి మార్గం అన్నవిచక్షణ వదిలేసినప్పుడే ఇలాంటివి(ఈ టపాలో పేర్కొన్నవి )సంభవిస్తుంటాయ్.దానికి,దేశ,కాల,మానాలతో నిమిత్తం లేదు.అలాగని అందరినీ ఈగాటన కట్టలేము.

జాన్‌హైడ్ కనుమూరి said...

మీ టపా చదువుతుంటే హటాత్తుగా ఎప్పుడోచూసిన "క్లియోపాత్రా" సినిమాలోని ఒక సీను గుర్తుకొచ్చింది.
అది సీజరు క్లియో పాత్రముందు మోకాళ్ళపై వుండి ఆహ్వానం పలుకుతాడు.
అక్కడో డైలాగు కూడా వున్నట్టు గుర్తు "ఎవ్వరికీ తలవంచని సీజరు నీముందు మోకరిల్లుతున్నాడు అని".
మరో సీనులో ఆంతోని వుంటాడు క్లియోపాత్ర ముందు.

ఇదే ఎందుకు గుర్తుకు వచ్చిందో ఖచ్చింగా చెప్పలేను.

ఎవరి ఎలా "డీల్" చెయ్యాలి అనేది గొప్ప కళ అనిపిస్తుంది నాకు, అది ఆడవాళ్ళకు అబ్బుతుందా మగవాళ్ళకు అబ్బుతుందా అనేది నాకు సంశయమే.
నా అనుభవంలో నాతో గోముగా/ముద్దుగా మాట్లాడి పని (ఆఫీసు) చేయించుకున్న వాళ్ళలో మొగవాళ్ళు వున్నారు, ఆడవాళ్ళు వున్నారు.


ఆలోచనాత్మక టపాకు అభినందనలు

Sujata M said...

Thanks for what you said here. But I have honest doubts - flirting - వల్ల పనులు జరుగుతాయా?! ప్రమోషన్లు వస్తాయా ? ఒక వేళ జరిగితే మంచిదే. దానికీ కేవలం ఆడవాళ్ళ పనులు జరిపించుకునే విధానాలకీ సంబంధం లేదు.

అసలు ఆడైనా, మగైనా పని జరిపించుకోవడానికి కావల్సింది లౌక్యం. అది చాలా మర్యాదయిన ఇచ్చి పుచ్చుకునే రిలేషన్.

స్త్రీలు గోముగా అడగటం వల్ల పని చేసేస్తుంటే, అది మగ వాళ్ళ ప్రాబ్లెం. మీకో సంగతి తెలుసా - స్త్రీలకు లంచం ఇచ్చి పని చేయించుకోవడం కష్టం. స్త్రీలను మందు పార్టీలకు పిలిచి, ఫేవర్లు చేసి బిల్లులు సంతకం పెట్టించుకోలేరు.

పాతివ్రత్యం - ఎవరికి వారు గీసుకునే పరిధులననుసరించి ఉంటుంది. అది వృత్తి జీవితం నుంచీ వ్యక్తిగత జీవితం దాకా వేరే వేరే పరిస్థితుల్లో ఉండొచ్చు. మన ప్రొఫెషనల్ జీవితాల్లోకి స్త్రీల ప్రవేశం ఎక్కువ అయ్యాక ఈ కొత్త ట్రెండ్స్ బయలు దేరాయని ఒక వాదన. కానీ దీనినే ఆధారంగా చేసుకుని స్త్రీలు వృత్తిపరంగా ఎదగుతున్నారనేది అర్ధం లేని వాదన. ఇప్పుడు వృత్తి జీవితం నిర్దాక్షిణ్యమైన పరుగు. ఈ పరుగులో అందరూ పరిగెట్టాల్సిందే.


So, as u said - కార్పొరేట్ కల్చర్ లో ఫ్లిర్టింగ్ ఉన్నా అది దీర్ఘకాలిక ప్రయోజనాలకు పని చెయ్యదు. ఫ్లిర్టింగ్ అసలు పెద్ద సమస్య కాదు.

చైతన్య కృష్ణ పాటూరు said...

చర్చ sexual favours, flirting దాకా వెళ్ళింది కానీ, నిజానికి విషయం ఇంకా అంతదూరం వెళ్ళలేదనుకుంటా. ఇలాంటివి అక్కడక్కడా కనపడుతున్నా, బహు తక్కువ. మహేశ్ గారు చెప్పినట్లు గోముగా అడగటాలు, మొహమాటం మీద కొట్టటాలే ఎక్కువ. మిగతా ఫీల్డ్స్ సంగతి నాకు తెలీదు కానీ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇది చాలా ఎక్కువగా కనిపించే దృశ్యం. అలాగని దీన్ని జనరలైజ్ చెయ్యలేము కూడా. మంచి టెక్నికల్ స్కిల్స్ వున్నవాళ్ళని కూడా చాలా మందిని చూసాను.

ఇది నిజంగా మగాళ్ళ ప్రాబ్లమే. అమ్మాయి అడిగితే చాలు మన టాలెంట్ ప్రదర్శించేసి, మెప్పించేద్దాం అనేంత డెస్పరేట్‍గా వున్నారు. అడిగితే చాలు పనులు చేసిపెట్టే వాళ్ళు, నవ్వుతూ ఆడిగితే ప్రాజెక్ట్లు చేసిపెట్టే వాళ్ళు వుండగా, flirting, sexual favours దాకా వెళ్ళాల్సిన అవసరం లేదసలు.

Kathi Mahesh Kumar said...

@ప్రతాప్;ఎంత శాతం ఇలా జరుగుతుందో తెలియాలంటే అదొక పెద్ద (అపరాద)పరిశోధనైపోతుంది.ఎందుకులెండి,తద్వారావచ్చిన ఫలైతాలుకూడా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది.ఏదిఏమైనా ఇలా అప్పుడప్పుడూ జరుగాయన్నది మీకూ కూడా అనుభవమే కదా!

@జ్యొతిగారూ; అటువంటివారికి తమదైన ఒక జీవన బ్లూప్రింట్ ఉండే ఉంటుంది లెండి!

@రాజేంద్రగారూ; చాలా మంచి డైలాగ్ గుర్తుచేశారు.ఈ సమస్య ఇరువైపులనుండీ ఉండేదే,కాకపోతే ఆడవాళ్ళ తరఫునుండీ ఇలా జరుగుతుందని ఖుల్లంఖుల్లా చెప్పే అవకాశంగానీ,ఆలోచనగానీ చాలా తక్కువ అంతే.

@జాన్ హైడ్ కనుమూరి గారు;"డీల్" చెయ్యడం, బాగా చెప్పారు. that's the name of the game.

@సుజాత;ఆడవారి లౌక్యంలో ఇవన్నీ భాగాలనుకోవచ్చుగా? కేవలం ‘దీని ఆధారంగా’మాత్రమే ఆడవారు వృత్తిపరంగా ఎదుగుతున్నారని చెప్పటం నా ఉద్దేశం అస్సలుకాదు.అది నేను వ్యక్తిగతంగా నమ్మనుకూడా. కాకపోతే ఇలాంటివి విరివిగా కార్పొరేట్ రంగంలో జరుగుతున్నాయని కొందరు మిత్రులు తమ కామెంట్లలో కూడా చెప్పడం ఒక సాక్ష్యం కాదంటారా? ఇక ఫ్లర్టింగ్ ని ఒక సమస్య అని నేను వ్యక్తిగతంగా అనుకోను. ఆరోగ్యవంతమైన సరదా ఉంటే, ఫ్లర్టింగ్ is an energy booster! I have absolutely no objections to it. కాకపోతే ఇక్కడ నేను చర్చించింది ఫ్లర్టింగ్ ని "ఉపయోగించడం" గురించి .

@చైతన్య; మీరు చెప్పింది సబబే. దీన్ని జనరలైజ్ చెయ్యడం నా ఉద్దేశం అస్సలుకాదు. చివరి పేరాలో ఆ మాట చెప్పానుకూడా.

Bolloju Baba said...

మహేష్ గారూ మీరు విభిన్న టాపిక్కులు ఎలా పడతారండీ బాబూ?
ఒక్కొక్క టపాను చూస్తుంటే కనిపించే వైవిధ్యం, కలకలం అంతా ఇంతా కాదు.
అభినందనలన్న మాట చాలా చాలా చిన్నది.
మీ బుర్ర మామూలిది కాదు. మీరు సీరియస్ గా బుక్ రైటింగ్ ఫీల్డ్ లోకి వెళితే చాలా ప్రభావవంతమైన రచయిత కాగలరు..

i admire your writings.
good luck
bollojubaba

సత్యసాయి కొవ్వలి Satyasai said...

కుమారా .. కత్తిలా చెప్పావు. నా అంచనా ప్రకారం మీకింకా పెళ్ళికాలేదనుకుంటా:)) అందుకే మీ ఫ్రెండు చూపించేదాకా ఈరెండో కోణం తెలియలేదు. కాంతం కథలు చదివితే కొంత విజ్ఞానం కలుగుతుంది ఆడవారి టెక్నిక్సు గురించి. ఆదిశంకరుడికి కూడా పరకాయప్రవేశం తర్వాతే పూర్ణ జ్ఞానం కలిగింది కదా :))
త్యాగరాజు గారు ఈసూక్ష్మం ... ఎంత నేర్చినా ఎంతవారలైనా కాంత దాసులేగా ... అని వాపోలేదా
@పూర్ణిమా.. అందాలరాముడు (పాత) లో పాట మర్చిపోయారా? నను బ్రోవమని చెప్పవే.... మాయ రోగమదేమో కానీ మనిషి మనిషికి కుదరదు .....

శ్రీ said...

బొల్లొజు బాబా గారు సత్యం పలికారు!మహేష్ గారి టపా కూడలిలోకి వచ్చిందంటే ఎదో ఒక మంచి టాపిక్ మీద విపరీతమయిన చర్చ ఉంటుంది.మంచి క్రియేటివిటీ ఉంది మీ దగ్గర!మీ అదిరిపోయే టపాలకివే మా జోహార్లు!

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

చాలా సున్నితమైన విషయాన్ని బాగా చెప్పారు. ఇలాంటివి రాసేప్పుడు పదాల ఎంచుకోవటం చాలా కష్టం.

ఎప్పటిలానే మీ విషయాల ఎంపిక, పదాల పొందిక చాలా బాగున్నాయి. నెనర్లు.

నా అనుభవం లో మీరు చెప్పిన విషయాన్ని సమర్ధించే సంఘటనలు, ఖండించే సంఘటనలు కూడా ఉన్నయి. కాబట్టి ఈ విషయం లో నేను తటస్థుడిని.

ఎటొచ్చి అబ్బాయిలు అంత "గోము" గా అడగలేరు :( అడిగినా అమ్మాయిలకి వచ్చినంత స్పందన రాదు :((
"మేన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్" అనుకుంటా !!! అబ్బాయిలు, ఆ "గోమింగ్ ఫేక్టర్" మాకు కూడా కావాలని ఈ సారి బ్రహ్మ గారిని అడిగేద్దాం.

Sankar said...

@మహేష్ గారు,
ఈసారి కూడా మంచి టపాతో ముందుకొచ్చారు.. మీ ఎనర్జీకి కారణం ఏంటీ (బూస్టా)... ఈ విషయంలో అంతగా అవగాహన లేదుకానీ నాకు తోచిన ఒక చిన్న విషయం ఒకటి చెప్తా... చాలా కార్పొరేట్ ఆఫీసుల్లో అడ్మినిస్ట్రేషన్ తర్వాత ముఖ్యమైన పోస్టుల్లో ఎప్పుడూ మగవాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళూ కూడా ఆ పదవికి అర్హులైనప్పటికి వాళ్ళకి అంతటి పదవులు అందనివ్వరు.. అంటే ఇలాంటి చోట వాళ్ళ లౌక్యం పనిచేయడం లేదనా... మీరు ఉదహరించిన టైపు వాళ్ళూ లేరని కాదు... ఐతే వాళ్ళ టాలెంటు అన్ని సమయాల్లో పనికి రాదేమో అని... ఇక ప్రమోషన్లు వగైరా విషయాలంటారా కొన్ని సార్లు మీరు చెప్పిన పద్ధతిలోనే జరిగినా, మగవాళ్ళు మాత్రం చాలా కామన్‍గా తమకు రాకుండా వేరే అమ్మయికి ఏదైనా చాన్స్ వెళ్ళిపోయినప్పుడు తమ అసహనాన్ని వెళ్ళగ్రక్కడానికి ఇలా ’ ఆవిడ వొగలు చూపించి ఉద్యోగం కొట్టేసింది’ లాంటి మాటలు వాడతారేమోనని నా అభిప్రాయం. అదో సాకుగా చూపించి తమ చేతకానితనాన్ని కవర్ చేసుకుంటారు. నిజంగా అంత సరుకులేకుండానే ఆడవాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చేస్తే ఇప్పుడున్నా కంపెనీలన్నీ ఎప్పుడొ మూసుకునేవారు కాదంటారా...
ఇక అబ్బాయిల్ని అవసరాలకోసం వాడుకునే టైపు గురించి రాజేంద్రగారు చెప్పినట్టు అది కోడి ముందా గుడ్డు ముందా టైపు సమస్య.. అక్కడ తప్పైనా ఒప్పైనా అది ఇద్దరిదీనూ(అమ్మ్యిలూ,అబ్బాయిలూ)...

@independent గారు
’I mean కనీసం ఒక మంచి జోక్ వేస్తే receive చేస్కోలేని wives కోకొల్లలు ’
జోక్‍కి రెస్పాన్స్ తక్కువగా వచ్చిందంటే దానర్ధం అది వాళ్ళు ఐడెన్టిఫై చేసుకోలేని విషయమేమోగానీ మరీ అంత బుర్రలేనోళ్ళేం కాదు కదా. ఏదో టెక్నికల్ విషయానికి సంబంధించో లేక మరేదొ విషయం మీద ఒక జోకేసేసి నవ్వలేదంటె ఎలా.... మనం ఎంత ఇంగ్లీష్ తెలిసినా కొన్ని హాలీవుడ్ సినిమా సీన్లకి నవ్వలేం ... దాని బ్యాక్ గ్రౌండ్ తెలియక ఇదీ అంతేనేమో...

సుజాత వేల్పూరి said...

చదువుతున్నా, చదువుతున్నా!

Anonymous said...

శంకర్, నా ఉద్దేశం మనమేదో పొడిచే వాళ్ళం, అమ్మాయిలేమో దద్దమ్మలు అని కాదు నా ఉద్దేశం.

ఆ మాటకొస్తే, నన్ను కళ్ళు పెద్దవి చేసుకొని అలా... వింటూ ఉండిపోయేలా నిలబెట్టిన అమ్మాయిలని మీట్ అయ్యాను చాలాసార్లే.

నా ఉద్దేశం, మహేశ్ చెప్పిన విషయాలకి, ఇంకొంచెం substance add చెయ్యడం. ఎందుకంటే, అందరూ ఇండియన్ అబ్బాయిలను ఆడిపోసుకుంటూనే ఉంటారు. వాళ్ళకి కూడా అసంతృప్తులు ఉంటాయి అందరి లాగే, కాని మిగతా societies లో వెళ్ళిపోయినంత తొందరగా కాని, వదిలేసుకున్నంత అతి చిన్న కారణాలకి కాని, పోతే తను మళ్ళీ ఎలా బతుకుతుందో అన్న కనీస భాధ్యతాయితమైన ఆలోచన లేకుండా కాని, తన తరవాత మన అబ్బాయిలు వెళ్ళరు అని చెప్పాను.

అంతేకాని వాళ్ళని కించపరిస్తే నా చెల్లెళ్ళని, అమ్మనీ తక్కువ చేసినట్టే కదా. అలా నేనెందుకు చేసుకుంటాను చెప్పండి. నేనెప్పటికి కూడా 'స్త్రీ' వాదినే.. కాకపోతే we have to give the credit where it is due కదా. మీరు నా కామెంట్స్ అన్నీ చదివి వుంటే, 'స్త్రీ వాది అయ్యిండీ సిగ్గుపడింది, అందాన్ని పొగడినప్పుడు" అని సుజాత గారు ఎక్కడో రాస్తే, నచ్హక objection raise చేసింది నేనే.

మోహన said...

Mahesh garu..

nishpakshapatam ga alochimche cheptunnanamdi.
Adavallu oorukumtunnaru kabatte pitru swaamika bhAvajAla vyapti jarugutumdi. samaja paramga imka marpu raakapovachchu. kanI chala kutumbalalo ladies domination ledamtara ? ala ani chala kutumbalalo strIlu pIdimchabadatleda ?

Edi emaina mashtaroo... mana tappunu manam oppukom. "aham" adduvastundi. anakuva ku, orpu ku gouravam lekapoga, aNige koddi imka anaga dokke paristhiti erpadinappudu ala anigipovatam lo elamti artham ledu.. pirikitanam tappa.

pakka vadu nannu tana swartham kosam vadukukuntunnaru ani telisi kooda adedo pedda help chestunnattuga feel ayite, manam em chestam ? vishayam telisaka bhoru mante maatram em chestam ?

chesipedutunte evaru maatram cheyinchukoru ? mire cheppandi ? daniki Ada, maga bhedalu levu. evari talent ni batti, evari art ni batti vallu vatini vadatam, pakka varini vadukovatam kosam upayogimchukovatam jarugutundi. annitikanna mukhyamaina point enti ante... pakkavadu manakante balavantudu kadu. manaloni bhayame vadiki balam istundi. ikkada lopam evaridi ?

Mahesh garu.. mI career ? cheppaledu?? :(

Budugu said...

sujata said...

Thanks for what you said here. But I have honest doubts - flirting - వల్ల పనులు జరుగుతాయా?! ప్రమోషన్లు వస్తాయా ?

==

Vastaayi. ee article choodandi
http://money.cnn.com/2005/08/05/news/economy/women_raises/index.htm

Flirting at the office is not only taboo, but it could even take a toll on your financial future.

Women who cross their legs provocatively, wear short skirts or massage a man's shoulders at work get fewer pay raises and promotions, according to Friday's USA Today.

ఏమంటారు sujatha గారు?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మహానగరాల్లో మగబాసుల్ని ఎలాగైనా మెప్పించి కెరీర్ పరంగా పైకి రావాలనే దుగ్ధ గల వర్గం ఒకటి బయలుదేరిన మాట వాస్తవమే, నేను స్వయంగా చూశాను. కానీ ఈ విషయమై అవలోడనలు (surveys) ఏమీ జరగలేదు కాబట్టి ఇది ఎంత స్థాయిలో ఉందో తెలిసేదాకా ఎదరుచూడాలి.

వెనకటి తరాలవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోను చెయ్యొద్దన్న పనే మనం చేస్తున్నామా ? తిరిగి చెడుతున్నారనుకోవాలా ? ఒకరిది ఏ దారైతే రెండోవారిదీ అదే దారవుతుంది కదా క్రమంగా !

Sankar said...

@independent గారు,
నేను కేవలం మీ కామెంటుని మాత్రమే తప్పుపట్టాను...మిమ్మల్ని కాదు.. గమనించగలరు... నేను మీరు రాసిన మిగతా కామెంట్లు చదవకపోవడం వల్ల అయ్యుండొచ్చు.. ఎందుకో ఆ వాక్యం చదవగానే నాకు అలా అనిపించింది అంతే... మరోలా అనుకోవద్దని మనవి..

నిషిగంధ said...

మహేష్, మళ్ళీ ఇంకో టాపిక్ ని చించారుగా :))

షివల్రీ బాబులు ఉన్నంతకాలం గోముపాపలు కూడా ఉంటారు.. మనమేం చేయలేం..

ఇక్కడ శంకర్ గారు అన్నదానితో 100% ఏకీభవిస్తున్నాను.. గోమయినా వామయినా పనిచేసేది ఒక స్టేజ్ వరకే.. ఆ తర్వాత బుర్రలో ఉండే అసలు గుజ్జు మీదే ఆధారపడి ఉంటుంది కెరిర్ లో మన ఎదుగుదల..

రాధిక said...

వ0ట మనిషిగా చేరినా,పని మనిషిగా చేరినా,ఉద్యోగ0కోస0,ఏ చిన్న అవసర0 పడినా ఎలా అయినా స్వశక్తి మీద అధారపడి నా బ్రతుకు నేను బ్రతుకుతాన0టే వదిలిపెట్టక చేతులు పట్టుకుని,తాకి,లేకపోతే రాత్రికొస్తేగానీ పనవ్వదని ఎదవ షరతులుపెట్టి పెద్ద పెద్ద పోస్టుల్లో మర్యాదగా బ్రతికేస్తున్న ఎదవల స0గతి వదిలేయ0డి సార్.చిన్న నవ్వుకే చొ0గ కార్చుకు0టూ పనులు చేసేసే బలహీనతను తప్పుపట్టక0డి సార్.నాది మ0చి మనసనుకు0టూ ఆడవాళ్ళకు మాత్రమే సాయాలు చేసేసి ,సాయ0 అడిగిన మగాళ్ళని చీకొట్టే మగాళ్ళను వదిలేయ0డి సార్.స్వశక్తి తో పైకొచ్చిన ఆడవాళ్ళను చూడలేక రూమర్లు పుట్టి0చి సునకాన0ద0 పొ0దే వాళ్ళని వదిలేయ0డి సార్.అ0ద0గా లేని లేడీకొలీగ్స్ ని కుక్కల క0టే హీన0గా చూస్తూ,అ0దమయిన వాళ్ళ చెప్పులు మోస్తూ తిరిగేవాళ్ళని వదిలేయ0డి సార్.ఒక్కశాత0 వున్న విషయాలే మనకి కావాలి.అవే మనకి హాట్ టాపిక్స్.అసలు మన దేశ0లో ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు ఎ0త మ0ది?అ0దులో అ0ద0గా వున్నవాళ్ళు ఎ0తమ0ది?అ0ద0గా వున్నవాళ్ళలో మ0చి పోస్టులకు ఎదిగినవాళ్ళు ఎ0తమ0ది?ఎదిగినవాళ్ళలో వ్యక్తిత్వ0 దిగజారిన వాళ్ళు ఎ0తమ0ది?ఆలోచి0చ0డి సార్.
అయినా చాలా విషయాల్లో అభ్యుదయ భావాలు వున్నవారిలా కనిపి0చే మీరు ఒక విషయ0 ఎ0దుకు ఆలోచి0చలేదు.మగ వాళ్లకి ఎన్నో బలహీనతలు వున్నప్పుడు...ఆడవాళ్ళలో ఒకరో ,ఇద్దరొ ఈ బలహీన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తే ఒప్పుకోరేమి?ఇన్విజలేటర్ గా ఆడవాలొస్తే భయ0..కాపీకొట్టనివ్వరని,ఇ0టర్వ్యూలో ఆడవాళ్ళు0టే తిట్టుకు0టాము....ఖశ్చిత0గా వు0టారని,కార్యాలయాల్లో ఉద్యోగులుగా ఆడవాళ్ళున్నర0టే భయ0...వేటికీ లొ0గరని,మేనేజర్లుగా ఆడాళ్ళు0టె భయ0..కాకా పట్టడానికి వు0డదని.
ఎవరో అన్నారు ప్రోజక్ట్ మేనేజలని పెళ్ళిచేసుకున్న వాళ్ళు ఎ0తో మ0ది అని.వాళ్ళు వీళ్ళని ప్రేమి0చారో,వీళ్ళు వాళ్ళని ప్రేమి0చారో ఎవరికి తెలుసు?ఏమో ఇలా ఎ0దుకు అనుకోరు?ప్రోజెక్టు మేనేజరే ఏదో క్షణ0లో బల0తపెట్టి,మరొకటో ఎర చూపి అలా చేసాడని.ఏనాణాని కైనా రె0డువైపులు0టాయ0డి.

Unknown said...

excellent write-up.

Unknown said...

This is a major problem with male vedhavas only. I can see hundreds of bucket fellows around me and how they can be handled with a smile and flirting. I have seen normal cool gals getting in this shit as they find all other normal ways as very complicated.

Niranjan Pulipati said...

మహేష్.. కత్తి టాపిక్.. నేను పని చేసిన ముందు కంపెనీ లో చాలా సార్లు చూసాను. కేవలం స్త్రి అవటం వల్ల వాళ్ళకు ఈజీ గా ప్రమోషన్లు వచాయి. ఒక్కరో ఇద్దరో కాదు. ఐదు ఏళ్ళలో కనీసం పాతిక మంది ని చూసి వుంటాను. ఈ అమ్మాయిలకు వున్న అంత టాలెంట్ లేక ఇంకా కాస్తా ఎక్కువ టాలెంట్ వున్న అబ్బాయిలు వెనుక పడిపోయారు. ఇక్కడ flirting లేక గోము కూడా కారణం కాదు. It is just they being women . సో మీరన్నట్టు ఈ విషయాలలో మగాడికి మగాడే శత్రువు.

Kathi Mahesh Kumar said...

@బాబాగారూ;జీవితంలోని ఘటనలూ,ఇతరులతో పంచుకునే ఆలోచనలే నా టపా విషయాలు.అవి విభిన్నంగా ఉండటంకన్నా,కొంతైనా ఆలోచింపజేసేవిగా ఉండాలని కోరుకుంటాను.నా బ్లాగు ఈ అవకాశాన్ని కల్పిస్తే,కూడలి ఒక వేదికని కల్పించింది. ఇక మీలాంటి వారి ప్రోత్సాహం నా ఎనర్జీని ఎప్పుడూ పెంచుతూ, ఆలోచనలకు పురికొల్పుతూనే ఉంటుంది. ధన్యవాదాలు.

@కొవ్వలి సత్యసాయి; నాకు పెళ్ళై ఐదేళ్ళకొడుకున్నాడండి. కాకపోతే మాఆవిడ గోముగాకాక అధికారపూర్వకంగా ఏదికావాలన్నా అడుగుతుంది.అదీ చాలా సహేతుకమైన(నేను కాదనలేని) కారణాల్ని చెప్పి మరీను. కాబట్టి ఈ విషయంలో నా అనుభవం లిమిటెడ్ అన్నమాట.

@బ్రహ్మి; "గోమింగ్ ఫాక్టర్" చాలామంచి పదాన్ని సృష్టించారు. నెనర్లు. ఇలాంటి విషయం అసభ్యత,లేకితనం లేకుండా రాయాలంటే కొంచెం కష్టమే.కానీ ప్రయత్నించాను.

@శ్రీ; మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
@శంకర్; నా ఎర్జీకి కారణం బూస్టు కాదు,మీలాంటి పాఠకుల టేస్టు. మీరు చెప్పినట్లు ఇది రెండువైపులా పదునున్న కత్తే. కాకపోతే ఇది నిజానికి ఒక చిన్నకోణం మాత్రమే,పూర్ణసత్యం కాదు.

@మోహన;త్వరలో నా కెరీర్ గురించి మీకు విశదంగా మెయిల్ చేస్తాను. ఇక మీరు కామెంట్ లో చెప్పినవి అంగీకారాత్మకాలే.

@బుడుగు; అన్ని ప్రమోషన్లూ ఈ పంధాలో రావు. ముఖ్యంగా నిర్ణయాధికారం ఉన్న పదవులు దక్కాలంటే అర్హత మాత్రమే కొలమానం అవుతుంది.ఏరంగంలోనైనా ఇలాంటి పదవులు 2% కన్నాతక్కువే ఉంటాయి. అంటే మిగతా అత్యంత ప్రాధాన్యతలేని inter changeable capabilities అవసరమైన 98% పదవులకి ఈ దారి వర్తించొచ్చుగా? అందరూ ఈ దావినే ఉపయోగిస్తారని నేను ఇప్పటికీ చెప్పడం లెదు. I am only extending a logic. That's all.

@తాలబా గారూ:ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి ప్రస్తుత మన భారతదేశంలో ఒక సర్వే ఖచ్చితంగా అవసరం.

@నిషిగంధ; మీతో నేనూ 100% అంగికరిస్తున్నాను. ఇదొక బ్యాలెన్సింగ్ ప్రాసెస్.

@రాదిక; మీ ఆవేశంలో చాలా నిజాలున్నాయి.ఈ విషయంపైన మీరొక కవిత రాస్తే మహదానందంగా చదవాలనుంది.

@డింగు; నిజమే ఇది మగాళ్ళ ప్రాబ్లమెంతో ఆడాళ్ళప్రాబ్లమూ అంతే. ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

@నిరంజన్; ధన్యవాదాలు. మొత్తానికి ఈ విషయాన్ని మీరు నిజజీవితంలో చాలా దగ్గరగా అనుభవించేసారన్నమాట.

సుజాత వేల్పూరి said...

మీరు చెప్పాల్సినవన్నీ చెప్పేసి, చివర్లో 'అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు కాబట్టి, ఇది అందరికీ వర్తించదు 'అనేసారు. మరి ఇక్కడ స్పందనలు చూస్తే చాలామంది 'అవును, ఆడాళ్లలో చాలమంది ఈ టైపే ' అని మర్యాదగా చెప్పినట్టు కనిపిస్తోంది. నేను రాధిక raise చేసిన పాయింట్లు రాద్దామని అనుకుంటూ వచ్చాను. రాధిక రాసేసారుగా! మరి దీనికి మీరు 'మీ ఆవేశంలో నిజాలున్నాయి ' అన్నారు కానీ వివరించలేదు.

నిజం మాట్లాడితే బయటికి వెళితే ఎక్కువమంది ఆడవాళ్ళకి ఎదురయ్యే బాధలు ఇవే! మీరు కేవలంక్ 'గోము ' ఆడాళ్ళ గురించి మాత్రమే కాక, ఇటువంటి మగవాళ్లగురించి కూడా రాస్తే బాగుంటుందేమో చూడండి ఒకసారి!

Kathi Mahesh Kumar said...

@సత్యవతి గారు; భూమిక సంపాదకురాలు సత్యవతిగారు నా ఈ టపాను ఉటంకిస్తూ తమ బ్లాగులో "స్త్రీపక్షపాతానికి అసలైన కోణం" (http://maagodavari.blogspot.com/2008/08/blog-post_04.html) అంటూ ఒక టపా రాసారు.అక్కడ సమాధానం ఇచ్చేసౌలభ్యం లేక ఇక్కడే వారు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం చెబుతున్నాను.

వారు లేవనెత్తిన మొదటి బిందువు, "అందరూ అలాగే ఉంటారని కాదు అంటూ ఆ కొందరి గురించి అందరికి తెలిసినవే ఎందుకు రాయడం? అని. నేను కొత్తగా తెలుసుకున్న కోణాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేసానేతప్ప అదే నిత్యసత్యమని చెప్పలేదు.కాకపోతే,గృహహింస,ఈవ్ టీజింగ్ మాత్రం అందరికీ తెలిసిన విషయాలు కావంటారా! వాటి గురించి మాత్రం పుంఖాలు పుంఖాలు రాయొచ్చు.ఇలాంటి వాటిగురించి రాస్తే మాత్రం అనవసరమైపోతాయా?

రెండో అభ్యంతరం "ఇంటా బయటా ఎంత దారుణ హింసని మెజారిటీ స్త్రీలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్నారో మీకు అర్ధం కాదా?" అని. అర్థం కాదని ఎవరు చెప్పారు. నా యిదివరకటి టపాలు దాదాపు ఈ విషయంపైన రాసినవే.కాకపోతే సమస్యని అన్నివైపులనుండీ చూడాలనుకోవడం తప్పా?

మరో ముఖ్యమైన బిందువు "అందాన్ని ఎరగా వేసి కొందరు స్త్రీలు బతికేస్తున్నారని రాసిన స్త్రీల శాతం ఎంత?
ఎంతమందుంటారు? వాళ్ళు ఎక్కడుంటారు?మీలాంటి వాళ్ళు రాయాల్సింది మెజారిటీ స్త్రీల భయానక జీవితాల గురించి కాదా?చెదురుమదురు సంఘటనలను పీకి పాకం పట్టి వడ్డించడం మీకు తగునా?" అని. అందాన్ని ఎరగ వేసి బతికే మహిళల శాతం 0.1% ఉన్నాకూడా ఆ విషయాన్ని ఆలోచించాలని మాత్రమే నేను చెబుతున్నాను.అంతమాత్రానా,గ్రామీణ మహిళల జీవితాల గురించీ,మహిళలపై జరిగే అన్యాయాలగురించీ నేను ఆలోచించనని కాదు కదా? ఇలా కొంత క్రిటికల్ గా ఆలోచించి వివిధకోణాల్ని బయటపెడితే మెజారిటీ స్త్రీలకు అన్యాయం చేస్తున్నట్లు భావించడం ఎంతమాత్రం న్యాయం? ఈ విషయాన్ని నిజంగానే "పీకిపాకం" పెట్టదలుచుకునుంటే నా పంధా చాలా వేరుగా ఉండేది.నేనూ పల్లె ఒడిలోంచీ వచ్చినవాడినే,కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటూ వాటికి ఎదురెళ్ళి పోరాడినవాడినే.అంతమాత్రానా alternative points of views ని accommodate చేసి నా దృక్పధాన్ని విశాలం చెయ్యక, భావజాలం పేరుతో ఒక బోనునుండీ మరో బోనుకు వెళ్ళమంటారా?

స్వతంత్రించి చెబుతున్నందుకు క్షమించాలి. కానీ,బహుశా ఇలా మాట్లాడి,వాదించీ మీరు చాలా మందిని ఉద్యమానికి దూరం చేస్తున్నారనిపిస్తోంది.ఒక విషయంలో వ్యతిరేకించినంత మాత్రానా లేక కొత్త కోణాన్ని విశదీకరించినంత మాత్రానా మూల సిద్దాంతాలను విస్మరించినట్టు కాదు. Please learn to disagree agreeably.అప్పుడే స్త్రీవాద ఉద్యమంలో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొంటారు.ఇలాంటి ధోరణి కొనసాగిస్తే, చాలా మంది మహిళలు తాము స్త్రీవాదులని చెప్పుకోవడానికే సంకోచిస్తారు.

Kathi Mahesh Kumar said...

@సుజార గారూ; ఈ వ్యాసంలో చాలావరకూ నేను చెప్పాల్సింది చెప్పలేదు. నా మిత్రుడు వెళ్ళగక్కిన ‘కార్పొరేట్ అర్బన్ మేల్’ బాధల్నీ, కోణాల్నిమాత్రమే తెలియజెప్పాను.ఇక మొదట్లో,చివర్లో చెప్పినవి మాత్రమే నా ఆలోచనలు.ఇక్కడివారు వాళ్ళకు తెలిసిన పరిధిలో ఇలాంటి అనుభవాల్ని చూశామంటున్నారేతప్ప ‘అందరు ఆడవాళ్ళూ ఇంతే’ అని చెప్పడం లేదు.

ఇక రాధిక గారు చెప్పిన విషయాలన్నీ నేను అంగీకరించేవే కాబట్టి విశదంగా చర్చించలేదు. ఇక మీరు నా వ్యాసాన్ని పరికిస్తే ఈ సమస్య ఆడవాళ్ళు తమ అందాన్ని ఉపయోగించడం గురించి ఎంతో, మగవెధవల ‘జొల్లు’తనాన్నిగురించి కూడా అంతే ఉంది.ఇది ఇరువైపుల్నించీ ఉండే సమస్యే!

maa godavari said...

Monday, August 4, 2008
ఎలాగూ నా బ్లాగ్ లో నేను రాసిన దాన్ని మీరు ఇక్కడ ప్రస్తావించారు కాబట్టి మళ్ళి పోస్ట్ చేస్తున్నాను.
మీరు గ్రుహహింసని,ఈవ్ టీజింగ్(దాన్ని ఈవ్ టీజింగ్ అని పిలవడం నేను ఒప్పుకోను.పబ్లిక్ ప్రదేశాల్లో వేధింపులుగానే పిలవాలి) ని అందాలను,గోముల్ని,కన్నీళ్ళని ఉపయోగించి పనులు పూర్తిచేసుకునే బలహీన మనస్క ఆడవాళ్ళని ఒకే గాటన కట్టడం చాలా విడ్డూరంగా ఉంది.
0.1 శాతం ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని నేను అంతున్నాను అని కదా మీరు అన్నారు.
99శాతం స్త్రీలను కాల్చుకుతినే పరిస్తితులే సమాజమంతా ఉన్నపుడు ఈ విషయాన్ని అంత ప్రముఖంగా పట్టించుకోవాలా అన్నదే నా ప్రశ్న.
ఇంక చివరిగా నేను ఇలా వాదించడం వల్ల చాలా మంది ఉద్యమానికి దూరమౌతున్నారని,ఇలాంటి ధోరణి కొనసాగిస్తే స్త్రీవాదులమని చెప్పుకోవడానికి సంకోచిస్తారని బెదిరిస్తున్నారు.అంటే మీరు ఏమి రాసినా అది ఎంత స్త్రీ వ్యతిరేకంగా ఉన్నా మేము వాదించకూడదన్న మాట.ఆహా ఏమి న్యాయమండీ.
అయినా మీరు ఏదో కొత్త కోణాన్ని ఇప్పుడే కనిపెట్టినట్టు మీ మిత్రుడు మీ పరిధిని సరి కొత్తగా విశాలం చేసినట్టు మీరు అనుకుంటున్నారు కానీ 99 శాతం హింసాయుత పరిస్థితులున్నట్టుగానే 0.1 శాతం మీరు పేర్కొన్న లాంటి స్త్రీలు ఎప్పుడూ ఉన్నారు.ఇందులో మీరు కొత్తగా కనిపెట్టిందేమిటో నాకు అర్ధం కావడం లేదు కత్తి మహేష్ కుమార గారూ!



స్త్రీ పక్షపాతానికి అసలైన కోణం
ఆడవాళ్ళు అందాన్ని ఎరగా వేసి అందలాలెక్కేస్తున్నారంటూ
పర్ణశాల బ్లాగ్ లో చదివాక అక్కడ స్పందిచే కన్నా నా బ్లాగ్ లో నా భావాలు రాయాలనిపించింది.
అందాన్ని చూపించి,గోముగా అడిగేసి కొంత మంది ఆడవాళ్ళు తమ పనులు పూర్తి చేసేసుకుంటారని కత్తి మహేష్ కుమార్ గారు రాయడం నాకు చాల ఆశ్చర్యాన్ని కలిగించింది.అందరూ అలాగే ఉంటారని కాదు అంటూ ఆ కొందరి గురించి అందరికి తెలిసినవే ఎందుకు రాయడం?స్త్రీలు 498ఏ ను,గ్రుహహింస నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారంటూ గుండెలు బాదుకోవడం లాంటిదే ఇది కూడా. ఇల్లాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారు?మెజారిటీ స్త్రీల పరిస్థితి ఎలా ఉంది?
సగటు గ్రామీణ స్త్రీ పరిస్తితి ఏంటో వీరికి తెలియదనుకోవడానికి లేదు.
ఇంటా బయటా ఎంత దారుణ హింసని మెజారిటీ స్త్రీలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్నారో మీకు అర్ధం కాదా?
మొన్ననే నేను మా ఊరెళ్ళి వచ్చాను.
ఒక గ్రామీణ స్త్రీ ఉదయం లేచిన దగ్గరనుండి చేసే పనుల్ని ఎప్పుడైనా లెక్కించారా ఎవరైనా?
ఉదయం లేచి ఇల్లూ వాకిలీ ఊడ్చి,కళ్ళాపు చల్లీ,అంట్ల గిన్నెలు కడిగి,పొయ్యి రాజేసి,కాఫీలు,టిఫిన్లూ అన్నం,కూరలూ వండి వార్చి,(అందరికి గ్యాస్ పొయ్యిలున్నాయని భ్రమపడకండి)భొజనాలు వడ్డించి,మళ్ళి తిన్న పళ్ళలు వండిన గిన్నెలు కడిగి,బట్టలుతికి ఆరేసి,(ఒక్కో సారి చెరువుకెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి.)పశువులుంటే వాటి పని,పిడకలు చెయ్యడం.ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రమౌతుంది.మళ్ళి వంట,పిల్లలికి మొగుడికి ముసలి వాళ్ళకి వడ్డించడం,అన్నింటికి మించి ఏపూటకాపూట పొయ్యి మీదికి పొయ్యి కిందకి వెతుక్కోవాల్సిన పని ఉండనే ఉంటుంది.
మగవాళ్ళు పొలానికెళతారు.పనిచేసినా చెయ్యక పోయినా,సంపాదించినా సంపాదించక పోయినా వాళ్ళకి తిండి పెట్టాల్సిన బాధ్యత మాత్రం ఆడవాళ్ళదే.మంచి మొగుడైతే బుద్ధిగా ఇంటికొస్తాడు.కానీ చాలా కుటుంబాల్లో మగవాళ్ళు పూటుగా తాగే వస్తారు.ఉదయం నుండీ వొళ్ళు హూనం చేసుకున్న ఆమెకు సందెకాడ నుండి,అర్ధరాత్రిదాకా దొరికేవి తిట్లూ,తన్నులూ,తాగి పొర్లే మొగుడి లైంగిక అత్యాచారాలే.
సగటు గ్రామీణ స్త్రీ బతుకు ఇంతే.ఇంతకంటే గొప్పగా ఉండదు.
మన జనాభా 80% గ్రామాల్లోనే కదా ఉంది.అంటే 80% స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లోనే కదా ఉన్నారు.
కత్తి మహేష్ కుమార్ గారూ! అందాన్ని ఎరగా వేసి కొందరు స్త్రీలు బతికేస్తున్నారని రాసిన స్త్రీల శాతం ఎంత?
ఎంతమందుంటారు? వాళ్ళు ఎక్కడుంటారు?మీలాంటి వాళ్ళు రాయాల్సింది మెజారిటీ స్త్రీల భయానక జీవితాల గురించి కాదా?చెదురుమదురు సంఘటనలను పీకి పాకం పట్టి వడ్డించడం మీకు తగునా?

Kathi Mahesh Kumar said...

@సత్యవతిగారు; ఇందులో నేను కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు.ఇదంతా నాకు తెలుసనీ నేను ఎక్కడా చెప్పలేదు.నామిత్రుడు వెళ్ళగక్కిన బాధని నా శైలిలో అక్షరబద్ధం చేసి,దానికి నా ఆలోచనని జోడించానేతప్ప నేనేదో కొలంబస్ అమెరికా కనిపెట్టిన ఫీలింగ్ ఈ వ్యాసంలో అస్సలివ్వలేదు. మరీ సందేహంగా ఉంటే, ఇంకోసారి చదివి చూడండి. మొదటి నాలుగు,ఆఖరి ఒక పేరా మాత్రమే నేను చెప్పినవి. మిగతా విషయం నా మిత్రుడి స్పందన మాత్రమే.

నేను రాసింది స్త్రీవ్యతిరేకం అని మీరనుకుంటున్నారు. ఇది అర్బన్ మేల్ సమస్య అని నేను చెబుతున్నాను.ఇక మిమ్మల్ని వాదించవద్దనటాన్నికూడా విరీతార్థమే తీసారు.కూలంకషంగా వ్యాసాన్నికూడా చదవకుండా,కేవలం అపోహల ఆధారంగా మీరు చేసిన వాదన సహేతుకం కాదు కనకనే ఇలాంటి పెడర్థాలవాదనల వలన స్త్రీవాదం యొక్క credibility తగ్గుతోందని చెబుతున్నానంతే.

ఇక మీరు చెప్పిన ఈవ్ టీజింగ్ (వీధి హింస) గురించి నేనే నా బ్లాగులో విస్తృతమైన వ్యాసం జూలై మాసంలో రాసాను చదవగలరు (http://parnashaala.blogspot.com/2008/07/blog-post_1778.html).

నాకు స్త్రీసమస్యల మీద సాధికారత లేదనో లేక empathy లేదనో మీరు ఊహించేసుకుని,సాధారణంగా "మగవాళ్ళ"మీద దాడికి ఉపయోగించే పదజాలాన్ని నామీద అలవాటుగా రువ్వుతున్నారు. అందుకే నా అభ్యంతరం.ఇలా మీరు అయినదానికీ కానిదానికీ ఒకే మూసలో సమాధానం ఇస్తూపోతే మీచుట్టూ మిగిలేది భావజాలమే, నిజం కాదు.

మీరు వ్యక్తిగా,సంస్థగా చేసే చాలా మంచి పనులగురించి నాకు తెలుసు. వాటిని అభిమానిస్తాను కూడా. కానీ, ఒక్కోసారి భావజాలం మత్తులో నిజాల్ని గుర్తించక అతివాద ధోరణి అవలంభిస్తేనే ఖండించక తప్పడం లేదు. వ్యాసాన్ని ఇంకోసారి తీరిగ్గా,సమయం చేసుకుని చదివి ఆ తరువాత కామెంటండి.

Anil Dasari said...

సత్యవతి గారు,

ఎనభై శాతం జనాభా గ్రామాల్లోనే ఉండి వాళ్లలో ఎక్కువమంది మగాళ్లు మీరన్నట్లు తాగి తందనాలాడే వెధవలైతే మరి దేశంలో పనులన్నీ ఆడాళ్ల చేతులమీదుగా నడుస్తున్నాయా? ఒక శాతమో అంతకన్నా తక్కువో జరిగే సంఘటనలని మహేష్ పీకి పాకాన పెట్టాడని గొడవ చేస్తున్న మీ వంటి వాళ్లు ఫెమినిజం పేరుతో చేసేది కూడా అదే కదా మరి. శాతాల సంఖ్యలో కాస్త తేడా - అంతే. మొగుడు తనని హీనంగా చూస్తున్నాడని వాపోయే ఆడాళ్లలో ఎందరు ఇంట్లో పాచి పనులు చేసే ఆడ మనుషులని గౌరవంగా చూస్తున్నారు? కోడళ్లని ఎంతో కొంత వేధించని అత్తలెందరు? విధవరాళ్లని చులకనగా చూసే వాళ్లలో ఆడాళ్లెందరు, మగాళ్లెందరు? చెబుతూ పోతే ఇలాంటివి బోలెడు. ముందు అట్నుండి నరుక్కు రండి - ముందు ఆడాళ్లని మార్చండి.

ప్రియ said...

"స్వతంత్రించి చెబుతున్నందుకు క్షమించాలి. కానీ,బహుశా ఇలా మాట్లాడి,వాదించీ మీరు చాలా మందిని ఉద్యమానికి దూరం చేస్తున్నారనిపిస్తోంది.ఒక విషయంలో వ్యతిరేకించినంత మాత్రానా లేక కొత్త కోణాన్ని విశదీకరించినంత మాత్రానా మూల సిద్దాంతాలను విస్మరించినట్టు కాదు. Please learn to disagree agreeably.అప్పుడే స్త్రీవాద ఉద్యమంలో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొంటారు.ఇలాంటి ధోరణి కొనసాగిస్తే, చాలా మంది మహిళలు తాము స్త్రీవాదులని చెప్పుకోవడానికే సంకోచిస్తారు."

మీ టపా కన్నా మీరు ఇక్కడ రాసిన విషయమే గొప్పగా ఉంది. అందుకే స్త్రీవాదులు అంటే చులకనగా చూస్తున్నారు.

ఒక మాట చెప్పనా?

"స్త్రీ వాదులంటే స్త్రీలగురించి వాదులాడే వారు కాదు. స్త్రీలంటే గౌరవం పెంచేవారు."

మీ టపాల్లోనే గీతాచార్య గారన్నట్లు, రేషనల్ వ్యూస్ ఎప్పుడూ అవసరం. లేక పొతే చర్చ ప్రక్కద్రోవ పడుతుంది.

సుజాత గారికి: కొన్నిటపాల్లో మీ వ్యాఖ్యలు చూశాను. మీరు ఎకకోణం లో ఆలోచిస్తున్నారు. గమనించండి. అన్యదా భావించొద్దు.

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర & ప్రియ;చాలా బాగా చెప్పారు. పురుషద్వేషమే ఏకైక అజెండాగా మారిన స్త్రీవాదం, తన అస్తిత్వాన్ని కోల్పోతోందనే నా బాధంతా.సత్యవతి గారి లాంటివారు ఈ పంధాను సరైన సైద్ధాతిక ప్రాతిపదిక సృష్టించక తమ అతివాదనలతో మరింత నష్టాన్ని కలిగిస్తున్నట్లనిపిస్తోదే తప్ప,అందరికీ కనువిప్పు కల్పించి సమస్యల్ని నిర్మూలించే దిశగా తమ ఆదర్శాలను మలుచుకుంటున్నట్లు కనిపించడం లేదు.

పురుషుల్ని తెగడడానికి వారు వెచ్చించే సమయం వారికి తెలియజెప్పడానికి వెచ్చిస్తే, మారడానికి చాలా మంది మగాళ్ళు సిద్దంగా ఉన్నారన్నది నా నమ్మకం. స్వీయ అనుభవం కూడా.జెండర్ అంటే మహిళలేకాదు, మగాళ్ళుకూడా అందుకే, they are as much part of solution as much as the problem.ఈ సమస్యని యుద్ధంగా భావించి ఎదురెదురుగా పోరాడితే,ఫలితం క్షతగాత్రులేతప్ప మార్పులు కాదు. ఇది గుర్తెరిగి స్త్రీవాదాన్ని సమయానుకూలంగా అన్వయించుకోవాలి. లేదంటే,It will die its own death and none will be there to mourn it.

తెలుగోడు said...

kattilA vrASAru katti mahEsh gAru

Anonymous said...

మీరు చెప్పినది నిజంగా ఎంత శాతంలో జరుగుతూ ఉన్నా
1) మగవాళ్ళు తమ సబార్డినేట్సుతో ఈ విదంగా ఉండాలని వాళ్ళకు వాళ్ళుగా స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది ఆడవారికి ఇష్టమా, కాదా అని ఆలోచించేవాళ్ళు ఎందరుంటారు. స్కూల్లో టీచర్స్ దగ్గర నుండి ఏదో కాకతాళీయంగా ప్రయాణాల్లో కలిసే తోటి ప్రయాణీకుల వరకూ వద్దన్నా సహాయం చెసేయటానికి తయారైపోయెవాళ్ళే.

2)నా స్కూల్ డేస్ నుండి ఈ రోజు వరకూ ఇలాంటి అనవసర విషయాల్లొ స్త్రీ పక్షపాతం చూపించేవారినీ, అవసరమున్నా స్త్రీల ప్రతిభను గుర్తించకుండా ఇలాంటి కుంటి సాకులను అడ్డుపెట్టుకునేవాళ్ళనీ చాలా మందిని చూసాను.


3) చివరగా నాకు అత్యంత సంతోషం కలిగించే విషయం ఏంటంటే, ఏ రంగంలోనూ "గోముగా" మాట్లాడే మగవారిని తయారు చేయని ఘనత ఆ రంగాల్లో ఉన్నతాధికారులుగా ఉన్న స్త్రీల యొక్క నిజాయితీనీ, నిబద్ధతనీ చెప్పకనే చెప్పుతున్నాయి.

Kathi Mahesh Kumar said...

@గంగా భవాని: స్త్రీలకు వ్యతిరేకమైన వివక్ష పనిప్రదేశాలలో ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. కాకుంటే, ఈ కోణానికి వ్యతిరేకంగా ఎంతోకొంత మగవాడిపట్ల కూడా వివక్ష ఉందనేది గుర్తించాల్సిన విషయం. ఇప్పుడు కనీసం గుర్తించకపోతే సమస్య పెద్దదైననాడు అర్థం చేసుకోవడానికీ, సమస్యని తీర్చడానికీ పట్టే సమయం మరింత పెరగొచ్చు.

ఇక మీ స్వీయానుభవంతో మీరు చూసింది తెలుసుకున్నది ఎంత విలువైనదో, నా మిత్రుడు అనుభవించింది కూడా అంతే విలువైనదని నేను నమ్ముతాను. మీరు చెబితే నిజం, నా మిత్రుడు చెప్పింది అపోహా కాదుకదా!

మగవారు గోముగా మాట్లాడకపోవడానికి కారణం ఉన్నతస్థానంలో ఉన్న స్త్రీల ఘనత కాకపోవచ్చు. సామాజికంగా మగవాళ్ళు అలా "కండిషన్" చెయ్యబడలేదు.అంతే.ఒకవేళ అలాంటి ప్రయత్నాలు మగాళ్ళుచేసినా..."తేడా" అనుకునే అవకాశాలే ఎక్కువ.

Anonymous said...

మీరు భవిష్యత్తులో పెద్దదవుతుంది అనుకునే సమస్య గురించి మాత్రమే ఆలోచించమంటున్నరా? ఇప్పటికే పెద్దదైన సమస్య గురించి ఆలోచించరా?

మీ మిత్రుడి స్వీయానుభవం నేను చెప్పిన విషయంతో పోలిస్తే ఎంత శాతం ఉంటుంది అనేది గ్రహించగలరు.

"గోముగా" మాట్లాడటం అంటే ఫిజికల్ ఏస్పెక్ట్నే తీసుకోవక్కరలేదు. ఏదో ఒక విధంగా ఉన్నతాధికారులైన స్త్రీలను ప్లీజ్ చెయ్యటం అని. వాటికి తావివ్వకపొవటం అనేది ఆయా సంస్థల్లో స్త్రీల గొప్పతనమే అవుతుంది.

ముఖ్యంగా నేను చెప్పదలచుకున్నది ఏంటంటే మీ మిత్రుడు చెప్పిన స్వీయానుభావాల గురించి మీరు స్పందించారు. బాగానే ఉంది. అందుకు కారకులైన వారిని ఎందుకు విడిచిపెట్టినట్టు. అంతా ఆడవాళ్ళదే తప్పంటే ఎలా?

Kathi Mahesh Kumar said...

@గంగా భవాని:ఇప్పటికే పెద్దదైన ప్రశ్న(ల) గురించి నేను ఆలోచించనని మీరు అనుకోవడానికి కారణం, బహుశా నా ఇదివరకటి టపాలు మీరు చదవకపోవడం అనుకుంటాను. ఒక సారి చదివి చూడండి.

ఇలా ఎంతశాతం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పడానికి గల గణాంకాలు ప్రస్తుతానికి లేవు.ఇలాంటివాటిని కొలవడానికి కావలసిన రీసెర్చ్ టూల్స్ కూడా భారతీయ పరిస్థితికి అనుగుణంగా ఇప్పట్లో ఉన్నట్లుకూడా సందేహమే.

ఇది ఒక ధృక్కోణం మాత్రమే. నా మిత్రుడు చెప్పినదానికి నా స్పందన అంతే. అది చాలా సమతూకంగా ఉండే అవకాశం లేదు.He was only showing me a different point of view.

ఇక అంతా ఆడవాళ్ళదే తప్పు అని నేనెక్కడా చెప్పలేదే!.Its man's weakness and women are only using it. అలాంటప్పుడు ఆడవాళ్ళదెంత తప్పో,మగాళ్ళదీ అంతే. బలహీనత ఉన్నవాడితోపాటూ ఆ బలహీనతను ఉపయోగించుకోవడమూ తప్పే.

Anonymous said...

నేను ఇప్పటికే పెరిగిపోయిన సమస్య అన్నది - ఎక్కడో జరిగే రెండు మూడు సంఘటనలను చూసి, ఆడవారి తెలివితేటల్నీ, వ్యక్తిత్వాన్నీ కించపరచటం. ఈ వ్యాసం ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ ఉంది అని చెప్పట్లేదు. మీరు మళ్ళీ అపార్ధం చెసుకోవద్దు. ఎన్నో ఏళ్ళుగా ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయాల్లో ఇది ప్రధానమైనది. నాకు తెలిసిన పదో క్లాస్ కుర్రాడి ప్రిన్సిపాలు స్త్రీ పక్షపాతి. అమ్మాయిలను సమర్ధించటం, తిట్టకపొవటం, అబ్బాయిలనే తిట్టటం అన్నీ చెసేవాడు. ఆ అబ్బాయి క్లాస్లో ఒకమ్మాయి బాగా చదివేది. ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ప్రిన్సిపాలు (ఆయన కూడా రెండు సబ్జెక్తులు టీచ్ చెసేవాడు) మార్కులు వేస్తున్నాడని అపోహ. పబ్లిక్ పరీక్షల్లో ఆ అమ్మాయికే ఎక్కువ మార్కులు వచ్చాయి.
కేవలం ప్రిన్సిపాలు వెనకేసుకొచ్చినందుకు ఆ అమ్మాయి తెలివితేటలని లోకువ కట్టారన్నమాట. ఇది చాలా చాలా చిన్న సంఘటన. ఇలాంటివెన్నో.

ముంజేతి కంకణానికి అద్దం కావలెనా అన్నట్టు, మీకు ఎంతో తేటతెల్లంగా కనిపించే సమస్యకు సర్వేలు అవసరం లేదు.

మద్యపానాన్ని నిర్మూలించాలంటే మద్యాన్ని నిషేదించాలా? లేదా మద్యానికి బానిసలైన వారిని నియంత్రించాలా? ఏది చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది?

Anonymous said...

నేను ఇప్పటికే పెరిగిపోయిన సమస్య అన్నది - ఎక్కడో జరిగే రెండు మూడు సంఘటనలను చూసి, ఆడవారి తెలివితేటల్నీ, వ్యక్తిత్వాన్నీ కించపరచటం. ఈ వ్యాసం ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ ఉంది అని చెప్పట్లేదు. మీరు మళ్ళీ అపార్ధం చెసుకోవద్దు. ఎన్నో ఏళ్ళుగా ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయాల్లో ఇది ప్రధానమైనది. నాకు తెలిసిన పదో క్లాస్ కుర్రాడి ప్రిన్సిపాలు స్త్రీ పక్షపాతి. అమ్మాయిలను సమర్ధించటం, తిట్టకపొవటం, అబ్బాయిలనే తిట్టటం అన్నీ చెసేవాడు. ఆ అబ్బాయి క్లాస్లో ఒకమ్మాయి బాగా చదివేది. ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ప్రిన్సిపాలు (ఆయన కూడా రెండు సబ్జెక్తులు టీచ్ చెసేవాడు) మార్కులు వేస్తున్నాడని అపోహ. పబ్లిక్ పరీక్షల్లో ఆ అమ్మాయికే ఎక్కువ మార్కులు వచ్చాయి.
కేవలం ప్రిన్సిపాలు వెనకేసుకొచ్చినందుకు ఆ అమ్మాయి తెలివితేటలని లోకువ కట్టారన్నమాట. ఇది చాలా చాలా చిన్న సంఘటన. ఇలాంటివెన్నో.

ముంజేతి కంకణానికి అద్దం కావలెనా అన్నట్టు, మీకు ఎంతో తేటతెల్లంగా కనిపించే సమస్యకు సర్వేలు అవసరం లేదు.

మద్యపానాన్ని నిర్మూలించాలంటే మద్యాన్ని నిషేదించాలా? లేదా మద్యానికి బానిసలైన వారిని నియంత్రించాలా? ఏది చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది?