Saturday, October 15, 2011

మాయావతి జిందాబాద్ !


బృహత్తర నిర్మాణాలే వారసత్వాలుగా గుర్తించే భారతదేశంలో, ప్రభుత్వం డబ్బుతో పార్కుల నిర్మాణం. దళితబాంధవుల విగ్రహాల నిర్మాణం చేసినందుకు మాయావతిని ఖండించాలట. ఎందుకు ఖండించాలో నాకు అర్థం కావడం లేదు. విగ్రహాల నిర్మాణం చెయ్యని పార్టీ ఏది? నాయకుల్ని చిరస్మరణీయులు చెయ్యడానికి ఎయిర్పోర్టులకి, రోడ్లకీ, పార్కులకీ, భవనాలకూ పేర్లుపెట్టని రాష్ట్రం ఏది? అవన్నీ పబ్లిక్ డబ్బులతో జరగలేదా?! ట్యాంక్ బండ్ మీద విగ్రహాలెందుకు? హుస్సేన్ సాగర్ లో బుద్దుడెందుకు? అది మాత్రం ట్యాక్స్ పేయర్ డబ్బుకాదా?!

మాయావతి చాలా మందికి నచ్చదు. తను బాహాటంగా చేసే వెల్త్ డిస్ప్లే అస్సలు నచ్చదు. నిజమే... బాత్రూముల్లో మాత్రమే బంగారు కమోడ్లు పెట్టుకునే నాగరికులుండే లోకంలో బాహాటంగా వెయ్యిరూపాయిల దండేసుకోవడం అసహ్యంగానే ఉంటుంది. చచ్చినోడి రాజకీయ ఉత్తరాధికారిగా నిరూపించుకోవడానికి వాడవాడలా విగ్రహాలు పెట్టిస్తే అది రాజకీయం. కానీ తన విగ్రహాన్ని తనే ఉద్ఘాటిస్తే మాత్రం అసహ్యం. ఇది ఏరూల్ బుక్ ప్రకారమో కాస్త చెబుతారా? ఆ రూల్ బుక్ తగులబెట్టడానికే పుట్టిన ‘మాయ’ ఇది. అగ్రకుల రాజకీయాల్ని, హిందూమతాహంకారాన్ని కాలరాయడానికి పుట్టిన ‘అతి’ ఇది.      

****