Thursday, December 2, 2010

తెలుగు సినిమా తమిళ పైత్యం

ప్రతిభ ఎక్కడున్నా దాన్ని అభినందిచాల్సిందే, స్వాగతించాల్సిందే, ప్రోత్సహించాల్సిందే. కాకపోతే పక్కోడి ప్రతిభ గుర్తించడంలోని శ్రద్ధ మనదగ్గరున్న ప్రతిభని సానబెట్టడంలో చూపించకపతే పొగడ్డానిక తప్ప మనమంటూ ఎదగడానికి ఏమీ మిగలదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిస్థితీ అలాగానే ఉంది. చెప్పుకోవడానికి  సినీపరిశ్రమ మద్రాసునుంచీ హైదరాబాద్ కొచ్చి పాతికేళ్ళు అవుతున్నా, హీరోలను వదిలేస్తే (హీరోయిన్లు ఎలాగూ బొంబాయి నుంచి దిగుమతి అవుతారు) మిగతా విభాగాల్లోని సాంకేతిక నిపుణుల్ని అక్కడ్నించే దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా దర్శకత్వం, సంగీతం, సహనటుల విభాగాల్లో తమిళ్ హవానే నడుస్తోంది.

దర్శకత్వ శాఖలో కోకొల్లలుగా తెలుగు జనాలున్నారు. ప్రతి సినిమాకూ ఆరు మందికి తగ్గకుండా సహాయదర్శకులుగా పనిచేస్తుంటారు. అయినా అవకాశాలు, ముఖ్యంగా పెద్ద అవకాశాల దగ్గరికొచ్చేసరికీ తమిళంవాళ్ళే కావలసొస్తుంది. తమిళులకు దర్శకత్వ అవకాశం ఇవ్వడం వరకూ బాగానే ఉంది, కానీ వాళ్ళ కంఫర్ట్ కోసం ముఖ్యపాత్రల్నో లేదా సహాయపాత్రల్నో తమిళ నటులతో, సాంకేతిక వర్గాన్నంతా తమిళ సాంకేతిక నిపుణులతో నింపడం ఎందుకో ఒక అర్థంకాని పరిణామంగానే మిగిలిపోతోంది. ‘డార్లింగ్‌’లో ప్రభాస్‌ ఫాదర్‌గా ప్రభు చేసిన క్యారెక్టర్‌ మన తెలుగులో ఎవరూ చేయలేరా? అలాగే, ఈనెల 26న విడుదల కానున్న ‘ఆరెంజ్‌’లోనూ ప్రభు ఓ ముఖ్యపాత్ర పోషించాడు. కారణం ఆ నటుడి అవసరమా లేక దర్శకుడి విజన్ లో ప్రభు తప్ప మరే ఇతర తెలుగు నటుడూ కనిపించకపోవడమా?

ఎమ్.ఎస్.విశ్వనాధన్ నుంచీ ఇళయరాజా వరకూ అటు తమిళం ఇటు తెలుగులో మహత్తరమైన సంగీతం ఇచ్చినా, భాషకు అనుగుణంగానే బాణీలు కూర్చారు. ఆ తరువాత తరంలో తమిళ బాణీల్ని డబ్బింగ్ రూపంలో తప్ప స్ట్రైట్ ఫిల్మ్ గా సంగీతం కూర్చి, తెలుగు సంగీతాన్ని ఇవ్వడంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కూడా ఎదురుదెబ్బే తిన్నారు. అయినా మనోళ్ళు ఈ మధ్య హ్యారిస్ జైరాజ్(ఆరంజ్), జి.వి.ప్రకాష్ (డార్లింగ్) అంటూ మళ్ళీమళ్ళీ బొక్కబోర్లా పడటానికి తయారైపోతున్నారు. ఇది మోజుకాక మరేమిటి? నిజంగా హైదరబాద్ లో మ్యూజిక్ డైరెక్టర్లు లేరా? చక్రిలాంటి వాళ్ళు వచ్చిన పదేళ్ళలో దాదాపు వంద సినిమాలకు సంగీతం అందించలేదూ!  మన దగ్గర ప్రతిభకు కొదవలేదు, కానీ గుర్తించేవాళ్ళే కరువు.

మనోళ్ళ తమిళ పైత్యానికి పరాకాష్ట ఏమిటంటే,  తమిళ్ సినిమాలపైన ఈ మధ్య సెటైర్ గా వచ్చిన, “తమిళ్ పడం” అనే సినిమాని మనోళ్ళు రీమేక్ రైట్స్ తీసుకోవడం. తమిళ సినిమాల మీద తీసిన వ్యంగ్యాస్త్రాన్ని తెలుగులో హక్కులు తీసుకోవడం ఒక హాస్యాస్పదమైన ప్రక్రియ అయితే,  దాన్ని రీమేక్ ఎలా, ఎందుకు చేస్తారనేది పెద్ద జోకు. ఏం… తెలుగు సినిమాల మీద సెటైర్ మనం సొంతంగా రాసుకోలేమా? దాన్నీ తమిళం నుంచీ దించుకోవాలా?   హతవిధీ!

***