Friday, November 13, 2009

వరద వార్త




పేపరు తడిగా ఉందెందుకో!
పేపరోడు నీళ్ళలో పారేసిపోయాడా?
లేదే!
వరదొచ్చి వందగ్రామాలు మునిగిపోయాయట
బహుశా ఆవార్తను మోసుకొచ్చిందేమో.

(గుల్జార్ కవితలోని కొన్ని పంక్తుల స్పూర్తితో) 

****

Thursday, November 5, 2009

ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర


మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేదు. నిజానికి ఎందరో దళితేతరుల కృషి లేకపోతే దళిత ఉద్యమమే లేదు. కాబట్టి ఇక్కడా అది చెల్లదు. 

కానీ...తెలుగు భాషలో నిర్బంధ విద్య కావాలి అని కోరుకునేవాళ్ళు తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పించకపోయినా, కనీసం చేర్పించిన స్కూళ్ళలో తెలుగు కోసం శ్రమించినవాళ్ళో,వాదించినవాళ్ళో లేక పేరెంట్స్ కమిటీలో ప్రస్తావించినవాళ్ళో ఉండాలనుకోవడంలో తప్పులేదని నా ఉద్దేశం. ఎందుకంటే, తమ పరిధిలోనే తెలుగు కోసం పోరాడని ఈ సాహసవంతులు ఉద్యమాలు చేసి ప్రభుత్వాల్ని మారుస్తామంటే నమ్మడానికి చెవిలోపూలు పెట్టుకున్నవాళ్ళు బ్లాగుల్లో కొందరున్నా, అందరూ అలా ఉండరని చెప్పడానికి ఆమాత్రం ప్రశ్నించక తప్పదు.

ప్రాధమిక విద్యలో తెలుగు తగ్గిపోతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఎక్కడా లేవు. సంఖ్యాపరంగా ఈ వాదం ఎక్కడా నిలబడదు. 2005-06 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 50,895 ప్రాధమిక పాఠశాలలున్నాయి.విధ్యార్థుల సంఖ్య 30,84,212. ప్రైవేటు పాఠశాలల్లో కేవలం 3,570. విద్యార్థలు 6,03,160. ప్రభుత్వపాఠశాలల్లో తెలుగులోనే బోధిస్తారనేది అందరికీ తెలిసిందే. ప్రాధమికోన్నత విద్యలో కూడా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏదో కుట్రచేసి తెలుగును చంపేస్తుందనటం తెలియనితనం. ప్రభుత్వం తన ముస్లిం appeasement కోసం తెలుగుని పట్టించుకోవటం లేదనడం మూర్ఖత్వం. ఉర్దూ చదివిన ముస్లింలు పాకీస్తానీలు అయిపోయి శతృవర్గంగా తయారవుతారనడం ఉన్మాదం.

తెలుగు భాష కోసం మొత్తుకుంటున్న మేధావుల పిల్లలెవరూ తెలుగు మీడియం చదువులు చదవటం లేదు. వీళ్ళు ప్రభుత్వం మీదపడి స్టేజిల్లోనూ,బ్లాగుల్లోనూ ఏడవటంతప్ప క్రియాశీలకంగా తెలుగును ఒక ప్రజాఉద్యమంగా ఎన్నడూ చెయ్యాలనుకోలేదు.ఎందుకంటే,ఒక్కసారి ప్రజల్లో పడితే వీళ్ళబ్రతుకులు కుక్కలుచింపిన విస్తరే. "మీకు మాత్రం ఇంగ్లీషు చదువులూ మాకు మాత్రం తెలుగు బ్రతుకులా" అని ప్రజలు అడిగితే వీళ్ళు మొఖం ఎక్కడబెట్టుకుంటారో వీళ్ళకే తెలీదు.

ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం,ప్రజాఉద్యమాలకున్న ప్రాధాన్యత మీకు తెలియంది కాదు. సరిగ్గా ఈ పరిస్థితినే రాష్ట్రప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి వాడుకుంటోంది. పాఠశాల విద్యను 6-12 వరకూ చేసి ఇంగ్లీషు-హిందీ చేస్తే కేంద్రప్రభుత్వం తేరగా నిధులిస్తుంది.రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులు విద్యాశాఖలు కేటాయించాల్సిన పనిలేదు. ప్రాధమిక విద్య ఎలాగూ SSA (సర్వశిక్షా అభియాన్) పుణ్యమా అని కేంద్రం నిధులతో గడిచిపోతోంది. పాఠశాల విద్యకూడా ఒదిలిపోతే ఒకపనైపోతుందనేది ప్రభుత్వ విధానం.

ఈ తెలుగు భాషా ‘బాధ’కులకు మిగిలింది మూడు options. ఒకటి భాషాబోధనను మార్చడం. అది వాళ్ళు చచ్చినా చెయ్యరు. ఎందుకంటే అదే "అచ్చతెలుగు" అనేది వీళ్ళ పిచ్చినమ్మకం. భాషా వారసత్వం వీరికి ముఖ్యం. భాష కాదు. వీరికి వర్తమానంకన్నా భూతకాలపు వైభవం ముఖ్యం.ప్రజల తెలుగుకన్నా, సారస్వతం ముఖ్యం.

రెండోది. ఏ ఆర్థిక కారణాల వల్లనైతే ప్రభుత్వం ఇంగ్లీషుమీడియం చదువులవైపు మొగ్గుచూపతోందో ఆ ఆర్ధిక కారణాన్ని రూపుమాపడం. స్వచ్చందంగా "భాషా సెస్" విధించమని ప్రభుత్వానికి చెప్పి,తెలుగు భాషా పరిరక్షణకోసం ట్యాక్స్ కట్టడానికి తయారవ్వడం. ఈ పని వీళ్ళు చేస్తారని నాకు అస్సలు నమ్మకం లేదు. ఏదో తెలుగు భాషకోసం lip service వరకూ చేస్తారుగానీ జేబులోంచీ డబ్బుతీసి తెలుగు భాషను రక్షించడమంటే..హమ్మో!

మూడొది. తెలుగు భాషను ఒక రాజకీయ ఉద్యమం చెయ్యడం. అన్ని రాజకీయపార్టీల మ్యానిఫెస్టోలోనూ తెలుగు భాషను "రక్షించే"(what ever it means to them)విధంగా చర్యలు ప్రతిపాదింపజెయ్యడం. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు పరిచేలా ఒత్తిడి తేవడం. లోక్ సత్తా లాంటి స్థానిక పరిపాలన తెలుగులో జరగాలని కోరుకునే పార్టీల నెత్తిన తమ ఆభిజాత్యాల్ని రుద్ధకుండా, పరిపాలనా తెలుగును సర్వత్రా ఉపయోగించేలా చర్యలు తీసుకుంటూ స్వచ్చందంగా దానికోసం పాటుపడటం.

పైవేవీ ఈ పెద్దలు చెయ్యరు చెయ్యలేరు...ఎందుకంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం తెలుగు భాష బ్రతకడం కాదు, తెలుగుతప్ప మరేదీ చదువుకోలేని ఒక తరగతి ప్రజల్ని మరో యాభైసంవత్సరాలు ఈ గొప్పోళ్ళకు వాళ్ళవారసులకూ పోటీరాకుండా చెయ్యడం. అందుకే తెలుగు భాష గురించి emotional rhetoric మాట్లాడతారేగానీ,విద్యాప్రమాణాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం తెలుగు కోసం ఏదో చెయ్యలంటారుగానీ, వీళ్ళు మాత్రం ప్రైవేటు విద్యకు మహారాజపోషకులు. అందరూ నిర్భంధ తెలుగు విద్య అభ్యసించాలంటారుగానీ,వీళ్ళ పిల్లలు మాత్రం కాన్వెంటుల్లో రాజ్యమేలుతుంటారు. They are the most dangerous people at this point in time. Beware of them.


భాష - మతం: దీనిభావమేమి తిరుమలేశా!



ఒక స్కూల్లో ఇంగ్లీషు పలక పిల్లల మెడలో వేసిన మరుక్షణం ఆ స్కూలు క్రిస్టియన్ మిషనరీలది కాబట్టి దీనికొక మతకోణం ఆపాదించబడుతుందని అనుకున్నాను. అటూఇటూగా అది జరిగినా, సహజంగా మన మతవాదుల గురి విషయం మీదకాక వారి "వాదాల" మీద ఉంటుంది కాబట్టి, అది కాస్తా ప్రభుత్వ మైనారిటీ విద్యా విధానం పై, ఉర్దూ మీడియంలపై, ముస్లింల పైకి వెళ్ళిపోయింది. "భాషకు మతం రంగేమిటయ్యా బాబూ!" అంటే,"వ్యాఖ్యలోని భావాన్ని వక్రీకరిస్తున్నారు" అంటున్నారు ‘పొద్దు’ వారు. కాబట్టి మీరే ఈ వ్యాఖ్యలకు అర్థాల్ని చెప్పండి. 
“మీరు ముస్లిములు, కాబట్టి మీరు ఉర్దూవాళ్లు” అని ఈ ప్రభుత్వమే వాళ్ళకి బళ్లు పెట్టి మఱీ ఉర్దూ నేర్పిస్తున్నది. అలా వాళ్ళని ఇండియాలో పాకిస్తానీలుగా మారుస్తున్నది. ఇలా ఉర్దూబళ్ళు పెట్టి జాతిలో ఇంకో ఉపజాతిని, చెవిలో జోఱీగలాంటి శత్రువర్గాన్ని తయారు చేసుకోవడం మనకి అర్జెంటా ?” దీని భావమేమి తిరుమలేశా????????
““తెలుగుని తప్పనిసరి చెయ్య” మని అడిగినప్పుడల్లా “అమ్మో ముస్లిములేనైనా అనుకుంటా”రంటూ ఎందుకు కుంటిసాకులు చెబుతుందో నాకు తెలియదు. కానీ ఈ కుట్ర ఇంకెంతకాలం ? ” దీని అర్థమేమి శ్రీనివాసా?????
ముస్లింలు తెలుగును ఎప్పుడు వ్యతిరేకించారు? ముస్లింలు ఉర్ధూనేర్చుకుంటే పాకిస్తానీలు అయిపోతారా? ప్రభుత్వం తెలుగుకన్నా ఉర్ధూకు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చింది? తెలుగు మాధ్యమాన్ని ప్రమోట్ చెయ్యకపోవడానికి ముస్లింల నిరసన కారణం అని ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పిందా? మరి ఏమిటీ విపరీతం!!! ఎవరిమీద ఈ కోపం!!! ఎందుకీ కుట్ర???
50,895 ప్రాధమిక పాఠశాలలు 30,84,212 తెలుగు మీడియం విద్యార్థులున్న ఈ రాష్ట్రంలో, పాఠశాలల్లో/ప్రాధమిక విద్యలో తెలుగు మృగ్యమయ్యే ప్రమాదం నిజంగా ఉందా?  తమ పిల్లల్ని మాత్రం ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పించిన ఈ కుహానా మేధావులు పడుతున్న బాధ దేనిగురించి?
**** 

Saturday, October 31, 2009

తెలుగుకన్నా...పిల్లల హక్కులు ముఖ్యం


మళ్ళీ తెలుగు భాష చర్చల్లోకి వచ్చేసింది. అవకాశం కోసం ఆశగా చూసే తెలుగు వీరులు బ్లాగుల్లో వీరంగాలు మొదలెట్టేసారు. తెలుగు భాషా ప్రశస్త్యం, ఘనతల్ని ఏకరువుపెడుతున్నారు.ప్రస్తుత పరిస్థితి మీద దీర్ఘమైన వ్యాసాలలో నిట్టూర్పు విడుస్తున్నారు. సందులో సందుగా ఇష్యూ లేక సైలెంట్ అయిపోయిన తెలంగాణా వా(బా)దులు ‘తెలుగు వయా తెలుగుతల్లి వయా తెలంగాణాతల్లి’ అనే రాంగ్ రూటొకటి కనిపెట్టి మళ్ళీ అర్థరహితవాదనల్ని అరంగేట్రం చేయించారు. ఈ గోల మధ్య అసలు గోడు పక్కదారిపట్టింది.

అది పిల్లల హక్కులకు సంబంధించింది. చిన్నపిల్లల సున్నిత హృదయాలకు సంబంధించింది. భాషకన్నా నాకు ఆ పిల్లోళ్ళ బాధ ముఖ్యం. వారు అనుభవించిన మానసిక వేదనకు న్యాయం చెయ్యడం ముఖ్యం. నవోదయా విద్యాలయాలో చదువుతున్నప్పుడు మాకు three language formula ఉండేది. వారంలోని ఆరు రోజుల్లో రెండేసి రోజులు తెలుగు, రెండ్రోజులు హిందీ మరో రెండు రోజులు దినసరి వ్యవహారాలలో ఇంగ్లీషు భాషాప్రయోగం చెయ్యడాన్ని ప్రోత్సహించేవారు. ఆ రోజులో ప్రార్థన మొదలు రాత్రి స్టడీ అవర్స్ ఆఖరి ఘడియ వరకూ ఈ విధానం అమలయ్యేలా మానిటరింగ్ జరిగేది. చిన్నచిన్న పనిష్మెంట్లు,జరిమానాలూ సాధారణం. కానీ ఇలాంటి శిక్షలూ, అవమానాలూ ఉండేవి కాదు.

ఈ ఫోటో పేపర్లో చూడగానే నాకొచ్చింది ఆ వ్యవస్థపై కోపం. ఇంగ్లీషు "మాత్రమే" నేర్పించాలనే తల్లిదండ్రుల పట్టుదలలపై చిరాకు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తూ,reinforce చేస్తున్న టీచర్లు,స్కూళ్ళపై నిరసన. అంతకన్నా మించింది ‘ఆ పిల్లల హృదయాలకు తగిలిన గాయం ఎలా మానుతుందా’ అనే వేదన. 

తెలుగు భాష తన బలహీనతల మూలంగానో, పరిస్థితుల ప్రభావం వల్లనో, పాలకుల చేతకానితనం మూలంగానో,తెలుగోళ్ళ ఇంగ్లీషు మోజు కారణంగా బలైనా నాకు పెద్ద తెడాలేదు. కానీ పిల్లల్ని ఇలా మానసిక వేదనకు గురిచేసే హక్కు ఎవరికీ లేదు. చివరికి తల్లిదండ్రులకు కూడా ఆ అధికారం లేదు. Its a gross violation of child rights. అందుకే స్కూలుపై,టీచర్లపై తక్షణం చట్టపరమైన చర్య తీసుకోవాలి.  

*****

Friday, October 23, 2009

మునెమ్మ - A manifesto on the Feminine


డాక్టర్ కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ అటుపాఠకుల్నీ ఇటు విమర్శకుల్నీ ఒక పట్టాన వదిలే నవలైతే కాదనే నిజానికి, నవల విడుదలైన సంవత్సరం తరువాత కూడా జరుగుతున్న చర్చలూ,వ్యాసాల పరంపరలు,కొనసాగుతున్న ఆలోచనలే సాక్ష్యం. ఆ నవలను కొందరు మ్యాజిక్ రియలిజంగా అభివర్ణించి-పొయటిక్ జస్టిస్ ని కొనియాడితే, మరికొందరు అరాకొరా మానసిక విశ్లేషణ చేసి, మోరలిస్టిక్ జడ్జిమెంట్లు రాసిపారేశారు. నా ప్రయత్నంగా నేను ‘నేటివ్ రీడర్’ ధృక్కోణం నుంచీ నవలని స్థానికసాంప్రదాయాల ఫోక్లోర్ ట్రెడిషన్ పంధాను ఆవిష్కరించే అసంపూర్ణ ప్రయత్నం(నా వ్యాసం పూర్తి కాలేదుమరి!) చేశాను.


మునెమ్మ నవల అందులోని పాత్రల మార్మికత,కథ లోని గాథాత్మకత దృష్ట్యా ఒక మనోవైజ్ఞానిక నవల అనేది నిర్వివాదాంశం. కానీ, ప్రాచిన- మానవమౌళిక( primitive and primordial) భావనలైన లైంగికతను మోరలిస్టిక్ దృష్టితో చూసే పురుషభావజాలం కోణం నుంచీ అర్థం చేసుకునే ప్రస్తుతపోకడలలో ఒక objective analysis ఈ నవలపై జరగలేదు అనేది నా నమ్మకం. ‘మునెమ్మ’ కేశవరెడ్డి పైత్యానికి ప్రతీకగా సాక్షి పేపర్లో కాత్యాయని విరుచుకుపడ్డా, కొందరు సాహితీ మిత్రులు ఆవిడ అర్బన్-ఎలీటిస్ట్- మిస్ ఇంటర్ప్రిటేషన్ కు సాగిలపడ్డా, అదంతా అనలిటికల్ సైకాలజీలోని నవీనపోకడలు (ముఖ్యంగా కార్ల్ యంగ్)- సాహిత్యంలో ఆ పోకడల్ని అన్వయించడం తెలియకపోవడమే అనే నిజాన్ని బహుచక్కగా వివరించిన వ్యాసం పసుపులేటి పూర్ణచంద్రరావు గారు ద సండే ఇండియన్ (19th Oct,2009)లో రాసిన "మునెమ్మ - ఒక ‘ఫండమెంటల్’ కథ! : A manifesto on the Feminine" అనే వ్యాసం.


ఆ వ్యాసం లంకెను ఇక్కడ ఇస్తున్నాను (పేజి నెంబర్ 42- 47). చదివి మీ అభిప్రాయాల్ని తెలిపితే, చర్చ ఇక్కడా ప్రారంభించొచ్చు.


****

Thursday, October 22, 2009

ప్రేమ వైరుధ్యం


ప్రేమ కోసం...
జీవితాంతం ఎదురుచూస్తాం.
ఎవరైనా ప్రేమిస్తే...
అనుమానంతో వేధిస్తాం.
అంగీకరించక మారాంచేస్తాం.

****

Wednesday, October 14, 2009

ఆధునికోత్తరవాదం : Post-modernism




"Post-modernism is not an ideology. Its an 'idea' of demystifying all ideologies at the strength of independent thinking" అని మా ఆంగ్లసాహిత్యం ఫ్రొఫెసర్ చెప్పేవారు.అప్పట్లో కొంత అర్థమయ్యిందనిపించినా,ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను.

"ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం". ఇలా ఉంటే ‘మీ మాటల్లో పొంతనలేదు’ అన్న వ్యాఖ్యలు వినాల్సివస్తుంది. అలాంటప్పుడు గ్రహించాల్సింది ఏమిటంటే, seeking nobody's approval and disapproving no one's idea of what you are  is also part of post- modernism.



****