Friday, January 27, 2012

షూటింగ్ ముచ్చట్లు : ఆదిలోనే హంసపాదు

డిసెంబర్ 9,2011

ఎనిమిదికి షాట్ పెట్టాలనుకుంటే, అందరూ వచ్చేసరికీ తొమ్మిదయ్యింది. బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా, అప్పటికే మేకప్ పూర్తయిన హీరోయిన్ కి కాస్ట్యూమ్స్ ఇచ్చాం. ఉన్న రెండు ఛేంజెస్ లో అతిముఖ్యమైన బెడ్రూం సీన్స్ కి సంబంధించిన చీర అది. 

కాస్సేపటికి నాకు పిలుపొచ్చింది. 
"మీ స్కిప్టులోని అవసరాలకి, మీరు స్కెచ్ లో చూపించిన లుక్ కి ఈ చీర సరిపోతుందా?" అంటూ నాచేతికి చీర యిచ్చింది స్వప్న(రమ). 
చీర మెటీరియల్ బాగుంది. కట్టుకుంటే స్వప్నకూ బాగుంటుంది. కానీ రమ పాత్రకు, ఆ పాత్ర తీరుకు, నేను చూపించాలనుకున్న విధానానికీ, కెమెరాకూ నప్పని కలర్, మెటీరియల్ లో ఉంది. ఒక్కసారిగా ఏంచెయ్యాలో తోచలేదు. 

కమలాకర్ లైటింగ్ సెట్ చేసుకుంటున్నారు. అజయ్, శ్రీనాథ్, శ్రీకాంత్, అరవింద్ సెట్ అరేంజ్ చేస్తున్నారు. హరి స్టిల్స్ తీస్తున్నాడు. కాస్ట్యూమ్స్ లో తేడా వచ్చేసిందింది. ఎలా షూటింగ్ మొదలుపెట్టాలో తెలీదు. 

పవిత్రం కి ఏదో ఆలోచన వచ్చి 
"నీ దగ్గర ఏమైనా చీరలున్నాయా" అని స్వప్ననే అడిగాడు. 
"మీకు అభ్యంతరం లేకపోతే తెస్తాను. కొన్ని ఆప్షన్స్ ఉండొచ్చు." అంది స్వప్న నన్ను చూసి. 
అప్పటికే నాలో ఏదో టెన్షన్. ఆదిలోనే హంసపాదా అనే ఫీలింగ్. అప్పటివరకూ ఉన్న మొండితనం ఎక్కడో సడలిన భావన. 

"సరే" అన్నాను నెమ్మదిగా. 

మోహన్ కార్ అరేంజ్ చేసాడు. స్వప్న పవిత్రం చీరలు తేవడానికి కృష్ణానగర్ బహల్దేరారు. మోహన్ కూడా నేనూ మా ఇంట్లో ఏమైనా చీరలున్నాయేమో తీసుకువస్తానని వెళ్లాడు. అప్పుడు సమయం దాదాపు 10 గంటలు.

ఏదో టెన్షన్. వచ్చే చీర ఎలా ఉంటుందో తెలీదు. నేను అనుకున్న విజన్ ఏమిటో మర్చిపోయాను. హీరోయిన్ ఎలా ఉంటే బాగుంటుందని నేను ఆలోచించిన ఊహకు మసకేసింది. 
హరి, శ్యాం తమ కెమెరాలకు పని చెప్పారు. ఏవేవో స్టిల్స్ తీస్తూ వచ్చారు. 
కొంత ఆటవిడుపు. హరి నా ఫోటోలూ కొన్ని తీశాడు.

గంటలో మోహన్ వచ్చాడు. వెంటవెంటనే ఒక పెద్ద బ్యాగ్ తో స్వప్న-పవిత్రం. బ్యాగ్ లోంచీ చీరలు తీసి చూపించింది. వాటిల్లో రెండు ఈ చేంజ్ ఓవర్ కోసం చెప్పాను. అంతలో ఆ చీరల మధ్య మరో చీర కనిపించింది. 
"ఇది రెండో చేంజ్ ఓవర్ కి" అని చెప్పాను.
స్వప్న విచిత్రంగా చూసి. "ఇంకో చీర బానే ఉందిగా" అంది.
"లేదు. ఇది ఇంకా బాగుంటుంది. రెడీ అయ్యిరండి" అని చెప్పేసి కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళాను.
అప్పటికి లైటింగ్ అయిపోయింది. చక్రధర్ తో చర్చించి, ఫ్రేమ్ చూసుకున్నా.
స్వప్న వచ్చింది. నేను అనుకున్నదానికన్నా ఇప్పుడే ‘రమ’ నా కళ్ళముందు క్లియర్గా కనిపించింది. 


ఫస్ట్ షాట్ తీశాం....


****