Sunday, March 20, 2011

స్పృశ్యాస్పృశ్య దేహాలు - ఒక హోళీ అనుభవం

చీరాల, తెనాలి, గుంటూరుల్లొ పెరిగి చదువుక్కున్న నాబోటి కొస్తా కుర్రాళ్ళకి (అప్పట్లొ కుర్రవాళ్ళమనే అర్థంలో సుమా), హోళీ అనే ఒక రంగుల పండగ ఉంటుందని తెలియదు. విజయవాడ సిద్దార్థా ఇంజినీరింగ్ కాలేజీకి చదువులకి వచ్చాక, Hyderabad పిల్లలు, ఉత్తరాది పి...డుగులు హోళీ అడుతుంటె బాగుంది.
 

అన్నింటికన్నా విశేషం-- వేళ్ళు తగిలినా కొరకొర మనే మా ఆడపిల్లలు (క్లాసుమేట్లు), దేవతలు తాకటనికి కూడా సందేహపడే ప్రదేశాల్లో తాకుతూ రంగులు పూస్తున్నా ఏమీ అనకపోవడం. అప్పట్నుంచి, హోళిని మించిన పండగ నాకు లేకుండా పోయింది. 365 రోజుల్లో, ఒక్క రోజు మాత్రమే హోళి రావడం నా జన్మకి శాపమేమో అనిపించింది.
ఇదిలా ఉండగా, మేము ఇంజినీరింగ్ లో జాయిన్ అయినప్పుడు, ఆ తర్వాత రెండేళ్ళ వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజి మా కాంపౌండ్ లోనే ఉండేది. మాధవీ లతల కన్నా నాజూకైన మెడికో ఆడపిల్లలతో స్నేహం వల్ల, అనాటమి ఇరుకిరుకు గదుల్లో వాళ్ళ practicals లో నేనూ ఉండే వాడిని. అక్కడ ద్రావకాల్లో కూడా nude bodies ఉంటాయి కదా. కానీ, ఎంత contrast? ఆ వైరుధ్యాన్ని, అనుభవాన్ని అర్థం చేసుకునే యాతనలో, నా brother in law, Osmania medical collegeలో తన anatomy practicals experience నాకు ఉద్వేగంతో చెప్పినప్పుడు, 1997లో నేను రాసిన కవిత ఇది. ప్రతి హోళీకీ గుర్తుకొచ్చే పోయెం. 


స్పృశ్యాస్పృశ్య దేహాలు

ఒట్టి దేహాలేనా

ధూళి దుప్పట్ల్లై కప్పుతున్న
పంచరంగుల కేరింతల మధ్య
.............................. అవొట్టి దేహాలేనా

వాన చిత్తడి దయన
కొంగొత్తగా తెలిసే పసిడి పాదాలు

కుదురులేని పైటల చాటు
పియానో మడతల గమకాలు

కొనవేళ్లు తాకినా
ఒళ్లెర్ర చేసి కొరకొరమనే చూపుల
అంటరానితనాల్ని వర్ణావర్ణంగా
చెరిపేసిన
ఆనందహోళీల స్మృతిలో...
................................ అవి ఒట్టి దేహాలేనా

ప్రమత్తంగా తాకిన
క్షణభంగుర స్పర్శలేనా-
నును సెగల నివురును తప్పిస్తున్న
భీతి!
ఇది జఘన చంద్రవంక గాయపరిచిన
సౌఖ్యం!
* * *

ఒట్టి దేహాలేనా

తెంపులేని గొలుసు కలల్ని
చెడనివ్వని ద్రావకాల్లో
...................................... ఇవొట్టి దేహాలేనా

పండు కొరకని ఈవ్‌ల
నగ్నాచ్ఛాదనలివేనా

నిద్రంటని దిండు దాచిన
డెబొనేర్ బొమ్మల్లో
అడ్డు తెరల నూలుపోగై
శ్వాస తెంపిన దిసమొలలివేనా

అనాటమీ ఇరుకిరుకు గదుల్లో
అనైచ్చికంగా తాకేవన్నీ తమకపు స్పర్శలేనా

ఎప్రాన్ భుజాల్ని తీకే తామర తూడు
విశ్లేషణల వేళ్లకంటే నలుపెరుపు నరం

జలదరింపుల మెడపై ఊపిరి సెగ
శ్వాసల్లేని గుండెకి డిసెక్షన్ కత్తిగాటు

వీపును గుచ్చే ఉలిమొనల వక్షం
మండుతున్న కంటిలో శవ నగ్నత్వం

నిర్లిప్తోద్వేగాలకు స్పృశ్యాస్పశ్యంగా
తెరతీస్తున్న
జ్ఞాత జ్ఞానాల స్పృహలో
........................................ ఇవి ఒట్టి దేహాలేనా

అనైచ్ఛికంగా తాకేవన్నీ
తమకపు స్పర్శలేనా-

రహస్యాల వేళ్లమధ్య
నలిగి జారే ముగ్గురేణువు!
రంగవల్లుల కెంపుబుగ్గకు
పేడముద్దల దిష్టిచుక్క!!
* * *
*మెడికో బావమరిది 'శివ' 'కు అనుభవంలో వాటా పంచుతూ-



- నరేష్ నున్నా
****

Tuesday, March 1, 2011

శ్యామ్ బెనెగల్ తో నేను