నిన్న సినీమ్యాక్స్ లో సినిమా చూడ్డానికి వెళుతుండగా ఒక మీడియా మిత్రుడు ఎదురుపడ్డాడు. ఒక ప్రముఖ దినపత్రికలో సినిమా జర్నలిస్టు. “ఏంటిబాసూ ఇక్కడ” అంటే “వర్మ సినిమాకిలే” అని జవాబిచ్చాను. పెద్ద టాక్ లేదుకదా మళ్ళీ ఎందుకు వెళ్ళడం అంటూ నా వైపు ఒకసారి చూసి నవ్వేసాడు. నేనూ ఇబ్బందిగా ఎంతైనా వర్మ సినిమాకదా అని కవరింగ్ ఇచ్చాను.
అప్పుడే చుట్టుపక్కల గమనించాను. ఏదో సినిమా స్టాండీలు, వాటిపైన తమిళనటుడు జీవా ఫోటోలు “ఏంటీ రంగం సినిమా విజయోత్సవాలా?!” అనిఅడిగితే దానికి మిత్రుడు నవ్వేసి, “కాదు. రాబోయే సినిమా ప్రమోషన్లు” ఓహో...అంటూ పరికించి చూస్తే ఆ సినిమా టైటిల్ “వచ్చాడు. గెలిచాడు”...
సర్కాస్టిగ్గా నా మిత్రుడివైపు తిరిగి “‘రంగం’తో వచ్చాడు హిట్ కొట్టి గెలిచాడా!” అన్నాను.
తను నావైపు తమాషాగా చూస్తూ “ఇండస్ట్రీ అంతేకదా బ్రదర్. హిట్ ఉన్నవాడిదే రాజ్యం. వాడు ఏంచేసినా చెల్లుతుంది. ఏం చెప్పినా ఊకొడుతుంది” అని పత్రిక ప్రాస భాషలో అనేశాడు.
“రంగం సినిమా హిట్ అవడానికి కారణం కథ కదా, మరి అలాంటి కథల్ని వెతుక్కోకుండా ఆ హీరోని పట్టుకుని వేలాడితే మరో హిట్ వస్తుందని ఎందుకనుకుంటారు మనోళ్ళు” అని నేను సాలోచనగా నాలోనేను అనుకుంటే, నా మిత్రుడు సానుభూతిగా నా భుజంతట్టి, “ఇలా అలోచించి బుర్ర పాడుచేసుకోకు. నాకైతే ఈ సినిమా హిట్ అవడానికి జీవాకన్నా ఇంకో నటుడు అజ్మల్ పాత్ర కారణం అనిపిస్తుంది” అని చల్లగా చెప్పాడు.
నిజమే జీవాకు రంగం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నమాట నిజమేకానీ, కథాపరంగా అజ్మల్ చేసిన యువరాజకీయనేత పాత్ర నటనపరంగానూ, సబ్జెక్టుపరంగానూ చాలా ప్రముఖమైన పాత్ర. చివరికొచ్చేసరికీ మొత్తంగా కథను నడిపిన పాత్రగా నిలబడుతుంది.
కాకపోతే సమస్యల్ని తీర్చేవాడే హీరోకాబట్టి చివరాఖరికి జీవానే ఆ సినిమా హీరో. నా ఆలోచన సంగతి ఎలా ఉన్నా అసలే కాన్స్పిరసీ థియరీలు రాసే పత్రికలో గాసిప్స్ రాసే పాత్రికేయుడిగా నా మిత్రుడి ఆలోచన ఎలా ఉందో తెలుసుకుందామనే క్యూరియాసిటీ కలిగి “అలా ఎందుకనుకుంటున్నావ్?” అని ఒక శరంసంధించాను. కానీ నేను రియలైజ్ కానిది ఎంట్రా అంటే, ఈ మిత్రుడు నా మైండ్ బ్లాంకయ్యే కాన్స్పిరసీ చెబుతాడని.
నా మిత్రుడు చెప్పెనదాని ప్రకారం రంగం సినిమా తెలుగులో హిట్ అవ్వడానికి ముఖ్యకారణం అజ్మల్ పాత్ర్ర. “ఒకసారి జాగ్రత్తగా గమనించు, ఆ పాత్ర తీరు, డ్రస్సింగ్, డయలాగ్స్ అన్నీ మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ ని తలిపించడంలేదూ!” అన్నాడు.
ఒక్క క్షణం నాకు పోలిక అర్థం కాలేదు. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి సినిమా రీలు మైండ్ లో తిరగేస్తే ఒక క్రూషియల్ సీన్ లో “నేనూ స్వార్థపరుడినే, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. కాకపోతే నా కుటుంబం పెద్దది. విశాలమైనది. మీరు, ఈ సమాజం, దేశం అన్నీ దానిలో భాగమే” అంటూ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా ఏదో సభలో (లోక్ సత్తా పార్టీ ఆవిర్భావసభ అనుకుంటా) అన్నాడు. “హమ్మో! నిజమేనేమో” అనుకున్నా.
“అయితే మాత్రం” అంటూ ఏదో బింకం నటించడానికి ప్రయత్నించాను. నా మిత్రుడు సాలోచనగా నన్ను పక్కకు తీసుకెళ్ళి “బాసూ, రంగం సినిమా A సెంటర్లకన్నా B-C సెంటర్లలో బాగా ఆడింది. సినిమా బాగుండటంతో పాటూ ఆంధప్రదేశ్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. జయప్రకాష్ నారాయణ్ లాంటి న్యూట్రల్ సిన్సియర్ ఫేస్ ను అడ్డుపెట్టుకును ఈనాడు పేపర్ అటు కాంగ్రెస్ ను తెలుగుదేశం ను ఎలా ఆడుకుందో వాడుకుందో అనేదే అసలు కథ. ప్రజలకు అర్థమయిన కథ. జె.పి.ఎలాగూ అగ్రకులాల రాజకీయాలకు మరో ఫేసు తనబండారమూ ఇలా ఎదో ఒక రోజు బయటపడుతుందని అందరికీ తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే అలా కనెక్ట్ అయిపోయారు” అని తన కాన్స్పిరసీ థియరీతో నాకు జ్ఞానోదయం కలిగించాడు.
“ఛా! నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్. సినిమా బాగుంది హిట్ అయ్యింది” అని నేను కొంచెం బెదురుగా అంటే, “బ్రదరూ జె,పి. కుల కోఠరీ గురించి, ఈనాడు అతన్ని ఎలా లీడర్ ను చేసింది అనేదాని గురించీ నీకూ తెలుసుకదా?” అని అడిగాడు.
“అదిసరే! కానీ మరీ సినిమా కథకూ దానికీ లింకు కట్టడం నాకైతే పెద్దగా లాజికల్ గా అనిపించడం లేదు” అని తేల్చేశాను. నా మిత్రుడు కొంచెం కోపంగా “ఇదేనయ్యా మీలాంటి సీరియస్ ఫిల్మ్ క్రిటిక్స్ తో వచ్చే తంటా, ‘తెలుగుతనం లేదు కాబట్టే శక్తి, తీన్ మార్, బద్రీనాథ్ ఫెయిలయ్యాయి’ అంటారు. ఇదిగో ఈ తెలుగు రాజకీయాల్ని చూపించింది కాబట్టే రంగం సినిమా హిట్ అయ్యింది అంటే మాత్రం ఒప్పుకోవడానికి కష్టం అంటారు. ఎలాగయ్యా మీతో చేసేది” అనేశాడు.
“మరీ బోడి గుండుకీ మోకాలికీ ముడిపెట్టడం...” అంటూనేను నసుగుతుండగానే ఎవరో ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవుతోందనే సరికీ ఫ్రీబీస్, స్వీట్ ప్యాకెట్స్, గిఫ్ట్ కవర్ల కోసం మావోడులగెత్తాడు కవరేజ్ అనుకుంటూ. నేను మాత్రం చేతిలో రాంగోపాల్ వర్మ ‘నాట్ ఎలవ్ స్టోరీ’ సినిమా టికెట్లు పట్టుకుని పిచ్చిచూపులు చూస్తూ “వచ్చాడు గెలిచాడు” పోస్టర్ చూస్తుంటే పోస్టర్ మసకబారి
“వచ్చాడు. కెలికాడు” లా కనిపించింది.
****