Tuesday, September 13, 2011

తెలుగు సినిమాలు - డబ్బింగ్ సినిమాలు

కన్నడ పరిశ్రమ తరహాలో ఇక్కడా డబ్బింగ్ సినిమాల్ని నిషేధిస్తారట: హహహ...
కర్ణాటకలో తెలుగు తమిళ సినిమాలు డైరెక్టుగానే రిలీజై వందరోజులు ఆడేస్తాయి. డబ్బింగ్ సినిమాలు వాళ్లకి అసలు అవసరమే లేదు. అయినా నిషేధాలవల్ల సినిమా పరిశ్రమ అభివృద్దిచెందదు. సెన్సిబుల్ సినిమాల వల్ల అభివృద్ధి చెందుతుంది. ఆ జ్ఞానం మనోళ్ళకి కావాలి. అయినా, డబ్బింగ్ సినిమాలు లేకపోతే ఉన్న థియేటర్లలో ఈగలు తోలుకోవలసిందే. డబ్బింగ్ సినిమాలు లేకపోతే పూటగడవని పరిస్థితికి తెలుగు పరిశ్రమ చేరింది. కాబట్టి డబ్బింగ్ మీద నిషేధం పరిశ్రమని మరింతగా దిగజారుస్తుందేతప్ప మెరుగుపరచదు. మౌళికాంశాలని వదిలేని ఈ పనికిమాలిన పనులేమిటో మన పరిశ్రమ పెద్దలకు!

మన తెలుగు పరిశ్రమ సమస్యల విస్తృతత్వానికి అంతే విశాలమైన సమాధానాలు కావాలి. “సెన్సిబుల్ సినిమా” అనే పదం చిన్నదే అయినా దానిలో ఆ విశాలత్వం దాగుందని తమిళ,మళయాళ,బంగ్లా, మరాఠీ, హిందీ సినిమాలు నిరూపిస్తూ వస్తున్నాయి. సినిమాని కేవలం కళగా భావించినా చెల్లదు, వ్యాపారంగా మాత్రమే భావించినా పొసగదు. కళాత్మకవ్యాపారం అని అంగీకరిస్తూనే, రెంటిలోని నిబద్ధతని ఒకటిచెయ్యగలిగితేనే సెన్సిబుల్ సినిమా పుడుతుంది. విషయపరమైన సెన్సిటివిటీ దర్శకుడి బాధ్యత అయితే, వ్యాపారపరమైన సిన్సియారిటీకి నిర్మాత బాధ్యుడు. ఈ విధంగా ఇద్దరూ సెన్సిబుల్ సినిమాకి రథసారధులే.

వ్యాపారనిబద్ధత కలిగిన నిర్మాత ఆద్యుడైతే, కళపట్ల సమగ్రమైన అవగాహన కలిగిన దర్శకుడు మధ్యాంతాలుగా కొనసాగితేనే మంచి సినిమా పుడుతుంది. అటు వ్యాపారాత్మకంగానూ ఇటు కళాత్మకంగానూ వృద్ధిచెందుతుంది.

సమస్య నిర్మాతల వైపునుంచే అని ఒప్పుకోవాలనిపించినా, తమిళంలో మొదలైన దర్శకనిర్మాతల ట్రెండ్ నన్ను ఆపుతోంది. ఒక సెన్సిబుల్ సినిమా ఇచ్చి పరిశ్రమని ఒక కుదుపుకుదిపిన దర్శకులు తమిళంలో వెనువెంఠనే కార్పొరేట్ ఫండింగో, ఫైనాన్సర్ల ఫండింగో సంపాదించి దర్శకనిర్మాతలుగానూ, సెన్సిబుల్ నిర్మాతలుగానూ ఎదిగి వైవిధ్యాన్ని నిలబెడుతున్నారు. “ట్రెండ్” సృష్టిస్తున్నారు. కానీ తెలుగులో ఆ పరిణామం కనిపించదు. శేఖర్ కమ్ముల కొంత ప్రయత్నించినా, చంద్రశేఖర్ ఏలేటి, చంద్రసిద్దార్థ, క్రిష్, దేవకట్టా లాంటివాళ్ళుకూడా తమ సర్వైవల్ కోసం వెతుక్కునే పరిస్థితిదాటి ఎదగలేని బలహీనతలోనే ఉన్నారు. ఈపాటికి వీళ్ళ స్వీయదర్శకత్వంలోనో లేక నిర్మాణంలోనే కనీసం నాలుగేసి సినిమాలు సంవత్సరానికి వచ్చుంటే ఈపాటికి పరిశ్రమ రూపురేఖలు మారేవి.

కథల విషయానికి వస్తే, తెలుగు సినిమా కథలు చెప్పడం మానేసి సీన్ల అల్లికలోపడు పాతికసంవత్సరాలు దాటుతోంది. కాబట్టి మార్పు అక్కడినుంచే రావాలి. అది నిర్మాతగా కూడా మారగలిగే సత్తాఉన్న దర్శకుల దగ్గరనుంచే రావాలి. కథలు చాలానే ఉన్నాయి.

***

Saturday, September 10, 2011

రెండు సినిమాలు: ఒకటి కొత్తది మరొకటి పాతది.

ఈటివి లో శోభన్ బాబు- లక్ష్మి నటించిన ‘కోడెనాగు’ సినిమా చూశా  . చాలా శక్తివంతమైన సినిమా. యువతరం ఆరాటం. సమాజం పట్ల ఉండే నిరసన, కోపం. వ్యక్తిగత ద్వేషాలూ, పగ. అలవికాని ప్రేమ. అర్థంకాని ఆవేశాలు. ఎంత సహజంగా రచించారా అనిపించింది. ఈ భావతీవ్రత అంతా ఈ చిత్రానికి కన్నడ మాతృక అయిన ‘నాగరహావు’ రాసిన ‘తరాసు’ కు చెల్లుతాయనుకుంటా. పుట్టణ్ణ కణగల్ దర్శకత్వం వహించిన ఒరిజినల్ కూడా చూశాను. అందులో విష్ణువర్థన్ నటనే నాకు శోభన్ బాబుకన్నా బాగా నచ్చింది. బహుశా అదే విష్ణువర్థన్ మొదటి సినిమా కావడం, శోభన్ బాబు ఈ సినిమా చేసేసరికే ఒక ఇమేజ్ ఉండటం ఒక కారణం కావొచ్చు. కొడెనాగు సినిమాలో ఆచార్య ఆత్రేయ నటించడం ఒక హైలైట్.
 
ఈ ‘గ్యాంబ్లర్’ తో పెట్టుకుంటే పాపరే!
అజిత్ అభిమానుల వీరాభిమానం మీద, అతగాడి స్క్రీన్ ప్రెజెన్స్ మీద తప్ప స్క్రిప్టు మీద ఏమాత్రం శ్రద్ధలేకుండా తీసిన చిత్రం ఇది. ఒక థిల్లర్ కథకు అనవసరపు కామెడీ మిక్స్ చేసి అసందర్భమైన, అర్థరహితమైన స్క్రీన్ ప్లేతో సినిమా అంతా నడుస్తుంది. ఉపసంహారం (ఎపిలాగ్)లో మలుపు తిప్పి, కథ మొత్తాన్నీ మార్చేసే పద్దతి హాలీవుడ్ లో కొన్ని సినిమాలలో వర్కవుటైనా అప్పటికే సహనం చచ్చిన ప్రేక్షకుడికి ఈ చిత్రంలోని ఎండ్ ట్విస్ట్ ఏమాత్రం కిక్ ఇవ్వదు. అజిత్ నటన చాలా కొత్తగా, బాగుంది. అర్జున్ మామూలే. అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీలేదు.
****