Thursday, December 27, 2012

కశ్మీర రాజతరంగిణి కథ - చిరు సమీక్ష


కశ్మీర రాజతరంగిణి కథలు"రచయిత కస్తూరి మురళీకృష్ణగారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు సాహితీధోరణుల్ని, ఏది మంచి సాహిత్యం అనే నిర్ణయాధికారాన్ని అమలుచేస్తున్న కొందరు పెద్దల గురించి జరిగిన చర్చలో వాళ్లని "సాహితీ మాఫియా"గా వర్ణిస్తే నేను "పీఠాధిపతులు"అన్నాను. ఇద్దరి ఉద్దేశం ఒకటే. కానీ సామాజిక సాంస్కృతిక రెఫరెన్స్ పాయింట్ వేరు. అదే మా ఇద్దరి ధృక్కోణాలలో ఉన్న బేధం. ఆ బేధాన్ని అంగీకరించి బయాస్ లేకుండా చదివితే కశ్మీర రాజతరంగిణి కథలు విషయపరంగా, కథనపరంగా, శైలి పరంగా చాలా ఆసక్తికరమైన కథలు. చరిత్ర మీద ఆసక్తిని రేపెత్తించే కథలు. ఇదా చరిత్ర అని చాలా చోట్ల ఆశ్చర్యపడే కథలు.

చారిత్రాత్మక కథల్లో వచ్చే సమస్య అదే. ఇదా చరిత్ర అని ఆశ్చర్యపడ్డా, ఇదేనేమో చరిత్ర అని నమ్మి అనుమానపడకపోయినా తంటామొదలౌతుంది. కల్హణుడి రాజతరంగిణి ఆధారంగా రాసిన ఈ కాశ్మీర రాజుల కథల్లో చాలా వరకూ మ్లేచ్చులకు, తురుష్కులు, బౌద్ధుల మరియు హిందూరాజులైన కాశ్మీర రాజులకూ మధ్య జరిగిన వాదాలు, వివాదాలు, కుట్రలు, కుతంత్రాలు, మతపరమైన చర్చలు, సనాతనధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పే సూక్తాలు, బ్రాహ్మణుల తపోబలం మరియు శాపఫలాలు ఇవే అన్నీనూ. అప్పటికీ ఇప్పటికీ కాశ్మీర్ ఇతరమతాల ప్రాబల్యం వల్ల వచ్చిన ఘర్షణని అనుభవిస్తుండటం ఆ కారణంగా కథల్లో చెప్పిన కొన్ని ఘటనలు నేటికీ చాలా కాంటెంపరరీగా అనిపించడం వంటి చమక్కులు నిజంగా ఆ కథల్లోంచీ వచ్చాయా లేక కథకుడి మ్యాజిక్కా అనే సందేహం వచ్చినప్పుడు మాత్రం నా బయాస్ పక్కనపెట్టలేకపోయాను. ముఖ్యంగా కథల్లో దాదాపు "హిందూమతం" అనే పదం వాడకపోవడం "సనాతనధర్మం" అంటూ ఒక మిథికల్ పేరునే మాటిమాటికీ జపించడంతోపాటూ యాంటీ బుద్దిస్ట్ కథలకి కల్పించిన ప్రాధాన్యత, మ్లేచ్చులు, తురుష్కులు అంటూ మిడిల్ ఈస్టర్న్ మతాన్ని ఉంటంకించడం చూస్తుంటే హిందుత్వ అజెండా ఏమైనా రచయిత భుజాన మోస్తున్నాడా అనే అనుమానం రాకతప్పదు.

ఈ పాలిటిక్స్ పక్కన పెట్టినా లేక దీనిలో కుట్ర ఉందేమో అనే అనుమానంతో చదివినా "కశ్మీర రాజతరంగిణి కథలు" ఆసక్తి కరంగానే ఉంటాయి. అదే చెయ్యితిరిగిన రచయిత చెయ్యదగ్గ ఫీట్ కాబట్టి కస్తూరి మురళీకృష్ణగారిని అభినందించక తప్పదు. తప్పకుండా కొనిచదవదగ్గ పుస్తకం. చదవండి.
 

కాశీభట్ల వేణుగోపాల్ "నికషం" - ఒక చిరుస్పందన


బంగారాన్ని కాకిబంగారాన్నీ వేరుచేసి చూపించే గీటురాయి కూడా నకిలీదైతే నాణ్యత తెలిసేదెవరికి? ప్రమాణాలకు అర్థం ఏమిటి? ఏది సక్రమమో ఏది అక్రమమో తెలిపే న్యాయం మిథ్యగా మిగిలిదే జీవితంలో విలువలకు అర్థం ఏమిటి? నైతికతకు అస్తిత్వం ఎక్కడుంటుంది? ఈ ప్రశ్నల్లేని జవాబుల్ని జవాబుల్లేని ప్రశ్నల్ని శరాల్లా సంధించి మేధను, మనసును తుత్తునీయలు చేసే బ్రహ్మాస్త్రం కాశీభట్ల వేణుగోపాల్ "నికషం".

నైతికతకీ అనైతికానికీ మధ్య ‘నిర్ నైతికత’ అనే పదం ఉందోలేదో తెలీదుగానీ, తెలుగు సాహిత్యంలో postmodernist amoral content ని ideology విప్లవాత్మక స్థాయిలో గుప్పిస్తున్న అధివాస్తవిక రచయిత కాశీభట్ల. మెసేజిలిచ్చే మోరలిస్టిక్ సాహిత్యాన్నో లేక సమస్యల్ని అధిగమిస్తూ ఉన్నతులుగా బ్రతికే హీరోయిక్ జర్నీలనో ఆశించి కాశీభట్లను చదివితే అతని ఆలోచనల్ని కూడా భరించలేం. పాత్రల్ని పాత్రలుగా సహించలేం. వీలైతే మరింత అసహ్యాన్ని పెంచుకుంటాం. కాబట్టి చదివేముందు "సాహిత్యమంటే ఇది" అనే బ్యాగేజిని పరుపుకిందో, అల్మరాలోనో ఇంకా వీలైతే టాయ్ లెట్ ఫ్లష్ లో ఫ్లష్ చేసేసివచ్చి ఇతని పుస్తకాల్ని చదవడం మొదలెట్టండి. నికషం అందుకు మినహాయింపు కాదు. సో...బీ రెడీ ఫర్ ఇట్. ఇఫ్ నాట్ డోంట్ రీడ్ ఇట్.

Thursday, May 24, 2012

నా ద్వితీయ లఘుచిత్రం - ‘కృతజ్ఞత’ ప్రోమో



Thursday, April 12, 2012

‘ఎడారి వర్షం’ చిత్రానికి వాసిరెడ్డి సీతాదేవి అవార్డు


Saturday, March 24, 2012

తెలుగు బ్లాగుల బాగోగులు


"బ్రాహ్మణ వాద పునరుజ్జీవం : తెలుగు బ్లాగులు" (http://seperateandhra.blogspot.in/2012/03/blog-post_23.html) అని ఇందాకా కట్టా సుఖేంద్ర రెడ్డి గరు రాసిన ఒక పోస్టు చదివాను. అందులో ఆర్గ్యుమెంటుని దాదాపు బ్రాహ్మణకులానికి ఆపాదించడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తానుగానీ, మూల భావనని అంగీకరిస్తాను. అటు సామాజికంగా, ఇటు సాహితీపరంగా బ్రాహ్మణవాదానికి (బ్రాహ్మణ కులం కాదు) స్థానం క్రమేణా పబ్లిక్ స్పేస్ లో తగ్గిన క్రమంలో ఆభావజాలాలకు తెలుగు బ్లాగులు పట్టుకొమ్మలయ్యాయి.

సంస్కృతి సాంప్రదాయం, మతనిబద్ధత, భాషాభిమానం, దేశ భక్తి పేర్లతో ఒక మారువేషపు బ్రాహ్మణవాదం బ్లాగుల్లో ప్రచులితమై ఉంది. ఏ ఇతర ఆల్టర్నేట్ ఐడియాలజీని తెలుగు బ్లాగులోకం భరించదు. దాని ఉనికిని నాశనం చెయ్యడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. సమాజంలో ఆర్థకంగా-సామాజికంగా-రాజకీయంగా ఆధిపత్యాన్ని ఉపయోగించినట్లు ఇక్కడ సాంకేతికంగా వారికున్న ఆధిపత్యాన్ని ఉపయోగించి "దాడి" చేస్తారు. ప్రత్యామ్న్యాయానికి ఉనికి లేకుండా చేసి తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోంటారు.

తెలుగు బ్లాగులోకం ఈ పద్దతుల వల్లనే అల్లకల్లోలమయ్యింది. ఇప్పుడు ఈ పరిస్థితి కంటిన్యూ అవుతోంది కాబట్టే వైవిధ్యం నశిస్తోంది. బ్లాగులోకం కేవలం భద్రలోకానికే అనే రకంగా తయారయ్యాయి.  

****

Friday, January 27, 2012

షూటింగ్ ముచ్చట్లు : ఆదిలోనే హంసపాదు

డిసెంబర్ 9,2011

ఎనిమిదికి షాట్ పెట్టాలనుకుంటే, అందరూ వచ్చేసరికీ తొమ్మిదయ్యింది. బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా, అప్పటికే మేకప్ పూర్తయిన హీరోయిన్ కి కాస్ట్యూమ్స్ ఇచ్చాం. ఉన్న రెండు ఛేంజెస్ లో అతిముఖ్యమైన బెడ్రూం సీన్స్ కి సంబంధించిన చీర అది. 

కాస్సేపటికి నాకు పిలుపొచ్చింది. 
"మీ స్కిప్టులోని అవసరాలకి, మీరు స్కెచ్ లో చూపించిన లుక్ కి ఈ చీర సరిపోతుందా?" అంటూ నాచేతికి చీర యిచ్చింది స్వప్న(రమ). 
చీర మెటీరియల్ బాగుంది. కట్టుకుంటే స్వప్నకూ బాగుంటుంది. కానీ రమ పాత్రకు, ఆ పాత్ర తీరుకు, నేను చూపించాలనుకున్న విధానానికీ, కెమెరాకూ నప్పని కలర్, మెటీరియల్ లో ఉంది. ఒక్కసారిగా ఏంచెయ్యాలో తోచలేదు. 

కమలాకర్ లైటింగ్ సెట్ చేసుకుంటున్నారు. అజయ్, శ్రీనాథ్, శ్రీకాంత్, అరవింద్ సెట్ అరేంజ్ చేస్తున్నారు. హరి స్టిల్స్ తీస్తున్నాడు. కాస్ట్యూమ్స్ లో తేడా వచ్చేసిందింది. ఎలా షూటింగ్ మొదలుపెట్టాలో తెలీదు. 

పవిత్రం కి ఏదో ఆలోచన వచ్చి 
"నీ దగ్గర ఏమైనా చీరలున్నాయా" అని స్వప్ననే అడిగాడు. 
"మీకు అభ్యంతరం లేకపోతే తెస్తాను. కొన్ని ఆప్షన్స్ ఉండొచ్చు." అంది స్వప్న నన్ను చూసి. 
అప్పటికే నాలో ఏదో టెన్షన్. ఆదిలోనే హంసపాదా అనే ఫీలింగ్. అప్పటివరకూ ఉన్న మొండితనం ఎక్కడో సడలిన భావన. 

"సరే" అన్నాను నెమ్మదిగా. 

మోహన్ కార్ అరేంజ్ చేసాడు. స్వప్న పవిత్రం చీరలు తేవడానికి కృష్ణానగర్ బహల్దేరారు. మోహన్ కూడా నేనూ మా ఇంట్లో ఏమైనా చీరలున్నాయేమో తీసుకువస్తానని వెళ్లాడు. అప్పుడు సమయం దాదాపు 10 గంటలు.

ఏదో టెన్షన్. వచ్చే చీర ఎలా ఉంటుందో తెలీదు. నేను అనుకున్న విజన్ ఏమిటో మర్చిపోయాను. హీరోయిన్ ఎలా ఉంటే బాగుంటుందని నేను ఆలోచించిన ఊహకు మసకేసింది. 
హరి, శ్యాం తమ కెమెరాలకు పని చెప్పారు. ఏవేవో స్టిల్స్ తీస్తూ వచ్చారు. 
కొంత ఆటవిడుపు. హరి నా ఫోటోలూ కొన్ని తీశాడు.

గంటలో మోహన్ వచ్చాడు. వెంటవెంటనే ఒక పెద్ద బ్యాగ్ తో స్వప్న-పవిత్రం. బ్యాగ్ లోంచీ చీరలు తీసి చూపించింది. వాటిల్లో రెండు ఈ చేంజ్ ఓవర్ కోసం చెప్పాను. అంతలో ఆ చీరల మధ్య మరో చీర కనిపించింది. 
"ఇది రెండో చేంజ్ ఓవర్ కి" అని చెప్పాను.
స్వప్న విచిత్రంగా చూసి. "ఇంకో చీర బానే ఉందిగా" అంది.
"లేదు. ఇది ఇంకా బాగుంటుంది. రెడీ అయ్యిరండి" అని చెప్పేసి కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళాను.
అప్పటికి లైటింగ్ అయిపోయింది. చక్రధర్ తో చర్చించి, ఫ్రేమ్ చూసుకున్నా.
స్వప్న వచ్చింది. నేను అనుకున్నదానికన్నా ఇప్పుడే ‘రమ’ నా కళ్ళముందు క్లియర్గా కనిపించింది. 


ఫస్ట్ షాట్ తీశాం....


****