Tuesday, August 30, 2011

ది క్రిటిక్


అనగనగా ఇద్దరు స్నేహితులు.
చాలా సంవత్సరాల తరువాత పట్నంలో ఉంటున్న స్నేహితుడు పల్లెకొస్తే ఇద్దరూ కలిసారు.
చిన్ననాటి జ్ఞాపకాలు, పిండివంటల ఆహారాలు, పాతస్నేహితులతో సంబరాలూ అన్నీ అయ్యాయి.
అన్నీ అయ్యాక పల్లెలో ఉన్న స్నేహితుడికి తనదగ్గరున్న ఒక విచిత్రాన్ని పట్నం మిత్రుడికి చూపించాలనుకున్నాడు.
“చెరువులో బాతుల్ని వేటాడటానికి వెళ్దాం” అని పూర్వజుల మరతుపాకి ఒకచేత్తో మరోచేత్తో విశ్వాసపాత్రమైన కుక్కనూ తీసుకుని బయల్దేరమన్నాడు పల్లెమిత్రుడు.
ఇద్దరూ చెరువుగట్టుకొచ్చారు.
పల్లెమిత్రుడిలో ఒక ఎక్సైట్మెంట్, ఏదో చూపించాలనే తపన.
గురిపెట్టి ఒక బాతుని కాల్చి గర్వంగా పట్నం మిత్రుడి వైపు చూశాడు. పట్నం మిత్రుడి ముఖంలో ఎటువంటి రియాక్షనూ లేదు.
పల్లె మిత్రుడు చిన్నగా నవ్వుకున్నాడు. పక్కకు తిరిగి తన కుక్క వైపు చూసి ఒక సైగచేశాడు.
అంతే...కుక్క అమాంతం నీళ్ళలోకి దూకింది. విచిత్రం...కుక్క నీళ్ళలో ఒక అంగుళంకూడా మునగలేదు. దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి బాతుని నోటితో కరుచుకుని ఒడ్డుకుతీసుకొచ్చి యజమాని చేతిలో పెట్టింది.
పల్లెమిత్రుడు, పట్నం మిత్రుడి ముఖంలో విచిత్రాన్ని చూసిన అనుభూతిని చూద్దామని తిరిగి చూశాడు.
ఆ స్నేహితుడి ముఖంలో ఎటువంటి స్పందనా లేదు. ఏ అధ్బుతాన్నీ చూసిన ఆనవాళ్ళు లేవు.
పల్లె మిత్రుడికి విచిత్రమనిపించింది. మళ్ళీ బాతుని కాల్చాడు. మళ్ళీ కుక్క నీళ్ళపై నడుచుకుంటూ బాతుని తీసుకుని యజమానికిచ్చింది. ఇలా ఇంకో నాలుగుసార్లు చేశాడు.
కనీసం స్నేహితుడు “ఎలా” అనైనా అడుగుతాడేమో అని ఆశగా చూశాడు.
స్పందన లేదు.
నిరాశగా, “ఇంటికి వెళ్దామా” అంటూ లేచాడు.
స్నేహితుడు అప్పటికే లేచి బయల్దేరాడు. పల్లె మిత్రుడు వడివడిగా బాతుల్ని బ్యాగ్ లో పెట్టుకుని స్నేహితుడి దగ్గరికి వచ్చి, ఇక తప్పదన్నట్టుగా “నీకేమీ తేడాగా అనిపించలేదా” అని క్యూరియస్గా అడిగాడు.
స్నేహితుడు ఒక్కసారి వెనక్కి తిరిగి బాతుల బుట్టవైపు, మరతుపాకివైపు, కుక్కవైపూ చూసి,
“అనిపించిది. తెలిసొచ్చింది. నీ కుక్కకు ఈదడం రాదని” అంటూ వెళ్ళిపోయాడు.
అవాక్కయిన పల్లె స్నేహితుడు మరునిముషంలో తేరుకుని...”ఓరేయ్ ఇంతకీ నువ్వు పట్నంలో ఏంచేస్తుంటావూ” అన్నాడు.
“నేనా ! ఒక విమర్శకుడిని” అంటు చక్కాపోయాడు ఆ మిత్రుడు.
(మిత్రుడు ఆర్. కె. చెప్పిన పిట్టకథ ఆధారంగా)

2 comments:

సుజాత వేల్పూరి said...

హ హ హ! బాగుంది. కొంతమంది విమర్శకులని చూస్తే ఈ కథ నిజమే అనిపిస్తుంది

గీతాచార్య said...

:-)D