మొన్న ఒక చర్చలో ‘తెలుగు సాహిత్యానికి తగిన గుర్తింపు భారతదేశంలో రాలేదేమిటి చెప్మా?’ అని నిట్టూర్పువిడిస్తే, ‘నూతిలోంచీ ఎగబాకే కప్పను లాగి మళ్ళీ క్రిందపడదోసే జాతి సాహిత్యానికి ఎట్లా గుర్తింపు వస్తుంది?’ అని ప్రశ్నించి నా నిట్టూర్పుని కాస్తా నిస్పృహగా మార్చేశారు. అప్పుడే విన్నాను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ "ద్రౌపది"కి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అని. విన్న క్షణం నుంచే అప్పటినుంచీ ఆ పుస్తకాన్ని గురించి ఎక్కడా చర్చించని సాహితీప్రియులందరూ పరమచెత్త పుస్తకం అంటూ సాంప్రదాయాన్ని భుజాన వేసుకుని బయల్దేరారు. అప్పటివరకూ నిద్రపోయిన పండితులు హఠాత్తుగా విమర్శలు గుప్పించడం మొదలెట్టారు. ఏకంగా మానవహక్కుల కమిషన్ కు "మా మనోభావాలు దెబ్బతీస్తోందహో" అని ఏకరువుపెట్టి అవార్డుని ప్రస్తుతానికి ఆపించడంమే కాకుండా ఆ పుస్తకం ఇతరభాషల్లో అనువదించకూడదనే డిక్రీ పట్టుకొచ్చి సంస్కృతిని రక్షించేశారు.
నేను యార్లగడ్డ రాసిన పుస్తకం చదవలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చదువుతాను. ఈ గొప్పోళ్ళ విమర్శలకు సమాధానం చెప్పడానికి ఏమీ చదవక్కరలేదు. కూసింత ఇంగితజ్ఞానం ఉంటే సరిపోతుంది.
సంస్కృతీ రక్షకుల విమర్శలు:
"1. ఇది ఒక బూతు పుస్తకం. వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు సరస్వతికి ఇటువంటి అవమానం, పరాభవం, కీడు, అపరాధం, అపచారం ఎన్నడూ జరగలేదు.న్యాయనిర్ణేతలే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సాహిత్య అకాడమీ ఈ విషయాలు గ్రహించి పునరాలోచించి ‘ద్రౌపది’ గ్రంథ పురస్కారానికి అనర్హమైనదిగా ప్రకటించాలి."
ఐదు భర్తలున్న ద్రౌపది మడిగట్టుకుని కూర్చోకుండా, ఆ ఐదుగురితోనూ సుఖించింది అని పుస్తకంలో వర్ణనలున్నాయి కాబట్టి ఇది బూతు పుస్తకం అనేది వీరి వాదన. ద్రౌపది వాళ్ళతో సంబోగించకుండానే అందరికీ పిల్లల్ని కన్నదా? ఇందులో అసహ్యించుకోవలసింది "పవిత్రతకు" భంగం కలిగించే విషయం ఏముంది? బూతు పుస్తకమట! ఎక్కడ లేదు బూతు? ఈ వర్ణనలే బూతైతే, రతిభంగిమలు నలుదిక్కులా ఉండే దేవాలయాలు బూతుకాదా! సమాగమనానికి ప్రతీకైన శివలింగం బూతుకాదా!!
సాంప్రదాయాన్ని వ్యతిరేకించి మనుషుల్ని మనుషులుగా ముఖ్యంగా స్త్రీలను స్త్రీగా చూడాలన్న ప్రతి వ్యక్తి సాహిత్యాన్నీ "బూతు" అన్న ఈ ఛాంధసవాద తిరోగమనవాద ఛండాలురకు గౌరవమిచ్చి సాహిత్య అకాడమీ పునరాలోచించాలా? ఈ పుస్తకం అనర్హమైనదిగా ప్రకటించాలా? ఎవరండీ ఈ సంస్క్కతిని కాపాడేందుకు కంకణం కట్టుకున్న గొప్పోళ్ళు...నిజమైన సమస్యలొచ్చినప్పుడు వీళ్ళెక్కడా కనిపించరే!!!
"2. ద్రౌపదిని శ్రీకృష్ణుని ఇష్టసఖిగా రచయిత అభివర్ణించాడు. ఇష్టస అంటే ప్రియురాలు, వలపుకత్తే, ప్రేయసి అనే అర్థాలు ఉన్నాయి. కాని చెల్లెలు అనే అర్థం ఉందా?"
సఖి-సఖుడు అనేది భక్తి సాంప్రదాయంలో ఒక విధానం. దేవుడ్ని కొలవడంలో అదొక ప్రత్యేకతరహా. ఇప్పుడు మనం platonic relationship అంటామే ఆతరహా. ఆ అర్థం,చరిత్ర మనోళ్ళకు తెలీదుగానీ ప్రస్తుతానికి "సఖి" అంటే ప్రియురాలు అనే అర్థం ఉందికాబట్టి ద్రౌపదికీ కృష్ణుడికీ రచయిత రంకు అంటగట్టాడనే అపోహతో వీళ్ళు తమ మనసుల్లోని కుతిని తీర్చుకుంటున్నారేతప్ప మరొకటి కాదు.
"3. ఐదుగురు కొడుకులను పోగొట్టుకొని (సుషుప్తి పరవశులైన బాలకులను అశ్వత్థామ గొం తులు కోసి చంపాడు) గోలుగోలున ఏడుస్తున్న ద్రౌపది, పూర్వం తనకు జరిగిన అన్యాయాలను తలచుకుంటూ వెంటాడే స్మృతులలో దుర్యోధనుడు కామంతో తన ఎత్తైన వక్షస్థలాన్ని చూస్తున్న సంగతి గుర్తుచేసుకోగలదా?"
ఎందుకు గుర్తుచేసుకోకూడదూ...ఎవరైనా స్త్రీని బస్టాండుల్లో,ఆఫీసుల్లో, రోడ్డు మీద కళ్ళతో గుచ్చిగుచ్చి చూసి రేప్ చేసే మీలాంటి దౌర్భాగ్యులపై ఎంత అసహ్యం ఉంటుందో ఒకసారి అడిగి కనుక్కోండి. ఈ నీచత్వం వాళ్ళ మనసుల్ని ఎంతగా గాయపరుస్తుందో తెలుసుకోండి.
"4. ద్రౌపది ఒకరోజు తరువాత ఒకరోజు పాండవులు ఒక్కొక్కరితో కామకేళీ విలాసాలతో సుఖించినట్లు, పరవశత్వం చెందినట్లు వక్రీకరణలు గొప్ప పరాభవము, మానభంగము కావా?"
హన్నా... మొగుళ్ళతో సుఖించడం కూడా పరాభవమా! ఆ సుఖంలో పరవశత్వం చెందడం మానభంగమా! ఎవరండీ ఈ కేతిగాళ్ళు? ఈ సాంప్రదాయవాదులు ఇప్పటికే స్త్రీలని ఎన్నో మానసిక సంకెళ్ళలో బంధించారు. వీలైతే ఇలాంటి వాదనలతో యోనులకు తాళాలు వేస్తామన్నా అంటారు. ఛత్!!
"5. శ్రీకృష్ణ పరమాత్మను అతి నీచంగా ప్రస్తావించటం కృష్ణభక్తులైన ఆనందవర్ధనుడు, ఆచార్య శంకరభగవత్పాదులు, సూరదాసు, మీరాబాయి, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణపరమహంస, లీలాశకుడు, జయ దేవుడు, విద్యావతి, చండీదాసు, నారాయణతీర్థుల వంటి మహానుభావులను అవమానించడం కాదా?"
పైన చెప్పినవాళ్ళందర్నీ అప్పటి సాంప్రదాయవాదులు వ్యతిరేకించారు(కొందర్ని పిచ్చోళ్ళని కూడా ముద్రవేసారు). ఆ తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు. కాబట్టి వాళ్ళకు కొత్తగా జరిగిన అవమానం ఏదీ లేదు. కృష్టుడు అల్ట్రా మాడ్రన్ పాత్ర. ఆపాత్ర చేసినవన్నీ established నైతికతకు అందని గిమ్మిక్కులే. ఉచ్చనీచాల ప్రస్తావన ఆపాత్రకే అవమానం.
****