మిత్రులు ప్రసాదమూర్తి కవిత్వం గురించి ఏమని చెప్పాలి?
కవిత లేకపోతే రోజుగడవని వాడు...ఒక పుస్తకం పుట్టకపోతే పుట్టినరోజు జరుపుకోనివాని గురించి ఏమని చెప్పాలి?
ఈ సంవత్సరం పుట్టినరోజునాటికి "నాన్న చెట్టు" పుట్టింది.
అందులోని కొన్ని పంక్తులే తన కవిత్వానికి ప్రమాణాలు...చదవండి.
పుస్తకాన్ని మాత్రం కొని చదవండి.
నేను సముద్రాన్నయితే...
సముద్రం నా ముందు కూర్చుంటుంది.
వేల సంవత్సరాల జ్ఞాపకాలేవో...ఇసుకరేణువులై
నాలో మేటవేస్తుంటే
తరంగాలు తరంగాలుగా నేను పడిలేస్తుంటాను
సముద్రం పకాలున నవ్వుతూ
పాతముచ్చట్ల మూట విప్పుతుంది
(పేజి1 : విశాఖ తుంపర)
రెండుగంటల విధ్వంసం
రెండు దశాబ్దాల విచారణ
తూర్పు సింహాసనంపై
సూర్యుడు తీర్పు ప్రకటిస్తాడు
గాల్లో కదలుతున్న బాధితులు
పడమటి కోండలకు
తలలు బాదుకుంటారు
దోషులు రాత్రి పార్టీలో
సూర్యుడి నెత్తిమీద
చుక్కల్ని కుమ్మరిస్తారు
ప్రజాస్వామ్యం బురుజు చుట్టూ
చీకటి పహరా
రెండు దశాబ్దాల విచారణ
తూర్పు సింహాసనంపై
సూర్యుడు తీర్పు ప్రకటిస్తాడు
గాల్లో కదలుతున్న బాధితులు
పడమటి కోండలకు
తలలు బాదుకుంటారు
దోషులు రాత్రి పార్టీలో
సూర్యుడి నెత్తిమీద
చుక్కల్ని కుమ్మరిస్తారు
ప్రజాస్వామ్యం బురుజు చుట్టూ
చీకటి పహరా
(పేజి: 64, లిబర్ హాన్)
ఆకాశమంత మచ్చ
ఏ వెలుగు నీళ్ళతో కడిగేయగలం?
విలువల కోసం కలలుకనే కళ్ళల్లో
ఇక నీ ముఖమే
గడ్డకట్టిన అశ్రుకణమై తిరుగుతుంది
(పేజి:102, బిల్కిస్ బానో)
జాగ్రత్త గురూ
రెచ్చిపోయి నీదేశం దరిద్రాన్ని అక్షరీకరిస్తానేమో..
పేట్రేగి నీదేశం మత హింసను
రంగుల్లో దృశ్యమానం చేస్తావేమో
ఆందోళనతో నీదేశంలో అన్యాయాలను...అక్రమాలను
ఖండిస్తూ నిప్పుల సంగీతమై మండిపోతావేమో..
జాగ్రత్తరా బాబూ!
దేశభక్తులకు ఆగ్రహం వస్తుంది
నిన్ను దేశద్రోహిగా చిత్రీకరించి చించిపారేస్తారు
నీకళ్ళముందు మురికిని మిన్నేటి పరికిణిలా వర్ణించాలి
నీ ముందు పడివున్న భిక్షు వర్షీయసిని
ఐశ్వర్యరాయ్ గానో...శిల్పాశెట్టిగానో అభివర్ణించాలి..
భద్రం తమ్మీ!
(పేజి: 54, కల్చర్ డాగ్)
నిన్ను తెరవకుండా ఉండలేను
కానీ మూయకుండానూ ఉండలేను
జ్వరం ఒంటిమీద అమ్మచేతి స్పర్శవు నువ్వు
స్కూలు బస్సులోంచి టాటా చెప్తున్న
పిల్లల నవ్వు కళ్ళకాంతివి నువ్వు
దాహంగా ఉన్నప్పుడో...ఆకలేసినపుడో
నీటికోసమో అన్నం కోసమో కాదు..
నీకోసమే చూస్తాను
నువ్వున్నావన్న నమ్మకంలోనే కాని..
ఈ ఊపిరిలో ఇంత వెచ్చదనం ఎక్కడిది?
(పేజి: 25, కవిత్వం)
రాత్రి కలలో తడిసిన అక్షరాలు
పొద్దున్నే నీరెండలో ఆరబోశాను
కోటి అంచుల జలఖడ్గ ప్రహారానికి
ముక్క ముక్కలైన నా దేహమే కనిపించింది.
ఒక అవయవాన్ని ఆదుకోడానికి
మరో అవయవం తాపత్రయం
కొట్టుకుపోవడమేగా తెలిసింది
ఏ చెట్టుకో చిక్కుకున్న నాకోసం నేనే ఆర్తనాదాలు
(పేజి:3, అశ్రుదేహం)
పుస్తకం : నాన్న చెట్టు (ప్రసాదమూర్తి కవిత్వం)
ప్రచురణ: వున్నూత్న ప్రచురణలు
ధర: 75 /-
కాపీలకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి,నవోదయ,నవయుగ,దిశ దుకాణాలు
****
1 comments:
ప్రసాదమూర్తిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజే ‘నాన్నచెట్టు’ పుస్తకావిష్కరణ. ఆ సందర్భంగా కూడా ప్రసాదమూర్తిగారికి అభినందనలు. వచ్చే ఏడు ‘నిజంగా నేనేనా’ కథల పుస్తకంతో పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నా... (కథల పుస్తకం పేరు అప్పుడే పెట్టేశా...)
Post a Comment