Wednesday, February 25, 2009

ఔనన్నా! కాదన్నా!!

ఔనన్నా,కాదన్నా జీవనవైరుధ్యాలు చాలా తమాషాగా ఉంటాయి. ఒక నిమిషంలో విజయశిఖరాల్ని అధిరోహించిన మనం, మరో నిమిషంలో...అపజయాల అఘాతాల్లో మన గుర్తింపును వెతుక్కుంటూ ఉంటాం. ఈ ఎగుడు దిగుడు అలల మధ్యన బ్రతికెయ్యడం. పడిలేచే ఆలోచనల, అనుభవాల మధ్యన ప్రపంచాన్ని అనుభవించెయ్యడం మనం అప్రయత్నంగా చేసే పని.

అందుకే ఈ అసహన అలల మధ్యన జీవించే చాలా మందిని చూసినప్పుడల్లా, నా జీవనప్రయాణాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తాను. ప్రతొక్కరి జీవితంలోనూ ఒడిదుడుకులుంటాయి. కానీ, వ్యకిత్వం, ఆలోచన సాక్షిగా ఈ అలల తాకిడిని బేరీజుచేస్తే గుర్తొచ్చింది, ఇవన్నీ నిజానికి బాహ్యప్రపంచపు ఒత్తిడుల అనవాలేకదా ! అని. అయితే మరివి నా జీవితపు ఆటుపోట్లు కావా? ఏమో?!? నిజంగా కావేమో!

ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం. ఒక రైతుదగ్గర ఆరోగ్యవంతమైన జోడెడ్లుండేవి. పొలం దున్నీ బండి నడీపీ రైతు పొషణకు ఉపయోగపడే విధంగా ఉండేవి. రైతు పక్కింటాయనెప్పుడూ "ఎంత అదృష్టమయ్యా నీది. ఇలాంటి ఎడ్లున్నాయి" అంటుండేవాడు. దానికి రైతు నవ్వి "ఔనో కాదో" అని వేదాంత ధోరణిలో సమాధానం చెప్పుకొచ్చేవాడు.

కొన్నాళ్ళ తరువాత ఆ ఎడ్లు రైతునొదిలి అడవిలోకి పారిపోయాయి. పక్కింటతను "చూశావా నీదురదృష్టం ఎలా తగలడిందో" అన్నాడు. రైతుమళ్ళీ "ఔనో కాదో" అనే సమాధానం ఇచ్చాడు. రెండ్రోజులు గడిచేసరికీ అడవిలోకి పారిపోయిన ఎడ్లు మరిన్ని అడవి పశువులతో జత కలిసి రైతు ఇల్లు చేరాయి. మళ్ళీ "ఎంత అదృష్టమయ్యా నీది" అని పక్కింటాయన. రైపు ఎప్పటిలాగే "ఔనో కాదో".

రైతు కొడుకొకడు ఎటువంటి శిక్షణా లేని అడవి పశువు మీద స్వారీ చెయ్యబోతూ ప్రమాదవశాత్తూ పడిపోతాడు. విపరీతమైన జ్వరం పట్టుకుంటుంది. అప్పుడు పక్కింటతను మళ్ళీ "చూశావా నీ దురదృష్టం" అనే అన్నాడు. రైతు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. యుద్ధం మొదలయ్యింది. సైనికుల్ని భర్తీ చేసుకుంటూ గ్రామాలను వెదుకుతున్న సైన్యం రైతు కొడుకు పరిస్థితి చూసి, "వీడు పనికి రాడు" అని నిర్ణయించి వెళ్ళిపోయారు. కానీ పక్కింటాయన కొడుకుని సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి తీసుకెళ్ళారు. రైతు కొడుకు కొన్నాళ్ళకు కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. పక్కింటాయన కొడుకు యుద్ధంలో చనిపోతాడు. మళ్ళీ...రైతు అదృష్టాన్ని అతను కీర్తిస్తే, రైతు మరోమారు తన ఔనోకాదో సందిగ్ధతను వ్యక్తపరుస్తాడు.

ఈ కథవిన్న ప్రతిసారీ పునర్జన్మ ఎత్తినట్లుంటుంది. ఏది మంచి ఏది చెడు? ఏది గెలుపు ఏది ఓటమి? అన్న ప్రశ్నలు తలెత్తిన ప్రతిసారీ, ఈ కథలోని సత్యం గుర్తుకొచ్చి స్వాంతన కలుగుతుంది.మన జీవితంలోని ప్రతి ఘటనా మంచీ చెడూ రెండుపార్శ్వాలనూ కలిగుంటుంది. బహుశా అందుకే స్పానిష్ సామెతలో "every bad happens for a good reason" అంటారు కాబోలు. వాటిని అర్థం చేసుకోవడం, జీవితానికి అన్వయించుకోవడం మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం చెయ్యాల్సిన పనులు. అలాంటప్పుడు ఎవరివో తులమానాలు మనకెందుకు? వారు చేసే బేరీజులు మనకేల?

మంచి చెడుల్ని సమానంగా స్వీకరిద్ధాం. వాటి విలువల్ని ‘స్వదృష్టి’ బేరీజు చేద్ధాం. అప్పుడు మన సమాధానం కూడా ఔనన్నా కాదన్నా "ఔనో..కాదో" అవుతుందేమో!


* ఒక మిత్రుడు పంపిన ఆంగ్ల వ్యాసం ఆధారంగా.


****

Tuesday, February 24, 2009

హిందీ సినిమాలు - Politics of Representation

హిందీ చిత్రరంగమంతా, ఆస్కారు అవార్డులస్థాయిలో ‘ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’- IIFFA ప్రారంభించుకున్న సమయంలో (బహుశా 2005 అనుకుంటాను) మళయాళ నటుడు మమ్ముట్టిని NDTV పాత్రికేయుడు, What do you think of IIFFA ?ఆని ఒక ప్రశ్న అడిగాడు. దానికి మమ్ముట్టి చెప్పిన సమాధానం ఏమిటంటే, “Its an utter arrogance on Hindi film Industry’s part to call themselves ‘Indian Film Industry’. Whom do they represent ? NONE. There are number of regional language films that are being made in India, representing it’s people and culture. These guys have not even bothered to acknowledge this fact and call themselves Indian film industry!!! I don’t strongly object to IIFFA, simply because I don’t even care to acknowledge it.”

తను చెప్పిన ఈ ఒక్కమాటతో ఈ మహానటుడిని, ఒక వ్యక్తిగా కొండంత గౌరవం ఇవ్వడం మొదలుపెట్టాను. ఎవరిని represent చేస్తూ సినిమాలు తీస్తున్నారోకూడా తెలియని బొంబాయి/ముంబై చిత్రపరిశ్రమ, తమనితాము ‘భారతీయ చిత్రపరిశ్రమ’గా చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. హిందీ మన జాతీయభాష అయినంతమాత్రానా, హిందీ సినిమాలు మన జాతీయ సినిమాలు ఎలా అవుతాయో నాకు అర్థంకాని విషయం. అంతేకాకుండా, ఆస్కారు అవార్డుల్లోకూడా విదేశీచిత్రాల కేటగిరీ వుంటుంది. కానీ, ఈ IIFFA లో కనీసం ఇతరభాషా చిత్రాల ఊసుకూడా ఉండదు. అలాంటప్పుడు, ఈ అవార్డుల పేరులో హిందీ చిత్రపరిశ్రమ అనికాకుండా, “ఇండియా” అనే పదం అవసరమా? అనేది, మిలియన్ డాలర్ ప్రశ్న.

ఇక్కడే మొదలౌతుంది “representation” గురించి ‘మిస్ రెప్రజెంటేషన్’ అనే భాగం. ఈ మొత్తం తంతులో,గుర్తించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. అందులో మొదటిది, నిజంగా ముంబై పరిశ్రమ(బాలీవుడ్) కనీసం హిందీ మాట్లాడే ప్రజలకూ వారి సంస్కృతికీ అయినా ప్రాతినిధ్యం వహిస్తాయా? రెండోది. ఒకవేళ వహించినాకూడా, హిందీ సినీరంగానికి భారతీయ సినీపరిశ్రమ హోదాని ఇవ్వచ్చా?

భాష అనేది గాల్లోంచీ ఊడిపడేది కాదు. దానికొక సాంస్కృతిక-సామాజిక-ఆర్థిక-రాజకీయ నేపధ్యం ఉంటుంది. ఈ విస్తృత నేపధ్యం లోని అనుభవాల్ని అనువదించడానికే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు భాషని ఉపయోగిస్తారు. ప్రామాణికమైన హిందీ భాషను భారతదేశంలోని బృహత్తరమైన భౌగోళిక భాగంలో అధికార భాషగా వాడుతారు. కానీ, ప్రాంతాన్ని బట్టి దానిలో చాలా మార్పులు చేర్పులు కనిపిస్తాయి. ఒక రాష్ట్రానికీ మరో రాష్ట్రానికీ కొన్ని వేలపదాల తేడా ఉంటుంది.

హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్- ఉత్తరాంచల్, బీహార్-ఝార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్ ఘడ్,హర్యాణా,కొంతవరకూ హిమాచల్ ప్రదేశ్ మరియూ రాజస్థాన్. ఈ మధ్యవచ్చిన వంద హిందీ సినిమాల్ని చూస్తే ఈ ప్రదేశాల్లోని ఏప్రజలకు అవి అద్దంపట్టాయో, ప్రాతినిధ్యం వహించాయో చెప్పాలంటే బుర్రబద్ధలు కొట్టుకోవాలి. ఆరంభంలో చాలావరకూ నిర్మాతలు,దర్శకులూ, నటులూ పంజాబ్ (భారతీయ-పాకిస్తానీ రెండువైపులా ఉన్న) ప్రాంతానికి చెందిన వారవటం వలన అక్కడి సంస్కృతీ,సంగీతం,ఇతర కళల్ని హిందీ సినిమాల్లోకి అనువదించారు. కర్వాచౌత్, లేడీ సంగీత్ లాంటి పెళ్ళికి సంబంధించిన పంజాబి సాంప్రదాయాలు హిందీ సినిమాల పుణ్యమా అని భారతీయ సాంప్రదాయాలైపోయాయి.ఢోలక్ లాంటి వాయిద్యాలు సినీసంగీతంలో భాగాలయ్యాయి. ఆ తరువాత బెంగాలీ దర్శకుల హవా నడిచినంత కాలం బెంగాలీ కట్టూబొట్టూ హిందీ సినిమాల్లో స్థానం సంపాదించింది. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే బొంబాయి నగర నేపధ్యంలోనే చాలా వరకూ సినిమాలు వచ్చేవి. ఇప్పటివరకూ అదే తంతు కొనసాగింది. అంతమాత్రానా మరాఠీ సభ్యత,సంస్కృతికి ఈ సినిమాలు నీరాజనాలు పట్టాయా అంటే, అదీ లేదు. ఢిల్లీ నేధ్యంలో 80 వదశకంలో ‘స్పర్శ్’,‘చష్మేబద్దూర్’ వంటి సినిమాలు వచ్చినా అవి ఢిల్లీ సంస్కృతిని చూపించాయా అనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు వస్తున్న హిందీ సినిమాలు ప్రాతినిధ్యం వహించేది ఎవరికి? ఏ ప్రజలకు? ఏ సంస్కృతికి? ఏ భాషకు?

సినిమా ఒక (contemporary art form) సమకాలీన కళల సమాహారమన్న నిజం అందరూ అంగీకరించే విషయం. అలాంటప్పుడు కళ ఒక నిర్ధుష్ట్యమైన భాష, సంస్కృతి,సామాజిక-రాజకీయ సందర్భంలో లేకపోతే దాని ప్రయోజనం ఏమిటో ప్రశ్నించాల్సిన విషయమే. లేదూ సినిమా కేవలం వినోదం కోసమే అంటే ఆ వినోదం ఏ స్థాయికి చెందిందో పునర్విచారణ చెయ్యవలసిన విషయమే!

ఉత్తర ప్రదేశ్ లో స్థానిక భాష భోజ్ పురి లో సినిమాలున్నాయి. ఉత్తరాఖండ్ లో కుమోనీ,గఢ్వాలీ లో సినిమాలు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీహార్-ఝార్ఖండ్ లో మైధిలీ భాషా సాహిత్యం నుంచీ సినిమాల వైపుగా అడుగులు పడుతున్నాయి. చిన్నచిన్న ప్రయత్నాలు జరుగుతున్నా రానున్నకాలంలో ఈ ప్రయత్నాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. హిందీ సినిమాలలో అప్పుడప్పుడూ ఈ ప్రాంతం ప్రజలు కనిపించినా, బొంబాయి లేక ఢిల్లీ నుంచీ వచ్చే హీరోలకు సహాయపడటానికో లేక సినిమాలో తమ భాషని అపహాస్యం చేస్తూ హాస్యాన్ని పండించడానికో మహా అయితే అమాయకపు హీరోయిన్ గా హీరోను ప్రేమించడానికో తప్ప మరెందుకూ ఉపయోగపడిన ధాఖలాకు కనిపించవు. ఈ నేపధ్యంలో అటు భాషాజనాలకు, ప్రాంతాలకూ,స్థానిక సంస్కృతికీ రాజకీయాలకూ స్థానం లేని హిందీ సినిమా హిందీభాష ప్రజల సినిమా అనికూడా చెప్పుకోవడం సందేహాస్పదం. ఒక స్థాయిలో హాస్యాస్పదం.

ఒకప్పుడు శ్యాం బెనెగల్ తనకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ ఫ్యూడల్ వ్యవస్థ ను ‘అంకుర్’, ‘నిశాంత్’ లాంటి సినిమాలలో జనబాహుళ్యానికి చెప్పడానికి హిందీ భాష ఆసరా తీసుకుంటే ప్రస్తుతం ప్రకాష్ ఝా వంటి దర్శకులు తన బీహార్ ప్రపంచాన్ని“గంగాజల్’, ‘అపహరణ్’ వంటి సినిమాల ద్వారా ఆవష్కరిస్తునారు. ఇలాంటి సార్థక ప్రయత్నాలు అరాకొరాయే తప్ప విస్తృతం కావు. హైదరాబాదీ ముస్లింలపై తీసిన ‘బాజార్’, ఉత్తరప్రదేశ్ మాఫియాను మట్టుబెట్టడం గురించి తీసిన ‘సెహర్’, ఎమర్జెన్సీ నేపధ్యంలో ఢిల్లీ ని ఆధారం చేసుకున్న ‘హజారో ఖ్వాహిషే ఐసీ’, రియల్ ఎస్టేట్ మాఫియా గురించి తీసిన ‘ఖోస్లా కా ఘోస్లా’ వంటివి అప్పుడప్పుడూ వచ్చే సినిమాలే తప్ప సర్వసాధారణంగా హిందీ సినిమాలన్నీ ఏ భాషకూ సంబంధించినవి కావని నా నమ్మకం. They are rootless cinema that uses Hindi as a medium of language that’s all.

ఈ విధంగా హిందీ సినిమా హిందీవాళ్ళ సినిమానే కాదు. మరి దీనికి భారతీయ సినిమా అనే పదం ఎలా ఉపయోగించాలి?

ఈ మొదటి నిర్ణయం నుంచీ ఉదయించేదే మన రెండో ప్రశ్న. “హిందీ సినీరంగానికి భారతీయ సినీపరిశ్రమ హోదాని ఇవ్వచ్చా?” హిందీ కాకుండా దాదాపు అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ సినిమాలు తియ్యబడుతున్నాయి. ముఖ్యంగా చెన్నై లో తమిళ, మళయాళ చిత్రాలు, హైదరాబాద్ లో తెలుగు చిత్రాలు, బెంగుళూరులో కన్నడ,ముంబై లో మరాఠీ మరియూ కోల్కతా లో లో బెంగాలీ,ఒరియా,అస్సామీ చిత్రాలు ప్రముఖమైనవి. ఇందులో అన్ని భాషా చిత్రాలూ తమతమ భాష,సంస్కృతి, రాజకీయాలు,సామాజిక స్థితిగతులకు అద్దంపడతాయి.ముఖ్యంగా తమిళ,మళయాళ, బెంగాలీ,ఒరియా మరియూ అస్సామీ చిత్రాలలోని సింహభాగం ఇలాంటి చిత్రాలే.

తెలుగు సినిమాలు సంఖ్యాపరంగా హిందీ చిత్రాల్ని అధిగమించినా, తెలుగు ప్రజల్ని represent చెయ్యడంలో విఫలమవుతున్నాయన్నది ప్రముఖంగా వినబడే విమర్శ. అందులో చాలా వరకూ నిజం ఉంది కూడాను. హిందీ భాషలోని urban rootlessness ని అత్యంత శ్రద్ధతో అందిపుచ్చుకున్న పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమే కావచ్చు. తమిళ చిత్రరంగంలో కూడా ఈ మూస చిత్రాలు కొన్ని బయల్దేరినప్పటికీ భాషావిస్తృతత్వమో లేక సాహితీ-సాంస్కృతిక బలమో తెలీదుగానీ తమిళ సంస్కృతి తళుక్కు మనిపించే సినిమాలు ఇక్కడ అధికపాళ్ళలో ఇంకా వస్తున్నాయి. సాంకేతికపరంగా తమిళ, తెలుగు భాషా చిత్రాలు హిందీకి తలదన్నే విధంగా ఉన్నా, విషయపరంగా వైవిధ్యంతో నిలిచేవి మాత్రం తమిళ సినిమానే అనుకోవాలి.

కన్నడ-మరాఠీ భాషల్లో అత్యద్భుతమైన సాహిత్యం, నాటకం ఉన్నా, సినిమాలు మాత్రం అలవికాని కారణాలతో ఆ అద్భుతాల్ని అందిపుచ్చుకో లేకున్నాయి. అయినప్పటికీ గిరీశ్ కాసరళ్ళి, గిరీష్ కర్ణాడ్ వంటి దర్శకులు అప్పుడప్పుడూ కన్నడంలో ఆణిముత్యాల్ని రాలిస్తే, ‘శ్వాస్’, ‘డోమివెలీ ఫాస్ట్’ వంటి సంవేదనాత్మక చిత్రాలు మరాఠీలోనూ వెల్లివిరుస్తూనే ఉన్నాయి.సత్యజిత్ రే, మృణాల్ సేన్ ల వారసత్వాన్ని నిలుపుకోలేకపోయినా, అపర్ణాసేన్, రీతూపర్ణ ఘోష్ వంటి దర్శకులు బెంగాలీలో అప్పుడప్పుడూ సినిమాద్వారా తమ భాషాసంస్కృతుల ఉనికిని జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతూ వస్తున్నారు.

హిందీ భాష మాట్లాడే ప్రజలకు ప్రాతినిధ్యం వహించని ఈ చిత్రరంగం, ఏవిధమైన ఇంతటి చరిత్ర,నేపధ్యం, జనం కలిగిన మిగతా భాషల సినిమాని కనీసం గుర్తించని హిందీ చిత్రరంగం, తమ అంతర్జాతీయ అవార్డుల్ని భారతీయం అనడం… మమ్ముట్టి చెప్పినట్లు arrogance - అహంభావం కాక మరేమిటి?

ఈ మధ్యకాలంలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు హిందీ చిత్రరంగంనుంచీ వస్తున్నా, అవి urban కథల్నీ, జీవనశైలినీ,ప్రజల్నీ వారి ఆలోచనలనీ ప్రతిబింబిస్తున్నాయి తప్ప హిందీభాషకు సంబంధించిన native ప్రజల్ని కాదు. ఈ ‘కొత్త మార్పు’ స్వాగతించదగినదే అయినా, హిందీ సినిమా తన పరిధి పెంచుకొని తన ప్రజల్ని represent చేస్తేతప్ప సార్థకత ఉండదేమో. ఈ విధానం ఇలాగే కొనసాగిస్తే ‘బాలీవుడ్’ అన్న పేరేతప్ప ‘హిందీ సినిమా’ అనే అర్థంకూడా నిరర్థకమైపోతుంది. ఇక ‘ఇండియన్/భారతీయ సినిమా’ అనే పేరుకు ఈ చిత్రరంగం కనీస అర్హతనుకూడా తెచ్చుకోలేదు.

****

Thursday, February 19, 2009

తెలుగుకోసం నిరాహారదీక్ష

ఫిబ్రవరి 21 నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ హైదరాబాద్ ఇందిరాపార్క్ లోని ధర్నాచౌక్ లో ఉదయం 9 నుండీ సాయంత్రం 7 గంటల వరకూ సామూహిక నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ ఉద్యమంలో తెలుగును ప్రేమించే అందరూ పాల్గొనొచ్చు.

ఈ ఉద్యమదీక్ష ద్వారా ప్రభుత్వాన్ని కోరదలచిన విషయాలు ఈ క్రింది మూడు.

1. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కావాలి: తెలుగు రాష్ట్రానికి ఒక భాషా విధానం ఉండాలి. తెలుగు రక్షణ, అభివృద్ధి-భాషావిధాన లక్ష్యాలుగా ఉండాలి. తెలుగు భాషా సాహిత్యాల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి. ఈ శాఖను ప్రాధమిక విద్యాశాఖతో పాటూ ఒకే మంత్రి అధీనంలో ఉంచాలి.

2. మాతృభాషలోనే ప్రాథమిక విద్య: ప్రాధమిక విద్యను మాతృభాషలోనే బోధించడం శాస్త్రీయమైన, హేతుబద్ధమైన పద్దతి. ప్రభుత్వ,ప్రభుత్వేతర పాఠశాలలన్నింటిలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని శ్రద్ధతో అమలు చెయ్యాలి.

3. ప్రజల భాషలోనే పరిపాలించాలి: చట్టసభలు, అన్ని స్థాయిల్లో పరిపాలన, న్యాయస్థానాలు తెలుగులోనే నడవాలి. ఇందుకోసం ప్రత్యేకించి తెలుగు ప్రాధికార సంస్థను అన్ని అధికారాలతో ఏర్పరచాలి.


****

Wednesday, February 18, 2009

‘మునెమ్మ’ పై కాత్యాయని పైత్యం


'మునెమ్మ' నవలపై కాత్యాయనిగారి సమీక్ష/విశ్లేషణ కూడా "రాసేవాళ్ళకు చదివేవాళ్ళెప్పుడూ లోకువే" అన్న నానుడిని స్థిరపరిచేదిగానే ఉంది.అందుకే, ఒక సాధారణ పాఠకుడిగా కాత్యాయనిగారు చేసిన ఈ అవమానాన్ని చూస్తూ సహించలేక ఈ స్పందనని అక్షరబద్ధం చేస్తున్నాను.

ఒక రచయిత యొక్క వర్గస్పృహ, సామాజిక ధృక్పధం, భావజాలం తను రచించే రచనలలో ఉండొచ్చునుగాక. కానీ, విమర్శకులు ఒక రచనని బేరిజు చేసేటప్పుడు రచయితనుకాక, ఆ రచనలోని సూచించిన ఆధారాలను మూలం చేసుకుని వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చెయ్యాలి. అలాకాకుండా, ఉరుమురిమి మంగలం మీదపడ్డట్టు మొదటిపేరాలోనే డా" కేశవరెడ్డి "గొప్ప"తనాన్ని ఎద్దేవాచేసి. ఆయన "మార్క్సిస్టు నిష్ట" ను అపహాస్యం చేసి. పేద,దళితసమస్యలనే చురకత్తుల్ని జేబులోపెట్టుకు తిరుగుతాడనే అపవాదు మూటగట్టి. తదనంతరం అసలు విషయాన్ని ప్రారంభించడం కాత్యాయనిగారి bias ను సుస్పష్టంగా ఎత్తిచూఫూతోంది.ఒక పాఠకుడిగా ఇవన్నీ నాకు అప్రస్తుతాలు, అనవసరాలు.

పుస్తకం గురించి చెప్పకముందే కాత్యాయనిగారు విసిరిన మరొ రాయి, రచయిత "స్త్రీ సమస్యలపై సానుభూతితో తాజానవల 'మునెమ్మ' వెలువరించారు" అటూ రచయితకు లేని ఉద్దేశాన్ని ఆపాదించడం. 'జయప్రభ'గారు రాసిన ముందుమాటలో "అయ్యా! మీరచనల్లో స్త్రీపాత్రే ఉండవు. ఉన్నా వాటికి ప్రాధాన్యత ఉండదు. మీధృష్టిలో స్త్రీలకి ప్రాధాన్యత లేదా? లేక స్త్రీలని ముఖ్యపాత్రగా మలచి కథ రాయగల్గిన శల్తిమీకు లేదా? ఆడవాళ్ళంటే మీకేమన్నా భయమా??" అన్న ప్రశ్నలకి సమాధానంగా ఈ నవలను రాయటం జరిగిందన్న సూచన ఉంది. అంతేతప్ప, సమీక్షకురాలు ఆరోపించిన 'ఒంటరి స్త్రీల సమస్యలకు పరిష్కారాన్ని అందిచడానికి పూనుకున్నట్లు'గా కనీసం చూచాయగాకూడా చెప్పడం జరగలేదు.అలాంటప్పుడు, ఇంతటి ఆరితేరిన conclusion కి సమీక్షకురాలు ఎలా వచ్చిచేరారో అర్థంకాకుండా ఉంది.

****

Sunday, February 15, 2009

సిక్కిం సెలబ్రిటీ





నేను సిక్కిం(గ్యాంగ్ టాక్)లో పనిచేసేప్పుడు (2004-05) మా ప్రాజెక్టు "Clean Gangtok campaign" ఒకటి చేపట్టింది. దానికోసం కొన్ని టీవీ కమర్షియల్స్ చెయ్యటానికి ఎవరైనా సెలబ్రిటీ కావాలని చూస్తే సిక్కిం రాష్ట్రం నుంచీ ఇద్దరేఇద్దరు పేరెన్నికగన్న వాళ్ళు భారతదేశానికి తెలుసని చెప్పారు. వారిలో ఒకరు ప్రముఖ బాలీవుడ్ నటుడు డానీ డెంజొప్పా అయితే మరొకరు భారత ఫుడ్ బాల్ టీం కెప్టెన్ బైచుంగ్ భూటియా. అదృష్టవశాత్తూ బైచుంగ్ తన హైపర్ థైరాయిడ్ ట్రీట్మెంట్ తరువాత గ్యాంగ్ టాక్ లో రెస్ట్ తీసుకోవడానికి రావడంతో తనని యాడ్ షూటింగ్ కోసం ఒప్పించి మూడు యాడ్స్ షూట్ చేసాను. ఇలా సిక్కిం సెలబ్రిటీని డైరెక్ట్ చేసే అవకాశం నాకొచ్చింది. ఆ యాడ్ షూటింగ్ ఫోటోలే ఇవి.


****

Tuesday, February 10, 2009

బ్లాగడం ఆపను. కానీ...


ఈ రోజు విశ్వప్రేమికుడు అనే బ్లాగులో ఒక వ్యాఖ్యరాస్తూ, "బ్లాగు వ్యక్తిగత అభివ్యక్తికి వేదికైతే,బయటి ప్రపంచానికి ఒక మినీరూపం బ్లాగుసమాహారాలూ,సంకలినులు.బ్లాగులో ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది.కానీ,కూడలి లేక జల్లెడకొచ్చాక అదొక "సంఘం"లాగా మారి సమస్యలొస్తాయి. అది తప్పదు. అందుకని బ్లాగులు రాయటం సమస్య కాకూడదు. ప్రపంచం కోసం మనం మన వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టకూడదు కదా!" అన్నాను. వ్యాఖ్య రాసిన తరువాత ఒక్క క్షణం ఆలోచించిచూస్తే, వ్యక్తిగత అభివ్యక్తిని అమితంగా ఆకాంక్షించే నేను, ఈ సంఘం చట్రంలో వ్యవహరిస్తూ అప్పుడప్పుడూ నా వ్యక్తిత్వాన్ని పక్కనపెడుతున్నానేమో అనే సందేహం వచ్చింది.


నాకోసం నేను రాసుకునే బ్లాగుకి నేను రాసింది చదివించాలనుకునే కొందరు మిత్రులో లేక యాధృశ్చికమైన పాఠకులో లభించడంలో ఒక అర్థముంది. కానీ, కూడలి, జల్లెడ లాంటి సమాహారాల యొక్క సౌకర్యం మూలంగా తెలుగు బ్లాగులోకమనే ఒక సమాజంలోకి వచ్చిపడ్డాను. నేను రాసింది చదివేవాళ్ళుండటం అదృష్టం అనుకునే సమయంలో స్పందనలు, ప్రతిస్పందనలూ, చర్చలూ,వాదాలూ మరికొన్ని వివాదాలూ కలగలిపి నన్నొక బ్లాగ్సమాజజీవిని చేసేసాయి. నేను రాయాలనుకున్నదే ఇప్పటికీ రాస్తున్నా, "వీళ్ళందరూ చదువుతారు" అనే ఒక ఆలోచన మెదడులో నిక్షిప్తంగా నిలిచి ఉండేది. ఆ ఆలోచన మూలంగా ఎంతో కొంత (అనవసరపు) ఒత్తిడి.


నా ఆలోచనలూ, అభిప్రాయాలూ,భావజాలం ఇతరులపై రుద్దే ఉద్దేశంగానీ ఆశయంగానీ ఎప్పుడూ నాకు లేదు. బ్లాగు రాయడంద్వారా వాటికి జనామోదంగానీ, ప్రజాదరణగానీ మూటగట్టాలనే ఆలోచనా ఎప్పుడూ రాలేదు. స్వీయానుభవంద్వారా సంపాదించిన జ్ఞానమే శాశ్వతమని నమ్మే నేను, ఇతరులు నా అనుభవాల ప్రాతిపదికమీద మారాలనే కోరిక ఎప్పుడూ కలగలేదు.


కాకపోతే ఈ మధ్య నా బ్లాగుపై మొదలైన చర్చలూ, అపోహలూ చూసిన తరువాత. వాటిని చూస్తూ కేవలం నిశ్శబ్దంగా ఉండలేని నా అసహనాన్ని అనుభవించిన తరువాత. ఇవన్నీ కమ్యూనిటీ బ్లాగింగ్ వలన ఏర్పడిన సమస్యలు అనిపించింది. అందుకే కూడలి, జల్లెడలకు తాత్కాలికంగా బైబై చెప్పే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే నా బ్లాగును చదవాలుకునేవాళ్ళకు చిరునామా తెలుసుగనక, పెద్ద తేడా రాదనే అనుకుంటాను.


బ్లాగడం ఆపను. కేవలం కూడలి, జల్లెడల్లో కనిపించడం మాత్రం మానేస్తున్నాను. ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు చేస్తూ చర్చల్లో భాగస్వామిగా కనిపిస్తాను. కేవలం పర్ణశాల కొత్త టపాలు నా బ్లాగు చిరునామాకొస్తే మాత్రమే కనిపిస్తాయి. అంతే తేడా!


****

Sunday, February 8, 2009

ఉరుము ఉరిమి, మంగలం మీద...


శంఖారావం అనే బ్లాగులో ప్రస్తుతం బ్లాగుల్లో మహిళలపై జరుగుతున్న హేయమైన దాడికి పరోక్షంగా నేనే కారణం అంటూ గొప్పగా శెలవిచ్చారు. దానికి ఆ బ్లాగరి సరస్వతీకుమార్ గారిచ్చిన వివరణ చదివి నవ్వుకుని నిన్న పక్కకొచ్చేసినా, ఇప్పుడు వారి సమర్ధింపు వ్యాఖ్య చూసి ఇది రాయక తప్పడం లేదు. దానితోపాటూ'కంప్యూటర్ ఎరా'లో నా బ్లాగు సమీక్ష దగ్గర సీబీ.రావు గారూ జీడిపప్పు గారూ లేవనెత్తిన ప్రశ్నలు చదివి అచ్చెరువొంది, కొంత వివరణని పొందుపరుస్తున్నాను.


సరస్వతీకుమార్ గారు తమ టపా ప్రారంభంలోనే నేను నా బ్లాగులో చేసే వితండవాదం వల్ల ద్వేషాన్ని మూటగట్టుకున్నాని తేల్చేశారు. నా బ్లాగులో నేను రాసే నా నమ్మకాల గురించి ప్రజలు చర్చించడం మాని, నాతో వాదించి, నా అభిప్రాయాల్నీ, నమ్మకాల్నీ మార్చాలని ప్రయత్నిస్తే నేను వాటికి తలొగ్గకపోవడం ఈయన దృష్టిలో వితండవాదం.నా అనుభవాన్నీ, ఆత్మపరిశీలననీ కాదని ఇతరుల వాదనల్ని నా ఆలోచనలకు ప్రాతిపదికగా చేసుకోకపోవడాన్ని వ్యక్తిత్వం అని నేను అనుకుంటాను. అంతే తేడా! నాగురించి నేను బ్లాగులో చెప్పినట్లు సాధన, శోధన చేసిన జ్ఞానం సత్యమని నమ్ముతాను. అదే సమయంలో ఇతరుల జ్ఞానాన్ని గౌరవిస్తానేగానీ నా అనుభవాల్ని విలువలేనివంటే సహించను. సావకాశంగా చర్చించే ఓపిక లేని కొందరు ఒకవేళ నాది వితండవాదమని అనుకున్నా, వారికి నా మీద ద్వేషం పెంచుకునే అవసరం, కారణం, సమయం ఎలా వచ్చాయో నాకు అర్థం కాని విషయం. "If I don't like some one, its my problem" అని నమ్ముతాను. అందుకే నన్ను పనిగట్టుకు ద్వేషించేవాళ్ళ గురించి, నేను ఆత్మపరిశీలన చేసుకునే అవసరమెప్పుడూ రాలేదు.


"అగ్గి" లాంటి జ్యోతిగారూ సుజాతగారూ నాలాంటి "ఇనుముని" చేరి ఇప్పుడు ఈ దుండగుల సమ్మెటపోట్లకి బలవుతున్నారని మరో అభిప్రాయం. అది కేవలం అభిప్రాయమైతే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు వారి వ్యాఖ్య ద్వారా, నాకు మానసిక వ్యధ లేదుకాబట్టి నా పేరుని ప్రస్తావించి, నన్ను నిందించి తద్వారా ఆత్మపరిశీలన కోసం అర్రులుచాస్తూ ఈ టపా రాసినట్లు వారు చెప్పుకోవడం చూస్తే నాకు ఆశ్చర్యంతోపాటూ చిరాకూ కలుగుతోంది.


బ్లాగులోకంలో నాకు కనిపించిన మంఛి టపాని అభినందించడం, నేను విభేధించే చోట నా అభిప్రాయాన్ని వీలైనంత గౌరవప్రదంగా వెళ్ళడించడం, కొత్త బ్లాగర్లకు కొంత ప్రోత్సాహాన్ని అందించే ప్రయత్నం చెయ్యడం నేను మొదట్నుంచీ చేస్తున్న పనులు. క్రితం టపా వరకూ వీరలెవల్లో వాదించుకుని ఆ తరువాత టపాను విపరీతంగా మెచ్చుకున్న సందర్బాలూ ఉన్నాయి. వరుసగా విభేధించుకుంటూ మూలసైద్ధాంతిక స్థాయిలోనే తేడాలున్నాయని గ్రహించి కొన్ని బ్లాగుల్ని కేవలం చదివి ఊరకుండిన ఘటనలూ ఉన్నాయి. ఈ ప్రయాణంలో వ్యక్తులతో సంబంధం లేకుండా ఆలోచలతో,అనుభవాలతోఆభిప్రాయాలతో, సిద్ధాంతాలతో స్నేహపూరిత సంబంధాలూ,సైద్ధాంతిక వైరుధ్యాలూ ఏర్పరుచుకుని జీవితంలో కొంత వైవిధ్యాన్ని అనుభవించాను. ఇలా నేను బ్లాగుసిక(మానసిక అనేపదాన్ని బ్లాగులకిలా అన్వయించుకున్నాను) బాంధవ్యాల్ని పెంచుకున్న బ్లాగర్లలో నా రాతల్ని అభిమానించిన వారూ ఉన్నారు, తీవ్రంగా విభేధించినవారూ ఉన్నారు.


ఇక్కడ చెప్పిన జ్యోతి,కొత్తపాళీ, సుజాత గార్లు ఆ రెండు పార్స్వాల్నీ సమంగా చేసినవారే. నేను చెప్పిన కొన్ని ఆలోచనల్ని outrageous అని ఒక టపాలో అంటే, మరో టపాలోని అభిప్రాయాల్ని interesting అంటూ అభినందించినవారే. మరి మిగతావారిని ఒదిలేసి వీరిని మాత్రం ఈ బ్లాగ్ముష్కరులు టార్గెట్ చేస్తే అందులో నా తప్పేముంది? Guilty by association అని blame చెయ్యడానికి ఇక్కడ సమస్య ప్రారంభమయ్యింది నా బ్లాగు నుంచీ కాదు. నేను ప్రారంభించిన చర్చనుంచీకూడా కాదు. ఇలా సుత్తి నరేష్ కుమార్ ‘పానశాల’లో జరిగినప్పుడు మొదటగా ప్రతిస్పందించింది నేను, ఖండించి ఆపాలని ప్రయత్నించిందీ నేనే. I take that moral responsibility. నా కారణంగా ఎవరూ అవమానింపబడకూడదని అనుకునేవాళ్ళలో నేనూ ఒకడ్ని. అలాగని ఈ ఘటనతో నాకు సంబంధం లేదని ఊరకనే కూర్చోలేదుకూడాను. రవిగారి బ్లాగులో అసభ్యపదజాలంతో రాసిన కాగడా శర్మ, ధూం మచాలేల వ్యాఖ్యలు చూడగానే అది అసహ్యమన్న మొదటి గొంతు నాది. వాటిని తొలగించాలంటూ రవిగారికి వెళ్ళిన మొదటి ఫోన్ కాల్ నాదే. కారణం...ఇలాంటిది ఎవరికి జరిగినా, ఒక వ్యక్తిగా అది సరైనది కాదని నేను నమ్ముతాను గనక.


ఈ context లో నా ఖండనని ఎద్దేవా చేస్తూ, "ఇప్పుడు “ఖండిస్తున్నాను! ఖండించాలి కూడా!” ఆని వ్యాఖ్యలు రాస్తే ప్రయోజనం ఏం ఉంటుంది. గాయపడాల్సిన మనసులు గాయపడిపోయాయి ..జరగాల్సిన నష్టం జరిగిపోయింది...ఎదుటివారి emotions ను అదే పనిగా stir చేస్తే పర్యవసనాలు ఇలానే ఉంటాయి" అంటూ మళ్ళీ మూలకారణం నేను రాజేసిన వివాదాలూ, దానివల్ల చెలరేగిన విద్వేషాలూ అని నిర్ణయించేశారు. ఏమిటి నేను రాజేసిన వివాదాలు? నా టపాలు వివాదాస్పదం అయినంత మాత్రానా, నావాదన అంగీకారం కానంత మాత్రానా ఊరూపేరూ తెలీని ప్రజలు విద్వేషాలు నింపుకుని, బ్లాగులోకంలో అపహాస్యాలూ, అక్రమాలు,అసహ్యాలూ, అసభ్యాలూ సృష్టించుకుంటూ చెలరేగిపోవడం అభినందనీయమా? కనీసం తమ పేరుకూడా ధైర్యంగా చెప్పుకోలేని ఈ రౌడీ మూక emotions కు గౌరవమిచ్చి నేను నా ఆలోచనల్ని బ్లాగులో రాయడం మానేసి తెలుగు బ్లాగుల్ని ఉద్ధరించాలా!


ఈ టపాలో సరస్వతీకుమార్ గారి ఉదారస్వభావం చూడముచ్చటేస్తుంది. ఒకవైపు "ఇక్కడ జరిగిన విషయాన్ని సభ్యత గలిగిన ఎవరూ సమర్ధించరు" అంటూనే "ఇక ఆ బూతుల సంగతంటారా! సాధారణంగా చాలా మంది బాచలర్స్ రూముల్లోనూ, కుర్రాళ్ళ ప్రైవేటు సంభాషణల్లోనూ వాడబడే పదాలే అవి. ఇప్పుడు అవి పబ్లిగ్గా బయటపడేసరికి గగ్గోలు తలయెత్తింది. అంతే తేడా!" అని చాలా హుదాంతంగా ఈ ఉగ్రవాదుల్ని జనజీవన స్రవంతిలో కలిపేసి చప్పట్లు కొట్టేసారు. ఖర్మకొద్దీ ఇంత ఔదార్యం నా సొంతం కాదు. I always try to be true to my own self and will agree and oppose according to my believes and convictions. అందుకే అసభ్యకరమైన వ్యాఖ్యల్ని ఆ రాసినవాళ్ళని ఉద్దేశిస్తూ నా అభ్యంతరాన్ని తెలుపుతూనే, సుజాత గారు "ఖండించరా?" అని అడిగితే, “ఖండిస్తున్నాను! ఖండించాలి కూడా!” అని నా సంఘీభావాన్ని తెలియజెప్పుకున్నాను. కొత్తాపాళీ గారిని విమర్శిస్తూ రాస్తే దాని ఔచిత్యాన్ని సమర్ధవంతంగా ప్రశ్నించే పనీ చేశాను.


ఇలాంటి అనుచిత వ్యాఖ్యల్ని ఎవరు ఎవరిపైన రాసినా వాటిని వీలైనంత అడ్డుకోవడం లేక కనీసం ఈ పోకడల్ని ఖండించడం నేను కొనసాగిస్తాను. ఇక్కడ "కొందరి మధ్యనే కామెంట్లు తిరుగుతుండటం.." అంటూ కొత్తపాళీ,సుజాత,జ్యోతి గార్లు నా బ్లాగుకి regular గా వ్యాఖ్యలు రాస్తారు కాబట్టి, నా మీదున్న కోపం reflected anger గా వారిమీదకు మరలిందని చెప్పబూనడం silly గా అనిపించింది. నా బ్లాగులో ఇప్పటికి 175 టపాలున్నాయి. వాటికొచ్చిన వ్యాఖ్యల సంఖ్య దాదాపు 2,500. బహుశా తెలుగు బ్లాగుల్లో అధికసంఖ్యలో వ్యాఖ్యలు కలిగిన బ్లాగుల్లో నాదొకటి. ఇన్నేసి వ్యాఖ్యల్లో ప్రతి టపాకూ ఆ ముగ్గురూ వ్యాఖ్యలు రాసున్నా అవి 500 ఉంటాయి. మరి మిగతా వ్యాఖ్యలు చేసినవాళ్ళేరి? వారిపైన దాడి జరగలేదే? నేను వ్యాఖ్య రాయని బ్లాగులు, టపాలూ కూడలి, జల్లెడల్లో చాలా తక్కువ. అందరికీ రాసినట్లే ఈ ముగ్గురి బ్లాగుల్లో రాసుంటాను. మరి...కొందరి మద్యనే కామెంట్లు తిరుగుతాయనే మీ అభియోగానికి హేతువెక్కడుంది? అంటే మీరు selective గా ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉండాలి లేక sheer ignorance అన్నా అయ్యుండాలి. Both are no excuses for blaming me as a root cause for all that is happening.


ఇన్ని అపవాదులు నా పేరుపెట్టి మరీ చెప్పేసి, చివరాఖర్న సార్వజనికంగా కొన్ని సూచలు చేసినట్లు 1) "మన అభిప్రాయాలను మన పరిధులలో మనం రాసుకోవచ్చుగానీ, 2)వాటికి నేపథ్యంగా మరే ఇతర ulterior motives ఉండకూడదు" అంటూ మళ్ళీ "కెలకడం" ఈ టపా హైలైట్. వ్యక్తిగత అభిప్రాయాల పరిధులేమిటో? అవి మీరి నేను రాసిన టపా లేమిటో? నేను ఎలాంటి వాదనలు చెయ్యాలో వీరు తమ జడ్జిమెంటులో చెప్పేస్తారు...వాటిని నేను అచ్చుతప్పు కాకుండా ఫాలో అయిపోతే, "తోటి బ్లాగర్ల emotion" ని కెలకని వాడినవుతాను. వీరు కెలికిన కెలుక్కి ఇక్కడ నా ఎమోషన్ మాటేమిటి??? రెండోది, మరే ఇతర లోపాయకారి ఉద్దేశం ఉండకూడదట. నేను రాసె టపాల్లో వీరికి ulterior motives కనపడ్డాయనుకుంటాను. అవేమిటో చెబితే నేనూ తెలుసుకుని ఆనందిస్తాను. ఇదివరకూ చెప్పినట్లు, బ్లాగు రాయడం నేను నాకోసం చేసే పని. నమ్మిన విలువల్ని జీవితంలో ఆచరించే నాకు, ఉద్దేశాలూ,ఆశయాలూ, ఆదర్శాల propagation కోసం బ్లాగుల్ని అడ్డంపెట్టుకోవల్సిన అవసరం లేదు. I have enough places in life to live my ideology. కాబట్టి, రాసే motivationనే తప్ప ulterior motives నా పంధా కాదు.


ఆద్యంతం రెచ్చగొట్టే ధోరణిలో రాసిన ఈ టపాలో "ఎదుటివారి భావాలను సాధ్యమైనంతవరకు రెచ్చగొట్టకుండా టపాలు, వ్యాఖ్యలు రాయాలి" అనేది వీరు చేసిన మరో హాస్యాస్పదమైన సూచన. నేను వ్యస్థనూ, సిద్ధాంతాలనూ, ఆలోచలనూ వ్యక్తిరేకిస్తూనో లేదా సమర్ధిస్తూనో టపాలు రాస్తే అది రెచ్చగొట్టేవి. ఈయనగారు నన్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసి,లేని కారణాలనూ, కల్పిత ఉద్దేశాలనూ అంటగడుతూ రాసే టపా మాత్రం "ఆత్మపరిశీలన" ఉద్దేశంతో రాయబడింది. పైగా "మిగతా వారంతా ఇప్పటికే మానసికంగా బాధపడుతున్నారు కనుక కత్తిగారిని తప్ప మరెవరినీ నేను హైలైట్ చేయలేదు" అని విజయవంతంగా నన్ను గౌరవించడానికి కారణాన్ని తెలుపుకున్నారు. ఏమిటీ విపరీతం? ఏమిటీ దాష్టీకం?


దీన్ని తెలియనితనం అనుకోవాలో లేక మూర్ఖత్వం అనుకోవాలో తెలీని పరిస్థితి. ఆ రెండూ కాకుండా, నేనూ ఒక conspiracy theory ప్రతిపాదిద్ధామని నిర్ణయించుకున్నాను. సరస్వతీకుమార్ గారి బ్లాగును కూలంకషంగా పరిశీలించిన మీదట నాకు కలిగిన అపోహ ఏమిటంటే, ఈ మేధావి గారు తమ మేధనంతా ఉపయోగించి, చాలా విలువైన సమాచారాన్ని టపాల ద్వారా అందిస్తారు. భారతదేశానికి ఎలాంటి వ్యవస్థకావాలో, తత్వశాస్త్రాన్ని తేలిగ్గా ఎలా చెప్పాలో వంటివాటితోపాటూ ‘రెచ్చగొట్టి ఎలా అదుపు చెయ్యాలో’,ఎలా ‘ఇతరుల నిర్ణయాలు నియంత్రించాలో’ చెప్పే వ్యక్తిగతవికాస వ్యాసాలు పుంఖాలు పుంఖాలుగా తెలుగు బ్లాగులోకానికి ధారాదత్తం చేస్తున్నారు. కానీ ఎప్పటిలాగే కమర్షియల్ మాసాలా సినిమాలు తప్ప, అర్థవంతమైన ఆర్టు సినిమాలు చూడని మన తెలుగు జనతలాగానే బ్లాగు జనులుకూడా, కాలక్షేపం బఠాణీల్లాంటి టైంపాస్ బ్లాగుల్ని ఎడాపెడా చదువుతారేగానీ వీరి ఒలికించిన మేధని గమనించరు. అవి వీరి సీరియస్ టపాలకొచ్చే వ్యాఖ్యల్ని బట్టే అర్థమవుతుంది. కానీ వీరు రాసిన కొన్ని టపాలకి మాత్రం వ్యాఖ్యల సంఖ్య రెండంకెలు దాటాయి. Unfortunately ఆ టపాలలో ‘ఎవరు దురహంకారులు?’, ‘దేశభక్తంటే మానవత్వం’ అంటూ నా మీద విరుచుకుపడినవే. అంటే ఇంత మేధావికీ నాలాంటి substance లేనివాడి పేరు చెప్పుకుంటేగానీ....


ఇక ‘కంప్యూటర్ ఎరా’ లో వచ్చిన బ్లాగు సమీక్ష వ్యాఖ్యలకి వస్తాను. వివాదాస్పదం అయ్యింది నా బ్లాగు కాదు. నా బ్లాగు గురించి కొందరు చేసిన ఆగడం వివాదమయ్యింది. నేను ప్రతిపాదించినవి మింగుడుపడని సిద్ధాంతాలని సీబీ.రావు గారంటే, జీడిపప్పు గారు రావుగారితో అంగీకరిస్తూనే అవేవీ పెద్ద గొప్పవి కావని తేల్చేశారు. నాకు అర్థంకాని విషయమల్లా ఒక్కటే నేను కొత్తవీ,గొప్పవీ, మింగుడుపడని సిద్ధాంతాలు రాస్తానని ఎక్కడైనా చెప్పుకున్నానా? లేక నా "పైత్యాన్ని" అందరూ ఒప్పుకోవాలని పట్టుబట్టానా? మరలాంటప్పుడు వివాదాలు చేసింది ఎవరు! అవి గొప్పవో కావో, ప్రత్యేకమైనవో-చెత్తవో నిర్ణయించినవారెవరు? ఎవరికి వారు తమ జడ్జిమెంటులు ఇచ్చేసుకుని అవేవో నా ఉద్దేశాలూ, భావనలుగా ప్రచారం చెయ్యడం ఎంతవరకూ సమంజసం?


Specific గా చెప్పారుకాబట్టి నేను ప్రతిపాదించిన "కాశ్మీర్ నాకొద్దు" సిద్ధాంతం గురించి ఒక మాట చెబుతాను. ఈ ఆలోచన నేను కొత్తగా ప్రతిపాదించినదేమీ కాదు. కొన్ని circles లో ముఖ్యంగా కాశ్మీర్లో జరుగుతున్న పౌర-మానవహక్కుల సమస్యల్ని, కాశ్మీర్ ను అడ్డంపెట్టుకుని ప్రముఖరాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాల్ని ఇన్నాళ్ళుగా దగ్గరగా చూసిన వర్గాల్లో alternate గా వినిపించే అభిప్రాయమే అది. హిందూస్థాన్ టైంమ్స్ వంటి జాతీయపత్రికలో వీర్ సాంఘ్వీ దాదాపు ఇదే అభిప్రాయాన్ని తెలియజెప్పితే లేని వివాదం నేను చెబితే మింగుడుపడనిది అయిపోయిందా? ఈ పరిణామం సమాచారం, పరిణితిలేని కొందరి సమస్యగా అనిపిస్తోందిగానీ నా పైత్యంలా అస్సలు కనిపించడం లేదు. కనీసం ఇప్పటికైనా నేను పెట్టిన లంకె చూసి ఆలోచనాపరిధిని పెంచుకోగలరని ఆశిస్తాను.


నాకూ సరిగ్గా తెలీదుగానీ, దాదాపు రెండు సంవత్సరాలుగా ‘కంప్యూటర్ ఎరా’లో బ్లాగు పరిచయాలు/సమీక్షలు సాగుతున్నాయి. దాదాపు అన్ని సమీక్షలూ బ్లాగు బాగుందని చెప్పి, చదవమని ప్రోత్సహించేవేతప్ప నెగిటివ్ గా చెప్పిన దాఖలాలు లేవు. అలాంటిది, ఇది నా బ్లాగు కాబట్టి "ఆకాశానికెత్తేసారు" "ముఖస్తుతి" గా రాశారు అని సమీక్షకురాలి నిబద్ధతను శంకించడం చూస్తే, అక్కడ బూతులు రాసిన కాగడా శర్మకీ మీకూ పెద్ద తేడా కనిపించడం లేదు. అంతేకాక "అతి ముఖ్యంగా - బ్లాగులోకంలో మీకు ఒక విశిష్టస్థానం, గౌరవం ఉన్నాయి. మీరు కూడా ఇలా వ్రాయడం శోచనీయం" అంటూ, నాగురించి మంచిగా రాయడం వలన వారి గౌరవానికీ, మర్యాదకూ భగం కలుగుతుందనే సూచన చెయ్యడం షాకింగ్. పైపెచ్చు "బ్లాగులోకంలో ఎందరో మహేష్ గారి కంటే మంచి బ్లాగర్లు ఉండగా ఆయనను పొగడడం"(తగదు) అని జ్యోతిగారికీ, "జ్యోతి గారు అంత పెద్ద ఎత్తున ముఖస్తుతి చేయడానికి మీరు తగరు" అని నన్నుద్దేశించి వ్యాఖ్యానించి, ఎవర్ని ఎక్కడ పొగడాలో ఎవర్ని ఏ విషయంలో తెగడాలోకూడా వీరే నిర్ణయించేస్తే ఎట్లా!!!


ఏదిఏమైనా...ఇదింతే. నాకెప్పుడూ పర్ణశాల మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది.



****

Friday, February 6, 2009

తలపు


ఒకసారి ప్రేమించాక
నువ్వేనేననుకున్నాక
తలుచుకోవడం
లేమి ఉనికికి చిహ్నం కాదు

నేనే నువ్వయ్యాక
కలిమి కౌగిలిలో మిగిలాక
నాలో నువు
లేవనుకోవడంలోనూ అర్థం లేదు

అందుకే...
తలుచుకోవడం
మరుపుకు చిహ్నం కాదు
భౌతికంగా నువు లేకున్నా...
నాలోని నీ ఉనికిని అనుభవించేందుకు
ఒక ప్రయత్నం మాత్రమే!


****

Wednesday, February 4, 2009

లక్ ‘భలే’ ఛాన్స్ !

“ఉదయం లేవగానే నేను ఉద్యోగం కోసం వెళ్ళను. నాకు ఇష్టమైన పని (నటన) చెయ్యడానికి వెళతాను. ఇంత అదృష్టం ఎంత మందికి ఉంటుంది?” అని గర్వంగా అనుకుంటుంది కొంకణా సేన్ శర్మ చేసిన ‘సోనా మిశ్రా’ అనే పాత్రధారిణి. ఇదే సినిమాలో “స్టార్ డమ్ ఒక కాక్టైల్ లాంటిది. ఇందులో కీర్తి,డబ్బు,అధికారం కలిసిన మత్తు (నషా) ఉంటుంది. అది చాలా ప్రమాదకరం” అని హీరో విక్రం జైసింగ్ (ఫర్హాన్ అఖ్తర్) తో అంటాడూ షారుఖ్ ఖాన్. బహుశా ఈ రెండూ కారణాలు చాలూ రోజుకు కనీసం వందమంది ఈ సినీపరిశ్రమవైపుగా తమ కలల్ని మోసుకుంటూ ప్రయాణం కట్టడానికి. సినీపరిశ్రమలోని రెండు విభిన్నమైన,విపరీతమైన పార్శ్వాలను సాధికారంగా,సహజంగా అదే సమయంలో వినోదభరితంగాకూడా తెరకెక్కించిన చిత్రం జోయా అఖ్తర్ దర్శకత్వం వహించిన ‘లక్ బై ఛాన్స్’.

చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ ఒక పెద్ద నిర్మాత ‘పెద్ద’ అవకాశం ఇస్తాడని ఆశించే సోనా మిత్రా. హిందీ సినిమా హీరో అవ్వాలంటే నటనతోపాటూ, డ్యాన్సులూ,ఫైట్లూ,హార్స్ రైడింగ్ లాంటి విద్యలన్నీ తెలుసుండాలి కాబట్టి అది హాలీవుడ్ కన్నా కష్టం అని నమ్మే యాక్టింగ్ స్కూల్ నుంచీ, ఒక పోర్టుఫోలియో పట్టుకుని బయటపడి, అవకాశాల కోసం ప్రయత్నించే విక్రం జైసింగ్. ఈ ఇద్దరి జీవితాన్ని తెరపై ఉంచుతూనే బాలీవుడ్ సినీపరిశ్రమ స్థితిగతుల్ని గురించి చర్చించే సినిమా ఇది. కథాపరంగా సోనా- విక్రంల కథే అయినా, ప్రతి సినిమా ఒక టీం ఎఫర్ట్ అన్నట్లు వీరి జీవితాల్ని చాలా శక్తులు,వ్యక్తులు,పరిస్థితులూ, ప్రభావితం చెయ్యడంతో ఒదొక testimony on present day Hindi cinema గా అవతరిస్తుంది.

పూర్తి సమీక్ష కోసం నవతరంగం చూడండి.