Monday, March 2, 2009

ఆంధ్రజ్యోతిలో ‘కలగూరగంప’ పరిచయం


బ్లాగుల్లో నేను క్రమం తప్పకుండా చదివే వాటిల్లో ఒకటి కలగూరగంప. నేను రాసిన ఆ బ్లాగు పరిచయం ఆంధ్రజ్యోతిలో ఈ ఆదివారం ప్రచురితమయ్యింది. అక్కడ చదవని వారికోసం ఇక్కడ....http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2009/mar/1navya3

పత్రికలో ప్రచురించిన దానితోపాటూ, నేను రాసుకున్న మరికొంత ఈ క్రింద చూడండి.

"నిజాయితీ లేని జాతికి ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీలున్నా ఉపయోగమేముంది ? ఈ దేశంలో నిజాయితీ, ముక్కుసూటిదనం, ప్రొఫెషనలిజం అనేవి ఇంత అరుదైన బ్రహ్మపదార్థాలుగా మారిపోవడానికి కారణమేంటి ? ఉన్నవాడూ నీచంగానే ప్రవర్తిస్తూ, లేనివాడూ నీచంగానే ప్రవర్తిస్తూ - ఇలా ఎంతకాలం ?" అంటూ 'సత్యం' ఘటనపై తన సూటైన ప్రశ్నల్ని వినిపిస్తాయి. "ఫెమినిస్టుల కథలో ఎల్లప్పుడూ ఆడదే ఏకకాలంలో కథానాయకుడు, కథానాయిక కూడా ! అలాగే ఆమె పాలిట మగవాడే ఎల్లప్పుడూ ఏకకాలంలో ప్రతినాయకుడు, హాస్యగాడు అవుతాడు. ఒక చెడ్డమగవాడు యావన్ మగజాతికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే ఒక మగవాణ్ణి చూసి అసలు మగజాతంటే ఏంటో ఇట్టే గ్రహించిపారెయ్యొచ్చు. కాని చెడ్డదని బయటపడ్డ ఒక ఆడది అందరు ఆడవాళ్ళకీ ప్రతినిధి కాజాలదు. ఆమె స్త్రీజాతికే కళంకం. ఎందుకంటే మిగతా ఆడవాళ్ళంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళందరిలో ఒక తల్లినీ, చెల్లినీ మనం చూసుకోవాలి. వాళ్ళలో చెడ్డవాళ్ళు అరుదుగా ఉంటారు. ఒకవేళ ఏ స్త్రీ అయినా చెడ్డదైతే అందుకు మగవాడిదే బాధ్యత." అంటూ, ఫెమినిజంలోని నిజాల్ని నిగ్గదీస్తూ వ్యాసమొకటి పలకరిస్తుంది.

"
ఇది(సినిమా) వ్యాపారమైతే, అన్ని వ్యాపారాల్లో లాగే దీంట్లో కూడా ఒక ఉత్పత్తి, దాని అమ్మకందారు, కొనుగోలుదారు, ధరకు తగ్గ నాణ్యత, మన్నిక వగైరా అన్నీ చూసుకోవాలి కదా ! ఉత్పత్తిలో కొత్తదనమేదైనా ఉండాలి కదా ! మఱి ఏముంది ? అంటూ సినీపరిశ్రమ మూలసిద్ధాంతాల్ని అధారిటీగా ఆక్షేపించే పోకడలు కనిపిస్తాయి. "కెరియర్ కి పనికిరాని చదువులు వద్దని పెద్దపెద్దవాళ్ళే అంటూంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదొక రకం మానసిక నీచత్వాన్ని పనిగట్టుకుని ప్రమోట్ చెయ్యడంలా ఉంది. ఒకవేళ ఇంజనీరు కంటే రాళ్ళు కొట్టేవాడికి ఎక్కువ జీతం వచ్చే మాటైతే అందఱూ పొలోమని పోయి రాళ్ళు కొట్టే డిగ్రీకి లాంగ్‌టెర్మ్ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధపడే వాతావరణం ఈ దేశంలో ఉంది." అంటూ మన వేలంవెర్రి విద్యావిధానాన్ని తూర్పారబడతాయి. "వ్యక్తిత్వంలో హేతుబద్ధత ఎంత పాత్ర పోషిస్తుందో అహేతుకత్వం కూడా అంతే పాత్ర పోషిస్తుందని నా అభిప్రాయం. ఎల్లవేళలా తనని తాను పక్కాగా హేతుబద్ధంగా నడుపుకునేవాడు తుదకు మరమనిషి కంటే పెద్ద భిన్నంగా పరిణమించడు. అతని అనుభూతుల క్కూడా మీటలూ, మీటర్లూ, గంటలూ, గడియారాలూ ఉంటాయి. మనుషులిలా మరమనుషులుగా మారిపోతారేమోననే భయంతోనే కాబోలు భగవంతుడు వారి వ్యక్తిత్వాల్లో బొత్తిగా హేతువుకు అందని వాంఛల పార్శ్వాన్ని ఉద్దేశ ఫుర్వకంగా జంతువుల కంటే చాలా హెచ్చు మోతాదులో మిశ్రితం చేశాడని తోస్తుంది. లేకపోతే జీవితం పట్ల విసిగి వేసారి మానవజాతి అంతా ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్నా చేసుకుని ఉండేది." అంటూ ఒక వేదాంత చర్చకు ఆహ్వానం పలుకుతుంది. ఇలా ఎన్నోఎన్నెన్నో వైవిధ్యాలు అక్షరరూపం దిద్దుకునే బ్లాగు "కలగూరగంప"(http://www.tadepally.com/). పేరుకుతగ్గ బ్లాగు...బ్లాగుకు తగ్గ పేరు.

"ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక దేశభక్తియుత బ్లాగు" అని బ్లాగ్ముఖంగా ప్రకటించుకున్న ఈ బ్లాగులో ప్రకటనకు తగినట్లు సనాతన హిందూసాంప్రదాయాన్ని అత్యంత ప్రేమగా, సాధికారంగా, నమ్మకంగా, అప్పుడప్పుడూ తీవ్రంగా బ్లాగుబద్ధం చేస్తుండే బ్లాగు ఇది. ఉదాహరణకు "మన భాష, సంస్కృతి, మతమూ, దేశభక్తి ఈ గడ్డపై స్వతంత్రంగా జీవించేవారి మూలంగానే ఇప్పటి దాకా నిలబడుతూ వచ్చాయి. స్వతంత్రమైన వనరులున్నవారి మూలంగాను, వాటిని నిలబెట్టుకున్నవారి మూలంగాను అవి నిలబడుతూ వచ్చాయి. అంతేగాని ఉద్యోగాల పేరుతో ఇతరులకు ఉపయోగపడ్డంలోనే అహర్నిశలూ తలమునకలైనవారి వల్ల కాదు. దేశం బహుళ జాతీయ సంస్థల చేతుల్లోకి పోతోందని గగ్గోలు పెట్టేవారున్నారు. మనం ఉద్యోగాల పేరుతో బానిసలమైనప్పుడు, అందుకోసం మన పిల్లలకు పసితనం నుంచి తర్ఫీదు కూడా ఇస్తున్నప్పుడు ఇలా గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. మనలో ప్రతి ఒక్కడూ వ్యక్తిగతంగా కట్టుబానిసైనప్పుడు మనందఱి యొక్క సమష్టి స్వరూపమైన దేశం మాత్రం స్వతంత్రంగా కొనసాగడం జరగదు" అంటూ ఈ బ్లాగరి నూరిపోసే స్వదేశీ ఉద్యమ భావన తన ప్రకటనను సార్థకతను చేకూర్చేదే!

ఇంత విస్తృత విషయపరిజ్ఞానం, ధృఢవిశ్వాసం తొణికిసలాడే బ్లాగు రాసేది తా.ల.బా.సు. గా బ్లాగుప్రపంచంలో పరిచయమున్న తాడేపల్లి లలితాబాలసుబ్రమణ్యం గారు. హైదరాబాదు నగర వాస్తవ్యులు. ఫోకస్ అడ్వర్టయిజింగ్ అనే సొంత సంస్దను నడుపుతుంటారు. వృత్తితోపాటూ అంతర్జాలంలో తెలుగీకరణను ఒక ప్రవృత్తిగా స్వీకరించి కృషి చేస్తున్నారు. వారి బ్లాగులో కూడా ఒక పక్క కంప్యూటర్ కు సంబంధించిన అమరికలు - settings,అంతర్జాలం - internet,అంతర్జాల అనుసంధానం, (జాలసంధానం) - internet connection వంటి ఆంగ్లపదాలకు తెలుగు అర్థాలు పెట్టడం వీరి అభిరుచికీ,తెలుగు భాషమీద ప్రేమకీ ఒక ఉదాహరణ అనుకోవచ్చు. అందుకే తెలుగు బ్లాగుల్లో ఇదొక ప్రత్యేకమైన బ్లాగు. చదివి ఆనందం,ఆవేశం తోపాటూ విజ్ఞానాన్నీ సమపార్జించుకోదగిన బ్లాగు.


****

5 comments:

$h@nK@R ! said...

Its very impressive...! Congratulations !!!!

పరిమళం said...

మీకూ ,తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారికీ అభినందనలండీ !

Anonymous said...

Mahesh,
Please read this article

The New Nationalist Movement in India by Jabez T. Sutherland

http://www.theatlantic.com/doc/190810/nationalist-india

This will give you clarity on british rule in India.

Anonymous said...

Sometime back you told that " I am not writing my comments in the kalagura gampa blog because tadepally gaaru started mentioning "ఇది సనాతన హిందూసాంప్రదాయిక, ఆస్తిక దేశభక్తియుత బ్లాగు". I am wondering how come you wrote about that blog in Andhrajyothy. Kalaa leka nijamaa?

కత్తి మహేష్ కుమార్ said...

@అనామకుడు:తాడేపల్లిగారి బ్లాగులోని కొన్ని విషయాల్ని నేను తీవ్రంగా విభేధిస్తాను. మరికొన్ని విషయాల్ని అస్సలు అంగీకరించను. కాకపోతే వారు తన నమ్మకాల్ని బాహాటంగా ఒక భావజాల చట్రంలో బంధిస్తూ statement ఇచ్చారు గనక, అలాంటి వ్యాసాలు తను రాస్తే నేను వాటికి ప్రతికూల వ్యాఖ్యలు చెయ్యను. అంతమాత్రానా ఆయన రాసేవన్నీ నాకు ఇష్టం లేదనీ కాదు. నేను వారి బ్లాగు చదవననీ కాదు. ఇతరులు ఆ బ్లాగు చదవకూడదనే ఆకాంక్ష అస్సలు లేదు. కాబట్టే వారి బ్లాగు పరిచయం రాశాను. ఇందులో వైరుధ్యానికి అవకాశం ఎక్కడుంది?