Thursday, March 26, 2009

చలం ‘మైదానం’ లో...

ఈ మధ్య నేను రాసిన ‘చలం గురించి నేను’ అనే టపా చదివి మిత్రుడొకరు ‘చలాన్ని అనుభవిస్తాను. చర్చించను. అనే వాడివి, హఠాత్తుగా ఈ మూర్ఖత్వం ఎందుకు చేసావ్?’ అని ప్రశ్నించాడు. నిజానికి నేను నా బ్లాగులో రాసింది ప్రత్యేకమైన టపా కాదు. ఒక బ్లాగులో చలం గురించి జరిగిన చర్చల్లో నేను చేసిన వ్యాఖ్యల్ని, ఒకటిగా కూర్చిపెట్టుకునే ప్రయత్నం మాత్రమే. కానీ ఆ మిత్రుడు, ఆ తరువాత అన్న మాటలు నన్ను మరింత ప్రభావితం చేసాయి. ‘కనీసం ఒంటరిగానైనా, కనీసం చీకటి గదిలోనైనా, తమ నగ్న దేహాన్నీ, మనసునీ ఆసాంతం పరికించి,పరీక్షించి, ప్రశ్నించికోని ఈ జనాలకి చలాన్ని చెప్పాలనుకోవడం మూర్ఖత్వం.చెప్పినా అర్థం చేసుకుంటారనుకోవడం దురాశ. అర్థం చేసుకున్నా, ముసుగుల్లో బ్రతికెయ్యడానికి అలవాటుపడ్డవారు అంగీకరిస్తారనుకోవడం వెర్రితనం.’ ఈ మాటలు విన్న తరువాత నా మూర్ఖత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలనే కోరిక కలిగింది.

నేను అనుభవించిన చలంని, తార్కికంగా అక్షరాల్లోకి కుదించాలనుకోవడం నా సామర్ధ్యాన్ని మించిన పని. ఇలాంటప్పుడే భాషలోని మితి,పరిమితులు తేటతెల్లమవుతాయనుకుంటాను. అనుభవాల్ని అక్షరీకరించడం, ఆలోచనల్ని తెలియజెప్పడమంత తేలిక కాదు. మనసునీ మెదడునీ ఏకకాలంలో ఆక్రమించి, హత్తుకుని, కుదిపివేసి, జీవితానికి కొత్త అర్థాల్ని అందించే అనుభవాల్ని పదాల్లో చెప్పాలంటే...చలం కావాలి. అది తనకే సాధ్యం. మరి చలం పదాల్ని అనుభవించి ఆ ఆనుభవాన్ని ఆలోచనల్లో జీవించి, ఆ జీవితసారాన్ని మళ్ళీ చెప్పాలంటే?!?

అందుకే, చలంను అనుభవించగలను గానీ చర్చించలేనని ఎప్పుడూ భీష్మించుకు కూర్చున్నాను. కానీ, అనుభవాల్ని కాకుండా, ఆ అనుభవానికి నేను వేసుకున్న ప్రాతిపదికని పరిచయం చెయ్యడంలో తప్పులేదనిపిస్తోంది. ఏదైనా సాహిత్యాన్ని చదివేటప్పుడు మన పూర్వజ్ఞానం, అప్పటి మన:స్థితి, సామాజిక స్థాయిని బట్టి కొన్ని ప్రాతిపదికలు ఏర్పరుచుకుని ఒక తార్కికనమూనా (logical framework) ఆధారంగా అస్వాదిస్తాం,అర్థం చేసుకుంటాం, అనుభవిస్తాం. అర్ధాన్నీ,ఆస్వాదననీ మళ్ళీ ఆలోచనలుగానో, అభిప్రాయాలుగానో విడమర్చి విశ్లేషించొచ్చుగానీ, అనుభవాల్ని articulate చెయ్యాలంటే కష్టం. ఈ హేతువు ఆధారంగా చలం ‘మైదానం’ ని అర్థం చేసుకోవడానికీ,ఆస్వాదించడానికీ నేను ఏర్పరుచుకున్న తార్కికనమూనాని పరిచయం చేస్తాను.

మైదానం - ఒక సర్రియల్ (surreal ) నవల:
Surrealism was a means of reuniting conscious and unconscious realms of experience so completely, that the world of dream and fantasy would be joined to the everyday rational world in "an absolute reality, a surreality."
- The Surrealist Manifesto, André Breton,1924

మైదానం నవల్లో ఏది నిజం, ఏది కల్పన, ఏది కల, ఏది ఆలోచన,ఏది అపోహ అనేవి ప్రశ్నార్థకాలు. కానీ, అన్నీ మనకు తెలిసిన లోకంలో జరుగుతున్నట్లుగానే భ్రమింపజేస్తాయి. ఈ కారణంగా కథలో జరుగుతున్న "కాల్పనిక వాస్తవాన్ని" భౌతికనిజంగా పరిగణించి, చలం పంధా బరితెగించిన పంధా అని అప్పటికే నిర్ణయించేసిన చాలా మంది పాఠకులు, ప్రతిస్పందించండం మొదలుపెడతాం. ఒకసారి ప్రతికూల ప్రతిస్పందన మొదలైతే, రసస్పందనకు మిగిలింది అభాసుపాలే.అందుకే,ఈ సాహితీప్రక్రియ మూలాల్ని లేక ఉద్దేశాల్ని గ్రహించకుండా ఈ నవలను సాధించడం అపోహల్ని కలిగిస్తుందేతప్ప ఆర్ధ్రతను కాదు.

ఈ నవల, నాయిక రాజేశ్వరి మానసిక చేతన(conscious),ఉపచేతన(subconscious),అచేతన (unconscious)ల అభివ్యక్తి. రాజేశ్వరి అమీర్ తో నివసించే మైదానం అణచివేయబడ్డ శారీరక,మానసిక వాంఛల ఫలసిద్ధికి సాక్షాత్కరించిన మాయాలోకం . అదొక ప్రతీక.అదొక బలీయమైన కోరిక. అదొక కాల్పనికవాస్తవం.అమీర్, మీరాలు రాజేశ్వరి మనోజనిత కాంక్షలు.

ఒక స్త్రీగా రాజేశ్వరి లోని శారీరక చైతన్యానికి సరిదూగే పురుషశక్తికి అమీర్ ప్రతీకైతే, మీరా స్త్రీలోని మాతృహృదయ పరిపూర్తికి చిహ్నం. స్త్రీలోని మూలభావనలైన (basic instincts) ప్రేమవాంఛ, మాతృకాంక్షల కథ మైదానం.

రాజేశ్వరి-అమీర్ ల కలయిక, సంసారం-దాంపత్యం- నాగరికత మాటున అణవేయబడుతున్న శారీరక చైతన్యాన్ని అందుకోవడానికి, హిపోక్రటిక్ సామాజిక విలువల కూర్పుని కాలదన్ని, కేవలం ప్రాధమిక (rudimentary) కాంక్షల్ని ఆకాంక్షించే విప్లవానికి సంకేతం. మీరా తో రాజేశ్వరి ప్రేమ, తన వంచిత మాతృకాంక్షను ఆవిష్కరించే ప్రయత్నం. మీరా రాజేశ్వరికి కొడుకు,తమ్ముడు, ప్రేమికుడు, ఆరాధకుడు,రక్షకుడు. అమీర్ - మీరా- రాజేశ్వరిల మధ్యజరిగే ప్రేమ-ద్వేషం-మళ్ళీ ప్రేమలను అర్థం చేసుకోవాలంటే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ ( psychoanalysis ) సహాయం తీసుకోకతప్పదు.

చలం ఇందులో స్త్రీస్వేఛ్ఛని ప్రబోధించలేదు. ఎవర్నీ ఇలా సంసారాలు వదిలి కాల్పనిక మైదానాల కోసం పరిగెత్తమని చెప్పలేదు. అణగదొక్కబడిన స్త్రీత్వం సాక్షిగా, ఒకధీటైన సమాంతర ప్రపంచాన్ని సృష్టించి అందులో ఆ స్త్రీని సంతుష్టురాల్ని చేసే ప్రయత్నం చేసాడు. సంసారాలూ,దాంపత్యాలూ ఇలా ఏడిస్తే, స్త్రీలో జరిగే మానసిక విచ్ఛిన్నతి (fragmented consciousness)ని ఆవిష్కరించి, సమాజానికి ఒక హెచ్చరిక జారీచేసాడు.

ఈ సిద్ధాంతాలనూ, సాహితీప్రక్రియలనూ,ఆలోచనా విధానాలనూ నేపధ్యంగా తీసుకోకుండా మైదానాన్ని చదివి అర్థం చేసుకోవడం కష్టమయితే, అస్వాదించి, అనుభవించడం అసంభవం. చలం రచనల మీదున్న అపోహని ప్రాతిపదికగా తీసుకుని లేక "సామాజిక సృహ" అనే మరొక హిపోక్రటిక్ టూల్ ని ప్రమాణంగా తీసుకుని మైదానాన్ని బేరీజు చెయ్యాలని చూసినా మిగిలేది అనుభవం కాదు అపభ్రంశమైన మానసిక సంతులన.

****

10 comments:

సుజాత said...

మీరింతకు ముందు రాసిన టపా మీ వ్యాఖ్యల సమాహారమని గమనించాను.

నాకు మైదానం కంటే చలం ఇతర రచనల్లో ఆయన స్త్రీల కోసం పడిన ఆవేదన స్పష్టంగా కనపడుతుంది. బ్రాహ్మణీకంలో సుందరమ్మ ను చూశారా? ఎంతగా exploitation కి గురవుతుందో? అరుణ, శేషమ్మ? రాజి? మణి?

రాజేశ్వరి కంటే వీళ్లందరినీ ఎక్కువ ఇష్టపడాలనిపిస్తుంది చలం దృక్కోణంలో! మైదానం నిజంగానే ఒక అధివాస్తవిక(surrelasitic) నవల. అందుకే అందరికీ అర్థం కాదు. అసలు ఆయన శైలే చాలామంది ఇష్టపడరు.(అర్థం కాకే కావొచ్చు)

చలం నిజంగానే ఒక అపురూపమైన మనిషి. ఇక ముందెన్నడూ కనిపించని మనిషి కూడా!

బుజ్జి said...

malli jalledaloki vachinattunnaru :)

భవాని said...

ఇన్నాళ్ళూ 'మైదానం' అర్ధంకాలేదు. మీరు వేరొక బ్లాగులో చేసిన వ్యాఖ్యల ద్వారా కొంత అర్ధమయ్యింది. ఇప్పుడు మరికొంత. కృతజ్ఞతలు.
మీరు చెప్పినట్లుగానే నేను వాస్తవ ప్రపంచ విలువలతోనే మైదానాన్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నించాను. నాకు చలంపై కోపమొచ్చింది కూడా. రాజేశ్వరి భర్తకీ, అమీరుకీ స్వభావంలో పెద్ద తేడా కనిపించకపోవటమే దీనికి కారణం. ఒకరిని ఎదిరించిన ఆమె ఇంకొకరు అదే విధంగా ప్రవర్తిస్తే ఎందుకు భరించినట్లుగా చెప్పారు అని చాలా కోపం వచ్చింది.
రాజేశ్వరి మావయ్య వాళ్ళింటికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించే తీరు చదివి భయపడ్డాను కూడా.
But now i realize that it's a parallel world where the rawness of the thoughts are explored.

భవాని said...

*rawness of thoughts are
rawness of thoughts is

రవి said...

క్రితం టపాలో మీరు ఎరుర్కున్న ప్రశ్నకు నేను ఇలాంటి చిన్న సమాధానం చెబుదామనుకున్నాను. మీ సమాధానం బావుంది. అయితే
ఎంత చెప్పినా, యండమూరి అదేదో నవల్లో అన్నట్టు, "కొన్ని ఫీలింగులకు లాజిక్కులుండవు. అంతే!".

chakri said...

మైదానం అనే నవల కామానికి,, ఆకర్షణకి ,, మొహానికి. ప్రేమకి..మధ్య ఒక మనసు ఊగిసలాట..
ఆకర్షణా కామం తో మొదలై.. మోహము.. ప్రేమ వైపు పయనిస్తుంది..

Brahma Mahesh said...

చాలా బాగుంది

కత్తి మహేష్ కుమార్ said...

"మహేష్ వి చలం వ్యతిరేక రాతలు" అని భీష్మించిన మార్తాండ ఈ టపా చూసినట్లు లేడే!

|||||murali||||| said...

Till now i dnt knw abt....chelam....

but i wanna knw him...through his novels......

cn u plz suggest me....some books

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత: చలం మిగతా రచనలకీ మైదానానికీ నాకక్కడే తేడా కనిపిస్తుంది.సుందరమ్మ,అరుణ, శేషమ్మ, రాజి, మణి కన్నా రాజేశ్వరి, రమణ లు విప్లవాత్మకంగా విభిన్నం. మిగతాపాత్రలు సజీవమైన సాక్షాలుగా అనిపిస్తే రాజేస్వరి ఈ సమాజానికి ఒక వార్నింగ్ అనిపిస్తుంది.రమణ మగాడికొక ఛాలెంజ్ అనిపిస్తుంది.

నిజంగా చలం అపురూపమైన మనిషి. విశ్వసాహితీ క్షేత్రంలో నిలబడిన ఒకేఒక తెలుగు రచయిత.