Wednesday, September 30, 2009

వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)


ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ‘S picture‘ వైవిధ్యానికి పట్టంగట్టే నిర్మాణసంస్థగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నూతన చిత్రం, ‘అరివళగన్‘ దర్శకత్వం వహించిన “ఈరమ్“. ఈరమ్ అంటే తెలుగులో తడి లేదా చమ్మ అని అర్థం.

ఒక అపార్ట్మెంట్ బిల్డింగులో రమ్య(సింధు మీనన్) అనే గృహిణి బాత్ టబ్ లో మునిగి చనిపోతుంది. అది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీస్ పరిశోధన ప్రారంభమవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ రమ్య ఒకప్పుడు ప్రేమించిన వాసుదేవన్ (ఆది). రమ్య సూసైడ్ నోట్ లభించడం, చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు రమ్య చావునొక ఆత్మహత్యగా నిర్ణయిస్తారు. కానీ రమ్య వ్యక్తిత్వం తెలిసిన వాసుదేవన్ కు అది ఆత్మహత్య అని నమ్మబుద్ది కాదు. ఒక మిత్రుడి సహాయంతో సొంతంగా తనే ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలెడతాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ లో రమ్యతో పరిచయమున్న ఒక్కొక్కరూ చంపబడ్డం మొదలౌతుంది. ఈ అందరి చావులోనూ ఉపయోగపడిన ఆయుధం …నీళ్ళు…తడి.

రమ్య ఎందుకు చనిపోయింది? రమ్య చావుకీ ఈ చావులకీ మధ్యనున్న సంబంధం ఏమిటి? వాసు ఈ రహస్యాన్ని బేధిస్తాడా అనేది మిగతా కథ.

ఈ మధ్యనే నవతరంగంలో సినిమాల మూసల (Genre – జాన్రా) గురించి చర్చలు జరిగాయి. ఆ నేపధ్యంలో చూసుకుంటే, ఈ సినిమాని మర్డర్ మిస్టరీతో మొదలై హృద్యమైన ప్రేమకథగా రూపాంతరం చెంది, హఠాత్తుగా మానవాతీతశక్తుల సినిమాగా పరిణితిచెందే ఒక ధిల్లర్ అనుకోవచ్చు. ఇన్ని మూసలు కలిపిన మసాలా మిక్స్ లాగా అనిపించినా, అన్ని మూసల్నీ సరైనపాళ్ళలో కలిపి కన్విన్సింగా చెప్పగలగటం వలన ఒక మంచి సినిమాగా తయారయ్యింది.ముఖ్యంగా హారర్ ఎలిమెంట్ ని ధ్రిల్లర్ పంథాలో నడిపి, ఎక్కడా జుగుప్స కలగకుండా దర్శకుడు చూపించిన విధానం అభినందనీయం.

Tamil-Movie-Eeram-Stills-05భద్రాచలం లాంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సింధు మీనన్ (చందమామ ఫేమ్), రమ్యపాత్రలో చాలా మంచి నటన కనబరిచింది. చాలా అందంగా కూడా కనిపించింది. ‘మృగం’ చిత్రంలో తన భీకరమైన నటన కనబరిచిన ఆది(దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) చాలా అండర్ ప్లే ఉన్న వాసుదేవన్ పాత్రలో రాణించాడు. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. రమ్య భర్త ‘బాల’గా నందా నటన ఆకట్టుకుంటుంది. రమ్య చెల్లెలిగా శరణ్య మోహన్ పాత్రోచితంగా నటించింది. ముఖ్యంగా రమ్య తనని ఆవహించినప్పుడు చేసిన నటనని మెచ్చుకోవచ్చు.

సినిమాలో చాలా భాగం వర్షం పడుతూవుంటుంది. ఆ మూడ్ ని సినెమాటోగ్రఫీ విభాగం(మనోజ్ పరమహంస) మనసుకి హత్తుకునేలా చిత్రీకరించింది. నేపధ్యసంగీతం చాలా బాగున్నా, పాటల్లో కొంత మోనాటనీ ధ్వనిస్తుంది. ఇది ఔట్-అన్డ్-ఔట్ దర్శకుడు ‘అరివళగన్‘ చిత్రం. భారతీయ సినిమాల్లో ధ్రిల్లర్లు వచ్చేదే చాలా అరుదు. అదీ ఇంత మంచిది రావడం అత్యంత అరుదు. కాబట్టి… అర్జంటుగా చూసెయ్యండి.

****

Tuesday, September 29, 2009

పరమసత్యాన్ని మించిన సత్యం !!!


ఈ టపా గురించి కొన్నివ్యాఖ్యల్లో ఎవరో అజ్ఞాత reference ఇస్తుంటే...ఇంకోసారి పోస్టు చేస్తున్నా... ఈ టపా ఆగష్టు,2008 లో మొదటిసారిగా ఈ బ్లాగులో పోస్టు చెయ్యబడింది.

సిద్దార్థుడు నిద్రపోతున్న భార్యాపిల్లల్ని వదిలి సత్యశోధనకై అడవుల్లో ప్రయాణించి ‘గయ’ చేరుకున్నాడు. బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది. ‘పరమసత్యం’ (Ultimate Truth) అవగతమయ్యింది. సత్యాన్ని కనుగొన్న ఉత్సాహం... ఎవరికైనా తెలియజెప్పాలన్న ఆతృత. సారనాధ్ తన మొదటి ప్రవచనానికి సిద్దమయ్యింది. ఐదుగురు శిష్యులు గౌరవంగా చేతుజోడించి ఎదురుగా నిల్చున్నారు.

"నిజంగా సత్యాన్ని అవగతం చేసుకుని బుద్ధుడి మారిన సిద్దార్థుడికా ఆ గౌరవం? లేక, ఇన్నికష్టాలు అనుభవించి రాజ్యాన్నీ, పెళ్ళాంపిల్లల్నీ అంత:పురంలో వదిలి అడవులపాలై తిరిగివచ్చిన ఒక సాధకుడిగా ఆ గౌరవం?" ఈ ప్రశ్నకి సమాధానం బుద్ధుడితో సహా ఎవరికీ తెలీదు.



సత్యాన్ని తెలుసుకోవడంద్వారా అనుభవించిన అలౌకిక ఆనందాన్ని, అవగతం చేసుకున్న పరమసత్యాన్ని ఎలా మాటల్లో చెప్పాలో బుద్దుడికైనా తెలిసేనా ! అనుభవానికి పదాలుకూర్చడం ముక్కుమూసుకుని ధ్యానిస్తే వచ్చేనా! మెల్లగా పెదాలు విడిపడ్డాయి...జీవితం దు:ఖమయం...కోరికలు దు:ఖానికి మూలకారణం...కోరికల్ని త్యజిస్తే దు:ఖాలు అంతమైపోతాయి. ఎదురుగా నించున్న శిష్యుల్లో ఎలాంటి చలనమూ లేదు. కనీసం కళ్ళలో ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న ఆనందంకూడా ప్రతిఫలించడం లేదు. "ఇదేకదా నేను ఇన్నాళ్ళ ధ్యానంలో తెలుసుకున్నది. మరి సత్యం మరెవ్వరికీ అర్థం కాదా?" ఒక self doubt ఉదయించింది. పరమసత్యం అవగతమైనా, సందేహాలు తప్పవా! ఏమో!



పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే అందరూ ధ్యానం చెయ్యాలా? దేన్ని ధ్యానించాలి? ఎంతకాలం ధ్యానించాలి? ఎలాధ్యానించాలి? ఎన్నో ప్రశ్నలు. తనే విడమర్చి చెబితే ! ప్రయత్నించాడు. చిన్నచిన్నఊర్లూ, పెద్దపెద్ద పట్టణాలూ అన్నీ తిరిగాడు. ప్రజలందరికీ ఈ సత్యాన్ని విప్పిచెప్పాడు. కొందరు అర్థమయ్యిందని తలలూపారు. శిష్యులు మరింత శ్రద్ధగా తలాడించారు. మరికొందరు, "ఐతే" అన్నట్లు ప్రశ్నార్థకంగా ముఖాలుపెట్టారు.

నిజమే, "ఐతే ఏమిటి?", "ఐతే ఎలా?" అప్పుడే తను పొందిన జ్ఞానంలోంచీ మరో వెలుగురేఖ ఉదయించింది. ‘అష్టాంగమార్గం’. ఎలా కోరికల్ని త్యజించాలో తెలియాలి. దానికి మార్గం అవగతం కావాలి. అయ్యింది. అదే మరోక మూలసూత్రం. మొదటి మూడింటితో కలిపి ఇప్పుడు నాలుగు.దు:ఖాలనుండీ విముక్తికి ఒక మార్గముంది, అదే అష్టాంగమార్గం. సత్యావగాహన (Right Understanding), సత్యాలోచన (Right Thought), సత్యవాక్కు (Right Speech), సత్యప్రవర్తన (Right Action),సత్యజీవని (Right Livelihood), సత్యయత్నం (Right Effort),సత్యయోచన (Right Mindfulness), సత్యఏకాగ్రత(Right Concentration).



మార్గం చెప్పగానే వానవెలిసిన స్పష్టత ఏర్పడినట్టుంది. తేటగా కనబడుతున్న ప్రజల ముఖాలు, "ఇదే సరైన దారి" అన్నట్లు శిష్యుల కళ్ళూ. సత్యశోధన బోధించడానికి దారి లభించింది. సులభంగా అర్థమయ్యేలా అవగతం చేసే మార్గం లభించింది. అప్పుడే ‘సంఘం’ ఏర్పడింది. ఈ దారిని నమ్మి ప్రయాణించే ప్రయాణికుల సమూహం. అదే సమయంలో ‘కపిలవస్తు’ నుండీ పిలుపువచ్చింది. బుద్దుడికళ్ళలో సందిగ్ధత. "తనది ఇంకా చిన్నతనమని తండ్రి అనుకుంటున్నాడేమో!" అని. ఏంత పెద్దవారైనా తల్లిదండ్రులకు ఎప్పటికీ చిన్నపిల్లమే కదా. భార్య యశోధర "ఎందుకిలా చేసావంటే, సమాధానం?". కొడుకు "నాన్నా...అంటే నువ్వేనా?" అని అడిగితే. ఇవే ఆలోచనలా, లేక వారికీ సత్యాన్ని చూపించాలనే తపనా ! అరమూసినకళ్ళలో అటు సందిగ్ధత ఇటు తపనా కనిపించకపోతే చెప్పేదెలా.



యశోధర వచ్చింది. ఎదురుగా నిలుచుంది. ఒకప్పుడు ప్రేమించిన దేహం. చుంబించిన నుదురు. ఒళ్ళంతాకప్పుకున్న జుట్టు. వెలిగే కళ్ళు. కానీ ఇప్పుడు. మారిపోయింది. చాలామారిపోయింది. "మార్పుకు కారణం నువ్వే" అన్నంతగా మారింది. నిలదీస్తుందో...నిందిస్తుందో తెలీదు.

తను పెదవి విప్పింది."ప్రపంచంలో ఒకే పరమసత్యం ఉన్నప్పుడు, అది అంత:పురంలో లేకుండా అడవిలో ఎలా దొరుకుతుందనుకున్నావు?". అంత సత్యం తెలిసిన బుద్దుడికి నోటమాట లేదు. సత్యం తెలిసిన బుద్దుడు నిజంకోసం వెతుకుతున్నాడు. తెలిసింది. "సత్యం ఎక్కడ దొరుకుతుందో నాకప్పుడు తెలీదు. ఒక్కటే తెలిసేది. అంత:పురంలో నన్ను సత్యన్ని చూడకుండా కట్టడి చేసారని. అందుకే అక్కడినుండీ పారిపోయాను. భార్యాబిడ్డల భాద్యత ఒక మనిషిగా నాకున్నాయని తెలుసు. అయినా సత్యశోధన బలం నన్ను ఈ బంధాలను త్యజించేలా చేసింది." యశోధర నవ్వినట్లనిపించింది. యశోధరకి పరమసత్యానికి మించిన సత్యమేదో తెలుసని బుద్దుడి మనసుకు అనిపించింది. "నిజంగా తెలుసా...!!! ఎలా అడగాలి?".



"బౌద్ద విహారానికొచ్చావు, ఏదైనా భిక్ష ఇవ్వకుండానే వెళ్ళిపోతావా?" అన్నాడు. కనీసం భిక్షగా అయినా పరమసత్యాన్ని మించిన సత్యాన్ని పరిచయం చేస్తుందేమో అన్న ఆశ.

"నా దగ్గర నా కొడుకుతప్ప ఇంకేమీ లేదు.తననే నీకు ధారాదత్తం చేస్తున్నాను. రాహుల్ తనదైన సత్యాన్ని కనుగొంటాడని కోరుకుంటాను.ఈ ప్రపంచంలో మరో యశోధర జన్మించకుండా ఆ సత్యం వుంటుందని ఆశిస్తాను." అది భార్యభర్తని ఎత్తిపొడిచినట్టుగా లేదు. ఒక జ్ఞాని తన శిష్యుడిని మందలించినట్టుగావుంది. బుద్దుడికి ఎలా అనిపించిందో తెలీదు.



రాహుల్ మంచి శిష్యుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి బుద్దుడు వెళ్ళినా ప్రజలు అగరొత్తులతో స్వాగతిస్తున్నారు. అతన్ని కీర్తిస్తూ గానం చేస్తున్నారు.దేవుడంటూ అభిమానిస్తున్నారు. తన ఆశీర్వాదంతొ మోక్షం పొందొచ్చనుకుంటున్నారు. ధనవంతులు విహారాలనూ, ఉద్యానవనాలనూ బుద్దుడికి గౌరవంగా నిర్మించి నిర్వాణం పొందొచ్చనుకుంటున్నారు. ఈ మార్పులు బుద్దుడికి అస్సలు అర్థం కావటం లేదు. తను చెప్పిన పరమసత్యంకన్నా, తానెప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాడో అవగతం కాని దశ. ఎవరినీ ప్రశ్నించలేని, గద్దించి జవాబు అడగలేని స్థితి. ఏంచెయ్యాలో తెలీని పరిస్థితి.



ఇలాంటి తరుణంలో రాహుల్ బుద్దుడి దగ్గరికొచ్చాడు. " నాకు పరమసత్యం అవగతమయ్యింది" అన్నాడు. తన ముఖవర్ఛస్సూ చుట్టూ ప్రతిఫలించే కాంతీ అది నిజమని చెప్పకనే చెబుతున్నాయి. బుద్దుడు మరోమాట మాట్లాడేలోపు రాహుల్ "నేను మళ్ళీ రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది" అన్నాడు. బుద్దుడి కళ్ళలో ఆశ్చర్యం.

"పరమసత్యాన్ని గ్రహించినవాడివి వాటిని ప్రజలకు తెలియజెప్పాలని లేదా?" అని వీలైనంత శాంతంగా అడిగాడు. "తండ్రీ ! నన్ను మీకు అప్పగించేముందు నా తల్లి నాతో కొన్ని మాటలు చెప్పింది. నీ తండ్రి చెప్పిన దారిలో పయనిస్తూ ‘విశ్వజనీయమైన పరమ సత్యాన్ని’ (Universal Ultimate Truth) కాక నీదంటూ ఒక ప్రత్యేకమైన ‘వ్యక్తిగత సత్యాన్ని’ (Personal Truth) తెలుసుకో. ఎందుకంటే, ఒక సారి విశ్వజనీయమైన సత్యాన్ని గ్రహించిన పిదప ఆ సత్యాన్ని అందరూ గ్రహించాలని కాంక్షిస్తావు. కానీ అది అసాధ్యం. ప్రతిమనిషీ తనదైన సత్యాన్ని తెలుసుకుంటేతప్ప నిర్వాణాన్ని అందుకోలేడు. విశ్వజనీయమైన సత్యాన్ని వేరొకద్వారా వింటే మనిషికి అర్థం కాదు. సత్యంయొక్క మహత్తు తెలిసినతరువాత ఆ సత్యాన్ని త్వరగా పొందాలని ఆశించే స్వార్థం ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో అష్టాంగమార్గం శూన్యమై దానికి విపరీతమైన లక్షణాలు అలవడుతాయి" అని చెప్పాడు రాహుల్.



మరోసారి బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది. "ఇదే పరమసత్యానికి మించిన సత్యం" అని అవగతమయ్యింది. "కానీ ఇప్పటివరకూ తాను చేసింది !" అనే సందేహంతోపాటూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలోని రహస్యం బోధపడినట్లయ్యింది.

అప్పుడు ఈ సందేహాస్పద తధాగతుడిని చూసి రాహుల్ "శాక్యమునీ ! నీ ఆలోచన నాకు అర్థమయ్యింది. ప్రపంచం నీ పరమసత్యాన్ని అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోదుకూడాను. కానీ నీ బోధనలవలన కొన్ని విప్లవాత్మక పరిణామాలు జరిగాయని మర్చిపోకు. కొన్ని వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన పేదలు, దళితులూ ఈ వ్యవస్థని మొదటిసారిగా ప్రశ్నించారు. హిందూమతంలోని సామాజిక దురాచారాలనీ, మూఢాచారాలనీ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. త్యజిస్తున్నారు. పరమసత్యాన్ని వారు అందుకోలేకపోయినా సత్యం కానిదాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తున్నారు, నిరసిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యక్తిగత సత్యాన్ని సాధించటానికి గల ఉత్తమమైన మార్గం. నువ్వు చూపినదారి ఇంకోదారిని వెతుక్కుంది. ఈ దారి పరమసత్యాన్ని అందించకపోయినా, మెరుగైన జీవితాన్ని ఖచ్చితంగా అందిస్తుందు. అదే వ్యక్తిగత సత్యం. అదే ఇప్పుడు కావలసింది. నిజంగా కావలసింది దు:ఖం లేని జీవితంకాదు. పోరాడి సాధించుకునే హక్కులూ,స్వతంత్ర్యం." అన్నాడు.



తధాగతబుద్ధుడు మందస్మితుడైవున్నాడు. పరమసత్యాన్ని మించిన సత్యాన్ని గ్రహించిన యశోధరకు ప్రణమిల్లుతున్నాడు. రాహుల్ తన వ్యక్తిగత సత్యాన్ని తనలోనే వుంచుకున్నాడు.
లోకం మారింది కానీ బుద్దుడు అనుకున్నట్లుగా కాదు. పరమసత్యం ఇప్పటికీ ఎవరికీ తెలీదు.




*
మైధిలీ శరణ్ గుప్త్ రాసిన ‘యశోధర’ కవితకు నా సొంతపైత్యం జోడించి.



***

Thursday, September 24, 2009

సంస్కృతి అంటే?


ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు

నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.

- దేవరకొండ బాలగంగాధర తిలక్ (1965)

‘సంస్కృతి’ అనే పదానికి గల వ్యుత్పత్యర్థం నాకు తెలీదు. సంస్కరింపబడిందా! సంస్కృతం నేర్చినవారి జీవనశైలా! అనే ఎటిమాలజీలోకి పోకుండా, "సంస్కృతి అంటే కల్చర్. కల్చర్ అంటే ఒక జీవనవిధానం" అనే వ్యావహారిక అర్థంలో సంస్కృతిని వాడేద్దామని నిర్ణయించాను. బహుశా నా ‘సంస్కృతి’ సమస్య ఇక్కడే మొదలౌతుందనుకుంటా.

నా మిడిమిడి జ్ఞానానికి ఆ పదం యొక్క మూలమే తెలీకపోతే దాని విస్తృతి, వివరణ, ఉద్దేశం ఎక్కడ తెలిసిఏడుస్తాయి? అందుకే, నాకు తెలిసిన ‘కల్చర్’ అనే ఇంగ్లీషుపదం లోంచీ అర్థాలు ఏరుకుని నా తాత్పర్యాల్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తాను.

"Culture, defined as shared knowledge or symbols that create meaning within a social group" అనేది ఇప్పటి వ్యవహారం అయితే, ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ transition లో dynamic గా ఉంటుంది.

ఈ నిర్వచనంతో "మన" సంస్కృతితో బేరీజు చేసుకుంటే, తీరే సమస్యలకన్నా వచ్చే సమస్యలే ఎక్కువ. "భారతీయ సంస్కృతి" అనేది ఒకటుందా? "తెలుగు సంస్కృతి" అనేదాన్ని నిర్వచింపగలమా? ఎప్పుడూ మారే సంస్కృతిని ఏమూసలో పోస్తే స్థిరమౌతుంది? అలా స్థిరమైతే అది అసలు సంస్కృతేనా?

****

Wednesday, September 16, 2009

స్వర్గం అంచుల్లో...


రావడం పోవడం అంతా ఒకటేనా?

వెనక్కెళ్ళడం అంత సులువుగా జరిగేనా?
రేపటి గురించి రేపు మాట్లాడుకుందాం.
ఈ రోజు గురించి చెప్పండి.
ఒక్క నిమిషం నిశ్శబ్ధంగా వినండి.
ఆ ప్రవాహపు శబ్దాన్ని వినండి.
ఆ వాగుపేరు "వైతరణి".
దాన్ని దాటొచ్చినవాళ్ళు తిరిగెళ్ళడం సాధ్యమేనా!
వైతరణి ఆవలి ఒడ్డున ఉన్నా, సాధారణ జీవిగా మనగలగటం సాధ్యమేనా!!

****

Monday, September 14, 2009

కథ-కల-కల్పన


చీకటిగర్భాన నేను

వెలుతురు తీరాన నేను
ఎటూతేల్చుకోలేని కలల లోకాన నేను

నేనే కథగా మారిపోయానో...
లేక
నీ కథనంలో మునిగిపోయానో...
తెలీదు
నువ్వు చెప్పిన కథలో చిక్కుకుపోయాను
చీకటి వెలుగుల జీవితంలో
ఎటూతేల్చుకోలేని కల్పనల లోకాన మిగిలిపోయాను

****

Wednesday, September 9, 2009

తెలుగు సినిమాలకు అవార్డులు ఎందుకు?

2007 సంవత్సరానికిగానూ 55వ జాతీయ చలనచిత్ర అవార్డులు మొన్ననే ప్రకటించారు. ఎప్పటిలాగే మన తెలుగు సినిమా ఏ అవార్డూ దక్కలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు, "Telugu film industry produces films in great quantities. But,they failed to impress the jury with quality films this year"అని జాతీయ అవార్డుల కమిటీ చైర్మెన్ ప్రముఖదర్శకురాలు సాయ్ పరాంజిపే అన్నారు.

ఈ మాటకు మన ఇండస్ట్రీ పెద్దలకు భలే కోపం వచ్చేసింది. ‘ఇది విదేశీ కుట్ర’ అన్న సహజరీతిలో "అవార్డుల జ్యూరీ తెలుగు సినిమాలపైన వివక్ష చూపించారు" అని ‘చందమామ’ చిత్ర నిర్మాత కళ్యాణ్ ఒక ఆరోపణ చేసి చేతులు దులుపుకున్నారు.

ఏ కేటగిరీలో అవార్డుల కోసం పంపారోగానీ, పంపిన మూడు సినిమాలు... మీ శ్రేయోభిలాషి, చందమామ,హ్యాపీడేస్.

అవార్డులు లిస్టు వాటి కేటగిరీలు ఇక్కడ ఇస్తున్నాను....


ఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు)

ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది)

ఉత్తమ సహాయనటి "షెఫాలీ ఛాయా (గాంధీ మై ఫాదర్ లో కస్తూర్బా పాత్రకుగానూ ఈ నటికి అవార్డుగక్కింది)

ఉత్తమ స్క్రీన్ ప్లే : ఫిరోజ్ ఖాన్ (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఫిరోజ్ ఖాన్ వహించారు. ఇది పిరోజ్ మొదటి చిత్రం)

ఉత్తమ దర్శకుడు: అడూర్ గోపాలకృష్ణన్ (‘నాలు పెణ్ణుంగల్ చిత్రానికి గానూ ఈ అవార్డు దక్కింది)

షారుఖ్ ఖాన్ నటించిన ‘చక్ దే ఇండియా’ చిత్రానికి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. భావనా తల్వార్ దర్శకత్వంలో వచ్చిన వివాదాస్పద చిత్రం ‘ధర్మ’ కు ఉత్తమ జాతీయ సమగ్రతను ప్రేరేపించే చిత్రంగా అవార్డు లభించింది. అమీర్ ఖాన్ నిర్మించి,దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ ఉత్తమ కుటుంబ సంక్షేమ చిత్రంతోపాటూ ఉత్తమ గీత రచయిత (ప్రసూన్ జోషి), ఉత్తమ గాయకుడు (శంకర్ మహదేవన్) కు అవార్డులు లభించాయి. ఉత్తమ గాయనిగా ‘జబ్ వుయ్ మెట్’ చిత్రానికి శ్రేయా ఘోషాల్ కు లభించింది. చివరిగా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ గానూ రజనీకాంత్ - శంకర్ ల ‘శివాజీ’ చిత్రానికి అవార్డు లభించింది.


ఉత్తమనటుడిగా ప్రకాష్ రాజ్. బాలీవుడ్ బాద్షాలైనా షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు ఈ అవార్డు కోసం రేసులో ఉండగా, ‘కాంజీవరం’ చిత్రంలో ప్రకాష్ రాజ్ "నటనకు" గానూ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. మన తెలుగు నామినేటెడ్ సినిమాల్లో మంచి నటన మీ శ్రేయోభిలాషి లో రాజేంద్ర ప్రసాద్ చేశారనుకున్నా, ప్రకాష్ రాజ్ నటనకు పోటీ ఇవ్వదగిన నటన చేశారా అంటే "లేదు" అనే చెప్పుకోవాలి.

ఉత్తమ నటిగా ఉమశ్రీకి. చందమామ నుంచీ,హ్యాపీడేస్ నుంచీ తెలుగు రాని (డబ్బింగ్ చెప్పుకోలేని) హీరోయిన్లు జాతీయ అవార్డుకు మొత్తంగా అనర్హులు. ఒకవేళ అవార్డు "నటనకు" ఇద్దామనుకున్నా, వారి నటన ఏపాటిదో అందరికీ తెలిసిందే. మరి ఎవరికి అవార్డు ఇవ్వాలి?

ఓకే...(ఉత్తమ చిత్రం ఎలాగూ ఇవ్వలేరు) మొత్తంగా సినిమాకు ఏదైనా ఒక అవార్డు ఇద్దామా అంటే, సందేశాత్మక చిత్రమైన ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ చేనేత కార్మికుల పోరాటం గురించి ఒక సినిమా, హిందూ-ముస్లింల మధ్య పెరుగుతున్న అపనమ్మకాన్ని గురించి మరొకటి, హిందూమతంలోని resilience గురించి చెప్పిన చిత్రం ఒంకొకటి, పిల్లల పెంపకం గురించి హృద్యంగా,వినోదాత్మకంగా చెప్పింది మరొకటి, ఒక మహిళా హాకీటీం ప్రేరణాత్మక ప్రయాణాన్ని రసభరితంగా తెరకెక్కించిన సినిమా మరొక్కటి. ఇలాంటి వాటి మధ్య, మన ‘మీ శ్రేయోభిలాషి’ అవార్డు దక్కించుకోలేక పోవడం నిజంగా వివక్షేనా?

ఆడలేక మద్దెల ఓడన్న సామెత గుర్తొస్తోంది నాకు. బాక్సాఫీస్ కలెక్షన్లు తప్ప మాకు వేటితో పనిలేదనిచెప్పే మన సినీజనాలు అవార్డులు రాకపోతే ఇంత ఇదిగా ఎందుకు బాధపడాలి? మనకు వాటితో సంబంధం లేనప్పుడు, అసలు నామినేషన్ వెయ్యడం ఎందుకు? అవార్డు రాకపోతే వివక్ష అంటూ లేనిపోని అభాంఢాలు ఎందుకు? అత్యధిక సినిమాలు తీసే పరిశ్రమగా, ఇండస్ట్రీ కొత్త టేడ్ టాక్ సృష్టించే సినిమాలు తీసే గొప్ప పరిశ్రమగా సంతోషపడక ఈ అర్థంలేని అవార్డుల ఆశలేల....రాకపోతే ఈ నిరాశలేల?

మనం నామినేట్ చేసిన మూడు చిత్రాల్లో దేనికి ఏ అవార్డు ఇచ్చుండచ్చో కనీసం మీరైనా చెప్పడానికి ప్రయత్నించండి.
*****

Friday, September 4, 2009

సమర్థతా, రాజకీయమా?

ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణంతో రాజకీయ శూన్యం ఏర్పడింది. బహుశా ఈ స్థాయి శూన్యత రాష్ట్రరాజకీయాలలో మొట్టమొదటిసారి.


ఆపద్ధర్మంగా రోశయ్యను ముఖ్యమంత్రిని చేసినా, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రెండోరోజే "తరువాత ఎవరు?" అనే ప్రశ్న తలెత్తడం ఆ ఉచ్చస్థాయి శూన్యత పట్ల నెలకొన్న అందోళనకు చిహ్నమేతప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో పార్టీని ఒక్కమాటతో శాసించే నాయకుడు. అధిష్ట్రానంతో నిక్కచ్చిగా వ్యవహరించగలిగిన ఈ స్థాయి జననాయకుడు ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో లేరనే చెప్పాలి. మరి ఇలాంటి నాయకుడికి ప్రత్యామ్నాయం ఎవరు అనేది పెద్ద ప్రశ్న.

ఇప్పటికే కొందరు బ్లాగరలు ‘అనుభవం...సమర్ద్థతా’ అంటూ రాజకీయంలో అప్రస్తుతమైన పదాల్ని పదేపదే అంటున్నారు. నిజంగా రాజకీయ సమర్ద్థత అనేది ఒక బ్రహ్మపదార్థం. అనుభవం అవకాశం వస్తేగానీ రాదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో "రాజకీయ జరుగుబాటుతనం" అత్యంత ముఖ్యం. అనుభవం సమర్ద్థతా secondary.

D.శ్రీనివాస్, పురంధరేశ్వరి,జానారెడ్డి, జైపాల్ రెడ్డి ఎవరికి పట్టంగట్టినా కాంగ్రెస్ లో ఫ్యాక్షన్ గొడవలు తప్పవు. నిరసనస్వరాలు తప్పవు. అలా జరిగితే ఇప్పటిదాకా బలహీనమవుతున్న ప్రతిపక్షాలకు ఊతం దొరికినట్లే. కాబట్టి, వై.ఎస్. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే కనీసం మరో రెండు సంవత్సరాల వరకూ అటు స్వపక్షం ఇటు విపక్షానికి నోరెత్తే చాన్స్ ఉండదు

సానుభూతి రాజకియాలు,ఆనువంశిక రాజకీయాలు కాంగ్రెస్ కు కొత్త కాదు. అవి బ్రహ్మాండంగా పనికొస్తాయనడానికి బోలెడు ఆధారాలున్నాయి. పనిచెయ్యవని చెప్పడానికి మనదగ్గర ఆధారాలు లేవు. అలాంటప్పుడు ఎందుకీ మిడిల్ క్లాస్ స్లోగన్లైన ‘అనుభవం-సమర్థతా’ జపాలు!


కడప నుంచీ MP గా అత్యధిక మెజారిటీతో గెలిచిన వై.ఎస్.జగన్ కు మాస్ బేస్ లేదనే సాహసం ఎవరూ చెయ్యలేరు. అనుభవం లేదందామా….అంటే కావలసింది పరిపాలనా అనుభవమా, రాజకీయ అవసరమా అనే ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది.

ఇప్పటికే 118 మంది MLA లు (పార్టీ చీఫ్ విప్ భట్టివిక్రమార్కతో సహా) మద్దత్తు ప్రకటిస్తూ అధిష్టానానికి లేఖలు సమర్పించారు. రాష్ట్ర క్యాబినెట్ ఒక రెజొల్యూషన్ పాస్ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది జె.సి.దివాకర్ రెడ్డి, జానారెడ్డి,మర్రి శశిధర్ లు మాత్రమే. వీళ్ళని వై.ఎస్. వ్యతిరేకవర్గంగా తేలిగ్గా తీసెయ్యొచ్చు. రాజకీయంగా కూడా వీరి ప్రాధాన్యత తగ్గింది.


రాష్ట్రం సంగతి ఎవరికీ ఎప్పుడూ పట్టలేదుకాబట్టి, రాజకీయపరంగా చూస్తే వై.ఎస్.జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు క్షేమకరం. ఎలాగూ ఐదు సంవత్సరాల కాలం ఉందికాబట్టి పరిపాలనా అనుభవం,సమర్థతా ఆ సమయంలో వచ్చేస్తాయని ఆశించడంతప్ప మనం చెయ్యగలిగేది పెద్దగా ఏమీ ఉండదు.

****