Tuesday, August 26, 2008

పరమసత్యాన్ని మించిన సత్యం !!!

సిద్దార్థుడు నిద్రపోతున్న భార్యాపిల్లల్ని వదిలి సత్యశోధనకై అడవుల్లో ప్రయాణించి ‘గయ’ చేరుకున్నాడు. బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది. ‘పరమసత్యం’ (Ultimate Truth) అవగతమయ్యింది. సత్యాన్ని కనుగొన్న ఉత్సాహం... ఎవరికైనా తెలియజెప్పాలన్న ఆతృత. సారనాధ్ తన మొదటి ప్రవచనానికి సిద్దమయ్యింది. ఐదుగురు శిష్యులు గౌరవంగా చేతుజోడించి ఎదురుగా నిల్చున్నారు. "నిజంగా సత్యాన్ని అవగతం చేసుకుని బుద్ధుడి మారిన సిద్దార్థుడికా ఆ గౌరవం? లేక, ఇన్నికష్టాలు అనుభవించి రాజ్యాన్నీ, పెళ్ళాంపిల్లల్నీ అంత:పురంలో వదిలి అడవులపాలై తిరిగివచ్చిన ఒక సాధకుడిగా ఆ గౌరవం?" ఈ ప్రశ్నకి సమాధానం బుద్ధుడితో సహా ఎవరికీ తెలీదు.సత్యాన్ని తెలుసుకోవడంద్వారా అనుభవించిన అలౌకిక ఆనందాన్ని, అవగతం చేసుకున్న పరమసత్యాన్ని ఎలా మాటల్లో చెప్పాలో బుద్దుడికైనా తెలిసేనా ! అనుభవానికి పదాలుకూర్చడం ముక్కుమూసుకుని ధ్యానిస్తే వచ్చేనా! మెల్లగా పెదాలు విడిపడ్డాయి...జీవితం దు:ఖమయం...కోరికలు దు:ఖానికి మూలకారణం...కోరికల్ని త్యజిస్తే దు:ఖాలు అంతమైపోతాయి. ఎదురుగా నించున్న శిష్యుల్లో ఎలాంటి చలనమూ లేదు. కనీసం కళ్ళలో ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న ఆనందంకూడా ప్రతిఫలించడం లేదు. "ఇదేకదా నేను ఇన్నాళ్ళ ధ్యానంలో తెలుసుకున్నది. మరి సత్యం మరెవ్వరికీ అర్థం కాదా?" ఒక self doubt ఉదయించింది. పరమసత్యం అవగతమైనా, సందేహాలు తప్పవా! ఏమో!పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే అందరూ ధ్యానం చెయ్యాలా? దేన్ని ధ్యానించాలి? ఎంతకాలం ధ్యానించాలి? ఎలాధ్యానించాలి? ఎన్నో ప్రశ్నలు. తనే విడమర్చి చెబితే ! ప్రయత్నించాడు. చిన్నచిన్నఊర్లూ, పెద్దపెద్ద పట్టణాలూ అన్నీ తిరిగాడు. ప్రజలందరికీ ఈ సత్యాన్ని విప్పిచెప్పాడు. కొందరు అర్థమయ్యిందని తలలూపారు. శిష్యులు మరింత శ్రద్ధగా తలాడించారు. మరికొందరు, "ఐతే" అన్నట్లు ప్రశ్నార్థకంగా ముఖాలుపెట్టారు. నిజమే, "ఐతే ఏమిటి?", "ఐతే ఎలా?" అప్పుడే తను పొందిన జ్ఞానంలోంచీ మరో వెలుగురేఖ ఉదయించింది. ‘అష్టాంగమార్గం’. ఎలా కోరికల్ని త్యజించాలో తెలియాలి. దానికి మార్గం అవగతం కావాలి. అయ్యింది. అదే మరోక మూలసూత్రం. మొదటి మూడింటితో కలిపి ఇప్పుడు నాలుగు.దు:ఖాలనుండీ విముక్తికి ఒక మార్గముంది, అదే అష్టాంగమార్గం. సత్యావగాహన (Right Understanding), సత్యాలోచన (Right Thought), సత్యవాక్కు (Right Speech), సత్యప్రవర్తన (Right Action),సత్యజీవని (Right Livelihood), సత్యయత్నం (Right Effort),సత్యయోచన (Right Mindfulness), సత్యఏకాగ్రత (Right Concentration).మార్గం చెప్పగానే వానవెలిసిన స్పష్టత ఏర్పడినట్టుంది. తేటగా కనబడుతున్న ప్రజల ముఖాలు, "ఇదే సరైన దారి" అన్నట్లు శిష్యుల కళ్ళూ. సత్యశోధన బోధించడానికి దారి లభించింది. సులభంగా అర్థమయ్యేలా అవగతం చేసే మార్గం లభించింది. అప్పుడే ‘సంఘం’ ఏర్పడింది. ఈ దారిని నమ్మి ప్రయాణించే ప్రయాణికుల సమూహం. అదే సమయంలో ‘కపిలవస్తు’ నుండీ పిలుపువచ్చింది. బుద్దుడికళ్ళలో సందిగ్ధత. "తనది ఇంకా చిన్నతనమని తండ్రి అనుకుంటున్నాడేమో!" అని. ఏంత పెద్దవారైనా తల్లిదండ్రులకు ఎప్పటికీ చిన్నపిల్లమే కదా. భార్య యశోధర "ఎందుకిలా చేసావంటే, సమాధానం?". కొడుకు "నాన్నా...అంటే నువ్వేనా?" అని అడిగితే. ఇవే ఆలోచనలా, లేక వారికీ సత్యాన్ని చూపించాలనే తపనా ! అరమూసినకళ్ళలో అటు సందిగ్ధత ఇటు తపనా కనిపించకపోతే చెప్పేదెలా.యశోధర వచ్చింది. ఎదురుగా నిలుచుంది. ఒకప్పుడు ప్రేమించిన దేహం. చుంబించిన నుదురు. ఒళ్ళంతాకప్పుకున్న జుట్టు. వెలిగే కళ్ళు. కానీ ఇప్పుడు. మారిపోయింది. చాలామారిపోయింది. "మార్పుకు కారణం నువ్వే" అన్నంతగా మారింది. నిలదీస్తుందో...నిందిస్తుందో తెలీదు. తను పెదవి విప్పింది. "ప్రపంచంలో ఒకే పరమసత్యం ఉన్నప్పుడు, అది అంత:పురంలో లేకుండా అడవిలో ఎలా దొరుకుతుందనుకున్నావు?". అంత సత్యం తెలిసిన బుద్దుడికి నోటమాట లేదు. సత్యం తెలిసిన బుద్దుడు నిజంకోసం వెతుకుతున్నాడు. తెలిసింది. "సత్యం ఎక్కడ దొరుకుతుందో నాకప్పుడు తెలీదు. ఒక్కటే తెలిసేది. అంత:పురంలో నన్ను సత్యన్ని చూడకుండా కట్టడి చేసారని. అందుకే అక్కడినుండీ పారిపోయాను. భార్యాబిడ్డల భాద్యత ఒక మనిషిగా నాకున్నాయని తెలుసు. అయినా సత్యశోధన బలం నన్ను ఈ బంధాలను త్యజించేలా చేసింది." యశోధర నవ్వినట్లనిపించింది. యశోధరకి పరమసత్యానికి మించిన సత్యమేదో తెలుసని బుద్దుడి మనసుకు అనిపించింది. "నిజంగా తెలుసా...!!! ఎలా అడగాలి?"."బౌద్ద విహారానికొచ్చావు, ఏదైనా భిక్ష ఇవ్వకుండానే వెళ్ళిపోతావా?" అన్నాడు. కనీసం భిక్షగా అయినా పరమసత్యాన్ని మించిన సత్యాన్ని పరిచయం చేస్తుందేమో అన్న ఆశ. "నా దగ్గర నా కొడుకుతప్ప ఇంకేమీ లేదు.తననే నీకు ధారాదత్తం చేస్తున్నాను. రాహుల్ తనదైన సత్యాన్ని కనుగొంటాడని కోరుకుంటాను.ఈ ప్రపంచంలో మరో యశోధర జన్మించకుండా ఆ సత్యం వుంటుందని ఆశిస్తాను." అది భార్యభర్తని ఎత్తిపొడిచినట్టుగా లేదు. ఒక జ్ఞాని తన శిష్యుడిని మందలించినట్టుగావుంది. బుద్దుడికి ఎలా అనిపించిందో తెలీదు.రాహుల్ మంచి శిష్యుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి బుద్దుడు వెళ్ళినా ప్రజలు అగరొత్తులతో స్వాగతిస్తున్నారు. అతన్ని కీర్తిస్తూ గానం చేస్తున్నారు.దేవుడంటూ అభిమానిస్తున్నారు. తన ఆశీర్వాదంతొ మోక్షం పొందొచ్చనుకుంటున్నారు. ధనవంతులు విహారాలనూ, ఉద్యానవనాలనూ బుద్దుడికి గౌరవంగా నిర్మించి నిర్వాణం పొందొచ్చనుకుంటున్నారు. ఈ మార్పులు బుద్దుడికి అస్సలు అర్థం కావటం లేదు. తను చెప్పిన పరమసత్యంకన్నా, తానెప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాడో అవగతం కాని దశ. ఎవరినీ ప్రశ్నించలేని, గద్దించి జవాబు అడగలేని స్థితి. ఏంచెయ్యాలో తెలీని పరిస్థితి.ఇలాంటి తరుణంలో రాహుల్ బుద్దుడి దగ్గరికొచ్చాడు. " నాకు పరమసత్యం అవగతమయ్యింది" అన్నాడు. తన ముఖవర్ఛస్సూ చుట్టూ ప్రతిఫలించే కాంతీ అది నిజమని చెప్పకనే చెబుతున్నాయి. బుద్దుడు మరోమాట మాట్లాడేలోపు రాహుల్ "నేను మళ్ళీ రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది" అన్నాడు. బుద్దుడి కళ్ళలో ఆశ్చర్యం. "పరమసత్యాన్ని గ్రహించినవాడివి వాటిని ప్రజలకు తెలియజెప్పాలని లేదా?" అని వీలైనంత శాంతంగా అడిగాడు. "తండ్రీ ! నన్ను మీకు అప్పగించేముందు నా తల్లి నాతో కొన్ని మాటలు చెప్పింది. నీ తండ్రి చెప్పిన దారిలో పయనిస్తూ ‘విశ్వజనీయమైన పరమ సత్యాన్ని’ (Universal Ultimate Truth) కాక నీదంటూ ఒక ప్రత్యేకమైన ‘వ్యక్తిగత సత్యాన్ని’ (Personal Truth) తెలుసుకో. ఎందుకంటే, ఒక సారి విశ్వజనీయమైన సత్యాన్ని గ్రహించిన పిదప ఆ సత్యాన్ని అందరూ గ్రహించాలని కాంక్షిస్తావు. కానీ అది అసాధ్యం. ప్రతిమనిషీ తనదైన సత్యాన్ని తెలుసుకుంటేతప్ప నిర్వాణాన్ని అందుకోలేడు. విశ్వజనీయమైన సత్యాన్ని వేరొకద్వారా వింటే మనిషికి అర్థం కాదు. సత్యంయొక్క మహత్తు తెలిసినతరువాత ఆ సత్యాన్ని త్వరగా పొందాలని ఆశించే స్వార్థం ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో అష్టాంగమార్గం శూన్యమై దానికి విపరీతమైన లక్షణాలు అలవడుతాయి" అని చెప్పాడు రాహుల్.మరోసారి బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది. "ఇదే పరమసత్యానికి మించిన సత్యం" అని అవగతమయ్యింది. "కానీ ఇప్పటివరకూ తాను చేసింది !" అనే సందేహంతోపాటూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలోని రహస్యం బోధపడినట్లయ్యింది. అప్పుడు ఈ సందేహాస్పద తధాగతుడిని చూసి రాహుల్ "శాక్యమునీ ! నీ ఆలోచన నాకు అర్థమయ్యింది. ప్రపంచం నీ పరమసత్యాన్ని అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోదుకూడాను. కానీ నీ బోధనలవలన కొన్ని విప్లవాత్మక పరిణామాలు జరిగాయని మర్చిపోకు. కొన్ని వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన పేదలు, దళితులూ ఈ వ్యవస్థని మొదటిసారిగా ప్రశ్నించారు. హిందూమతంలోని సామాజిక దురాచారాలనీ, మూఢాచారాలనీ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. త్యజిస్తున్నారు. పరమసత్యాన్ని వారు అందుకోలేకపోయినా సత్యం కానిదాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తున్నారు, నిరసిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యక్తిగత సత్యాన్ని సాధించటానికి గల ఉత్తమమైన మార్గం. నువ్వు చూపినదారి ఇంకోదారిని వెతుక్కుంది. ఈ దారి పరమసత్యాన్ని అందించకపోయినా, మెరుగైన జీవితాన్ని ఖచ్చితంగా అందిస్తుందు. అదే వ్యక్తిగత సత్యం. అదే ఇప్పుడు కావలసింది. నిజంగా కావలసింది దు:ఖం లేని జీవితంకాదు. పోరాడి సాధించుకునే హక్కులూ,స్వతంత్ర్యం." అన్నాడు.తధాగతబుద్ధుడు మందస్మితుడైవున్నాడు. పరమసత్యాన్ని మించిన సత్యాన్ని గ్రహించిన యశోధరకు ప్రణమిల్లుతున్నాడు. రాహుల్ తన వ్యక్తిగత సత్యాన్ని తనలోనే వుంచుకున్నాడు. లోకం మారింది కానీ బుద్దుడు అనుకున్నట్లుగా కాదు. పరమసత్యం ఇప్పటికీ ఎవరికీ తెలీదు.
*మైధిలీ శరణ్ గుప్త్ రాసిన ‘యశోధర’ కవితకు నా సొంతపైత్యం జోడించి.***

20 comments:

Purnima said...

బుద్ధుడికి భోధి వృక్షం కింద జ్ఞానోదయమైయ్యింది. అతడు కనుగొన్న జ్ఞానం అందరికీ "బుద్ధిజం" పేరున ప్రపంచంలో విస్తరించింది. - ఇక్కడితో మా పాఠాలన్నీ ఆగిపోయాయి. అటు తర్వాత జరిగింది నిజమో, కాల్పనికమో తెలీదు కానీ, చాలా interesting insights. ఇక ఈ సత్యాలు, పరమ సత్యాలు పై నాకంత అవగాహన లేదు. అందుకే వాటి గురించి ఏమీ రాయటం లేదు.

ఈ కవి గారిని పరిచయం చేసినందుకు నెనర్లు! యశోదర కథ మీరు చెప్పేశారు. నేనిక ఊర్మిళ గురించి వెత్తుకుంటా!!

నాగమురళి said...

మీ సొంత సత్యాన్ని ఇందులో చొప్పించినప్పటికీ, హృదయపూర్వకంగా చెప్తున్నాను - చాలా బాగా రాశారు. చాలా మంచి విషయం చెప్పారు. అభినందనలు.

Anonymous said...

బుద్ధుడి కధ విన్నప్పుడు నాక్కూడా కలిగిన సందేహమిదే. బుద్ధుడనే కాదు...అన్నమయ్యలాంటి భక్తులను చూసినప్పుడు కూడా.
రవీంద్రనాధ్ ఠాగూర్ చెప్పినట్లు ఇహలోకాన్ని అనుభవిస్తూ పరలోకాన్ని జయించాలి అంతేకానీ త్యజించి కాదు. ఈ విషయాన్ని చాలా మంచిగా చెప్పారు.

నాగమురళి said...

ఈ అంశం నాకు చాలా ఇష్టమైనది కాబట్టి మళ్ళా ఇంకో మాట. ఎవరి సత్యం వాళ్ళదే అయినప్పటికీ ఈ ప్రపంచంలో ఎవరి సత్యాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకోవడం వల్లనే సమస్యలన్నీ. మన సత్యాన్ని మనం వదిలెయ్యకుండా ఇతరుల సత్యాన్ని గౌరవించడం ప్రస్తుత సమాజంలో అత్యవసరమైన ఒక లక్షణం. అలాగే తమ సత్యాన్ని తాము ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండడం, అవసరమైతే మార్చుకోడానికి సిద్ధపడడం, ఇతరులు తమ సత్యాన్ని ఎందుకు నమ్ముతున్నారో తెలుసుకోడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడం కూడా చాలా అవసరమని నేను ఘట్టిగా నమ్ముతాను. లేకపోతే మనం ఈ ప్రజాస్వామిక సమాజంలో బ్రతకడానికి అనర్హులం అవుతాము.

అబ్రకదబ్ర said...

చాలా బాగుంది. నా 'దశావతారాలు' నుండి దీనికి ఓ లింకు పెడుతున్నాను. మీకేమీ అభ్యంతరం లేదుగా?

వికటకవి said...

బాగుంది. పనిలో పనిగా మీ మార్కు ద్రవ్యాల్ని కలిపారు, తప్పులేదనుకోండి. అదీ ఓ టెక్నిక్కే. పూర్ణిమ గారన్నట్లు, అసలెంత, మీ మసాలా ఎంతో తెలియలేదు.
కానీ అసలు కథకి ఇదే నిజమైన పొడిగింపా అన్న స్థాయిలో లాక్కొచ్చారు. బాగుంది.

బొల్లోజు బాబా said...

avunaa?

bollojubaba

Anonymous said...

ఇప్పుడే ఇదీ, ఇక్కడ వ్యాఖ్యలూ చదవడం జరిగింది. నా ఈ వ్యాఖ్య మహేశ్ రాసిందానికి సంబంధించింది కాదు. తను చివర్లో ఒక పాయింట్(హిందూ మతంలో ఉన్న చాలా క్రానిక్ డిసీజెస్ ముఖ్యంగా "కులం" లేకుండా, బౌద్ద మతం వచ్చేసరికి దాంట్లోకి చాలా మంది చేరిపోయారు. ఇది మంచి విషయమే, ఆక్షేపించేది ఏమీ లేదు) చెప్పడం కోసం ఇది రాసినట్లున్నారు.

అయితే పూర్ణిమ మరియి బాబా గారి వ్యాఖ్యలు చూసాక నాక్కొంచెం భయం వేసింది. బుధ్ధ మీద ఫిక్షన్ ముఖ్యంగా ఇంగ్లీష్ లో కుప్పలు కుప్పలు. ఇదనే కాదు, చారిత్రాత్మక విషయాలకి, ఫిక్షన్ జత కూర్చి, ఆ విషయం పైకి చెప్పి, బాగా పాపులర్ అయ్యే బుక్స్ ట్రెండ్ ఈ మధ్య బాగా పెరిగింది (ఉద: డావిన్సీ కోడ్-దీన్ని చదివిన నా హిందూ ఫ్రెండ్స్ ఇదే నిజమనుకున్నారు-నేను కూడా హిందు నే ). ఇందులో తప్పేమీ లేదు కాని, చదివిన వాళ్ళల్లో కొంతమంది ఇదే నిజమేమో అనుకొంటారు.

ఉదా: పూర్ణిమ వ్యాఖ్య: యశోధర సంగతి మీరు చెప్పారూ..నేను ఊర్మిళని వెతుక్కుంటా. బాబా గారి వ్యాఖ్య: నిజమా!.

నాకు తెలిసినంత వరకూ, ఎపుడయితే సిద్దార్థుడు బుద్దుడయిపోయాడో(ఇంకా ముందేనేమో-ఒకసారి మళ్ళీ రిఫర్ చేయాలి) యశోధర కూడా నన్ కింద మారిపోయింది.

బుద్దుడు ఆడవారిని బౌద్ద సంఘం లోకి అనుమతించడానికి ఇష్టపడలేదు ముందు. కాని చివరికి ఒప్పుకుంటాడు. తన భార్య తొలి బౌద్ద సన్యాసుల్లో ఒకరనుకుంటా(I have to check this again).

ప్లీజ్..ఎవ్వరైనా పైన కథ లో మహేశ్ చెప్పదల్చినది కాకుండా, అదే historical truth అని conclusionకి రాకండి. అలా అని మహేశ్ చెప్పలేదు, కాని....అందరికీ ఓపిక ఉండదు కదా..డిగ్ చేయడనికి.

కొంత కాలం కిందా "ఈ మాట" లో సాయి బ్రహ్మానందం గారు "యథార్థ చక్రం" అనే ఒక శీర్షిక రాసారు. అందులో బుద్దుడు తిరిగి వచ్చిన తర్వాత, అతని తమ్ముడు నందుడు, సుందరీ ల గురించి రాసారు. అది యథార్థానికి దగ్గరిది. అది తప్పనిసరిగా చదవండి. ఆయన చాల బాగా రాసారు. ఇది ఆరు భాగాలు..చివర్లో సుందరి తథాగథున్ని ప్రశ్నిస్తుంది..నా భర్తని ఎందుకు తీసుకెళ్ళిపోయావ్ అని?
క్రింద నేను సెర్చ్ లింక్ ఇస్తున్నా. అందులో "యథార్థ చక్రం భాగాలు 1-6 ".. (ఏ డ్రమటిక్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయబాకండి).
http://www.eemaata.com/em/index.php?s=%E0%B0%AF%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5+%E0%B0%9A%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82&sdup=Searching...&sentence=0


అలాగే ఇంకో బుక్ గూగుల్ లే దొరుకుతుంది. నేను ఇక్కడ లోకల్ లైబ్రరీలో తెచ్చి, చదవకుండా రిటర్న్ ఇచ్చేశా. నాకు గుర్తున్నంతవరకూ, అందులో కూడా రిటర్న్ అఫ్ బుద్ద :-).. (సారీ, పద ప్రయోగానికి, జస్ట్ ఫర్ ఫన్.. ) కవర్ చేసాడనుకుంటా..ఆ బుక్ లింక్. http://books.google.com/books?id=h2Qh2zzNkNkC&dq=the+historical+buddha+book&pg=PP1&ots=riqlFeKQ8a&sig=6QQZIBbYmTCkR4_hklVoRHOtCPE&hl=en&sa=X&oi=book_result&resnum=1&ct=result


I am sure there is plethora of info on Gautama... you guys can take it from here...I am at work place..I have to get back to my work. bye for now...Just thought I have to put my 2 cents...

కత్తి మహేష్ కుమార్ said...

@ఇండిపెండెంట్: బుద్దుడి గురించి చరిత్రకన్నా జాతక కథలూ, బోధిసత్వులూ అంటూ ఎక్కువగా కాల్పనిక సాహిత్యం (ఫిక్షన్) వ్యవహారంలో వుంది.అది బహుశా బౌద్దమతంయొక్క విశిష్టత అనుకోవచ్చు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో హిందూ సమాజంలో "నీతి కథలు" వున్నట్లు వీరిలో జ్ఞానపరమైన, ధర్మ పరమైన కథలన్నమాట.

అందుకే మన పురాణకథల్లొ వున్న flexibility వీటిల్లో ఏర్పడింది.నేను రాసిన కథకు మూలం మైధిలీ శరణ్ గుప్త్ హిందీలో రాసిన కవిత. కాకపోతే అది నేను 9దో తరగతిలో చదవటం వలన కేవలం concept గుర్తుంది. అందుకని వీలైనంత గుర్తుచేసుకుని రాసాను. ఈ కథకు చారిత్రకత లేదన్నది అందరూ అంగీకరించాల్సిన సత్యం.This is an imaginary extension.


యశోధర లాగానే ఈ కవి ‘ఊర్మిళ’ అని రామాయణంలో సాధారణంగా అత్యంత insignificant అయిన లక్ష్మణుడి భార్య గురించికూడా రాసారు. పూర్ణిమ చెప్పింది దానిగురించే అనుకుంటాను.ఇక్కడ అపోహలకి ఆస్కారం లేదు.

చరిత్రపరంగా చూస్తే యశోధర భిక్షువుగా మారినమాట నిజం. అంతేకాక భార్యా, తల్లీ బౌద్ధాన్ని తీసుకుని విహారాల్లో వుండటానికి బుద్దుడు సంశయిస్తే,వారి ముఖ్యశిష్యుడు (పేరు సుందరుడనుకొంటాను)వారితో జరిపే సంవాదంకూడా చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఎక్కడో వుండేవుంటుంది. చూస్తాను.

అంతేకాకుండా యశోధర, బుద్దుడి వారసత్వంకావాలని రాహుల్ ని అడగమటం గురించి కూడా చాలా మంచి కథ వినికిడిలోవుంది. దానినీ నేను తవ్వాల్సిందే. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన విషయాలు మళ్ళీ నాకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

@అబ్రకదబ్ర: దర్జాగా లంకెపెట్టుకోండి. నా బ్లాగు open source software లాంటిది. Its always free for use.

@బాబాగారూ: ఇది కథద్వారా చెప్పిన నిజం.

@నాగమురళి: వ్యక్తిగత సత్యాన్ని సాధించిన ప్రతివ్యక్తీ ఇతరుల సత్యాన్ని అంతే గౌరవిస్తాడు. అందులో సార్వజనిక,విశవజనీయ, సామాజిక సత్యాలుకూడా వస్తాయి. కాకపోతే ఇప్పుడున్న సమస్యల్లా సామాజిక సత్యమే వ్యక్తిగతసత్యంగా బలవంతంగా అంగీకరింపజేయబూనడం. అందుకే ఈ విధానాన్ని నేను ఎక్కడో "second hand values" అన్నాను.

ప్రతిమనిషీ ‘తన సత్యాన్ని’ తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నదే ఇక్కడ యశోధర చెప్పేది.ధ్యానం (అనుభవం) ద్వారా తెలుసుకున్న పరమసత్యాన్ని ఎవరూ ఇతరులకి తెలియజెప్పలేరు. చెప్పినా ఆసత్యం అర్థసత్యమవుతుందేతప్ప పూర్ణసత్యం అవదు. అదే పరమసత్యాన్ని మించిన సత్యం.

@అన్నీ అమూల్యం: మీ సందేహం చాలా సహేతుకం. కొంత వీరిగురించి చదవడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.

@పూర్ణిమ: ‘ఊర్మిళ’ గురించి నేనూ వినడమేగానీ చదవలేదు. ఇప్పుడు ప్రయత్నిస్తాను.ఇది ముమ్మాటికీ కల్పనే అయ్యుండొచ్చు. లేదా కవిచెప్పినట్టే జరిగుండకపోవచ్చు. కానీ ఇందులో తెలుసుకోవలసిందీ,నేర్చుకోవలసిందీ తీసుకుని మిగతాది వదిలెయ్యడమే!

సుజాత said...

పూర్ణిమా,
"..అక్కడితో మా పాఠాలు ఆగిపోయాయి. బాగా చెప్పావు. ఊర్మిళ గురించి కొంత వరకు తెలియాలంటే రామాయణ విషవృక్షం చదువు(రంగనాయకమ్మ గారి దృక్కోణం నుంచి ఊర్మిళను చూస్తావు)! ఇంకెవరో కూడా ఊర్మిళను గురించి రాసినట్టు బాఘా గుర్తు! ఎవరో గుర్తు రావడం లేదు.

సత్యాలు, పరమ సత్యాల గురించి నీ అభిప్రాయెమే నాదీనూ! జీవితమొక్కటే మన చేతుల్లో ఉన్నది, కనీసం ప్రస్తుతానికి. దీన్ని వీలైనత ఆనందంగా జీవించేలా మలుచుకోవాలి. అదొక్కటే నేను నమ్మేది.

Anonymous said...

సుజాత గారూ. ప్లీజ్.. మీరు కూడా..?

"అక్కడితో ఆ పాఠాలు ఆగిపోయాయి". ఇట్స్ ఓకే అండీ. పాఠాల్లో అన్నీ కవర్ చేయలేరు. అందులోనూ ఇలాంటి ఫిక్షన్ ని అస్సలు పెట్టకూడదు.

ఫిక్షన్ ని చాలా క్లియర్ గా, ఇది కల్పితం అని పెట్టి రాస్తే పర్లేదండి..అలా కాకుండా నిజమనే అర్ధం వచ్చేలా రాస్తేనే డేంజరస్..నేనిలాంటివి చిన్నప్పుడు చాలా చదివి, చాలా తప్పుడు అభిప్రాయాలని ఏర్పరచుకున్నా. Unlearning is a very tough process.

"విషవృక్షం" చదివా. అది కేవలం రంగనాయకమ్మ గారి "చాలెంజ్, సర్కాజం" అని, అది నిజమయిన చరిత్ర కాదు అని చదివే వాళ్ళందరికీ స్పష్టంగా తెలుస్తుంది. అలాగే దానికి కౌంటర్ గా రాసిన "రామాయణ విషవృక్ష ఖండన"(లత గారిదనుకుంటా?!) కూడా అంతే.

ఎవరైనా ఒక వ్యాసం రాస్తే పర్లేదండీ..రామున్ని తిడుతోనో, ప్రశ్నిస్తూనో, అలాగే ఇక్కడ బుద్దున్ని విమర్శిస్తూనో... జయప్రభ గారెప్పుడో రాసారు. బుద్దుడి భార్య పరిస్థితి ఏంటీ అని. ఎంతకీ దొరకట్లేదు నాకు, వెతుకుతుంటే. It's perfectly acceptable and infact it offers a different perspective. It enriches the reader.
నాకెక్కడ నచ్చదంటే, నిజమయిన మనుషుల్ని(పాత్రల్ని?!) బలవంతంగా లాక్కొచ్చేసి, వాళ్ళ మధ్యన "సంభాషణలని ఇరికించేసి" అవి నిజంగా జరిగాయేమో అన్నట్లుగా భ్రమిపజేసేసి, కొత్తగా చదివే వాళ్ళని, లేక పైపైన చదివే వాళ్ళని మిస్ లీడ్ చేసేట్లుగా ఉండడం నాకస్సలు ఇష్టం ఉండదు.

Mahesh- There are no veiled references here. You have already stated that this is imaginary extension in your comments. I just wish it was boldly written at the begining of the article.

Saraswathi Kumar said...

పరమ సత్యానికి, వ్యక్తిగత సత్యానికి 'వైరుధ్యం' ఉండదు. ఎవరికివారు తమ వ్యక్తిగత సత్యాన్ని తెలుసుకోవడానికి కావల్సిన మూలసూత్రాన్ని,మార్గదర్శకత్వాన్ని పరమ సత్యం అందిస్తుంది.పరమ సత్యంతో వ్యక్తిగత సత్యానికి వైరుధ్యం ఉండకపోవడమే కాదు.. ఆ పరమ సత్యాన్ని అనుసరించిన ఏ రెండు వ్యక్తిగత సత్యాల మధ్యన కూడా సంఘర్షణ ఉండదు.వ్యక్తిగత సత్యం పరమ సత్యాన్ని మించిన సత్యం కాదు.. పరమ సత్యానికి లోబడిన సత్యం. అందుకే పరమ సత్యం అత్యంత ఆవశ్యకమైనది.

"పరమ సత్యం ఇప్పటికీ ఎవరికీ తెలీదు".

'ఇప్పటికీ ఎవరికీ తెలీదు ' అన్నది నిజమే కానీ 'ఎప్పటికీ ఎవరికీ తెలీదు 'అని అంటే మాత్రం అది నిజం కాదు. ఎందుకంటే ఎప్పటికైనా మానవుడు పరమ సత్యాన్ని తెలుసుకుని తీరతాడు. అది రేపే కావచ్చు.

అశ్విన్ బూదరాజు said...

నేను విన్నదీ ....
ఇంతా చేసినా బుద్ధుడు పంది మాంసము భుజిస్తూ గొంతుకడ్డం పడి చనిపోయాడని ఓ పెద్దాయన ద్వారా విన్నాను అదెంతవరకూ నిజం మహేష్ గారు, నాకు ఇప్పటికప్పుడు వద్దు, ఓ సారి కనుక్కుని చెప్పగలరు, బ్లాగ్ప్రంచములోని పెద్దలైనా సరే

Purnima said...

@independent:

First things first, lemme assure that I didn't get carried away by the theory proposed here. Just because it's by a famous poet, I can't blindly believe it. But even though it's a fiction I liked the concept. I'm really lost when there is this discussion about "satyam", "paramsatyam" and all. May be, I learn it as I go ahead. May be! But one thing I would like to emphasis is that, before leaving my earlier comment I did make sure to know about the poet and his writings.

And when I mentioned Urmila, I was referring a poem called "Saket", which is Ramayana from Urmila's point of view. Now I know this is mere imagination, but still wud love to read it. I love imaginations, don't I? ;-)
నిజమయిన మనుషుల్ని(పాత్రల్ని?!) బలవంతంగా లాక్కొచ్చేసి, వాళ్ళ మధ్యన "సంభాషణలని ఇరికించేసి" అవి నిజంగా జరిగాయేమో అన్నట్లుగా భ్రమిపజేసేసి, కొత్తగా చదివే వాళ్ళని, లేక పైపైన చదివే వాళ్ళని మిస్ లీడ్ చేసేట్లుగా ఉండడం నాకస్సలు ఇష్టం ఉం... That's the exact reason why he is making me excited. And I'm sure that my attempt would be to understand the perspective rather than believing fiction as ultimate truth.

True, all are not taught at school. That's why we remain students for life. Kada? :-)

I guess, I've been in the nick of leaving ambiguous / half baked comments. Would be working on that. Nevertheless, thanks for your concern about we being misled.

రవి said...

మహేశ్, ఇది వ్యక్తిగతం అన్నారు కాబట్టి, మీ ఆలోచనలు బావున్నాయి. అయితే, మైథిలీ శరణ్ గుప్త, ఈ అభిప్రాయాలను బుద్ధుడికి ఆపాదిస్టే (అలా ఆపాదించాడా అన్నది నాకు తెలియదు) మాత్రం, అది పొరబాటు చెప్పడానికి సాహసిస్తున్నాను.

Truth is neither personal, nor impersonal -JK. It is్...దీన్నే, తథాత (తథా అత - థట్స్ హౌ ఇత్ ఇస్) అని తథాగతుడు. అలానే బుద్ధ బోధ సారాన్శం "ఆత్మ దీపో భవ". ఆర్య అష్టాంగిక మార్గం, ప్రతీత్య సముత్ప్దాం, వజ్రచ్చేదిక, వగైరాలు ఇంపెటస్/ స్తిములంత్స్ మాత్రమే.

అశ్విన్ : నిజమే. సూకర మద్దనం అన్న డిష్ తిని, లివర్ కాన్సర్ వచ్చి చనిపోయాడు (అట) బుద్ధుడు. ఈయన నాన్ వెజ్ తినడమా (తినమని చెప్పడమా)? అన్న దానికి సమాధానం ఈ నెల ఓషో టైంస్ పత్రికలో చక్కని సమాధానం ఉంది.

శ్రీకాంత్ said...

కెరటాలు మహా సముద్రం లో భాగమైనట్టే, వ్యక్తి సత్యం పరమ సత్యం లో భాగమే . తన పరిసరాలలో మార్పు లేనంత కాలం, మార్పు రానంత కాలం వ్యక్తిగత సత్యం వునికి కల్గి ఉంటుంది .పరిసరాలు అనే పదం మనస్సు , ప్రకృతి ,మనుగడ మొదలైన వాటికి సంకేతం గా వాడాను.ఉదాహరణకు యుద్దాలు ,ప్రకృతి వైపరిత్యాలు,మంచి పరిపాలన ,సకాలంలో వర్షాలు వంటివి దాదాపుగా అందరికి ఇబ్బంది నో ,ఆనందాన్నో ఒకేరకంగా కల్గిస్తాయి .మన పరిమితుల పరిధి లో వ్యక్తిగత సత్యం నిలిచి వుంటుంది . వ్యక్తి సంఘం లో భాగమే కాని , సంఘం వ్యక్తుల యొక్క సముదాయం .బ్లాగు లోకం లో ఎవరి బ్లాగు వారిది .ఎవరి రాత వారిది. కాని మనమందరం కూడలి ని common code గా కలిగిఉన్నాము

అన్ని వ్యక్తిగత సత్యాల అంతర్ సూత్రం పరమసత్యమే .

కత్తి మహేష్ కుమార్ said...

@ఇండిపెండెంట్: చారిత్రక నవలలూ కథలు అనేవి సాహిత్య ప్రక్రియలో భాగం. అవి భ్రమింపజేయడానికో లేక తప్పుడు చారిత్రకనిజాల్ని సృష్టించడానికో వాడరు. కేవలం ఒక fictional premise సృష్టించడానికీ,interpretative value కల్పించడానికీ, ఆసక్తి కలిగించడానికీ వాడతారు.

ముదిగొండ శివప్రసాద్, అడివి బాపిరాజు వంటి రచయితల చారిత్రాతమక నవలలు తెలుగు పాఠకుల్ని ఎంతగా అలరించాయో మీకు తెలియదా? నాకు ఈ తరహా నవలల్లో ‘శ్రావణి’,‘గోనగన్నారెడ్డి’చాలాబాగా నచ్చాయి.

ఇలాంటి శైలిని చూసు భ్రమించి "ఇదే చరిత్ర" అనుకునే పాఠకులు ఇక్కడున్నారనేది నాకు సందేహమే.అందుకే మీరన్నట్లు "బోల్డుగా ఇది ఫిక్షన్" అని చెప్పలేదు.

@సరస్వతీకుమార్: ఇక్కడ చెప్పింది పరమసత్యాన్ని ధ్యానం ద్వారా అనుభవించి తెలుసుకున్న ఒక వ్యక్తి ఇతర ప్రజలకు దాన్ని కూలంకషంగా అర్థం చేసుకునేలా చెప్పలేడేమో! అని మాత్రమే. అంతేకాక, స్వీయానుభవం లేని జ్ఞానం కొంత సందేహాస్పదమే అన్నది నిజమే కదా.

అయినా సామాన్యమానవులకి పరమసత్యంకన్నా, వ్యక్తిగతసత్యం ద్వారా అవగతమైన "నిత్యసత్యం" యొక్క ప్రాముఖ్యత ఎక్కువ. పరమసత్యం జ్ఞానుల అవసరం. సామాన్యులకి కాకపోవచ్చు.

@అశ్విన్: బుద్దుడు విషాహారసేవన వల్ల జరిగిన reaction తో చనిపోయినట్లు అందరు చరిత్రకారులూ అంగీకరించారు. కానీ తను తిన్నది ఏమిటి అన్నదాని మీద వివాదాలున్నాయి.

రవిగారు చెప్పినట్లు "సుకరమద్ధవ" తిన్నట్లు చెబుతారు. కానీ దీనికి ‘పందిమాసం’, ‘పందులకు ఇష్టమైనది’,‘పందులతో తొక్కబడేది’ అనే అర్థాలున్నాయి. వీటి ఆధారంగా ఒక conclusive నిర్ణయం తీసుకోవడం కష్టం.అయినా అతను తిన్నది veg అయినా, non-veg అయినా పెద్ద తేడా లేదని నా వ్యక్తిగత అభిప్రాయం.

@పూర్ణిమ: I endorse your opinion.

@రవి: మూలకథ మాత్రమే నాకు గుర్తుంది.కథనం విషయం నా కల్పన.కాబట్టి ఈ కథ భాధ్యత నాదే. కాబట్టి పొరపాటు అని మీకు అనిపిస్తే that is directed to me.నాకు బౌద్దధర్మం గురించి నాకు సాధికారత లేకున్నా ఈ concept నన్ను చిన్నప్పుడు (9th classలో) బాగా ప్రభావితం చెయ్యటం వలన గుర్తుంది. ఆ గుర్తున్నవాటికి నా రంగులద్దానంతే.

@శ్రీకాంత్: మీ విశ్లేషణ బాగుంది. తన ప్రపంచం చిన్నదైన సామాన్యడు పరమసత్యంకన్నా, వ్యక్తిగతసత్యాన్ని తన స్వీయానుభవంద్వారా త్వరగా తెలుసుకోగలడు అని నా నమ్మకం. అంతేకాక,ధ్యానం ద్వారా పరమసత్యాన్ని తెలుసుకున్న ఎవ్వరూ కూలంకషంగా వేరొకరికి ఆ జ్ఞానాన్ని చెప్పలేరు. Knowledge of Absolute Truth only comes through experience and it may not be easily shared through words. కాబట్టి,మొదట వ్యక్తితన సత్యాన్ని తెలుసుకుని తరువాత పరమసత్యం దిశగా కావాలంటే వెళ్ళచ్చు. అయినా అందరూ పరమసత్యాన్ని ఆశించేవారు కాదు కదా!

@సుజాత గారు: చరిత్ర కేవలం facts చెబితే సాహిత్యం వాటికి అనువైన భాష్యం entertainingగా చెబుతుంది. దేని విలువ దానిదే. Information కోసం అయితే చరిత్ర చదవండి.అనుభవించడానికి చారిత్రాత్మక సాహిత్యం చదవండి.

ఇక సత్యాలంటారా...అవి నాకు మాత్రం పూర్తిగా అర్థమయ్యారనుకుంటున్నారా! అదొక ప్రయత్నం. విశ్లేషణ. అంతే.

Anonymous said...

splitting the hairs..ఇష్టం లేదు కానీ.. చివరగా ఒక్కమాట.
"ఇదే చరిత్ర" అనుకునే పాఠకులు ఇక్కడున్నారనేది నాకు సందేహమే"..
వెల్..బాబా గారే "నిజమా" అన్నారు. నా చిన్నప్పుడు నేను చాలా unlearn చేసుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటి రచనలు చదువరి కున్న డెప్త్, అండర్స్టాండింగ్ మీద ఆధారపడతాయి.

ఇదిగో పులి అంటే అదుగో తోక అనే gullible ప్రజలతో the so-called learned personalities in all fields(politics, religion, spirituality, mythology etc.,) రకరకాల parables తో ఎంత ఆడుకొంటారో అనే దానికి మానవ జాతి చరిత్రే పెద్ద ఉదాహరణ.

ఇట్లాంటివి రాయడం తప్పు అని నేను అనలేదు, అనుకోను కూడా..If it was for me, I would give a disclaimer in the begining. చెప్పాలనిపించింది చెప్పా. I take rest now. It's no big deal.

నాగన్న said...

"ప్రపంచంలో ఒకే పరమసత్యం ఉన్నప్పుడు, అది అంత:పురంలో లేకుండా అడవిలో ఎలా దొరుకుతుందనుకున్నావు?"

బయట ఉన్న భౌతిక ప్రపంచంలో పరమ సత్యం లేదు అందుకే ఎవరు ఏ రకంగా బయట వెతికినా దొరకడం లేదు :)

శ్రీకాంత్ said...

స్వీయానుభవం ద్వారా మాత్రమే పరమసత్యమైనా , వ్యక్తిగత సత్యమైనా ప్రత్యక్షమౌతాయి. ధ్యానం ద్వారా దర్శించిన పరమసత్యాన్ని అందరికి అందించ లేక పోవటానికి కారణం వారి లోపం కాదు.వారు ఉన్న స్థాయి , మనం అనుభవలోపం వల్ల అందుకోలేక పోవటం, మన వ్యక్తిగత సత్యం మనకు ముఖ్యం కావటం .మన అనుభవమే సార్వజనీనమని భ్రమించటం .వ్యక్తి తనకేం కావాలో తెలుసుకోవటం వ్యక్తి గత సత్యమని , తనను తాను తెలుసుకొని ,తద్వారా లోకాన్ని సహానుభూతి తో అర్ధం చేసుకొని వేర్పాటు భావన ను వదిలించుకోవటమే పరమ సత్యాన్ని తెలుసుకోవటం అని నా అభిప్రాయం.