Thursday, November 5, 2009

ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర


మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేదు. నిజానికి ఎందరో దళితేతరుల కృషి లేకపోతే దళిత ఉద్యమమే లేదు. కాబట్టి ఇక్కడా అది చెల్లదు. 

కానీ...తెలుగు భాషలో నిర్బంధ విద్య కావాలి అని కోరుకునేవాళ్ళు తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పించకపోయినా, కనీసం చేర్పించిన స్కూళ్ళలో తెలుగు కోసం శ్రమించినవాళ్ళో,వాదించినవాళ్ళో లేక పేరెంట్స్ కమిటీలో ప్రస్తావించినవాళ్ళో ఉండాలనుకోవడంలో తప్పులేదని నా ఉద్దేశం. ఎందుకంటే, తమ పరిధిలోనే తెలుగు కోసం పోరాడని ఈ సాహసవంతులు ఉద్యమాలు చేసి ప్రభుత్వాల్ని మారుస్తామంటే నమ్మడానికి చెవిలోపూలు పెట్టుకున్నవాళ్ళు బ్లాగుల్లో కొందరున్నా, అందరూ అలా ఉండరని చెప్పడానికి ఆమాత్రం ప్రశ్నించక తప్పదు.

ప్రాధమిక విద్యలో తెలుగు తగ్గిపోతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఎక్కడా లేవు. సంఖ్యాపరంగా ఈ వాదం ఎక్కడా నిలబడదు. 2005-06 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 50,895 ప్రాధమిక పాఠశాలలున్నాయి.విధ్యార్థుల సంఖ్య 30,84,212. ప్రైవేటు పాఠశాలల్లో కేవలం 3,570. విద్యార్థలు 6,03,160. ప్రభుత్వపాఠశాలల్లో తెలుగులోనే బోధిస్తారనేది అందరికీ తెలిసిందే. ప్రాధమికోన్నత విద్యలో కూడా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏదో కుట్రచేసి తెలుగును చంపేస్తుందనటం తెలియనితనం. ప్రభుత్వం తన ముస్లిం appeasement కోసం తెలుగుని పట్టించుకోవటం లేదనడం మూర్ఖత్వం. ఉర్దూ చదివిన ముస్లింలు పాకీస్తానీలు అయిపోయి శతృవర్గంగా తయారవుతారనడం ఉన్మాదం.

తెలుగు భాష కోసం మొత్తుకుంటున్న మేధావుల పిల్లలెవరూ తెలుగు మీడియం చదువులు చదవటం లేదు. వీళ్ళు ప్రభుత్వం మీదపడి స్టేజిల్లోనూ,బ్లాగుల్లోనూ ఏడవటంతప్ప క్రియాశీలకంగా తెలుగును ఒక ప్రజాఉద్యమంగా ఎన్నడూ చెయ్యాలనుకోలేదు.ఎందుకంటే,ఒక్కసారి ప్రజల్లో పడితే వీళ్ళబ్రతుకులు కుక్కలుచింపిన విస్తరే. "మీకు మాత్రం ఇంగ్లీషు చదువులూ మాకు మాత్రం తెలుగు బ్రతుకులా" అని ప్రజలు అడిగితే వీళ్ళు మొఖం ఎక్కడబెట్టుకుంటారో వీళ్ళకే తెలీదు.

ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం,ప్రజాఉద్యమాలకున్న ప్రాధాన్యత మీకు తెలియంది కాదు. సరిగ్గా ఈ పరిస్థితినే రాష్ట్రప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి వాడుకుంటోంది. పాఠశాల విద్యను 6-12 వరకూ చేసి ఇంగ్లీషు-హిందీ చేస్తే కేంద్రప్రభుత్వం తేరగా నిధులిస్తుంది.రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులు విద్యాశాఖలు కేటాయించాల్సిన పనిలేదు. ప్రాధమిక విద్య ఎలాగూ SSA (సర్వశిక్షా అభియాన్) పుణ్యమా అని కేంద్రం నిధులతో గడిచిపోతోంది. పాఠశాల విద్యకూడా ఒదిలిపోతే ఒకపనైపోతుందనేది ప్రభుత్వ విధానం.

ఈ తెలుగు భాషా ‘బాధ’కులకు మిగిలింది మూడు options. ఒకటి భాషాబోధనను మార్చడం. అది వాళ్ళు చచ్చినా చెయ్యరు. ఎందుకంటే అదే "అచ్చతెలుగు" అనేది వీళ్ళ పిచ్చినమ్మకం. భాషా వారసత్వం వీరికి ముఖ్యం. భాష కాదు. వీరికి వర్తమానంకన్నా భూతకాలపు వైభవం ముఖ్యం.ప్రజల తెలుగుకన్నా, సారస్వతం ముఖ్యం.

రెండోది. ఏ ఆర్థిక కారణాల వల్లనైతే ప్రభుత్వం ఇంగ్లీషుమీడియం చదువులవైపు మొగ్గుచూపతోందో ఆ ఆర్ధిక కారణాన్ని రూపుమాపడం. స్వచ్చందంగా "భాషా సెస్" విధించమని ప్రభుత్వానికి చెప్పి,తెలుగు భాషా పరిరక్షణకోసం ట్యాక్స్ కట్టడానికి తయారవ్వడం. ఈ పని వీళ్ళు చేస్తారని నాకు అస్సలు నమ్మకం లేదు. ఏదో తెలుగు భాషకోసం lip service వరకూ చేస్తారుగానీ జేబులోంచీ డబ్బుతీసి తెలుగు భాషను రక్షించడమంటే..హమ్మో!

మూడొది. తెలుగు భాషను ఒక రాజకీయ ఉద్యమం చెయ్యడం. అన్ని రాజకీయపార్టీల మ్యానిఫెస్టోలోనూ తెలుగు భాషను "రక్షించే"(what ever it means to them)విధంగా చర్యలు ప్రతిపాదింపజెయ్యడం. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు పరిచేలా ఒత్తిడి తేవడం. లోక్ సత్తా లాంటి స్థానిక పరిపాలన తెలుగులో జరగాలని కోరుకునే పార్టీల నెత్తిన తమ ఆభిజాత్యాల్ని రుద్ధకుండా, పరిపాలనా తెలుగును సర్వత్రా ఉపయోగించేలా చర్యలు తీసుకుంటూ స్వచ్చందంగా దానికోసం పాటుపడటం.

పైవేవీ ఈ పెద్దలు చెయ్యరు చెయ్యలేరు...ఎందుకంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం తెలుగు భాష బ్రతకడం కాదు, తెలుగుతప్ప మరేదీ చదువుకోలేని ఒక తరగతి ప్రజల్ని మరో యాభైసంవత్సరాలు ఈ గొప్పోళ్ళకు వాళ్ళవారసులకూ పోటీరాకుండా చెయ్యడం. అందుకే తెలుగు భాష గురించి emotional rhetoric మాట్లాడతారేగానీ,విద్యాప్రమాణాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం తెలుగు కోసం ఏదో చెయ్యలంటారుగానీ, వీళ్ళు మాత్రం ప్రైవేటు విద్యకు మహారాజపోషకులు. అందరూ నిర్భంధ తెలుగు విద్య అభ్యసించాలంటారుగానీ,వీళ్ళ పిల్లలు మాత్రం కాన్వెంటుల్లో రాజ్యమేలుతుంటారు. They are the most dangerous people at this point in time. Beware of them.


23 comments:

కెక్యూబ్ వర్మ said...

మేడిపండు పొట్ట విప్పేసారు. హేట్సాఫ్ టు యు సార్.

విజయ క్రాంతి said...

ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో CBSC ప్రవేశ పెట్టినట్టు విన్నాను . అలా అయితే మీరు చెప్పే లెక్కల్లో చాల మార్పులు వుంటాయి రాబోయే కాలం లో .
మీరు చెప్పేది బానే వున్నా ..ఎందుకో ఈ సమస్య ప్రభుత్వనిదో , వుద్యమాలదో ఇంకా ఏదో చేస్తే తీరేది కాదు . నిజంగా భాషను ప్రేమిస్తే జరిగే పని .
తల్లిదండ్రులూ ,సమాజంలో ప్రతి వొక్కరి పని ...

Anonymous said...

*తెలుగుతప్ప మరేదీ చదువుకోలేని ఒక తరగతి ప్రజల్ని మరో యాభైసంవత్సరాలు ఈ గొప్పోళ్ళకు వాళ్ళవారసులకూ పోటీరాకుండా చెయ్యడం.*

ఇంతకి ఆ ఒక తరగతి ప్రజలను చూసి ప్రస్తుత గ్లోబలైసషన్ జమానాలో అది కూడా మీరు చెప్పె విద్యా రంగం ఈ గొప్ప వాళ్ళెవరు ఎవరు పోటీ గా భావించటం లేదు. చూడ బోతె ఈ వ్యాఖ్య ఆచార్య పదవి/ఉప కులపతి పదవి రాని వ్యక్తి తన గోడును వెళ్ళబోసుకున్నట్లు లా ఉంది. మీరు మరో యాభైసంవత్సరాలు గురించి మాట్లాడు తున్నారు, గత
60 సం|| కాలం లో అభివృద్ది చెందిన లేక వీరి తో పోటి పడటం మన వల్ల కాదు అనే విధం గా ఉండె 100 మంది ఒక అరగతి ప్రజల పేర్లు చెప్పగలరా?

Kathi Mahesh Kumar said...

@డమ్మీ: గ్లోబలైజేషనా! ఎవరికి బాబూ గ్లోబలైజేషన్? ఎంతశాతం మందికి గ్లోబలైజేషన్? ఒకసారి హైదరాబాద్ దాటి బయటికిరా లేకపోతే అమెరికా వదిలి పల్లెలకి రా అప్పుడు కనిపిస్తుంది గ్లోబలైజేషన్ మరో రూపం. Its just a sophisticated suppression and oppression. ఆ తరగతి గురించే నేను మాట్లాడుతోంది. మీతరగతి గురించే జాగ్రత్త చెబుతోంది.

Praveen Mandangi said...

పల్లెటూరివాడికి గ్లోబలైజేషన్ గురించి అడిగితే ఒక్క ముక్క కూడా చెప్పలేడు. గ్లోబలైజేషన్ అనేది కొద్ది మంది ప్రయోజనం కోసమే అని ఈ ఉదాహరణ చూస్తే తెలిసిపోతోంది.

మాగంటి వంశీ మోహన్ said...

సుమారు సంవత్సరన్నరలో ఈ బ్లాగులో రాసిన టపాల్లో నాకు ఒక మోస్తరుగా నచ్చిన టపా ఇది. Not that you care :)

ఇది అనేక వాదోపవాదాల తర్వాత సంగ్రహించిన సారాంశమో, స్వతహాగా - స్వంత ఆలోచనతో రాసినదో అర్థం కాకపోయినా, ఇమిడి వున్న వెటకారపు పలుకులని పక్కకు తోసేసి టపా సరిగ్గా చదివితే, ప్రతిపాదించిన కొన్ని మటుకు బాగున్నాయి. నిజంగా బాగున్నాయి. అభినందనలు.

ఎగతాళి, వెటకారం వదిలిపెట్టి అవే "మంచి" పలుకులు ప్రాతిపదికగా ఇంకా కొన్ని ప్రతిపాదనలు (ఆచరణీయమో కాదో సంగతి తర్వాత!) చెయ్యవచ్చేమో అని ఆలోచించే టపాకోసం ఎదురుచూస్తూ. సాయం చెయ్యవచ్చుగా అంటే.. :) :) :) రేరాజ్ ని జత కలుపుకోమని చెప్పటమయినది....

నా సాయం అవసరంలేదు. ఎందుకో తెలుసు...అదీ సంగతి.

వంశీ

Anonymous said...

మరి మీరు పల్లేల సంగతి మాట్లాడుతున్నారు కనుక పల్లెల లో వాళ్ళకి తెలుగు ఉపయొగం కాని ఇంగ్లిష్ నేర్చుకొని ఎమీ చేస్తారు? ఇంగ్లిష్ నేర్చు కుంటె అక్కడేమి ఉద్యొగాలు వస్తాయని?

karthik said...

good comedy post.

Kathi Mahesh Kumar said...

@డమ్మీ: అంటే మొత్తానికి పల్లెలోవాళ్ళు పల్లెల్లోనే చాలీచాలని బ్రతుకులు బ్రతకమంటారు. బాగుంది. అదేనా మీ గ్లోబలైజేషన్? అయినా ఇంగ్లీషు కేవలం ఉద్యోగానికి కాదు.అదొక మంత్రదండం. చాలా మ్యాజిక్కులు చేస్తుంది.

@విజయ క్రాంతి: CBSC ప్రవేశపెట్టినా పదోతరగతి వరకూ తెలుగును ప్రధమభాషగా చదవొచ్చు. నేను అలాగే చదివాను.

అనుభవిస్తే భాషను ప్రేమించొచ్చు. నీది సరైన భాషేకాదంటే ప్రేమెక్కడ మిగులుతుంది? ఇప్పటివరకూ అదే జరిగింది. ఎవరైనా రాయలసీమ-తెలంగాణా వాళ్ళుంటే అడిగిచూడండి.

Anonymous said...

మీరు భాషాభిమానుల వాదనల్ని అర్థం చేసుకోకుండా అందరినీ ఒకే గాటన కట్టి మీ తరహాలో మీ దాడి మీరు చేస్తున్నారు. ఇది వారిని సక్రమంగా అర్థం చేసుకోవడానికి ఉపకరించదు. వాదనని బట్టి భాషాభిమానుల్లో చాలా రకాలున్నారు.

౧. తెలుగు ప్రాథమిక విద్య వరకు ఒక మీడియమ్ గా ఉండాలని వాదించేవారు.

౨. తెలుగు మొత్తం పాఠశాలా స్థాయి దాకా ఒక మీడియమ్ గా అమలు కావాలని వాదించేవారు

౩. తెలుగు ఒక మీడియమ్ గా అవసరం లేదు. పదో తరగతి వరకు ప్రథమ భాషగా ఉంటే సరిపోతుందని వాదించేవారు.

౪. అసలు ఏ స్థాయిలోను ఇంగ్లీషు వద్దు. పుట్టినప్పటినుంచి చచ్చేదాకా అన్నీ తెలుగులోనే ఉండాని వాదించేవారు. ఈ విధమైన అతివాదుల్ని అక్కడక్కడే చూస్తాం.

ఈ అభిప్రాయాల్లోని విభేదాలెలా ఉన్నప్పటికీ వీరిలో ఏ రకమైన అభిమానులైనా చెబుతున్నది - ఈ సూత్రాల్ని అందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ! అంతేతప్ప అగ్రకులాలకి ఒకలా, నిమ్నకులాలకి ఒకలా చెయ్యమని కాదు. వర్గ, లింగ, కుల, మత, ప్రాంత విచక్షణ లేకుండా తెలుగుభాషకి అనుకూలంగా రాష్ట్రమంతటా ఒక సార్వజనిక భాషాపాలసీని అమలు పఱచమని వారు చెబుతున్నారు. ఇందులో మీకు అభ్యంతరకరమైనదేంటో మీ టపా ద్వారా తెలియడం లేదు. అందరికీ ఒకే విధంగా వర్తించే భాషాపాలసీ గల విద్యావిధానం ఈ రాష్టంలో లేకపోవడం ఒక సాంఘిక సమస్యేనని మీరు అంగీకరిస్తారనుకుంటాను.

Kathi Mahesh Kumar said...

@ఓబుల్ రెడ్డిగారు: ప్రాధమిక విద్యవరకూ తెలుగు ఉండటం పిల్లల వికాసానికి ముఖ్యం. కానీ బోధనావసతులూ,భాషా బోధనాపద్దతులూ సంస్కరింపబడనంత వరకూ తెలుగు ఉన్నా పెద్ద తేడా రాదు. అందుకే మూలసమస్యల గురించి ముందు చర్చించమంటున్నాను.

ఇదివరకూ ఒక భాషాకమిటీ ఇచ్చిన నివేదికలోని కొన్ని బిందువుల్ని చూడండి.

1)మొదటి ఐదు తరగతుల్లో మౌఖికంగా బాల సాహిత్యం (పాటలూ,గేయాలూ,గీతాలూ,కథాపఠనం) నేర్పుతూ కేవలం ఆక్షరాలు రాయడం,చదవడం నేర్పాలి.

2)ఆరు ఏడు ఎనిమిదో తరగతుల్లో వాడుకభాషలోని కథలు,వ్యాసాలు,వాడుక భాషకు దగ్గరగా ఉండే శతక పద్యాలు ఇతర గేయాలను పరిచయం చెయ్యాలి. కథావ్యాసాల్లోని ఆలోచనల్ని,అభిప్రాయాల్నీ అర్థం చేసుకోవడం,విస్తరణ,కుదింపు,వాక్యనిర్మాణం (దానికి సంబంధించిన వ్యాకరణం) వంటి ప్రక్రియలలో నిపుణుల్ని చెయ్యాలి.నిఘంటువు శోధనను అనివార్యం చేసే చర్యలు చేపట్టాలి. తద్వారా పిల్లల్లోని ఆలోచనా శక్తిని,సృజనాత్మకనూ పెంపొందించి స్వయంగా తమ ఆలోచనల్ని రాసేవిధంగా ప్రేరేపించాలి.
ఉపవాచకాలుగా ట్రావెలాగులు,విహారప్రదేశాల వర్ణనలు వంటివి పరిచయం చెయ్యడం ప్రోత్సహించదగినవి.

3)తొమ్మిది పది తరగతుల్లో తెలుగును రెండు సమ భాగాలుగా చేసి పద్యసాహిత్యం ఒకవైపు గద్య సాహిత్యం మరొకవైపూ బోధించాలి. పద్యసాహిత్యాన్ని ఆధునిక కవితలతో మొదలుపెట్టి ఛంధోబద్ధమైన పద్యాల వరకూ అన్ని ప్రక్రియలతోనూ పరిచయం కలిగేలా బోధించాలి. గద్యసాహిత్యంలో కథ,కథానిక,గల్పిక,నవలిక వంటి ప్రక్రియను పరిచయం చేస్తూ పాఠ్యాంశాలను జతచెయ్యాలి.
ఉపవాచకంగా నవలా సాహిత్యాన్ని లేక నాటకాన్ని పరిచయం చెయ్యడం ఉత్తమం.

కానీ బ్లాగుల్లో తెలుగుబాధపడుతున్నవారి చిత్తశుద్దిని నేను శంకిస్తాను. వాళ్ళ నిబద్ధత నాకు ప్రశ్నార్థకం. వాళ్ళ ఉద్దేశాలు లోపభూయిష్టం. అందుకే వారి గురించి రాస్తున్నాను. అంతేతప్ప భాషాభిమానుల్ని అందరినీ ఒకగాటన కట్టడం లేదు. I am a trained language teacher myself and know the importance of mother tongue. I also know the conspiracy behind these "reformists".

Unknown said...

అనవసరంగా అందరిమీదా పడి ఏడుస్తున్నారనిపిస్తుంది..

Uday said...

మహేష్ గారు,

మీరు అన్నట్లు ఎదొ కుట్రతో తెలుగు భాష మరియు దాని వాడకం గురించి ఆవేదన వ్యక్తం చెయ్యటం జరుగుతుందని నేను అనుకోవటం లెదు. మీరు ఎప్పటిలాగే విషయాన్ని తప్పుడు కోనం లొ చూసినా, గ్రామీణ ప్రాతాలలో చదువుకునేవారికి ఆంగ్ల భాష అందుబాట్లో వుండాల్సిన అవసరాన్ని మీరు బాగా గుర్తు చేసారు. ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

"తెలుగుతప్ప మరేదీ చదువుకోలేని ఒక తరగతి ప్రజల్ని మరో యాభైసంవత్సరాలు ఈ గొప్పోళ్ళకు వాళ్ళవారసులకూ పోటీరాకుండా చెయ్యడం! "

హమ్మో, హమ్మో, ఇంత కుట్ర ఆపాదిస్తారా? మీ మీద కేసు పెట్టాల్సిందే! ఇంగ్లీషు చాలా మాజిక్కులు చేస్తుందని అంగీకరిస్తాను కొంతవరకూ! అంత మాత్రం చేత తెలుగును ఎత్తి అవతల పారేయమనీ అర్థం కాదు!

ఓబులె రెడ్డి గారన్నట్లు అసలు ఇంగ్లీషు ఏ స్థాయిలోనూ వద్దనే అతివాదులు అక్కడక్కడా ఉంటారు. ఇంగ్లీష్ లేకపోతే ఇప్పటికిప్పుడు దేశం ఏమీ ఆగిపోదు అనే వింత వాదన! దీనికి దేశభక్తనే పేరు పెట్టుకోవాలేమో!

గ్లోబలైజేషన్ అని అందరం అంగీకరించిన ఈ రోజు ఇంగ్లీష్ ను వద్దని అనలేం,! అత్యవసరం కూడా! తెలుగు మాత్రమే చదువ్కున్న వాళ్ళు తెలుగు దేశంలో తప్ప ఎక్కడ బతకగలరు? పల్లెల్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే! అందుకోసం మాతృభాషను అవమానించక్కర్లేదు. అదీ నా బాధ!

అతివాదుల్ని పక్కన పెడితే నా పాయింట్ ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమం ఉన్నా, అది ప్రామాణిక స్థాయిలో ఉందా లేదా అన్న విషయం ఆలోచించక్కర్లేదా? తెలుగు మీడియంలో చదివే అయిదో క్లాసు పిల్లాడిని సొంతంగా ఒక వ్యాసం రాయమనండి చూద్దాం ఇవాళ?

మీరు ఓబులు రెడ్డి గారికిచ్చిన సమాధానంలోని అన్ని అంశాలతోనూ ఏకీభవిస్తున్నాను.

మాధ్యమాల సంగతి కాసేపు పక్కన పెట్టి పడిపోతున్న ప్రమాణాల సంగతి కూడా ఆలోచించండి!

Kathi Mahesh Kumar said...

@సుజాత: ఏ తెలుగు? ఎవడి తెలుగు? మా యింటి తెలుగుని "అసలు తెలుగు" కాదని, ఇంగ్లీషులాగా కొత్తతెలుగును నేర్పించిన ఈ ఛాందసవాదుల ఉన్మాదాన్ని నేను ఎలా అంగీకరిస్తాను. అది నా తెలుగని ఎందుకు గర్విస్తాను? ఎలా ప్రేమిస్తాను?

అందుకే ముందుగా భాషాబోధనని సంస్కరించండి. విద్యాప్రమాణాలను పెంచండి. ఆ తరువాత తెలుగులో నిర్భంధ విద్యకోసం పోరాడండి. అప్పటివరకూ కేవలం "సంస్కృతిని కాపాడదాం" అనే నినాదంతో నాదికాని భాషా సంస్కృతిని నా నెత్తిన రుద్ధాలనిచూస్తేమాత్రం ఘర్షణ తప్పదు.

Anonymous said...

ఆర్యా ! నేను అడిగినదానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. సమస్యలో భాగం కానటువంటి ఇతరేతర అంశాలపై వాదం లేవనెత్తుతున్నారు. మనం చర్చలో దారి తప్పుతున్నట్లు అనిపిస్తా ఉంది.

ఒక భాషలో ఇంటిభాష, వీథిభాష, కులభాష, మతభాష, ప్రాంతభాష అని అనేక విధాలు అంతర్భవించి ఉంటై. Because all living natural languages are dynamic and mutative entities. They can not be static. అందువల్ల వాటిల్లో స్వల్ప వేరియేషన్స్ సహజం. అదే సమయంలో అవన్నీ రిలేటేడ్. కానీ వాట్లలో ఒక శైలి ప్రాచుర్యాన్ని పొందుతుంది. అది ఇంగ్లీషుకైనా, హిందీకైనా బెంగాలీకైనా తప్పదు. ఎట్లనైతే మనలో అందురూ ఒకేసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాలేరో అట్లనే మన యొక్క అన్ని తెలుగు మాండలికాలూ ఒకేసారి సాహిత్య గౌరవానికి నోచుకోవు. ఎందుకు ? అనడిగితే ఏం చెప్పేది ? అదంతే. ఒకప్పుడు రాయలసీమ మాండలికం ఈ రాష్ట్రానికి ప్రామాణిక భాష. పాతపుస్తకాలన్నిట్లలో అదే కనిపించేది. ఇప్పుడు కృష్ణా గుంటూరు భాష. రేపు ఇంకేదో తెలవదు. ఎందుకంటే నాగరికతలో మొబిలిటీ పెరిగినాక భాషావాడుకల్లో పరస్పర అవగాహన కొరకు standardization కూడా అవుసరమవుద్ది. ఇదొక అనివార్య ప్రక్రియ. అంతమాత్రాన భాషే వద్దని, భాషాభిమానం కుట్ర అని హంతక వాదాలు (murderous arguments) చేస్తారా ? మీ యింటిభాషలో మీరు రాయండి. మేము కాదంటే కదా ? అయితే నేను నా యింటి భాషలో రాసినది కూడా దయచేసి చదవండి. అలా ఒకరినొకరు చదవడానికి శక్తి కలిగించే తెలుగుబోధనకి వోటెయ్యండి.

రమణ said...

@ మహేష్ కుమార్: మీరు ముందు తెలుగులో బోధనా పద్ధతులు, ప్రమాణాలు మార్చాలంటున్నారు. మాండలికానికి తగినట్టుగా విద్యా బోధన జరగాలంటున్నారు. నిర్బంధ విద్య గురించి తరువాత అంటున్నారు. కొంతమందికి వేరే విధంగా అనిపించవచ్చు. బోధనా పద్ధతులు, మాండలికాల్లో బోధన అనేది విస్తృతమైనది. చర్చించాల్సిన సమయం ఎక్కువ పడుతుంది. తర్వాత ఆలోచించవచ్చు అనిపిస్తుంది. ఇరువైపులా ఉన్న ఆవేదన తెలుగు గురించి, పిల్లల ఒత్తిడి గురించే కదా! రెండు వాదనలపై ఒకేసారి ఎందుకు పోరాటం చేయకూడదు? తెలుగు భాష ఎలా బ్రతుకుతుందో అనేదానిమీద నాలాంటి వాళ్ళకు అవగాహన లేకపోవచ్చు. ఆవేదనని ప్రశ్నించకండి. అందరినీ ఒకే గాటన కట్టకండి. అవివాహితులు, తమ పిల్లలని చేర్పించని వారికి ఈ విషయంలో ఎంతో ఆవేదన ఉంటుంది. తెలుగులో మాట్లాడుతుంటే, తెలుగు పుస్తకాలు చదువుతుంటే తోటివారు అవహేళన చేస్తున్నా గానీ వాటిని పట్టించుకోని వారు ఉంటారు.
అయినా బ్లాగుల్లో వ్రాసిన దానికి ఎదురుగా చర్చించిన దానికీ అర్ధం చేసుకొనే విషయంలో తేడా ఉండవచ్చు. ముఖాముఖీ జరిగితేనే మంచింది. అలా కాకుండా బ్లాగుల్లో అకారణ ద్వేషాన్ని పెచుకుంటూ పోతామంటే చేయగలిగిందేమీ లేదు. emotional rhetoric అనటం అభ్యంతరకమే.

పెదరాయ్డు said...

ఏ తెలుగు? ఎవడి తెలుగు? మా యింటి తెలుగుని "అసలు తెలుగు" కాదని........

నీ యింటి తెలుగు నీకు "అసలు తెలుగు" అయితే, కేసిఆర్ యింటి తెలుగు కేసిఆర్ కు "అసలు తెలుగు". ఇ౦టికో తెలుగును కావాలనుకునే ఇ౦గిత ఙ్ఞాన౦ లేని కుహనా మేధావి లౌక్యాన్ని ప్రదర్సిస్తున్న తెలుగు రూప రాక్షసుల ను౦డి మన తెలుగును రక్షి౦చే సమయ౦ వస్తు౦ది. ఇటువ౦టి వేర్పాటువాదనల వల్లే తెలుగుకి (ఆ మాట కొస్తే ఏ జాతికైనా) ఈ చీడ.

విజయ క్రాంతి said...

మీరు చెప్పినట్టు CBSC వున్నా తెలుగు ఒక భాష గా తీసుకోవచ్చని చెప్పారు . మీరు నిజంగా ఆ విషయాన్నీ నమ్ముతారా ? ఎందరు తీసుకుంటారు ?
అయినా ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడో లేదు మనలో వుంది .
మీరు ఏ యూరోప్ దేశం వుదాహరణకు తీసుకున్నా సులభంగా సమాధానం దొరుకుతుంది.

భావన said...

వేరే దేశం లో వున్న నాకు నైతికం గా ఈ చర్చ లో పాల్గొనే హక్కు వుందో లేదో నాకు తెలియదు తప్పైతే వదిలెయ్యండి.
మీరందరు తెలుగు ఎలా నేర్పించపడాలి ఎవరి తెలుగు నిజం, ఎవరి మాండలీకం ఆచరించాలి అంటున్నారు.. ఇలా ఎవరి కి నిజమైన తెలుగు వాళ్ళను నేర్చుకోమంటే ఒక ప్రమాణం ఎలా వుంటుంది మహేష్.. పుస్తకం లో ఏమి వున్నా అది మన బుర్ర లోనికి వెళ్ళేప్పుడూ మన మాండలీకం లోనే వెళుతుంది కదా.. పుస్తకం లో చందస్సు చదివి ఎవ్వరు ఇంటికి వెళ్ళి నాన్నారు +అండి నాన్నారండి సవర్ణధీర్గ సంధి అని ఆలోచించరు కదా, మా అయ్య అనే ఆలోచిస్తాము మనం ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళమైతే .. అలా అని తెలుసుకోవటం తప్పులేదు కదా. కాకపోతే సర్వత్రా ఇంగ్లీష్ నేర్చుకుని తెగ ఇంగ్లీష్ మాట్లాడితే మిగతా అందరు అదేదో వెధవలు, చదువురాని అజ్ఞానులైనట్లు చూడటం.... తెలుగు లో కూడా వుంది. కూసంత తెలుగు నేర్చుకో గానే ఇంక మిగతా అందరు వెధవలు నేనే తెలుగు ను రక్షించ గల మేధావిని మిగతా మాండలీకాలు సున్న, నే నేర్చిన పద్యం నాకు తెలిసిన పురాణాలు తెలియని వాళ్ళు అందరు హుళక్కి నా ముందు తగ్గి వుండాలి అనే భావన.
ప్రభుత్వం చెయ్యాలి.. మీరందరు అనే మార్పులన్ని.. మహేష్ ఓబుల్ రెడ్డి గారి కిచ్చిన కమిటీ లో పాయింట్ లు బాగున్నాయి కాని
ప్రభుత్వం తో పాటు సామాజికం గా మన భాద్యత లేదా? వీటన్నిటికి మూలం ముందు మనం మన బుర్ర లలో ఇంగ్లీష్ గొప్ప తెలుగు దేమి వుంది అనే ఆలోచన పక్కన పెట్టి మన పిల్లలకు మనం ఎంత వరకు నేర్ప గలం అనే ది కూడా ఆలోచించాలి కదా.. తెలుగు నేర్పించని ప్రభుత్వాన్ని తిట్టొచ్చు కాని ఇంట్లో కూడా తెలుగు ను మర్చి పోయి జీవన విధానమంటే మనకు ఎక్కువ రూకలు తెచ్చేవే అనే ఆలోచనున్నంత వరకు సుజాత అన్నట్లు 5 వ తరగతి ఏమి ఖర్మ డిగ్రీ ఐన వాళ్ళను తెలుగు లో వ్యాసం రాయమన్నా అలానే తడ బడతారు. మీరందరు చాలా హై లెవెల్ లో ఆలోచిస్తున్నారు మూలం ఈ సమస్య కు మన ఇంట్లో నే వుంది అని మర్చి పోయి..

Anonymous said...

భావాన్గారూ ! అందరూ లోనయ్యే ఒక ఫక్తు పొరపాటభిప్రాయాన్నే మీరు కూడా వెలిబుచ్చారు. సమస్య మన యింట్లో లేదు. మనం సమస్య యొక్క బాధితులమే, కారకులం కాము. సమస్య మన యింట్లోంచి మొదలుకాలేదు. చారిత్రికంగా చూస్తే అది ప్రభుత్వాలతో మొదలయింది. బ్రిటీష్ ప్రభుత్వం ఇంగ్లీషు చదివితేనే ఉద్యోగాలిస్తామనడం దగ్గర అది మొదలయింది. అంతకుముందు రాజాస్థానాల్లో తెలుగు అధికారభాషగా ఉండేది. తెలుగొచ్చినవారికి ఉద్యోగాలు హాయిగా లభించేవి. అదంతా ప్రభుత్వపరంగా బలవంతాన మార్చబడింది. ప్రభుత్వాన్ని అనుసరించి విదేశీ కంపెనీలు కూడా ఇంగ్లీషు నేర్చుకుంటేనే ఉద్యోగాలిస్తామనడం మొదలుపెట్టాయి. ఆ తరువాత వాళ్ళ ననుసరించి వాళ్ళ పద్ధతుల్లో ఏర్పడ్డ స్వదేశీ కంపెనీలు కూడా అదే పాట పాడ్డం మొదలుపెట్టాయి. అలా అన్నిచోట్లా తెలుక్కి ఒక నిషేధ వాతావరణం సృష్టించబడింది. మైదుకూరు సంఘటన జరగడానికి చాలా దశాబ్దాల ముందే, పిల్లలకంటే ముందే పెద్దల మెడల్లో అదృశ్య పలకలు కట్టబడ్డాయి "నేను తెలుగులో మాట్లాడను" అని ! బాగా గమనించండి. ఈ పని చేసినవాళ్ళు మీలాంటి, నాలాంటి సామాన్యప్రజలు కారు. విదేశీ సామ్రాజ్యవాదులు, టైకూన్ లు ! ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. మనం మన భాషాహక్కుల్ని పోగొట్టుకున్నది ప్రభుత్వాల చేతుల్లో ! కనుక వాటిని ప్రభుత్వజోక్యంతోనే మళ్ళీ పునరుద్ధరించగలం. మీరో, నేనో, మహేష్ గారో భాషాభిమానులమైనంతమాత్రాన గానీ మనం ఇంట్లో పిల్లలకి కూర్చోబెట్టి తెలుగక్షరాలు దిద్దబెట్టినంత మాత్రాన గానీ ఇక్కడేమీ మారబోవడంలేదు. మారాల్సింది వ్యవస్థ. అది తెలుక్కి అనుకూలంగా ప్రభుత్వ జీవోలనీ, చట్టాలనీ చెయ్యడం ద్వారానే సాధ్యం. ఆ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకుల్నీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు పోవడం ద్వారానే సాధ్యం.

Anonymous said...

అందరు దళిత రచయితల్లాగానే మీరు కూడా ప్రతిదీ కులం ప్రిజమ్ లోంచి చూస్తున్నట్టున్నారు. తెలుగు విషయంలో మనమందరం ఈ కుల, మత, వర్గ, ప్రాంతాల కంపులోంచి బయట పడాలని నేననుకుంటున్నాను. ఇన్ని విభేదాల మధ్య మననందరినీ కలపగల ఉమ్మడి అంశం కనీసం ఒక్కటైనా ఉంది ఈ రాష్ట్రంలో ! కనీసం దాని దగ్గర మనమందరం ఒకటి. మన మాట ఒకటే అవ్వాలి.

kuffir said...

mahesh kumar garu,

this post makes great sense to me. but the figures you've quoted (of numbers of children in primary schools)-- could you please provide the links to the source of your data?
thanks.