Thursday, November 5, 2009

భాష - మతం: దీనిభావమేమి తిరుమలేశా!



ఒక స్కూల్లో ఇంగ్లీషు పలక పిల్లల మెడలో వేసిన మరుక్షణం ఆ స్కూలు క్రిస్టియన్ మిషనరీలది కాబట్టి దీనికొక మతకోణం ఆపాదించబడుతుందని అనుకున్నాను. అటూఇటూగా అది జరిగినా, సహజంగా మన మతవాదుల గురి విషయం మీదకాక వారి "వాదాల" మీద ఉంటుంది కాబట్టి, అది కాస్తా ప్రభుత్వ మైనారిటీ విద్యా విధానం పై, ఉర్దూ మీడియంలపై, ముస్లింల పైకి వెళ్ళిపోయింది. "భాషకు మతం రంగేమిటయ్యా బాబూ!" అంటే,"వ్యాఖ్యలోని భావాన్ని వక్రీకరిస్తున్నారు" అంటున్నారు ‘పొద్దు’ వారు. కాబట్టి మీరే ఈ వ్యాఖ్యలకు అర్థాల్ని చెప్పండి. 
“మీరు ముస్లిములు, కాబట్టి మీరు ఉర్దూవాళ్లు” అని ఈ ప్రభుత్వమే వాళ్ళకి బళ్లు పెట్టి మఱీ ఉర్దూ నేర్పిస్తున్నది. అలా వాళ్ళని ఇండియాలో పాకిస్తానీలుగా మారుస్తున్నది. ఇలా ఉర్దూబళ్ళు పెట్టి జాతిలో ఇంకో ఉపజాతిని, చెవిలో జోఱీగలాంటి శత్రువర్గాన్ని తయారు చేసుకోవడం మనకి అర్జెంటా ?” దీని భావమేమి తిరుమలేశా????????
““తెలుగుని తప్పనిసరి చెయ్య” మని అడిగినప్పుడల్లా “అమ్మో ముస్లిములేనైనా అనుకుంటా”రంటూ ఎందుకు కుంటిసాకులు చెబుతుందో నాకు తెలియదు. కానీ ఈ కుట్ర ఇంకెంతకాలం ? ” దీని అర్థమేమి శ్రీనివాసా?????
ముస్లింలు తెలుగును ఎప్పుడు వ్యతిరేకించారు? ముస్లింలు ఉర్ధూనేర్చుకుంటే పాకిస్తానీలు అయిపోతారా? ప్రభుత్వం తెలుగుకన్నా ఉర్ధూకు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చింది? తెలుగు మాధ్యమాన్ని ప్రమోట్ చెయ్యకపోవడానికి ముస్లింల నిరసన కారణం అని ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పిందా? మరి ఏమిటీ విపరీతం!!! ఎవరిమీద ఈ కోపం!!! ఎందుకీ కుట్ర???
50,895 ప్రాధమిక పాఠశాలలు 30,84,212 తెలుగు మీడియం విద్యార్థులున్న ఈ రాష్ట్రంలో, పాఠశాలల్లో/ప్రాధమిక విద్యలో తెలుగు మృగ్యమయ్యే ప్రమాదం నిజంగా ఉందా?  తమ పిల్లల్ని మాత్రం ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పించిన ఈ కుహానా మేధావులు పడుతున్న బాధ దేనిగురించి?
**** 

13 comments:

Praveen Mandangi said...

మా పట్టణంలోని ముస్లింలు ఉర్దూ, తెలుగూ రెండూ బాగా మాట్లాడుతారు. వాళ్ళు సఘం పాకిస్తానీయులూ, సఘం భారతీయులూ అని అనుకోవాలా? పాకిస్తాన్ లో ఎక్కువ మంది పంజాబీ, సింధీ బాషలు మాట్లాడుతారు. ఉర్దూ అక్కడి ప్రజలు సెకండరీ లాంగ్వేజ్ గా మాట్లాడుతారు. పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయిన తరువాతే ఉర్దూ అక్కడ అధికార బాష అయ్యింది కానీ ఉర్దూ అక్కడ మొదటి నుంచీ అధికార బాష కాదు. నేను చదివినది ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో అయినా ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజ్ గా ఎలా మాట్లాడుతున్నానో, పాకిస్తాన్ లో ఉర్దూ సెంకండ్ లాంగ్వేజ్ గా అలా మాట్లాడుతారు.

సుజాత వేల్పూరి said...

ఏమిటీ ఇంతమంది తెలుగు మీడియం పిల్లలున్నారా? వీళ్ళలో సరిగా గుణింతాలెంతమందికి వచ్చో కనుక్కోండి. ప్రామాణికత లేని మీడియం ఏదైతే ఏమిలెండి!

ఉర్దూ మీడియం పాఠశాలలు రాష్ట్ర రాజధానిలో ఉన్నంత విరివిగా రాష్ట్రమంతటా ఉన్నాయా? ముస్లిములంటే HYD లో ఉన్నవాళ్ళేనా మిగతా వాళ్ళు కూడానా? ఆంధ్రా వైపు ముస్లిములు తెలుగు బాగానే నేర్చుకుంటారే?


అయినా భాషకూ, మతానికీ ముడిపెట్టడం...ప్చ్!

Praveen Mandangi said...

మహేష్. ప్రైవేట్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసినా మిడిల్ క్లాస్ వాళ్ళు తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ కే ఎందుకు పంపిస్తారో కూడా చదువరి బ్లాగ్ లో వ్రాసాను. అది కూడా డిలీట్ చేశాడు. ఇంగ్లిష్ మీడియం చదివిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న నిజం వాళ్ళు నమ్మడం లేదా? లేకపోతే నమ్మనట్టు నటిస్తున్నారా? నాకు ఇంకా పెళ్ళి కాలేదు కానీ రేపు పెళ్ళైన తరువాత నా పిల్లలని తెలుగు మీడియం స్కూళ్ళకి పంపిస్తే పెద్దైన తరువాత నా పిల్లలు "తెలుగు మీడియం స్కూల్ లో మమ్మల్ని ఎందుకు వేశావు" అని నన్ను తిడతారు. నాకు వ్యక్తిగతంగా బాషాభిమానం ఉన్నా కూడా పిల్లల భవిష్యత్ నా ఇష్టం అనుకోలేను.

Kathi Mahesh Kumar said...

@సుజాత: అదేనండీ నాబాధకూడానూ! ఇప్పటికీ సగర్వంగా తెలుగుమీడియం చదువులు చదువుతూ, బోధనలో నాణ్యత లేక, ఐదోతరగతికి వచ్చినా తప్పులు లేకుండా ఒక్కపేజి తెలుగు చదవలేని-రాయలేని విద్యావ్యవస్థలో మనం ఉన్నాం. అందుకే ఇక్కడ ముందు కావలసింది quality. రెండోది తెలుగు భాష బోధనాపద్దతిని నిత్యజీవితంలో పనికొచ్చేలా మార్చడం. ఆ రెండూ జరగనంతవరకూ ప్రభుత్వపాఠశాలలు తప్ప మరో గతిలేని పిల్లలు బలౌతూనే ఉంటారు.

ఈ తెలుగు ఉన్మాదులు గుర్తించడానికి ఒప్పుకోని నిజాలు ఇవి. వాళ్ళకు కావల్సింది తెలుగు భాష బ్రతకడం కాదు, తెలుగుతప్ప మరేదీ చదువుకోలేని ఒక తరగతి ప్రజల్ని మరో యాభైసంవత్సరాలు ఈ గొప్పోళ్ళకు పోటీరాకుండా చెయ్యడం. అందుకే తెలుగు భాష గురించి emotional rhetoric మాట్లాడతారేగానీ,విద్యాప్రమాణాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం తెలుగు కోసం ఏదో చెయ్యలంటారుగానీ, వీళ్ళు మాత్రం ప్రైవేటు విద్యకు మహారాజపోషకులు. అందరూ నిర్భంధ తెలుగు విద్య అభ్యసించాలంటారుగానీ,వీళ్ళ పిల్లలు మాత్రం కాన్వెంటుల్లో రాజ్యమేలుతుంటారు. They are the most dangerous people at this point in time. Beware of them.

Anonymous said...

మహేష్ గారూ ! మీ టపా ఇప్పుడే చూశాను. ఇది నా వ్యాఖ్యల గుఱించేనని అర్థం చేసుకుని సంతోషించాను. మీరు కుహనామేధావి అంటూ నన్నే బాహాటంగా విమర్శించారు కదా. నేను కుహనా మేధావిని అవునో కాదో మన తరువాతి తరాల వారు నిర్ణయిస్తారు. కాలం నిర్ణయిస్తుంది. అయితే ఆ విషయమై మీతో నాలుగు ముక్కలు పంచుకోవడం అవసరమనిపించింది. మఱోపక్క, చాలాకాలం తరువాత మీ బ్లాగులో వ్యాఖ్య రాసినట్లూ ఉంటుంది

మా అబ్బాయిని ఇంగ్లీషు మీడియమ్ లోనే చేర్పించాను. కానీ నేను స్వయంగా తెలుగుమీడియమ్ లోనే చదివాను. అయితే అలా చేర్చింది మీరనుకుంటున్నట్లు వాడినేదో పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగిని చేద్దామని కాదు. నాకు గానీ వాడికి గానీ ఆ అవసరం లేదు. ఎందుకంటే మేము ఉద్యోగాలు చెయ్యనక్కరలేని, పైపెచ్చు ఇతరులకి ఉద్యోగాలివ్వగల స్థితిలో ఉన్నవాళ్ళం.

మా నేపథ్యానికి తగినట్లు మా అబ్బాయిని నేనొక మంచి బ్రాహ్మణుడుగా, తెలుగువాడుగా తీర్చిదిద్దుదామంటే అందుకు తగిన పాఠశాలలు మేముండే దఱిదాపుల్లో ఎక్కడా దొఱక్కపోవడమే, వాణ్ణి దొఱికిన సమీప ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలో చేర్చడానికి కారణం. మీరు చెబితే నమ్ముతారో లేదో నాకు తెలియదు. నా అన్వేషణానుభవాన్ని అనుసరించి, హైదరాబాదులో మంచి తెలుగు మీడియమ్ పాఠశాలలే లేవు. ఒక పాఠశాలలో తెలుగుంది. కానీ మంచినీళ్లు దొఱకవు, తగినన్ని టాయిలెట్లు లేవు. రవాణా సౌకర్యం లేదు. ఇంకో పాఠశాలలో ఇవన్నీ ఉన్నాయి. కానీ వారిది ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ. ఆ సైద్ధాంతిక భావజాలం మా అబ్బాయి మీద పడ్డం నాకిష్టం లేకపోయింది. స్టేట్ సిలబస్ గల పాఠశాలల్లో ఎక్కువశాతం పిల్లల్ని కౌన్సెలింగ్ తరగతుల పేరుతో సాయంకాలం ఏడున్నఱ దాకా చావగొట్టే అలవాటు కలిగినవి. వాటిల్లో హిందూ ఆధ్యాత్మిక వాతావరణం శూన్యం. అలాంటి ఓవర్యాక్షన్ లతో మా వాణ్ణి బాల్యాన్ని పాడుచెయ్యడం నాకిష్టం లేకపోయింది.

కాబట్టి ఆఖరిగా నేను ఒక నిర్ణయానికొచ్చాను. తగినన్ని సౌకర్యాలు ఉండి, తెలుగుని ఒక సబ్జెక్టుగా 12 వ తరగతి దాకా బోధించే బడిలో, హిందూ ఆధ్యాత్మిక సిద్ధాంతాల్ని బోధించే బడిలో వాణ్ణి వెయ్యాలి అని, అది ఇంగ్లీషు మీడియమైనా ఫర్వాలేదు అని ! అలాగే చేశాను. అదే సమయంలో మా అబ్బాయికి ఏళ్ల తరబడి నేను నా శిక్షణలో కలిగించిన తెలుగుభాషా పరిజ్ఞానానికి నేను గర్వపడతాను. ఏ తెలుగు మీడియమ్ బడిలో వేసినా రాని భాషానైపుణ్యాల్ని వాడికి నేను అలవఱుస్తున్నాను. ఇప్పుడాలోచిస్తే నాకనిపిస్తున్నది - మీ విమర్శలో ఇంకో సంభావ్యత ఇమిడి ఉందని ! ఒకవేళ నేను మా అబ్బాయిని తెలుగు మీడియమ్ లో చేర్చి ఉంటే ఇంగ్లీషు మీడియమ్ లో చదివించడం చేతకాదు కనుక మీరలా చేశారు, మాకేం ఖర్మ ? మీ వ్యక్తిగత శక్తాశక్తతల్ని మా మీద రుద్దడానికి చూడకండీ" అని కొత్తవాదం లేవనెత్తే అవకాశం ఉందని !

నేను భవిష్యత్తులో బడి స్థాపిస్తే అది తెలుగుమీడియమ్ బడే అయ్యుంటుంది. నేను ఇంగ్లీషు మీడియమ్ బడి పెడితే మీరు నన్ను ఇలా బ్లాగుల్లోనే కాదు, దినపత్రికల్లో కూడా ప్రకటనిచ్చి మఱీ విమర్శించవచ్చు. నేను మీ అందఱిలాగే ఒక వ్యవస్థలో భాగమై బతుకుతున్నవాణ్ణి. ఈ వ్యవస్థలో మంచి తెలుగుబళ్ళు దొఱక్కపోవడం నా తప్పు కాదు. ఉన్నంతలో నా అభిమానానికి తగిన మంచి బడిని నేను వెతుక్కున్నాను. ఈ వ్యవస్థని నేను సృష్టించలేదు. ఇది నేను పుట్టక ముందునుంచి ఉంది. కానీ ఇతరులకీ నాకూ మధ్య ఉన్న తేడా ఏంటంటే దీన్ని మార్చాలని నేను ప్రయత్నం చేస్తున్నాను.

చివఱిగా నేను చెప్పేదేంటంటే- ఒక విదేశీభాష చుట్టూ బలిష్ఠమైన, అతిఖరీదైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి శాసిస్తున్న వ్యవస్థ యొక్క లోపాల్ని నిస్సహాయులైన ఏ అధికారమూ లేని వ్యక్తులకి ఆపాదించి, వాళ్ళ మీదికి తోసేసి "వాళ్ళు కుహనా వగైరా" అని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. దానివల్ల మీ వాదం తాత్కాలికంగా గెలుస్తుందేమో గానీ, నేను కూడా చాలా సంవత్సరాలు బతికే ఉంటాను కనుక ఇందులో ఇమిడి ఉన్న సాధక బాధకాల్ని వివరిచడంలో నేనూ సఫలుణ్ణి కాగలను. ఆఫ్టరాల్, అవి అందఱికీ ఇప్పటికే తెలుసు. లోపభూయిష్ఠమైన వ్యవస్థ మధ్యలో జీవిస్తూ కూడా వారు అది మారాలని కోరుకుంటున్నారా లేదా ? ఆ మాత్రం సంస్కరణాభిలాష ఉందా లేదా ? అనేదే పరిగణనలోకి వస్తుంది. కమ్యూనిస్టు వ్యవస్థ రావాలని కోరుకున్నంతమాత్రాన అది వెంటనే రాకపోవచ్చు. అది రాకముందే కమ్యునిస్టులంతా తమ ఆస్తులన్నీ వదులుకోవాలని డిమాండు చేస్తే అది ఆచరణాత్మకమేనా ? వ్యవస్థ బావుంటే అందఱమూ పరిశుద్ధులమే.
అలాగే ఇంగ్లీషు మీడియమ్ స్థానంలో తెలుగుమీడియమ్ రాజ్యమేలేట్లయితే నేనేమిటి, మీరేమిటి, అందఱమూ మన పిల్లల్ని తెలుగుమీడియమ్ లోనే చేర్చేవాళ్ళం.

Anonymous said...

ఇక్కడ సమస్యని మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఇది మీ తప్పు కాదు. తెలుగువాళ్లందఱూ చేసే పొఱపాటే ఇది. భాషని వ్యక్తిగత ఇష్టానిష్టాలతో, భావోద్వేగాలతో సంబంధించిన విషయంగా చూడ్డం దగ్గఱే మనమంతా పప్పులో కాలేస్తున్నాం. అందుకనే మనం భాష పేరు చెబితే అమాంతం వ్యక్తివాదులుగా అవతారమెత్తి వ్యక్తివాదాల్ని, కులవాదాల్ని, ప్రాంతవాదాల్ని బయటికి తీస్తున్నాం. భాష గుఱించి మన అవగాహణ చాలా లోపభూయిష్ఠమైనది. దశాబ్దాల కాంగ్రెస్ పాలన మనల్ని అలా తయారుచేసింది. భాష ఒక జాతికి సంబంధించినది. జాతిని సృష్టించేది. ఆ జాతి ఆధారంగా జాతీయతనీ, ప్రభుత్వాన్ని కూడా సృష్టించిపెట్టేది. అది మన ప్రభుత్వం ప్రయత్నపూర్వకంగా కాపాడాల్సిన దేశీయమైన పారంపరిక వారసత్వ హక్కు, అలా ఆలోచించకుండా మనం వ్యక్తిగతంగా మారితే భాష పరిస్థితి మారుతుందని భ్రమిస్తున్నాం. మనం మారాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనమంతా మన దైనందిన జీవితంలో తెలుగే మాట్లాడుతున్నాం. మనం ఇప్పటికే తెలుగుని ప్రేమిస్తున్నాం. మారాల్సింది వ్యవస్థ. ఈ మాట్లాడుకోవడాన్ని, ఈ భాషాప్రేమనీ ఆధికారికంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యస్థాయిలో గౌరవించే వ్యవస్థ కావాలి. అందు కనుకూలంగా చట్టాలు కావాలి.

చివఱిగా ఒక మాట. తెలుగుని ఉద్ధరించమని అడిగితే ప్రభుత్వం అనేక రకాల నాన్-తెలుగు మైనారిటీల పేరు చెప్పి తన కర్తవ్యం తాను చేయకుండా ఎగ్గొడుతున్నది. అది కఠోరవాస్తవం. అది మీకు తెలియకపోయినా మాలాంటివాళ్ళందఱికీ తెలుసు. మీరు మీ టపాలో నాలాంటివాళ్ళ నుద్దేశించి ’భాషోన్మాదులు’ అనే పదం వాడారు. అంటే మీరు మా అసలు తత్త్వాన్ని కొంచెం moderate చేసి చెప్పినట్లే.

-- తాడేపల్లి

Kathi Mahesh Kumar said...

@తాడేపల్లిగారు:
మీరు సమయం తీసుకునిచ్చిన సుదీర్ఘ సమాధానానికి నా ధన్యవాదాలు. కానీ మీ సమాధానంలోని మీ వ్యక్తిగత పరిస్థితుల గురించి చెబుతూ మీరు ప్రస్తావించిన సమస్యల్ని ఒకసారి చూడండి.

1.హైదరాబాదులో మంచి తెలుగు మీడియమ్ పాఠశాలలే లేవు.
2.ఒక పాఠశాలలో తెలుగుంది. కానీ మంచినీళ్లు దొఱకవు, తగినన్ని టాయిలెట్లు లేవు. రవాణా సౌకర్యం లేదు.

"మంచి" పాఠశాలలు లేరని మీరంటున్నారు. రాష్ట్రం మొత్తం మీదా పాఠశాలల్లో "ప్రమాణాల లేమి" ఉందని నేనంటున్నాను. మంఛి నీళ్ళు-మరుగుదొడ్లు-రవాణా సౌకర్యం లేదని మీరంటున్నారు. అవేవీ తగిన ప్రమాణాల్లో అన్ని పాఠశాలల్లోనూ లేవని నేనంటున్నాను.

అంటే...మూల సమస్య infrastructure and quality of education in government schools.వాటిని బాగుచెయ్యమని ముందుగా పోరాడాలంటారా? తెలుగు మీడియంలోనే చదువు చెప్పండి అని పోరాడాలంటారా?

అయినా,ఆంధ్రదేశం మొత్తంలో ముప్ఫై లక్షలకు పైగా ఇప్పటికే విద్యార్థులు ఈ పరిమితుల్లోనే తెలుగు మీడియంలో చదువుతున్నారు. మొదటగా వారి పరిస్థితులు మెరుగు పరచడానికి పోరాడితే, వ్యవస్థలో మార్పొస్తుంది. ఒక తెలుగు చదువుతున్న తరం సంతోషిస్తుంది. ఆతరువాత కావాలంటే హైదరాబాదులో తెలుగుకోసం పోరాడుదాం.

ప్రభుత్వం ఏమీ చెయ్యటం లేదనేది నిజం. కానీ ప్రభుత్వం నిజంగా చెయ్యాల్సింది తెలుగును ఉద్ధరించడం కాదు. పాఠశాల విద్యను బాధ్యతాయుతంగా నడపడం. కేంద్రప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ లో నిధులిస్తుంటే వాటిని 40% కూడా ఖర్చిపెట్టలేని వ్యవస్థలో మనమున్నాం. కేంద్రం infrastructure కు డబ్బులిచ్చి quality of education రాష్ట్రప్రభుత్వం బాధ్యత అని చెప్పినా, విద్యావాలంటీర్లతో కాలం వెళ్ళబుచ్చుతున్నారేగానీ,qualified teachers ని రిక్రూట్ చెయ్యలేని ప్రభుత్వం మనది. అందుకే మూలసమస్యలు-పోరాడవలసిన సమస్యలు వేరే ఉన్నాయంటున్నాను.

పాఠశాలల్లో తెలుగు కోసం వ్యవస్థకాదు. చదువుకోసం వ్యవస్థ. కాబట్టి దానికోసం మొదటగా పోరాడదామంటున్నాను. విద్యావ్యవస్థ బాగుపడితే తెలుగు దానంతట అదే బాగుపడుతుంది.

మీబోట్లతో నాకున్న సమస్యల్లా తెలుగు భాషను పెంపొందించడానికి చెయ్యదగ్గ శాస్త్రీయ పద్దతుల్ని,పథకాల్నీ పక్కనబెట్టి మతాల్ని,రాజకీయభావజాలాల్నీ ఉన్మాదకర స్థాయిల్లో తెలుగు విషయంలో జొప్పించి విషయాన్ని తప్పుదోవపట్టించడమే.

Anonymous said...

మహేష్ గారూ ! మా తత్త్వాన్ని వర్ణించడానికి ఉన్మాదం సరిపోదని ఇదివఱకే తెలియజేశాను. గ్రహించగలరు. నా వ్యక్తిగత అజెండా కేవలం విద్యకీ, తెలుగుభాషని పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి పరిమితం కాదు.

-- తాడేపల్లి

chiranjeevi said...

telugu bhasha ku mataniki sambandham ledu. manaku bhasha pai mamakaram ledu. adi atmabhimana samasya. tamilanadu, kerala, karnataka rashtralloni vari laga manamu kuda bhashante amma vantide ani anukunnappude telegu bhasha abhivruddi chendutundi.

chiranjeevi said...

telugu bhasha ku mataniki sambandham ledu. manaku bhasha pai mamakaram ledu. adi atmabhimana samasya. tamilanadu, kerala, karnataka rashtralloni vari laga manamu kuda bhashante amma vantide ani anukunnappude telegu bhasha abhivruddi chendutundi.

chiranjeevi said...

telugu bhasha ku mataniki sambandham ledu. manaku bhasha pai mamakaram ledu. adi atmabhimana samasya. tamilanadu, kerala, karnataka rashtralloni vari laga manamu kuda bhashante amma vantide ani anukunnappude telegu bhasha abhivruddi chendutundi.

గీతాచార్య said...

Changing the infrastructure must be the prime concern. Then we can go for language/media fights.

గీతాచార్య said...

Mr. Praveen,

అది కూడా డిలీట్ చేశాడు.

Mind your language sir. I hope your emotional balance state is... Ok ok. I don't probe into it. కానీ సంబోధనా గౌరవం పాటించటం మంచి పద్ధతి.